ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 20.01.2018 11:13:05am

విలాసరావు ఎక్కిన కారు చక్కగా జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకు ముందాగింది. అన్ని బ్యాంకులకు లాగానే ఆ బ్యాంకుకు కూడా ఆ రోజు సెలవు. విలాసరావు అక్కడికి చేరేప్పటికి సాయంత్రం ఐదు గంటలయింది.

అది జిల్లా కేంద్ర బ్యాంకు కాబట్టి అట్ట హాసంగా ఉంది. బ్యాంకు ఛైర్మన్‌కు ఒక రెస్టురూముతో పాటు ప్రత్యేకంగా ఒక చాంబర్‌ కూడా ఉంది. డైరక్టర్లతో సమావేశాలు, అవసరమైతే వివిధ బ్రాంచ్‌ మేనేజర్లతో సమావేశాలు అందులో జరుగుతుంటాయి.

గ్రామీణ రైతుల అభ్యున్నతి కోసం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సహకార బ్యాంకుల వ్యవస్థ ఏర్పడింది. వడ్డీ వ్యాపారుల కోరల్లోంచి గ్రామీణ రైతులను కాపాడడం ఆ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. అందుకోసం రైతులకు తక్కువ వడ్డీకి ఋణాలు అందజేయడం వాటిపని. రాజకీయ ప్రమేయం లేకుండా రైతులందరిని సమదృష్టితో చూడడం ఆ బ్యాంకుల కర్తవ్యం. ముఖ్యంగా చిన్న కారు, సన్నకారు రైతుల ప్రయోజనం కాపాడడం సహకారం వ్యవస్థలో అతి ముఖ్యమైన విషయం. గ్రామీణ భారతం సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్న మహాత్మాగాంధీ ఆలోచనలకనుగుణంగా ఏర్పాటుచేయబడ్డ వ్యవస్థ అది.

కొంత కాలం దాకా సహకార వ్యవస్థ చాలా బాగా పనిచేసింది. సత్ఫలితాలనిచ్చింది. తర్వాత రాజకీయాలు ప్రవేశించి భ్రష్టుపట్టింది. తన వర్గం, పరాయి వర్గం అంటూ రెండు గ్రూపులయ్యాయి. తన వర్గానికి అన్ని, పరాయి వర్గానికి కొన్ని అన్న పద్ధతి ప్రారంభమయింది.

ప్రభుత్వం ద్వారా కోట్ల రూపాయలు కో-ఆపరేటివ్‌ బ్యాంకులకు అందుతాయి. అక్కడి నుండి రైతులకు చేరుతాయి. పంట ఋణాల కోసం, వ్యవసాయ సంబంధిత వస్తువుల కొనుగోలు కోసం రైతుకు ఋణ పంపిణీ జరుగుతుంది. ఎకరానికి ఇంత అంటూ రైతులకు ఋణాలు మంజూరు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులకు వ్యక్తిగత ఋణాలు ఇచ్చి వారిని ఆదుకోవడం బ్యాంకు విధి విధానాల్లో ఉంటుంది.

రాను రాను అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. స్వార్థం, అవినీతి, పక్షపాతం, బంధుప్రీతి అన్నీ కలిసి విధి విధానాలు కనుమరుగయ్యాయి. దాంతో సహకార బ్యాంకుల పాత్ర గ్రామీణ భారతంలో నామ మాత్రమయింది. ఎలక్షన్ల నుండి ఎలక్షన్ల దాకా మధ్య కాలంలో ఎవరెంత దండుకున్నారన్నది ప్రధానమయింది.

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆ 50 రోజుల కాలంలో రైతులు, ఇతరులు ప్రభుత్వానికి చెల్లించవలసిన ఋణాలు పాత పెద్ద నోట్లలో చెల్లించవచ్చని ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. తద్వారా పేరుకపోయిన బకాయిలు పాతనోట్లతో చెల్లించబడుతాయని ప్రభత్వం యొక్క ఉద్దేశ్యం. ఇది నల్ల కుబేరులకు వరంగా పరిణమించింది. పాలక వర్గం అండదండలతో నల్ల కుబేరులు తమ నల్ల డబ్బుతో రైతుల ఋణాలు తీర్చి తిరిగి కొత్త ఋణాల రూపంలో తెల్లడబ్బు రాబట్టుకోడానికి అవకాశం ఏర్పడింది.

ఆ రోజు సాయంత్రం ఐదున్నరకు విలాసరావు పాలకవర్గంలోని ముఖ్యులతోను మరియు కొందరు బ్రాంచ్‌ మేనేజర్లతోను ఒక ప్రైవేటు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. విలాసరావు పిలిచిన వాళ్ళందరు అక్కడికి వచ్చారు.

వారిని ఉద్ధేశించి విలాసరావు కొంతసేపు మాట్లాడాడు. ప్రభుత్వం కల్పించిన రాయితీని ఎలా వాడుకునే వీలుందో ʹఆఫ్‌ ది రికార్డ్స్‌ʹ అంటూ విడమరిచి చెప్పాడు. విలాసరావు ఎకనామిక్స్‌తో గ్రాడ్యుయేషన్‌ చేశాడు కాబట్టి ఈ విషయంలో ఆయనకు ఒక ఖచ్చితమైన అవగాహన ఉంది.

ʹʹప్రస్తుతం రైతుల ఋణాల వసూళ్ళ విషయంలో దృష్టిపెట్టండి. రైతుల ఋణాలను ఎవరు కట్టినా, ఎలా కట్టినా కట్టనివ్వండి. నల్లడబ్బు, తెల్లడబ్బు అని చూడకండి. అలాంటి సమయాల్లో రైతుల పాసుబుక్కులను, ఆధార్‌ వంటి ఇతర ఒరిజినల్‌ గుర్తింపు కార్డులను దగ్గర పెట్టుకోండి. కొత్తఋణాలు మంజూరైనపుడు చెల్లించిన వారికి సర్దుబాటు చేసి తిరిగి రైతులకు వాటిని ఇచ్చేయండి. ఏది ఏమైనా సహకార ఋణాల వసూళ్ళలో మన జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపి ప్రభుత్వం యొక్క మన్నన పొందాలి. ఈ సమయంలో ప్రభుత్వ మన్నన పొందుతూనే స్వంత లాభాన్ని గుర్తులో పెట్టుకోవాలి. ఇది ఒక విషయం.

ఇక రెండో విషయం. బ్యాంకులలో పాతనోట్లు డిపాజిట్‌ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. రైతులు ఈ అవకాశాన్ని వాడుకోనివ్వండి. రైతుల పేరుతో ఎవరైనా దీన్ని వాడుకుంటే అభ్యంతర పెట్టకండిʹʹ

అంటూ ఇంకా ఏదేదో చెప్పి మాటలు ముగించాడు విలాసరావు. మేనేజర్లను పంపించి కాసేపు మాట్లాడుకుందాం అంటూ డైరెక్టర్లను ఉండమన్నాడు.

తర్వాత విలాసరావు ఫోన్‌ తీసి చందుతో మాట్లాడాడు.

ʹʹచందూ! మన కారులో ఉన్న నా బ్లూ బ్యాగ్‌ తీసుకురాʹʹ అని చెప్పాడు. చందు బ్యాగు తెచ్చి ఇచ్చాడు. చందు బయటకు పోయాక ʹకాన్ఫిడెన్షియల్‌ʹ అంటూ నల్లడబ్బును తెలుపు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో వివరించాడు.

ʹʹఈ సమయంలో రైతు ఋణాల చెల్లింపుల విషయంలోను, రైతు ఖాతాల్లో డిపాజిట్‌ చేసే విషయంలోను ముందు జాగ్రత్త తీసుకొని ఎవరి డబ్బైనా ఉపయోగించండి. అవసరమైతే నా డబ్బును కూడా వాడండి. అందుకోసం నాదగ్గర 10 శాతం కమీషన్‌ తీసుకొండి. మొహమాటం అవసరం లేదు. అయితే ఈ విషయం చాలా గోప్యంగా ఉండాలి.ʹʹ

అంటూ తన దగ్గరున్న నల్ల డబ్బును తెలుపు చేసుకోడానికి మార్గం సుగమం చేసుకున్నాడు విలాసరావు. పోలీసులాంటి వ్యవస్థల నుండి ఏ ఇబ్బంది రాకుండా తాను చూచుకుంటానని వారికి హామీ ఇచ్చాడు.

ఈ దెబ్బతో తన దగ్గరున్న నల్లడబ్బులో చాలా వరకు తెలుపు చేసుకోడానికి తన అధ్యక్ష పదవి మరియు సహకార బ్యాంకు, సహకారం చేసిందనుకున్నాడు విలాసరావు. వెంటనే వెళ్ళిపోతే బాగుండదని మరికాసేపు అక్కడే ఉన్నాడు.

చందు వస్తూ పోతూ విలాసరావు మాటలు కొన్ని విన్నాడు. లోపల నల్లకుబేరులు ఏదో కుతంత్రం చేస్తున్నారనిపించిందతనికి.

తాను బ్యాగు ఇచ్చి వచ్చినపుడు అక్కడున్న వారిని గమనించాడు చందు. అతనికి తెలిసినంత వరకు విలాసరావుతో సహా అక్కడున్న ఎవరి చరిత్రా బాగలేదు. విలాసరావును తిట్టుకుంటూ కొందరు, ఏడుస్తూ కొందరు రైతులు పడే బాధలను గతంలో చూశాడు చందు. తమ ఖాతాలలో విలాసరావు మరియు అతని సహచరులు ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటున్నారని రైతులు అనుకుంటుండగా చాలా సార్లు విన్నాడు. ʹమనిషిలో ఇంత దుర్మార్గం ఉంటుందా?ʹ అనిపించిందతనికి అప్పుడే.

సమావేశం అయిపోయినట్టుంది.

విలాసరావు బ్యాంకులోంచి బయటకువచ్చాడు. కారు ఎక్కి

ʹʹచక్కగా ఇంటికి పోనీయ్‌ʹʹ అన్నాడు.

విలాసరావు కారు ఇల్లు చేరేసరికి ఏడయింది.

ʹʹకాసేపు ఉండిపోరా చందూ!ʹʹ అంటూ కారు దిగి లోపలికి పోయాడు విలాసరావు సీరియస్‌గా.

తాను రేపు రాననే విషయం అతనితో చెప్పాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు చందుకు. కో-ఆపరేటివ్‌ బ్యాంకు నుండి వచ్చేటప్పుడు విలాసరావు మూడ్‌ను బట్టి అతనితో చెప్పాలనుకున్నాడు. కాని వస్తూ వస్తూ విలాసరావు ఫోన్‌లో ఎవరిపైనో అరుస్తూ మాట్లాడాడు. అవతలి వ్యక్తి ఎవరో గాని విలాసరావుకు బాగా కోపం తెప్పించినట్టున్నాడు. ఇలాంటి పరిస్థితిలో తన విషయం చెపితే తన మీద కూడా అరుస్తాడని చందు ఏమీ చెప్పలేదు.

అవతలి వ్యక్తి మీద విరుచుకపడ్డప్పటి సీరియస్‌నెస్‌ కారు దిగే వరకు కూడా పోలేదు విలాసరావుకు.

ఆరోజు ఎందుకో చందుకు చాలా చిరాగ్గా ఉంది. తొందరగా ఇంటికి పోవాలనిపిస్తోంది. అమ్మదగ్గర కూర్చొని తనివితీరా మాట్లాడాలని ఉంది. పెద్దనోట్ల రద్దు వార్త తెలిసినప్పటి నుండి అమ్మతో సరిగా మాట్లాడినట్టే లేదు చందుకు. విలాసరావు తనను తొందరగా పంపిస్తే బాగుండు అనుకున్నాడు.

అంతలోనే ఓ కారు విలాసరావు కాంపౌండులోకి ప్రవేశించింది. అందులోంచి నాయర్‌తో పాటు మరో ఇద్దరు దిగారు. వారు తెలుసు చందుకు. విలాసరావుతో బ్యాంకుకు పోయినప్పుడు వారినక్కడ ఎన్నోసార్లు చూశాడు.

నాయర్‌ కారుదిగి నేరుగా లోపలికి పోయాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు గాని బయటకు వచ్చేటప్పుడు మాత్రం నవ్వుకుంటూ వచ్చారు.

విలాసరావు పాత నోట్ల మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నట్టనిపించింది చందుకు. ఆరోజు ఉదయం నుండి రాత్రి దాకా ఆ పనే పెట్టుకున్నట్టున్నాడు. రేపటి నుండి బ్యాంకులు తెరుస్తారు కాబట్టి ఒక రోజు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

నల్ల డబ్బు ఉన్నోళ్ళు ఎంత అప్రమత్తంగా ఉంటారో చందుకు అర్ధమవుతోంది. విలాసరావును చూస్తుంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు విరుగుడు మంత్రాలు వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయేమో అనిపిస్తోంది. ప్రభుత్వంలోని యంత్రాంగాలు కూడా వారికి సహకరిస్తాయన్న నిజం కూడా చందుకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. విలాసరావు ఉదయం నుండి ఇప్పటిదాకా చేసిన, చేస్తున్న ప్రతి పని నల్ల డబ్బును తెలుపు చేయడానికే. కూతురు పెళ్ళి నెపంతో రాత్రికి రాత్రే బంగారం షాపును కొనేయడం, వివిధ బ్యాంకు అధికారులతో మాట్లాడడం, వారిని ఇంటికి పిలిపించుకోవడం, కో-ఆపరేటివ్‌ బ్యాంకులో జరిగిన మంత్రాంగం... ఇవన్నీ ఆ ప్రయత్నంలోని భాగాలే. నల్ల కుబేరులు ఇంత నిర్భయంగా చట్ట వ్యతిరేక పనులు చేయడం, ప్రభుత్వ యంత్రాంగమే వారికి సహకరించడం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు ఒక ఫార్స్‌ ప్రయోగమే అనిపించింది చందుకు.

చూస్తుండగానే మరో కారు వచ్చింది. అందులోంచి పట్నాయక్‌ దిగాడు. ఆయన కాసేపు లోపల కూర్చొని బయటకు వచ్చాడు. ఆయన్ని సాగనంపడానికి విలాసరావు కూడా బయటకు వచ్చాడు.

వస్తూ వస్తూ

ʹʹపట్నాయక్‌ జీ! పర్సెంటేజి విషయంలో నా దగ్గర మొహమాటం వద్దుʹʹ అంటూ అతని చెవిలో ఏదో చెప్పాడు విలాసరావు.

ʹʹసరే సరేʹʹ అని తలూపుతూ నవ్వుతూ వెళ్ళిపోయాడు పట్నాయక్‌.

విలాసరావు బయటకు వచ్చినపుడు తనను పొమ్మంటాడేమో?నని అతనికి కనిపించేలా ఎదురుగా నిలుచున్నాడు చందు. విలాసరావు చందును చూశాడుగాని ఏమీ అనలేదు.

చందుకు నిజంగానే చిరాకేస్తుంది. చిరాకులో అమ్మ జ్ఞాపకమొచ్చింది. పొద్దున లేస్తూనే తాను ఇంట్లోంచి బయలుదేరాడు. మధ్యాహ్నం అమ్మ అన్నం తినలేదని లతకు ఫోన్‌ చేస్తే చెప్పింది. ʹఏడుస్తూనే కూర్చుందట. పైసలసంచీని వదలడం లేదటʹ. చందుకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

రేపు ఎలాగైనా చాలాసేపు, వీలైతే రోజంతా అమ్మతోనే ఉండాలనుకున్నాడు చందు. విలాసరావు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా రేపు డ్యూటీకి రావద్దనుకున్నాడు. తనకు, లతకు, అమ్మకు బ్యాంకు ఖాతాలు తెరవడం రేపటి ప్రధానాంశంగా నిర్ణయించుకున్నాడు.

రాత్రి ఎనమిది దాటింది. అయినా తాను వెళ్ళడానికి అనుమతి లభించలేదు. విలాసరావు తనకు ఏ పని చెప్పడం లేదు. అలాంటప్పుడు తననెందుకుండమన్నాడో అర్ధం కావడం లేదు చందుకు.

ఆ తరువాత మరో రెండు కార్లు వచ్చాయి. అందులోంచి దిగిన వారి పేర్లు చందుకు తెలియదు గాని వాళ్ళు కూడా బ్యాంకు అధికారులే. విలాసరావు వాళ్ళకేమిస్తున్నాడో గాని వచ్చిన వారందరూ నవ్వుతూ వెళుతున్నారు.

తొమ్మిదిన్నర దాటినా విలాసరావు నుండి చందుకు అనుమతి లభించలేదు. చందు ఇక ఆగలేకపోయాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడి పరిస్థితి చూచి చందు ఆశ్చర్యపోయాడు. విలాసరావు, రాధమ్మ, సారిక ముగ్గురు కలిసి డైనింగ్‌ టేబుల్‌ మీద డిన్నర్‌ చేస్తున్నారు. చందు ఉన్నట్టు కూడా గుర్తులేదు వారికి. చందుకు కోపం వచ్చింది.

ʹʹసార్‌! నేను వెళ్తానుʹʹ అన్నాడు చందు కోపం తెలియనీయకుండా..

ʹʹసరే వెళ్ళు. రేపోద్దున్నే రాʹʹ అన్నాడు విలాసరావు చందును చూడకుండానే..

ʹʹసార్‌! రేపు నేను....ʹʹ

ʹʹకుదరదు. రావలసిందే, రేపు చాలా పనులున్నాయిʹʹ.

చందు మాటలు పూర్తిగా చెప్పకముందే సీరియస్‌గా అన్నాడు విలాసరావు.

ʹʹసార్‌! ......ʹʹ చందు ఇంకా ఏదో చెప్పబోయాడు.

ʹʹచెబుతున్నాగా! విసిగించకుʹʹ

అంటూ తినడం పూర్తి చేసి వాష్‌ బేసిన్‌ వైపు నడిచాడు విలాసరావు.

ఇక లాభం లేదనుకొని బయటకు వచ్చాడు చందు

రాత్రి పదయింది. తాను ఆటో పట్టుకొని ఇల్లు చేరాలంటే అరగంట దాటుతుంది. అంతరాత్రి సమయంలో తాను ఇంటికి పోయే రూట్‌లో ఆటోలు సరిగా ఉండవు. అరగంట ఎదిరిచూస్తే గాని ఆటో దొరుకలేదు చందుకు.

ఇల్లు చేరేసరికి పదకొండయింది. అమ్మ పడుకుంది. పైసల సంచీ ఆమె ఒడిలోనే ఉంది. మెల్లిగా లతనడిగాడు చందు.

ʹʹఅమ్మ అన్నం తిన్నదా?ʹʹ అని

ʹʹపగలు తినలేదు. రాత్రి బతిలాడి నేనే రెండు ముద్దలు బలవంతంగా తినిపించానుʹʹ అంది లత.

చందు మనసు అవిసిపోయింది. ఇలాంటప్పుడు కూడా తాను అమ్మవెంట ఉండనందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. అమ్మను చూశాడు చందు. అమ్మ చెక్కిళ్ళమీద కన్నీళ్ళు చారలు కట్టి ఉన్నాయి. చందుకు ఏడుపొచ్చింది. తనలో తనే ఏడ్చాడు.

No. of visitors : 589
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ యాభై రోజులు (నవల)

మెట్టు మురళీధర్‌ | 18.11.2017 12:35:34am

విలాసరావు పాతనోట్ల మార్పిడి ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నట్టు అర్థమవుతోంది చందుకు. ఆయనది, తనది ఒకే రకమైన పరిస్థితి. ఆయన మార్పిడి ప్రయత్నాలు మొదలుపెట్టా.....
...ఇంకా చదవండి

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 20.02.2018 12:38:01am

ʹʹఅసలు మన డబ్బు మనం తీసుకోవడానికి ఇన్ని ఆంక్షలెందుకండీ? నేను దాచుకున్న పైసలు నాకివ్వకపోవడమేమిటి? ఇది ఒకరకంగా హక్కుల భంగమే.ʹʹ ఒకతను చాలా కోపంగా అన్నాడు. .......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •