జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌

| సాహిత్యం | వ్యాసాలు

జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌

- ఎ. నర్సింహ్మా రెడ్డి | 04.01.2018 02:45:06pm

పాలస్తీనీయులు అనుమానించినట్లుగానే తొమ్మిది శతాబ్దాలుగా రగులుతూ, నివురుకప్పిన నిప్పులా కొనసాగుతున్న జెరూసలేంని ఇజ్రాయిల్‌ దేశపు రాజధానిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిసెంబర్‌ 6న ప్రకటించాడు. తమ దౌత్య కార్యాలయాన్ని టెల్‌ అవిల్‌ నుండి జెరూసలేంకు తరలించనున్నట్లు ప్రకటించాడు. దీంతో ట్రంప్‌ పశ్చిమాసియాలో మరోకుంపటి రగిలించారు. పాలస్తీనా-ఇజ్రాయిల్‌ వివాదాన్ని ట్రంప్‌ మరోసారి ఉద్రిక్తం చేశాడు. దశాబ్దాలుగా అపరిష్క్యతంగా ఉన్న పాలస్తీనా-ఇజ్రాయిల్‌ అంశంపై ఏకపక్షంగా ప్రకటన చేయడం ట్రంప్‌ దుస్సాహసానికి నిదర్శనం. పాలస్తీనా సమస్యపై శాంతి చర్చలకు దూతగా తన అల్లుడు జరెడ్‌ కుష్‌నర్‌ను నియమించి శాంతి క్రమం కొనసాగుతుందంటూనే జెరూసలేంపై నిర్ణయం ప్రకటించారు.

పశ్చిమాసియాలో చిచ్చు రగిల్చే ఈ దుందుడుకు నిర్ణయం పాలస్తీనియన్‌లకు, ఇతర అరబ్‌ దేశాలకు ద్రోహం చేసింది. ట్రంప్‌ ప్రకటన అనేక అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మాణాలను, స్వయంగా అమెరికానే మధ్యవర్తిత్వం వహించిన 1993 ఓస్లో (నార్వే) ఒప్పందాన్ని ఘోరంగా ఉల్లంఘించింది. నిరంతరం ఎడతెగని, అంతులేని చర్చలు, మోసపూరిత హామీలు ఇస్తున్న అమెరికానే పాలస్తీనీయన్ల న్యాయమైన ఆకాంక్షను దురుద్దేశపూరితంగా చిదిమేస్తుంది. ఈ ప్రకటనను ఉప సంహరించుకోవాలని పాలస్తీనా, ఇండోనేషియా , ఈయూ దేశాలు, అరబ్‌ దేశాల కూటమి, ప్రజాస్వామిక వాదులు ముక్త కంఠంతో డిమాండు చేస్తున్నారు.

ఏసుక్రీస్తు పునరుత్థానం పొందిన నేల జెరూసలేంను విముక్తం చేయండి అన్న నినాదంతో మధ్యయుగాలలో (క్రీ.శ. 1099 నుంచి) లాటిన్‌ చర్చి ఇచ్చిన పిలుపుమేరకు క్రూసేడ్స్‌ పేరుతో ఖలీఫత్‌ రాజ్యంపై క్రైస్తవులు మత దండయాత్రలు జరిపారు. ఆ సమయంలో స్థానిక ముస్లింలతో యూదులు కూడా కలిసి క్రూసేడర్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నేడు అదే జెరూసలేం కోసం యూదులు, పాలస్తీనా ముస్లింల మధ్య పోరుగా పరిణమించడం వెనుక సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. తొలినాటి క్రూసేడ్లు మత దండయాత్రలుగా ప్రారంభమైనప్పటికీ అది క్రమంగా సైన్యం రాకపోకలు సాగిన ప్రాంతం పొడవునా యూరప్‌ నుంచి మధ్య ప్రాచ్యం దాకా సుదీర్షమైన భూభాగంలో వాణిజ్య మార్కెట్లు స్థిరపడ్డాయి. జెరూసలేం విముక్తి లక్ష్యం పక్కకుపోయి ఈ మార్కెట్లు సజావుగా ఉంటే వచ్చే లాభాల కోసం వ్యాపారులు, కొల్లగొట్టిన సంపదల కోసం చర్చి, రాజకుటుంబీకులు క్రూసేడ్లను పెంచి పోషించారు. ఈ చారిత్రక పరిణామం యూరప్‌లో పెట్టుబడిదారి విధానం ఆవిర్భావానికి పునాదయింది. అలాగే మధ్యప్రాచ్య చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం అరబ్‌ దేశాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇజ్రాయిల్‌ను ఒక భూతంగా అమెరికా వాడుకుంటుంది.

పశ్చిమాసియాలోని జెరూసలేం నగరం గురించి తెలియనివారు ఉండరు. మధ్యధరా సముద్రం, మృత్యు సముద్రం (డెడ్‌ సీ) మధ్య భాగంలో జూడాయెన్‌ పర్వతాలపై ఉన్న జెరూసలేంను యూదులు, ముస్లింలు, క్రైస్తవులు... ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మిక నగరంగా భావిస్తారు. అత్యంత పురాతనమైన ఈ నగరంపై ఆధిపత్యం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. యూదు, ముస్లిం, క్రైస్తవ మతాల పవిత్ర ప్రదేశాలున్న జెరూసలేం ప్రపంచంలోనే విశిష్టమైంది. ఈ ప్రాంతం ఐరోపా, ఆసియాలను కలిపే ప్రాంతం. ఆయిల్‌ నిల్వలు విస్తారంగా ఉండడంతో భౌగోళికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ప్రాంతం మొదటి నుంచి అరబ్బుల ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతంలో అరబ్బులు ఎక్కువ సంఖ్యలో, యూదులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అరబ్బుల ప్రాబల్యం వల్ల మధ్య యుగాల్లో యూదులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వ్యాపారంలో, పరిశ్రమల్లో అధునిక విజ్ఞానంలో అగ్రగ్రామిగా ఎదిగారు. కాని వారికి స్వంత దేశం అనేది లేదు.

యూదులంత కలిసి 1897లో స్విట్జర్లాండ్‌లో ప్రపంచ జియోనిస్టు సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే యూదులు నివసిస్తున్న తమ మతానికి పవిత్రమైన జెరూసలేం (పాలస్తీనా)ను తమ మాతృభూమిగా చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు క్రమంగా పాలస్తీనాకు వలస వెళ్లడం ఆరంభించారు. అప్పటి నుండి అరబ్బులు, యూదుల మధ్య వివాదం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పాలస్తీనా ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. యుద్ధంలో టర్కీ ఓడిపోయింది. 1517 నుంచి జెరూసలేంను పాలించిన ఒట్టమాన్‌ సామ్రాజ్యాన్ని 1917లో బ్రిటీష్‌ జనరల్‌ ఎడ్మండ్‌ అల్లేనీబ్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆనాటి నుంచి యూదులు పెద్ద ఎత్తున పాలస్తీనాలో నివాసమేర్పరచుకున్నారు.1917లో ఏర్పడిన నానాజాతి సమితి పాలస్తీనా నిర్వహణ బాధ్యతను బ్రిటన్‌కు అప్పగించింది. అదే సమయంలో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడటంతో, దానిని వ్యతిరేకించిన పెట్టుబడిదారుల్లో ప్రముఖంగా ఉన్న యూదులకు మద్దతునివ్వాలని బ్రిటన్‌ భావించింది. అందుకే తన ఆధీనంలో ఉన్న పాలస్తీనాను యూదు రాజ్యంగా ఏర్పాటు చేయాలని తన ఎజెండాగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అరబ్‌, యూదుల మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. 1930 నాటికి అమెరికా, యూరప్‌, రష్యా, జర్మనీ, ఇతర దేశాల నుండి పాలస్తీనాకు యూదుల వలసలు పెరిగాయి. 1937లో బ్రిటిష్‌ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ పీల్‌ కమీషన్‌ పాలస్తీనాను పాలస్తీనా (అరబ్బులకు), ఇజ్రాయిల్‌ (యూదులకు) రెండు రాజ్యాలుగా విడగొట్టాలని నివేదిక ఇచ్చింది. రెండు రాజ్యాల ఏర్పాటును అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు వర్గాలు పాలస్తీనాను తమ మాతృభూమిగా భావించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ యూదు నిర్మూలన విధానంలో భాగంగా 1941-45 కాలంలో 60 లక్షల మంది యూదులను చంపారు. దీంతో యూదుల్లో స్వతంత్య్ర రాజ్యస్థాపన కోరిక బలపడింది. యుద్ధం అనంతరం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి నవంబర్‌, 1947లో పాలస్తీనాను ఇజ్రాయిల్‌, పాలస్తీనాగా విభజిస్తూ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే దాకా జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా తన ఆధీనంలో ఉంచాలనే నిర్ణయాన్ని వెలువరించింది. ఆ నిర్ణయం మేరకు 1948 మే 4న పాలస్తీనా భూభాగంలో అక్రమంగా స్వతంత్ర రాజ్యంగా ఇజ్రాయిల్‌ ఏర్పడింది.

1948లో యూదులు, అరబ్‌ రాజ్యాలుగా విభజించిన ఐరాస ప్రణాళిక, జెరూసలేంను విశిష్టమైన అంతర్జాతీయ పరిపాలన వ్యవస్థగా ప్రతిపాదించింది. దాన్ని యూదు నాయకులు అంగీకరించినా, అరబ్‌ నాయకులు తిరస్కరించారు. 1948లో బ్రిటిష్‌ వారి ఉపసంహరణతో జెరూసలేం పశ్చిమ భాగాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించుకోగా, జోర్డాన్‌, పాలస్తీనీయులు తూర్పు భాగం స్వాధీనం చేసుకున్నారు. కాగా 1967లో 6 రోజులు జరిగిన యుద్ధంలో జెరూసలేం తూర్పు భాగాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించుకుంది. ʹʹసంపూర్ణ, ఐక్య జెరూసలేం ఇజ్రాయిల్‌ రాజధానిʹʹ అంటూ 1980లో ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ఒక బిల్లు ఆమోదించింది. అయితే ఆ శాసనం ʹʹచెల్లుబాటు కాదుʹʹ అని ఐరాస భద్రతా మండలి తీర్మాణం (478) ఆమోదించింది. ఇదిలా ఉండగా, అమెరకిన్‌ కాంగ్రెస్‌ 1995లో జెరూసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తూ తమ ఎంబెసీని అక్కడికి తరలించారని కోరుతూ ʹజెరూసలేం ఎంబెసీ చట్టంʹ ఆమోదించింది. దాని అమలును వాయిదా వేస్తూ ఆర్నెల్లకొకసారి ప్రకటన చేసే అవకాశాన్ని అధ్యక్షునికి కల్పించింది. బిల్‌ క్లింటన్‌, జార్జి డబ్య్లుబుష్‌, ఒబామా ఆ క్లాజును ఉపయోగించారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి (1945)నుండి అమెరికా సామ్రాజ్యవాదులు పాలస్తీనా సమస్యపై ద్విముఖ విధానాలను అవలంబిస్తూ వస్తున్నారు. ఒకటి, పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయిలీ యూదు జాత్యహంకార శక్తులను ప్రోత్సహించటంలో వీరే ప్రధాన కారకులుగా ఉన్నారు. అందువల్ల తూర్పు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిలీ పాలకులు అనుసరిస్తున్న దుందుడుకు విధానాలను అమెరికా ఆధిపత్య రాజకీయాలనుండి వేరుచేసి చూడలేము. ఆ ప్రాంతంలో అమెరికాకు మిలటరీ స్థావరంగాను, సాధనంగాను ఇజ్రాయిల్‌ ఉపయోగపడుతోంది. ఇజ్రాయిల్‌ సైన్యం పాలస్తీనా ప్రజలపై దశాబ్ధాలుగా సాగిస్తున్న అన్ని దుందుడుకు యుద్ధాలవెనుక, ఊచకోతల వెనుక, దురాక్రమణల వెనుక అమెరికా సామ్రాజ్యవాదుల వత్తాసు ఉన్నది. ఇది అమెరికా సామ్రాజ్యవాదుల ఒక స్వరూపం. రెండు, అమెరికా సామ్రాజ్యవాదం శాంతికాముకుల ముసుగు తగిలించుకొని, ప్రజాస్వామ్యానికి ప్రతినిధినంటూ ఇజ్రాయిల్‌, పాలస్తీనా చర్చలలో మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇది మరో స్వరూపం, మోసకారి ముఖం.

మాతృభూమి కొరకు దశాబ్ధాల తరబడి సాగుతున్న పోరాటంలో పాలస్తీనా ప్రజలు చెప్పరాని కష్టాలనుభవించారు. పాలస్తీనా అనేకమంది ప్రజలను, ఆస్తులను పోగొట్టుకున్నది. అనిశ్చితి, అభద్రత, విభేదాలు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ అంతరంగికంగా వాళ్ళను బలహీనులను చేశాయి. వీళ్ళ పక్షాన నిలబడతారనుకున్న మధ్యప్రాచ్య దేశాల పాలకులందరూ సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులొత్తేవాళ్ళే. పాలస్తీనా ప్రజలపట్ల సానుభూతి ప్రకటించిన దేశాలు కూడ కాలనుక్రమంలో సామ్రాజ్యవాదులతో, ఇజ్రాయిలీ పాలకులతో జత కట్టారు. ఉదాహరణకు మోడీనే పేర్కొనవచ్చు. కొంతమంది అమెరికాను వ్యతిరేకించినప్పటికీ, తమ స్వీయ సమస్యల కారణంగా పాలస్తీనా ప్రజలకు మద్దతు నందించగలిగిన స్థితిలో లేరు.

ప్రపంచంలో జరుగుతున్న అనేక ప్రతికూల పరిణామాల నేపథ్యంలో, గతంలో లభించిన ప్రపంచ ప్రజల మద్ధతు, సహకారం, సంఘీభావం పాలస్తీనా ప్రజలకు తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా పాలస్తీనా విమోచన పోరాటాన్ని బలహీనపర్చాయి. ఇవి పాలస్తీనా ప్రజల పోరాటాలపై, వారి సమస్యకు పరిష్కారం కనుగొనే పద్ధతులపై తీవ్రప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా మధ్యవర్తిత్వంలో వాళ్ళు శాంతిచర్చలకు అనివార్యంగా వెళ్ళవలసి వచ్చింది. ఒకవైపు మధ్యవర్తిగా, శాంతికాముకురాలిగా పోజుపెడుతున్న అమెరికా, మరోవైపు ఇజ్రాయిలీ పాలకులను సంతృప్తిపరిచే విధంగా వ్యవహరిస్తోంది. జెరూసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డిసెంబర్‌ 6న చేసిన ప్రకటన దీనిలో ఒకభాగం మాత్రమే.

ట్రంప్‌ ప్రకటనలో రాజకీయం కూడా ఉంది. అమెరికాలో యూదుల జనాభా ఎక్కువ. ఇజ్రాయిల్‌ కన్నా ఇక్కడే ఎక్కువమంది యూదులు ఉన్నట్లు అంచనా. 2016 ఎన్నికల్లో వీరి ఓట్లపై కన్నేసిన ట్రంప్‌ జెరూసలేం గుర్తింపుపై హామీ ఇచ్చారు. తన నిర్ణయం ద్వారా స్వదేశంలో యూదుల అభిమానం, మద్ధతును పొందవచ్చన్నది ట్రంప్‌ తాజా వ్యూహంగా చెబుతున్నారు. తన పాలనతో ఇంటా బయటా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 70వ దశకం చివరలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌ ఈజిప్టు-ఇజ్రాయిల్‌ మద్య సయోధ్య కుదిర్చారు. 1978 సెప్టెంబరు 17న అమెరికాలోని క్యాంప్‌డేవిడ్‌లో ఈజిప్టు, ఇజ్రాయిల్‌ అధినేతలు అన్వర్‌ సాదత్‌ బెగిన్‌ల మధ్య ఒప్పందం కుదిర్చి, దశాబ్దాల వైరానికి తెరదించారు. దీన్నే క్యాంప్‌డేవిడ్‌ ఒప్పందంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ట్రంప్‌ ఆ దిశగా అడుగులు వేయకుండా భిన్న వైఖరి అవలంభించడం కొత్త సమస్యను రాజేసింది!

కొంతకాలంగా అమెరికా, ఇజ్రాయిల్‌ దుందుడుకు విధానాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మాణాలు జరగడం ఆ దేశాలకు కొరుకుడుపడడంలేదన్న సంగతి తెలిసిందే. దాంతో యునిసెఫ్‌ వంటి అంతర్జాతీయ వేదికల నుంచి తప్పుకుంటున్నట్లు బెదిరింపులకు దిగుతూ ఐక్యరాజ్యసమితిపై తన ఆధిపత్యం నెలకొల్పేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా భౌగోళిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యం క్రమంగా సన్నగిల్లుతూ, చైనా, ఈయూ, రష్యా, ఇరాన్‌లు కూటమిగా ప్రపంచాధిపత్యానికి సవాలు విసురుతూ కొత్త భౌగోళిక రాజకీయ సమీకరణలు అవతరిస్తున్న తరుణంలో మళ్లీ జెరూసలేం వివాదాన్ని అమెరికా రెచ్చగొట్టింది. సౌదీ అరేబియా కేంద్రంగా ఉన్న సున్నీల ఆధిపత్యంతో కూడిన అరబ్‌ కూటమి అమెరికా నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు జెరూసలేం వివాదాన్ని అర్థమనస్సుతో ఖండిస్తుంది. జెరూసలేంను రాజధానిగా ప్రకటిస్తూ ట్రంప్‌ చేసిన తాజా క్రూసేడ్‌ మరోసారి అబ్రహామిక్‌ మతాల మధ్య రక్తపాతాన్ని సృష్టించే అవకాశం లేకపోలేదు.

ట్రంప్‌ ప్రకటనను ʹచారిత్రాత్మకమైనదిʹగా ʹసాహసోపేతమైనదిʹగా ఇజ్రాయిలీ పాలకులు స్వాగతించారు. సంప్రదింపులకు స్వస్తి పలకటంగా ఈ చర్యను పాలస్తీనా నాయకులు పేర్కొన్నారు. ఇది నరకానికి ద్వారాలు తెరవటమేనని హమాస్‌ హెచ్చరించింది. పాలస్తీనా అధారిటీ నాయకుడు హమమ్మద్‌ అబ్బాస్‌, ట్రంప్‌ ప్రకటన ʹʹగౌరవప్రదమైన మధ్యవర్తిగా ఉండాల్సిన అమెరికా ఈ చర్య ద్వారా తన స్తాయిని పోగొట్టుకోవటమేకాక, చిచ్చు రగిలించిందనిʹʹ వ్యాఖ్యానించాడు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 14 శాశ్వత, అశాశ్వత ప్రతినిధులు ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించగా అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మాణాన్ని అడ్డుకుంది. అరబ్‌ దేశాలు గ్రూపు, ఇస్లామిక్‌ సహకార సంస్థ తరపున టర్కీ, ఎమెన్‌లు ఐరాస జనరల్‌ అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని కోరాయి.

ఈజిప్టు ప్రతిపాదించిన ముసాయిదా తీర్మాణాన్ని అమెరికా మిత్రదేశాలు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, ఉక్రేన్‌ సహా భద్రతామండలి సభ్య దేశాలు 14 బలపరిచాయి. అరబ్‌ రాజ్యాలు ఈ సమస్యను ఐరాస సర్వసభ్య సమావేశం ముందుకు తెచ్చాయి. 193 దేశాలు సభ్యులుగా ఉన్న సభలో అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన తీర్మాణానికి అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 9 ఓట్ల లభించాయి. 35 దేశాల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. కాగా 21దేశాల ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు. ఇజ్రాయిల్‌, అమెరికాతో పాటు వ్యతిరేక ఓటు చేసిన దేశాలు- గౌతమాలా, హోండూరస్‌, టోగో, మిక్రోనేసియా, నౌరూ, పాలే, మార్షల్‌ ఐలాండ్‌. ప్రభావవంతమైన ఏ ఒక్క పెద్ద దేశమూ అమెరికాను బలపరచనందున అది ఏకాకి అయింది. జనరల్‌ అసెంబ్లీ తీర్మాణాలు శిరోధార్యం కానందున ఈ ఓటింగ్‌ వల్ల అమెరికా విధానాలకు అటంకం కాకపోయినా ట్రంప్‌ దుష్టత్వానికి చెంపపెట్టు.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్‌ హాలీ ప్రసంగం కూడా తమ అధ్యక్షుడి బాటలోనే బెదిరింపులు, హెచ్చరికలతో సాగింది. అమెరికా ఎన్నటికీ ఈ అవమానాన్ని మరిచిపోదనీ, తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన దేశాలన్నింటినీ పేరుపేరునా గుర్తుపెట్టుకుంటామని హాలీ హెచ్చరించారు. జెరూసలేం నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినదిగా భావిస్తున్నారనీ, అందువల్ల ధిక్కరించే దేశాల విషయంలో ఆయన కఠినంగా ఉంటారన్న సందేశంతో ఓటింగ్‌కు ముందు హాలీ అన్నిదేశాల ప్రతినిధులను ఈమెయిల్స్‌ ద్వారా బెదిరించింది. నా పక్షాన నిలవకపోతే తాటతీస్తానన్న ట్రంప్‌ హెచ్చరిక మిగతా దేశాల వైఖరిని మార్చకపోవడం అటుంచి, వారి ప్రతిస్పందనలు ఘాటుగా ఉండటానికి కారణమైంది. దండిగా నిధులిచ్చి ఐక్యరాజ్యసమితిని నిలబెడుతున్నది అమెరికాయేనని ఆమె గుర్తుచేశారు. ఏ వేదికనైతే అమెరికా ఇంతకాలమూ ఎదుటి వారిపై నిందలు వేసి, అసత్యాలతో మసిపూసి దురాక్రమణలకు, యుద్ధాలకు పావుగా వాడుకుందో ఇప్పుడు ఆ వేదికపైనే తాను ఒంటరి కావడంతో దుర్భాషలకు దిగింది.

జెరూసలేంను రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించగానే, భారతదేశం ఏక వాక్య ప్రకటనలో భారత్‌ వైఖరిలో ఏ మార్పూ లేదని సుష్మాస్వరాజ్‌ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో యూదుల ఓట్లకోసం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ట్రంప్‌ పాల్పడిన ఈ దుస్సాహసాన్ని భారత్‌ వెంటనే ఖండించి ఉంటే బాగుండేది. దశాబ్ధాలుగా పాలస్తీనాకు బాసటగా నిలిచిన భారతదేశం క్రమంగా అంటిముట్టినట్లుగా మారి, మోదీ రాకతో మరింత దూరం జరిగిపోయింది. అమెరికా, ఇజ్రాయిల్‌తో స్నేహం ఆయుధాల కొనుగోలు నుంచి ఆలింగనాల వరకూ వెళ్లిన నేపథ్యంలో భారతదేశం సమితి ఓటింగ్‌ సందర్భంగా అమెరికాకు వ్యతిరేకంగా నిలిచి పరువు నిలుపుకుంది. ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య (ఓఐసీ) ట్రంప్‌ నిర్ణయాన్ని తూర్పారబట్టడంతోనూ, భద్రతామండలిలో అమెరికా ఆప్తదేశాలే దాన్ని కాదనడంతోనూ, ప్రపంచదేశాలన్నీ అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా నిలవబోతున్న విషయం అర్థమై భారత్‌ సమితిలో స్వతంత్రవైఖరికి సిద్ధపడింది. ఓఐసీలోని 57 దేశాల్లో ఏడు మినహా మిగతా యాభై ఇస్లామిక్‌ దేశాల్లో జెరూసలేం అత్యంత ప్రధానమైన మతపరమైన అంశం.

అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వ జాత్యహంకార దౌత్య వైఖరితో ప్రపంచంలో ఇప్పటికే మూడవ ప్రపంచ యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ప్రపంచంలో తనకు తిరుగులేదని విర్రవీగుతూ, ప్రజాస్వామిక పాఠాలు బోధిస్తూ, ఉగ్రవాద నిర్మూలన పేరుతో అమానవీయంగా దాడిచేస్తూ, భౌగోళికంగా అనేక ప్రాంతాల్లో మానవతా సంక్షోభాలు తలెత్తేందుకు ప్రధాన కారణమైన అమెరికా పాలకులు ఐక్యరాజ్య సమితిలో భంగపాటుకు గురయ్యారు. గతంలో జెరూసలేం విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మాణానికి అందరూ కట్టుబడి ఉండాలని, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని యూఎన్‌ సర్వసభ్య సమావేశం పిలుపిచ్చింది. దాంతో డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అవమానకరమైన ఓటమికి గురైంది. భౌగోళిక రాజకీయ యవనికలో అమెరికా ఒంటరి కావడం ఇదే ప్రథమం. ఈ పరిణామం మధ్య ఆసియాలో మరో హింసాత్మక ఘర్షణకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

అమెరికా తాజా పోకడలతో ప్రపంచం ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధానాలు తలకిందులయ్యే స్థితి ఏర్పడింది. పాలస్తీనా చిక్కుముడి మరింత జటిలంగా మారింది. మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రక్రియకు, ప్రాంతీయ సమగ్రతకు విఘాతపరిచేందుకు ట్రంప్‌ కంకణం కట్టుకున్నట్లు తనకు తానే నిరూపించుకున్నాడు. జెరూసలేం పశ్చిమ ప్రాంతానికి తమ దౌత్య కార్యాలయాన్ని తరలిస్తామన్న ట్రంప్‌ ప్రకటనకు పోటీగా టర్మీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తూర్పు జెరూసలేంలో ఇకపై తమ దౌత్య కార్యాలయం ఉంటుందని చెప్పారు. అదే బాటలో మరి కొన్ని దేశాలు వెళ్లినా ఆశ్చర్యం లేదు. పాలస్తీనా విషయంలో ఇక అమెరికాను మధ్యవర్తిగా పరిగణించబోమని 50 ముస్లిం దేశాలు ప్రకటించడంతో దాని అగ్రరాజ్య హోదా కుప్పకూలినట్లయింది.

అమెరికాకు వ్యతిరేకంగా ఏదో ఒకచోట నిరసన తెలియజేయటానికి పాలస్తీనా ప్రజలు వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి ఇజ్రాయిల్‌ సాయుధ పోలీసులతో తలబడ్డారు. వివిధ ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్న పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ పాలకులు వైమానిక దాడులకు పూనుకుంటున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈజిప్టు, లెబనాన్‌, సిరియా, జోర్డాన్‌, టర్కీ, యెమన్‌ ఇంకా ఇతర అరబ్‌ దేశాల ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఆసియాలో బంగ్లాదేశ్‌, ఇండియా, మలేషియా ఇంకా ఇతర దేశాల ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు.

జెరూసలేం వివాదాల కేంద్రంగా అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యా, ఈయూ కూటమికి మధ్య ఆధిపత్య పోరు కారణంగా మరోసారి రెండవ ప్రపంచయుద్ధానంతర ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రంప్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల ముసురుతున్న ప్రపంచ యుద్ధమేఘాలను నివారించేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న యుద్ధ వ్యతిరేక ఉద్యమాలతో పాటు, అమెరికా ప్రజలూ ప్రధానంగా చొరవ చేయాలి. అమెరికా మరింత నగుబాటుపాలు కాకూడదనుకుంటే ఆ దేశ ప్రజానీకం తమ అధ్యక్షుడి చర్యల్ని నిలదీయాలి. తమ ప్రభుత్వం మెడలు వంచి వియత్నాం దురాక్రమణ యుద్ధాన్ని ఆపించిన వెనకటి తరం చేవను గుర్తుచేసుకోవాలి. జియోనిస్టు దురాక్రమణను అడ్డుకోవడానికి, అరబ్‌ దేశాలు ఐక్యం కాకుండా, ఆధిపత్య అమెరికా సామ్రాజ్యవాదుల నీతి బాహ్యమైన కూటమిని ఓడించలేరు. పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటాన్ని బలోపేతం చేసేదిగా సాగుతున్న ఈ నిరసనోద్యమంలో భారత దేశంలోని ప్రజాస్వామికవాదులందరూ, అన్యాయాలను వ్యతిరేకించే వారందరూ భాగస్వాములవ్వాలి.

No. of visitors : 440
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •