ʹమార్క్సిజం - భాషాశాస్త్ర సమస్యలుʹ అనే పేరుతో స్టాలిన్ రాసిన వ్యాసం మొదట 1950 జూన్ 20న ʹప్రావ్దʹ పత్రికలో ప్రచురింపబడింది. అంతకు ముందే అదే పత్రికలో సోవియట్ భాషా శాస్త్ర సమస్యలపై కొంత చర్చ జరిగింది. ఆ చర్చలలో భాగంగానే సోవియట్ విద్యార్థులు వేసిన ప్రశ్నలకూ, ʹప్రావ్దʹ పత్రికలో వెలువడ్డ వ్యాసాలకూ జవాబుగా స్టాలిన్ ఈ వ్యాసం రాశారు. తెలుగులో ఈ వ్యాసాన్ని చిన్న పుస్తకంగా విశాలాంధ్ర ప్రచురణాలయం 1953 జూలైలో ప్రచురించింది. ఆ తర్వాత చాలా కాలానికి 1976లో పెకింగ్లోని విదేశీ భాషల ప్రెస్సు ప్రచురించిన ఇంగ్లీషు మూలం ఆధారంగా పై అనువాదానికి స్వల్ప సవరణలతో 2002 ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా జనసాహితి ప్రచురించిన పుస్తకం ప్రస్తుతం నాచేతిలో ఉన్నది. 2002లో ʹఅరుణతారʹలో సమీక్ష కోసం ఇది నాకందింది. అప్పుడు అరుణతారలో సమీక్షించలేకపోయినందుకు చింతిస్తూ, ఇప్పుడు విరసం అంతర్జాల పత్రికలో సమీక్షించేందుకు అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ ఈ సమీక్ష.
పునాది, ఉపరితలం అనే మాటలు మార్క్సిజంతో స్థూల పరిచయం ఉన్నవాళ్ళకు కూడా తెలుసు. సమాజ అభివృద్ధి క్రమంలో ఆయా ప్రత్యేక దశల్లో ఉండే సామాజిక ఆర్థిక విధానం పునాది అవుతుంది. దాని ఆధారంగా వచ్చిన రాజకీయాలు, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, మతం, సాహిత్యం, కళలు, వాటికి సంబంధించిన భావాలు, సంస్థలు, వ్యవస్థలు వగైరాలు ఉపరితలం అవుతాయి. ఉపరితలాన్ని ఈ అనువాదంలో కట్టడం అన్నారు. అంటే పునాది, దానికనుగుణంగా దానిపై కట్టేది కట్టడం. కట్టడం ఎప్పుడూ పునాదికి తగ్గట్టుగానే ఉంటుంది.
విభిన్న సామాజిక వ్యవస్థల్లో ప్రతి పునాదికి దానికి తగిన కట్టడం ఉంటుంది. భూస్వామ్య వ్యవస్థలో భూస్వామ్య పునాదికి అనుగుణమైన కట్టడం ఉంది. అంటే భూస్వామ్య విధానానికి తగిన రాజకీయాలు, న్యాయ వ్యవస్థ, సాహిత్యం, కళలు, తత్వశాస్త్రం మొదలైనవి ఉంటాయని అర్థం. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ, సోషలిస్టు వ్యవస్థలోనూ ఆయా వ్యవస్థల పునాదులకు తగిన కట్టడాలు ఉన్నాయి. పునాది మారినప్పుడల్లా కట్టడం కూడా మారిపోతుందన్న మాట.
భాష విషయానికి వస్తే, భాషను పునాది మీది కట్టడం అనడం సరైనదేనా అన్నది ప్రశ్న. ముమ్మాటికీ కానే కాదని స్టాలిన్ జవాబు. ʹప్రావ్దʹ పత్రికలో భాష విషయమై చర్చ చేసినవారు భాష కూడా పునాది మీద కట్టడంగా భావించారు. అంటే వాళ్ళ దృష్టిలో సోషలిస్టు పునాది ఏర్పడింతర్వాత దానికి అనుగుణమైన న్యాయవ్యవస్థ, రాజకీయాలు, సాహిత్యం, కళలు ఏర్పడినట్టుగానే భాష కూడా సమూలంగా మారిపోయిందన్న మాట. దీన్ని స్టాలిన్ తన వ్యాసంలో తీవ్రంగా ఖండించాడు. సోవియట్ యూనియన్లో సోషలిస్టు పునాది నిర్మించబడి, దానికనుగుణమైన కొత్త కట్టడం నిర్మించబడిం తర్వాత కూడా రష్యన్ భాష మాత్రం అక్టోబర్ విప్లవానికి పూర్వం ఎలా ఉండేదో, ఇప్పుడూ ప్రధానంగా అలాగే ఉండిపోయిందని అన్నాడు. అయితే రష్యన్ భాషలోని పదజాలంలో కొంత మార్పు వచ్చిందనీ, కొన్ని పదాలకు అర్థం మారిపోయిందనీ, వాడుకలో లేని కొన్ని మాటలు మరుగున పడిపోయాయనీ, కొన్ని కొత్త పదాలు వచ్చి భాషలో కలిశాయనీ అన్నాడు. ఇది భాషలో వచ్చిన స్వల్పమైన మార్పే గాని పెనుమార్పు కాదంటాడు. భాషలో పెను మార్పులు చేసినందువల్ల విప్లవానికి ఒరిగేది కూడా ఏమీ ఉండదని స్టాలిన్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు. వాక్యనిర్మాణంలోనూ, వ్యాకరణ స్వరూపంలోనూ పెను మార్పులు వస్తేనే, భాషలోని మూల పదజాలం మారిపోతేనే భాష సమూలంగా మారినట్టవుతుంది గాని, కొన్ని పదాలు వచ్చినందువల్లా, పోయినందువల్లా, కొన్ని పదాల అర్థాలు మారినందువల్లా భాష సమూలంగా మారినట్టు కాదు.
భాషలో కొన్ని పదాలు రావడం, పోవడం, కొన్ని అర్థాలు మారడం లాంటి మార్పులు నిరంతరం జరిగేవే. దీనికి వ్యవస్థ పునాది మారనక్కర లేదు. మనదేశంలో సోషలిస్టు పునాది ఏర్పడకపోయినా, పదజాలానికి సంబంధించి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ స్వల్పమైన మార్పులు జరగడానికి ఉపరితల అంశాల్లో జరిగే చిన్న చిన్న పరిణామాలు కూడా కారణం కావచ్చు. ప్రస్తుతం మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నాం. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే ఇది బూర్జువా ప్రజాస్వామ్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఈ వ్యవస్థలో కూడా అనేక రంగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. భాష విషయంలో కూడా ఈ మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు ʹసంస్కరణలుʹ అనే మాట ఉంది. మనకు తెలిసిన అర్థం సాంఘిక సంస్కరణలు అని. అంటే సతీసహగమనం, వరకట్నం, మూఢనమ్మకాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా తీసుకొచ్చే మార్పుల్ని సాంఘిక సంస్కరణలు అంటాం. ఈనాటికీ ఈ పదం ఈ అర్థంలో ఉంది. అయితే 1990ల తర్వాత నూతన ఆర్థిక విధానం నేపథ్యంలో ʹఆర్థిక సంస్కరణలుʹ అనే పద ప్రయోగం కొత్తగా వచ్చింది. పనికి రాని దాన్ని మార్చడం సంస్కరణల లక్ష్యం. వ్యవస్థ పునాదితో సంబంధం లేకుండా మన ఆచార వ్యవహారాల్లో, జీవన విధానంలో ప్రజలకుపయోగపడే కొన్ని మార్పులు చేసుకోవడం సంస్కరణలు ఉద్దేశం. ఆర్థిక సంస్కరణలు అనే మాట ఈ అర్థంలో లేదు. ఆర్థిక విధానాల్లో కొన్ని మార్పులు వచ్చిన మాట వాస్తవం. అయితే అవి సామ్రాజ్యవాదులకూ, బహుళజాతి కంపెనీలకూ ఉపయోగపడేవే గాని, ప్రజలకు కాదు. అయినా వీటిని పాలక వర్గాలు, ఆ వర్గ మేధావులు సంస్కరణలు గానే ప్రచారం చెయ్యడం వల్ల ప్రజావ్యతిరేక అర్థంలో ʹసంస్కరణలుʹ అనే మాట వినియోగంలోకి వచ్చింది. అలాగే పాలక వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో విప్లవం అనే మాటను కూడా ఉపయోగిస్తుంటారు. విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని అంటుంటారు. ప్రజల్ని భ్రమల్లో ఉంచడానికి పాలక వర్గాలకు ఇవి ఉపయోగపడతాయి.
భాష అనేది పాత వ్యవస్థ పునాది నుండో, కొత్త వ్యవస్థ పునాది నుండో నిర్మించబడేది కాదు. వందల వేల సంవత్సరాల సామాజిక చరిత్ర నుండీ, అనేక వ్యవస్థల పునాదుల చరిత్ర నుండీ ఏర్పడుతుంది. తరతరాలుగా మొత్తం సమాజమూ, సమాజంలోని అన్ని వర్గాలూ తమ ఉమ్మడి అవసరం కోసం భాషను ఏర్పర్చుకున్నాయి. అంతేగాని ఏ ఒక ప్రత్యేక వర్గమో దాన్ని సృష్టించుకోలేదు. భాష ఎప్పుడూ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడి కొన్ని వర్గాలకు హాని కలిగించే విధంగా ఉండదు. దోపిడీ చేసేవాడికీ, దోపిడీ చెయ్యబడేవారికీ భాష ఒకే రకంగా సహాయపడగలదు. సోవియట్లోని జాతుల భాషల విషయంలోనే కాదు, ప్రపంచంలోని ఏ భాష విషయంలోనైనా ఇంతే.
పెట్టుబడిదారీ వ్యవస్థలో రాజ్యాంగ యంత్రం, న్యాయ వ్యవస్థ, సాహిత్యం, కళలు మొదలైనవన్నీ బూర్జువా వర్గానికి అనుకూలంగా ఉన్నట్టే, సోషలిస్టు వ్యవస్థలో ఇవి బూర్జువా వర్గానికి కాక, ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. భాష ఒక్కటే ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇవాళ తెలుగులో దాదాపు అందరూ వ్యావహారిక భాషలో రాస్తున్నారు. ఈ వ్యావహారిక భాష అన్ని వర్గాలకూ సమానంగానే ఉపయోగపడుతుంది. వ్యావహారిక భాషలో ఎంత ప్రజానుకూలంగా రాయవచ్చో, అంత ప్రజావ్యతిరేకంగా కూడా రాయవచ్చు. ఈ భాష విప్లవ రచయితలకు ఎంతగా ఉపయోగపడుతోందో, చంద్రబాబునాయుడుకూ అంతగా ఉపయోగపడుతోంది. విప్లవ రచయితలు సోషలిస్టు వ్యవస్థను కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారీ వ్యవస్థను కోరుకుంటున్నారు. మరి ఇద్దరికీ ఒకే భాష సమానంగా ఉపయోగపడుతోంది గదా! కాబట్టి భాష కట్టడానికి పూర్తిగా భిన్నమైనదని గుర్తించాలి.
స్టాలిన్ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా పాత వ్యవస్థకూ, కొత్త వ్యవస్థకూ - అంటే అన్ని వ్యవస్థలకూ ఉపయోగపడుతుంటాయి. కాబట్టి భాష ఏ రకమైన పునాదికన్నా, ఏ రకమైన కట్టడం కన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది. పునాదులూ, కట్టడాలూ రూపొంది నాశనమైపోతున్నా, కొత్తవి వస్తున్నా భాష మాత్రం తన మౌలిక స్వభావాన్ని మార్చుకోవడం లేదు. 1850 నుండి 1950 దాకా జరిగిన వందేళ్ళలో రష్యాలో భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థలు రెండూ పోయి మూడోది సోషలిస్టు వ్యవస్థ ఏర్పడింది. అంటే రెండు పునాదులూ, రెండు కట్టడాలూ పోయి, ఈ వందేళ్ళలో మూడోదైన సోషలిస్టు పునాది, సోషలిస్టు కట్టడం వచ్చాయి. కాని రష్యన్ భాషలో మాత్రం ఈ వందేళ్ళలోనూ మౌలికమైన మార్పేమీ రాలేదంటాడు స్టాలిన్.
భాషకూ, కట్టడానికీ ఉండే మరొక ముఖ్యమైన తేడాను స్టాలిన్ వివరిస్తాడు. కట్టడానికి ఉత్పత్తితోనూ, ఉత్పత్తి కార్యాచరణతోనూ ప్రత్యక్ష సంబంధం లేదు. ఆర్థిక విధానం ద్వారానూ, పునాది ద్వారానూ పరోక్షంగా మాత్రమే భాషకు ఉత్పత్తితో సంబంధం ఉంది. అందువల్ల ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలోని మార్పుల్ని కట్టడం వెంటనే ప్రతిబింబించడం ద్వారా పునాదిలో వచ్చిన మార్పుల్ని కట్టడం ప్రతిబింబిస్తుంది. కాని భాషకు మానవుని ఉత్పత్తి కార్యాచరణలో ప్రత్యక్ష సంబంధం ఉంది. అంతేకాదు, ఉత్పత్తి నుంచి పునాది దాకా, పునాది నుంచి కట్టడం దాకా అన్ని కార్యరంగాల్లోనూ మానవుని కార్యాచరణతో భాషకు ప్రత్యక్ష సంబంధం విభిన్నమైనదీ. ఒక విధంగా భాష కార్యరంగం ఎంత విశాలమైనదంటే, దానికి హద్దులే లేవని చెప్పొచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారం, రవాణా, టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రాల్లోని నిరంతర అభివృద్ధి వాటికి అవసరమైన కొత్త పదాలను, కొత్త ప్రయోగాలను సృష్టించుకుంటూ భాష అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఈ క్రమంలో ఉదాహరణకు ఒక వస్తువు ఏ ప్రాంతం నుండి వస్తే దాని పేరు కూడా ఆ ప్రాంతపు భాషనుండే దిగుమతి అవుతుంది. రైలు, బస్సు, కుక్కర్, కంప్యూటర్, టీవీ మొదలైన పదాలన్నీ భారతీయ భాషల్లోకి అలా వచ్చినవే.
ఇంకో విషయం ఏమిటంటే సమాజంలో వర్గాలుంటాయి గాని, వర్గ భాషలుండవని స్టాలిన్ అంటాడు. ఒకే జాతిలో వర్గవైరుధ్యాలున్నంత మాత్రాన ఆయా వర్గాలకు ఆయా వర్గభాషలుండాల్సిన అవసరం లేదు. అలా ఉండవు కూడా. ఒక జాతికి ఒక భాష ఉండడం అనేది జాతికి ఉండవలసిన అతి ప్రధాన స్వభావాల్లో ఒకటిగా మార్క్సిజం చెబుతుంది. ఇంగ్లాండులో ఒకప్పుడు ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ ఫ్యూడల్ ప్రభువులు మాత్రం చాలా కాలం పాటు ఫ్రెంచి భాష మాట్లాడుతూ ఉండేవారు. అంత మాత్రాన ఇది వర్గభాషలు ఉంటాయనే దానికి అనుకూల విషయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఫ్యూడల్ ప్రభువులందరూ ఫ్రెంచి భాష మాట్లాడేవారు కాదు. రాజసభలకూ, సామంత ప్రభువుల ఆస్థానాలకూ సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఫ్రెంచి భాష మాట్లాడేవారు. పైగా వాళ్ళు మాట్లాడేది సాధారణ ప్రజలు మాట్లాడే ఫ్రెంచి భాషే గాని ʹవర్గʹ భాష కాదు. పైగా అది ఆ కొద్ది మందికైనా ఫ్రెంచి భాష మీద మోజే గాని ఇంకేమీ కాదు. రష్యన్ రాజవంశీకులు కూడా ఒకప్పుడు జారు భవనాల్లోనూ, విలాస గృహాల్లోనూ ఫ్రెంచి భాషను మాట్లాడేవారు. మన దేశంలో కూడా భూస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకున్న తర్వాత రాజాస్థానాల్లో సంస్కృత భాషకున్న విలువ ఇతర భారతీయ భాషలకు లేదు. ఈ దేశంలో సంస్కృతం పండిత భాషగా మాత్రమే ఉండేది. కావ్యాలూ, శాస్త్ర గ్రంథాలూ సంస్కృతంలో రాస్తేనే విలువ ఉండేది. సంస్కృతం వచ్చిన పండితులూ, రాజులూ కూడా వారి మాతృభాషను మరిచిపోయేవారు కాదు. అవసరమైనప్పుడు వారి మాతృభాషలో కూడా మాట్లాడేవారు. వాళ్ళ విశిష్టతను చాటుకోడానికే సంస్కృతం ఉపయోగించేవారు. అంతేగాని అది వాళ్ళ వర్గభాష కాదు. సంస్కృత నాటకాల్లో కూడా రాజులూ, మంత్రులూ, ఇతర ముఖ్యులూ సంస్కృతం మాట్లాడితే, మిగిలిన సాధారణ పాత్రలు ప్రాకృతం మాట్లాడేవారు. ఈ ప్రభావం తెలుగు భాషపైన కూడా పడి తెలుగు నాటకాల్లో ప్రధాన పాత్రలు గ్రాంథికం మాట్లాడితే, అప్రధాన పాత్రలు వ్యావహారికం మాట్లాడేవి. నిత్య వ్యవహారంలో మాత్రం పండితులు కూడా వ్యావహారికమే మాట్లాడతారు. నన్నయ, తిక్కన్న, చిన్నయసూరి వ్యవహారంలో గ్రాంథికం మాట్లాడి ఉంటే జనం వాళ్ళను పిచ్చోళ్ళను చూసినట్టు చూసి ఉండేవారు. ఫ్రెంచి గానీ, సంస్కృతంగానీ, గ్రాంథికం గానీ ఇవేవీ మోజుతో మాట్లాడేవాళ్ళకు మాతృభాషలు కావు. ఇవాళ మన దేశంలో ఈ స్థానాన్ని ఇంగ్లీష్ భాష ఆక్రమించింది. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు వాళ్ళ మాతృభాష కూడా వచ్చు. తమ స్థాయి గొప్పదని చెప్పుకోడానికే అవసరం లేకపోయినా మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్, రష్యన్ ఫ్యూడల్ ప్రభువులకు ఫ్రెంచి వర్గభాష కానట్టే, మన దేశంలో ఉన్నత వర్గాలకూ, ఉన్నత విద్యావంతులకూ ఇంగ్లీషు వర్గ భాషకాదు.
పాత వ్యవస్థను నాశనం చెయ్యకుండా కొత్త వ్యవస్థను నిర్మించలేం. పాత వ్యవస్థను ధ్వంసం చెయ్యడం ద్వారానే సామాజికాభివృద్ధి జరుగుతూ వస్తోంది. కాని భాష విషయంలో అలా కాదు. పాత భాషను ధ్వంసం చేసి కొత్త భాషను ఏర్పర్చుకోవడం ద్వారా భాష అభివృద్ధి కాలేదు. భాష తన మౌలిక లక్షణాన్ని వదులుకోకుండానే, దశలు దశలుగా అభివృద్ధి పొందుతూ, క్రమ పరిణామం చెందుతుంది. భాషాభివృద్ధిలో ఆకస్మిక విధ్వంసనాన్నీ, కొత్త భాషను హఠాత్తుగా సృష్టించడాన్నీ మార్క్సిజం ఒప్పుకోదు.
Type in English and Press Space to Convert in Telugu |
SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNIONIn the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ...... |
స్టాలినో నీ ఎర్రసైన్యం...ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది...... |
స్టాలిన్ కవితలువిద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్..... |
స్టాలిన్ వ్యతిరేకత? ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్ మార్గంపట్ల రాజకీయ ఏ...... |
జీవించు జీవించు హే సూర్య బింబమా...దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది...... |
పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా...... |
ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి..... |
ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే...... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |