తండ్రి హృదయాన్ని గెల్చుకున్న ʹఇగోర్ʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

తండ్రి హృదయాన్ని గెల్చుకున్న ʹఇగోర్ʹ

- శివలక్ష్మి | 21.03.2018 10:18:08am

ఇజ్రాయెల్, జర్మనీ, పోలండ్ దేశాల సంయుక్త ఆధ్వర్యంలో వచ్చిన ఆకర్షించే చిత్రమిది.ʹ Igor and the Craneʹs Journey ʹ అనేపేరుతో హీబ్రూ,రష్యన్ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయింది. దీని నిడివి 90 నిమిషాలు. 10 సంవత్సరాల పైబడిన బాల,బాలికలు, పెద్దలకుద్దేశింపబడింది. ఈచిత్ర దర్శకుడు ఎవ్వని రూమన్ (Evgeny Ruman).

ఇగోర్ అనే పదకొండు ఏళ్ల బాలుడు ఈ చిత్ర కథా నాయకుడు. తన బుద్ధికుశలత తోనూ, చాకచక్యంతోనూ విడిపోయిన తన తండ్రి సాన్నిహిత్యాన్ని సాధించుకోవడమే ఈ సినిమా కథాంశం. ఇగోర్, అతని పక్షి"కార్ల్"- వీళ్ళ వలస జీవితాల్లో వచ్చిన మార్పులు ఈ చిత్ర కథనం.

ఇగోర్ తండ్రి పీటర్ జంతుశాస్త్రం లోని ఒక భాగమైన పక్షుల విభాగపు శాస్త్రజ్ఞుడు. అతడు కొంగల జాతికి చెందిన, ʹక్రేన్ʹ అనే జాతికి చెందిన ఒక రకమైన పక్షుల సమూహాలను పెంచుతూ, అవి ఒకచోటినుంచి ఇంకోచోటికి ప్రయాణం చేసే శిక్షణ నిస్తూ ఉంటాడు. ఇగోర్ తలి-దండ్రులు విడాకులు తీసుకుని విడిపోతారు. ఇగోర్ తల్లి దగ్గర ఉండడం వల్ల తండ్రితో ఎక్కువ పరిచయం గాని, చనువు గాని లేవు. సంవత్సరాని కొకసారి తండ్రి దగ్గరికి వెళ్తుంటాడు ఇగోర్. ఒకసారి రష్యాలో తండ్రి దగ్గరున్నప్పుడు పొదిగిన గుడ్డు నుంచి ఒక చిట్టి పక్షి బయటికి రావడాన్ని తండ్రి పీటర్ తో పాటు ఇగోర్ కూడా చూస్తాడు. పీటర్ దానికి పేరు పెట్టమని ఇగోర్ ని అడుగుతాడు. ఇగోర్ బుజ్జి పక్షికి "కార్ల్" అని పేరు పెట్టి అపురూపంగా సంరక్షిస్తూ ఉంటాడు. కార్ల్ ని ఎప్పటికీ అపురూపంగా చూసుకుంటానని తండ్రికి మాటిస్తాడు ఇగోర్.

తండ్రి పీటర్ అన్నా, అతను చేసే పక్షుల పెంపకం అన్నా, క్రేన్ పక్షులన్నా ఇగోర్ కి చాలా ఇష్టం. అందరి పిల్లల్లా కాకుండా భావోద్వేగాలతో బతుకుతుంటాడు ఇగోర్. వేరే పిల్లలు ʹఅనవసరం, ఇదంతా టైం వేస్ట్ʹ అనుకునే విషయాల్లో తన సమయాన్ని వినియోగిస్తుంటాడు. ʹకార్ల్ʹ పక్షిని పెంచుతున్న క్రమంలో, ఈ అవకాశాన్నుపయోగించుకుని తన తండ్రితో బాగా స్నేహ-సాన్నిహిత్యాలను పెంచుకోవాలనుకుంటాడు. పక్షుల పెంపకం గురించి బాగా అద్యయనం చెయ్యాలనుకుంటాడు ఇగోర్. అతని తల్లి టాన్యా బృందగీత నిర్వాహకురాలుగా రష్యాలో పనిచేస్తుంటుంది. ఆమెకు ఇజ్రాయెల్ లో ఉద్యోగం వస్తుంది. ఇజ్రాయెల్ లో ఆమెకు మెరుగైన అవకాశాలున్నాయని భావించడం వల్ల టాన్యా ఇగోర్ తో కలిసి రష్యా నుంచి ఇజ్రాయెల్ కు వలస వెళ్ళడానికి నిర్ణయిస్తుంది. అప్పటివరకూ రష్యాలో నివశించడం అలవాటైన ఇగోర్ కి ఈ సంగతి తల్లి చెప్పినప్పుడు చాలా కలవర పడతాడు. అలవాటైన పరిసరాలు, అతనికిష్టమైన స్నేహితులు, అన్నిటికంటే ప్రియమైన కార్ల్ పక్షి- అన్నిటినీ వదిలి పెట్టి తల్లితో ఇజ్రాయెల్ కు వెళ్ళిపోతాడు ఇగోర్. తండ్రేమో ఇగోర్ ని రష్యాలో తనతో ఉంచుకోవడానికి నిరాకరిస్తాడు. తండ్రి తనతో రష్యాలో ఉంచుకోనందుకు తండ్రి మీద ఇగోర్ కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో తండ్రితో అన్ని రకాల బంధాలను తెంచేసుకోవాలనుకుంటాడు ఇగోర్. ఇజ్రాయెల్ లో కొత్త స్కూలు, కొత్త భాష, కొత్త వాతావరణంలో అలవాటు పడడానికి, సర్దుబాటు చేసుకోవడానికి ఇగోర్ కి చాలా కష్టమనిపిస్తుంది.

పాఠశాలలో అసంతృప్తిగా, నిరాశగా ఉన్న ఇగోర్ తనకు ప్రియమైన క్రేన్ పక్షుల తెలుపు-నలుపు బొమ్మలను ఒక వరుస క్రమంలో గీస్తూ అవి ఎగిరిపోతున్నట్లు ఊహించుకుని, ఊరట పొందుతుంటాడు. ఇది అతని క్లాస్ మేట్ వేరేద్ అనే బాలిక దృష్టి నాకర్షిస్తుంది. వేరేద్ పీటర్ వీడియో వెబ్ సైట్ గురించి వివరించి చెప్పి ఇగోర్ కి చూపిస్తుంది. ఇక అప్పటినుంచి తూర్పు యూరప్ నుండి ఆఫ్రికా వరకూ గుంపులు గుంపులు గా వెళ్ళే క్రేన్ల మందల జాడలను తన తండ్రి వీడియో బ్లాగ్ లో చూస్తూ ఆనందంగా గడుపుతుంటాడు ఇగోర్. ఆ రకంగా ఇగోర్ క్రేన్ల దారిని గమనిస్తున్నప్పుడు తన ʹకార్ల్ʹ పక్షి మంద నుండి వేరు పడిందని తెలుసుకుంటాడు. క్రేన్ల మంద నుండి వేరు పడింతర్వాత, ఆఫ్రికా వరకూ ఒంటరిగా సుదీర్ఘ యాత్ర చేయలేదనీ, అప్పటి వరకూ తన కార్ల్ పక్షి బతికి ఉండదేమోనని ఇగోర్ ఆందోళన పడతాడు. పక్షిని రక్షించడమంటే తనని తాను రక్షించుకున్నట్లుగా భావిస్తాడు. అందుకని బర్డ్ హౌస్ లాంటి ఒక చిన్న గూడు కార్ల్ కోసం ʹవింటర్ హోంʹ నిర్మించడానికి సహాయం చెయ్యమని అనునయంగా అతని సహ విద్యార్ధులకు విజ్ఞప్తి చేస్తాడు ఇగోర్. ఆ విధంగా కార్ల్ పక్షి ఇజ్రాయెల్ మీదగా వెళ్ళడానికి తన క్లాస్ మేట్స్ తో కలిసి ఒక ప్రణాళిక వేస్తాడు ఇగోర్. దక్షిణ దిక్కుగా డ్రైవ్ చేస్తూ బిజీగా ఉన్న పీటర్ ఆ పక్షి జాడ తెలుసుకోవడానికి తన దళాలతో ఇగోర్ ని కలుస్తాడు. ఆ విధంగా కార్ల్ ని రక్షించడంతో పాటు విడిపోయిన తండ్రీ-కొడుకులు కూడా కలుసుకుంటారు!

ʹఈ రోజుల్లో ʹవిడాకులు ఒక ʹసర్వ సాధారణ విషయం. ఇజ్రాయెల్ లో మాత్రమే కాదు, దాదాపు అన్ని దేశాల్లో విడాకుల రేటు అధికంగానే ఉంది. గత కొన్నిదశాబ్దాలుగా స్వంత ఊరు, స్వంత దేశం ʹమాతృభూమిʹ అనే భావనలు నాటకీయంగా వలసల వల్ల మార్పు చెందుతున్నాయి. ఇది ఒక సామాజిక విషాదం" అంటాడు దర్శకుడు ʹఎవ్వని రూమన్ʹ . పిల్లల జీవితాలు అల్లకల్లోలమయ్యే అంతర్జాతీయ అప్పీలున్న ఈ సమస్యతో పిల్లలూ, పెద్దలూ అనుసంధానమై,తన్మయత్వం చెందుతారని నా నమ్మకం అంటాడు దర్శకుడు.

స్వయంగా తాను కూడా అతి చిన్న వయసులోనే రష్యానుంచి ఇజ్రాయెల్ కు వలస వెళ్లినవాడు కావడం వల్ల పక్షుల ప్రయాణాన్ని చిత్రించే క్రమంలో రమణీయమైన ప్రకృతి సోయగాలను ప్రపంచం ముందుంచి కనుల పండుగ చేశాడు దర్శకుడు ఎవ్వని రూమన్. పాఠశాలలో ఇగోర్ ని వెక్కిరించినప్పుడు, తన తల్లిని ఒక అల్లరివాడు చేరుకుని ఆట పట్టించినప్పుడు ఇగోర్ చూపించే క్రోధావేశాల హావభావాల ప్రకటనలు దర్శకుడి స్వంత అనుభవాలే!

ఇది హృదయాన్ని కదిలించే ఒక ఆకర్షణీయమైన చిత్రం. గట్టి పట్టుదల, కార్య దీక్ష ఉండి కొంచెం చతురత తోనూ, తెలివి గానూ వ్యవహరిస్తే ఎంతటి క్లిష్ట పరిస్థితులలో నైనా మార్పు తేవచ్చునని స్పష్టపరుస్తుందీ సినిమా! అతి సాధారణ బాలుడుగా కనిపించే ఇగోర్ తన నిర్ణయాలు అమలు పరచడంలో చూపించే దృఢత్వాన్నీ, సాహసాన్నీ రూపుకట్టిన చాలా అందమైన సినిమా ఇది .
బాధాకరమైన వలస జీవన విధానాన్ని కళ్ళకు రూపు కడుతుందీ సినిమా! కొందరు కొత్త జీవితానికి అలవాటు పడతారు. కొందరు పుట్టెడు దిగులు పడతారు. కానీ బతుకు చిత్రాలు మాత్రం మారిపోతాయి. క్షణ క్షణం మార్పుకు గురౌతున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒక చిన్నారి బాలుడు వలసతో ఎలా అనుసంధానమయ్యాడు అనే విషయాన్ని అత్యంత మనోహరంగా దృశ్యీకరించిన చాలా అద్భుతమైన చిత్రం!

ప్రకృతితో, ఆకాశంతో ప్రేక్షకుల్ని మమేకం చేస్తాడు ఇగోర్. ఈ సినిమాలో క్రేన్ పక్షులు ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగరే దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాన్ని ఎవరికి వారు చూచి తీరవలసిందే! ఎగిరి వెళ్ళే క్రేన్ల గుంపులు నిజమేనేమోనన్నట్లు చూపించడంలో విజువల్ ఎఫెక్ట్స్ శక్తి యొక్క గొప్పతనం తెలుస్తుందీ చిత్రంలో!

ఈ అత్యాధునిక ప్రపంచంలో ఎదుటివారి మనసుని వారి స్థానంలో నిలబడి ఆలోచించి ఎలా ఆకట్టుకోవాలి అనే విషయంలో ఎన్నో మనస్తత్వాలను చదివిన ఎదిగిన మనుషులు కూడా తెలుసుకోలేక విఫల మవుతు న్నారు. కానీ ఒక చిన్నారి బాలుడు తనదైన ఆలోచనతో, స్వంత వ్యక్తిత్వంతో అసాధారణమైన రీతిలో తన తండ్రి హృదయాన్ని గెల్చుకుని సఫలమైన విధానం ప్రేక్షకుల్ని ఆర్ధ్రతతో నింపుతుంది.

ఇటాయి షెర్బాక్ (Itai Shcherback) అనే బాల నటుడు తన తలి-దండ్రులు విడాకుల ద్వారా విడిపోతే స్వయంగా ఆ బాధ ననుభవించిన వాడు. ʹచిట్టి పక్షి మనుగడ సాగించాలంటే దానికి తల్లిదండ్రుల పోషణ, ప్రేమ అవసరంʹ అని పీటర్ ఒక సందర్భంలో తన కుమారుడికి చెప్పిన సంగతిని తిరిగి తెలివిగా తండ్రికే నేర్పించిన ఘనుడుగా పాత్రలో నిజంగానే జీవించాడు ఇటాయి షెర్బాక్!

చిన్ననాటి ఒంటరితనం, కుటుంబ కథ, వలస జీవితం, పిల్లల స్నేహాలు, పర్యావరణం మొదలైన అంశాలతో, సున్నితమైన సంభాషణలతో అద్భుతమైన సినిమాటోగ్రఫీతో కవితాత్మకంగా మలచబడిన ఒక పరిపూర్ణ చిత్ర మిది! దర్శకుడికి వలస జీవితం తెలియడం, విడిపోయిన తలి-దండ్రులతో ఉండే యాతనలు బాల నటుడికి అనుభవంలోకి రావడం వల్ల ఈ సినిమా చాలా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది!

ఈ సినిమాని ఇజ్రాయెల్ ఉత్తర భాగాన ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుందరమైన హులా లోయ లో దృశీకరించడం ఇంకో ప్రత్యేకత!

ఇగోర్ అతని తండ్రి మధ్య సంబంధం ప్రతి ఒక్కరికీ "ఇది మన కథే"అనిపించి ప్రేక్షకుల గుండె కతుక్కుంటుంది!

పక్షుల గురించి మనకేమీ తెలియకపోయినా కుటుంబం మొత్తం పిల్లలతో కలిసి చూడవలసిన సినిమా!

"టోరంటో, చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ʹ లో ప్రపంచ సినీ ప్రేక్షకుల, విమర్శకుల నుండి గొప్ప ప్రతి స్పందన పొందిందని యూదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కీర్తించింది.

చికాగో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిలిం ఫెస్టివల్, సినీకిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లలో అధికారి కంగా ఎంపికై, ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ పొందింది.

నేనీ సినిమాని ʹఅంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం" లో చూశాను.


No. of visitors : 342
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •