కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ప్రైవేటు వర్సిటీలు

| సాహిత్యం | వ్యాసాలు

కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ప్రైవేటు వర్సిటీలు

- ఎ. నర్సింహ్మా రెడ్డి | 04.04.2018 10:46:22am

సామాజిక ప్రగతికి, ఆర్థికాభివృద్ధికి, సంస్కారవంతమైన జాతి నిర్మాణానికి, మానవ సృజన శీలతకు అత్యంత కీలకమైంది విద్య. వ్యక్తి వికాసం మీద జాతి ఔన్నత్యం ఆధారపడి ఉంటుంది. వ్యక్తిలో హేతుబద్ధ భావాజాలాన్ని, మానవీయ విలువలను పెంపొందించడానికి విద్య అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడితే విద్యలో ఆరు దశాబ్ధాల వివక్ష అంతమై, ప్రజా ప్రయోజనాల కనుగుణంగా విద్యవిధానంలో గుణాత్మక మార్పు చోటు చేసుకుంటుందని ఉద్యమ కాలంలో ప్రజలు ఆశించారు. అయితే తెలంగాణలో విద్య ఒట్టి డొల్లగా ఉందన్నది వాస్తవం. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో ప్రైవేట్‌ సంస్థల ప్రమేయాన్ని తగ్గిస్తే, ప్రైవేట్‌రంగ ఆధిపత్యానికి కళ్లెం వేస్తే మన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆకాంక్షించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. స్వరాష్ట్రం కల సాకారమైంది. కానీ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. చదువుల పరంగా కడగండ్లు తీరలేదు. పైగా ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్‌ ఆధిపత్యం మరింతగా పెంచేందుకు పాలకులు పావులు కదుపుతున్నారు.

మన రాష్ట్రంలో రిలయన్స్‌, జిందాల్‌ లాంటి బడా కార్పొరేట్‌ సంస్థలు వర్సిటీలు ప్రారంభించడానికి ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ శాసనసభలో టిఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న ఆధిక్యత వల్ల, ప్రతిపక్షాలు కూడ ఆ ప్రైవేటీకరణ తానులో ముక్కలే కావడం వల్ల బడ్జెట్‌ సమావేశంలో మార్చి 27న ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపన బిల్లు -2018ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, మరుసటి రోజు ఆమోదించడం జరిగింది. ఉన్నత విద్యకు సంబంధించి విశ్వవిద్యాలయాల ఏర్పాటులో ప్రైవేటీకరణ విధానాన్ని ప్రవేశపెట్టదలచినప్పుడు, కనీసం ʹʹవిద్యావంతులు, మేధావులు, వైస్‌ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థి సంఘాలతో సెమినార్లు, చర్చలు నిర్వహించి విద్యావిధానం రూపొందించడం జరుగుతుందిʹʹ అని టిఆర్‌ఎస్‌ పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాన్నయినా గౌరవించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో, మధ్యంతర విద్యలో, ఉన్నత విద్యలో విద్యావ్యాపారం పెద్ద ఎత్తున సాగి, విద్యావ్యాపారస్తుల మాఫియాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ ప్రైవేట్‌ విద్యా మాఫియా మీద తీవ్రమైన విమర్శలూ నిరసనలూ వెలువడ్డాయి. ఇంటర్‌ నుంచి వృత్తివిద్య వరకు కొన్ని ప్రైవేట్‌ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెల్లడం పట్ల ప్రజలు ఆక్రోశం ప్రకటించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థల ఆక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తామనీ, అసలు ఆ సంస్థల ఉనికి లేకుండా చేస్తామనీ ఉద్యమకాలంలో బీరాలు పలికారు. ఇప్పుడు హారతులు పడుతున్నారు. ఉద్యమ స్ఫూర్తి ఇంత తొందరగా సమసిపోవడం విషాదమే. అయితే టిఆర్‌ఎస్‌ నేత కేసిఆర్‌ విషయంలో మాట తప్పడం ఆయనకు కొత్త కాదు, ఆశ్చర్యకరమైనదీ అంతకంటే కాదు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉన్నత విద్య ప్రైవేటీకరణ తెలంగాణ సమాజానికి అవసరమా, అది ప్రజా ప్రయోజనకరమా, ఇతర రాష్ట్రాలలో యూనివర్సిటీల ప్రైవేటీకరణ పర్యవసానాలు ఏమిటి, ఆరు దశాబ్దాల విద్యా వివక్షకు గురైన తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు ఇది అనుకూలమా కాదా అనే అంశాలపై, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా ప్రైవేట్‌ వర్సిటీల చట్టం ఎందుకు తీసుకువస్తున్నారో విస్తృతంగా చర్చ జరగవలసి ఉంది.

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యుజిసి) - 2003 నిబంధనల అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఏర్పాటయ్యే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను బిల్లులో పొందుపరిచారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. రిజర్వేషన్లు వర్తించవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి గ్రాంట్స్‌ అందవు. ఫీజులు నిర్ణయించుకునే అధికారం వాటికే ఉంటుంది. కోర్సులు, పరీక్షలు, సిలబస్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు నిర్వహించుకోవచ్చు. గౌరవ డిగ్రీలూ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఫీజుల నుంచి కోర్సుల వరకు, ప్రవేశాల నుంచి పరిపాలనా వ్యవహారాల వరకు ప్రైవేట్‌ వర్సిటీ పాలకమండలి నియంత్రణలో ఉంటుంది. ʹప్రభుత్వ నియంత్రణ అంతంత మాత్రంగానే ఉంటుంది.

రాష్ట్రంలో నెలకొల్పే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీతో అయినా ఒప్పందం కుదుర్చుకోవచ్చు. నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు ఆటంకంగా ఉండవు. ఐదేండ్లలోపు ఆ విశ్వవిద్యాలయానికి న్యాక్‌ గుర్తింపు పొందాలని నిబంధన. ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్శిటీని మూసివేయవద్దు. తెలంగాణ భౌగోళిక పరిధిలోనే ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమల అసవరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి. విశ్వవిద్యాలయానికి చాన్సలర్‌ హెడ్‌గా ఉంటారు.

నూతన ఆర్థిక విధానాలు అమలు మొదలయ్యాక 1995 నుంచి దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం జరుగుతుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు సంబంధించిన విధి విధానాలను 2003లో యుజిసి జారీ చేసింది. 2002లో చత్తీస్‌గడ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం తీసుకు వచ్చి, ఒక్క ఏడాదిలో 112 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది. వాటిలో అత్యధికం బోగస్‌ విశ్వవిద్యాలయాలు. ఒక గదిలో, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యుజిసి) మాజీ అధ్యక్షుడు ప్రొ. యశ్‌పాల్‌ 2004లో ఈ విషయంలో చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సి లాహోటి, జస్టిస్‌ జి పి మాథుర్‌, జస్టిస్‌ పి కె బాలసుబ్రమణ్యం 2005 ఫిబ్రవరి 11న చత్తీస్‌గడ్‌ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టాన్ని కొట్టివేస్తూ చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. మరోవైపు దేశంలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలే కారణమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అయినా పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక విద్యపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం మొదలెట్టాయి. విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. ప్రైవేట్‌ పెట్టుబడిదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పని అయినా లాభాపేక్షతోనే చేస్తారు. విద్య ఉదాత్త లక్ష్యాలను నాశనం చేయకుండా వారి విద్యా వ్యాపారం సాగదు. విద్య సామాజిక రంగంలోనే ఉండాలన్న ఒక ఉదాత్తమైన ఆకాంక్ష జాతీయోద్యమ కాలం నుంచి ఉంది. అయితే 1947 తరువాత ప్రధానంగా 1986 నుంచి మన పాలకులు ఈ ఆకాంక్షకు తూట్లు పొడుస్తూ వస్తున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల అమలుతో విద్య సరుకుగా మారింది. సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటుంది. తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు, మేధావుల పాత్రకు స్థానం లేకుండా పోయింది.

ప్రైవేట్‌ విద్యాసంస్థలు తోటి మనుషులు ఎలా బతుకుతున్నారు? వారి బతుకు చిత్రాన్ని ఎలా మార్చాలీ అనే ఆలోచన చేయవు. లాభమే పరమావధిగా పనిచేస్తాయి. ఉన్నత విద్య సరుకుగా మారడం వలన కొందరికీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆచరణలో అందరికీ దూరమవుతుంది. కొనగలిగిన వారికి మాత్రమే విద్య దొరుకుతుంది. ప్రయివేటీకరణలో కూడా ప్రజలకు ఒక అవకాశం కల్పించినట్టు ప్రభుత్వం చెబుతున్నది. రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకుంటే 25 శాతం సీట్లు కేటాయిస్తారట. కానీ అందులో ఫీజు కట్టగలిగినవాడే చదువుకుంటాడు. ఆచరణలో డబ్బున్నవాడికే అందులో ప్రవేశముంటుంది. రాష్ట్ర యూనివర్సిటీల మీద శ్రద్ధ పెట్టకుండా ప్రైవేట్‌కు సాష్టాంగ పడుతున్నారు. ప్రైవేట్‌ విద్యలో నాణ్యతకంటే మోసపూరిత వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రైవేటీకరణ వ్యతిరేకులు చెబుతున్నమాట కాదు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి సంస్థ అయిన యునెస్కో పరిశోధనలే హెచ్చరించాయి.

రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో పాటు మరో డజను యూనివర్సిటీలున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి మౌలిక వసతులు లేకుండా జిల్లా కొక యూనివర్శిటీలాగా అనేక కొత్త యూనివర్శిటీలు ప్రకటించాడు. అయితే వాటిలో నిధుల లేమి కారణంగా మౌలిక వసతుల కల్పన పూర్తి కాలేదు. అధ్యాపక సిబ్బంది కొరత కొనసాగుతోంది. వచ్చే నెలలో శతవార్షికోత్సవ వేడుక ముగియనున్న ఉస్మానియా యూనివర్శిటీ సైతం నిధుల కొరతను, అధ్యాపక ఖాళీల సమస్యను ఎదుర్కొంటున్నది. తెలంగాణ ప్రభుత్వం వీటికి కోరినన్ని నిధులు ఇవ్వలేదు.

ఇవాళ తెలంగాణలో విశ్వవిద్యాలయాలు సమస్యలకు నిలయంగా మారాయి. ఆదరణలేక విలవిల్లాడుతున్నాయి. కనీస వసతుల్లేక, ప్రొఫెసర్లు సరిపోయినంత మంది లేక, అవసరమైనన్ని నిధుల్లేక కునారిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం వస్తుందని, నాణ్యమైన విద్య అందుతుందని, ప్రమాణాలు మెరుగవుతాయని, నిధుల కేటాయింపు పెరుగుతుందని అందరూ ఆశించారు. కానీ అలా ఆశించిన అందరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతూ వస్తున్నది. ఇప్పుడు ఆ వర్సిటీలపై ప్రయివేటు కత్తి వేలాడుతోంది. తెలంగాణలో ప్రభుత్వ ప్రాధాన్యతతో వెలిగిపోవాల్సిన విశ్వవిద్యాలయాలు చిన్నచూపుతో వాడిపోతున్నాయి. బోధనరంగం పూర్తిగా కుంటుపడింది. ఇది ప్రమాణాలు దిగజారడానికి దోహదపడుతున్నది. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. బోధనకు ప్రొఫెసర్లు లేకపోవడంతో పరిశోధనలు అటకెక్కాయి.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ వంటి విశ్వవిద్యాలయాల్లోనూ ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓయూలో 1,264 మందికి కేవలం 682 పోస్టులు, కేయూలో 391 మందికి 210 పోస్టులు, జేఎన్‌టీయూలో 409 మందికి 203 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తున్నది. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న విశ్వవిద్యాలయాలపై పిడుగు పడనుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సమాధి కట్టే పరిస్థితులు దాపురించనున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల రాకతో ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు సహజ మరణం పొందే ప్రమాదం పొంచి ఉంది. ఇక రాష్ట్రంలోకి ప్రయివేటు వర్సిటీలు వస్తే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉనికి కోల్పోయే ప్రమాదముంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విద్యావసరాలు, విద్యాప్రమాణాలు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా మారాల్సిన అవసరముందని ప్రభుత్వం పేర్కొంటున్నది. ఉన్నత విద్యా సంస్థల పోటీ కారణంగా నాణ్యతా ప్రమాణాలు, జవాబుదారీతనం పెరుగుతాయని చెప్పడం హాస్యాస్పదం. ఎక్కడైనా పోటీ అంటే ఇద్దరు సమానుల మధ్య జరగాలి. కానీ బలహీనులకు బలవంతులకు మధ్య పోటీ అనడం అన్యాయం, అప్రజాస్వామికం. విద్యా విషయకంగా వెనకబాటు సామాజిక ఆర్థిక ప్రగతిలో తిరోగమనానికే దారితీస్తుంది. ఈ మౌలిక జాడ్యానికి విరుగుడుగా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యాగంధం అందించే సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయవల్సి ఉంది.

విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుంది. రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే సమర్థ మానవ సృజనశక్తుల సృష్టికి విద్య ఎంతగానో అవసరం. బహువిధాలుగా ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే కసరత్తులో భాగంగా విద్య, వైద్యరంగాల్ని పునాది స్థాయినుంచి చిత్తశుద్ధితో ప్రభుత్వం చేపట్టాలి. ప్రభుత్వం వెంటనే ప్రైవేటు వర్సిటీల ఆలోచనను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ విద్యార్థి, అధ్యాపక, ఉపాధ్యాయ లోకం విస్తృత ప్రజాఉద్యమం ద్వారా ప్రభుత్వ అనుచిత ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించడం తక్షణ కర్తవ్యం.


No. of visitors : 451
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •