ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు

| సాహిత్యం | వ్యాసాలు

ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు

- గ్రోవర్ ఫర్ | 06.03.2018 10:23:19am

ట్రాట్స్కీరచనలుప్రపంచవ్యాపితంగా చిరకాలంగాకమ్యూనిష్టు వ్యతిరేకులకు మూలాధారంగా ఉన్నాయి.కాని ఈ రచనలు అబద్ధాల పుట్టలు. 1930 దశకంలో ట్రాట్స్కీఉద్దేశ పూర్వకంగానే తనరచనలలో జోసెఫ్ స్టాలిన్ గురించీ, సోవియట్ యూనియన్ గురించీ అసత్యాలు రాశాడు. దశాబ్దాలుగా ప్రజలను మోసగించిన, నిజాయితీపరులైన కమ్యూనిష్టులను నిరుత్సాహపరచిన ట్రాట్స్కీ అసత్యాలలో కొన్నింటిని, నా కొత్త పుస్తకం ʹట్రాట్స్కీ కట్టుకధలు (Trotskyʹs Amalgams)ʹ లో చర్చించాను.

హార్వర్డ్ యునివర్సిటీలోని ట్రాట్స్కీ పత్రాల సంగ్రహాలయంలోని పత్రాలను పరిశీలించడానికి1980లో చారిత్రక పరిశోధకులకు అనుమతి లభించింది. కొద్ది రోజులలోనే పియరీబ్రౌ(Pierre Broué)అనే ప్రముఖ ట్రాట్స్కీయిష్టు చరిత్రకారుడు ట్రాట్స్కీ అసత్యాలు చెప్పాడని గుర్తించాడు.

ట్రాట్స్కీయిస్టులతో సహా సోవియట్ యునియన్ లో రహస్య ముఠా లేవీ లేవని ట్రాట్స్కీ చెబుతుండేవాడు.రహస్య ముఠాలున్నాయనే సోవియట్ ప్రభుత్వ ఆరోపణను ట్రాట్స్కీʹఅమాల్గంʹ అనేవాడు- అంటే ఇదంతా స్టాలిన్ అల్లిన కట్టుకధ అని. 1937జనవరిలోనూ, 1938 మార్చిలోనూ జరిగిన రెండవ, మూడవ మాస్కో విచారణలలో ఈ ʹముఠాʹ మీదే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ట్రాట్స్కీ పత్రాల సంగ్రహాలయంలో లభ్యమయిన ట్రాట్స్కీ, అతని కుమారుడు లియోన్ సెడోవ్ రాసిన ఉత్తరాలను నిదర్శనంగా చూపించి, ఆటువంటి విద్రోహ ముఠాలు సోవియట్ యూనియన్ లో ఆ కాలంలో ఉన్నాయని బ్రౌ నిరూపించాడు.

ట్రాట్స్కీ నేరస్తుడని నిరూపించడానికి తోడ్పడే పత్రాలను ట్రాట్స్కీ పత్రాల సంగ్రహాలయం నుండితొలగించారనీ, కాని ఆతొలగింపు అసంపూర్తిగా జరిగిందనీ, అన్ని పత్రాలనూ తొలగించలేకపోయారనీ, 1985లో అమెరికాకు చెందిన చరిత్రకారుడు ఆర్చ్ గెట్టి(Arch Getty)వెల్లడించాడు. సోవియట్ యునియన్ లోని తన పాత మిత్రులతో ట్రాట్స్కీ సంబంధాలు కొనసాగించాడనడానికి ఆధారాలను కూడా గెట్టి గుర్తించాడు.తన విధానాలను బహిరంగంగాతిరస్కరించి, స్టాలిన్ ముందు మోకరిల్లిన వారందరితో సబంధాలను తెగతెంపులు చేసుకున్నానని చెప్పిట్రాట్స్కీ ఈ ఆరోపణను తిరస్కరించేవాడు. ఇక్కడా ట్రాట్స్కీ మళ్ళీ అబద్ధమే చెప్పాడు.

1936 ఆగష్టు నాటి మొదటి మాస్కో విచారణలలో వెల్లడయినʹబ్రిస్టల్ హోటల్ʹ ప్రశ్న కు సంబంధించి, స్వీడిష్ చరిత్రకారుడు స్వెన్-ఎరిక్ హోమ్ స్ట్రోమ్(Sven-Eric Holmström) 2010లో ఒక వ్యాసాన్ని ప్రచురించాడు. అందులో ఆతను ట్రాట్స్కీ ఈ విషయంలో కూడా అబద్దాలే చెప్పాడని నిరూపించాడు.

నికెటా కృశ్చేవ్ తన రహస్య ప్రసంగంలో స్టాలిన్, బెరియాలపై చేసిన అన్ని ఆరోపణలనూ నేను 2005లోఒక క్రమ పద్దతిలో అధ్యయనం చెయ్యడం ప్రారంభించాను. స్టాలిన్ పై కృశ్చేవ్ బహిరంగంగాచేసిన ʹస్టాలిన్ అకృత్యాలుʹ అనే ఆరోపణలలో కనీసం ఒక్కదానికి కూడా ఆధారాలు లేవని నా పరిశోధనలో వెల్లడైంది.

1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే చెప్పాడు అన్న వాస్తవాన్ని రుజువు చేస్తుంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో ట్రాట్స్కీ అసత్యాలు చెప్పాడనే విషయాన్ని నేను ఇంతకు ముందే బ్రౌ, గెట్టీ(Broué and Getty)ల రచనల ద్వారా తెలుసుకున్నాను. ఒక అపరాధక పరిశోధక కధలో అపరాధ పరిశోధకుడు, అనుమానితుడు కొన్ని ముఖ్యమైన విషయాలలో అబద్ధాలు చెబుతున్నాడని గ్రహించినప్పుడు, తనకు తాను ఒక ప్రశ్న వేసుకుంటాడు: ఈ వ్యక్తి ఇంకా ఏమేమి అబద్ధాలు చెబుతున్నాడు?

ట్రాట్స్కీవ్యాఖ్యలలో ఏవి పరీక్షకు నిలబడతాయో నిర్ణయించుకుందామని నేను అతని రచనలను అధ్యయనం చెయ్యడం ప్రారంభించాను. ట్రాట్స్కీ స్టాలిన్కు వ్యతిరేకంగా చేసిన నిందారోపణలలో నిజానిజాలను సరి చూడడానికి స్వతంత్రంగా సాక్ష్యాధారాలు లభించినప్పుడల్లా ట్రాట్స్కీ పదే పదే అబద్ధాలు చెబుతున్నాడని రుజువు దొరికింది. అందుబాటులో ఉన్న స్వతంత్ర ఆధారాలను పరిశీలించిన ప్రతిసారీ ట్రాట్స్కీ అబద్ధాలాడుతున్నాడని నేను గుర్తించాను.

ఇప్పుడు నా వద్ద చాలా ఆధారాలున్నాయి. వాటన్నిటినీ వివరించడానికి ఒక మహా గ్రంధం సరిపోదు. అందుచేత ట్రాట్స్కీ అబద్ధాలను వివరిస్తూ మరి రెండు సంపుటాలను ప్రచురిస్తున్నాను. రెండవ సంపుటం2017 మొదటి బాగంలో వెలువడుతుంది.

లెనిన్ గ్రాడ్ ఫస్ట్ సెక్రెటరీ సెర్జీ మిరోనోవిచ్ కిరోవ్ (Sergei Mironovich Kirov) 1934 సంవత్సరంలో డిసెంబరు 1వ తేదీన హత్య చెయ్యబడ్డాడు. ఈ హత్య వివరాలను పరిశోధించి, సెప్టెంబరు2010- జనవరి2013ల మధ్య ఒక పుస్తకం రాశాను. ఈ పుస్తకం,ʹసెర్జీ కిరోవ్ హత్యʹ (The Murder of Sergei Kirov), జూన్ 2013లో ప్రచురింపబడింది.

1934 తర్వాత, ఆ దశాబ్దంలో సోవియట్ రష్యాలో సంభవించిన అన్ని రాజకీయ పరిణామాలకూ కిరోవ్ హత్యే కీలకమైనది. తరచు ʹవిచారణ నాటకాలుʹ అని చెప్పబడే 1936ఆగష్టు, 1937 జనవరి, 1938 మార్చి లలో జరిగిన మూడు బహిరంగ మాస్కో విచారణలు; సైనిక ప్రక్షాళన లేదా 1937 మే, జూన్ లనాటి తుఖాచ్ వస్కీ ఉదంతం (Tukhachevsky Affair); నిజాయితీ లోపించిన రాబర్ట్ కాంక్వెస్ట్ రచన "ద గ్రేట్ టెర్రర్(మహా భీభత్సం)" ప్రచురణ తర్వాత అదే పేరుతోకమ్యూనిష్టు వ్యతిరేకులు వర్ణించే 1937జులై - 1938 అక్టోబర్లనాటిʹయఝోవిశ్చినాʹ(Ezhovshchina- యఝోవ్ ఉన్మాదం) లాంటి సంఘటనలకు కిరోవ్ హత్యే కీలకమైనది.

ట్రాట్స్కీ కూడా కిరోవ్ హత్యా విచారణల గురించి వ్యాసాలు రాశాడు. తన వ్యాసాలలో చెప్పిన విషయాలను ఫ్రెంచ్ కమ్యూనిష్టు పత్రికలలోనూ, సోవియట్ పత్రికలోనూ తాను చూశాననిట్రాట్స్కీ రాశాడు. కిరోవ్ హత్యా విచారణలపైఈ వ్యాసాలలో కూడా ట్రాట్స్కీ అబద్ధాలు చెప్పాడని నేను గుర్తించాను.

స్టాలిన్, అతని అనుచరులూ, కిరోవ్ హత్యా సూత్రధారులని ట్రాట్స్కీ ఒక కధ అల్లాడు. మాస్కోలో రష్యన్ భాషలో పత్రికలు ముద్రించబడిన రెండు రోజులలోనే (విదేశాలలో ఉన్న) ట్రాట్ స్కీ కి చేరేవి. ఈ రష్యన్ పత్రికలలోనూ, ఫ్రెంచ్ కమ్యూనిష్టు పత్రిక ʹహ్యూమనైట్(Humanité)ʹ లోనూ, ప్రచురింపబడిన వ్యాసాలు ఏం చెప్పాయి అనే విషయంలో ట్రాట్స్కీ మళ్ళీ అబద్దమాడాడు.

తాను జాగ్రత్తగా చదివి విశ్లేషించానని ట్రాట్స్కీ చెప్పిన ఫ్రెంచ్, రష్యా వార్తాపత్రికలలోని వ్యాసాలనూ, ట్రాట్స్కీ వ్యాసాలనూ పక్క పక్కనే పెట్టి చదివిన ఎవరికైనా ట్రాట్స్కీ అబద్ధాలు చెబుతున్నాడనేది వెంటనే స్పష్టమయ్యేది. కాని ఇప్పటివరకూ ఎవ్వరూ అది చెయ్యనట్లు కనుపిస్తున్నది.

దీని పర్యవసానమేమిటంటే, స్టాలిన్, ఎన్. కె. వి. డి.అధికారులు కిరోవ్ ను హత్యచేశారని ట్రాట్స్కీ అల్లిన కట్టు కధను ట్రాట్స్కీ అనుయాయులే కాకుండా నికెటా కృశ్చేవ్ కూడా మనకు వినిపించాడు.

పూర్తిగా అబద్ధాలతో నిండిన తన రహస్య ప్రసంగంలో కృశ్చేవ్, ʹస్టాలిన్ కిరోవ్ ను హత్య చేశాడనేʹ కట్టు కధకు మరింత ఊతమిచ్చాడు. బహుశాకృశ్చేవ్, అతని ప్రసంగ రచయితలూ, దీనిని ట్రాట్స్కీ రచనల నుండి గ్రహించి ఉంటారు.ʹస్టాలిన్ కిరోవ్ ను హత్య చేశాడనేʹ ట్రాట్స్కీ కట్టుకధను కృశ్చేవ్ నుంచి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారమే వృత్తిగా స్వీకరించిన రాబర్ట్ కాంక్వెస్ట్ లాంటిఇతర కమ్యూనిష్టు వ్యతిరేక ప్రచారకులు అందుకున్నారు.

1980 దశాబ్దపు చివరి భాగంలోగోర్బచేవ్ మనుషులు ఈ కట్టుకధకు ఆధారాలను సోవియట్ పత్రాల భాండాగారాల(ఆర్కైవ్స్) నుంచి సంపాదించడానికి విఫల ప్రయత్నం చేశారు. సైద్దాంతిక విషయాలలో గోర్బచేవ్ ప్రధాన సలహాదారుడు అయిన అలెగ్జాండర్ యకోవ్లేవ్(Aleksandr Iakovlev),గోర్బచేవ్ మనుషులను మరో ప్రయత్నం చెయ్యమన్నాడు. మరో ప్రయత్నం తర్వాత కూడా పాలిట్ బ్యూరో పరిశోధనా బృందంస్టాలిన్ కిరోవ్ ను హత్య చేశాడని నిరూపించడానికి ఆధారాలను సంపాదించ లేకపోయింది.

ట్రాట్స్కీఉద్దేశ పూర్వకంగా చెప్పిన అనేక అబద్దాలనుకృశ్చేవ్, గోర్బచేవ్ వంటి సోవియట్ కమ్యూనిష్టు వ్యతిరేకులూ, పెట్టుబడిదారీ అనుకూల కమ్యూనిష్టు వ్యతిరేకులూ అందుకున్నారనడానికి ఒక మంచి ఉదాహరణʹస్టాలిన్ కిరోవ్ ను హత్య చేశాడనేʹ కట్టుకధ చరిత్ర,

నా కొత్త పుస్తకం ʹట్రాట్స్కీ కట్టుకధలుʹలో స్టాలిన్, యూ.ఎస్.ఎస్.ఆర్ లగురించి ట్రాట్స్కీఉద్దేశపూర్వకంగా చెప్పిన అనేక అబద్ధాలు కప్పుకున్న ముసుగును నేను తొలగించి చర్చించాను. ఈ అబద్ధాలన్నింటినీ కమ్యూనిష్టు వ్యతిరేకులూ, ట్రాట్స్కీ వాదులూ ప్రచారంలో పెట్టారు. ఈ పుస్తకం రెండవ, మూడవ సంపుటాలలో సోవియట్ రష్యాలో ఉన్నవిచ్చిన్న కారులతోనూ, ఫాసిస్టులతోనూ; జర్మన్, జపాన్ సైనికాధికారులతోనూ చేతులు కలిసి ట్రాట్స్కీపన్నిన కుట్రల గురించి వివరిస్తాను.

1936ఆగష్టు -1937జనవరి మధ్యకాలంలో, ʹమాస్కో విచారణ నాటకాలుʹ అని కమ్యూనిష్టు వ్యతిరేకులు వర్ణించే మాస్కో విచారణలలో ట్రాట్స్కీకి వ్యతిరేకంగా వచ్చిన నేరారోపణలలో నిజా నిజాలను నిర్ధారించడానికీ, విచారణ జరపడానికీ,1937లో ప్రఖ్యాత విద్యావేత్త ʹజాన్ డ్యూయీ(John Dewey)ʹ తోనూ, మరి కొంతమందితోనూ కూడిన ఒక విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయించడంలోట్రాట్స్కీ సఫలమయ్యాడు. (అమెరికన్ కమిటీ ఫర్ డిఫెన్స్ ఆఫ్ లియాన్ ట్రాట్ స్కీ అనే ట్రాట్స్కీయిస్టు ముఠా ఈ కమిషన్ ఏర్పాటు వెనుక ఉంది - అనువాదకుడు).ఆ విచారణ కమిషన్ ట్రాట్స్కీ నిర్దోషి అనీ, మాస్కో విచారణలన్నీ కల్పనలనీ నిర్ధారించింది.

నేను 1,000పేజీల డ్యూయీ విచారణకమిషన్ పత్రాలను జాగ్రత్తగా చదివాను. ఆ కమిషన్ లో నిజాయితీ లోపించిందనీ, చాలా అసమర్ధంగా పనిచేసిందనీ నేను గుర్తించాను. తార్కికంగా నిజాలను వెలికి తీయడంలో ఈ కమిషన్ ఒక దాని వెనుక ఒకటి అనేక తప్పులను చేసింది.

డ్యూయీ విచారణకమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ట్రాట్స్కీ అనేక మార్లు అబద్ధాలు చెప్పాడు అనేది అతి ముఖ్యమైన విషయం. ట్రాట్స్కీ తమతో అబద్ధాలు చెబుతున్నాడని కమిషన్ సభ్యులకు తెలిసి ఉంటే డ్యూయీకమిషన్ ట్రాట్స్కీ నిర్దోషి అని తీర్పు ఇచ్చి ఉండేది కాదు.

నా పుస్తకంలోని రెండు భాగాలను సంక్షిప్తంగా వివరించాలనుకుంటున్నాను. అవి, మొదటిది మాస్కో విచారణల సాక్ష్యాలనుపరిశీలించి, నిజాన్ని నిర్ధారించే, అంటే సరిచూసే, నా ప్రణాళిక.రెండోది, సోవియట్ చరిత్రను అధ్యయనం చేసే వారిలో చాలామంది చేస్తున్న తప్పులను పరిశీలించడం. ఈ తప్పుల కారణంగా వారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ప్రాముఖ్యతను గుర్తించలేక పోతున్నారు.

మూడు మాస్కో విచారణలలోనూ ముద్దాయిలిచ్చిన సాక్ష్యాలునిజం కావనీ, నిరపరాధులనుండి ప్రాసిక్యూషన్, ఎం.కె.వి.డి., స్టాలిన్ లు బలప్రయోగం ద్వారా సేకరించినవనీ, అందరూ ప్రకటిస్తున్నారు, కాని ఈ అభిప్రాయాన్ని సమర్ధించడానికి ఇసుమంతైనా సాక్ష్యాధారంలేదు. అయినప్పటికీ ట్రాట్స్కీ వాదులూ, సోవియట్ చరిత్రలో ʹస్పెషలిస్టులూʹఢంకా బజాయించి ఈ ఆరోపణను చేస్తూనే ఉన్నారు.

మూల పత్రాలను గుర్తించడానికి, వెతికిపట్టుకోవడానికి,ఎక్కడున్నాయో తెలుసుకొనడానికి, సంపాదించడానికి, వాటిని అధ్యయనం చెయ్యడానికి నేను సంవత్సరాలు వెచ్చించిన కారణంగా, మాస్కో విచారణలలో ముద్దాయిలిచ్చిన అనేక వాంగ్మూలాలను పరిశీలించి ఒక నిర్ధారణకు రావడానికి ఇప్పుడు తగిన సాక్ష్యాధారాలున్నాయని నేను గమనించాను.
మాస్కో విచారణలలోని ముద్దాయిలిచ్చిన అనేక వాంగ్మూలాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ధారణ చేసుకోవడానికిʹట్రాట్స్కీ కట్టుకధలుʹ లోని మొదటి పన్నెండు అధ్యాయాలనూ వినియోగించాను. మాస్కో విచారణలలో ముద్దాయిలిచ్చిన వాంగ్మూలాలను, ఇప్పుడు అందుబాటులో ఉన్న స్వతంత్ర సాక్ష్యాల వెలుగులో తిరిగి పరిశీలించడానికి అవకాశం ఉన్న ప్రతీసారీ వారు నిజమే చెబుతున్నారని తేలింది.

ట్రాట్స్కీ, కృశ్చేవ్, అతనిముఠా, ప్రచ్చన్న యుద్ధకాల సోవియట్ చరిత్ర నిపుణులు, గోర్బచేవ్, అతని ముఠా, నేటి సోవియట్ అధ్యయనాల అకడమిక్ స్కాలర్లు - అందరూ విచారణలన్నీ కల్పితాలని చెప్పారు, చెబుతున్నారు. వారు చెప్పింది తప్పని నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాను. మాస్కో విచారణల వాంగ్మూలాలను, అంటే ముద్దాయిలఒప్పుకోళ్ళను,మాస్కో విచారణలకు వెలుపలా, సోవియట్ యూనియన్ కు వెలుపలా కూడా లభ్యమవుతున్న చాలా సాక్ష్యాధారాలతో పరిశీలించి నేను ఒక నిర్ణయానికొచ్చాను.

ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. సోవియట్ చరిత్రలోని ʹస్టాలిన్ వ్యతిరేక భావజాలంʹ తప్పని ఇది రుజువుచేస్తుంది. సోవియట్ చరిత్ర గురించి ట్రాట్స్కీ వ్యాఖ్యానం తప్పని రుజువు చెయ్యడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రాట్స్కీ సోవియట్ చరిత్ర గురించి చేసిన వక్రీకరణలను ట్రాట్స్కీయిస్టు ఉద్యమం నమ్మి ఈ నాడు ప్రపంచవ్యాపితంగా ప్రచారం చేస్తోంది. స్టాలిన్ కాలం నాటిసోవియట్ చరిత్రపై ముందే కొన్ని అభిప్రాయాలను ఏర్పరుచుకొని, ఆ అభిప్రాయాలను నిజమని నిరూపించాలని ప్రయత్నించడం కాకుండా, ఆ చరిత్ర గురించి వాస్తవాలను కనుగొనాలని కోరుకునే మా లాటిచరిత్ర పరిశోధకులూ, కార్యకర్తలూ, తదితరుల దగ్గర, అందరూ చెబుతూ వస్తున్న స్టాలిన్ వ్యతిరేక సోవియట్ చరిత్రను పూర్తిగా తోసిపుచ్చాడానికి తగినన్ని ఆధారాలున్నాయి. ఈ దిగువన కొన్ని వాస్తవాలను ఇస్తున్నాను:

" సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ లో కృశ్చేవ్ ప్రపంచాన్ని కుదిపి వేసిన రహస్య ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగంలో స్టాలిన్, లవెంట్రీ బెరియాల గురించి చేసిన ప్రతీ ఆరోపణ అసత్యాలతో కూడినది. కృశ్చేవ్ మనుషులు, స్టాలిన్, బెరియాలు చేశారన్న ʹనేరాలʹ గురించి ఏ రకమైన వాస్తవ సాక్ష్యాధారాలు కనుగొనలేకపోయారనీ, అందువలన కృశ్చేవ్ ఈ కట్టుకధలు అల్లవలసి వచ్చిందనీ దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది.

" 1962-1964లలో కృశ్చేవ్ నియమించిన ష్వెర్నిక్ కమిషన్ (Shvernik Commission) ఎంతోకాలం వెచ్చించి, సంగ్రహాలయాలన్నీ జల్లెడ పట్టినప్పటికీ, మాస్కో విచారణల ప్రతివాదులు కానీ, ʹతుఖాచ్ వస్కీ ఉదంతʹప్రతివాదులు కానీ, తప్పుడు కేసులలో ఇరికించబడి బలయ్యారనీ, లేదా తమ ఒప్పుకోళ్ళలో (confessions) అబద్ధాలు చెప్పారనీ అనడానికి ఏ అధారాలనూ సంపాదించ లేకపోయింది.

" గోర్బచేవ్, ఎల్సిన్లపరిశోధకులుగాని, ఆ తర్వాతి కాలం నాటి కమ్యూనిష్టు వ్యతిరేక పరిశోధకులుగాని, సోవియట్ పురాతన పత్రాల సంగ్రహాలయాలు ఈ పరిశోధకులకు బాహాటంగా తలుపులు తెరిచినా,కిరోవ్ హత్య, మాస్కో విచారణలు, సైనిక ప్రక్షాళనలో తీర్పులను సవాలు చెయ్యడానికి ఏ అధారాలనూ సంపాదించ లేకపోయారు.

" మాస్కో విచారణలలో ప్రతివాదులు ఇచ్చిన వాంగ్మూలాలు మొత్తం మీద వాస్తవమే.

" 1938జులై - 1939నవంబర్మధ్య కాలంలో జరిగిన హత్యా కాండనుచారిత్రక పరిశోధకులుʹయఝోవ్ ఉన్మాదం (Ezhovshchina)ʹ అనీ, కమ్యూనిష్టు వ్యతిరేక ప్రచారం చేసేవారుʹభయంకర భీభత్సం(The GreatTerror)ʹ అనీ వర్ణిస్తారు.ఈ హత్యాకాండకు, స్టాలిన్, సోవియట్ నాయకత్వంలోని ఆయన అనుచరులూ కాక యఝోవ్, యఝోవ్ ఒక్కడు మాత్రమే, బాధ్యుడు.

" కిరోవ్ హత్యానంతర కాలంలో యు.ఎస్.ఎస్.ఆర్. గురించి రాసిన తన రచనలలో ట్రాట్స్కీ తనకుట్రలను కప్పిపుచ్చుకోవడానికి పదే పదే అసత్యాలు రాశాడు.

" స్టాలిన్ యుగం నాటి సోవియట్ చరిత్ర గురించిపరిశోధనలు చేస్తున్న ఇప్పటి పరిశోధకులలో చాలామంది తమ పాఠకులను మోసగించడానికి అబద్ధాలు చెబుతున్నారు, కాని చాలా జాగ్రత్తగా వారుఉపయోగించుకున్న మూల పత్రాలను ఆమూలాగ్రం చదివితే తప్ప వారు అసత్యాలు రాస్తున్నారనేది తెలవని విధంగా వారు అబద్ధాలు చెబుతున్నారు.

ట్రాట్స్కీయిస్ట్ పండితులు, ప్రధానస్రవంతికి చెందిన కమ్యూనిస్టు వ్యతిరేక పండితుల మీద ఆధారపడుతున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ఇటీవలనే, స్టాలిన్ నుతీవ్రంగా వ్యతిరేకించే ట్రాట్స్కీయిస్టులʹప్రపంచ సోషలిష్టు వెబ్ సైట్ (wsws.org)ʹలో, ఒక ట్రాట్స్కీయిస్టువిశ్లేషకుడు, ప్రిన్సుటన్ యునివర్సిటీ చరిత్రకారుడు స్టీఫెన్ కొట్కిన్ రచన ʹస్టాలిన్ʹ ను సమీక్షిస్తూ, ʹఒలేగ్ ఖ్లేవ్ నుక్(Oleg Khlevniuk)ʹను గౌరవనీయుడైన రష్యన్ చరిత్రకారుడని వర్ణిస్తూ, అతని స్టాలిన్ వ్యతిరేక కధనాలను ఆమోదిస్తూ ఉటంకించాడు. - https://www.wsws.org/en/articles/2015/06/04/kot4-j04.html.

ఖ్లేవ్ నుక్ఒక కమ్యూనిష్టు వ్యతిరేక ఉన్మాది, పచ్చి అబద్దాలకోరు. అతని రచనలన్నీ అబద్దాలపుట్ట. ఖ్లేవ్ నుక్ స్టాలిన్ వ్యతిరేకి; wsws.org ఒక ట్రాట్స్కీయిస్ట్ ప్రచురణ సంస్థ, స్టాలిన్ వ్యతిరేక సంస్థ. ఆ కారణంగానే ట్రాట్స్కీయిస్టులు, ప్రపంచంలోకమ్యూనిష్టు వ్యతిరేక అబద్దాలకోరులలో అగ్రభాగాన నిలిచిన ఖ్లేవ్ నుక్ చెప్పేదినమ్ముతున్నారు!
అనేక దశాబ్దాలుగా ప్రధానస్రవంతి కమ్యూనిష్టు వ్యతిరేక పండితులు ట్రాట్స్కీ రచనలనుంచి ఉటంకిస్తూనే ఉన్నారు.

తాను అబద్దాలాడుతున్నాననిట్రాట్స్కీ కి తెలుసు. అతను ఈ క్రింది విషయాల గురించి అసత్యాలు చెప్పాడు:
" మితవాద, ట్రాట్స్కీయిస్టుల, జినోవీవైట్ల, తదితర కమ్యూనిష్టు వ్యతిరేకుల ముఠా గురించి:
" 1934డిసెంబరు లో జరిగిన కిరోవ్ హత్యలో తనపాత్ర గురించి;
" ʹతుఖాచ్ వస్కీ ఉదంతంʹ లో, జర్మనీ కాని, జపాన్ కాని సోవియట్ యూనియన్ మీద దాడి చేసినప్పుడు, స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకూ, ఎర్ర సైన్యాన్ని వెన్నుపోటు పొడవడానికీ, సైనికాధికారులు చేస్తున్న కుట్రలో తను కూడా చేతులు కలపడం గురించి:
" పరిశ్రమలలోనూ, రవాణాలోనూ, గనులలోనూ విధ్వంస చర్యలు సాగించడానికి ఫాసిస్టులతోనూ, సోవియట్ రష్యాలో ఉన్న తన అనుచరులతోనూ చేసిన కుట్ర గురించి:
" నాజీలతోనూ. జపాన్ సైనిక నియంతలతోనూ మంతనాలు జరుపుతూ తాను చేసిన కుట్రగురించి;
" తనకు నిజమేనని తెలిసిన మాస్కో విచారణలలో ప్రతివాదులపై ఆరోపణలు, వారి ఒప్పుకోళ్ళ గురించి:
తన పత్రిక ʹబులెటిన్ ఆఫ్ ద అపోజిషన్ʹ లో పదే పదే అబద్దాలనే రాస్తున్నానని ట్రాట్స్కీకి తెలుసు. డ్యూయీకమిషన్ కు తప్పుడు సమాచారమిచ్చానని ట్రాట్స్కీకి తెలుసు.

స్పెయిన్ అంతర్య్యుద్ధం.

తన సన్నిహిత సహచరులైనఏండ్రీస్ నిన్ (Andres Nin),ఎర్విన్ వుల్ఫ్(Erwin Wolf), కుర్ట్ లాండా(KurtLandau) లతో సహా, తన అనుయాయులందరికీ అబద్దాలే చెబుతున్నానని ట్రాట్స్కీ కి తెలుసు. ట్రాట్స్కీ సన్నిహిత రాజకీయ సహచరులలోనిన్ ఒకడు. 1931 లో నిన్, ట్రాట్స్కీతో సంబంధాలు తెగతెంపులుచేసుకున్నాడని భావించబడింది.కాని సోవియట్ యూనియన్ లో ఉన్న ట్రాట్స్కీ అనుచరులు, తమ ట్రాట్స్కీయిస్టు భావాలతో తెగతెంపులు చేసుకుని కమ్యూనిష్టు పార్టీవిధానాల పట్లవిశ్వాసాన్ని ప్రకటించడం ఒక మోసపూరిత చర్య అనీ, పార్టీలోనే ఉండి తమ రహస్య కుట్రలలో ఇతరులను రిక్రూట్ చెయ్యడానికి అలా చేశారనీ, నిన్1930లో ఒక ట్రాట్స్కీయిస్టు పత్రికలో రాశాడు.

అందుచేత, నిర్మాణం అనే అర్థంలో నిన్ ట్రాట్స్కీయిస్ట్ ఉద్యమంతో బహిరంగంగా సంబంధాలను తెగతెంపులు చేసుకున్నా, స్పెయిన్ లో అతని చర్యలు, ట్రాట్స్కీతో రహస్య సంబంధాలను కొనసాగించడానికి ఇది ఒక ముసుగు అని సూచిస్తున్నాయి. స్పానిష్ కమ్యూనిష్టు పార్టీ, స్పెయిన్ లోని సోవియట్ యన్.కె.వి.డి. విభాగం కూడా ఇలాగే అనుమానించాయి. సోవియట్ యూనియన్ కు, స్టాలిన్ కు వ్యతిరేకంగానూ, ట్రాట్స్కీ కి చాలా సన్నిహితంగానూ ఉండేPOUM పార్టీ నాయకులలో ఒక నాయకుడు అయ్యాడు నిన్.
ట్రాట్స్కీ రాజకీయ ప్రతినిధిగా ఎర్విన్ ఉల్ఫ్ స్పెయిన్ వెళ్ళాడు. హిట్లర్, ముసోలినీల మద్దతుతో తిరుగుబాటు చేస్తున్న స్పానిష్ ఫాసిష్టులతో స్పానిష్ రిపబ్లిక్ యుద్ధంలో మునిగి ఉన్న సమయంలో, ఆ రిపబ్లిక్ కు వ్యతిరేకంగా ʹవిప్లవంʹ తీసుకు రావడానికి నిన్ స్పెయిన్ వెళ్ళాడు.

మాస్కో విచారణలలో ట్రాట్స్కీ పై ఆపాదించబడిన నేరాలు కల్పితాలనీ, ట్రాట్స్కీ అమాయకుడనీ నమ్మి నిన్, ఉల్ఫ్ లు ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. స్టాలిన్ కాక ట్రాట్స్కీయే నిజమైన కమ్యూనిష్టు, విప్లవకారుడు అని వారు భావించారు, అలా భావించిన కారణంగా, లెనిన్ ఏ విధంగా చెయ్యాలని కోరుకుంటాడో ఆ విధంగా చెయ్యడానికి తాము స్పెయిన్ వెళుతున్నామని వారనుకున్నారు.

1937మేలో బార్సిలోనాలో స్పానిష్ రిపబ్లికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. POUM, స్పానిష్ ట్రాట్స్కీయిస్టులూ ఈ తిరుగుబాటులో ఉత్సాహంగా పాల్గొన్నారు.నిన్, ఉల్ఫ్, లాండాలు ఇది బోల్షివిక్ తరహావిప్లవానికి నాంది అని భావించినట్లు కనుపిస్తోంది. తాము లెనిన్ వంటి వాళ్ళమనీ, స్పానిష్, సోవియట్ కమ్యూనిష్టులు అలెగ్జాండర్ కెరెన్స్కీలాగా మోసపూరితమైన కమ్యునిష్టులనీ, స్పానిష్ రిపబ్లికన్ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రభుత్వమనీ, POUM బోల్షివిక్ పార్టీ అనీ వారు భావించినట్లుకనుపిస్తున్నది.
బార్సిలోనా మే డే తిరుగుబాటు, యుద్ధం మధ్యలో ఉన్న స్పానిష్ రిపబ్లిక్కుపై జరిగిన దుర్మార్గమైన వెన్ను పోటు. ఒక వారం లోపే అది అణచి వెయ్యబడింది. ఆ తరువాత స్పానిష్ పోలీసులూ, సోవియట్ ఎన్.కె.వి.డి.లు ట్రాట్స్కీయిష్టులనూ, POUM నాయకత్వాన్ని వేటాడడం ప్రారంభించాయి. ఆండ్రీస్ నిన్ ను సోవియట్, స్పానిష్ పోలీసులు అపహరించి, విచారణ జరిపి కాల్చివేశారు. ఇదే విధంగా లాండా, ఉల్ఫ్ లకు జరిగి ఉంటుంది.

జర్మనీ, జపాన్ లతోనూ, ʹతుఖాచ్ వస్కీఉదంతంʹలో భాగస్వాములైన సైనికాధికారులతోనూ కలిసి ట్రాట్స్కీ కుట్రపన్నుతున్నాడని మనకిప్పుడు తెలిసిన విషయం సోవియట్ ప్రభుత్వానికి అప్పుడే తెలుసు. కాని నిన్, ఉల్ఫ్ లకు నిశ్చయంగా ఇది తెలవదు. తాను అమాయకుడనని ట్రాట్స్కీ చెప్పినదానిని వారు నమ్మారు.
ట్రాట్స్కీకి అప్పుడే తెలిసిన, మనకు ఇప్పుడు తెలిసిన, విషయాలు ఆండ్రీస్ నిన్,ఎర్విన్ ఉల్ఫ్, కుర్ట్ లాండాలకు తెలిసి ఉంటే వారు ట్రాట్స్కీ ఆదేశాలను అమలుజేయడానికి స్పెయిన్ వెళ్లి ఉండే వారా? ట్రాట్స్కీ తన ఉద్దేశాలనూ, కార్యక్రమాలనూ కప్పిపుచ్చి, స్టాలిన్ ఏమిచేస్తున్నాడనే విషయంలో అబద్ధాలు చెప్పి వీళ్ళను అతిప్రమాదకరమైన పరిస్తితులలోకి నెట్టాడు. ట్రాట్ స్కీ అసత్యం వారి ప్రాణాలను బలిగొన్నది.

సోవియట్ యూనియన్ లో కాల్చివేతకు గురైన ఇతర ట్రాట్స్కీ అనుయాయుల విషయంలో కూడా ఇదే నిజం. స్పష్టంగా వారు వందలలో ఉన్నారు. స్టాలిన్ వర్గం ప్రపంచ విప్లవాన్ని వదిలివేసిందనీ, మాస్కో విచారణలు కల్పితాలనీ రాసిన ట్రాట్స్కీ రాతలను, ట్రాట్స్కీ చెప్పిన సోవియట్ చరిత్రను నమ్మినందున వీరంతా ట్రాట్స్కీ ని సమర్ధించారు. ట్రాట్స్కీ అబద్ధాలు చెప్పకుంటే వీరంతా అతనిని అనుసరించేవారు కాదు.

ʹట్రాట్స్కీ కట్టుకధలుʹ మొదటి ప్రకరణంలో, చరిత్ర అధ్యయనం తమ వృత్తిగా ఉన్నవారితో సహాసోవియట్ చరిత్ర విద్యార్ధులలో చాలామంది, ప్రాధమిక సాక్ష్యాధారాలను అధ్యయనం చెయ్యడంలో చేస్తున్న పొరపాట్లను పరిశీలించాను.

వాస్తవమేమిటంటే, చరిత్ర పరిశోధనను తమ వృత్తిగా స్వీకరించిన చరిత్రకారులతో సహా కొద్దిమందికి మాత్రమే చారిత్రిక ఆధారాలను ఎలా పరిశీలించాలనేది తెలుసు. సాక్ష్యాన్ని భౌతికంగా పరిశీలించడమంటే ఏమిటో కొద్దిమంది మార్క్సిస్టులకు మాత్రమే తెలుసు. ఒక భావవాద వాదం ఎదురైనప్పుడు దాన్ని గుర్తించగల, లేదా విమర్శించగల సామర్ధ్యం కొద్దిమంది మార్క్సిస్టులకు మాత్రమే ఉంది.

ఈ పొరపాట్లు, తాము ముందుగానే ఏర్పరుచుకున్న ట్రాట్స్కీ అనుకూల, స్టాలిన్ వ్యతిరేక అభిప్రాయాలు తప్పని నిరూపించబడటాన్ని ఇష్టపడని కొంత మంది వ్యక్తులు చేసే ʹతిరస్కరణʹ పొరపాట్లు మాత్రమే కాదు. ఈ తప్పులన్నింటిని, లేదా వీటిలో కొన్నింటిని, స్టాలిన్ అనుకూల, రివిజనిష్టు వ్యతిరేకులు కూడా చేశారు.పెట్టుబడిదారీ అనుకూల ప్రచ్చన్నయుద్ధ కాలం నాటి వాదనల రూపాలు మాత్రమే కాకుండా, పైకి కమ్యూనిష్టు అనుకూలంగా కనుపిస్తున్నా వాస్తవానికి కృశ్చేవ్-గోర్బచేవ్ యుగం నాటి కమ్యూనిష్టు వ్యతిరేక వాదనల రూపాలుకూడా మనలను ఎంతగా ముంచెత్తాయంటే, మన అందరి ఆలోచనలను ఈ వాదనలు దిగజార్చాయి. పియరీ బ్రౌ, ఆర్చ్ గెట్టిలు 30సంవత్సరాల క్రితం గుర్తించిన ట్రాట్స్కీ అబద్దాలను ఇంతకాలం పరిగణనలోకి తీసుకోలేదు. దీన్ని గురించి ఒక వివరణ ఇవ్వాలి.

1980, 1990 దశాబ్దాల కాలమంతా బ్రౌ ట్రాట్స్కీ అబద్దాలను గుర్తించి తన రచనలలో పేర్కొంటూనే ఉన్నాడు. కానీ ఈ అబద్దాలకు ఏమంత ప్రాముఖ్యత లేదని అతను కొట్టివేశాడు.
గెట్టి చేసిన రెండు ఆవిష్కరణలను బ్రౌ పరిగణన లోకి తీసుకోలేదు. మొదటిది, ట్రాట్స్కీ ఆర్కైవ్స్ నుండి ట్రాట్స్కీకి వ్యతిరేక సాక్ష్యాలుగా నిలుస్తాయని అనుమానించిన పత్రాలను తొలగించి ప్రక్షాళనం చేశారనేది.రెండవది, ట్రాట్స్కీ తాను అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకున్నానని ప్రమాణం చేసి చెప్పిన తర్వాత, రాడెక్(Radek) వంటి ప్రతిపక్ష కుట్రదారులతో సంబంధాలు కొనసాగించాడనేది. స్టాలిన్ యుగం నాటి సోవియట్ యూనియన్ చరిత్ర గురించి రాసే ప్రముఖ ట్రాట్స్కీయిస్టు చరిత్రకారుడు వాడిమ్ రోగోవిన్(Vadim Rogovin) బ్రౌ అబద్ధాలకు తోడుగా తన స్వంత అబద్దాలనుమరికొన్ని జోడించాడు.

ట్రాట్స్కీయిస్టులూ, ప్రచ్చన్నయుద్ధ వీరులూ బ్రౌ ఆవిష్కరణలను పూర్తిగా ఉపేక్షించడమో లేదా (ట్రాట్స్కీ చెప్పిన) అబద్ధాలు ఏమంత ప్రాముఖ్యతలేనివనే బ్రౌ వాదనను పునరుద్ఘాటించడమో చేస్తున్నారు. వారు ఆ విధంగా ఎందుకు చేస్తున్నారో మనం అర్దం చేసుకొనగలం. ట్రాట్స్కీ అబద్ధాలు చెప్పాడనే వాస్తవం, నేను ʹస్టాలిన్ వ్యతిరేక భావజాలంʹ అని పిలిచే, ట్రాట్స్కీయిస్టులూ, ప్రచ్చన్నయుద్ధ కాల కమ్యూనిష్టు వ్యతిరేక చరిత్రకారులు ప్రచారంలో పెట్టిన సోవియట్ చరిత్రను కూలద్రోస్తుంది.

ట్రాట్స్కీ అబద్ధాలుచెప్పి తీరాలి. సోవియట్ యూనియన్ లోనూ, బోల్షివిక్ పార్టీలోనూ ఉన్న తన అనుయాయులతో కలిసి, నాజీ జర్మనీ, సైనిక నియంతృత్వ జపాన్, ఫ్రాన్సు, బ్రిటన్ లతో కుమ్మక్కై, స్టాలిన్ ను కూలద్రోయడానికి ఆతను ఒక పెద్ద కుట్ర పన్నుతున్నాడు. కుట్ర ఎప్పుడూ రహస్యంగానేఉంటుంది. కుట్రకుఅబద్ధాలుఅవసరమవుతాయి.
ట్రాట్స్కీ ఎవరిని మోసగించాడు? స్టాలిన్ నూ, సోవియట్ ప్రభుత్వాన్నీ కాదు. ట్రాట్స్కీ అబద్దాలాడుతున్నాడనివారికి తెలుసు.

తన అనుయాయులను మోసం చెయ్యడానికి ట్రాట్స్కీ అబద్ధాలు చెప్పాడు అనే అభిప్రాయానికి మనం అనివార్యంగా చేరాలి. ట్రాట్స్కీ రాసినదల్లా వాళ్ళు మాత్రమే నమ్మారు. ట్రాట్స్కీ తన గురించి ప్రచారం చేసుకున్నట్లు, వారు ట్రాట్స్కీ నిజమైన సిద్ధాంతబద్ధ లెనినిష్టు అనీ, స్టాలిన్ అబద్దాలకోరనీ నమ్మారు.

ట్రాట్స్కీ జర్మనీ, జపాన్ లతో కుమ్మక్కయి కుట్ర పన్నినందున సోవియట్ రాజ్యద్రోహ నేరం కింద ట్రాట్స్కీయిజాన్ని సోవియట్ యూనియన్ లో నిషేధించినప్పుడు, ట్రాట్స్కీ పట్లఈ గుడ్డి విశ్వాసం సోవియట్ యూనియన్ లో ఉన్న ట్రాట్స్కీ అనుచరులలో అత్యధికుల ప్రాణాలను బలిగొన్నది. సోవియట్ యూనియన్ వెలుపల ఉన్న ట్రాట్స్కీ అనుచరులు అతని వ్యక్తి పూజ చేస్తూ తమ జీవితాలను గడిపారు. మాస్కో విచారణలలో సోవియట్ ప్రాసిక్యూటర్, ముద్దాయిలూ ట్రాట్స్కీ ఏ ద్రోహాలు చేస్తున్నాడని వెల్లడించారో, ఆ సమయంలో ట్రాట్స్కీ ఆ ద్రోహాలు చేస్తూనే ఉన్నాడు.

సోవియట్ యునియన్ చరిత్రపైనా, తద్వారా 20వ శతాబ్దపు ప్రపంచ చరిత్రపైనా ట్రాట్స్కీ వ్యక్తిత్వం ఒక బ్రహ్మాండమైన నీడను కప్పింది.1920లలో బోల్షివిక్ పార్టీని కుదిపివేసిన ముఠా కలహాలలో ట్రాట్స్కీ చాలా ప్రముఖమైన ప్రతిపక్ష నాయకుడు. ఏకైక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు. 1920లలో ఐక్య ప్రతిపక్ష పార్టీని స్థాపించిన వ్యక్తులను తన వైపు ఆకర్షించగలిగాడు. వారి కుట్రలు బోల్షివిక్ పార్టీకి, కొమింటర్న్ కు,ప్రపంచ కమ్యూనిష్టు ఉద్యమానికి కోలుకోలేని హాని చేశాయి.

ఉపసంహారం

ట్రాట్స్కీ అబద్దాలాడాడు, కృశ్చేవ్ అబద్దాలాడాడు,కాని ఈ వాస్తవాన్ని ఇంత కాలం ఉపేక్షించడం జరిగింది. దీని అర్దమేమిటి? కోట్లాదిమంది శ్రామిక ప్రజలనూ, మనలనూ వేధిస్తున్న ప్రధాన ప్రశ్నకూ, ఈ ఉపేక్షించడానికి మధ్య సంబంధం ఏమిటి? 20వ శతాబ్దపు ప్రపంచ కమ్యూనిష్టు ఉద్యమం ఎందుకు పతనమయింది?70సంవత్సరాల క్రితం ప్రారంభమైన, రెండవ ప్రపంచ యుద్ధంలో విజయవంతమైన, చైనా కమ్యూనిష్టు విప్లవంలో, ప్రపంచవ్యాపితంగా వలసవాద వ్యతిరేక పోరాటాలలో విజయవంతమైన, పెట్టుబడి దారీ విధానాన్ని కూలద్రోసి, ప్రపంచ మంతా సోషలిజం విజయాన్ని సాధ్యం చేసినట్లు కనుపించిన, ఉద్యమం ఎందుకు పతనమయింది?

పాత కమ్యూనిష్టు ఉద్యమం ఎందుకు పతనమయ్యిందో మనకు తెలుసనీ, భవిష్యత్తులో ఇటువంటి పతనం తిరిగి చోటుచేసుకోకుండా మనం వేరే విధంగా ఎలా చెయ్యాలో తెలుసుకున్నామనీ, కార్మికులనూ, విద్యార్ధులనూ, ఇతరులనూ ఒప్పించడమెలా? మనం ఈ సమస్యను అధ్యయనం చెయ్యవలసి ఉంది. భిన్నదృక్కోణాలనుంచి చర్చించాల్సి ఉంది.
అందుకోసం లెనిన్ కాల, ప్రత్యేకించి స్టాలిన్ కాల, వారసత్వాన్ని మనం సమర్థించాలి. అదే సమయంలో మనం నిర్భయంగా ఆ కాలాన్ని విమర్శించాలి. వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ జరగకుండా చూడాలి. నా అభిప్రాయం ప్రకారం 20వ శతాబ్దపు అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమం పతనమవ్వడానికి దారితీసిన కారణాలను కనుగొనడం చారిత్రకంగా, సిద్ధాంత పరంగా ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న నేడు దోపిడీకి గురౌతున్న ప్రజానీకానికీ, మనవజాతిలోని అత్యధికులకూ చాలా ముఖ్యం.

ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం ధైర్యంగా ఆలోచించాలి, ʹఇంతకు ముందు ఎవ్వరూ వెళ్ళని చోటుకి వెళ్ళాలి.ʹʹమార్క్స్, ఏంగెల్స్ ల వద్ద అన్ని ప్రశ్నలకూ జవాబులున్నాయనిʹ, లేదా ʹలెనిన్ వద్ద అన్ని జవాబులూ ఉన్నాయనిʹ (చాలా మంది ట్రాట్స్కీ వాదులుʹట్రాట్స్కీ వద్ద అన్నిటికీ జవాబులున్నాయనిʹనమ్ముతారు) భావిస్తే - అలా నమ్మితే, మనం ఏమీ సాధించలేం.
మహత్తర చారిత్రక సంఘటనలు రెండుమార్లు సంభవిస్తాయనీ,ʹమొదటి మారు విషాదాంతంగానూ, రెండవమారు ప్రహసనంగానూʹ సంభవిస్తాయని మార్క్స్ చెప్పాడు. అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ విషాదాంతం అంతిమంగా అది విఫలం కావడమే.

ఎక్కడ తప్పుటడుగు పడిందో గుర్తించలేకపోతే మనం ఒక ʹప్రహసనంʹ గా మిగిలిపోవడం తథ్యం. అది మన రాజకీయ నేరం. అందుచేత మన వారసత్వాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాలి. మార్క్స్ ప్రఖ్యాత సూక్తి: ʹDe omnibus dubitandum - ప్రతీదానినీ ప్రశ్నించుʹ. ఈ ప్రశ్నకు మార్క్స్ కూడా అతీతుడు కాడు. నన్ను కూడా ప్రశ్నించమనే అన్నాడు. చరిత్ర ప్రత్యక్షంగా పాఠాలు నేర్పదు. చరిత్ర రాజకీయ సిధ్హాంతమ్ కాదు. మనం సరైన ప్రశ్నలు సంధిస్తే, సమాధానాలు అన్వేషించడంలో చరిత్ర మనకు సహకరిస్తుంది.
ఈ లోగా మనం ప్రతీచోటా, ప్రతి పధ్హతిలోనూ కృశ్చేవ్, గోర్బచేవ్, ట్రాట్స్కీలు అబద్ధాలు చెప్పారనీ, వాటిని రుజువు చెయ్యగలుగుతున్నామనీ ప్రచారం చెయ్యాలి. పెట్టుబడిదారీ యూనివర్శిటీలు, చరిత్ర పరిశోధనా కేంద్రాలూ ʹఅభిషేకించినʹస్టాలిన్ వ్యతిరేక, కమ్యూనిష్టు వ్యతిరేక ʹనిపుణులుʹ కూడా అబద్ధ్హాలే చెబుతున్నారని వివరించాలి. స్టాలిన్ యుగంలో సాధించిన ఘన విజయాలనుండీ, విషాదకరమైన తప్పులనుండీ గుణపాఠాలు తీసుకోవాలి.

(అమెరికాలోని మోంట్ క్లెయిర్ స్టేట్ యూనివర్సిటీ లో పనిచేస్తున్న ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్ గ్రోవర్ ఫర్ రచించిన వ్యాసం.)
అనువాదం: యార్లగడ్డ వెంకటరావు

No. of visitors : 599
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNION

K. RAMKOTESH | 05.03.2018 07:24:00pm

In the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ......
...ఇంకా చదవండి

స్టాలినో నీ ఎర్రసైన్యం...

పి.వరలక్ష్మి | 04.03.2018 10:53:05pm

ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది......
...ఇంకా చదవండి

స్టాలిన్ కవితలు

రమేష్ చంద్ర | 05.03.2018 06:54:07pm

విద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్.....
...ఇంకా చదవండి

జీవించు జీవించు హే సూర్య బింబమా...

తోలేటి జగన్మోహనరావు, స్టాలిన్ సొసైటి, ఇండియా | 04.03.2018 11:32:57pm

దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది......
...ఇంకా చదవండి

ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవు

వి. చెంచయ్య | 05.03.2018 12:05:27am

స్టాలిన్‌ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా.....
...ఇంకా చదవండి

స్టాలిన్‌ వ్యతిరేకత?

పాణి | 06.03.2018 11:57:50am

ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్‌ మార్గంపట్ల రాజకీయ ఏ......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత

స్టాలిన్ | 05.03.2018 12:09:45pm

శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా......
...ఇంకా చదవండి

ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్

| 05.03.2018 12:14:44am

స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •