గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

| సంభాషణ

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

- సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో, మండల కేంద్రానికి 7 లేక 8 కి.మీ దూరంలో ఉన్న గ్రామం పెదగొట్టిపాడు. ఈ గ్రామంలో, 2500 కమ్మ కుటుంబాలతోపాటు, యితర కులాల ప్రజలు ఉండగా, పల్లెలో 1000 మాల, 400 మాదిగ కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఉన్న దళిత వాడలన్నింటిలోకి యిదే పెద్దది. అలాంటి పెదగొట్టిపాడు గ్రామంలో, డిశంబరు 31, 2017 అర్ధరాత్రి నుండి, జనవరి 01, 2018 మధ్యాహ్నం వరకు జరిగిన సంఘటనలు, అగ్రకుల పెత్తందార్ల ఆధిపత్య దాడులకు నిదర్శనం.

31వ తేది రాత్రి 12 గంటల సమయంలో, మాల యువకులైన, కొచ్చర్ల అవినాశ్‌, కూరపాటి ఏసుభక్తలు మోటారు సైకిళ్ళపై గ్రామంలోగుండా వెళ్తుండగా, స్లిప్పై ఆ ప్రాంతంలో ముగ్గులు వేస్తున్న రజక మహిళలపై పడ్డారు. ఆ మహిళలు వాళ్ళను మందలించి పంపించి వేసే క్రమంలో, ఆ సమీపంలోనే ఉన్న కమ్మ కులానికి చెందిన యువకులు వాళ్ళను కులంపేరుతో దూషించి, మోటారు సైకిళ్ళను ధ్వంసంచేసి కొట్టారు. మరుసటి రోజు, అనగా జనవరి 1, 2018న మాలపల్లెకు చెందిన జొన్నలగడ్డ ప్రకాశ్‌, జొన్నలగడ్డ జాన్‌లు గడ్డం చేయించుకోవడానికి గ్రామం గుండా వెళ్తూ వుంటే, అక్కడి వున్న అగ్రకుల కమ్మవారు, వాళ్ళిద్దరిపై కర్రలతో దాడిచేశారు. ఆ దాడిలో, ఒకరికి తల పగిలి, కాలికి తీవ్ర గాయమైంది. మరొకరికి అరచేయి చీలిపోయింది. అలా ఉన్న వారిద్దర్నీ ప్రక్కనే ఉన్న ఒక యింటిలో పడేశారు. ఈ దాడికంతటికీ పధక రచన చేసిన ఆలపాటి పాండు, దళిత పెద్దలకు ఫోన్‌చేసి, ʹʹమీ వాళ్ళను కొట్టిపడేశాం, వాళ్ళను తీసుకెళ్ళండిʹʹ అని చెప్పాడు. దళితులు పోలీసుల సహాయంతో వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

డిశంబరు 31, రాత్రి, మోటారు సైకిళ్ళపై వస్తున్న యువకులను కొట్టిన సంఘటనలో, తమ కులస్తులు, దళితులకు క్షమాపణ చెప్పాల్సిరావడాన్ని సహించలేని, గ్రామ పెత్తందార్లుగా ఉన్న, ఆలపాటి పాండు, మారెళ్ళ భాస్కర్‌, గుంటుపల్లి ఉపేంద్రలు షుమారుగా 100మందిని కూడగట్టి, జనవరి 01, 2018 మధ్యాహ్నం రెండు ట్రాక్టర్లపై కర్రలు, యినపరాడ్లు, ఖాళీ బీరుసీసాలు సమకూర్చుకొని, పల్లెపై దాడిచేశారు. అక్కడ భయానక వాతావరణం సృష్టించి, నూతన సం||ర వేడుకల సందర్భంగా, చర్చిలో ప్రార్థనలో ఉన్న దళిత మహిళలను తిడుతూ, పురుష దురహంకారంతో లుంగీలు విప్పి, నీచంగా, అసభ్యంగా ప్రదర్శనలు చేశారు. అక్కడ జరిగిన దాడిలో బూసి దీనాభరణానికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ జరిగిన సంఘటన. చూడడానికి యిది, కేవలం ఒక తాత్కాలికోద్రిక ఫలితంగా జరిగిన దాడిగా కనపడుతోంది గాని, దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని పరిశీలిస్తే, దళితులలో క్రమక్రమంగా పెరుగుతున్న స్వతంత్ర జీవనవిధానం, ఆత్మ గౌరవ ప్రకటన, తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి ప్రశ్నించే చైతన్యం పెరగటం అసలు కారణాలుగా విదితమవుతాయి. గొట్టిపాడు పల్లె, చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న పల్లెలన్నింటికంటే పెద్దది. ఈ పల్లెలో ఉన్న దళిత యువకులు, దగ్గర్లో ఉన్న గుంటూరు పట్టణంలో పెయింటర్లుగా, వడ్రంగులుగా, రాడ్‌ బెండింగ్‌, తాపీ, ఎలక్ట్రికల్‌ కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాలను గడుపుకుంటున్నారు. గతంలోలాగా గ్రామంలోని అగ్రకుల రైతుల పొలాలల్లో పనిచేస్తూ వాళ్ళ మోచేతిగంజినీళ్ళు తాగాల్సిన దుస్థితి నుండి ఒక మేరకు బైటపడ్డారు. ప్రతిరోజూ పనుల నిమిత్తం గుంటూరు వెళ్ళి రావటానికి అనుకూలంగా మోటారు సైకిళ్ళు కొనుక్కున్నారు. ఈ కొద్దిపాటి ఎదుగుదలను కూడా అగ్రకులస్తులు సహించలేకపోయారు.

దీనికితోడు, దళిత యువకులు అంబేద్కర్‌ యువజన సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామంలో తమపట్ల జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ప్రశ్నించటం ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు కేవలం గ్రామంలోనే అమలవుతూ తమ పల్లెలో ఎందుకు అమలుకావటం లేదని ప్రశ్నించారు.ఎస్సి,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఉపయోగించటంలో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టారు. వీటికితోడు దళిత మహిళలు తమ బతుకులను బుగ్గిపాల్జేస్తున్న మద్యం షాపులకు వ్యతిరేకంగా ఉద్యమించి, మారెళ్ళ భాస్కరరావు మద్యంషాపు ఎత్తివేయించారు. నీరు-చెట్టు పేరుతో జన్మభూమి కమిటీ, మాదిగల అనుభవంలో ఉన్న చెఱువుని కబ్జాచేసే ప్రయత్నాన్ని అడ్డుకోవటంలో మాలలు, మాదిగలకు అండగా నిలిచారు. ఈ విధంగా బలపడుతున్న దళిత చైతన్యం పాలక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికీ, దాని అండ చూసుకుని తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్న అగ్రకుల ఆధిపత్యవాదులకు కన్నెర్ర కలిగించింది. అది దృష్టిలో ఉంచుకునే, దళితులకు బుద్ది చెప్పి లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా యింతటి భయానకమైన దాడికి పాల్పడ్డారు.

ఈ విధంగా పరమ అనాగరికంగా దాడిచేసిన అగ్రకుల దురహంకార్లు, రాజకీయ నాయకత్వం, అధికార యంత్రాంగం, యిచ్చిన దన్నుతో మరింత రెచ్చిపోయి, దళితులపై సాంఘిక బహిష్కరణను అమలు పరచప్రారంభించారు. దళితులకు కౌలుకిచ్చిన పొలాలను తిరిగి యిచ్చివేయాలని, పాత బాకీలను వెంటనే చెల్లించాలని వత్తిడి చేస్తున్నారు. గ్రామంలో ఉన్న దుకాణాలలో దళితులకు ఎలాంటి వస్తువులను అమ్మనీయకుండా చేస్తున్నారు.

ఇంత బహిరంగంగా దళితులు మీద భౌతికదాడి జరిగి, యిద్దరు దళితులు గత నెల రోజులుగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడి ఉన్నా, వాళ్ళపై సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం అగ్రకుల పెత్తందార్ల పక్షమే వహించింది. దళితులపై దాడిచేసిన ముద్ధాయిలపై కేసులు పెట్టి అందర్నీ అరెస్టు చేయాల్సిన పోలీస్‌ అధికార్లు అందుకు భిన్నంగా, పోలీస్‌స్టేషన్లో, కొద్దిమంది దళితుల చేత బలవంతంగా రాజీకి ఒప్పించటం నేరంతో సమానం. ఆ రాజీ చర్చల్లో కూడా ముద్దాయిలు కుర్చీల్లో కూర్చుంటే దాడికి గురైన దళితులు నిలబడాల్సి రావటం అక్కడ సాగిన కులాధిపత్య సంస్కృతికి నిదర్శనం. ఇలాంటి బలవంతపు రాజీతో ఒక శాంతి కమిటీని వేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కాని, ఆత్మ గౌరవంగల దళిత మహిళలు యీ రాజీ తతంగాన్ని పూర్తిగా తిరస్కరించి తమకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమిస్తున్నారు.

ఈ ఉద్యమానికి మద్ధతుగా ʹʹపెదగొట్టిపాడు దళిత బాధితుల పోరాట సంఘీభావ కమిటీʹʹ ఒకటి ఏర్పడి పనిచేస్తున్నది. దాడి జరిగిన జనవరి 1 నుండి యిప్పటిదాకా పోలీస్‌ యంత్రాంగం, గొట్టిపాడు చుట్టూ ఒక బలమైన రక్షణ వలయాన్ని నిర్మించి, అక్కడి వాస్తవాల్ని బాహ్య ప్రపంచం దృష్టికి వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అలానే యీ హింసాకాండను ఖండించిన రాజకీయ పార్టీల బాధ్యులనుగానీ, సంఘీభావ కమిటీ బాధ్యులను గానీ గొట్టిపాడు వెళ్ళి బాధిత దళితులకు ఆత్మస్థైర్యాన్నివ్వకుండా అడ్డుకుంటున్నారు. జనవరి 24న కమిటీ యిచ్చిన ʹʹఛలో గొట్టిపాడుʹʹ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి కొన్ని వేలమంది పోలీసుల్ని, ప్రత్యేక పోలీసు బలగాల్ని చుట్టుప్రక్కల గ్రామాలన్నింట్లో మోహరించి వందలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని నిర్బంధించారు. అయినా యింత నిర్బంధంలో కూడా గ్రామంలోని దళిత మహిళలు జనవరి 24న అక్రమంగా నిర్బంధించిన ప్రజాసంఘాల, పార్టీల కార్యకర్తల్ని విడుదల చేసేంతవరకు గొట్టిపాడులో ధర్నా చేయటం వాళ్ళ చైతన్యానికి సంకేతం.

ఇన్ని రోజులుగా ఎంత ఆందోళన జరిగినా పోలీసులు యిప్పటికీ, ప్రధాన నిందితులైన ఆలపాటి పాండు, మారెళ్ళ భాస్కర్‌, గుంటుపల్లి ఉపేంద్రలను - వాళ్ళు బహిరంగంగా గ్రామంలో తిరుగుతున్నా - అరెస్టు చేయలేదు. ప్రధాన నిందితుల్ని అరెస్టు చేయకుండా, నిందితులలో కొద్దిమందిని అరెస్టు చేసి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు.

తెలుగుదేశం పాలనలో అగ్రకుల దురహంకార్లు దాడులు చేయటం కొత్తేమీకాదు. గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహాన్ని గ్రామంలోని చెఱువు కట్టమీద ఏర్పాటు చేయడానికి దళితులు ప్రయత్నిస్తే అక్కడ ఎలాంటి దౌర్జన్యాలు జరిగాయో, చివరకు రాజీపేరుతో, కొందరు దళిత దళారులను చేరదీసి, ఉద్యమాన్ని ఎలా నీరుగార్పించారో అందరికీ తెలిసిన విషయమే! అదే విధంగా దేవరపల్లి, గొట్టిపాడులలో దళిత దళారులను లొంగదీసుకుని బలవంతపు రాజీలు చేయించి, ఉద్యమాలను నీరుగార్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు. దళితులను అక్కున చేర్చుకుంటామనీ, దళిత యువకులకు ఉపాధికోసం, ఖరీదైన ఇన్నోవా కార్లను యిచ్చామనీ, తెలుగుదేశం పార్టీని, తెలుగు దళిత దేశంగా రూపొందిస్తామనీ, ఆ పార్టీ నాయకులు ఆర్భాటం చేస్తున్నారు. అమరావతి రాజధానిలో 125 అడుగుల ఎత్తున తాము నిర్మించబోయే అంబేద్కర్‌ విగ్రహం దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. దళితుల ఆత్మగౌరవం, ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వంతోనే సాధ్యమవుతుంది తప్ప, అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటుతో మాత్రమే సాధ్యం కాదనే విషయాన్ని దళితుల చేత గుర్తింపచేయాలి.

గొట్టిపాడు దళితుల ప్రధాన డిమాండ్లు :

1. ముగ్గురు ప్రధాన అగ్రకుల నిందితులతోపాటు నిందితులందర్నీ అరెస్టు చేయాలి.

2. వాళ్ళపై ఐ.సి.సి. 307 సెక్షన్‌ ప్రకారం కేసు పెట్టాలి.

3. దళితులపై పెట్టిన కౌంటర్‌ కేసులను ఎత్తివేయాలి.

4. గొట్టిపాడులో సాగుతున్న దళితుల సాంఘిక బహిష్కరణను ఎత్తివేయించాలి.

5. గొట్టిపాడుగ్రామంలో, దళితవాడను ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటు చేయాలి.

6. గొట్టిపాడులో నెలకొల్పిన పోలీస్‌ క్యాంపును ఎత్తివేసి, ఆ గ్రామంలో ప్రవేశించటంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి.

No. of visitors : 398
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప...
...ఇంకా చదవండి

ప్రపంచ విప్లవాలన్నిటికీ నిర్దిష్టమైన మార్గదŠర్శకత్వా“•న్ని రూపొందించిన బోల్షివిక్‌ పార్టీ

సోవియట్‌ యూ“నియన్Ž కమ్యూ“నిష్ట్‌ (బోల్షివిక్‌పార్టీ) ™సెంట్రల్ కమిటి | 05.02.2017 10:52:28am

విప్లవాలకు, మార్క్సిష్టు లెనినిష్టు సిద్ధాంతానికి కాలం చెల్లిపోయిందŠ“ని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విఫల˜Ÿమైన విప్లవాల గురించిన.......
...ఇంకా చదవండి

అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంల...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •