ఫాసిజం సవాలు చేస్తున్న వేళ

| సంభాషణ

ఫాసిజం సవాలు చేస్తున్న వేళ

- విరసం కార్యదర్శి | 20.01.2018 12:51:45am

(26వ మహాసభల సందర్భంగా కార్యదర్శి నివేదిక)

ఆత్మహత్యలు, హిందుత్వ హత్యలు, ఎన్‌కౌంటర్‌ హత్యలు.. ఇదీ వర్తమాన భారతదేశం. ప్రజలపై రాజ్యం చేస్తున్న భౌతిక, భావజాల, సాంస్కృతిక దాడిని మంత్రస్థాయి యుద్ధంగా 2016 విజయవాడ మహాసభల్లో విరసం విశ్లేషించిన వారానికే రోహిత్‌ వేముల ఆత్మహత్య జరిగింది. రూపంలో ఆత్మహత్య కానీ ఇది పాలకవర్గ భావజాలాన్ని, సంఘపరివార్‌ రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యాన్ని పెంచి పోషించి స్థిరీకరించే క్రమంలో యూనివర్సిటీ పాలకులు చేసిన హత్య. ఈ ఘటన ముందూ వెనకా బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులు చేసిన భౌతిక, రాజకీయ, సాంస్కృతిక దాడి ఉంది. ఇది మొదలుకొని ఊనా నుండి భీమ కోరెగావ్‌ వరకు దళితులపై దాడులు, గౌరీ లంకేష్‌ హత్య వంటివి ఈ రెండు సంవత్సరాల్లో సంఘపరివార్‌ దౌర్జన్యాలు దేశవ్యాప్తంగా లెక్కకు మించిన ఘటనలుగా చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి బలైనవారినందరినీ స్మరించుకుంటూ 26వ మహాసభలను బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం అనే అంశం కేంద్రంగా నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభలకు హాజరైన సాహితీ, ప్రజాసంఘాల మిత్రులకు, విప్లవాభిమానులకు హృదయపూర్వక స్వాగతం.

ప్రజాస్వామిక విలువల కోసం పోరాడుతూ బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులను ఎదిరిస్తూ ప్రాణాలర్పించిన గౌరీలంకేశ్‌కు, అలాగే ఈ రెండేళ్లలో ఫాసిస్టు రాజ్యం చేతిలో అమరులైన ప్రజాఉద్యమకారులందరికీ విరసం జోహార్లు చెప్తోంది. మన మధ్యే విరసంతో పాటు ఎన్నో వేదికల మీద ఆడి పాడిన ప్రజాకళాకారుడు, ప్రజాయుద్ధవీరుడు పి.కె.యం ప్రభాకర్‌ను ఈ మహాసభల సందర్భంగా గుర్తుచేసుకుంటూ ఆయనకు జోహార్లు చెప్తోంది. భావవిస్ఫోటనం వంటి రచనలతో మనుధర్మం మీద విరుచుకుపడిన కా.సివికి, తొలితరం విరసం కార్యవర్గ సభ్యుడు, పౌరహక్కుల సంఘం నాయకుడు, దళిత ఉద్యమాల సారధి, ప్రజాన్యాయవాది కా.బొజ్జా తారకం, నిండైన సాహిత్య వ్యక్తిత్వం మహాశ్వేతాదేవి, విప్లవ రచయిత కా.సత్నాం, ప్రజాగాయకుడు, రచయిత గూడ అంజయ్యలకు జోహార్లు. ఇటీవల అమరులైన విరసం సభ్యుడు కా.సాంబశివరావు, తొలితరం విరసం నాయకుడు కా.వర్ధనరావులకు జోహార్లు. హఠాత్తుగా సాహిత్యలోకానికి దూరమైన అరుదైన కథా రచయిత వి.చంద్రశేఖరరావు, కథా, నవలా రచయిత చిలుకూరి దేవపుత్రలను ఈ సందర్భంగా విరసం గుర్తుచేసుకుంటోంది.

హిందూ సాంస్కృతిక జాతీయవాదం పేరుతో ఆవిర్భవించి, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంగా బలపడిన సంఘపరివార్‌ భావజాలం వెనక రాజకీయార్థిక కోణం గురించి విరసం చాలా కాలంగా తన విశ్లేషణను అందిస్తున్నది. బాబ్రీ మసీదు విధ్వంసం నుండి గుజరాత్‌ మారణకాండ మీదుగా అది బ్రాహ్మణీయ భావజాలంతో, సామ్రాజ్యవాద దళారీతనంతో ఇవాల ఫాసిస్టు రూపం తీసుకుంటున్నది. నిజానికి అధికార మార్పిడి తర్వాత వచ్చిన మన దేశ పార్లమెంటరీ స్వభావమే బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం కలిగి ఉండి సామ్రాజ్యవాద మార్కెట్‌ ప్రయోజనాల కోసం పనిచేసేదిగా ఉంది. జాతీయోద్యమ కాలంలోనే దీనికి బీజం పడింది. రాజ్యంగం ద్వారా ప్రజాస్వామిక ఆకాంక్షలు, లక్ష్యాలు ప్రకటించుకున్నప్పటికీ దాని అర్ధభూస్వామ్య అర్ధవలస స్వభావం వల్ల అది ఫాసిస్టు తీరం చేరుతోంది. జాతుల ఉద్యమాలపై భారత ప్రభుత్వ ఫాసిస్టు లక్షణాలు మొదటి నుండి ప్రస్ఫుటంగా కనపడుతున్నవే.

వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వచ్చిన విప్లవోద్యమ రాజకీయాలపై, పోరాడే ప్రజానీకంపై అన్ని ప్రభుత్వాలదీ ఫాసిస్టు వైఖరే. ముఖ్యంగా ఆల్‌ అవుట్‌ వార్‌ ప్రకటించి, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో 2009 నుండి భారత ప్రభుత్వం ప్రజలపై యుద్ధాన్నే ప్రకటించింది. ఈ రెండేళ్లలో ఇది మావోయిస్టులు, ఆదివాసీలనే కాక గ్రీన్‌ హంట్‌ను వ్యతిరేకించే ప్రజాస్వామికవాదులపై కూడా విరుచుకపడుతోంది. ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవిత ఖైదు విధించి ఆయనకు వైద్యం కూడా అందజేయకుండా అండాసెల్‌లో చావు అంచుకు నెట్టివేసింది. స్వయంగా వర్ణించనలవికాని దుర్మార్గమైన రాజ్యహింసకు గురై తనవంటి అనేక మంది ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సోనీ సోరీపై ఆగంతకుల రూపంలో వచ్చి ఆసిడ్‌ వంటి ద్రావకం చల్లారు. జర్నలిస్టు మాలినీ సుబ్రమన్యం, బేలా బాటియా, న్యాయవాదులు శాలినీ గేరా, ఈషా కందెల్‌వాల్‌ను చత్తీస్‌ఘడ్‌ జగదల్‌పూర్‌ నుండి వెళ్లగొట్టారు. ప్రొఫెసర్‌ నందినీ సుందర్‌, అర్చనా ప్రసాద్‌ తదితరులపై హత్యకేసు నమోదు చేశారు. చత్తీస్‌ఘడ్‌కు నిజనిర్ధారణకు వెళ్లిన తెలంగాణ డెమాక్రెటిక్‌ ఫ్రెంట్‌ ఏడుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర సరిహద్దులోనే అరెస్టు చేసి ఛత్తీస్‌ఘడ్‌ తరలించి సుక్మా జైల్లో నెలల తరబడి నిర్బంధించారు. మావోయిస్టుల కోసం రద్దైన పాతనోట్లను మార్పిడి చేస్తున్నారని కేసులు పెట్లారు. ప్రభుత్వం ఆదివాసీ ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్న సామాజిక కార్యకర్తలందరిపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తూ వాళ్లని టెర్రరైజ్‌ చేస్తోంది.

2016 అక్టోబర్‌లో ఆంధ్రా ఒడిసా సరిహద్దులో జరిగిన మారణకాండ దేశచరిత్రలోనే అతి పెద్ద బూటకపు ఎన్‌కౌంటర్‌గా మీడియా అభివర్ణించింది. రాజ్యం విప్లవకారులపై ఎంత పాశవిక హింసను అమలు చేసిందో, మృతదేహాలతో కూడా ఎంత అమానుషంగా వ్యవహరించారో అది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఆందోళనకు గురిచేసింది. ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌ దగ్గరి నుండి రామ్‌గుడా మారణకాండ దాకా తీవ్ర విమర్శల పాలైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంఘాలపై కొత్తతరహా అణచివేతకు తెరతీసారు. ముసుగు సంస్థలను సృషించి ప్రజాసంఘాల కార్యకర్తల ఫోటోలతో పోస్లర్లు వేరు ుంచాడు. కరపత్రాలు వేయించాడు. ప్రజాసంఘాల నిరసన ప్రదర్శనలకు, సభలకు పోలీసులు కిరాయి మనుషుల్ని తీసుకొచ్చి కౌంటర్‌ ధర్నాలు, ర్యాలీలు చేయించాడు. చైతన్య మహిళా సంఘం సభ్యులతో పాటు విరసం కార్యదర్శి ఫోటోలతో పోస్టర్లు వేసి వీరు రాక్షసులు, అరాచక శక్తులు, మావోయిస్టులు అని ముసుగు సంఘాల పేర్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రచారం చేశాడు. ఒక మహిళా సంఘంపై ఈ తరహా దాడి ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ చేసి ఉండదు. అలాగే విరసం సాహిత్య పాఠశాల వద్ద పెద్ద ఎత్తున మావోయిస్టుల మీద పోస్టర్లు వేసి, ర్యాలీ, ధర్నా చేయించి సభకు హాజరయ్యే జనాన్ని భయపెట్టడం ఒక కొత్త అనుభవం. ఇది రాజ్యం ప్రజలపై చేసే మంద్రస్థాయి యుద్ధంలో భాగమైన మానసిక యుద్ధంగా మేము అర్థం చేసుకుంటున్నాం.

జనవరి 2016లో విరసం కార్యవర్గ సభ్యుడు కా.కాశీంపై కుట్ర కేసు నమోదు చేశారు. ఇది రచనపై, భావప్రకటనపై కుట్రపూరిత దాడిగా విరసం అభివర్ణించింది. కామ్రేడ్‌ కాశీంకు మద్దతుగా 500మంది రచయితలు ప్రకటన చేశారు. రోహిత్‌ వేముల మరణానికి కారకులైన వారిని శిక్షించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సందర్భంలో విరసం సభ్యుడు, హెచ్‌.సి.యు. పరిశోధక విద్యార్థి కా.ఉదయ్‌భానుపై పోలీసు దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ దాడికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులతో కలిసి సభ నిర్వహించాం. అమరుడు మున్నా స్థూప నిర్మాణం జరుగుతున్న సందర్భంగా కా.కళ్యాణరావుపై తప్పుడు కేసులు నమోదు చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సందె రాజమౌళి అంతిమయాత్రలో (హుస్నాబాద్‌ వద్ద) మాట్లాడినందుకు కా.వరవరరావు మీద కేసు పెట్టారు. ఇటీవలే కోర్టు దాన్ని కొట్టేసింది. రాజ్య నిర్బంధాలకు, తప్పుడు కేసులకు, దాడులకు విరసం సభ్యులు వెరవరని మరోసారి చాటుతున్నాం.

రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులలో పెల్లుబికిన ఆగ్రహావేశాలను అణచడానికి యూనివర్సిటీని పోలీసు క్యాంపు చేయడం దగ్గరి నుండి ఉస్మానియా యూనివర్సిటీలో మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో సృష్టించిన భీతావహ వాతావరణం వరకు విశ్వవిద్యాలయాలన్నిటిలోనూ విద్యార్థుల చైతన్యాన్ని అడ్డుకోడానికి రాజ్యం అన్ని విధాల అణిచివేతను ప్రయోగించడంతో పాటు సంఘపరివార్‌ మూకల దౌర్జన్యానికి వాటిని కేంద్రాలుగా తయారుచేస్తున్న పరిణామాలు ఈ రెండేళ్లలో వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రజాస్వామిక ఉద్యమాలకు, ప్రగతిశీల రాజకీయాలకు, భావసంఘర్షణకు కేంద్రాలుగా ఉన్న యూనివర్సిటీల మీద ఎంచుకుని, ప్రణాళిక రచించుకొని ఎబివిపి, ఆరెస్సెస్‌ శక్తులు దాడులు చేయడం ముమ్మరమైంది. హెచ్‌సియూ, జెఎన్‌యూ, ఎఫ్‌టిఐఐ, మద్రాస్‌ ఐఐటి, జాదవ్‌పూర్‌, అలాహాబాద్‌, కేరళ, ఎన్‌ఐటి కశ్మీర్‌ వంటి సుమారు పది యూనివర్సీటీలు ఎబివిపితో నేరుగా ఘర్షణ పడ్డాయి. ఆరెస్సెస్‌, ఎబివిపి మూకలు ప్రొఫెసర్ల మీద కూడా దాడులకు తెగబడుతున్నాయి.

యూనియన్‌ పెట్టుకున్న నేరానికి మారుతి సుజికి కార్మికులు 13 మందికి యావజ్జీవ శిక్ష విధించారు. కార్మిక హక్కులకు మోడీ ప్రభుత్వం మరణశాసనం విధించే చట్ట సంస్కరణలు తీసుకొచ్చింది. జార్ఖండ్‌లో ఏకంగా మజ్దూర్‌ సంఘటన్‌ సమితి అనే కార్మిక సంఘాన్ని ప్రభుత్వం నిషేధించింది.

ఊనా నుండి భీమ కోరెగావ్‌ దాకా దేశవ్యాప్తంగా దళితులపై, ఆవు రాజకీయాలు చేస్తూ మైనార్టీలపై దాడులు ముమ్మరమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంథని, నేరళ్ల, అభంగపట్నం, గరగపర్రు, పెదగట్టుపాడు వంటి ఉదాహరణలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యక్షంగా రాజ్యం చేసిన దాడులు, హిందుత్వ చేసిన దాడులు కలగలిసిపోవడం చూస్తే రెండు రాష్ట్రాల్లో సంఘపరివార్‌ ఎజెండా ఎలా అమలు జరుగుతోందో తెలుస్తోంది. కంచె ఐలయ్యపై, సూరేపల్లి సుజాతపై, స్కైబాబాపై దాడి తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ రెండువైపులా అమలు జరుపుతున్న సంఘపరివార్‌ ఎజెండాను ప్రస్ఫుటం చేస్తున్నాయి.

ఈ రెండేళ్ళలో కశ్మీర్‌ జాతీయ పోరాటం, గూర్ఖాల్యాండ్‌ ఉద్యమంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలో మద్దతు ధర కోసం రైతుల తిరుగుబాట్లు పెద్ద ఎత్తున ఎగిసాయి. ఇవన్నీ తీవ్రతరమవుతున్న సామాజిక సంక్షోభాన్ని తెలియజేస్తున్నాయి. నోట్ల రద్దు, జిఎస్‌టి పన్ను విధింపు వంటి చర్యల ద్వారా మరింతగా సామ్రాజ్యవాద మార్కెట్‌కు దేశాన్ని అధీనం చేసి ప్రజల మోదీ మూలుగులను పీలుస్తున్నాడు. ఇవాల మోదీ, ట్రంప్‌, నెతన్యాహూ కొత్త రూపంలో ఫాసిస్టు దుష్ట కూటమిగా తయారయ్యారు. అలీన సూత్రాలను పక్కన పెట్టి పాలస్తీనా దురాక్రమణదారు ఇజ్రాయెల్‌ను సమర్థిస్తున్నాడు మోదీ. రోహింగ్యాల జాతిహననాన్ని సంఘపరివార్‌ బహిరంగంగా సమర్థిస్తోంది. మరోసారి మార్కెట్‌ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి గుత్తపెట్టుబడి పక్షాన పలుదేశాల్లో అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు అధికార పగ్గాలు అందుకుంటున్నాయి. అమెరికా యుద్ధోన్మాదానికి ఉత్తర కొరియా సాకు దొరకబుచ్చుకుంటున్నది. చైనా కొత్త సామ్రాజ్యవాద శక్తిగా అవతరించి అమెరికాతో పోటీకి దిగుతోంది. ఇవి వేగవంతమవుతున్న సంక్షోభానికి సూచికలు.

ఈ సంక్షోభకాలసూచికలను ఎట్లా అర్ధం చేసుకోవాలో, వీటిలో ప్రజల ఆకాంక్షలు ఎలా వ్యక్తం అవుతన్నాయో, ప్రజాప్రత్యామ్నాయాన్ని ఎలా నిర్మించుకోగలమో విశ్లేషిస్తూ 2017 ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు ప్రొద్దుటూరులో సాహిత్య పాఠశాల నిర్వహించాం.

తీవ్రతరమవులున్న సంక్షోభాల నుండి రోజూ పలు ఘటనల రూపంలో వ్యక్తమవులున్న వాటిపై విరసం ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో స్పందిస్తోంది. రోహిత్‌ వేములపై విరసం సభ్యుల రచనలతో ʹవెలివాడే తొలిపొద్దైʹ పుస్తకాన్ని వెలువరించింది. హైదరాబాద్‌, విజయవాడలో ఆవిష్కరణ సభలతో పాటు రోహిత్‌ వేముల న్యాయపోరాట కమిటిలో భాగస్వామ్యం వహించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రభుత్వం పుష్కరాలను నిర్వహిస్తూ హిందుత్వ ఎజెండాను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అరుణోదయ, జనసాహితితో కలిసి విరసం విజయవాడలో సభ నిర్వహించింది. సాయిబాబా, అతని సహచరుల విడుదలకై సాయిబాబా విడుదల కమిటిలో భాగస్వామ్య సంస్థగా వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నది. సాయిబాబా నిర్బంధంపై విరసం సభ్యులు వేరువేరు పత్రికల్లో వ్యాసాలు, కవిత్వం ప్రచురించారు. అంబేద్కర్‌ను హైందవీకరించే సంఘపరివార్‌ కుట్రలను తిప్పికొడుతూ అంబెద్కర్‌ తాత్విక, సామాజిక అవగాహనలపై హైదరాబాదులో సదస్సు నిర్వహించాం.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించమని పిలుపునిస్తూ, రచయితలు ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని, సాహిత్య తాత్విక, నిబద్దతలను విశ్లేషిస్తూ ప్రచారం చేసింది. విరసం పాలకవర్గ ప్రపంచ తెలుగు మహాసభలపై చరిత్రలో ఎట్లాగైతే తన ధిక్కారాన్ని ప్రకటించిదో ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించింది. విరసం సభ్యులు తమ నిరసన తెలియజేస్తూ అరెస్టయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో బ్రాహ్మణీయ భూస్వామ్య సంస్కృతిని ఊరేగించి తెలంగాణ పేరుతోనే తెలంగాణ ప్రజా కవులను, కళాకారులను కో ఆప్ట్‌ చేసుకొని ప్రజల పక్షం నుండి దూరం చేసే వ్యూహంలో భాగమే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ సభల ముందూ వెనకా రాజ్యం హింసా, రక్తపాతమే. ఎనిమిది మంది ఎన్‌కౌంటర్‌ రక్తం ఇంకా ఇంకకముందే పాలకవర్గ వేడుక మొదలైంది. ముగింపు ముందు మాదిగ రిజర్వేషన్‌ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగ, ఎం.ఆర్‌.పి.ఎస్‌ కార్యకర్తలపై విరుచుకపడి అర్ధరాత్రి అరెస్టులతో వందలాది మందిని జైళ్లలో కుక్కేశారు. విరసం వెంటనే స్పందించి పోరాటానికి మద్దతు తెలిపి ప్రజాస్వామికవాదుల్లో కదలిక తెచ్చింది. తానే హామీపడిన ఒక చిన్న బూర్జువా డిమాండును నెరవేర్చకపోగా, దాన్ని నిలదీసి అడిగినందుకు అహంకారపూరితంగా, పచ్చి నియంతృత్వ ధోరణితో తెలంగాణ రాజ్యం వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎం.ఆర్‌.పి.ఎస్‌ సభను అడ్డుకొని, పోటీ సభను రెచ్చగొట్టి అరెస్టులు చేశారు. సమాజంలో అట్టడుగు సమూహమైన ఆదివాసులను, మిలిటెంట్‌ ఆదివాసీ ఉద్యమాలను అణిచెయ్యడానికి లంబాడాలతో వైరుధ్యాన్ని వాడుకుంటున్నది తెలంగాణ సర్కార్‌. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించకపోగా తెలంగాణ ప్రభుత్వం పోలీసు హింసను అమలు చేస్తోంది. ఇంటర్నెట్‌ కట్‌ చేసి సమాచారాన్ని బైటికి రానీయకుండా అడ్డుకుంటోంది. విరసం ఆదివాసీల పక్షాన దృఢంగా నిలుస్తోంది. ఆదివాసీ, లంబాడా సమస్యను రాజ్యాంబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేస్తోంది.

తెలంగాణలో నానాటికీ వాక్‌ సభా స్వాతంత్రాలు మృగ్యమవుతున్నాయి. ధర్నా చౌక్‌ ఎత్తివేసి నిరసనలు ఊరిబైట చేసుకోమని తెలంగాణ సర్కార్‌ చెప్తోంది. తెలంగాణ సాధన కోసం ఏ జెఏసీతో కలిసి పనిచేశాడో ఆ జెఏసికి సభలు పెట్టుకోను కూడా హక్కు లేకుండా చేస్తున్నాడు కెసియార్‌. తలుపులు పగలగొట్టి మరీ ప్రొఫెసర్‌ కోదండరాం, మందకృష్ణ మాదిగలను అరెస్టు చేసిన తీరు ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట. తెలంగాణ కోసం ఆడి, పాడిన గొంతులను నొక్కివేస్తున్నాడు. అరుణోదయ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి, వారి ఆఫీసును సీజ్‌ చేసి కళాకారులను బైటికి నెట్టేశాడు. సికింద్రాబాద్‌లో నిర్మించ తలపెట్టిన కామ్రేడ్‌ ప్రభాకర్‌ స్థూపాన్ని అడ్డుకోవడమే కాక ప్రభాకర్‌ కుటుంబ సభ్యులపై, ప్రజాసంఘాల బాధ్యులపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే స్థితి. దీన్ని సవాలుగా స్వీకరించి ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్యమాలతో విరసం కలిసి నడుస్తోంది. రాయలసీమ ప్రాంత న్యాయమైన ఆకాంక్షలను గొంతెత్తి చాటుతున్న సంఘాలతో విరసం కలిసి పనిచేస్తోంది. కామ్రేడ్‌ అరుణ్‌ రాసిన సీమ గొంతుక వినండి పుస్తకాన్ని ప్రచురించింది. ఉత్తరాంధ్రపై వివక్ష గురించి కూడా విరసం మాట్లాడుతోంది.

ఈ రెండేళ్లలో సోషలిజమే ప్రత్యామ్నాయమని చాటుతూ విరసం వైవిధ్యభరితమైన కార్యక్రమాలు తీసుకుంది. వందేళ్ల బోల్షవిక్‌ విప్లవం, యూభై ఏళ్ల శ్రామికవర్గ సాంసృతిక విప్లవం సందర్భంగా హైదరాబాద్‌లో ఒక రోజు సదస్సు నిర్వహించాం. సరిగ్గా ఆ సమయానికి బెజ్జంగి మారణకాండలో 31మంది విప్లవకారులను రాజ్యం హత్యచేసింది. ఆ త్యాగాలను ఎత్తిపడుతూ విప్లవోద్యమంలోని ఆటుపోట్లను చర్చిస్తూ అక్టోబర్‌ విప్లవ చరిత్రను, సాంస్కృతిక విప్లవాన్ని గురించి ఆ సభలో విరసం మాట్లాడింది. భారత సమాజంపై ఎనలేని ప్రభావం వేసిన నక్సల్బరీ ఉద్యమానికి 50 ఏళ్లైన సందర్భంగా బొడ్డపాడులో, విజయవాడలో, గుంటూరులో సభలు నిర్వహించాం. నెల్లూరు, హైదరాబాద్‌లలో నాలుగు రోజుల మార్క్సిస్టు పాఠశాల నిర్వహించాం. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం, ప్యారీస్‌ కమ్యూన్‌, బోల్షవిక్‌ విప్లవం, చైనా విప్లవం, నక్సల్బరీ నుండి దండకారణ్యం దాకా, కులసమస్యపై మార్క్సిస్టు దృక్పథం, జనతన రాజ్యం అనే అంశాలను తీసుకొని పాఠాలు, వాటిపై చర్చను ఏర్పాటు చేశాం. నెల్లూరులో సుమారు 150 మంది, హైదరాబాద్‌లో సుమారు 400 మంది ప్రజాసంఘాల మిత్రులు విద్యార్థులు మార్సిస్టు పాఠశాలకు హాజరయ్యారు. నక్సల్బరీ ప్రభావాన్ని నక్సల్బరీ ముందున్న సవాళ్లను చర్చించడానికి హైదరాబాద్‌లో జాతీయ సెమినార్‌ ఏర్పాటు చేశాం. వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధుల నుండి 20 పత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంత, రాజకీయాచరణపై ఈ రెండేళ్ల కాలంలో విరసం తన శక్తికి మించి చేసింది. మిత్రుల సహకారం మరువలేనిది. విరసం సభ్యులకన్నా విరసం మిత్రులే మా బలమని మరోసారి చెప్పడానికి సంతోషిస్తున్నాం.

దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ మీద కా.పాణి ప్రామాణిక రచన జనతనరాజ్యం వెలువడింది. దానిపై వివిధ యూనిట్లలో ఆవిష్కరణలు, చర్చా కార్యక్రమాలను నిర్వహించాం. కా.చలసాని ప్రసాద్‌ సాహిత్య సర్వస్వంలో మొదటి భాగాన్ని సిపి సంస్మరణ సభ సందర్భంగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లో ఆవిష్కరించాం. ఉత్తరాంధ్ర కథ, కవిత్వం మీద, గోర్కి సాహిత్యం మీద సదస్సులు, రాయలసీమ కథపై వర్క్‌షాప్‌ నిర్వహించాం. డా.వి.చంద్రశేఖరరావు సాహిత్య సమాలోచనపై గుంటూరులో సదస్సు, మహాశ్వేతాదేవి రచనలపై గుంటూరులో, వరంగల్‌లో సభలు నిర్వహించాం. ఆలూరి భుజంగరావు సంస్మరణ సభలో భాగంగా శ్రమణ సంస్కృతిపై చర్చ చేశాం. ఇటీవల ప్రచురించిన నల్లూరి రుక్మిణి ʹనిశిధʹ నవల చండూరు ఘటనపై వచ్చిన ఏకైక నవల. నవల ఆవిష్కరణ సభలు గుంటూరు, విజయవాడల్లో జరిగాయి.

ఈ రెండేళ్లలో వివిధ ప్రక్రియలపై విరసం సుమారు 42 పుస్తకాలను వెలువరించింది. సుమారు పాతిక మంది కవులు, 20 మంది కథకులతో విరసం సాహిత్య సృజన నవనవోణ్వేషణగా సాగుతోంది. విరసం సభ్యుల్లో కనీసం ఇరవై మంది కొత్త తరం కవులు, రచయితలు ఈ తరం విప్లవ సాహిత్య సృజనకు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ రెండేళ్లలో అరుణతార ప్రమాణాల్ని సంతృప్తికరంగా పెంచగలిగాం. కా.చలసాని ప్రసాద్‌కు హామీ పడినట్లు క్రమం తప్పకుండా ప్రతి నెలా పత్రిక వస్తోంది. సాహిత్య విమర్శ సమీక్షలతో, సామాజిక విశ్లేషణతో అరుణతార పాఠకులకు మరింత చేరువైంది. ఈ రెండేళ్లలో మేం సాధించిన మరో విజయం విరసం వెబ్‌ పత్రిక. మే 15, 2016 నుండి ప్రతి 15 రోజులకోసారి మా ఇంటర్నెట్‌ పత్రికతో పాఠకులతో సంభాషిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రజాఉద్యమ అవసరాలకు అనుగుణంగా స్పందిస్తున్నాం. కథ, కవిత్వం, పుస్తక సమీక్షలు, విమర్శ వ్యాసాలతో ఇంటర్నెట్‌ సాహిత్యాభిమానుకు చేరువయ్యాం. విరసం కార్యక్రమాల వీడియేలతో ప్రారంభించిన మా యూట్యూబ్‌ ఛానల్‌కు సంవత్సరంలోపే 17 లక్షల మంది వీక్షకులు నమోదుకావడం గర్వకారణం. దీని ప్రభావం ఎంతగా ఉందంటే యూనివర్సిటీల్లో విరసం వెబ్‌ సైట్‌ ఓపెన్‌ కాకుండా బ్లాక్‌ చేసేదాకా.

విప్లవోద్యమ ప్రేరణతో మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు అవగాహనతో విరసం తన కృషిని కొనసాగిస్తుంది. విప్లవం వర్ధిల్లాలి. విరసం వర్ధిల్లాలి.

విప్లవాభివందనాలతో

విరసం కార్యదర్శి

No. of visitors : 321
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •