సోషలిజం స్వప్నసీమ కాదు, నిజం. తనను బంధించిన సకల ఆధిపత్యాలను జయించి ప్రకృతంత సహజంగా ఒక కొత్త మానవ సమాజం ఉదయిస్తుంది. అప్పడు గుప్పెడు మెతుకుల కోసం దెబ్బలు తిని చచ్చిపోయే మనుషులుండరు. పనిదొరక్క పొట్ట చేతబట్టుకొని ఊళ్లు తిరిగే రోజులు పోతాయి. శ్రమను, శరీరాన్ని కారు చవకగా అమ్ముకుని బతులీడ్చే దుర్భరత్వం ఉండదు. ఆకలి, అవమానాలు ఉండవు. జనమంతా నెత్తురు చిందించి పోగేసిన సంపదను దిలాసాగా తిని కూర్చుని విలాసాలు చేసుకునే పరాన్నభుక్కులుండరు. ఇవాలున్న ఉద్యోగం రేపు ఉంటుందా, ఊడుతుందా అని భయముండదు. జాతిభేదాలను, మత మూఢత్వపు సంకెళ్ళను తెంచుకుని విజ్ఞానపు శిఖరాలను చేరుకునే నూతన మానవి, మానవుడు ఉదయిస్తారు. అవును, అది సాధ్యమే. స్త్రీ పురుష సమానత్వం సాధ్యమే. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం అంతరించడం తథ్యమే. 1917 అక్టోబర్ విప్లవం ఒక కలను సాకారం చేసింది. ప్రపంచానికి ఆ కలను పంచింది. మార్క్సిజాన్ని ఆచరణలో నిరూపించిన బోల్షవిక్ విప్లవం మార్క్సిస్టు, లెనినిస్టు సూత్రాలను ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించేలా చేసింది. సామ్రాజ్యవాదానికి, ఫాసిస్టు ఉన్మాదానికి సుదూరాన సోవియట్ ప్రజలు ధీటైన జవాబు చెప్పినప్పుడు గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని ఇక్కడి తెలుగు కవి ఉత్తేజితమయ్యాడు. కనీసం మూడు తరాలు సామ్యవాద ఆదర్శాలతో ప్రభావితం అయ్యారు. ప్రపంచ పీడిత ప్రజలు సోవియట్ సోషలిజంలో తమ భవిష్యత్తును చూసుకున్నారు. బోల్షవిక్ విప్లవ విజయం వెంట ఎదురైన కఠినమైన సవాళ్లను ఎదుర్కొని పురోగమించిన సోవియట్ యూనియన్ అనుభవం మానవ సమాజానికి అత్యంత విలువైనది. గుండెనెత్తురులు తర్పణ చేస్తూ సాగిన ఆ ప్రయాణం, విజయాలూ, ఓటములూ అన్నిటి నుండి పాఠాలు తీసుకోవాలి. వందేళ్ళ బోల్షవిక్ విప్లవ విజయాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆ విజయం వెంబడి సాగిన సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాలను, తప్పొప్పులను, గెలుపోటములను అంచనా వేస్తున్నప్పుడు ఆ మొత్తం క్రమానికి ప్రాతినిథ్యం వహించిన లెనిన్, స్టాలిన్ లు మనకు కనిపిస్తారు. అందులోనూ విప్లవానంతరం సోషలిస్టు నిర్మాణంలో, అంటే మార్క్సిస్టు, లెనినిస్టు ఆచరణలో ఎక్కువ పాత్ర స్టాలిన్ ది. సరిగ్గా 65 సంవత్సరాల క్రితం తన డెబ్బై ఐదవ ఏట అమరుడైన స్టాలిన్ ను గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన నాయకత్వంలో నడిచిన ప్రపంచ కార్మిక వర్గ విప్లవాన్ని ఈ యుగానికి ఆవాహన చేసుకుందాం.
సామ్రాజ్యవాదం సోషలిజం మీద దాడిని స్టాలిన్ కేంద్రంగా నడిపింది. స్టాలిన్ ను విలన్ గా చిత్రీకరించి ఒక భావజాలంగా సోషలిజాన్ని ఓడించాలని చూసింది. ఎందుకంటే కార్మికవర్గ విప్లవం దానికి పొంచి ఉండే ప్రమాదమని తెలుసుకుంది గనక. ప్రపంచ సోషలిస్టు కేంద్రంగా సోవియట్ యూనియన్ అనేక దేశాల్లో కార్మికవర్గ విప్లవాలకు భౌతిక, రాజకీయ, సైద్ధాంతిక, నైతిక మద్దతునిస్తున్నది కనక దానిని ధ్వంసం చేయాలి. ప్రపంచ కార్మికవర్గ అభిమాన నాయకుడిగా ఉన్న స్టాలిన్ ను నియంతగా, క్రూరుడిగా నిరూపించాలి. ఈ ప్రయత్నంలో అది ఆశించిన విజయం చాలావరకు సాధించింది. కానీ స్టాలిన్ మరణించి 65 సంవత్సరాలైనా ఆ దాడి ఎందుకు ఇంకా కొనసాగుతూనే ఉంది? మార్క్స్ చెప్పినట్లు పెట్టుబడిదారీ సమాజానికి గోరీ కట్టే కార్మికవర్గం ఎన్నటికైనా లేచి నిలవడం తప్పదు కాబట్టి. స్టాలిన్ మీద దాడిని కమ్యూనిజం మీద దాడిగా సామ్రాజ్యవాదులకు ఉపయోగపడుతోంది.
ఈ తరానికి స్టాలిన్ ఎలా పరిచయమవుతాడు? మీరు సరదాగా గూగుల్ లో హిట్లర్ అని టైప్ చేయండి. అది చాలా చోట్ల హిట్లర్ తో పాటు స్టాలిన్ ను చూపెడుటింది. స్టాలిన్ ప్రామాణిక రచనలను వెతకండి. స్టాలిన్ మీద దూసిన విమర్శలూ, దూషణలూ ముందుగా వస్తాయి. ఈ తరానికి స్టాలిన్ నియంతగానే పరిచయమవుతాడు. జార్జ్ ఆర్వెల్ ʹఅనిమల్ ఫాంʹలో నెపోలియన్ అనే పందిగా పరిచయమవుతాడు. తమను తాము కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళలో కూడా స్టాలిన్ అంటే గిట్టనివాళ్ళున్నారు. తెలిసి కొందరు, తెలీక చాలా మంది సామ్రాజ్యవాదుల అపద్ధాల హోరులో కొట్టుకుపోతున్నారు. ప్రజాస్వామికవాదులమని అనిపించుకోవడం కోసం స్టాలిన్ ను ద్వేషించే మార్క్సిస్టులున్నారు. స్టాలిన్ తప్పులు చేయలేదా అని అడక్కండి. స్టాలిన్ తప్పులు చేసాడు. కానీ అతను నియంత కాదు. సోషలిజాన్ని నిర్మించినవాడు. సోషలిజాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినవాడు. ప్రపంచంలో మూడోవంతు సోషలిస్టు రాజ్యాలు ఏర్పడటానికి శక్తులన్నీ వెచ్చించి కృషి చేసినవాడు. తప్పులతో పాటు ఎవ్వరూ సాధించని విజయాలను సోవియట్ కు సాకారం చేసినవాడు. అందువల్లనే తాను చేసిన తప్పులకన్నా వేల రెట్లు విమర్శలకు, ద్వేషానికి గురవుతున్నవాడు. కమ్యూనిస్టులు స్టాలిన్ మీద దాడిని ఎదుర్కోకుండా వర్గపోరాట సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం సాధ్యం కాదు. స్టాలిన్ ను అంచనా వేయడం అంటే అది ఆ ఒక్క వ్యక్తి గురించి కాదు, ఇరవయ్యో శతాబ్ది సోషలిస్టు ఆచరణను అంచనా వేయడం.
స్టాలిన్ అట్టడుగు వర్గం నుండి, జాతి నుండి వచ్చాడు. అతని తండ్రి భూస్వామి కింద సెర్ఫ్(బానిస)గా ఉండేవాడు. అనంతరం శ్రమను అమ్ముకునే స్వేచ్చను పొంది చెప్పులు కుట్టే వృత్తిలోకి వచ్చాడు. వాళ్ళది నిమ్న జాతిగా పిలవబడుతున్న జార్జియా. స్టాలిన్ విద్యార్థి దశలో జాతీయ భావాలు కలిగి ఉండేవాడు. అణచివేయబడిన జార్జియా జాతి ఔన్నత్యంపై కవిత్వం కూడా రాశాడు. పదిహేనవ ఏటనే జారు చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడుతున్న రహస్య మార్క్సిస్టు బృందాలతో కలిసాడు. అక్కడి నుండి మార్క్సిస్టుగా, అంతర్జాతీయవాదిగా, ప్రపంచ కార్మికవర్గ విప్లవానికి దన్నుగా స్టాలిన్ విస్తరించాడు.
విప్లవం విజయవంతమైన వెంటనే సోవియట్ యూనియన్ను పెట్టుబడిదారీ దేశాలన్నీ చుట్టుముట్టి ధ్వంసం చేసే ప్రయత్నంలో సోవియట్ యూనియన్ అపార నష్టాన్ని చవిచూసింది. కొద్ది సంవత్సరాల్లోనే లెనిన్ మరణించాడు. సోషలిజం నిర్మాణ బాధ్యత స్టాలిన్ వహించాల్సి వచ్చింది. భూమిపై, సాంఘిక జీవితంపై కులక్ ల (భూస్వాములు) ఆధిపత్యం కింద గ్రామాలు కునారిల్లుతున్నాయి. అందులోనూ అత్యంత వెనబడిన తెగలు, జాతులు. పారిశ్రామికంగా బలహీనమైన దేశం. కరువు, తిండి గింజల కొరత జనాన్ని మరింతగా పీడించింది. ఈ దశ నుండి సోవియట్ ప్రజలు బోల్షవిక్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచం కనీవినీ ఎరగని ప్రగతిని సాధించారు. పరిశ్రమలు, వ్యవసాయం శరవేగంగా అభివృద్ధి చెందాయి. అదంతా పెట్టుబడిదారుల హక్కుభుక్తం కాలేదు. కార్మికులకు 12 నుండి 14 గంటలు ఉండిన పని దినాలు, ఏడు గంటలకు తగ్గిపోయాయి. స్త్రీలు పురుషులతో సమాన వేతనం, ఓటు హక్కు పొందడం మాత్రమే కాదు, పశ్చిమ దేశాలతో పోల్చితే అత్యంత వెనకబడిన సమాజంలో దర్భర పితృస్వామిక పీడనను అనుభవించిన వాళ్ళు సోవియట్ లకు అధ్యక్షురాళ్ళు కూడా అయ్యారు. ఫ్యాక్టరీలలోనే కాదు యుద్ధరంగంలోనూ పనిచేసారు. ఆర్ధిక ప్రగతితో పాటు విద్య, విజ్ఞానం, కళలు విప్లవాత్మకంగా ఎదిగాయి.
ప్రపంచంలో మరెక్కడా లేనన్ని భాషలు, జాతులు సోవియట్ యూనియన్ లో ఉన్నాయి. మెజారిటీ రష్యన్ జాతి తక్కిన జాతుల మీద ఎంతో కాలంగా ఆధిపత్యం చేసింది. దాన్ని స్వయంగా చవిచూసిన వాడు స్టాలిన్. జాతుల సమస్య మీద స్టాలిన్ విశ్లేషణ ప్రామాణిక మార్క్సిస్టు అవగాహనగా నిలుస్తుంది. అందుకే 1917 విప్లవానతరం జాతుల కమిస్సారియేట్ చైర్మెన్ గా పార్టీ ఆయన్ని ఎన్నుకుంది. జాతులకు స్వేచ్చా, స్వయంనిర్ణయాధికార హక్కు గ్యారెంటీ చేయడమే కాదు, అవన్నీ సమానంగా పురోగామించేలా సోవియట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR) లో రష్యన్, ఉక్రేనియన్, వైట్ రష్యన్, ట్రాన్స్ కాకేషియన్, తుర్క్మేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఫెడరల్ రిపబ్లిక్కులున్నాయి. వీటిలో మళ్ళీ అనేక జాతులు. USSR లో రష్యా అనే పదం లేకపోవడం మనం గమనించవచ్చు. సోవియట్ ప్రభుత్వం మాత్రమే సాధించిన అద్భుతం పెద్దా, చిన్న జాతి సమూహాలన్నిటికీ వారి భాషలోనే విద్య, విజ్ఞానం అందుబాటులోకి తేవడం. ఎన్ని భాషలున్నాయో అన్నిటికీ ముద్రణా సంస్థలు నెలకొల్పారు. వారి సాహిత్యం, సంస్కృతీ, కళలు ప్రపంచానికి పరిచయం చేసారు. థియేటర్లు, కళా సాంస్కృతిక వికాసానికి సోవియట్ ప్రభుత్వం ఎంతో తోడ్పాటునందిన్చింది. ʹమార్క్సిజం - భాషాశాస్త్ర సమస్యలుʹ అనే మరో ప్రామాణిక రచన స్టాలిన్ చేసాడు. ప్రపంచంలోని అనేక భాషల్లోకి రష్యన్ సాహత్యం వచ్చింది. సోవియట్ సాహిత్యంతో తెలుగు ప్రజల అనుబంధం ఎంతగానో ఉంది.
సోషలిస్టు వ్యవస్థలో ప్రణాలికాబద్ధ అభివృద్ధి ఎలా ఉంటుందో సోవియట్ యూనియన్ ఉదాహరణగా నిలిచింది. విప్లవానంతరం వేగంగా నిరక్షరాశ్యత రూపుమాసిపోయింది. సోవియట్ ప్రభుత్వ సంరక్షణలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగారు. పది సంవత్సరాలు పరీక్షలు లేని చదువు అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. విద్యార్థులు తమకు ఇష్టమైన వృత్తిని, పరిశోధనను ఎంచుకునే స్వేచ్చను అనుభవించారు. ఉపాధి, ఉద్యోగం గురించి దిగులు అసలే లేదు. శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తారు. పని చేసేచోటే నివాస స్థలం. ఉచిత విద్య, వైద్యం. ఇదంతా చెప్తే ఇప్పటి తరానికి కథలాగా అనిపిస్తుంది. రష్యాలో ఇట్లా ఉంటుందట అని ఆ రోజుల్లో చెప్పుకోవడం, కమ్యూనిస్టులు ప్రచారం చేయడం, పెట్టుబడిదారులు వ్యతిరేక ప్రచారం చేయడం అంతా సోషలిస్టు రాజకీయాల చుట్టూ తిరిగేలా వాటి ప్రభావం ఉండేది.
పశువుల్లా బతికిన మనుషులు, ఆత్మగౌరవంతో జీవించగలిగే మానవీయ వ్యవస్థ రావాలంటే సమస్త సంపదను తమ హక్కుభుక్తంగా కలిగి ఉండే పెట్టుబడిదారీ వర్గాన్ని నిర్మూలించాలి. ఇది అంత సులభం కాదు. కులక్ లు సమిష్టి వ్యవసాయ క్షేత్రాలపై దాడులు చేసి పంటలను తగలబెట్టారు. హత్యలు, అత్యాచారాలు చేసారు. సోవియట్ ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ తమ అధికారం స్థాపించుకోవడం కోసం బూర్జువాలు, భూస్వాములూ చేసే ప్రయత్నాలకు జర్మనీ, అమెరికా, బ్రిటన్ లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. ట్రాట్స్కీ, బుఖారిన్ వంటి ద్రోహులు లెక్కలేనన్ని కుట్రలు చేసారు. పరిశ్రమలలో యంత్రాలని పాడు చేయడం మొదలుకొని, కమ్యూనిస్టు నాయకులను హత్యలు చేయడం దాకా జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు సోవియట్‌లో ఏజంట్లను తయారు చేసుకొని నడిపించారు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించడానికి రష్యాతో కలిసి కూటమిగా ఏర్పడిన అమెరికా, బ్రిటన్ లు హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి చేసినప్పుడు సోవియట్ యూనియన్ ఓడిపోవాలని ఎదురుచూసాయి. రెండు కోట్ల సోవియట్ ప్రజల త్యాగాలతో హిట్లర్ ను ఓడించిన తర్వాత సోవియట్ యూనియన్ శక్తి మరింతగా ప్రపంచానికి తెలిసి వచ్చింది. యుద్ధం తర్వాత చూస్తే సగం రష్యా బూడిదైంది. అయినా అనతికాలంలోనే పెట్టుబడిదారీ దేశాలు ఈర్షపడేలా లేచి నిలిచింది. ఎర్రసైన్యాన్ని నలుదిశలా కొనియాడారు. తూర్పు యూరోప్ దేశాల్లో కార్మికవర్గ విప్లవాలు విజయవంతమై సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జన చైనా అవతరించింది. వియత్నాం విముక్తమైంది. మూడోవంతు ప్రపంచం సోషలిజం కిందికి వచ్చాయి. సహజంగానే వీటికి సోవియట్ యూనియన్ సహకారముంది. స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ప్రపంచ సోషలిస్టు కేంద్రమైంది. అదే సమయంలో అనేక దేశాలు బ్రిటన్ ప్రత్యక్ష వలస నుండి విముక్తమయ్యాయి. సోవియట్ తరహా అభివృద్ధి, సోవియట్ తరహా ప్రజా సంక్షేమం ఆదర్శమయ్యాయి. పాలకులకు కనీసం సోషలిజం అని, సంక్షేమం అని నటించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక దేశంలో సోషలిజం నిర్మించడం అసాధ్యమన్న ట్రాట్స్కీ వాదాన్ని కొట్టిపడేస్తూ, ఒకదేశంలో విప్లవం విజయవంతమై అది ప్రపంచ దేశాలకు విస్తరించడం కూడా సాధ్యమేనని నిరూపించింది స్టాలిన్ నాయకత్వంలోని సోవియట్ యూనియన్.
సామ్రాజ్యవాద శక్తులకు సోవియట్ యూనియన్ బలమైన ప్రత్యర్థిగా అవతరించింది. నాటో కూటమి ఏర్పడింది. స్టాలిన్ మీద దాడి మొదలైంది. హిట్లర్ లాగా ప్రపంచాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని పెడబొబ్బలు పెట్టాయి సామ్రాజ్యవాద శక్తులు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకతతో జర్మనీ ఫాసిస్టులు చేసిన ప్రచారాన్ని అరువు తెచ్చుకొని, దానికి మరిన్ని రంగులద్ది అమెరికా పెట్టుబడిదారీ పత్రికాధిపతి హెరెస్ట్ వంటి వాళ్ళు, బ్రిటిష్ గూఢచార విభాగంలో పనిచేసి అనంతరం చరిత్ర రచనలో ప్రవేశించిన రాబర్ట్ కాంక్వెస్ట్ వంటివాళ్ళు గుట్టల కొద్దీ అపద్ధాలు రాయడం, లక్షల డాలర్లు పోసి వాటిని ప్రచురించి ప్రచారం చేయడం సామ్రాజ్యవాద యుద్ధతంత్రం కిందనే జరిగింది. స్టాలిన్ మరణానంతరం కృశ్చెవ్ కుట్రపూరితంగా కల్పించిన అపద్ధాలు దానికి ఎంతగానో సహకరించాయి. ఇప్పటికీ స్టాలిన్ పై వందలకొద్దీ పుస్తకాలు, సినిమాలు, వేల కొద్దీ వ్యాసాలూ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే బైటపడిన సోవియట్ కమూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ పత్రాల్లో వాస్తవాలు వెల్లడైనా ఈ ప్రచారం ఇంకా జరుగుతూనే ఉంది.
స్టాలిన్ కాలంలో కులక్ లను, పార్టీ ద్రోహులను, విదేశీ ఏజెంట్లను శిక్షించే క్రమంలో లక్షల మందిని జైళ్లలో వేసారు. లేబర్ క్యాంపులకు తరలించారు. దేశం నుండి బహిష్కరించారు. మరణశిక్షలు విధించారు. ఇందులో తప్పులు జరగలేదని అనలేం. జారిస్టు రష్యా నుండి విముక్తమైన అత్యంత వెనకబడిన దేశంలో అప్పటి శిక్షా పద్ధతులు, ఆనాటి ప్రత్యేక చారిత్రిక పరిస్థితుల ఒత్తిడి నుండి దీనిని మనం చూడాలి. అట్లాగని వీటిని సమర్థించాల్సిన పని లేదు. స్టాలిన్ పట్ల వీరారాధన కూడా అటువంటిదే. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ వీటిని అధిగమించి ఉండాల్సింది అని ఆశించడం సహజమే. కానీ సామ్రాజ్యవాదులు ప్రచారం చేసినట్లు స్టాలిన్ 20 మిలియన్ల జనాభాను ఊచకోత కోసాడు అని ఒకరు, కాదు అరవై మిలియన్లని ఇంకొకరు, స్టాలిన్ కు మతిస్థిమితం లేదని మరొకరు ప్రచారం చేసి సోషలిజమంటే నియంతృత్వమే అని తేల్చి వేస్తే మౌనంగా ఉండకూడదు.
తప్పులున్నప్పటికీ ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. సోషలిజమే ఊపిరిగా బతికినవాడు. రెండో ప్రపంచయుద్ధంలో జర్మన్ ఆర్మీ స్టాలిన్ కొడుకును అపహరించి తమ జనరల్ ను విడుదల చేస్తే అతన్ని పంపిస్తామని అన్నప్పుడు లక్షలాది సోవియట్ సైనికుల వంటి వాడే యాకోవ్, అతని కోసం ఒక జనరల్ ను వదిలేస్తే సోవియట్ సైన్యానికి మరింత నష్టం కలుగుతుంది అని నిబ్బరంగా జవాబు చెప్పగలిగినవాడు. అనేక కష్టనష్టాల నడుమ, ఇంటా, బైట చుట్టుముట్టిన శత్రుమూకల మధ్య స్టాలిన్ నాయకత్వంలో ఒంటరిపోరాటం చేసింది సోవియట్ యూనియన్. ఆ అనన్య సామాన్యమైన త్యాగాలను, అద్భుత విజయ గాధలను తుడిచేయడం ఎన్నటికీ సాధ్యం కాదు. స్టాలిన్ పేరు చెప్పి సామ్రాజ్యవాద శక్తులు నిత్యం పోగుచేస్తున్న అపద్ధాల కుప్ప దానిని కప్పివేయలేదు. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది.
Type in English and Press Space to Convert in Telugu |
SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNIONIn the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ...... |
స్టాలిన్ కవితలువిద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్..... |
జీవించు జీవించు హే సూర్య బింబమా...దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది...... |
ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవుస్టాలిన్ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా..... |
స్టాలిన్ వ్యతిరేకత? ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్ మార్గంపట్ల రాజకీయ ఏ...... |
ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే...... |
పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా...... |
ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |