జీవించు జీవించు హే సూర్య బింబమా...

| సాహిత్యం | వ్యాసాలు

జీవించు జీవించు హే సూర్య బింబమా...

- తోలేటి జగన్మోహనరావు, స్టాలిన్ సొసైటి, ఇండియా | 04.03.2018 11:32:57pm

గత సంవత్సరం మనం అక్టోబరు విప్లవ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. కొంతమంది కమ్యూనిస్టులు స్టాలిన్ యుగం గురించి మాట్లాడకుండా, మాట్లాడిన చోట ఆ యుగాన్ని ఒక భీభత్స యుగంగా చిత్రిస్తూ, అక్టోబరు విప్లవ శత జయంతి ఉత్సవాలు ʹఘనంగాʹ నిర్వహించారు. స్టాలిన్ యుగాన్ని విస్మరించినా, వక్రీకరించినా, అక్టోబరు విప్లవ సారాంశాన్ని విస్మరించడమే, వక్రీకరించడమే అవుతుంది. ఎందుకంటే అక్టోబరు విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం సోవియట్ యూనియన్ లో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం. ఈ సోషలిస్టు నిర్మాణం లెనిన్ జీవించి ఉండగా ప్రారంభం కాలేదు. లెనిన్ అనంతరం, స్టాలిన్ యుగంలో, 1929లో మొదటి పంచవర్ష ప్రణాళికతో సోషలిస్టు నిర్మాణం ప్రారంభమైంది. స్టాలిన్ యుగాన్ని ఒక అంధయుగంగా, ఒక భీభత్స యుగంగా చిత్రించడమంటే, ఈ సోషలిస్టు నిర్మాణాన్ని నిరాకరించడమే. సోషలిస్టు నిర్మాణాన్ని నిరాకరించడమంటే అక్టోబరు విప్లవం విఫలమైందని అంగీకరించడమే. స్టాలిన్ ను నిరాకరించాకా ఇంక మనం అక్టోబరు విప్లవ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికేం మిగిలింది?

ఈ సంవత్సరం మార్చి 5వ తేదీకి స్టాలిన్ మరణించి 65 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కార్మిక వర్గ మహా నాయకుడు స్టాలిన్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలియజెప్పాల్సిన బాధ్యత ఆ యుగంతో పరిచయం ఉన్న సీనియర్ మార్క్సిష్టులకు ఉంది.

సోవియట్ యూనియన్ కూలిపోయి పాతికేళ్ళ పైన అయింది, స్టాలిన్ మరణించి 65 సంవత్సరాలైంది, ఇప్పుడు సోవియట్ యూనియన్ గురించీ, స్టాలిన్ గురించీ మాట్లాడడం దేనికి? గతం తవ్వుకోవడం వలన ప్రయోజనం ఏముంది? వర్తమానం గురించి ఆలోచిద్దాం, అంటున్నారు కొంతమంది కామ్రేడ్స్.

స్టాలిన్ మీద దాడి కేవలం స్టాలిన్ మీద వ్యక్తిగత దాడి కాదు, మొత్తం కమ్యూనిష్టు ఉద్యమం నడచిన దారి మీద దాడి. సోవియట్ యూనియన్ లో కార్మిక వర్గ నియంతృత్వ ప్రభుత్వ స్థాపనా, నిర్వహణా స్టాలిన్ పేరుతో ముడిపడి ఉన్నాయి. స్టాలిన్ ను ఒక రాక్షసుడిగా, హంతకుడిగా చిత్రించడం ద్వారా, పెట్టుబడిదారులూ, రివిజనిష్టులూ, స్టాలిన్ నిర్మించిన సోషలిష్టు వ్యవస్థను అపఖ్యాతి పాలు చేసి, ప్రధమ సోషలిష్టు రాజ్యాన్నీ, ప్రపంచంలో కోట్లమంది కళ్ళల్లో ఉన్న సోషలిష్టు స్వప్నాన్నీ నాశనం చేశారు. పెట్టుబడిదారీ సమాజాన్ని కూలద్రోయడానికి పోరాడుతున్న శ్రేణులలో నిరాశా వాతావరణం సృష్టించారు. తాము తెలిసో తెలియకో ఒక తప్పుడు ఆదర్శం కోసం తమ జీవితాలను నాశనం చేసుకున్నామనే భావన కమ్యూనిష్టులలో కల్గించారు.

విప్లవ సంప్రదాయాలను తుడిచివేసి, విప్లవాన్ని ఒక పిచ్చి చేష్టగా చిత్రించి, విప్లవ యుగం నాటి పోరాట రూపాలనూ, సంస్థా రూపాలనూ, భావ జాలాన్నీ, నినాదాలను ప్రజలు మరచిపోయేలా చెయ్యడానికి అభివృద్ధి నిరోధకులు ప్రయత్నిస్తారు అన్నాడు లెనిన్. ఈనాడు ప్రచార సాధనాల మీద తనకున్న పట్టుతో, కేపిటలిజం ఈ ప్రయత్నాలలో దాదాపు విజయం సాధించింది. ఫలితంగా నేటి ప్రపంచంలో ప్రజలకు సోషలిజం పట్లా, సోవియట్ యూనియన్ సాధించిన సోషలిస్టు విజయాల పట్లా సరియైన అవగాహన లేకుండా పోయింది. సోషలిస్టు చరిత్ర అంతా రక్తసిక్త చరిత్ర అనే పెట్టుబడిదారీ, రివిజనిస్టు ప్రచారాన్ని నమ్మి, సోషలిజం భవిష్యత్తులో విశ్వాసం కోల్పోయారు. ఈ పరిస్థితిలో సోషలిస్టు విజయాలను, విఫలమైన సోషలిస్టు ప్రయోగాన్ని పరిచయం చేసి, వైఫల్యాలకు కారణాలు వివరించి, సోషలిజం మాత్రమే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలదని ప్రజలకు ఓపిగ్గా నచ్చచెప్పి, సోషలిజం పట్ల విశ్వాసం కలిగించడం నేటి మార్క్సిస్టుల కర్తవ్యం. సోవియట్ కమ్యూనిస్టు చరిత్ర నుండీ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రనుండీ, రధసారధి ఆయిన స్టాలిన్ పాత్రను తుడిచివేసే, లేదా అతన్ని ఒక రాక్షసుడిగా చిత్రించే బూర్జువా, రివిజనిస్టు ప్రచారాన్ని ఎదుర్కోకుండా ప్రజలలో ఈ విశ్వాసం కల్పించడం సాధ్యం కాదు.

స్టాలిన్ సొసైటి, ఇండియా, ఈ దిశగా కృషి చేస్తోంది. స్టాలిన్ ను తాననుకున్నది ఏదైనా సాధించగల ఒక సుపర్ మేన్ గా చిత్రించడం, లేదా ఒక మూర్ఖుడిగా చిత్రించడం - రెండు ధోరణులూ సరియైనవి కావు. స్టాలిన్ యుగంలో వాస్తవంగా ఏం జరిగింది? ఆ చరిత్రలో స్టాలిన్ వాస్తవ పాత్ర ఏమిటి? అన్నది నేడు వెలువడుతున్న చారిత్రక పత్రాల ఆధారంగా వివరించడానికి మేం ప్రయత్నిస్తున్నాం.

స్టాలిన్ గురించి అంతగా తెలియని యువతరానికి అతని గురించి ముందు రెండు మాటలు చెప్పాలి.
ʹరైతుకు పట్టంగట్టిన
రష్యా భాగ్య విధాత అతడు
కూలీకి కిరీటం పెట్టిన
స్టాలిన్ మహానేత అతడుʹ

కరుణ శ్రీ.

1917 అక్టోబరు విప్లవం తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిసారి సోవియట్ యూనియన్ లో కార్మిక వర్గ రాజ్యం ఏర్పడింది. అసాధారణ ప్రజ్ఞావంతుడైన లెనిన్ నాయకత్వంలో ఈ శిశువు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని జీవించగలిగింది. 1924లో లెనిన్ మరణించిన తర్వాత ఈ శిశువును కంటికి రెప్పలాగా కాపాడి, పెంచి, పోషించాల్సిన బాధ్యతా, దానితో పాటు ప్రపంచ కమ్యూనిష్టు ఉద్యమ బాధ్యతా, స్టాలిన్ భుజస్కంధాల మీద పడ్డాయి. 1953లో అతని మరణం వరకూ, మూడు దశాబ్దాల పాటు స్టాలిన్ విజయ వంతంగా ఈ బాధ్యతను నిర్వహించాడు. ఈ ప్రయత్నంలో అతను నిబద్ధతతో కార్మిక వర్గం తరఫున పని చేసి ట్రాట్స్కీ లాంటి కార్మిక వర్గ ద్రోహుల ద్వేషానికి గురయ్యాడు, పెట్టుబడిదారీ ప్రపంచ ద్వేషానికి గురయ్యాడు. అనునిత్యం కార్మిక వర్గ మూలుగులను పీలిస్తే కాని బతకలేని పెట్టుబడి స్టాలిన్ ను రాక్షసుడిగా చిత్రిస్తూ విపరీతంగా ప్రచారం చేసింది. ఈ ప్రచారానికి ట్రాట్స్కీయిష్టు, రివిజనిష్టు ద్రోహులు తోడయ్యారు.

కలం, కాగితం తప్ప నీతీ నిజాయితీ లేని అనేకమంది ʹమేధావులుʹ, ʹపరిశోధకులుʹ, స్టాలిన్ మీద అనేక ఆరోపణలు చేస్తూ వేల పుస్తకాలు రాశారు. స్టాలిన్ యుగంలో సోవియట్ యూనియన్ లో ఉన్నది బ్యూరోక్రాటిక్ రాజ్యమే కాని సోషలిజం కాదు; స్టాలిన్ యుగంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయింది; అతను జార్ చక్రవర్తి కంటే ఘోరమైన నేరాలు చేశాడు; కోట్లమంది నిరపరాధులను హత్య చేసి, మరిన్ని కోట్లమందిని జెయిలుపాలు చేసిన నిరంకుశుడు, హంతకుడు, మూర్ఖుడు - ఇదీ పెట్టుబడిదారీ ప్రపంచం, ట్రాట్స్కీయిష్టులూ, రివిజనిష్టులూ, తమ ʹపరిశోధనలలోʹ, వేల పుస్తకాలలో, టీవీలో, సినిమాల్లో, ఇంటర్నెట్లో ఇరవై నాలుగు గంటలూ మన ముందుంచే స్టాలిన్ రూపం. ప్రపంచ కార్మిక వర్గ మహానాయకుడిని మతి స్థిమితం లేని పిచ్చివాడుగా, హంతక మనస్తత్వంగల సేడిష్టుగా, తనకు ఎదురుచెప్పిన వాడినల్లా నాశనం చేసిన నియంతగా, మూర్ఖుడిగా చిత్రించారు. కళ్ళు తప్ప మెదడు లేని పాఠకులు ఇటువంటి రాతలను నమ్మవచ్చు.

బి.బి.సి. 2015 మేలో ఒక వార్త ప్రచురించింది. కజకస్తాన్ (మాజీ సోవియట్ యూనియన్ లో కజకస్తాన్ ఒక రిపబ్లిక్ గా ఉండేది)లో, ఒక మారు మూల గ్రామంలో, అనేక దశాబ్దాలుగా సోవియట్, కజక్ అధికారులు, ఆ గ్రామంలో ఉన్న స్టాలిన్ విగ్రహాన్ని తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలను గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించి ఆ విగ్రహాన్ని కాపాడుకుంటున్నారని తెలియజేసింది. 1956లో కృశ్చేవ్ రహస్య నివేదిక వెలువడిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించడానికి మొట్టమొదటి సారి అధికారులు ప్రయత్నించినప్పుడు, యుద్ధంలో పాల్గొన్న సైనికులు, ʹదేశం కోసం, స్టాలిన్ కోసం, అన్న నినాదంతో, నాజీలతో మేం యుద్ధం చేశాం. స్టాలిన్ విగ్రహాన్ని మేం కూలగొట్టనివ్వంʹ, అంటూ అడ్డుపడ్డారు. ఇటీవల ఒక తుఫానులో ఈ విగ్రహం దెబ్బతిన్నప్పుడు గ్రామస్తులు చందాలు వేసుకుని విగ్రహాన్ని బాగు చేశారు - ఇదీ బి.బి.సి. వార్త.


ఇది స్టాలిన్ మరో రూపం. ప్రజల గుండెల్లో ఉన్న రూపం.

స్టాలిన్ విషయంలో ఇలా పరస్పర విరుద్ధమైన రెండు రూపాలు ఎందుకున్నాయి? కొంతమంది స్టాలిన్ ను రాక్షసుడిలా ఎందుకు చిత్రిస్తున్నారు? కొంతమంది దేముడిలా ఎందుకు ఆరాధిస్తున్నారు?

ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ ప్రపంచం ఒకటి కాదు - ఈ ప్రపంచంలో పరస్పరం సంఘర్షించే రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి పెట్టుబడిదారుల, భూస్వాముల, పీడక వర్గాల ప్రపంచం; రెండోది కార్మికుల, కర్షకుల, పీడిత వర్గాల ప్రపంచం.

ఏ చారిత్రక వ్యక్తినైనా ప్రతీ వర్గం తన ప్రయోజనాల దృష్ట్యా అంచనా వేస్తుంది కాని నిష్పక్షపాతమైన, వస్తుగతమైన, తటస్థమైన అంచనాలు ఏవీ ఉండవు. ఉదాహరణకు, బ్రిటిషు వారి దృష్టిలో భగత్సింగ్ ఒక రాజద్రోహి, హంతకుడు. భారతీయుల దృష్టిలో ఒక విప్లవకారుడు, దేశభక్తుడు. అల్లూరి సీతారామ రాజు, బ్రిటిష్ వారి దృష్టిలో ఒక బందిపోటు; మన దృష్టిలో ఒక స్వాతంత్ర్య యోధుడు. నోబుల్ శాంతి బహుమతి గ్రహీత గోర్బచేవ్, పెట్టుబడిదారుల దృష్టిలో నిరంకుశ సోవియట్ యూనియన్ లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన మహా వ్యక్తి, శాంతి దూత; శ్రామిక వర్గం దృష్టిలో సోవియట్ యూనియన్ ను ముక్కచెక్కలు చేసి సోవియట్ ప్రజలను ఒక అగాధంలోకి నెట్టిన ద్రోహి. స్టాలిన్ విషయంలో కూడా అంతే. పెట్టుబడిదారుల, శ్రామిక వర్గ ద్రోహుల దృక్కోణం నుంచి చూస్తే అతను రాక్షసుడు, నిరంకుశుడు, హంతకుడు. కార్మిక వర్గం దృక్కోణం నుంచి చూస్తే అతను గొప్ప విప్లవకారుడు, పెట్టుబడిదారీ ప్రపంచానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మిక వర్గం తరఫున పోరాడిన మహా యోధుడు.

ఏ వర్గ ప్రయోజనం లేకుండా ʹనేను చాలా నిష్పక్షపాతంగా స్టాలిన్ గురించి చెబుతున్నానుʹ అనే పెద్దమనిషి, ఆత్మవంచన చేసుకుంటున్నాడు లేదా మనల్ని వంచిస్తున్నాడు.

స్టాలిన్ రెండో కొడుకు స్కూలులో ʹనేను స్టాలిన్ʹ ను అని చెప్పేవాడుట. ఆ సంగతి స్టాలిన్ కు తెలిసి, ఆ కుర్రాడిని మందలిస్తూ, ʹనువ్వు స్టాలిన్ వి కావు, నేనూ స్టాలిన్ ను కాను, అదిగో...ʹ - అక్కడ ఉన్న పోస్టరు మీద స్టాలిన్ చిత్రాన్ని చూపిస్తూ అన్నాడు - ʹఅతనూ స్టాలిన్....ʹ - అన్నాడుట. ఆ ʹమరో స్టాలిన్ʹ కేవలం ఒక వ్యక్తి కాదు. ఆ ʹస్టాలిన్ʹ పేరు సోవియట్ యూనియన్ లో సోషలిస్టు నిర్మాణానికి, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక సంకేత మైంది. ఆ కారణంగానే స్టాలిన్ మీద దాడి అంటే కేవలం స్టాలిన్ అనే వ్యక్తి మీద దాడి కాదు, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాల మీద దాడి. ఈ దాడిని ఎదుర్కోవడమంటే కేవలం స్టాలిన్ అనే వ్యక్తిని మూర్ఖంగా సమర్థించడం కాదు, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం మీదా జరుగుతున్న దాడిని ఎదుర్కోవడం అవుతుంది.

స్టాలిన్ యుగ విజయాలూ, అపజయాలూ; తప్పులూ, ఒప్పులూ; అతని నాయకత్వాన సోవియట్ కమ్యూనిష్టు పార్టీ, సోవియట్ ప్రభుత్వ విజయాలూ, అపజయాలూ లేదా తప్పులూ, ఒప్పులుగా తీసుకోవాలి. తప్పులైనా, ఒప్పులైనా పార్టీ సమష్టి నిర్ణయాల ఫలితమే కాని స్టాలిన్ కు వ్యక్తిగతంగా ఆపాదించకూడదు. ఆ కారణంగా ʹస్టాలిన్, సోవియట్ యూనియన్ లో సోషలిజం నిర్మించాడుʹ, ʹస్టాలిన్, నాజీ జర్మనీని ఓడించాడుʹ అని వాడుకలో మనం అంటున్నప్పుడు, ఈ విజయాలను స్టాలిన్ వ్యక్తిగత విజయాలుగా కాక పార్టీ విజయాలుగానే అర్థం చేసుకోవాల

చరిత్రలో మహా నాయకుల (హీరో) పాత్ర గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉండడం అవసరం. ఒక మహా నాయకుడు, తన అసాధారణ ప్రజ్ఞా పాటవాలతో చరిత్ర గమనాన్ని త్వరితం చెయ్యగలడు లేదా కొంతకాలం అడ్డగించగలడు, లేదా అల్ప సంఘటనల మీద తన వ్యక్తిగత ప్రభావం చూపించగలడు. కాని చరిత్రలో, మానవ సమాజాన్ని ఒక మలుపు తిప్పే మహత్తర సంఘటనలు, కేవలం మహా నాయకుల భావాలు, చర్యల కారణంగా సంభవించవు. ఒక నిర్దిష్ట సమాజ జీవిత భౌతిక పరిస్థితులూ, ఆ సమాజం జీవించడానికి అవసరమయ్యే భౌతిక సంపద ఉత్పత్తి చేసే విధానంలో మార్పులూ, ఈ భౌతిక సంపద సృష్టించే క్రమంలో వర్గాల మధ్య పరస్పర సంబంధాలలో మార్పులూ; భౌతిక సంపద సృష్టించడంలోనూ, పంపకంలోనూ తమ తమ స్థానాల కోసం వర్గాల మధ్య జరిగే సంఘర్షణలూ - ఇవీ దీర్ఘకాలికంగా చూస్తే సమాజ గమనాన్ని నిర్ణయించే అంశాలు. మహా నాయకులు, సమాజ ఆర్థిక పురోగమనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తమని తాము చరిత్ర నిర్మాతలమని విర్ర వీగి, ఆ సమాజ చారిత్రక అవసరాలకు అడ్డుగా మారితే, అత్యంత పురోగామి అయిన వర్గ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆ నాయకులు విఫలమవుతారు; నవ్వులపాలవుతారు. అదే విధంగా, ఒక నాయకుడి భావాలు సమాజ ఆర్థిక పురోగమనాన్ని వేగవంతం చేసేవయితే, అత్యంత పురోగామి అయిన వర్గ అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లయితే, సమాజం అతని భావాలను స్వీకరించి అతన్ని మహా నాయకుడిని చేస్తుంది. మహానాయకులు చరిత్రను సృష్టించరు; చరిత్రే మహానాయకులను సృష్టిస్తుంది. మహానాయకులు తమను అనుసరించే ప్రజలను సృష్టించరు; ప్రజలే తమకు నాయకుడిగా ఉండగల మహా నాయకుడిని సృష్టిస్తారు.

అయితే చరిత్రలో, మార్క్స్, లెనిన్, స్టాలిన్ లాంటి మహానాయకుల పాత్ర ఏమీ ఉండదా? పూర్తిగా శూన్యంగా భావించాలా? మహానాయకుల పాత్రను మార్క్సిజం పూర్తిగా విస్మరించదు. ʹ…చరిత్రలో ఏ వర్గం కూడా తనకు ప్రాతినిధ్యం వహించి, సంఘటితపరచి, పోరాటాలకు నాయకత్వం వహించగల వ్యక్తులు లేకుండా అధికారం చేపట్టలేదు..ʹ అన్నాడు లెనిన్. వస్తుగత పరిమితుల లోపల, మహానాయకులు, మహత్తర బాధ్యతలు నిర్వహిస్తారు. మహానాయకులే చరిత్రను సృష్టిస్తారనడం కాని, మహానాయకుల పాత్రను పూర్తిగా నిరాకరించడం, విస్మరించడం, చులకన చెయ్యడం కాని మార్క్సిజం కాదు. అనుభవం గల, బలమైన, స్థిరమైన, ప్రజలవిశ్వాసం పొందిన నాయకత్వం లేకుండా ఉద్యమాలు నిర్మించడం సాధ్యం కాదు. మార్క్సిష్టులుగా మేము, చరిత్రలో స్టాలిన్ మహత్తర పాత్రను ఈ విధంగా అర్థం చేసుకుంటున్నాం.

స్టాలిన్ మీద దాడిలో ప్రధాన అంశం ʹవ్యక్తి పూజʹ అయింది. స్టాలిన్ మొదటినుంచీ ఈ వ్యక్తిపూజను వ్యతిరేకించేవాడనడానికి అనేక ఆధారాలున్నాయి. ఈ వ్యక్తి పూజలో ప్రముఖ పాత్ర వహించిన వారు, తర్వాత స్టాలిన్ కు వ్యతిరేకంగా మారిన రాడెక్, మికోయాన్, కృశ్చేవ్ లాంటి ద్రోహులే. ఈ ద్రోహులు వంచనా పూరితంగా వ్యక్తి పూజ చేస్తుంటే, సామాన్య ప్రజలు స్టాలిన్ ను ఒక మహా నాయకుడిగా మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఒక మేధావి చెప్పినట్లు, ʹవ్యక్తి పూజ ఉంది, నిజమే! కాని ఒక మహా వ్యక్తి కూడా ఉన్నాడుʹ

స్టాలిన్ మీద ఆరోపణలలో మరొకటి అతను ఎవ్వరి సలహా తీసుకోకుండా, నిరంకుశంగా తనే నిర్ణయాలు తీసుకునే వాడనే ఆరోపణ. స్టాలిన్, అనేక సందర్భాలలో తను పార్టీ మనిషిననీ, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తాననీ చెప్పాడు. ఏ విషయాన్నయినా పాలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీలు సమగ్రంగా చర్చించి నిర్ణయించిన తర్వాత మాత్రమే, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ తరఫున స్టాలిన్ పార్టీ అభిప్రాయాన్ని ప్రపంచానికి వెల్లడించేవాడు. ఆ కారణంగా అతన్ని ʹపార్టీ గొంతుʹ అనేవారు (Voice of the Party). పార్టీకి అతీతంగా స్టాలిన్ వెల్లడించిన స్వంత అభిప్రాయాలు కాని, తీసుకున్న చర్యలు కాని ఏమీ లేవు. ఉదాహరణకు, సమష్టి వ్యవసాయ విప్లవంలో అక్రమాలు జరుగుతున్నప్పుడు, స్టాలిన్ ʹవిజయాలతో మత్తెక్కి (Dizzy with success)ʹ అనే లేఖ రాశాడు. ఈ లేఖలో స్టాలిన్ పార్టీ తప్పులను చాలా తీవ్రంగా విమర్శించాడు. ఈ లేఖను రైతాంగం చాలా అభిమానంగా ఆదరించింది. పార్టీ కార్యకర్తలను ఎండగడుతూ స్టాలిన్ స్వయంగా ఈ లేఖ రాశాడు అని ఒక ప్రచారం జరిగినప్పుడు స్టాలిన్, అది అర్థం లేని మాట అనీ, వ్యవసాయ విప్లవంలో జరుగుతున్న తీరు గురించి పార్టీ విమర్శను తాను పార్టీ జనరల్ సెక్రటరీగా వెల్లడించాననీ తెలిపాడు.
స్టాలిన్ మీద చేసిన ప్రతీ ఆరోపణకూ ఇక్కడ సమాధానాలివ్వడం సాధ్యం కాదు. మా ప్రచురణలలో ఆ ఆరోపణలలో కొన్నింటికి సమాధానాలు చూడవచ్చు.

స్టాలిన్ యుగంలో, సోవియట్ యూనియన్ లోనూ, ప్రపంచంలోనూ సోషలిజం సాధించిన విజయాలేమిటి?


1. లెనిన్, సోవియట్ యూనియన్ ను స్థాపించి సోషలిష్టు విత్తనాన్ని నాటినా, ఈ లేత మొలకను, తుఫానులనుంచి, వడగాలుల నుంచి జాగ్రత్తగా కాపాడి పెంచాల్సిన బాధ్యత పూర్తిగా స్టాలిన్ మీదే పడింది. స్టాలిన్ విజయవంతంగా ఈ కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఈ మార్గంలో అతను అతివాదులతో, మితవాదులతో, ట్రాట్స్కీయిష్టులతో, బుఖారినిష్టులతో, సైద్ధాంతిక పోరాటాలు సాగించి పార్టీని మార్క్సిష్టు-లెనినిష్టు మార్గం తప్పకుండా సవ్యమైన మార్గంలో నడిపించాడు.

2. సమాజ అధీనంలో ఉత్పత్తి శక్తులు అద్భుతంగా అభివృద్ధి చెందగలవనే మార్క్సిష్టు సూత్రీకరణ, స్టాలిన్ కు ముందు, కేవలం కాగితం మీద ఉన్న ఒక సూత్రీకరణగా మాత్రమే ఉండేది. స్టాలిన్ ఆచరణలో ఈ సూత్రీకరణను రుజువు చేశాడు. సోషలిష్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి పంచవర్ష ప్రణాళికలను అమలు చేసి, సోవియట్ యూనియన్ ను అతి వేగంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాడు. సోవియట్ యూనియన్ వెనుకబాటుతనాన్ని నిర్మూలించాడు.

3. మార్క్సిజం-లెనినిజంలో, కార్మిక వర్గ నియంతృత్వం అన్నది ఒక ప్రాణప్రదమైన సూత్రీకరణ. స్టాలిన్ ఈ సూత్రీకరణకు కట్టుబడి, కార్మిక వర్గ నియంతృత్వాన్ని అమలు జరిపి, కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఇంటా బయటా ఉన్న శత్రువుల పన్నాగాలనుంచి రక్షించాడు. (అతని తర్వాత అధికారంలోకి వచ్చిన రివిజనిష్టులు, కార్మిక వర్గ ప్రభుత్వానికి ఆయువు పట్టు అయిన ఈ సూత్రీకరణ మీద దాడి చేసి, కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్టాలిన్ వ్యక్తిగత నియంతృత్వంగా అపఖ్యాతి పాలు చేసి, పెట్టుబడిదారీ వ్యవస్థ పునరుద్ధరణకు సైద్ధాంతిక పునాదులు వేశారు)

4. సామ్రాజ్యవాదం ఉన్నంత వరకూ యుద్ధం అనివార్యం అన్న స్పృహతో, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు సోవియట్ యూనియన్ ను ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా, మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేశాడు. పార్టీలోనూ, సైన్యంలోనూ, దేశంలోనూ ఉన్న శత్రు పంచమాంగ దళాన్ని సంపూర్ణంగా నాశనం చేసి, ఓటమి ధోరణిని నిర్మూలించి, సోవియట్ యూనియన్ ధైర్యసాహసాలతో ఐక్యంగా పోరాడేలా చేశాడు.

5. యుద్ధానికి ముందు సామ్రాజ్యవాద దేశాలతో దౌత్య వ్యవహారాలను నైపుణ్యంతో నిర్వహిస్తూ, సోవియట్ యూనియన్ ఒంటరిగా సామ్రాజ్యవాద దేశాలన్నింటితోనూ పోరాడే పరిస్థితి నుంచి తప్పించాడు. సోవియట్ యూనియన్ ను నాశనం చెయ్యడం తన లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడిదారీ ప్రపంచం ఐక్యంగా ఆ దేశం మీద దాడి చెయ్యలేక పోయింది. ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, బ్రిటన్ లు, సోవియట్ యూనియన్ తో చేతులు కలిపి, జర్మనీతో పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే జపాన్ తో నిరాక్రమణ సంధి కుదుర్చుకోవడం ద్వారా, రెండు ఫాసిష్టు రాజ్యాలతో - జర్మనీతో పశ్చిమాన, జపాన్ తో తూర్పున - ఒకేసారి యుద్ధం చెయ్యవలసిన పరిస్థితిని నుంచి సోవియట్ యూనియన్ ను కాపాడాడు.

6. స్టాలిన్, నిజమైన అంతర్జాతీయ వాది. అతను కేవలం రష్యాలో కార్మిక వర్గ ప్రభుత్వాన్ని స్థాపించి దానిని బలపరచడమే తన లక్ష్యంగా భావించలేదు. సోవియట్ యూనియన్ ప్రపంచ కార్మిక వర్గ విప్లవం యొక్క ప్రధమ స్థావరమనీ, ఈ స్థావరాన్ని ఆధారంగా చేసుకుని కార్మిక వర్గ విప్లవం ప్రపంచమంతా వ్యాపించాలనీ భావించి, ఆ దిశగా కృషి చేశాడు. కమ్యూనిష్టు ఇంటర్నేషనల్ ద్వారా ఇతర దేశాలలో కార్మిక వర్గ పార్టీలు ఏర్పడడానికి కారకుడయ్యాడు. అతని కాలంలో కమ్యూనిష్టు ఉద్యమం ప్రపంచమంతా వ్యాపించింది. ఈ లక్ష్యంతో పని చేస్తున్నప్పుడు, పెట్టుబడిదారీ ప్రపంచ తీవ్ర ద్వేషానికి గురయినా, యుద్ధ ప్రమాదం ఎదురైనా అతను వెనుకంజ వెయ్యలేదు. సామ్రాజ్యవాదంతో రాజీ పడలేదు.

7. వివిధ దేశాలలోని కమ్యూనిష్టు పార్టీలకు సహాయ సహకారాలు అందచేస్తూ, హిట్లర్ జర్మనీ ఆక్రమణ క్రింద ఉన్న దేశాలను విముక్తి చేశాడు. యుద్ధానంతరం,ఈ దేశాలలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలను స్థాపించాలని చూస్తున్న సామ్రాజ్యవాదుల కుట్రలను భగ్నం చేసి ఆయా పార్టీల నాయకత్వాన సోషలిష్టు శిబిరం ఏర్పడడానికి కారకుడయ్యాడు.

8. యుద్ధానంతరం, యుద్ధంలో సర్వ నాశనమైన దేశాన్ని అతి వేగంగా పునర్నిర్మించి, ఏడెనిమిది సంవత్సరాలలోనే అగ్ర రాజ్యమైన అమెరికా తర్వాత రెండో స్థానంలోకి చేరేలా చేశాడు. అతని మరణం నాటికి సోవియట్ యూనియన్ అమెరికాను కూడా మించి పోయేట్లు కనుపించింది.

9. స్టాలిన్, సామ్రాజ్యవాద అణచి వేతకు గురవుతున్న దేశాలలోని విముక్తి ఉద్యమాలకు సహాయ సహకారాలు అందించాడు. 1946-1949 కాలంలో, ప్రపంచ జనాభాలో మూడో వంతు ఉన్న బర్మా, ఇండోనేషియా, ఇండియా, పాకిస్తాన్, లావోస్, లిబియా, సిలోన్, జోర్డాన్, ఫిలిప్పైన్స్ లు సామ్రాజ్యవాద శిబిరం నుంచి వెలుపలకు వచ్చాయి. ఆఫ్రికా ఖండం నిద్దరనుంచి లేచి, ఒళ్ళు విరుచుకుంటోంది. అతను మరణించే నాటికి సామ్రాజ్యవాదం చాలా బలహీనపడింది.

10. రెండో ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిష్టు ఉద్యమంలో తలెత్తిన టిటోయిజం లాంటి అనేక పెడధోరణులతో అతను తీవ్ర సైద్ధాంతిక పోరాటం చేసి, మార్క్సిజం పతాకాన్ని సమున్నతంగా నిలబెట్టాడు.

స్టాలిన్ ఒక మహానాయకుడనీ, గొప్ప మార్క్సిష్టు-లెనినిష్టు అనీ మేం చెప్పడానికి కొన్ని కారణాలు ఇవి. ఈ మాటలు మేం దురభిమానంతో, గుడ్డి ఆరాధనతో చెబుతున్న మాటలు కావు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో స్టాలిన్ పాత్రను జాగ్రత్తగా అంచనా వేసి చెబుతున్న మాటలు ఇవి.

సోవియట్ యూనియన్, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలను మేం రెండు దశలుగా చూస్తున్నాం. మొదటి దశ 1917 అక్టోబరు విప్లవంతో ప్రారంభమై 1953లో స్టాలిన్ మరణంతో ముగిసింది. ఈ దశలో సోవియట్ యూనియన్, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమమూ మహత్తర విజయాలు సాధించాయి. అక్టోబరు విప్లవ స్ఫూర్తితో ప్రపంచమంతటా జాతి విముక్తి ఉద్యమాలు చెలరేగాయి. అనేక దేశాలు సామ్రాజ్యవాద పిడికిలినుంచి బయటపడి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. ఫాసిస్టు జర్మనీ, జపాన్ లు రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాయి, చైనా తో సహా అనేక దేశాలు సోషలిస్టు శిబిరంలో చేరాయి.

రెండో దశ క్షీణ దశ. ఈ దశ స్టాలిన్ మరణంతో ప్రారంభమైంది. సోషలిస్టు శిబిరంలో రివిజనిస్టులది క్రమంగా పై చేయి అయింది. చైనాతో సహా అన్ని దేశాలలోనూ పెట్టుబడిదారీ పునరుద్ధరణ జరిగింది. సోవియట్ యూనియన్ కూలిపోయింది. చివరి శ్వాస పీలుస్తోందన్న సామ్రాజ్యవాదానికి కొత్త ఊపిరి అందింది. ఇదెల్లా జరిగిందనేది ప్రపంచ వ్యాపితంగా మార్క్సిస్టు మేధావులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికో అప్పటికి ఒక స్పష్టత వస్తుంది.

ఈ లోగా ఒక విషయాన్ని స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉంది. స్టాలిన్ మరణం తర్వాత అంత వేగంగా సోషలిస్టు వ్యవస్థ పతనమైందని మనం అంటుంటే, కేవలం స్టాలిన్ వలనే సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందనీ, అతని తర్వాత అది కూలిపోయిందనీ చెబుతున్నట్లు అర్థం తీసి, ఒక వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందని చెప్పడం మార్క్సిజానికి విరుద్ధమనీ కొందరు చెబుతున్నారు.

గతి తర్కంలో ఆవశ్యకత, యాదృచ్ఛిక సంఘటన అనే భావనలున్నాయి. ఆవశ్యకత అంటే మార్పుకు అవసరమైన పరిస్థితులు ఏర్పడడమన్నమాట. ఈ అవసరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు చరిత్ర ఒక యాదృచ్ఛిక సంఘటన ద్వారా దారి చూసుకుంటుంది. స్టాలిన్ మరణం అనేది ఒక యాదృచ్ఛిక సంఘటన. ఈ సంఘటనకు ముందే మార్పుకు అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాని అవి ఇంకా వెలుగులోకి రాలేదు. స్టాలిన్ మరణం అనే యాదృచ్ఛిక సంఘటన ద్వారా చరిత్ర కొత్త దారి వెతుక్కుంది. తిరోగమనం ప్రారంభమై సోషలిస్టు శిబిర అంతానికి దారి తీసింది.

దీనితో అంతా ముగిసినట్లేనా?

సోషలిజం అనేది మనం కలగనే ఒక సుందర స్వప్నం కాదు; ఉత్పత్తి శక్తుల పురోగమనంలో మానవ సమాజం అనివార్యంగా చేరుకునే ఒక దశ; ఒక చారిత్రక ఆవశ్యకత. ప్రతీఘాత విప్లవాలూ, ద్రోహాలూ, పెట్టుబడిదారీ వ్యవస్థ జీవితాన్ని పొడిగిస్తాయే కాని దాని మరణాన్ని ఆపలేవు.

కార్మిక వర్గ విప్లవాల యుగం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కార్మిక వర్గ విప్లవం అంటే సూటిగా ఒక విజయం తర్వాత మరో విజయం సాధించి, ఒక మెట్టు తర్వాత మరో మెట్టు క్రమం తప్పకుండా ఎక్కుతూ, శిఖరం చేరుకోవడం కాదు. ఈ శిఖరానికి దారి జిగ్ జాగ్ గా ఉంటుంది. ఈ మార్గంలో అవరోధాలుంటాయి, అపజయాలుంటాయి, తిరోగమనాలుంటాయి. నూతన సామాజిక వ్యవస్థ పాత వ్యవస్థను కూలద్రోయడం ఒక రోజులో సంభవించదనీ, ఈ సంఘర్షణ, ఒక చారిత్రక యుగమంతా నడుస్తుందనీ చరిత్ర మనకు చెబుతుంది. అనేక దేశాలలో ఫ్యూడలిజాన్ని కూలద్రోసిన బూర్జువా విప్లవాలు కూడా ప్రతీఘాత విప్లవానికి గురయిన సంగతి మనం చరిత్రలో గమనిస్తాం.

సోషలిజాన్ని కూలద్రోసిన ప్రతీఘాత విప్లవంలో రివిజనిష్టులు, తొలుతగా ʹస్టాలినిజం నుంచి విముక్తి, లెనినిష్టు మార్గానికి తిరిగి ప్రయాణంʹ అన్న నినాదంతో మార్క్సిజానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. స్టాలిన్, లెనినిజాన్ని వక్రీకరించి అనేక ఆక్రమాలకు పాల్పడ్డాడని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఆ నాడు చాలామంది కమ్యూనిష్టులు నమ్మారు. లెనిన్ ను వదలిపెట్టి స్టాలిన్ మీదే ప్రప్రధమంగా దాడి కేంద్రీకరించడం ఒక ఎత్తుగడ మాత్రమే.

తర్వాతి దశలో, లెనిన్ మార్క్సిజాన్ని వక్రీకరించాడని చెప్పి, శాస్త్రీయ సోషలిజం నిర్మాతలైన మార్క్స్-ఏంగెల్స్ ల సిద్ధాంతాలు మనకు ఆదర్శం కావాలన్నారు. ఈ తిరోగమనాన్ని సిసలైన మార్క్సిజం వైపు పురోగమనంగా చిత్రించాయి ఈ విద్రోహ శక్తులు. ఇటువంటి నినాదాలతో సోషలిష్టు శిబిరాన్ని కూలద్రోసిన విద్రోహ శక్తులు మాజీ సోషలిష్టు దేశాలలో మఫియా కేపిటలిజాన్ని పునరుద్ధరించాయి. స్టాలిన్ భౌతిక కాయాన్ని మసోలియం నుంచి బయటకు ఈడ్చి తగుల బెట్టిన శక్తులు, ఇప్పుడు లెనిన్ భౌతిక కాయాన్ని మసోలియం నుంచి బయటకు ఈడ్చి పడేయ్యాలని డిమాండు చేస్తున్నాయి.

స్టాలిన్ మీద వ్యక్తిగతంగా ప్రారంభమైన దాడి చారిత్రక పరిణామం ఇది. ఈ దాడి అంతిమంగా సోషలిష్టు శిబిరం కూలిపోవడానికి దారి తీసింది.

నేడు అసలు సోషలిజమే హృదయం లేని నిరంకుశ వ్యవస్థ అనీ, ఉత్పత్తి సాధనాలు సమాజపరమైనప్పుడు కార్మికులు ఉత్పత్తిలో ఆసక్తి చూపిస్తారనే సోషలిష్టు సిద్ధాంతం తప్పు అనీ; ఆకలి, నిరుద్యోగం తరుముతుంటే కాని, పెట్టుబడి కొరడా ఝులిపిస్తుంటే కాని, కార్మికులు పని చెయ్యరనీ, ప్రపంచంలో ఎక్కడా సోషలిజం పని చెయ్యలేదనీ, అందుకనే అది కూలిపోయిందనీ, పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదనీ, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

సోషలిష్టు వ్యవస్థ ఒక అసమర్థ వ్యవస్థ అనీ, ʹప్రభుత్వం వేతనాలిచ్చినట్లు నటిస్తుంది, ప్రజలు పని చేస్తున్నట్లు నటిస్తారుʹ అనీ సోషలిజాన్ని అపహాస్యం చేస్తూ జరిగే ప్రచారంలో వాస్తవం ఏమైనా ఉందా? స్టాలిన్ యుగంలో అతి స్వల్ప కాలంలో, మూడు దశాబ్దాలలో, సోవియట్ యూనియన్ లో సోషలిజం సాధించిన విజయాలేమిటో గమనిస్తే ఈ ప్రచారం నూటికి నూరుపాళ్ళూ అసత్యమని స్పష్టమవుతుంది. అక్టోబరు విప్లవం తర్వాత, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మొదలైన 14 దేశాల దురాక్రమణను కమ్యూనిష్టుల నాయకత్వంలో సోవియట్ యూనియన్ తిప్పి కొట్టింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్త్రీలకు సమాన వేతనం, ఓటు హక్కూ, విద్యా హక్కూ ఇచ్చింది. రెండు పంచవర్ష ప్రణాళికలలోనూ, సోవియట్ యూనియన్ లో పారిశ్రామిక రంగం 800 శాతం అభివృద్ధి చెందింది. అల్ప సంఖ్యాక వర్గానికి స్వంత కార్లు ఏర్పాటు చెయ్యడం తన లక్ష్యం చేసుకోకుండా సోవియట్ యూనియన్ చాలా చవుకలో ప్రజా రవాణాను ఏర్పాటు చేసింది. జారిష్టు రష్యాలో 20 శాతం ప్రజలు మాత్రమే అక్షరాస్యులు, 13 శాతం స్త్రీలు మాత్రమే అక్షరాస్యులు. 1937 నాటికి, సోవియట్ యూనియన్ లో నిరక్షరాస్యత దాదాపు నిర్మూలించబడింది. అందరికీ ఉచిత వైద్యం అందుబాటులోకి రావడం వలన జీవన ప్రమాణాలు పెరిగాయి. నిజ వేతనాలు క్రమంగా పెరిగాయి. 1913లో, సగటు జీవన ప్రమాణం 35 సంవత్సరాలుంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లమంది మరణించినా, సగటు జీవన ప్రమాణం 1955 నాటికి 55 సంవత్సరాలైంది. చివరకు 70 సంవత్సరాలకు చేరుకుంది. సోవియట్ యూనియన్ లో కేపిటలిజాన్ని పునరుద్ధరించిన తర్వాత జీవన ప్రమాణం 2011 నాటికి 69కి పడిపోయింది. స్టాలిన్ యుగంలో నిరుద్యోగం అన్నది లేదు. ఐదు సంవత్సరాల భయంకర యుద్ధం తర్వాత, 1947 నాటికే దేశ పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. 1947 సంవత్సర ఉత్పత్తి, యుద్ధానికి ముందు సంవత్సరాల ఉత్పత్తి కంటే రెట్టింపు ఉంది. సోవియట్ యూనియన్ ప్రపంచంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. సోవియట్ కారు పరిశ్రమ ప్రపంచంలో 5వ స్థానంలో ఉండేది. 1957లో సోవియట్ యూనియన్ మొట్టమొదటి స్పుట్నిక్ ను ప్రయోగించి, రోదసీయుగానికి అంకురార్పణ చేసింది. స్టాలిన్ యుగం నిర్మించిన బలమైన పునాదుల కారణంగా, రివిజనిష్టులు ఒక పక్క విధ్వంసం చేస్తున్నా, కొన్ని దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్ నిలిచింది. స్టాలిన్ కాలంలో, సోవియట్ యూనియన్ లో సోషలిష్టు వ్యవస్థ సాధించిన ఘన విజయాలు ఇవి.

ప్రజలు పని చేస్తున్నట్లు నటిస్తుంటే ఈ పురోగమనం సాధ్యమయ్యేదేనా? ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తున్నట్లు నటిస్తుంటే నిజ వేతనాలు పెరిగేవా? అపూర్వ విజయాలను సాధించిన ఈ వ్యవస్థను అసమర్థ వ్యవస్థ అందామా? లేక కోట్లమందిని నిరుద్యోగుల్ని చేసి, విద్య, వైద్యం అన్నీ వ్యాపారాలుగా మార్చి, ప్రజల జీవితాలతో జూదమాడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థని అసమర్థ వ్యవస్థ అందామా? కాసుకు మెదళ్ళు అమ్ముకునే మేధావులకు వాస్తవాలతో నిమిత్తం లేదు.

మార్క్సిజం-లెనినిజాన్ని పునరుద్ధరించాలంటే, కమ్యూనిష్టు ఉద్యమానికి పీడిత ప్రజలలో మళ్ళీ ఒక గౌరవ స్థానం కల్పించాలంటే, సోవియట్ యూనియన్ లో కార్మిక వర్గం సాధించిన సోషలిష్టు విజయాలను పీడిత ప్రజల దృష్టికి తీసుకువచ్చి, వారు తమ చరిత్ర చూసి గర్వించేలా చెయ్యాల్సిన అవసరం ఉంది. గత ఆరు దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మిక వర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కార్మికవర్గ నాయకత్వంలో కమ్యూనిష్టు ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి స్టాలిన్ పునరుద్ధరణ ఒక చారిత్రకావసరం అని మేం భావిస్తున్నాం.

ఎందుకంటే -
ʹనిష్క్రమిస్తే నీవు విక్రమించును రణము
కోలుకుంటే నీవు నిష్క్రమించును భయము...
నీవు జీవిస్తే సమత నిలబడుతుంది
నీవు దీవిస్తే జనత నిలబడుతుంది....ʹ (ఆరుద్ర)

No. of visitors : 920
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNION

K. RAMKOTESH | 05.03.2018 07:24:00pm

In the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ......
...ఇంకా చదవండి

స్టాలినో నీ ఎర్రసైన్యం...

పి.వరలక్ష్మి | 04.03.2018 10:53:05pm

ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది......
...ఇంకా చదవండి

స్టాలిన్ కవితలు

రమేష్ చంద్ర | 05.03.2018 06:54:07pm

విద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్.....
...ఇంకా చదవండి

ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవు

వి. చెంచయ్య | 05.03.2018 12:05:27am

స్టాలిన్‌ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా.....
...ఇంకా చదవండి

స్టాలిన్‌ వ్యతిరేకత?

పాణి | 06.03.2018 11:57:50am

ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్‌ మార్గంపట్ల రాజకీయ ఏ......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత

స్టాలిన్ | 05.03.2018 12:09:45pm

శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా......
...ఇంకా చదవండి

ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు

గ్రోవర్ ఫర్ | 06.03.2018 10:23:19am

1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే......
...ఇంకా చదవండి

ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్

| 05.03.2018 12:14:44am

స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •