వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

- వి.చెంచయ్య | 20.02.2018 12:40:30am

వర్ణం నుండి కులం దాకాʹ అనే పుస్తకం యలవర్తి నవీన్‌ బాబు ఎం.ఫిల్‌. థీసిస్‌. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది భారత సామాజిక వ్యవస్థలో కులం పుట్టుక, దాని రాజకీయ ఆర్థిక విశ్లేషణ, ఈ దేశంలో కుల వ్యవస్థను రూపుమాపాలంటే దాని పుట్టుకను గురించీ, దాని పరిణామాన్ని గురించీ, వివిధ సామాజిక వ్యవస్థలలో దాని పాత్రను గురించీ, దాని ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక కోణాల గురించీ తెలుసుకోవాలి. ఇందులో నవీన్‌బాబు కులం పుట్టుక గురించి చేసిన పరిశోధన మార్క్సిస్టు దృక్కోణం నుండి చేసిందే.

ఈ సిద్ధాంత వ్యాసానికి ʹవర్ణం నుండి కులం దాకాʹ అని పేరు పెట్టడంలోనే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ రెండూ వేరు వేరని రచయిత భావించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వర్ణం అనేది మొదట రంగును మాత్రమే సూచించేదిగా ఉన్నదనీ, ఆ తర్వాత మాత్రమే చాతుర్వర్ణ సిద్ధాంతంతో అన్వయం పొందిందనీ రుజువు చేశాడు. తెల్లరంగు కలిగిన ఆర్యులనూ, నల్లరంగు కలిగిన అనార్యులనూ సూచించడానికే వర్ణని అనే మాట మొదట ఉపయోగించబడింది.

రుగ్వేద కాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, విశ్‌లు అనే విభజన ఆర్య తెగలలోని వారికి మాత్రమే వర్తించే అంతర్గత విభజన అనీ, అప్పటికీ ఈ విభజనకు వర్ణాలు అనే పేరు లేదనీ రచయిత భావిస్తున్నాడు. ఆర్యులు ఓడించి లొంగదీసుకున్న అనార్య తెగల్నీ, కొన్ని ఆర్య తెగల వారినీ శూద్రుల పేరుతో సేవక వర్గంగా మార్చుకున్న తర్వాతనే బ్రాహ్మణులు చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని సృష్టించారని రచయిత అభిప్రాయం.

యజ్ఞ యాగాదులలో సమర్పించిన కానుకల అసమాన పంపిణీ వల్ల వేద కాలంలోనే గణ వ్యవస్థ ఉన్నప్పుడే వర్గాల పుట్టుకకు బీజం పడిందని నవీన్‌ బాబు పరిశోధనలో తేలింది. ఒక విధంగా వర్ణాల కంటే వర్గాలే ముందు పుట్టాయని చెప్పినట్టయింది.

వర్ణం అనే పదం మొదటిసారిగా రుగ్వేదంలో పేర్కొన్నారు. రుగ్వేదంలోని పురుష సూక్తంలో తప్ప మిగిలిన రుగ్వేదమంతటిలో వర్ణాన్ని రంగు అనే అర్థంలోనే ఉపయోగించారు. అంటే తెల్లరంగు కలిగిన ఆర్యులనూ, నల్లరంగు కలిగిన దాసులనూ (దస్యులనూ) పేర్కొనడానికి మాత్రమే వర్ణాన్ని ఉపయోగించారు. అంతేగాని ఆ తర్వాత సృష్టింపబడ్డ వర్ణ వ్యవస్థలోని వర్ణంతో దానికి సంబంధం లేదు. పురుష సూక్తంలో మొదటిసారిగా పురుషుడి (బ్రహ్మ) విభిన్న శరీర భాగాల నుండి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పుట్టారని పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే పురుష సూక్తంలో కూడా బ్రాహ్మణుల్నీ, క్షత్రియుల్నీ, వైశ్యుల్నీ, శూద్రుల్నీ వర్ణాలని అనలేదు. ఈ నాలుగు సమూహాల పుట్టుక గురించి మాత్రమే ఉంది. రుగ్వేదం తర్వాత వచ్చిన రచనల్లోనే ఈ నాలుగు సమూహాల్ని వర్ణాలని అన్నారు. అప్పటి నుండి వర్ణం అంటే ఆర్యుల్నీ, అనార్యుల్నీ సూచించే రంగు అనే అర్థంలో గాక, చాతుర్వర్ణ సిద్ధాంతంలోని వర్ణం అనే దానికి ప్రతీకగా మారిపోయింది. అందుకే రుగ్వేదానంతర (మలివేద) కాలంలోని రచయితలందరూ భారత సమాజాన్ని చాతుర్వర్ణ సమాజంగానే వర్ణించారు. ఈ చాతుర్వర్ణ సమాజంలో అగ్రస్థానంలో బ్రాహ్మణుల్నీ, తర్వాత క్షత్రియుల్నీ, వారికింద వైశ్యుల్నీ, చివరకు అట్టడుగున శూద్రుల్నీ ఉంచారు. తర్వాత వచ్చిన మనుస్మృతి లాంటి స్మృతులు ఈ నాలుగు వర్ణాలకు వారి వారి విధుల్నీ, అధికారాల్నీ, బాధ్యతల్నీ - వైదిక పరిభాషలో చెప్పాలంటే వారి వారి ధర్మాల్ని నిర్దేశించి చెప్పాయి.

మలివేదకాలంలో ఈ నాలుగు వర్ణాలకు తోడు, ఈ వర్ణాలకు సంబంధించని మరికొన్ని సముదాయాలు కూడా ఏర్పడ్డాయి. అనార్య తెగల్ని ప్రధాన సమాజంలో కలుపుకోవడం వల్లగానీ, పాత సమాజంలోని అంతర్గత విభజన వల్లగానీ, వ్యవసాయ సమాజం ప్రారంభం కావడంతో కొత్తగా తలెత్తిన కొన్ని వృత్తుల వల్లగానీ కొత్త సముదాయాలు పుడుతూనే ఉన్నాయి. నిజానికి ఆనాటి స్మృతికారులు చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ఆనాటి భారత సామాజిక వాస్తవికతకు అన్వయించడంలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అందుకే ʹపవిత్రంʹగా భావించిన చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ఆనాటి సమాజంలోని అనేక రకాల ఈ సముదాయాల వాస్తవికతతో ముడిపెట్టడానికి అష్టకష్టాలు పడి, చివరకు వర్ణ సంకర సిద్ధాంతాన్ని తయారు చేసి ముందుకు తెచ్చారు. దీని ప్రకారం మొట్ట మొదట ఉన్న నాలుగు వర్ణాలు ఆయా వర్ణాల మధ్య వర్ణ సంకరం జరగడం వల్ల అనేక రకాల కులాలు అస్తిత్వంలోకి వచ్చాయని వారి అభిప్రాయంగా అర్థం చేసుకోవాలన్న మాట. ధర్మసూత్రకారులు పేర్కొన్న సంకరజాతుల సంఖ్య ఏ ఇద్దరి దృష్టిలో ఒక రకంగా లేదు. ఎప్పటికప్పుడు ఆ సంఖ్య మారిపోతూనే ఉంది. మను ధర్మశాస్త్రంలోనూ, విష్ణు ధర్మసూత్రంలోనూ మొదటిసారిగా సంకర వర్ణాలకు వృత్తుల్ని ఆపాదించారు. మనువు మొత్తం 23 రకాల వృత్తుల్ని పేర్కొన్నాడు.

నవీన్‌బాబు తన పరిశోధనా గ్రంథానికి ʹFrom Vrana to Jatiʹ అని పేరు పెట్టాడు. తెలుగులో జాతి అంటే వేరే అర్థం ఉన్నందువల్ల అనువాదకులు కులం అనే మాటను ఉపయోగించారు. అందుకనే తెలుగులో దీని శీర్షికను ʹవర్ణం నుండి కులం దాకాʹ అని పెట్టారు. ఇంగ్లీష్‌ పదం ʹcaste ʹఅనేదాన్ని వర్ణం, కులం, ఉపకులం మొదలైన అన్ని అర్థాల్లోనూ వాడడం వల్ల నవీన్‌బాబు ʹcasteʹ అనే మాటకు బదులు ʹJatiʹ అనే హిందీ పదాన్ని తీసుకున్నాడు.

దీపాంకుర్‌ గుప్తా అనే చరిత్రకారుడు చెప్పినట్టుగా వర్ణం, కులం అనేవి రెండు విభిన్నమైన ఉత్పత్తి విధానాలకు సంబంధించినవని నవీన్‌ బాబు కూడా అభిప్రాయపడ్డాడు. రుగ్వేద కాలం పశుపాలక వ్యవస్థకు సంబంధించింది. మలివేద కాలం వ్యావసాయిక సామాజిక వ్యవస్థకు చెందింది. రుగ్వేద కాలంలోనే రెండు రకాల సామాజిక విభజనలు ఉండేవి. మొదటిది ఆర్య తెగలకూ, అనార్య తెగలకూ (దాసులకూ) ఉన్న విభజన. రెండోది ఆర్య తెగల్లోనే అంతర్గతంగా ఉన్న విభజన. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, విశ్‌లు (సాధారణ జనం) అనే విభజన. పశుపాలక సమాజం నుండి వ్యావసాయిక సమాజంలోకి పరిణామం చెందడంలో ఈ రెండవ రకం విభజన ప్రధాన పాత్ర నిర్వహించింది. ఈ క్రమంలో ఆర్యులకూ, దాసులకూ మధ్య ఉన్న తేడా - అంటే రంగు భేదం నిరుపయోగం అయిపోయింది. వ్యావసాయిక సమాజం మూడు వర్ణాలు లేదా నాలుగు వర్ణాల మీద మాత్రమే ఆధారపడి కొనసాగే అవకాశం లేదు. అనేక వృత్తులు రావడం వల్ల కుల వ్యవస్థకు ప్రాధాన్యం ఏర్పడింది. సామాజిక వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సామాజిక విభజనలో కూడా అనివార్యంగా మార్పులొస్తాయి. ఉత్పత్తి విధానం మారినప్పుడు ఉత్పత్తి సంబంధాలు కూడా మారతాయి. అంటే సామాజిక విభజనలు కూడా మారతాయని అర్థం. ఈ సామాజిక విభజనలు వర్ణ సిద్ధాంతంపై ఆధారపడినవి కాదు. ఎందుకంటే చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం వర్ణాలు నాలుగే. వ్యవసాయం అభివృద్ధి చెందే క్రమంలో అనేక వృత్తులు ఏర్పడడం వల్ల ఆ సమాజానికి నాలుగు వర్ణాలు అంటే నాలుగు విభాగాలు చాలవు. అందుకే ఎక్కువ విభాగాలున్న కుల వ్యవస్థ అవసరం ఏర్పడింది. అయితే వర్ణ సిద్ధాంతం ఉనికికే ప్రమాదం ఏర్పడినా, ఆ తర్వాతి కాలంలో కూడా అది కొనసాగింది. పాత సామాజిక వ్యవస్థలోని కొన్ని అంశాలు అవసరం లేకపోయినా, అవి కొత్త సామాజిక వ్యవస్థలో కూడా కొనసాగుతాయని ప్రసిద్ధ చరిత్రకారుడు డి.డి. కోశాంబి నిరూపించిన విషయమే. ఇలాంటి అంశాలు కొత్త సామాజిక వ్యవస్థలో సైద్ధాంతిక అంశాలుగా మాత్రమే మిగిలిపోతాయి.

కొత్త సామాజిక వ్యవస్థలో - అంటే వ్యవసాయిక సామాజిక వ్యవస్థలో అవసరం కొద్దీ ఏర్పడ్డ అనేక వృత్తి సముదాయాలు (వీటినే ఆ తర్వాత కులాలుగా పేర్కొన్నారు) చాతుర్వర్ణ వ్యవస్థలో ఇమిడేవి కావు. అందుకే కులాలుగా స్థిరపడ్డ ఈ వృత్తి సముదాయాలన్నిటినీ ధర్మశాస్త్రకారులు శూద్రవర్ణంలో భాగం చేశారు. దీంతో అగ్రవర్ణాలు - ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణం వారు రెండు విజయాన్ని సాధించగలిగారు. ఒకటి - ఉనికిని కోల్పోతున్న వర్ణ సిద్ధాంతానికి కృత్రిమంగానైనా ఒక ఉనికిని కల్పించడం. రెండు - వివిధ వృత్తి సమూదాయాలన్నిటినీ శూద్రవర్ణంలో చేర్చి మెజారిటీ ప్రజల్ని అట్టడుగు స్థాయికి నెట్టివెయ్యడం.

మార్క్స్‌ ప్రకారం వర్గం అంటే ఉత్పత్తి సాధనాలకు సంబంధించి ఒకే రకమైన స్థానంలో ఉన్న ప్రజల సముదాయం. అంటే ఉత్పత్తి సాధనాలను కలిగి ఉన్నవారూ, అవి లేనివారూ అని అర్థం. అయితే ఈ రెండు వర్గాలూ రెండు ముద్దలుగా మాత్రమే ఉండవు, అనేక సామాజిక వర్గాలుగా విడిపోయి ఉంటాయి. ఇవి మధ్య యుగాల్లోని యూరప్‌లో కులీనులుగా, భూస్వాములుగా, అర్ధబానిసలుగా, చేతివృత్తుల వారుగా విడిపోలే, భారతదేశంలో కులాల రూపాన్ని తీసుకున్నాయి. ఇవాళ శూద్ర వర్ణంలోని వందల కులాలలతో పాటు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు కూడా వ్యవహారంలో కులాలుగానే పరిగణింపబడుతున్నాయి. చాతుర్వర్ణ సిద్ధాంతం సైద్ధాంతిక స్థాయితోనే ఉనికిలో ఉంటే, కులాలు సామాజిక వాస్తవికతకు అద్దం పడుతున్నాయి.

వైదిక కాలంలో వర్గాలు లేవనీ, వేదకాలం తర్వాత వ్యవసాయం, రాజ్యం అభివృద్ధి చెందడంతోనే వర్గాలు ఆవిర్భవించాయనీ కోశాంబి, ఆరెస్‌ శర్మ, రొమీలా థాపర్‌ లాంటి ప్రసిద్ధ చరిత్రకారులు చెప్పిన విషయాన్ని నవీన్‌బాబు తప్పు బడుతున్నాడు. అతని పరిశోధనా బలమే అతనికీ సాహసాన్నిచ్చింది. వేదకాలంలోని పశుపాలక వ్యవస్థలో అదనపు ఉత్పత్తి సాధ్యం కాకపోవడాన్ని ఒక కారణంగా చూపి, ఆ తర్వాతి కాలంలోనే వర్గాలు పుట్టాయని వారు చెప్పారని అన్నాడు. రుగ్వేద సమాజం కానుకల ఆర్థిక వ్యవస్థ (gift economy) పై ఆధారపడింది. తెగలో ఉన్న సభ్యులు తమ తెగ పెద్దలకు కానుకలు సమర్పించుకునేవారు. తెగ పెద్దలు కానుకల రూపంలో వచ్చిన సంపదను తిరిగి బ్రాహ్మణులకూ, రాజన్యులకూ కానుకలుగా ఇచ్చేవారు. యజ్ఞయాగాది సందర్భాల్లో తెగ పెద్దలు కొంత సంపదను తెగ సభ్యులకు కూడా కానుకలుగా ఇచ్చేవారు. ఈ కానుకల ఆర్థిక వ్యవస్థ మొదట ఆచారంగా ప్రారంభమై తర్వాత బలప్రయోగంతో అమలు జరిగింది. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థ అస్తిత్వంలోకి వచ్చిన విధానంపైనా, దాని వెనుక గల కారణాలపైనా చరిత్రకారులు తగినంత శ్రద్ధ పెట్టలేదని అంటాడు నవీన్‌బాబు. అందుచేతనే వైదిక సమాజాన్ని వర్గ సమాజంగా గాక, శ్రేణులవారీ సమాజంగా వారు గుర్తించారనే నిర్ధారణకు నవీన్‌బాబు వచ్చాడు. ఆదిమ ఆహార సేకరణ సమాజంలో ఒక దశలో ఆహార పంపిణిలో అసమానతలు పొడి సూపాయి. అయితే ఆ తర్వాతి ఆహార ఉత్పత్తి సమాజంలో ఉన్నంత తీవ్రస్థాయిలో ఈ అసమానతలు లేకపోవచ్చు. అంత మాత్రాన ఆ సమాజంలో వర్గాలు లేవని కాదు. సేకరించిన ఆహారం గానీ, సంపద గానీ సమాన పంపిణీ జరగని సమాజాలన్నిటినీ వర్గ సమాజాలనే అనాలని నవీన్‌ బాబు స్పష్టంగా చెబుతాడు.

రుగ్వేదంలో ఇతర వృత్తుల గురించి ప్రస్తావన ఉన్నా, పూజారులు, యోధులే క్రియాశీల సముదాయాలు. మిగిలిన అన్ని వృత్తులకూ రెండవ స్థాయి ప్రాధాన్యమే ఉండేది. ఆర్యులలో ఉన్న విభజనల మధ్య ఈ దశలో అంతర్వివాహాల పట్ల గానీ, అంతస్సముదాయ భోజనాల పట్ల గానీ ఎటువంటి ఆంక్షలు లేవు. అలాగే కులాలు కూడా అప్పటికి రూపుదిద్దుకోలేదు. ఈ విషయాల్ని నిరూపించే ప్రస్తావనలు రుగ్వేదంలో ఉన్నాయి. ఒకే కుటుంబం నుండి బ్రాహ్మణులూ, క్షత్రియులూ ఉండేవారు. రుస్తిసేనుడి కొడుకులైన దేవపి, శాంతనుల్లో - పెద్ద కొడుకైన దేవి రాజు కావడానికి ఇష్టపడక పోవడంతో, చిన్న కొడుకైన శాంతనుడు రాజవుతాడు. ఈ ధర్మోల్లంఘన వల్ల కరువు వచ్చిందని పరిహారంగా వర్షం కోసం దేవపి ఒక క్రతువు నిర్వహిస్తాడు. దీనివల్ల అన్నదమ్ములిద్దరిలో ఒకరు రాజైతే, మరొకరు పురోహితుడయ్యాడు. అంటే రాజుకానీ, పురోహితుడు కానీ పుట్టుకతో నిర్ణయం కాలేదు. అయితే ధర్మోల్లంఘన అనే భావన కొంత ఉండేది. రుగ్వేదం ఒక శ్లోకంలో ʹʹనేను మంత్రాలు చదువుతాను. మా నాన్న వైద్యుడు. మా అమ్మ తిరగలితో విసురుతుంది. వేరే వేరే పనులు చేసి మేము సంపద కూడబెట్టాలనుకుంటాముʹʹ అని ఒక కవి అంటాడు. అంటే ఒకే కుటుంబంలోని ముగ్గురు ʹమూడు రకాల పనులు చేస్తారన్న మాట. తర్వాతి కాలంలోనే - అంటే వ్యావసాయిక సమాజంలోనే వృత్తి సముదాయాలు, క్రమంగా కులాలు ఒక రూపుదిద్దుకున్నాయి. రుగ్వేద కాలంలో నైపుణ్యం ఉంటే ఎవరు ఏ వృత్తినైనా చేపట్ట వచ్చుననే పద్ధతి ఉండేది. తర్వాత కాలంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ దడి కట్టుకున్న సముదాయాలుగా మారాయి.

ఆర్యుల ప్రధాన కానుక కొత్త ఉత్పత్తి సంబంధాలను ప్రవేశపెట్టడమే. అప్పటివరకు ఎక్కడికక్కడ స్థానిక రహస్యాలుగా ఉండిపోయిన నైపుణ్యాలూ, పనిముట్లూ, ఉత్పత్తి పద్ధతులూ కొత్తగా అందరికీ అందుబాటులోకి రావడమే దీనికి ప్రాతిపదిక. కొత్త ప్రాంతాలను కొత్త పద్ధతుల ద్వారా సాగులోకి తెచ్చారు. ప్రాచీన భారత దేశంలో వచ్చిన పరిణామంతో ఆర్యుల ప్రభావం, పాత్రల గురించి కోశాంబి వివరంగా చెప్పి ఉన్నాడు.

భారత దేశంలో పశుపోషక సమాజం నుండి వ్యావసాయిక సమాజానికి పరివర్తన చెందడానికి ఐదు శతాబ్దాల సుదీర్ఘ కాలం పట్టింది. రుగ్వేద కాలంలో నాగలి లేదు. మలివేద కాలంలో కొయ్య నాగలి ఉంది. వైదికానంతర కాలంలో ఇనుపనాగలి ప్రవేశించింది. ఇనుపనాగలితో వ్యవసాయం ఊపందుకుంది. ఈ కాలంలో పశుపోషణ, వైదిక కర్మకాండ, తెగలవంటి సంస్థలు తగ్గిపోయి వ్యవసాయ కార్యకలాపాలతో బాటు రాజ్యం, కులం, తదితర సంస్థలు బలపడ్డాయి. పశుపోషణ స్థానంలో వ్యవసాయం ప్రధాన ఆర్థిక కార్యకలాపమయింది.

మొత్తం మీద ఈ పుస్తకంలో నవీన్‌బాబు ప్రాచీన భారతదేశం గురించి ఎందరో చరిత్రకారులు చెప్పిన విషయాల్ని ప్రస్తావించి, వారి అభిప్రాయాలాలలోని సాధ్యాసాధ్యాల్ని చర్చించి, స్వీయ పరిశోధనా నైపుణ్యంతో కొన్ని నిర్ధారణలకు వస్తాడు. వర్ణమూ, కులమూ, రెండూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవని చెప్పడానికి ప్రయత్నించారు. వర్ణం, కులాలకు సంబంధించిన భౌతిక పునాదుల్ని గుర్తించి, సామాజిక నిర్మాణంలో వాటి స్థానాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణం నుండి కులం పుట్టుక వరకే తాను పరిమితమయినా, కులం పుట్టుక నుండి ఈనాటి దాకా జరిగిన పరిణామాల్ని అధ్యయనం చెయ్యడానికి ఒక శాస్త్రీయ మార్గాన్ని అందించాడు. నవీన్‌ బాబు జాతీయ వాది నుండి అంతర్జాతీయవాదిగా, సామాజిక శాస్త్రవేత్త నుండి విప్లవకారుడిగా, ఒక కామ్రేడ్‌ నుండి అమర వీరుడిగా ఎదిగిన యువ మార్క్సిస్టు మేధావి.

(ఛేంజ్‌ ప్రచురణగా తెలుగులో వచ్చిన ఈ పుస్తకం కోసం 040-24652387, 040-27608107 ఫోన్‌ నంబర్లను సంప్రదించండి.)No. of visitors : 759
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.....
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

వి. చెంచయ్య | 28.09.2018 01:10:47am

జాషువా కష్టసుఖాలు రెండూ అనుభవించాడు గాని, వాటికి వశం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, నిరాశామయ వాతావరణంలోనూ కవిగా నిలదొక్కుకోవడం జాషువా ప్రత్యేకత... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •