ఏమిటీ స్టాలిన్ వ్యతిరేకత? అని అన్నామంటే స్టాలిన్ వ్యతిరేకులు ఒంటి కాలి మీద వస్తారు. స్టాలిన్ ఎన్నెన్ని నేరాలు.. ఘోరాలు చేశాడో చిట్టా విప్పుతారు. హృదయ కంపనతో మానవీయత, వ్యక్తి స్వేచ్ఛ వగైరాల గురించి మాట్లాడతారు. సోషలిజమనే మహోన్నత లక్ష్యం పార్టీ నియంతృత్వం పేరుతో స్టాలిన్ అనే వ్యక్తి నిరంకుశత్వంగా ఎలా చెలామణిలోకి వచ్చిందో చరిత్ర పొరల్లోంచి గుట్టల కొద్ది సాక్ష్యాలు పట్టకొస్తారు. ఇంత కాలం కళ్లు మూసుకపోయి స్టాలిన్‌ను సమర్థించాం గాని వివరాలు తెలిసే కొద్దీ గుండె చెరువైపోయిందని వాపోయే వాళ్లూ ఉంటారు. .. ఇట్ల చేసినందుకే కదా.. సోషలిజమంటే మానవజాతికి మొహం మొత్తిందనే తీర్పురులూ ఉంటారు.
స్టాలిన్ వ్యతిరేకులు ఇప్పుడు కొత్తగా పుట్టుకరాలేదు. భ్రస్టు పట్టిపోయిన సోవియట్ కమ్యూనిస్టు పార్టీ(స్టాలిన్ తర్వాత అది ఎందుకు అలా తయారైందనే విషయం ఎంతైనా చర్చించవచ్చు..) కంటే, అమెరికా తదితర సోషలిస్టు వ్యతిరేక శక్తులకంటే ఈ తరం స్టాలిన్ వ్యతిరేకులు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆ రకంగా వీళ్లు అంత బలమైన వ్యతిరేకులు ఏమీ కాదు. అయినా వ్యతిరేకిస్తూనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు స్టాలిన్ వ్యతిరేకతకు ఒక ప్రయోజనం ఉంది. స్టాలిన్‌ను విమర్శనాత్మకంగా చూడ్డం దగ్గర మొదలు పెట్టి ఆయన్ను ఎంత వ్యతిరేకిస్తే అంత మేధావిగా గుర్తింపు వస్తుంది. అంత గౌరవం దక్కుతుంది. ప్రజాస్వామ్యానికి, మానవతకు స్టాలిన్ వ్యతిరేకత ఒక గీటురాయిగా మారిన కాలం ఇది. బూర్జువా శక్తుల స్టాలిన్ వ్యతిరేకత గురించి కాదు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. గతంలో కమ్యూనిస్టులుగా కాస్త పేరు మోసి, ఇప్పుడు ప్రజాస్వామికవాదులుగా పేరు మోయడానికి ఉబలాటపడేవాళ్లందరి ప్రయాణం స్టాలిన్ దగ్గర ఆరంభమవుతుంది. సోషలిజాన్ని అంచనా వేయడం, మార్క్సిజాన్ని మరమ్మతు చేయడం దగ్గర ఆరంభిస్తారు. స్టాలిన్ వీరారాధకులు ఒక చివర ఉంటారని, ఇంకో చివర స్టాలిన్‌ను వ్యతిరేకించే బూర్జువాలు ఉంటారని, తాము అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండి ప్రజాస్వామ్యం గీటురాయి మీద చూస్తున్నామని మొదలు పెడతారు. ఆ పని చేస్తే మంచిదే. కానీ మధ్యస్తవాదం బహు దొడ్డది. ఇప్పుడు దానికి చాలా గిరాకీ ఉంది. విశాలమైన దృక్పథాన్ని సంతరించుకుంటుంది. ఎంత విశాలమంటే అందులో పరస్పర విరుద్ధమైనవి ఎన్ని చేరడానికైనా జాగా ఉంటుంది. అలా స్టాలిన్ గురించి వాళ్లు చెప్పినవీ, వీళ్లు చెప్పినవి అన్నీ చేరి క్రమంగా స్టాలిన్ వ్యతిరేక దిశగా సాగిపోతుంటారు. ఆ మేరకు ప్రజాస్వామిక వాదులుగా గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు.
అందుకే చలసాని ప్రసాద్ అనేవాడు. స్టాలిన్ వ్యతిరేకులుగా బయల్దేరిన వాళ్లంతా అంతిమంగా కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయారని. ప్రపంచవ్యాప్తంగా అలాంటి వాళ్ల నోరు తిరగని పేర్లు టపటపా చెప్పేసేవాడు.
మన దగ్గర కూడా స్టాలిన్ వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లున్నారు. వాళ్లకు మేధావులనే గుర్తింపు ఉంది. వాళ్లే సున్నితమైనవీ, గంభీరమైనవీ మాట్లాడగలరనే నమ్మకం సంపాదించుకున్నారు. మానవ జాతి అంతిమ గమ్యానికి సవాళ్లేమిటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాలు వీళ్లే చర్చించగలరనే అభిప్రాయం కూడా ఉన్నది. అలాంటి సాహసం గల మేధావులుగా కూడా గుర్తింపు ఉంది. స్టాలిన్ తప్పులనేగాదు, ఏ పరిస్థితుల్లో గత సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాలు జరిగాయో, అవి ఎందుకు ఆగిపోయాయో, లేదా వెనక్కి వెళ్లాయో కూడా విప్లవకారులకు తెలుసు. అంత మాత్రాన ఆ రకమైన అన్వేషణ పూర్తయిందని చెప్పలేం. ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది. కానీ స్టాలిన్ వ్యతిరేకత దగ్గర బయల్దేరినవాళ్లు ఆ రహస్యం తమకే తెలుసని, దాని గురించి ఇప్పుడు విప్లవం చేస్తున్న వాళ్లెవరికీ తెలియదని, ఆ విషయం పట్టించుకోరని అనడం అన్యాయం. పైగా ఈ మొత్తానికి స్టాలిన్ అనే వ్యక్తిని మాత్రమే బాధ్యుడ్ని చేయడం అచారిత్రకం.
అట్లని స్టాలిన్ చేశాడని చెప్పబడుతున్న ʹనేరాలు, ఘోరాలʹను మనం సమర్థిస్తామని దీని తాత్పర్యమా?
కాదు. కానేకాదు. అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలను చెరిగితే నిజాలు తేలుతాయి. లోపలా బయటా అందరూ కలిసి స్టాలిన్‌కు ఆరోపించినవన్నీ జల్లెడ పడితే నిజంగానే స్టాలిన్ చేసి ఉండకూడనివి బైటపడతాయి. ఎవరైనా వాటిని ఎందుకు సమర్థించాలి? అందువల్ల ఏం ప్రయోజనం? గత విప్లవాలను ఇవాళ అర్థం చేసుకోడానికి ఈ సమర్థన ఎందుకు ఉపయోగపడుతుంది? భవిష్యత్తు విప్లవాన్ని విజయవంతం చేయడానికిగాని, సోషలిస్టు వ్యవస్థను నిర్మించడానికి అది ఎలా దారి చూపుతుంది?
స్టాలిన్ చేసిన నిజమైన తప్పులను సమర్థించడం వల్ల ఇవాళ, రేపు సాగవలసిన విప్లవ పోరాటాలకు ఏ ప్రయోజనమూ లేదు. కాబట్టి విప్లవాచరణలో ఉన్న వారు ఎన్నటికీ వాటిని నెత్తికెత్తుకోరు. అనవసర చరిత్ర భారంతో తమ ప్రయాణాన్ని తామే భారంగా మార్చుకోరు. అయితే స్టాలిన్ అనే వ్యక్తి తప్పొప్పుల చర్చలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. గతంలోకి వెళ్లి ఆయన చేసిన తప్పులనబడేవాటిని చూస్తే అవి స్టాలిన్ అనే వ్యక్తి చేసినట్లే కనిపిస్తుంది. కానీ ఇవాళ వాటిని అలా చూడటం వల్ల ఏ ప్రయోజనం లేదు. వాటిని ఒక ప్రత్యేక స్థలకాలాల్లో సోషలిజం నిర్మించే క్రమంలో భాగంగా గుర్తిస్తే ఎలా అర్థం చేసుకోవాలో తేలుతుంది. అప్పుడు స్టాలిన్ ఏ తప్పూ చేయలేదని, చేసినా సమంజసమేనని వాటి నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని కాపాడాలనే వీరారాధనా తప్పుతుంది. కాపాడాల్సింది స్టాలిన్ అనే పర్సనాలిటీని కాదు, స్టాలిన్ అనే వ్యక్తిని వ్యతిరేకించడమా? ఆరాధించడమా? అనే ఏ వైఖరీ సరైంది కాదు. చాలా మంది లాగే స్టాలిన్ కూడా చారిత్రక వ్యక్తి. కాకపోతే అనేక కారణాల వల్ల మరే వ్యక్తి మీద జరగనన్ని దుర్మార్గమైన దాడులు స్టాలిన్ మీదే జరిగాయి. జరుగుతున్నాయి. బహుశా సమీప చరిత్రలోని ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్ మార్గంపట్ల రాజకీయ ఏకీభావం ఉన్న వాళ్లకు ఆవేదన కలుగుతుంది. నిజాలు చెప్పేటప్పుడు వ్యక్తిగత ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆరాధన వల్ల ఎంత హేతుబద్ధ వాదన చేసినా గుడ్డి సమర్థన ఉందా? అనే అనుమానం కలగవచ్చు. కాబట్టి అలా ఉండాల్సిన పని లేదు. స్టాలిన్ చుట్టూ పోగు చేసిన అబద్ధాలు, అసత్యాల గుట్టలను తొలగించాల్సిందే. ఎందుకంటే ఆయన లక్ష్యం సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం. దాన్ని మరుగుపరిచే ఏ అబద్ధాన్నీ అంగీకరించడానికి వీల్లేదు. స్టాలిన్ మార్గం భవిష్యత్ సోషలిస్టు నిర్మాణానికి స్ఫూర్తిని ఇస్తుంది.
కానీ స్టాలిన్ వ్యతిరేకులు ఈ దృష్టిని అలవర్చుకోగలరా?.
ఈ ప్రశ్న వేయగానే.. అబ్బెబ్బే మేం స్టాలిన్ వ్యతిరేకులం ఎందువుతాం? స్టాలిన్ తప్పులు చేసిండని మాత్రమే అంటున్నాం.. అనే వాళ్లూ ఉంటారు.
ఇంకొందరు ఉంటారు. మేం స్టాలిన్‌ను ఫలానా కారణాలతో వ్యతిరేకిస్తున్నామేగాని మేమూ కమ్యూనిస్టులమే తెలుసా? అనే వాళ్లూ ఉంటారు.
మరి కొందరు స్టాలిన్‌ను విమర్శనాత్మకంగా చూసేది దేనికంటే.. భవిష్యత్ సోషలిజం ఎలా నిర్మించాలనే దాని కోసమే అంటూ ఆయన్ను ఆయన స్థలకాలాల నుంచి పూర్తిగా వేరు చేసి చూస్తుంటారు.
ఇంకొంత మంది ఆశ్చర్యకరమైన వాళ్లుంటారు. వీళ్లు స్టాలిన్ ఆలోచనలు, ఆచరణలను ఆ సమయ సందర్భాల్లో అర్థం చేసుకోవాలని, అప్పుడే ఆయన సోషలిస్టు నిర్మాతగా, మార్క్సిస్టు మహోపాధ్యాయుడిగా కనిపిస్తాడని అంటూ మావోకు అలాంటి స్థలకాలాలు ఉండవన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అక్కడితో ఆగకుండా ఎలాగైనా సరే మావోను మార్క్సిస్టు మహోపాధ్యాయుల సరసన నిలబెట్టకుండా చూడాలని ప్రయత్నిస్తుంటారు.
కాబట్టి ముందు వీటి నుంచి బయటపడాలి.
స్టాలిన్ ʹతప్పులʹను చూసి గుండెలు బాదుకున్నా, ఏది నిజమో, ఏది కాదో తెలుసుకోకుండా భుజానెత్తుకున్నా ప్రయోజనం ఏమీ లేదు. ఆయన ఇంకా ఏమేం తప్పులు చేశాడా? అని నిరంతరం రంధ్రాన్వేషణ చేసే వాళ్ల చరిత్ర అధ్యయనాసక్తిని గౌరవించాల్సిదేకాని వాళ్లు తేల్చే వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్లు అంతిమంగా నిర్ధారించేది ఏమంటే సోవియట్ యూనియన్‌లో ఒక నమూనాగా, ప్రయోగంగా కూడా కొంత కాలమైనా సోషలిజం లేదని.
అక్కడ జరిగిన ప్రయత్నాన్ని సోషలిజం కాదంటే స్టాలిన్‌ను వ్యతిరేకించినట్లే కాదు, మానవజాతి సాధించిన ఒక అద్భుత విజయాన్ని నిరాకరించినట్లవుతుంది. కోట్లాది మంది ప్రజలు చేసిన ఒక మహత్తర ప్రయోగాన్ని తిరస్కరించినట్లవుతుంది. అత్యంత దుర్మార్గమైన, అమానీయమైన, అనైతకమైన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా ఆ ప్రజలు చేసిన ఒక గొప్ప కృషికి, అందులోని విజయాలకు మన వారసత్వాన్ని మనమే తృణీకరించుకున్నట్ల్లవుతుంది. ప్రజలు ప్రాణాలొడ్డి పోరాడి జయించడమేగాదు, తమకు అనుకూలమైన ప్రపంచాన్ని నిర్మించుకోగలరని చెప్పడానికి చరిత్రలో ఏ ఆనవాలూ లేని నిస్సహాయులుగా మనం మిగిలిపోయినట్లవుతుంది.
స్టాలిన్ వ్యతిరేకత ఇంత ఘోరమైన నష్టానికి దారి తీస్తుంది.
ఇప్పుడు కూడా కొందరు పండితులు అబ్బే మేం స్టాలిన్ దుర్మార్గాలనే వ్యతిరేకిస్తున్నాంకాని, ఆ కాలంలో రష్యన్ ప్రజలు సోషలిజం కోసం చేసిన ఆ ప్రయత్నాన్ని ఎందుకు కాదంటాం..? అనవచ్చు.
కాదని అంటే ఆ ప్రయత్నానికి స్టాలిన్ అందించిన నాయత్వాన్ని అంగీకరించాలి. ఏ స్థల కాల పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నాయకత్వం అందించాడో, అది సాధించిన విజయం ఏమిటో చెప్పాలి. అంతేకాదు. లెనిన్, స్టాలిన్, మావో తదితరులందరినీ వాళ్ల చరిత్రలో భాగంగా చూడాలి. ఎలాంటి సమాజంలో వాళ్లు విప్లవం చేశారు? ఎలాంటి సమాజంలో సోషలిజం నిర్మించే ప్రయత్నం చేశారు? ఈ క్రమంలో వాళ్ల మధ్య వచ్చిన పొరపొచ్చాలకు ఆనాటి రాజకీయ వాతావరణంలో ఉండిన అర్థం ఏమిటి? అసలు ఆ సమాజాలు విధించిన ఏ ఏ అనివార్యతల నుంచి అక్కడ విప్లవాలు విజయవంతమయ్యాయి? ఏ చారిత్రక, ప్రపంచ ఆవరణలో అక్కడ సోషలిస్టు నిర్మాణ ప్రయాత్నాలు జరిగాయి? అనేది అత్యంత వస్తుగతంగా చూడాలి. కార్మిక వర్గ విప్లవానికి, సోషలిజానికి ఉన్న సాధారణ సూత్రాలకు భిన్నంగా విప్లవం తేవడంలో, సోషలిజం తేవడంలోనే సమస్యలు ఉన్నాయనే వాదనా ఉన్నది. వెనుకబడిన సమాజాల్లో సోషలిస్టు నిర్మాణానికి అనేక సమస్యలు ఉంటాయని, రష్యా, చైనా సమాజాలు వాటి మధ్యనే ప్రయాణించాయనేది వాస్తవమే. కానీ ఇది అక్కడి సోషలిజాలను చూడ నిరాకరించే అంధత్వంగా మారితే చాలా ప్రమాదం. అప్పడు ఆ సమాజంలో ఉండిన సంక్షోభాలు, వాటిని ఎదుర్కోవలసిన అనివార్యత, దానికి ప్రజల సంసిద్ధత, వాళ్లను కదిలించిన నాయకత్వం పాత్ర, పార్టీ నిర్మాణం, అది స్వీకరించిన దార్శనికత, దాని నుంచి ఎంచుకున్న రాజకీయ కార్యక్రమం.. వగైరాలన్నీ ఆ చారిత్రక ప్రపంచంలోంచి విడతీయలేని అంతర్భాగాలు. అలాంటి పరిస్థితుల్లోంచే విప్లవమనే చారిత్రక పరిష్కారం ముందుకు వచ్చింది. అంతగా భౌతిక పరిస్థితులు విప్లవాన్ని అనివార్యం చేశాయి. అలాగే విప్లవం విజయవంతం కావడానికి ఏ అంతర్గత, బాహ్య అనుకూల శక్తులు దోహపడ్డాయే అలాంటి అననుకూల పరిస్థితుల మధ్యే సోషలిజం నిర్మించాల్సి వచ్చింది. అంటే లోపలా, బయటా తీవ్ర అననుకూల పరిస్థితుల మధ్య సోషలిస్టు నిర్మాణ ప్రయత్నం జరిగింది.
కాబట్టి అప్పటి విప్లవంలో అయినా, సోషలిస్టు నిర్మాణంలో అయినా వ్యక్తుల మధ్య సాగిన సంవాదానికి, వ్యక్తుల చర్యలకు ఆ కాలానికి సంబంధించిన అర్థాలే ఉంటాయి. వాటిలో అప్పుడు ఏది కరెక్టు, ఏది తప్పు అనేవి అప్పుటి ఫలితాలనుబట్టే చెప్పగలం. స్టాలిన్ చర్యల్లో అభ్యంతరకరమైన వాటిని కూడా ఆ కాలానికి చెందినవాటిగానే చూడాలి. స్థూలంగా ఆయన సోషలిస్టు నిర్మాణం కోసం చరిత్ర కల్పించిన అనుకూలతలు, అననుకూలతల మధ్య ప్రయత్నించాడు. ఇవి ఆ సమాజానికి, దానికి నాయకత్వం వహించిన పార్టీకి, దాని కీలక నాయకుడికి సంబంధించినవి. స్టాలిన్ అనే వ్యక్తి పాత్రను గుర్తిస్తూనే ఆయన్ను కూడా ఈ మొత్తంలో భాగంగా చూడాలి. ఇంకా బాగా చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దపు సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా చూడాలి.
ఆ రకంగా ఇప్పుడు అదంతా చరిత్రలో భాగం. ఇరవై ఒకటో శతాబ్డంలో విప్లవాలు, సోషలిస్టు నిర్మాణాలు పూర్తిగా వేరే చారిత్రక ఆవరణలో జరగనున్నాయి. రష్యన్ సోషలిజం, చైనా సోషలిజంలాగే భవిష్యత్‌లో ఏ దేశంలో అయినా సోషలిజాలు నిర్మాణమవుతాయని అనుకోవడం అమాయకత్వం. భవిష్యత్తులో పూర్తిగా కొత్త ప్రపంచంలో విప్లవాలు విజయవంతమై సోషలిజాలు నిర్మాణమవుతాయి. దీనికి ఆయా సమాజాల ప్రత్యేకతలనే కాదు, ప్రపంచ రాజకీయార్థిక సాంస్కృతిక పరిస్థితుల్లోనే వచ్చిన వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకోవాలి.
కాబట్టి స్టాలిన్ తప్పులను చర్చించడం, లేదా సోవియట్ సోషలిస్టు నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తించడం రెండూ గతానికి చెందినవే. గతించిపోయిన చారిత్రక ప్రపంచానికి సంబంధించినవే. భవిష్యత్ సోషలిజం కోసమనే సాకుతో స్టాలిన్‌ను ఎవరు ఏ అర్థంలో బోను ఎక్కించాలని చూసినా అది చారిత్రక విశ్లేషణ అనిపించుకోదు. దీని కోసం లెనిన్ భుజాల మీది నుంచి స్టాలిన్‌ను కాల్చాలని అనుకోవడంగాని, లెనిన్ కాలంలో సోషలిజం కోసం ప్రయత్నం జరిగింది... స్టాలిన్ కాలంలో నియంతృత్వం తప్ప ఏమీ లేదనడం గాని, సోషలిస్టు రాజకీయార్థిక వ్యవస్థకు పునాది వేయలేదని అనడంగాని అసంబద్ధమైన వాదన. ఈ పద్ధతిలో సోవియట్ సోషలిజాన్ని అర్థం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. ఇది స్టాలిన్‌ను ఘోరంగా చిత్రించడానికి తప్ప ఎలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, చరిత్ర ఇచ్చిన ఎలాంటి అవకాశాల మధ్య సోషలిజం నిర్మించడానికి ఆయన కృషి చేశాడో చెప్పడానికి పనికిరాదు. అంతే కాదు, వర్గపోరాటాన్ని, కార్మిక వర్గ దృక్పథాన్ని అటకెక్కించినట్లవుతుంది. ఇలాంటి వాదన వల్ల చరిత్రలో కూరుకపోవడమేగాని, దాన్ని ఎలా అర్థం చేసుకోవడం ఉండదు. కాబట్టి వాళ్లు స్టాలిన్ వ్యతిరేకత దగ్గరే ఉండిపోతారు. ఇలాంటి వాళ్లకే స్టాలిన్ వ్యతిరేకత మేధావి ఫోజుగా అక్కరకొస్తుంది. ముఖ్యంగా జీవితంలో ఒక్కసారి కూడా పడక కుర్చీలోంచి లేయని వాళ్లకు స్టాలిన్ వ్యతిరేకత గొప్ప పాండిత్య ప్రదర్శన అవుతుంది. అలాగే స్టాలిన్‌ను చారిక్రంగా చూస్తాంగాని మావోను చూడమనే వాదన కూడా చరిత్రతో సంబంధం లేని శుష్క పాండిత్యమే.
స్టాలిన్ వారసత్వం స్వీకరించినవాళ్లు తమ ముందున్న ప్రపంచంలో విప్లవాలను విజయవంతం చేయడం, సోషలిజాన్ని నిర్మించడం అనే కర్తవ్యం స్వీకరించి ముందుకు వెళతారు. స్టాలిన్ చూపిన సోషలిస్టు నిబద్ధత వాళ్లకు అంతులేని శక్తిని ఇస్తుంది. మానవాళి చరిత్రపై ఒక గొప్ప ఆశారేఖను ప్రసరించిన మహోపాధ్యాయుడిగా ఆయన స్ఫూర్తి ఉత్తేజపరుస్తుంది. స్టాలిన్ అయినా, మావో అయినా తమ సమాజాల ప్రత్యేకతల్లో, తమ చరిత్ర ప్రత్యేకతల్లో సోషలిజం నిర్మించేందుకు ప్రయత్నించారు. వాళ్లు చేసిన పనులు, తీసుకున్న వైఖరులు, సూత్రీకరణలు అన్నీ ఆ పరిస్థితుల్లో భాగం. అసలు విషయం ఏమంటే మనం వ్యక్తులుగా లెనిన్ అనీ, స్టాలిన్ అనీ, మావో అనీ అనుకుంటాంగాని వాళ్ల నాయకత్వంలో పోరాడి త్యాగాలు చేసి, తమలోని అత్యద్భుతమైన సృజనశక్తినంతా వెలికితీసిన ప్రజలను మర్చిపోయి మాట్లాడుకోవడం అన్నిటికంటే అసంగతం. ఈ నాయకుల నేతృత్వంలో లేదా పార్టీ నాయకత్వంలో ప్రజలు తమను తాము మార్చుకొనే ఒక అద్భుతమైన పోరాటంలో భాగమయ్యారు. యుద్ధాలను, ఎమర్జనీ పరిస్థితులను ఎదుర్కొంటూ సమాజంలోని దుర్భర పరిస్థితులను మార్చుతూ తమను తాము కొత్త మనుషులుగా మార్చుకోడానికి ప్రయత్నించారు. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు. అందులో లోపాలు ఉండవచ్చు. కానీ భౌతిక పరిస్థితులు, మానవ వ్యక్తిత్వాలు ఎంతగా మారాయో ఆ కాలంలో రష్యాలో, చైనాలో వచ్చిన సాహిత్యమే ఉదాహరణ. పార్టీ రచయితలు కాబట్టి కొంత ఎక్కువ చేసి రాసి ఉంటారని అనుకున్నా సమాజంలో మౌలికంగా అలాంటి ప్రక్రియలు జరగకుండా అదంతా సాహిత్యంలోకి ఎలా వస్తుంది? ఆ నాయకులు సమాజంలో అలాంటి ప్రక్రియలను నడిపారు. వాటిలో ఏవైనా పరిమితులు, లోపాలు ఉంటే వాటితోపాటు మంచికి కూడా ఈ చారిత్రకత ఉంటుంది. ఆ రకంగా కూడా ఆ ప్రయోగాలు మానవజాతి ఉమ్మడి సంపద. స్టాలిన్ తన దేశ సోషలిజానికేగాక ప్రపంచ మానవాళికి మహా నాయకుడిగా వ్యవహరించిన కాలం అది. వర్గ పోరాటం, మార్క్సిజం లెనినిజం, సోషలిజం అనేవాటిని తన కాలంలో జేగేయమానంగా నిలబెట్టిన బోల్షివిక్ ఆయన. చాలా మంది ప్రజాస్వామిక వాదులకు తెలియనది ఏమంటే - ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన కంటే ప్రజాస్వామికంగా, మానవీయంగా ఉండటం మరెవ్వరికీ సాధ్యం కాదని. సోషలిస్టు నిర్మాణమే అత్యంత ప్రజాస్వామిక లక్ష్యమని, మానవీయత వికసించే క్రమమని ఆయన అనుకొన్నాడు. ఆయన చేసిన తప్పుల గురించి మనం ఇవాళ పండిత చర్చ ఎంతైనా చేయవచ్చుగాని, సోషలిస్టు నిర్మాణంపట్ల ఏమరపాటు ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆయనకు మాత్రమే తెలుసు. మిగతా తప్పులేమైనా జరిగితే అవన్నీ అందులో భాగమే. ఈ ఒక్క కారణం వల్లే మహోపాధ్యాయుడు కామ్రేడ్ జోసఫ్ స్టాలిన్ మన ఎర్రెర్రని జెండాగా ఎప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటాడు.
Type in English and Press Space to Convert in Telugu |
SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNIONIn the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ...... |
స్టాలినో నీ ఎర్రసైన్యం...ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది...... |
స్టాలిన్ కవితలువిద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్..... |
జీవించు జీవించు హే సూర్య బింబమా...దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది...... |
ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవుస్టాలిన్ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా..... |
ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే...... |
పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా...... |
ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |