కవిగానం

| సాహిత్యం | క‌థ‌లు

కవిగానం

- బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:16:21pm

కథకాని కథ

ʹనువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు.. మనం గరికపాటి పాటి కాదు..ʹ తేల్చేశాడు కుకవి. యన ఆయన ʹకుʹర్ర ʹకవిʹ.
ʹఆయన సహస్రావధాని మరి.. ఆయన పాటి యెలాగవుతాం.. ఆయన సాటి యెలాగవుతాం..?ʹ కుల్లుకున్నాడు పకవి. యన ఆయన పండిన ʹకవిʹ మాత్రమే కాదు ʹపʹద్య ʹకవిʹ.
ʹమనం యేపాటి అయితే యేoగాని.. అక్కడ తూతూ మంత్రాలయిపోతున్నాయి.. పదండి పదండి..ʹ తొందరపెట్టాడు వకవి. యన ఆయన వంక ʹకవిʹ (వంకలు పెట్టే కవి. అదేనండీ విమర్శనాత్మక కవి) మాత్రమే కాదు ʹవʹచన ʹకవిʹ.
ʹతూతూ మంత్రాలేమిటి?ʹ అడిగాడు అకవి. యన ఆయన ʹఅʹమాయక ʹకవిʹ.
ʹఅదే కవి సమ్మేళనమయిపోతోంది..ʹ ఆవేశంతోనూ ఆయాసంతోనూ అన్నాడు వకవి.
ʹబృహత్ కవి సమ్మేళనం ప్రియదర్శినీ ఆడిటోరియంలో జరుగుతోంది. మనలాంటి దూరం పెట్టాల్సిన కవుల్ని మాత్రం తెలుగు యూనివర్సిటీకి పొమ్మన్నారు గదా..?ʹ అనుమానం తీర్చబోయాడు కుకవి.
ʹదూరం పెట్టాల్సిన కవులేంటి?ʹ బుర్రగోక్కున్నాడు అకవి.
ʹదూరం ప్రాంతం నుండి వచ్చిన కవులని..ʹ పకవి పద్య తాత్పర్యము విప్పి చెప్పినట్టే విప్పి చెప్పాడు.
నలుగురూ వడివడిగా అడుగులు వేశారు. తెలుగు యూనివర్సిటీకి చేరారు. అక్కడ ఘొల్లున జనం. సారీ.. జనం కాదు. కవులు. మందలు మందలు. నిజం.. పశువుల్ని తోలినట్టే తోలుతున్నారు. గదుల్లోకి. కవిత్వ ప్రవాహాల్లోకి. హాల్లోకి.
నలుగురూ చెల్లాచెదురయ్యారు.
కవి సమ్మేళనం. ఒళ్ళు పులకించిపోయింది. ఒళ్ళు నొప్పులు కూడా అయిపోయింది. మొత్తానికి యెవరో వేదిక మీదకి యీడ్చేశారు. ʹఊ.. చదువుʹ అన్నారు. కవిత తీసి శీర్షిక చదివేలోపలే శాలువా కప్పేశారు. చేతిలో పుష్పగుచ్ఛం పెట్టేశారు. పెట్టినంత సేపుకూడా పట్టలేదు పుష్పగుచ్ఛం లాగేశారు. కప్పినంత సేపుకూడా వుంచలేదు శాలువా లాగేశారు. తిరుపతి వెంకన్న దగ్గరకు వెళితే రద్దీలో శఠగోపం పెట్టి అవతలకు తోసేసినట్టు తోసేశారు.
ʹఏమిటిది?ʹ అన్నాడు అకవి.
ʹసన్మానంʹ అని చెప్పారు.
మూడువేలు నగదు, శాలువా, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక, సర్టిఫికేటు.. గిట్టుబాటవుతాయని నమ్మి యింత దూరం వచ్చాడు అకవి. అందరికన్నా ముందు ఆన్ లైన్లో అప్లయ్ చేశాడు. చెల్లించాల్సిన రుసుం చెల్లించాడు. అకవికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ʹఆనంద భాష్పాలా..?ʹ కళ్ళు తుడుచుకుంటూ వుంటే వెనకాలే జుట్టు చెదిరి వచ్చిన వకవి అడిగాడు. అకవికి వొళ్ళు మండింది. వదిలితే వాడిమీద పదహారు పేజీల వచన కవిత్వం రాసేసి వొక్కో వాక్యం వొకటికి రెండేసిసార్లేం ఖర్మ.. నాలుగేసిసార్లు చదివి వినిపించాలన్నంత కసీ కోపమూ కలిగాయి.
ʹమనం అదృష్టవంతులం..ʹ అన్నాడు కుకవి.
ముక్కులుతూ మూల్గుతూ వచ్చాడు పకవి. ʹకవిత్వం రాయడం యింత కష్టం కాలేదెప్పుడూ..ʹ మాట రాలేదు. గాలోస్తోంది.
ʹఅన్యాయం.. అక్రమం..ʹ అన్నాడు అకవి.
ʹకవి సమ్మేళనం అయిపొయింది.. మళ్ళీ చదువుతావేంటి?ʹ వకవి ఆపమన్నట్టుగా చూశాడు.
ʹఒక్క శాలువా కూడా యివ్వలేదు..ʹ నోటికి బూతులు వచ్చేస్తుంటే మింగేశాడు అకవి.
ʹఆ వున్న వొక్క శాలువా నీకిచ్చేస్తే యెలా? ఇప్పటికి రెండువందల యాభైమందికి వొకే శాలువా వొకే పుష్పగుచ్ఛంతోటి మేనేజ్ చేశారు తెలుశా?ʹ అని, ʹకవులకి వోర్పు అవసరంʹ గుర్తుచేశాడు వకవి.
ʹనేను బొగ్గులకుంట సారస్వత పరిషత్తుకు వెళ్ళాల్సింది..ʹ బాధ పడ్డాడు పకవి.
ʹఅక్కడ శాలువా యిస్తారా?ʹ ఆశగా అడిగాడు అకవి.
ʹఆ.. యిస్తారు. అక్కడ జరిగేది ఆవకాయ బద్దేమీ కాదు. అవధానం. జంఝమన్నా వుండాలి. జబర్దస్తన్నా వుండాలి. ఈటీవీ జబర్దస్తు కాదు..ʹ అంత యేడుపులోనూ పడిపడి నవ్వాడు వకవి.
ʹపద్యం మీద పట్టున్నా అందుకే వెళ్ళనిది. వెనకటికి జాషువా పద్యాలు రాశాడు కదా అని మనం కూడా రాసేమనుకో.. ఆయన పడ్డ పాట్లన్నీ పడాలి..ʹ అన్నాడు పకవి.
ʹలేదు.. మారలేదు కాలం.. కవుల కాలం.. కవుకుల కాలం.. యిక్కడ ద్వందార్ధం పట్టేరా? కవి-కుల కాలం.. అని, కవుకుల-కష్టాల కాలం.. అని, కులానికే-కాలం.. అని..ʹ బోలెడు సంతోష పడిపోయాడు కుకవి.
ʹపోయి పృచ్ఛకుల ప్రశ్నలూ దానికి అవధానుల సమాధానాలు విన్నా బావుండేది..ʹ ఆశగా అన్నాడు అకవి.
ʹఅంతలేదు సోదరా.. అక్కడి నుండే వస్తా.. గౌరీభట్టు మెట్టు రామశర్మల ఆధ్వర్యంలోనే శతావధానం జరుగుతావుంది.. కాని అక్కడ పృచ్ఛకులంతా ప్రభుత్వ పెద్దల్ని పధకాల్ని రంజింపజేస్తున్నారు.. కేసీఆర్ని శ్రీకృష్ణదేవరాయల్ని చేసేస్తున్నారు. వెధవది దిక్కుమాలి వొక్కరూ ప్రజా సమస్యలమీద మాట్లాడరే? ప్రభుత్వం నిర్వహిస్తోంది నిజమే. వొంగొని వెళ్ళాలి. అదీ నిజమే. అరే మరీ దేక్కుంటూ వెళుతున్నారే.. శుంఠలు కేసీఆరు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు..ʹ గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
కుకవి అకవి వకవి పకవి అంతా వొకరి ముఖాలు వొకరు చూసుకున్నారు.
ఇవతలికి వస్తే పోలీసులు. గుంపుగా జనం. అదేదో ధర్నా జరుగుతున్నట్టే వుంది. ఉండడం కాదు ధర్నాయే.
ʹసామూహిక సన్మానం పేరుతో గదిలో బంధించి కించపరచడం సరికాదు.. దరఖాస్తు చేసుకున్నవాళ్ళకి అవకాశం యివ్వకపోతే యెవరికి యిస్తారు?ʹ
అది వో కవి గొంతే అని ఆ నలుగురు కవులూ యిట్టే గుర్తుపట్టారు. దరి చేరారు.
కవిగానం. మొదలైంది. అంతం లేదు.
ʹనిర్వాహకులు తెలిసినవారికే అవకాశం యిస్తున్నారు. మిగతావారిని చీకటిగదిలో బంధించి సన్మానాలు చేయడం అవమానించడమే..ʹ
ʹమాకు ఆ అవకాశమూ రాలేదు..ʹ
ʹమూడువేలు అక్కర్లేదు.. మూడొందలు పెట్టి వొక శాలువా కొనివ్వలేరా? కార్డు లేదు.. కిట్టు లేదు.. గిట్టుబాటే లేదు..ʹ
ʹమహిళలు యిక్కడా రెండవ పౌరులే. అవకాశాలు వాళ్ళకే. ఆడది అర్ధరాత్రి తిరగక్కరలేదు. అర్ధరాత్రి తర్వాత కూడా కవిత్వాలు చదవడానికి అవకాశమివ్వలేదు. ఇవి పురుష ప్రపంచ తెలుగు మహాసభలు..ʹ
ʹఅరే కవిత రెండు ఫంక్తులు కూడా చదవనివ్వలేదు.. అడిగితే యింటికి పోయి చదువుకోమన్నారు..ʹ
ʹనాకయితే శీర్షిక చదవగానే లాగేశారు. టైం లేదన్నారు. ఇది భాషా సాహిత్యాలకి తీరని లోటే కాదు, తీరని ద్రోహం కూడా..ʹ
కలగా పులగంగా కవుల కవిత్వ ధర్నా సభ జరుగుతోంది. పోలీసులకి నాలుగు పీకాలని వున్నా బుజ్జగిస్తున్నారు. ముద్దొచ్చినప్పుడే సంక యెక్కాలని యెరిగిన వాళ్ళంతా గోలగోల గొల్లుగొల్లు చేసేస్తున్నారు.
ʹఏయ్.. ఆగండి.. ఆగవయ్యాʹ సహనం తెచ్చుకొని.. తెచ్చుకున్నదాన్ని నిలుపుకొని.. తెలుగు యూనివర్సిటీ వీసీగారన్నారూ- ʹనమోదు చేసుకున్న యెనిమిది వేలమందికి అవకాశం కల్పించడం యెనభైరోజులు పెట్టినా సాధ్యం కాదు. కాబట్టి లిస్టులో లేనివారికి అవకాశం కల్పించే వుద్దేశంతో వర్సిటీలో ప్రత్యేకంగా కవితలు చదివే అవకాశం యిచ్చాం. ఇప్పటికిప్పుడు సిగరెట్ పెట్టెమీద కవితలు రాసుకువచ్చి అవకాశం యివ్వాలంటే సాధ్యంకాదు. మూడువేలు నగదు, శాలువా, పుష్పగుచ్ఛం యివ్వాలని గొంతెమ్మ కోరికలు కోరొద్దు. మెదడుకు ఖరీదు కట్టొద్దుʹ అని దండం పెట్టి అప్పటికి చక్కదిద్ది అవతలకు వెళ్ళిపోయారు.
పోలీసులు యెటు వాళ్ళని అటు పంపించేశారు.
కుకవి అకవి వకవి పకవి అంతా దారి తప్పినట్టు అడుగులు వేస్తున్నారు.
ʹఎందు కొచ్చామో అర్థం కావడం లేదు..ʹ తనలో తను అనుకున్నట్టుగా పైకే అన్నాడు పకవి.
ʹతెలుగు భాషకు ప్రాణం పొయ్యడానికి..ʹ అలవాటుగా అనేసి నాలుక్కరుచుకున్నాడు అకవి.
ʹముందు మన ప్రాణాలు పోకుండా వుంటే..ʹ అన్నాడు కుకవి.
ʹఇన్నివేలమంది కవులు వుంటారని తెలీదు.. అయిదొందలు కాపీలు వేసి కనపడినవాడికల్లా యిచ్చినా యింకా యింట్లో వుండిపోతున్నాయి.. పాతపేపర్లవాడికి అమ్మేస్తానని మా ఆవిడ రోజూ గొడవే..ʹ నిట్టూర్చాడు అకవి.
ʹవచ్చిన వాళ్ళంతా కవులు కారు.. టీచర్స్.. ఆన్ డ్యూటీ వచ్చారు. తిని తిరుగుతుంటే టియ్యే డియ్యే హాయిగా వస్తుంటే కవిత్వం రాక యేమవుతుంది..?ʹ వాపోతూ చెప్పాడు వకవి.
ʹఅవునా..ʹ అని అకవి, కుకవి యిద్దరూ నోళ్ళు వెళ్ళబెట్టారు.
ʹరేపు వుండి సినీ సంగీత విభావరి చూసేసి వెళ్ళిపోదాం..ʹ అన్నాడు పకవి.
ʹపద్యాల దగ్గరే వుండిపోయారు. ఇవతలకి రండి. సినిమా వాళ్ళని యేమి చూస్తాం. వాళ్ళంతా తెలుగుని పొగిడినా పొగడకపోయినా వొకల్లని వొకలు పొగుడుకు చస్తారు. సిగ్గుపడకుండా అమాంతం నాలుకతో నాకేస్తారనుకోండి.. రేపు కేసీఆరు తడిచి ముద్దయిపోవాల్సిందే..ʹ అని వకవి వంక పట్టాడు.
ʹఅయినా సినిమా వాళ్ళని సత్కరిస్తారు. తెలుగు భాషని బతికిస్తున్న మనల్ని అవమానిస్తారు. ఈ సర్కారు చోద్యం అర్థమే కాదు..ʹ పకవి విసిగిపోయి అన్నాడు.
ʹసినిమా వాళ్ళ సపోర్టు రాజకీయనాయకులకి.. రాజకీయనాయకుల సపోర్టు సినిమా వాళ్ళకి యెప్పుడూ అవసరమే.. అందుకే అందరూ సోపేస్తారు.. చూస్తూ వుండండి..ʹ కుతకుత వుడుకుతూ అన్నాడు కుకవి.
ʹవిదేశీ తెలుగు వాళ్లకి కేసీఆరు మంచి విందు పార్టీ యిస్తున్నాడు..ʹ అకవి ఆకలితో వున్నట్టున్నాడు.
ʹఇప్పటికైనా అర్థమయ్యిందా? తెలుగు బడులు దేనికీ పనికిరావని యెత్తేసినా కూడా పెట్టుబడులకు తెలుగు మాబాగా పనికొస్తోంది..ʹ నవ్వాడు వకవి.
ʹతెలుగుకు పెద్ద పీట వేస్తున్నామంటే వూపుకుంటూ వచ్చేసాం. పీట మీద అందరికీ పట్టేంత చోటుండదు.. పదండి వూరు పోదాంʹ అన్నాడు కుకవి.
ʹమా బామ్మర్ది విలేకరి గదా.. ఆడితో చెప్పి యేదో రాయిద్దాం.. లోకల్ ఎడిషన్లో వచ్చేలా చేద్దాం..ʹ అన్నాడు అకవి.
ʹఆడు రాసినదానికి ఆడికి మళ్ళీ మనం మందు పొయ్యాలి. ఇప్పటికి మాడిపోయింది చాలు. పదండి..ʹ అన్నాడు పకవి.
ʹమనం గరికపాటి గార్లాగ ఆలోచించాల్సింది. ఖర్చూ తప్పేది. పేరూ వచ్చేది..ʹ అన్నాడు వకవి.
ʹఆ..ʹ అర్థం కానట్టు చూశాడు అకవి.
ʹప్రపపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానిస్తే- గరికపాటిగారు తిరస్కరించారు. ఎందుకూ..?ʹ అని ఆగి, ʹతెలుగు రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి వున్నాడని, ఆయన అయిదుకోట్ల ఆంధ్రులకు ప్రతినిధని, ఆయన్ని పిలవలేదని, కుటుంబ పెద్దని పిలవకుండా యింట్లో వాళ్ళని పిలిస్తే మాత్రం యెలా వెళ్తామని తెగ బాధపడ్డారు.. మనం కూడా అలాగే బాధని ప్రకటించి వుండిపోయి వుంటే పుణ్యమూ పురుషార్థమూ రెండూ దక్కేవి..ʹ వకవి నొచ్చుకున్నట్టుగా నొసలు నొక్కుకున్నాడు.
ʹమనం వస్తే యింత.. రాపోతే యెంత? తెలుగంత..ʹ అన్నాడు పకవి.
ʹఆహ్వానం పై అపోహలు వద్దు.. యిద్దరు చంద్రుల మధ్య సత్సంబంధాలు.. అని పేపర్లో వొచ్చిందిగాʹ అకవి అడిగాడు.
ʹఓటుకు నోటు.. ఫోను ట్యాపింగు.. రెండూ చెల్లుకు చెల్లు..ʹ నవ్వాడు కుకవి.
ʹమన కవుల మధ్యే సఖ్యత లేదోయ్.. ప్చ్..ʹ అని వకవి దీర్ఘంగా దిగులుగా ఊపిరి వదిలాడు.
అంతా కలిసి అడుగులేశారు.
తెలంగాణ తల్లిని చేరి అకవి సెల్ఫీ దిగబోతే.. కుకవి, పకవి, వకవి వచ్చి సెల్ఫీలో పడేలా దగ్గరాగా ముఖాలు పెట్టి యిరుక్కున్నారు.
ఫోటో క్లిక్ మంది.
సెల్లులో చూసుకున్నారు. ఉలిక్కిపడ్డారు. వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకోలేనంత వికారంగా వికృతంగా కనిపించాయి!

No. of visitors : 432
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  International Seminar on Nationality Question
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?
  ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు
  కుట్ర
  జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య
  నామ్ కే లియే
  వరి గొలుసుల మార్మిక సవ్వడి
  ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం
  చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?
  పిడికెడు ఆత్మగౌరవం కోసం
  పీక‌ నొక్కు సిద్ధాంతం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •