క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

| సాహిత్యం | క‌విత్వం

క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

- గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఈ రోజు అంతర్జాతీయ కవితా దినోత్సవం అట
పొద్దున్నే ‌ఢిల్లీ నుంచి ఓ మిత్రుడు పలకరించాడు
ఓ కవిత రాయమన్నాడు
నేనన్నాను కదా... మిత్రమా కవిత రాయనిదెప్పుడు?
నేను కవిత లోనే ఉన్నాను!
కవిత్వం గానే నా ప్రపంచంతో మాట్లాడుతున్నాను
దే ని గురించి రాయను?
నా చుట్టూ పొరలు పొరలు గా అలుముకొన్న
అణిచివేత లు, అసమానతలు
ఆధిపత్యాలు, రక్త పాతాలు
యుద్ధాలు., కన్నీళ్ళు
ప్రేమరాహిత్యాలు.. వియోగాలు!

చాలా సార్లు నా వేళ్ళను కత్తిరించిన
అదృశ్య కత్తెరలను తప్పించుకుంటూ
ఎన్ని రాసానని? ఎన్ని చదివానని?
ఇంకా మిగిలే వున్నాయి
ప్రపంచం ఎప్పటికీ ఒక పచ్చి పుండే కదా!

ఎవరో కుట్టేసిన పెదాలు
కనురెప్పలు చెప్పాలనుకున్న రహస్య సంభాషణలను
మనుషులకు రాత్రుళ్ళని, నిద్రలని,
కలలను, అన్నాన్ని లేకుండా చేసిన
క్రూర‌మైన పగళ్ళను గురించి రాయని రోజులు ఉన్నాయా??

దేని గురించి రాయమంటావో నువ్వే చెప్పు!
ప్రశ్నించినందుకు... దూరమైన సముద్రాన్ని
ఈ లోకం మీదకు ఒంపిన నా మిత్రుడి కరస్పర్శ కోసం రాయమంటావా?
నగరంలోకొచ్చిన బాల్యమిత్రుడు కలవకుండా వెళ్ళిపోయిన తరువాత
ముంచెత్తిన దుఃఖం గురించి రాయమంటావా?
పోనీ.. ప్రేమ గురించి రాయమంటావా...?

చాలాసార్లు నా గుండె కవితా మధువులో మునిగే ఉంటుంది
ఎవరిని తలుచుకుంటుందో మరి?
ఎవరో కడలి రౌతు అట
ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి
ముఖ పుస్తకంలో ...!!
ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో
వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి!
ఇక ఒక్క క్షణం కూడా నటించను
నువ్వంటే కడలంత ప్రేమ , మోహం అని చెప్పేస్తాను
ఈ సముద్రం అంతా నీ కోసం కార్చిన నా కన్నీళ్ళే అని చెప్పేస్తాను!
పోస్ట్ చేయకుండా దిండు గలీబులో దాచు కున్న ప్రేమలేఖల్ని,
తన రాత్రుళ్ళు రహస్యంగా ఎలా చదువుతాయో చెప్పే సి
ఒక్క క్షణం అయినా తనకు ఒంటరిగా దొరికితే ఆ ప్రేమలేఖలని
అతని పాదాల మీద కుప్పగా పోస్తాను అంటుంది.!
ఎంత బాహాటంగా ఈ లోకం ముందు అతనిపై తన ముహబ్బత్ ని ప్రకటిస్తుందని?

ఇక...
సూర్య చంద్రులు, అరవిందులు
ఉద‌య్‌భాను, అరుణాంక్‌లు
క్రాంతి సేనలై ఎదలో మాటల ని..
నల్ల కలువ తెల్లని పలు వరుసల తళుకుల్ని
ప్రభాకరుడి నుంచి ప్రభాకరుడి అమరత్వాల దాకా
సిరియా నుంచి దండకారణ్యం మీదుగా
వెలివాడల దాకా పారుతున్న రక్తపుటేరుల్లో
కలత నిద్రలో కూడా వెన్నెల‌ సిరాల్లో‌
కన్నీళ్ళల్లో కలాలు ముంచి దుఃఖిస్తూ రాస్తుంటారు.!
వాళ్ళ నుంచి నేర్చుకోవడమే కానీ,
నేను రాయడం ఏంటి చెప్పు?

అయినా...మొన్న పాత బస్తీ వాల్మీకి నగరంలో
రామాయణం రాసిన వాల్మీకి కులపు పాకీ అమ్మాయి...
అన్నం కంచంలో కూడా
మీ పెద్ద కులపోళ్ళ మలం కనిపిస్తుంటే
పొయ్యిల్లు కూడా చండాస్ లాగా అనిపిస్తుందని
భోరుమని ఏడవడం రాయనా?

డొక్కలెండిపోయిన డక్కిలి వాళ్ళు
చిందేసి అడుక్కునే సత్తువ లేని
చిందోళ్ళై పుట్టిన పాపానికి....
థర్డ్ డిగ్రీ లాకప్ డెత్ లలో ఉనికిని కోల్పోతున్న వాళ్ల గురించి
యుగాలుగా అన్నం మెతుకులు ‌దొరక్క ‌
అయిదు వేళ్ళూ మాయమై పోయిన చేతులతో
వరి మడిలో ముంచి తీసినట్లు
రక్తంలో ముంచిన పాదాలతో
మహాదూరాలు నడిచిన రైతులు
మహా మానవ సముద్రాలై దేశాన్ని ముంచెత్తటం గురించి రాయనా??

ఆసిడ్ దాడుల్లో ప్లాస్టిక్ ముఖాలై పోయిన అమ్మాయిల గురించి
చదవలేక చచ్చి పోయిన కార్పొరేట్ హత్యల గురించి
నెలల పసితనం నుంచి మె నో పాస్ ముదిమి తనం దాకా
వయాగ్రాలకు ఛీలిపోయే రక్త సిక్త యోనులు మాట్లాడే భాషను రాయమంటావా?
ఏం రాయమంటావో చెప్పు?

అడవి బడుల్లో బాణాల ప్రశ్నలు సంధి స్తున్నారని పిల్లలను
రామనామాన్ని జపించమని ముస్లింలను
కుతుబ్ మినార్ ను విష్ణు స్థంభ్ గా మార్చే
మత మాయగాళ్ళ కుట్ర ను నిలువరించిన మనుషుల ను...
వేటాడి చంపుతున్న పైవాడి యుద్ధ తంత్రాన్ని రాయమంటావా..‌?
ఏం రాయమంటావో చెప్పు?

మనుషులు మనుషుల గురించేగా నువ్వు రాయమంటున్నది?
మనుషులంటే‌ ఆదివాసీ లు, స్త్రీ లు, పిల్లలు,
ముస్లింలు, దళితులు, సిరియన్లు, రోహింగ్యాలు
తెలంగాణా ఇంకా రాలేదని దుఃఖించే తెలంగాణ వాసులు
ఇంకా వీళ్ళ కోసం రక్త తర్పణం చేసే వీరులు
వీళ్ళ గురించి రాయడమంటే
ప్రపంచాన్ని మార్చే వాళ్ళ గురించి రాయ మంటున్నట్లేగా...?

ఇంత కీ ఈ మనుషులు... ఏం చేస్తున్నట్లు?
కొంతమంది మనుషులు
కలిసి బతుకుతూ ఉన్నారు
కొంత మంది విడిపోయి బతుకుతూ ఉన్నారు.
విడిపోలేక - కలవలేక పోతున్న మనుషులు
చచ్చి పోతున్నారు...!
మనుషులను బతికించుకోవాలనుకుంటున్న వాళ్ళు చంపబడుతున్నారు...

ఇంత కీ...
మనుషుల ని కలిపి ఉంచేది, బతికించేది ఏంటో
ఎక్కడ దొరుకుతుందో చెబితే...
మిత్ర మా... వెంట‌నే కవిత రాసేస్తాను...!
ఏం రాయమంటావో చెప్పు.!
నేను అలిసిపోయాను...
నాకు కాసింత విశ్రాంతి కావాలి.!
నీ నిద్ర నాకు అప్పుగా ఇవ్వవోయి!
కొంత నిద్ర పోతాను..!
నిద్ర లో నైనా అందని దాన్ని
ఈ ప్రపంచాన్ని మార్చే దాన్ని
కౌగలించుకుంటాను..!

No. of visitors : 1239
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి

నీడ ఒక అంతర్ మానవి !

గీతాంజలి | 03.08.2018 11:31:48am

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి.. ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా?? రా... నీడలు చెప్పిన రహస్యాలను .. మనం చేయాల్సిన యుద్ధాలను.....
...ఇంకా చదవండి

వదిలి వెళ్లకు...!

గీతాంజలి | 21.12.2018 07:53:43pm

నన్ను నీళ్లు లేని సముద్రం లోకి.. సముద్రం లేని భూమి మీదకి. వదిలి వెళ్ళకు .. వదిలి వెళ్ళకు.. ఎలా ఉండాలి నీవు లేక... ఎలా చేరాలి నీ దాకా? నిన్ను చేరాలంటే.. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •