ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 05.03.2018 08:45:14am

ఇంటికి చేరుకొని పాన్‌ కార్డు విషయం అమ్మకు చెప్పాడు చందు.

ʹʹఅయ్యో! అదోటుందా? సరే... కాసేపు పడుకో బిడ్డా! సాయంత్రం పోదువుతియ్యిʹʹ అంది సాయమ్మ.

చందుకు చేతకావడం లేదు. కాసేపు పడుకోవాలనే ఉంది. నాలుగు దాకా పడుకొని తర్వాత డాక్టరుకు చూపించుకొని ఇంటర్నెట్‌ షాపుకు పోవాలనుకున్నాడు.

అప్పటికి విలాసరావు డ్యూటీకి పోక రెండు రోజులయింది. ʹరేపు ఎలాగైనా పోవాలిʹ అనుకున్నాడు.

ఏదేదో ఆలోచిస్తూ కాసేపు నిద్రపోయాడు చందు. లేచి చూస్తే నాలుగయింది. రెండు గంటల నిద్రపోయేసరికి చందుకు కాస్త నెమ్మదిగా ఉంది. ముఖం కడుక్కొని బయటపడ్డాడు.

ʹఈ సమయంలో డాక్టరుండడు. ముందుగా ఇంటర్నెట్‌ షాపుకు పోయి పాన్‌ కార్డుల సంగతి తెలుసుకుంటానుʹ అనుకున్నాడు.

యూనివర్సిటీ సెంటర్‌లో ఇంటర్నెట్‌ షాపులున్నాయి. అక్కడికే పోయాడు చందు.

ʹʹఏం కావాలి బ్రదర్‌?ʹʹ అని అడిగాడు ఇంటర్నెట్‌ షాపతను.

ʹʹపాన్‌ కార్డులు కావాలి.ʹʹ

ʹʹఎవరికి?ʹʹ

ʹʹమా అమ్మకు, నాకు, మా చెల్లికిʹʹ

ʹʹఒక్కో పాన్‌ కార్డ్‌కు 250 రూపాయలవుతుంది. ఆధార్‌ కార్డ్‌, వయసు నిర్ధారణ సర్టిఫికేటు, ఫోటోలు కావాలి.ʹʹ

ʹʹనాకు, మా చెల్లికి స్కూలు సర్టిఫికేట్లున్నాయి. మా అమ్మకు లేదు. ముగ్గురికీ ఆధార్‌లున్నాయి.ʹʹ

ʹʹసరే, ఉన్నవైతే తీసుకురాʹʹ అన్నాడు.

ʹʹతెస్తాను. మరి పాన్‌ కార్డు వెంటనే ఇస్తారా?ʹʹ

ʹʹవెంటనేనా?ʹʹ అంటూ నవ్వాడు ఇంటర్నెటాయన. తర్వాత అన్నాడు,

ʹʹఅవి మేమిచ్చేటివి కాదు, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు ఇస్తారు. మేము అప్లై చేస్తాము, అంతే. నెల తర్వాత మీకు వస్తాయి.ʹʹ

ʹʹనెలా?ʹʹ ఆశ్చర్యపోయాడు చందు.

ʹʹఔను. ఒక్కోసారి లేటు కూడా అవుతుంది. ఇప్పుడు నోట్లు రద్దయ్యాయి కదా! బ్యాంకు వాళ్ళు ʹపాన్‌ʹను కంపల్సరీ చేశారు. అందుకే చాలా మంది అప్లై చేస్తున్నారు. కాబట్టి నెలపైన కూడా పట్టవచ్చు.ʹʹ

ఆయన సమాధానంతో చందు నీరుగారిపోయాడు. ఇంట్లో ఉన్న డబ్బు బ్యాంకులో వేయాలంటే ఖాతా కావాలి. ఖాతా తెరవాలంటే ʹపాన్‌ʹ కావాలి. పాన్‌ కార్డు రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ʹఇదంతా చాలా పెద్ద పనిʹ అనిపిస్తోంది చందుకు.

ఇంటర్నెటాయన కాస్త నెమ్మదిగా ఉన్నాడు. కొన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు చందు.

ʹʹఅన్నా! బ్యాంకులో డబ్బు వేస్తే టాక్స్‌ కట్టాల్నట, నిజమేనా?ʹʹ

ʹʹనేను అదే విషయం పేపర్లో చదివాను. రెండున్నర లక్షలు దాటితే టాక్స్‌ కట్టాలట.ʹʹ

ʹʹఎంత కట్టాలి?ʹʹ

ʹʹఆ సంగతి నాకు తెలియదు. ఆడిటరునడగాలి.ʹʹ

ʹʹఆయనెక్కడుంటాడు?ʹʹ

ʹʹఈ లైన్లోనే ఆ చివర పెద్ద బిల్డింగ్‌ ఉంది చూడు. అందులోనే థర్డ్‌ ఫ్లోర్‌లో ఉంటాడు.ʹʹ

ʹʹఇప్పుడు పోయి కలువచ్చా?ʹʹ

ʹʹసాధారణంగా ఆయన సాయంత్రం 6 గంటలకు వస్తాడు. నాకు అవసరం పడితే నేనోసారి పోయాను.ʹʹ

ʹʹసరే అన్నా! ఇప్పుడు ఐదున్నరయింది కదా? ఇప్పుడు ఆడిటర్‌ను కలిసి, రేపు నిన్ను కలుస్తాను.ʹʹ

ʹʹఅలాగేʹʹ అన్నాడు ఇంటర్నెటాయన.

ʹʹధ్యాంక్స్‌ʹʹ అంటూ బయలుదేరాడు చందు. ఇంటర్నెటాయన చెప్పిన ప్రకారంగా ఆడిటర్‌ ఆఫీసుకు చేరుకున్నాడు.

అక్కడప్పటికే ఐదారుగురున్నారు. చందు వాళ్ళ ప్రక్కనే కూర్చున్నాడు. అప్పటికి ఆడిటర్‌ రాలేదు.

ఆయన ఆఫీసులో ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు. వారి ముందు కంప్యూటర్లున్నాయి. తనకన్నా ముందుగా వచ్చినవారు, వారితో ఏదో మాట్లాడుతున్నారు.

కొద్దిసేపట్లో ఆడిటర్‌ వచ్చాడు. చక్కగా తన అద్దాల రూములోకి పోయాడు. ముందు కూర్చున్నాయన ఆయన వెంటే లోపలికి పోయాడు. వారు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినబడడం లేదుగాని ఆడిటర్‌ అడిగిన కాగితాలన్ని చూపిస్తున్నాడాయన. అదంతా అద్దాల్లోంచి కనబడుతోంది చందుకు.

ఓ గంట తర్వాత చందు వంతు వచ్చింది. లోపలికి పోయి నమస్కారం పెట్టి నిలుచున్నాడు చందు.

ʹʹకూర్చో బాబూ!ʹʹ అన్నాడు ఆడిటరు.

చందు కూర్చున్నాడు.

ʹʹచెప్పు! నీకేం కావాలి?ʹʹ

ʹʹమేము 16 సంవత్సరాల క్రితం రెండు రూములున్న చిన్న ఇంటి జాగా కొన్నాము సార్‌! అప్పుడు ఒక లక్ష అయింది. ఇప్పుడు మా చెల్లి పెండ్లి కుదిరి దాన్ని 18 లక్షలకు అమ్మాము.ʹʹ

ʹʹడబ్బులొచ్చాయా?ʹʹ

ʹʹవచ్చాయి.ʹʹ

ʹʹడబ్బు బ్యాంకులో వేశారా?ʹʹ

ʹʹలేదు సార్‌.ʹʹ

ʹʹఅప్పుడు కొన్న కాగితాలు, ఇప్పుడు అమ్మిన కాగితాలు తెచ్చావా?ʹʹ

ʹʹలేదు సార్‌.ʹʹ

ʹʹఅసలేం కావాలి నీకు?ʹʹ

ʹʹప్లీజ్‌, విసుక్కోకండి సార్‌.ʹʹ

ʹʹసరే, చెప్పు.ʹʹ

ʹʹనేనా డబ్బు బ్యాంకులో వేయాల్సిందేనా?ʹʹ

ʹʹఇప్పటి పరిస్థితుల్లో తప్పదు.ʹʹ

ʹʹటాక్స్‌ పడుతుందా సార్‌?ʹʹ

ʹʹపడుతుంది గదా!ʹʹ

ʹʹఎంత పడుతుంది?ʹʹ

ʹʹకాగితాలు చూడకుండా ఎలా చెప్పగలను?ʹʹ

చందు మాట్లాడలేదు. అతడు చాలా అమాయకుడనే విషయం ఆడిటర్‌కు అర్థమయింది. అతనికి తెలిసేలా చెప్పాలనిపించింది ఆడిటరుకు.

ʹʹచూడు బాబూ! పదహారు సంవత్సరాల క్రింద కొన్నప్పటివి, ఇప్పుడు అమ్మినప్పటివి లెక్కలు కడతాము. తీసేయాల్సినవి తీసేసి మిగిలిన డబ్బుకు 20 శాతం చొప్పున టాక్స్‌ కడతాము. ఎంత ట్యాక్స్‌ అనేది కాగితాలుంటేనే కరక్టుగా చెప్పగలను.ʹʹ

ʹʹఅందాదా.....ʹʹ అంటూ నసిగాడు చందు.

చందు మనసు అర్థమయింది ఆడిటర్‌కు. అందుకే కంప్యూటర్‌ మీద కాసేపు ఏవేవో లెక్కలు చేసి అన్నాడు.

ʹʹనీవు చెప్పిన సంవత్సరాలు, కొన్న, అమ్మిన ధరలను బట్టి అందాదా 2 లక్షల దాకా టాక్స్‌ పడవచ్చు. అది కాస్త ఎక్కువ, తక్కువ కూడా కావచ్చు. ముందైతే నీవు ఉన్న డబ్బును బ్యాంకులో వేసి బ్యాంకు పాసుబుక్కు, కొన్న అమ్మిన రిజిస్ట్రేషన్‌ కాగితాలు, పాన్‌ కార్డు అన్నీ తీసుకొని రా. సరిగ్గా లెక్కచేసిపెడుతాను.ʹʹ

ʹʹఇక్కడ కూడా పాన్‌ కార్డు కావాలా సార్‌?ʹʹ

ʹʹకావాలిగదా?ʹʹ అన్నాడు ఆడిటరు.

ఆ మాటకు నీరుగారిపోయాడు చందు.

ʹʹసరేసార్‌! మళ్ళీ కలుస్తానుʹʹ అంటూ బయటకు వచ్చాడు.

అతనికంతా అయోమయంగా ఉంది. పెద్దనోట్ల రద్దు సృష్టించిన ఈ తుఫానుకు తట్టుకోలేకపోతున్నాడు.

ʹఈ పెద్దనోట్ల రద్దు లేకుంటే వచ్చిన డబ్బును వచ్చినట్టే జగద్గిరిగుట్ట వాళ్ళకు ఇచ్చేవాడు. వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు. లత పెళ్ళి ఏ ఆటంకం లేకుండా హాయిగా జరిగేది. అమ్మ అనుకున్నట్టుగానే నాగరాజు జైలునుండి వచ్చేవరకే లత పెండ్లి అయిపోయేది. ఆమె అత్తవారింటికి పోయి సుఖంగా ఉండేదిʹ అనిపించింది చందుకు.

లత గుర్తుకు రాగానే చందు మనసు ఆర్థ్రమయింది.

ʹనాన్న ఉంటే లత పెండ్లి ఉన్నంతలో గొప్పగా చేసేవాడు. తాను కూడా అలాగే ఉన్నంతలో లత పెళ్ళి గొప్పగానే చేయాలి. అమ్మను సంతోషపెట్టాలి. రెండు లక్షల టాక్స్‌ కాదు, అంతకన్నా ఎక్కువ అయినా ఫరవాలేదుʹ అనిపించింది చందుకు.

నిద్ర లేచినప్పటి ఉత్సాహం ప్రస్తుతం లేదు చందుకు. ఒక్కొక్క విషయం తెలుస్తున్నకొద్ది శారీరక అలసటకన్నా మానసిక అలసట ఎక్కువయింది. పూర్తిగా చేతకావడం లేదు. చక్కగా డాక్టరు రాజేశం దగ్గరికే పోయాడు.

రాజేశం చందును పరీక్షించాడు.

ʹʹదాదాపు తగ్గినట్టే. నీరసముందంతే. అవే గోళీలు మరో రెండు రోజులు వేసుకొని రెస్టు తీసుకో. సరిపోతుందిʹʹ అని చెప్పి ఓ ఇంజక్షన్‌ ఇచ్చాడు.

డాక్టరు రాజేశం పేషెంటు దగ్గర 50 రూపాయలు ఫీజు తీసుకుంటే ఆ రోగం తగ్గేవరకు రెండు, మూడు సార్లు వచ్చినా మళ్ళీ ఫీజు తీసుకోడు. అందుకే అక్కడున్న మామూలు జనమంతా ఆయన దగ్గరే చూపించుకుంటారు.

మందుల చీటీ పట్టుకొని మెడికల్‌ షాపుకు పోయాడు చందు.

ʹʹఅన్నా! రెండువేల నోటుంది. చిల్లర లేవుʹʹ అన్నాడు.

మెడికల్‌ షాపతనికి చందు తెలుసు కాబట్టి,

ʹʹసరే! మందులు తీసుకోʹʹ అంటూ మందులిచ్చి లెక్క రాసుకున్నాడు.

ʹʹథ్యాంక్సన్నాʹʹ అని చెప్పి తర్వాత ఇల్లు చేరాడు చందు.

అమ్మకు పాన్‌ కార్డ్‌ విషయం, ఆడిటర్‌ను కలిసిన విషయం, ఆయన టాక్స్‌ గురించి చెప్పిన విషయం అన్నీ చెప్పాడు చందు.

ʹʹమన పైసలకు మనం టాక్స్‌ కట్టుడేందిరా?ʹʹ అంటూ విస్తుపోయింది సాయమ్మ.

విలాసరావు డ్యూటీకి పోతే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పదవుతున్నది. పనున్నా, లేకపోయినా అక్కడ ఊరికే ఉండాల్సివస్తోంది. స్వంత పనులు చేసుకోవడం వీలు కావడం లేదు. అందుకే రేపు కూడా విలాసరావు డ్యూటీకి పోకుండా పాన్‌ కార్డుల పని చూడాలనుకున్నాడు చందు. ఆ విషయాన్ని రాత్రే అమ్మతోను, లతతోను చెప్పాడు. అందుకే చందును వారు పొద్దున్నే లేపలేదు.

ఉదయం ఏడు గంటలకే ఫోన్‌ రింగైతే లేచి చూశాడు చందు. అది విలాసరావు దగ్గర నుండి.

ʹʹనమస్తే సార్‌!ʹʹ అన్నాడు చందు.

ʹʹచందూ! జ్వరం తగ్గిందా?ʹʹ అని అడిగాడు విలాసరావు.

ʹʹకాస్త నయంగా ఉంది సార్‌.ʹʹ

ʹʹసారికకు ఏవో స్వంత పనులున్నాయట. నువ్వు లేవు కదా? నిన్నటి నుండి గొడవ పెడుతోంది. ఇవ్వాల రావాలిరా చందూ!ʹʹ

చందుకు ఏమనాలో తోచలేదు. అందుకే మౌనంగా ఉన్నాడు. అవతలివైపు విలాసరావు దగ్గర నుండి రాధమ్మ ఫోన్‌ తీసుకున్నట్టుంది. ఫోన్‌లో ఆమె మాట వినిపించింది.

ʹʹరావాలిరా చందూ! వేరే డ్రైవరును తీసుకుపొమ్మంటే సారిక వినడం లేదు. నువ్వే కావాలంటుంది. రారా చందూ!ʹʹ

రాధమ్మ అలా అనేసరికి చందుకు తప్పలేదు.

ʹʹసరే అమ్మా! గంటలో వస్తాను.ʹʹ అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

ʹʹఅన్నయ్యా! మరి పాన్‌ కార్డుల సంగతి?ʹʹ అంది అక్కడే ఉన్న లత.

ʹʹసాయంత్రం రాగానే పోదాముʹʹ చెప్పాడు చందు.

సాయమ్మకు ఇవేవీ పట్టడం లేదు. విచారంగా ఉంటోంది. అప్పుడప్పుడు తనలోతనే ఏడుస్తోంది.

సారిక చాలా మొండి మనిషి. తాను అనుకున్నది సాధించి తీరుతుంది. ఒక్కతే కూతురు కాబట్టి విలాసరావు, రాధమ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ఆమె అలిగితే ఆ తల్లిదండ్రులు తట్టుకోరు. ఆమె ఏదంటే అది కొనిపెడతారు. ఏం చేసినా వద్దనరు.

ʹసారికకు ఏవో షికార్లుంటాయి ఈరోజు. అందుకే తననే డ్రైవరుగా కావాలని పట్టుబడుతోంది. మరి కొద్దిరోజులైతే ఆమె పెళ్ళయిపోతుంది. ఆమె బాధ తగ్గుతుందిʹ అనుకున్నాడు చందు.

తొందరగా తయారై గంటలోనే విలాసరావింటికి చేరుకున్నాడు చందు. అప్పటికే సారిక తయారైకూర్చుంది. చందును చూడగానే కారు దగ్గరికి చేరుకుంది.

ʹʹటిఫిన్‌ తిని వెళ్ళండి.ʹʹ అంది రాధమ్మ.

ʹʹవద్దు, ఈరోజు అన్నీ బయటేʹʹ అంటూనే కారెక్కింది. సారిక ముందుసీట్లో కూర్చుంది.

ʹʹత్వరగా పోనివ్వు చందూ! ఆకలవుతోంది.ʹʹ

ʹʹఇంట్లో తిని రావచ్చుగదా? అమ్మగారు తినిపో అంటూనే ఉన్నారు.ʹʹ

ʹʹఅప్పుడప్పుడు బయటి తిండి కూడా తినాలిరా బుద్ధూ!ʹʹ అంటూ చందు తొడమీద చేయేసింది సారిక. చందు ఝల్లుమన్నాడు. ʹఈ సారికతో ఇదే సమస్య. ఇవ్వాల ఏ సమస్య సృష్టిస్తుందో తల్లి?ʹ అనుకున్నాడు చందు.

సారిక ఏదేదో మాట్లాడుతోంది.

ʹʹఏం చేసినా ఈ కొద్దిరోజులే. తర్వాత నా పెళ్ళవుతుంది. నా స్వేచ్ఛ అంతా పోతుంది. అందుకే ఈ కొద్దిరోజులు నిన్ను వదిలిపెట్టనుʹʹ అంది సారిక.

ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాడు చందు.

ʹʹఎటు వెళ్ళాలి?ʹʹ అన్నాడు ఆమె మాటలను తప్పించాలని.

ʹʹహైదరాబాద్‌ నందన హోటల్‌కి.ʹʹ

ʹʹహైదరాబాదా? అమ్మకు చెప్పారా?ʹʹ

ʹʹఅన్నీ చెప్పాలా?ʹʹ అంటూ ఎదురుప్రశ్న వేసింది.

ఆమె సంగతి తెలుసు చందుకు. ఆమె తన ఇష్టమొచ్చినట్టు చేస్తుంది. ఆమె ఎటు పోయినా, ఎప్పుడొచ్చినా ఎవరూ అడుగరు. సారిక సంగతి తెలిసి చందు నోరు మూసుకున్నాడు.

కారు దూసుకుపోతోంది. సారిక ఏదేదో మాట్లాడుతోంది. ఏమేమో చెపుతోంది. తనకు అవసరం లేనివైనా వినాల్సివస్తోంది చందుకు. సారిక ఆవేశంగా చెపుతూ మధ్యమధ్య చందు భుజం మీద, తొడ మీద చేయి వేస్తోంది. చందుకు తేళ్ళు, పాములు పారుతున్నట్టుంది.

కారు హోటల్‌ ʹవివేరాʹ చేరుకునేసరికి గంటన్నరయింది. అక్కడ కారు ఆపమంది సారిక.

ʹʹవివేరాలో టిఫిన్‌ చేద్దాంʹʹ అంది.

కారు తిప్పి పార్కు చేశాడు చందు. సారిక ఇడ్లీ తెప్పించింది. ఇద్దరూ తిన్నాక మళ్ళీ కారు బయలుదేరింది.

మరో గంటన్నర ప్రయాణించాక కారు ʹనందనʹ హోటల్‌కు చేరుకుంది.

అది చాలా పెద్ద హోటల్‌. చందు విలాసరావుతో ఎన్నోసార్లు హైదరాబాద్‌కు వచ్చాడు గాని ʹనందనʹ హోటల్‌కు రావడం అతనికి ఇదే మొదటిసారి.

ʹʹఆ రెండు బ్యాగులు తీసుకొని 401కు రాʹʹ

అని చెప్పి సారిక ఆగకుండా పోయి లిఫ్ట్‌ ఎక్కింది. చందు కారు పార్కుచేసి సారిక రెండు బ్యాగులూ తీసుకొని 401కు చేరుకున్నాడు.

నందన హోటల్‌లో సారిక 401 సూట్‌ బుక్‌ చేసింది. ఎందుకు బుక్‌ చేసిందో? ఎప్పుడు బుక్‌ చేసిందో? చందుకు తెలియదు. ఆ సూట్‌ ఇల్లుకంటె పెద్దగా ఉంది. ఇటువైపు డైనింగ్‌ టేబుల్‌, అటువైపు రెండు బెడ్స్‌, ఇంకా అటువైపు సోఫాలు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఉన్నాయి.

బ్యాగులు రెండు రూములో పెట్టి బయటకు పోబోయాడు చందు. సారిక ఆపింది.

ʹʹటిఫిన్‌ ఆర్డరు చేశాను, ఉండుʹʹ అంది

ʹʹఇప్పుడే తిన్నాం కదా?ʹʹ

ʹʹరెండు గంటలయింది తిని.ʹʹ

ʹʹనేను తినలేను. మీరు తినండి.ʹʹ

ʹʹరెండు ఆర్డర్‌ చేశాను.ʹʹ

ʹʹఒకటి వాపసు చేయండి.ʹʹ

ʹʹఐతే నాకూ వద్దు. రెండూ వాపసు చేస్తానుʹʹ సారిక బెట్టు చేసింది.

ʹʹఅదేమిటి?ʹʹ

ʹʹఅదంతేʹʹ సారిక అలిగింది.

చందు మొహమాటంలో పడ్డాడు.

ʹʹసరే, తింటానుʹʹ అన్నాడు.

ʹʹగుడ్‌ బాయ్‌!ʹʹ అంది సారిక.

కాసేపట్లో రెండు ఇడ్లీ ప్లేట్లు వచ్చాయి. సారికకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఏ హోటల్‌కు పోయినా ఇడ్లీనే తింటుంది. సారిక టేబుల్‌ ముందు కూర్చొని చందును పక్కనే కూర్చోమంది. చందు కాస్త ఇబ్బంది పడ్డాడు.

ʹʹచూడు చందూ! ఇవ్వాల నేను చెప్పినట్టు వినాలి. లేకుంటే నేను చాలా హర్ట్‌ అవుతాను.ʹʹ

ఏమనాలో చందుకు తెలియలేదు. వెళ్ళి కూర్చున్నాడు. తన టిఫిన్‌ తాను తింటున్నాడు. అంతలోనే సారిక తన ప్లేట్లోని ఇడ్లీని చందు ప్లేట్లో వేసింది. అతని ప్లేట్లోని ఇడ్లీని తాను తీసుకోబోయింది.

ఆమె ప్రవర్తన చందుకు వింతగా అనిపించింది. అందుకే

ʹʹవద్దు, వద్దుʹʹ అన్నాడు చందు.

ʹʹఏం?ʹʹ ప్రశ్నించింది సారిక.

ʹʹబాగుండదు.ʹʹ

ʹʹఎందుకని?ʹʹ

ʹʹఎంగిలి కదా!ʹʹ

ʹʹనేను ఇవ్వాల నీతో ఎంగిలి పడుదామనుకుంటున్నానుʹʹ చందు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది సారిక.

చందు ఏమీ మాట్లాడలేదు. కళ్ళు తిప్పుకున్నాడు.

ʹʹఈ రూం బుక్‌ చేసింది కూడా అందుకేʹʹ అంది సారిక మళ్ళీ.

ʹʹఏమయింది మీకివ్వాల?ʹʹ అన్నాడు చిరాకుగా చందు.

ʹʹనీ పిచ్చి పట్టింది.ʹʹ

తల తిప్పుకున్నాడు చందు.

ʹʹకొద్దిరోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఏమిటిలా?ʹʹ అన్నాడు తల అటువైపుంచే.

ʹʹపెళ్ళికి దీనికి సంబంధమేమిటి?ʹʹ సారిక ప్రశ్నించింది.

చందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు.

ʹʹపెళ్ళికి, దీనికి సంబంధమేమిటి?ʹʹ రెట్టించింది సారిక.

చందుకు చెప్పక తప్పలేదు.

ʹʹపవిత్రతʹʹ అన్నాడు.

చందు ఆ మాట అనగానే షాకయింది సారిక. తానింత రెచ్చగొడుతున్నా ఎంతో సంయమనంతో ఉన్నాడు చందు.

ఇంతకు ముందు తన బాయ్‌ఫ్రెండ్స్‌ ఎవరూ ఇలా లేరు. ఆబగా తనవైపు చూచినవారే తప్ప ఇలాంటి వారు కనిపించలేదు. మొదటి సారిగా ఆమె చందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూస్తోంది. అందుకే అడిగింది సారిక,

ʹʹపవిత్రత అంటే ఏమిటి చందూ?ʹʹ అని.

చందుకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఐనా చెప్పాలనిపించింది. ఈ పరిస్థితి నుండి తాను తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చెప్పక తప్పదనిపించింది.

మళ్ళీ అడిగింది సారిక.

ʹʹచెప్పు చందూ! పవిత్రత అంటే ఏమిటి?ʹʹ

సారిక మాటల్లో ఇంతకు ముందున్న దుడుకుతనం లేదు.

ʹʹపవిత్రత లాంటి పెద్ద మాటల గురించి వివరించే వయసు గాని, అనుభవం గాని నాకు లేవు. ఐనా నాకు తెలిసింది చెబుతాను. పెళ్ళికాకముందు స్త్రీపురుషులు పరాయివాళ్ళతో అనైతిక సంబంధాలు పెట్టుకోకపోవడం పవిత్రత అని తెలుసుʹʹ అన్నాడు చందు.

ʹʹఅంటే? శారీరకంగానా? మానసికంగానా?ʹʹ

సారిక ఇవన్నీ తెలియని చిన్నపిల్లేం కాదు. ఐనా ఏదో చెప్పాలనుకున్నాడు చందు. ఏమీ చెప్పకుండా ఉంటే సారిక తనను బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలా జరిగితే సారికకు, నాగరాజుకు తేడా ఉండదు. సారిక దిగజారడం చందుకు ఇష్టం లేదు.

ఎందుకంటే సారిక స్వతహాగా చెడ్డది కాదు. ఆమెవి డబ్బు ఎక్కువై ఏర్పడ్డ దురలవాట్లే. మంచి చెప్పే తల్లిదండ్రులు గాని, స్నేహితులు గాని లేకపోవడంతో సారిక అలా అయిందిగాని వాస్తవానికి సారిక చెడ్డది కాదు. గత రెండు సంవత్సరాల నుండి సారికను గమనిస్తూ చందు ఏర్పరచుకున్న అభిప్రాయమిది.

సారిక మళ్ళీ అడిగింది.

ʹʹచెప్పు చందూ! శారీరకంగానా? మానసికంగానా?ʹʹ అని

ఆమె అడగడంలో ఇదువరకటి అహంకారం గాని, అధికారం గాని కనిపించలేదు. ఆమె మాటల్లో మార్దవం కనిపించింది. అందుకే,

ʹʹరెండిట్లోనుʹʹ అన్నాడు చందు.

ʹʹఅంటే?ʹʹ

ʹʹశారీరకంగాను, మానసికంగాను పవిత్రంగా ఉండాలి అని.ʹʹ

ʹʹఉంటే?ʹʹ

ʹʹఇద్దరూ పవిత్రంగా ఉంటే వారి దాంపత్యం పండుతుంది.ʹʹ

ʹʹలేకుంటే?ʹʹ

ʹʹమానసిక అశాంతి ఏర్పడుతుంది.ʹʹ

ʹʹఏర్పడితే?ʹʹ

ʹʹబంధాలు తెగిపోతాయి.ʹʹ

ʹʹతెగిపోతే?ʹʹ

ʹʹభవిష్యత్తు అయోమయమవుతుంది.ʹʹ

ʹʹఅయితే?ʹʹ

ʹʹమానవ జన్మకు అర్థం ఉండదు, మనిషికీ పశువుకు తేడా ఉండదు.ʹʹ

చందు అలా అనగానే సారిక ముఖంలో ఏదో ఆందోళన కనిపించింది. తర్వాత సారిక మరో ప్రశ్న వేయలేదు. ఆమె నిశ్శబ్దమయింది. తన సీట్లోంచి లేచి గదంతా తిరుగుతోంది.

తన సమాధానాలు తనకే ఆశ్చర్యం కలిగించాయి చందుకు. ʹసారిక వేసిన ప్రశ్నలు మామూలు ప్రశ్నలు కావు. వాటికి సమాధానాలు చెప్పడం తనలాంటి వ్యక్తికి సాధ్యం కాదు. కాని విచిత్రం! తాను టకటకా సమాధానాలు చెప్పేశాడు. ఎలా? ఎలా సాధ్యమయింది?బహుశః అమ్మవల్ల సంక్రమించిన సంస్కారం వల్లనేమో? తాను ఇదివరకు విన్నవి, తనకు నచ్చినవి, తాను గుర్తుంచుకున్నవి అమ్మ సంస్కారంతో కలిసి సమాధానాలుగా వచ్చినవేమో? ఏమో?ʹ అనుకున్నాడు చందు.

సారిక ఇంకా తిరుగుతూనే ఉంది. ఆమె తన మాటలకు నొచ్చుకుందనుకున్నాడు చందు. నిజానికి తాను సారికతో అన్న మాటలు చెప్పాలని చెప్పినవి కావు. ఆమెను ఇబ్బంది పెట్టాలని చెప్పినవీ కావు. కేవలం తన ఆత్మరక్షణ కోసం చెప్పినవే.

గదిలో మౌనంగా పచార్లు చేస్తున్న సారిక ఒక్కసారిగా ఆగింది. వచ్చి తన కుర్చీలో కూర్చుంది.

ʹʹసారీ చందూ! నిన్ను ఇబ్బందిపెట్టాను. వెరీ సారీ.ʹʹ

చందు ఆశ్చర్యపోయాడు. సారికలో ఇంత తొందరగా మార్పు వస్తుందనుకోలేదు. చెప్పేవాళ్ళు లేకగాని నిజానికి సారిక మంచి పిల్లే అనుకున్నాడు.

తాను సారీ చెప్పినా చందు ఏమీ అనకపోయేసరికి

ʹʹచందూ! అయాం సారీ!ʹʹ అంది మళ్ళీ.

ʹʹఫరవాలేదుʹʹ అంటూ నవ్వాడు చందు.

ʹʹఇవన్నీ ఎవరు చెప్పారు నీకు?ʹʹ ఆశ్చర్యంగా అడిగింది సారిక.

చందు మళ్ళీ నవ్వాడు. అంతే... మాట్లాడలేదు.

చందు మాట్లాడకపోయేసరికి

ʹʹనేనంటే అసహ్యం వేస్తోందా?ʹʹ అడిగింది సారిక.

ʹʹలేదు. అలాంటిదేమీ లేదు.ʹʹ

ʹʹఏం? ఎందుకు?ʹʹ

ʹʹమీరు మంచివారు గదా?ʹʹ

ʹʹనేనెలా మంచిదాన్ని?ʹʹ

ʹʹమంచిగా మారినవాళ్ళు కూడా మంచివాళ్ళే.ʹʹ

ఆ మాటకు సారిక కదిలిపోయింది. చందులో ఒక నిజమైన స్నేహితుడు కనిపించాడామెకు. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ʹʹనాతో ఫ్రెండ్‌గా ఉండగలవా మరి?ʹʹ అంది సారిక కళ్ళు తుడుచుకుంటూ.

ʹʹతప్పకుండాʹʹ అన్నాడు చందు.

సారిక చేయి చాచింది. చందు ఆమెకు చేయి అందించాడు. సారిక, చందు చేయిని ముద్దుపెట్టుకుంది. ఆ ముద్దులో కోరికల వేడి లేదు. ఆప్యాయతల తడి ఉంది. చందుకు సంతోషంగా ఉంది.

ʹʹచందూ! నాకిప్పుడు నిజంగా ఆకలవుతున్నది.ʹʹ

ʹʹతినండి మరిʹʹ అన్నాడు చందు.

ʹʹఇక్కడ కాదు. రూం ఖాళీచేసి అందరితోపాటు క్రింద హాల్లో తిందాము.ʹʹ

ʹʹఏం?ʹʹ

ʹʹఅందరిలో నేనూ ఒకదాన్ని అనే ఫీలింగ్‌ కలుగుతుంది మొదటిసారిగాʹʹ అంది సారిక.

చందు మాట్లాడలేదు.

బ్యాగులు సర్దింది సారిక. రిసిప్షన్‌కు ఫోన్‌ చేసి రూం ఖాళీ చేస్తున్నట్టు చెప్పింది.

రెండు బ్యాగులూ పట్టుకున్నాడు చందు. అందులోంచి ఒక బ్యాగును సారిక తీసుకుంది. క్రిందికి దిగారు.

తర్వాత ఇద్దరూ టిఫిన్‌ తిన్నారు. చందుకు ఆకలిగా లేకపోయినా కొద్దిగా తిన్నాడు.

ʹʹనన్ను ఇంట్లో దించి వెళ్ళిపో చందూ! మొండికేసి జ్వరంగా ఉందన్నా నిన్ను కావాలని పిలిపించాను. సారీ.ʹʹ బ్రతిమిలాడుతున్నట్టు ముఖం పెట్టింది.

ʹʹఅంతమాటద్దు. నాకు జ్వరం తగ్గిందిʹʹ అన్నాడు చందు.

ʹʹఐనా ఫరవాలేదు. ఇంటికే పోదాంʹʹ అంది సారిక.

కారు సారిక ఇంటివైపు పరుగుతీసింది.

సాయంత్రం ఆరు గంటల వరకే ఇల్లు చేరుకున్నాడు చందు. కాసేపుండి చెల్లిని వెంటబెట్టుకొని, కావలసిన కాగితాలన్నీ తీసుకొని పాన్‌ కార్డు కోసం ఇంటర్నెట్‌ షాపుకు పోయాడు. అమ్మను తర్వాత తీసుకపోదామనుకున్నాడు.

ʹʹఇద్దరివి కలిపి ఐదు వందలివ్వండిʹʹ అన్నాడు ఇంటర్నెటాయన. ఐదు వందలిచ్చాడు చందు.

ʹʹఐదు నిమిషాలు కూర్చొండిʹʹ అన్నాడు షాపతను.

అక్కడున్న కుర్చీలలో కూర్చున్నారిద్దరు.

వాస్తవానికి చందు దగ్గర అంతకుముందు చిల్లర లేదు. నిన్న ఆడిటర్‌ దగ్గరనుండి వస్తున్నపుడు ఒకతని దగ్గర కమీషన్‌ ఇచ్చి రెండు వేల నోటొకటి చిల్లర చేశాడు. చిల్లరిచ్చినాయన పేరు ఆనంద్‌.

ఆనంద్‌ కమీషన్‌ తీసుకొని చిల్లర ఇస్తాడని చందుకు కూడా మొదట తెలియదు. ఆడిటర్‌ దగ్గర కూర్చున్నవాళ్ళు మాట్లాడుకుంటుండగా ఆనంద్‌ పేరు విన్నాడు. తనకు కూడా అవసరమే కదా అని వాళ్ళను అడిగి అడ్రసు తీసుకున్నాడు. తర్వాత చిల్లర కోసం అక్కడికి వెళ్ళాడు.

చందు, ఆనంద్‌ దగ్గరికి పోయేటప్పటికి అక్కడ ముగ్గురున్నారు. వారు కూడా చిల్లర కోసం వచ్చినవారే.

ʹʹఆనందన్నా! మాకు దొరకడం లేదు. నీకెక్కడ దొరుకుతున్నాయి వందనోట్లు?ʹʹ ఆ ముగ్గురిలో ఒకతనన్నాడు.

ʹʹఊరికే దొరుకుతున్నాయనుకుంటున్నారా? 5 శాతం కమీషన్‌కు నేను తెస్తున్నాను. 10 శాతం తీసుకొని మీకు ఇస్తున్నానుʹʹ అన్నాడు ఆనంద్‌.

ʹʹఅంతా కమీషన్లమయమేʹʹ అన్నాడు ఇంకొకాయన.

ʹʹపెద్దనోట్ల రద్దు మహిమʹʹ అన్నాడు మరొకాయన.

ʹʹనాదేం లెక్క? 10 శాతమే! 20 శాతం కమీషన్‌తో కొందరు పాత నోట్లు కూడా మారుస్తున్నారు. వారినేమనాలి?ʹʹ మళ్ళీ అన్నాడు ఆనంద్‌.

ʹ20 శాతమా?ʹʹ

ʹʹఔను. అవసరాన్నిబట్టి 30 శాతం కూడా.ʹʹ

ʹʹఆ!ʹʹ అంటూ ఆశ్చర్యపోయాడు అడిగినాయన.

ʹʹఏం చేస్తారు మరి? అందరికీ బ్యాంకు ఖాతాలుంటాయా? కొందరికి ఉండవు. కొత్త ఖాతా కావాలంటే ఇప్పుడు బ్యాంకువాళ్ళు వెంటనే ఇవ్వడంలేదు. ఆధార్‌ అని, అడ్రసు ప్రూఫని, పాన్‌ కార్డు అని, అదీ అని, ఇదీ అని సవాలక్ష కాగితాలడుగుతున్నారు. అవన్నీ లేనివారు ఏం చేస్తారు మరి? అవసరాలాయె! ఎంతకో అంతకు మాట్లాడుకొని మార్చుకుంటున్నారుʹʹ చెప్పాడు ఆనంద్‌.

ఈ సంభాషణ వింటున్న చందు ఆనంద్‌తో మాట కలిపాడు.

ʹʹఅన్నా! ఎంత డబ్బైనా మారుస్తారా?ʹʹ అని అడిగాడు ఉత్సాహంగా.

ʹʹఆ! మార్చుతారు. వాళ్ళదేముంది? వాళ్ళకు బ్యాంకు వాళ్ళతో, ఇతరులతో సంబంధాలుంటాయి. వాళ్ళకింత కమీషన్‌. వీళ్ళకింత కమీషన్‌.ʹʹ

ʹʹఅంతా కమీషన్లమయమే.ʹʹ ఇదువరకు అన్నాయన మళ్ళీ అన్నాడు.

ʹతమ దగ్గరున్న పాతనోట్లు మార్చుకుందామా? జగద్గిరిగుట్టవాళ్ళ సమస్య తీరిపోతుంది. ఎలాగూ పాన్‌ కార్డు ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. అది రాంది బ్యాంక్‌ అకౌంటు తీసేటట్టు లేదుʹ అనిపించింది చందుకోక్షణం. కాని ʹఅమ్మనడగాలిʹ అనుకొని ఆనంద్‌తో ఆ విషయం మాట్లాడలేదు.

చందు తన దగ్గరున్న రెండువేల నోటు ఒకటి చిల్లర కోసం ఆనంద్‌కిచ్చాడు. అతడు 10 శాతం ఉంచుకొని మిగతా 18 వంద నోట్లిచ్చాడు. అవి తీసుకొని ఆనంద్‌ను అడిగాడు చందు.

ʹʹఅన్నా! పాతనోట్లు మార్చేవాళ్ళు నీకు తెలుసా?ʹʹ అని

ʹʹఆ తెలుసు, ఒకరిద్దరికి మార్పించాను కూడా. ఏం? నీదగ్గరున్నాయా?ʹʹ

చందు ఉన్నాయని చెప్పలేదుగాని,

ʹʹఈ విషయంలో నీకోసారి కలుస్తానన్నాʹʹ అన్నాడు.

ʹʹఅలాగే తమ్మీ! ఉంటే మార్చుకో. చాలా నమ్మకస్తులు వారు. రెండు రోజుల్లో కొత్తనోట్లిస్తారుʹʹ అన్నాడు ఆనంద్‌.

ఆనంద్‌ ఫోన్‌ నంబరు తీసుకొని బయటకు వచ్చాడు చందు.

అతడు బ్యాంకు దగ్గర లైన్లో నిలుచున్నపుడు కూడా ʹప్రైవేటు వ్యక్తులు కొందరు కమీషన్‌ తీసుకొని పాతనోట్లను మారుస్తున్నారనిʹ విన్నాడు. ఇప్పుడు ఆనంద్‌ దాన్ని ధృవీకరించాడు.

ఈ విషయాన్ని అమ్మనడిగి ఆలోచించాలనుకున్నాడు చందు.

చందు ఆలోచనలకు బ్రేక్‌ వేస్తూ ఇంటర్నెటాయన పిలిచాడు. చందు ఆయనడిగిన కాగితాలిచ్చాడు. పెట్టమన్నచోట సంతకాలు పెట్టారిద్దరు. వేలిముద్రలు కూడా ఇచ్చారు.

తమిద్దరి పని అయిపోయాక అమ్మ సంగతడిగాడు చందు.

ʹʹఅన్ని కాగితాలు తీసుకొని, అమ్మను కూడా తీసుకురండిʹʹ అన్నాడాయన.

ʹʹఅమ్మ రావలసిందేనా?ʹʹ అని అడిగాడు చందు.

ʹʹరావాలి. వేలిముద్రలు కావాలిగదా?ʹʹ

ʹʹసరే!ʹʹ

అంటూ ఇద్దరూ బయటకు వచ్చారు. నడుస్తూ అన్నాడు చందు, లతతో

ʹʹఅమ్మ వస్తుందటావా?ʹʹ అని.

ʹʹఏమో అన్నా! నాలుగైదు రోజులుగా అమ్మ అదోలా ఉంటోంది. ఒక్క క్షణం కూడా అప్పటినుండి బయటకు రాలేదు. వస్తుందని నమ్మకం నాకు లేదు.ʹʹ

ʹʹఅడిగి చూద్దాం.ʹʹ

ʹʹరాకుంటే మాత్రం ఏమిటి? మన రెండు ఖాతాలు చాలవా అన్నా!ʹʹ అంది లత.

అది కూడా కరక్టే అనిపించింది చందుకు.

ʹʹచాలులే! పాన్‌ కార్డులు వచ్చినపుడు గదా ఖాతాల సంగతి?ʹʹ అన్నాడు చందు.

ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.

ʹఅమ్మను ఇబ్బంది పెట్టడం ఎందుకులేʹ అనుకొని ఇద్దరు కూడా పాన్‌ కార్డు ప్రస్తావన అమ్మదగ్గర తేలేదు.

No. of visitors : 569
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •