ఎస్సీ రిజ‌ర్వేష‌న్ వ‌ర్గీక‌ర‌ణ ఉద్య‌మం; నిర్బంధం

| సంపాద‌కీయం

ఎస్సీ రిజ‌ర్వేష‌న్ వ‌ర్గీక‌ర‌ణ ఉద్య‌మం; నిర్బంధం

- సి. కాశీం | 19.02.2018 11:55:06pm


తెలుగు నేల మీద ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ఇరవై నాలుగేళ్లుగా ఎమ్మార్పీఎస్‌ నాయకత్వంలో ఉద్యమం నడుస్తోంది. ఈ ఉద్యమం సామాజిక న్యాయాన్ని కోరుతున్నది. యాభై తొమ్మిది ఎస్సీకులాల మధ్య రిజర్వేషన్‌ ఫలాలు జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని ఎమ్మార్పీఎస్‌ పోరాడుతున్నది. అట్టడుగున ఉన్న వారికి రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరుతుందని అంబేద్కర్‌ ఆశించాడు. ఆయన ఆశయాన్ని నెరవేర్చడం కోసం జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమమే ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం పోరాటం.

భారత దేశంలో మనుధర్మం, బ్రాహ్మణిజం ఉత్పత్తి వర్గాల మధ్య నిచ్చెన మెట్ల కులం ఆధారంగా విభజనను తీసుకొచ్చాయి. కులాల మధ్య అంతరాలను సృష్టించింది. అంటరాని తనాన్ని అమలు చేసింది. అంటరాని కులాల్లో కూడా మరింత అంటరాని వాళ్లను తయారు చేసిన దుర్మార్గం హిందూ బ్రాహ్మణీయ వ్యవస్థది. వేల సంవత్సరాలుగా అణిచివేయబడుతున్న మాల, మాదిగ కులాలకు మరో యాభై ఏడు ఉపకులాలు ఉండటం ఈ దేశంలో నెలకొన్న విషాదానికి నిదర్శనం. ఈ ఉపకులాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాజ్యాంగం కల్పించిన ఏ ఫలాలు అందకుండా, ఊరికి దూరంగా, సంచార కులాలుగా జీవిస్తున్నాయి. సామాజిక హోదా లేదు, భూమి లేదు, దుర్భర పేదరికం, వెంటాడుతున్న అంటరానితనం ఈ కులాలను పీడిస్తున్నది. డక్కలి, బుడగ జంగం, చిందు, మాస్టీ, బైండ్ల, పంబాల, దాసరి, బ్యాగరి, కాటి కాపరి మొదలైన కులం పేర్లతో మనచుట్టూ గ్రామాల్లో కన్పించే వీళ్లు షెడ్యూల్డు కులాల జాబితాలోని వారని చాలా మందికి తెలియదు. ఎస్సీలనగానే మాల, మాదిగ కులాలు మాత్రమేనని ఎక్కువ మంది భావిస్తారు. కనీసం సమాజం దృష్టిలో మనుషులుగా కూడా గుర్తింపులేని ఉపకులాలకు రిజర్వేషన్‌ ఫలాలు అందాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తూ పోరాడుతున్నది.

పెత్తందారి కులాలు పాలకులుగా మారి కుల వ్యవస్థను, భూస్వామాన్ని అమలు చేస్తూ దళిత కులాలకు భూమిని దక్కకుండా చేసారు. నూటికి తొంభై ఎనిమిది శాతం భూమిలేని నిరుపేదలు ఈ దేశంలో దళితులు మాత్రమే. అధికార మార్పిడి జరిగి డెబ్బై

ఏళ్లు గడిచినా ఉన్నత విద్యకు చేరుకుంటున్న దళిత కులాలు రెండు శాతానికి మించలేదు. సంపద మీద ఈ కులాలకు ఎలాంటి హక్కు లేదు. రాజ్యాంగ ఫలాలు అందుకోవటంలో ఈ కులాల మధ్య దేశ వ్యాపితంగా అంతరాలు ఉన్నాయి. వలస పాలన కాలంలో విద్యకు దగ్గరైన కులాలకు కొన్ని ఉద్యోగాలు, కొంత భూమి దక్కింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొత్తలో ఈ కులాలే రిజర్వేషన్‌ ఫలాలను ముందుగా అందిపుచ్చుకున్నాయి. ఫలితంగా రిజర్వేషన్స్‌ను ఉపయోగించుకున్న కులాలే తిరిగి పొందటం వలన మిగతా కులాలు వారితో పోటీ పడలేకపోయాయి. దీనితో ఎస్సీ కులాల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో చమర్‌లు రిజర్వేషన్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటే మరికొన్ని రాష్ట్రాల్లో మహర్‌లు ఎక్కువగా అనుభవించారు. కానీ ఉపకులాలకు రిజర్వేషన్‌ ఫలాలు నేటికీ అందలేదు.

తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించటంలో ఎస్సీ కులాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ అరవై ఎనిమిది సంవత్సరాల కాలంలో మాల, మాదిగలు మాత్రమే రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించారు. వీరిలో కూడా మాలలు 70 శాతం, మాదిగలు 30 శాతం పొందారు. కానీ మిగతా 57 కులాలు ఒక్క శాతాన్ని కూడా పొందలేకపోయాయి. క్రైస్తవ మిషనరీల ప్రభావంతో విద్యకు ముందుగా దగ్గరైన మాలలు సహజంగానే రిజర్వేషన్‌ ఫలాలు అందుకున్నారు. చెప్పులు కుట్టుకునే వృత్తిని కలిగి ఉన్న మాదిగలు విద్యకు, ఉద్యోగాలకు దూరంగా ఉండిపోయారు. ఈ అసమానత ఈ నాటి వరకూ కొన్ని మినహాయింపులతో కొనసాగుతున్నది. ఈ అసమాన పంపిణిని సరిచేసి జనాభా దామాషా ప్రకారం యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్‌ ఫలాలను న్యాయంగా అందించాలని మాదిగ దండోరా ఉద్యమం 1994 జులై 7న, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభమైంది.

ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌లో న్యాయ బద్దత గురించి పరిశీలించడానికి నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామచంద్రరాజు కమీషన్‌(1996)ను నియమించింది. ఈ కమీషన్‌ ఎస్సీ రిజర్వేషన్‌ అమలు గురించి అధ్యయనం చేసింది. 1965లోనే కేంద్ర ప్రభుత్వం వేసిన లోకూర్‌ కమీషన్‌ రిపోర్టును కూడా రామచంద్ర రాజు కమీషన్‌ పరిశీలించింది. రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించటంలో ఎస్సీ కులాల మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయని, మాలలు రిజర్వేషన్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నారని లోకూర్‌ కమీషన్‌ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసిన రామచంద్ర రాజు కమీషన్‌ 59 ఎస్సీ కులాలలో రిజర్వేషన్‌ పొందటంలో ఉన్న అంతరాలను, అసమానతలను తెలియజేసింది. మాలలు తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఫలాలను పొందారని, దీనిని సరిచేయాలంటే ఎస్సీ రిజర్వేషన్‌ను ʹఏబీసీడీʹగా వర్గీకరించి ఇప్పటి వరకు ఏమాత్రం రిజర్వేషన్‌లు పొందని కులాలను ʹఏʹ గ్రూప్‌లో చేర్చి, మాదిగలను ʹబిʹ గ్రూపులో, మాలలను ʹసిʹ గ్రూపులో, మిగతా వారిని ʹడిʹ గ్రూప్‌లో పెట్టాలని సూచించింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ 2000 సంవత్సరంలో చట్టం చేసింది. ఈ చట్టం అమలైన కాలంలో 27 వేల మంది మాదిగలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వందలాది మంది మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించారు. ఉన్నత విద్య గడపనే తొక్కని కులాలు డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్‌లు అయ్యారు. కానీ 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక సమస్యలను ప్రస్థావిస్తూ ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ చట్టాన్ని నిలుపుదల చేసింది. ఎస్సీ కులాలను వర్గీకరించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలని, ఆ పనిని పార్లమెంట్‌ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు చెప్పింది. తిరిగి సమస్య మొదటికి వచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళనకు గురైన మాదిగలు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. ధర్నాలు, రాస్తారోఖోలు, ముట్టడిలు మొదలైన ఉద్యమ రూపాలను ఎన్నుకున్నారు. అయితే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ సమస్యపై అధ్యయనం చేయడానికి ఉషా మెహ్రా కమీషన్‌(2006)ను నియమించింది. రిజర్వేషన్‌ ఫలాలను పొందటంలో ఎస్సీ కులాల మధ్య అసమానతలున్నాయని, కనుక దీనిని సరి చేయాలంటే ఎస్సీ రిజర్వేషన్‌ను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఉషా మెహ్రా కమీషన్‌ కూడా తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ పార్లమెంట్‌ ద్వారా జరగాలని సూచించింది. ఆనాటి నుంచి పార్లమెంట్‌లో వర్గీకరణ చట్టాన్ని చేయకుండా అప్పుడు కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ పార్టీలు మాదిగ ప్రజలను మోసం చేస్తూ షెడ్యూల్డు కులాల మధ్య మరింత దూరం పెరగడానికి కారణమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎస్సీ రిజర్వేషన్‌ను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేయమని అడిగినందుకు అక్కడి ప్రభుత్వం ఎమ్మార్పీఎస్‌ సభలకు అనుమతిని నిరాకరిస్తూ తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. అక్రమ కేసులను బనాయించి కార్యకర్తలను, నాయకులను జైలు పాలు చేస్తున్నది. తీర్మానం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అడిగినందుకు మాదిగ మహిళా సమాఖ్య

ఉపాధ్యక్షురాలు భారతి మాదిగను పోలీసులు దాడి చేసి హత్య చేశారు. రాజ్యాంగ బద్దంగా నిరసన తెలియజేసిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణమాదిగను రెండుసార్లు అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. ఆయుధాలు కల్గి ఉన్నాడని, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేసి అనేక సెక్షన్‌ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర నాయకత్వాన్ని, కార్యకర్తల ఇళ్లమీద దాడులు చేసి నిర్బంధించారు. బెయిల్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సభలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకుండా వేధించారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసి మందకృష్ణను అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్‌ మీద ఎన్నడూ లేనంత నిర్బంధాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది.

ఎమ్మార్పీఎస్‌ కోరుతున్న ఈ సామాజిక న్యాయానికి విప్లవ రచయితల సంఘం మొదటి నుంచీ సంఘీభావంగా ఉంది. ప్రత్యక్ష కార్యాచరణలో భాగమైంది. 1994లోనే ఏర్పడిన సంఘీభావ కమిటీలో భాగస్వామ్య సంస్థగా ఉండింది. రాజ్యాంగ పరిధిలో పరిష్కరించవల్సిన ఈ డిమాండ్‌ పట్ల పాలక వర్గాలు నిర్లక్ష్యంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం జరిగే చట్టం కోసం 24 ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా పోరాడటం గొప్ప విషయం. అంత మాత్రమే కాదు ఇది అట్టడుగు వర్గాలు చేస్తున్న అపురూపమైన ఉద్యమం. మాదిగల ఆకాంక్షలను నెరవేర్చలేని పాలక వర్గాల అసమర్థతకు, దివాళ కోరుతనానికి ఈ పోరాటమొక చెంపదెబ్బ. ఎమ్మార్పీఎస్‌ సామాజిక న్యాయాన్ని ఉద్యమ ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు ఉండవచ్చు. అవ్న అంతర్గతంగా చర్చించుకోవల్సిందే. విమర్శ పెట్టవల్సిందే. కానీ కోటి మంది మాదిగ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం జరుగుతున్న పోరాటంలో మనమందరం భాగస్వామ్యం కాకుండా ఉండగలమా? ప్రజాస్వామిక విలువలను గౌరవించి, కోరుకునే వాళ్లందరూ, ముఖ్యంగా మాల కులంలోని ప్రజాస్వామికవాదులు ఈ ఉద్యమంతో ఉండవల్సిందే. తెలుగు నేలలో అనేక మిలిటెంట్‌ పోరాటాలను నడిపిన విప్లవకర వర్గం మాదిగలు. మొదటి నుంచీ విప్లవోద్యమంతో నడిచిన త్యాగశీల వారసత్వం వారికుంది. కనుకనే మడమ తిప్పకుండా ఇరవై నాలుగేళ్లుగా పోరాడుతున్నారు. రాజ్యంతో తలపడుతున్నారు. వర్గీకరణ ఉద్యమం మాదిగల జీవితాల్లోకి చదువు, కొలువుల్ని మాత్రమే తీసుకురాగలదు. మొత్తం మాదిగ ప్రజల విముక్తి సమాజ విముక్తిలోనే సాధ్యమవుతుంది. దండోరా ఉద్యమ పెనుగులాటంతా తెలుగు సాహిత్యంలో అద్భుతంగా వ్యక్తీకరించబడింది. ఒకరకంగా తెలుగు సాహిత్యాన్ని కుల కోణంలో ప్రజాస్వామీకరించింది. దళిత సాహిత్యంలోకి మాదిగ కలాలు కొత్త పదబంధాలను, భావచిత్రాలను, ప్రతీకలను, జీవిత సౌందర్యాన్ని తీసుకొచ్చాయి. మాదిగ చైతన్యం, మాదిగపొద్దు, లంద, కువ్వ మొదలైన కవితా సంకలనాలతో కొత్త గొంతులను వినిపించారు. కథ, నవల, వ్యాస ప్రక్రియలలో కూడా మాదిగ రచయితలు వైవిధ్య భరితమైన శిల్ప సౌందర్యాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక చలనంలో వచ్చిన ప్రజల సామూహిక కదలికనే సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుందని ఇంత కన్నా మంచి ఉదాహరణ ఇటీవలి కాలంలో లేదు.

No. of visitors : 506
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  ఈ మానవ హననాన్ని ఆపండి
  అరుణతార మే - 2018
  మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
  గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
  మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
  Long live the 1st of May
  విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
  marx selected poetry
  మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
  ఎట్టి మనుషుల మట్టి కథలు
  మొద్దుబారుతున్న సమాజం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •