పీట ముడిగా ఎస్సి - ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

| సాహిత్యం | వ్యాసాలు

పీట ముడిగా ఎస్సి - ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

- ఆనంద్.కె | 17.04.2018 12:18:52am

బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. - శ్రీ శ్రీ

ఎబలవంతులు దుర్బల జాతిని బానసలను గావించారు నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. శ్రీ శ్రీ

ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం చేసే కుట్ర, అది అమలులోకి వచ్చిననాడే ప్రారంభమైంది. ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేస్తారనుకున్నప్పుడు, ఆ తిరుగుబాటును పక్కదారి పట్టించడానికి, తిరుగుబాటు ఆకాంక్షల మేరకు తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే చట్టాలను చేస్తుంది. ఆ తిరు గుబాటు తీవ్రత సన్న గిల్లిన తరువాత ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది. తమ రక్షణకు ఆయుధాలు కావాలని అడిగినప్పుడు పాలకులు, ప్రజలకు ఆయుధాలు యివ్వరు. ప్రజలు ఆయుధాలు పట్టినప్పుడు, ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలనే ఆలోచనచేస్తుంది. పీడకుడే పాలకుడౌతాడనే దళిత జనం, పాడు నిద్రలో కన్నపాపిష్టి పీడకల నెరవేరింది. మాటు కాచి వేటేసే ఉన్మాదపు పథక రచన, కోర్టులను అడ్డు పెట్టుకుని దెబ్బ కోట్టాలనే కుట్ర. బీజేపీ (బ్రాహ్మణీయ జనతా పార్టీ) అధికారంలోకి వస్తే దళితుల దుస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టేననీ, పెనం కాంగ్రెస్ పార్టీ ఐతే, కణ, కణ మండుతున్నరాక్షస బొగ్గుల పొయ్యి బీజేపీ. అగ్రకుల బ్రాహ్మణీయ రాజకీయ పార్టీల ఉమ్మడి ఆశయం ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని గొంతు పిసికి చంపడం. తరుముతున్న పులి పంజా విసరక మానదనీ, బుసకొడుతున్న విషసర్పం కాటు వేయక మానదనీ, చెడు శకునాన్ని ఊహించినట్లే, కలవరపడ్డట్లే, కలత చెందినట్లే, ఉలిక్కిపడ్డట్లే జరుగుతుంది. అగ్రకుల స్వాయంభూ మనువుకు, అంటరాని దళిత మనువులు కూడా తోడైయ్యారు. తమ సోదర దళిత శవాలపై నుండి ʹʹసనాతన హిందూ ధర్మʹʹ పల్లకిని మోయడానికి పోటీ పడుతున్నారు దళిత మనువులు. మూల మలుపులో ఉన్న దళితులకు ఇప్పుడిక బ్రతుకు పోరాటం వాయిదా వేయలేని కర్తవ్యం.

వేద కాలం నాటి ఇంద్రుడు పూర్తి చేయకుండా మిగిల్చిన దాడులు, గృహ దహనాలు ఇప్పుడు పూర్తి చేయనున్నారు ఆథునిక ఇంద్రులు. ఇక అగ్ర కులాల చిరకాల స్వప్నం, అనగా సంపూర్ణ బానిస సమాజ నిర్మాణలక్ష్య సాధన ఎంతోదూరం లేదు. వేల ఏళ్ళ నాటి చాతుర్వర్ణీకుల (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర) చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. అనగా, వేద కాలం నాటి సేవక వర్ణమైన శూద్రులు (కమ్మ, రెడ్డి, కాపు, వెలమ తదితర అగ్ర కులాలు) స్థానంలో, పంచమ వర్ణీకుల (ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ) లో మొట్ట మొదట ప్రధానంగా దళితులను భర్తీచేసే ప్రక్రియ పూర్తి కానుంది. దీనికి ప్రధాన అడ్డంకిగా నిలిచిన ఎస్సి/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యంచేసే ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. దీనికి ఆరంభంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ లాంటి నూతన ఆర్ధిక సంస్కరణలే నాంది. ఈ సంస్కరణల వలన తీవ్రంగా నష్టపోయింది ప్రదానంగా దళితులూ, ఆదివాసులే, వీరిని అగ్రకుల బ్రాహ్మణీయ హిందూ సమాజానికి (ఆశ్రమ ధర్మానికి) బానిసలుగా మలచుకోవడానికే, ఈ ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టి అమలు చేశారు. ఈ నూతన ఆర్ధిక సంస్కరణలు అమలు జరిపే ముందస్త పథకంలో భాగంగా, ఎంతో కాలంగా పోరాడి, ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్నకార్మిక చట్టాలను నిర్వీర్యంచేసి, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులను, నయానా, భయానా ప్రలోభపెట్టి, ఉద్యోగ పోరాట సంఘాల స్థానంలో, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసేలా కుట్రలు చేశారు. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఉమ్మడిగా ఉద్యమించే సాంప్రదాయానికి చరమ గీతం పాడారు. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు ఎంతో కొంత ఆత్మగౌరవం దొరికేది, ప్రభుత్వ ఉద్యోగంలోనే. కనుక మొదటి చర్యగా, ప్రభుత్వ ఉద్యోగ నియమా కాలను నిలిపివేశారు. స్వయం పోషక కుల వృత్తులను, కుటీరపరిశ్రమలను ధ్వంసం చేసి జీవనాధారం లేకుండా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరించారు. మరి కొన్ని సంస్థలకు కేన్సర్ వ్యాధి సోకేలా చేసి నిర్జీవంగా చేశారు. ఇక ప్రవేటు రంగ సంస్థలన్నీఅగ్ర కులాలకు చెందినవారివే. ఆ సంస్థలలో ఉద్యోగాలు ప్రధానంగా ఆ సంస్థ యజమాని కులస్తులకే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఏవో కొన్నిఅగ్ర కులాల ప్రజలు చేయ లేనివి, చేయ కూడని ఉద్యో గాల లో మాత్రమే దళితులను నియమించుకుంటారు.

అంతిమ కుట్రలో భాగంగా అత్యున్నత న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకుంది. ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందని దుష్ప్రచారం చేస్తుంది. కానీ ఈ చట్టం ఒక రకంగా అగ్రకుల మనువాద దోపిడీ పాలక వర్గాలకే లాభం చేకూరేలా ఎంతగానో దోహద పడుతుంది. ఎందుకంటే, ఈ చట్టం దళితులు, ఆదివాసులకు తాత్కాలిక ఉపశమనంతప్ప ఒరిగింది ఏమి లేదు సరిగదా, వీరిని మిలిటెంట్ ఉద్యమాల వైపుకు దృష్టి పెట్ట నియ్యకుండా నిలువరించింది. ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ముఖ్యంగా మెజారిటీ దళితుల, ఆదివాసులు ఒక వేళ్ళ మిలిటెంట్ పోరాటాలు ఆరంభించి ఉండినట్లైయితే, ఈ దేశంలో అంతర్యుద్ధం ఏనాడో వచ్చిఉండేది. ఆ పరిస్థితి గనుక ఉత్పన్న మైతే అగ్ర కుల మనువాదుల పరిస్థితి మరోలా ఉండేది. అలా కాకున్నా సంఖ్యా పరంగా చాతు ర్వర్ణీకుల జనాభా కేవలం 10-12 శాతం కూడా ఉండదు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణియా అగ్రకుల హిందూ మతోన్మాదుల కుట్రలను క్షున్నంగా గమనిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజలు సంఖ్యా పరంగా సమాజంలో మా జనాభా ఎంతో, చట్ట సభలలో మాకు ప్రాతినిధ్యం కూడా అంతే ఉండాలనే డిమాండ్ రోజు రోజుకు బలప డుతుంది. ఈ ఆకాంక్ష నెరవేరి, ఓట్ల రాజకీయాల ద్వారా నైనా ఒక వేళ్ళ బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ) గనుక సంపూర్ణ అధికారంలోకివస్తే, అగ్రకుల పెత్త నానికి గొడ్డలి పెట్టే అవుతుంది. కనుక పాలకులు, ఈ చట్టాన్నిఅడ్డుపెట్టుకుని పంచమ వర్ణ కులాల మధ్య వైషమ్యాలను సృష్టించి, వారి మధ్య ఇప్పుడిప్పుడే చిగు రిస్తున్న ఐక్యత ను దెబ్బతీసి, ఇక ముందు జరగబోవు ఎన్నికలల్లో ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా చేసుకోవాలనే కుట్ర. ఇంతకు ముందు ఎస్సీ రిజ్వేషన్లను అడ్డు పెట్టుకుని మాల, మాదిగలను ఏవిధంగా ఇన్నాళ్లూ విడదీశారో అదే విధంగా ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అడ్డు పెట్టుకుని మిగిలిన సమాజాన్ని అడ్డంగా చీల్చాలనే కుట్రలు పన్నుతున్నారు మనువాద పాలకులు. ఎలాగంటే ....,

పాలకులు, ప్రజలను విడదీస్తున్న ఒక బలమైన వైరుధ్యం బలహీన పడుతున్నప్పుడు, అనగా ఆ వైరుధ్యం ఏదో విధంగా పరీష్కరించ బడుతుందనుకున్నప్పుడు, అగ్రకుల పాలకులు, ప్రజలను మరోసారి విడదీయడానికి మరో బలమైన వైరుధ్యం కొరకు అన్వేషణ జరుపుతారు. ఆ అన్వేషణా పరిశోధనల ఫలితమే. ప్రస్తుతం మాల, మాదిగల మధ్య వర్గీకరణ వైరుధ్యం , అది ప్రస్తుతం బలహీన పడుతుంది, గనుక ప్రజలను విడదీయడానికి మరో శక్తివంత మై న వైరుధ్యం కావాలి, ఈ సారి కుట్ర ఆదివాసులపై మల్లించారు. కానీ లంబాడిల మరియు ఆదివాసుల మధ్య వర్గీకరణ వైరుధ్యం ప్రజలను విడిదీయ డానికి, పాల కులు ఆశించినంతగా పనిచేయలేదు. అనగా, అగ్ర కుల పాలకుల ఆకాంక్షలు ఆశించిన మేరకు నెరవేర లేదు. మరో వైపు ప్రజలు, పాలకుల ఎత్తుగ డలను గమ నించి తమ మధ్య ఉన్న చిన్న చిన్న వైరుధ్యాలను పక్కన పెట్టి, ప్రధాన వైరుధ్యం మైన ʹʹచాతు ర్వర్ణీకులుʹʹమరియు ʹʹపంచమ వర్ణీకులుʹʹ స్పష్టంగా అగ్ర కుల పాలకులు మరియు నిమ్నకుల పాలితులు మధ్య ఉన్న వైరుధ్యాలను తీవ్రతరం చేయడమే గాక వారి మధ్య ఉన్న వైరుధ్యాలను వారు వాటి పరిష్కారం వైపు దృష్టి సారిస్తు న్నారు. దీని నుండి పుట్టిన నినాదమే ʹʹఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలిʹʹ అనే నినాదం. ఈ నినాదంమే భారత సమాజాన్ని చాతుర్వర్ణీకులు గాను అనగా ఆర్యులు గానూ, పంచమ వర్ణీకులు అనగా ద్రావిడులు గానూ రెండు ప్రత్యర్థి సమూహాలుగా చీల్చను న్నారు. దీనికి పార్లమెంటు లో కాంగ్రెస్ ఎంపీ, మల్లికార్జున ఖర్గే నవంబర్ 27,2015న ʹʹమీరు అనగా ఆర్యులు (బ్రాహ్మణ మరియు బ్రాహ్మణేతర అగ్రకులాలు) బయటి దేశాల నుండి వచ్చిన వారనీ, మేము ఈ దేశం మూలవాసులమనీ, ఐదు వేల సంవత్సరాల నుండి మీరు మాపై దాడులుచేసున్నారనీʹʹ చేసిన ప్రకటనా, అలాగే ఈ మధ్యనే సినీ నటుడు శివాజీ ʹʹద్రావిడ రాజ్యంలో ఆర్యుల ఆపరేషన్ʹʹ అంటూ చేసిన ప్రకటన ఒక ఉదాహరణ. ఈ నినాదం ʹʹహిందూ రాజ్యʹʹ నిర్మాణానికి అనగా, ఈ దేశాన్నిసంపూర్ణ హిందూ దేశంగా, గంప గుత్తగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల (ద్రావిడులు) నందరిని హిందు జాతులుగా, హిందువులుగా మార్చాలనే జాతీయ అంతర్జాతీయ ఆర్యుల కూరకు తీవ్ర విఘాతం కలుగు తుంది .

దీనికి సాక్ష్యంగా ʹʹకుల వ్యవస్థ చాలా గొప్పది, కానీ కులాల మధ్య ఆదిపత్యం ఉండకూడదు, అన్ని కులాలను సమానంగా చూడాలి, అలానే శూద్రేతరులను, చాతుర్వర్ణ కుల వ్యవస్థలోకి తీసుకు రావాలి అంటారు ʹʹకలక్టివ్ వర్క్స్ఆఫ్ మహాత్మా గాంధీ 59,227ʹʹలో గాంధి. ఇక్కడ శూద్రేతరులు అంటే శూద్రులు కానివారు అన గా ʹʹపంచమ వర్ణీకులు లేదా పంచములు లేదా అవర్ణులు ʹʹస్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను హిందువులుగా మార్చాలనేది గాంధీ ఆకాంక్ష. ఈ వాదనను బల పరుస్తూ, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం చరిత్ర పూర్వం సంచార యోధులైన కాకేసియన్ ఆర్య జాతి ఉత్తర ప్రాంతం నుండి వచ్చి ఈ దేశంపు మూలవాసులైన నల్లరంగు ద్రావిడులను ఓడించి, ఈ ఉప ఖండంలోవారి సామాజిక సంస్థలను వ్యాప్తి చేసి, అపూర్వమైన వారి ఆధ్యాత్మిక ʹʹహిందూʹʹ సంస్కృతిని నెలకొల్పారని అత్యంత విశ్వాసనీయ టైం-లైఫ్ బుక్స్ లైబ్రరీ,1982లో ప్రచురించిన "బార్బేరియన్ టైడ్స్"(ఆటవిక కెరటాలు లేక రాకాసి అలలు) అనే గ్రంధంలోవ్రాయబడినదని, రిచర్డ్ రాసుల్ కసారో తానూ రచించిన గ్రంధంʹʹరిటన్ ఇన్ ద స్టోన్ʹʹ (రాతి పై రాతలు) అనే గ్రంధంలో రాయడం జరిగింది. మరో సందర్భంలోʹʹఈ ఆర్య జాతి,చరిత్ర పాలకులుగా మారి, వారి నాగరి కథ ను ప్రపంచ వ్యాప్తంగా గొలుసుకట్టుగా ప్రతి ప్రాంతాన్ని కలపాలన్నదే వారి కార్యక్రమంగా కనిపిస్తుందిʹʹ అనీ, మన రక్తనాళ్ళాలలో ప్రవచించే రక్తం ఎటువంటిదైనా కానివ్వరండి, మన ఆలోచనలలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది, నా ఉదేశ్యం ఏమిటంటే, అది మన భాష, భారత దేశంపు ఆర్యులు మాట్లాడే భాషా ఒకటే, ఆ భాష మన శరీరాలను పోషించే రక్తం కంటే ఎంతో ముఖ్య మైనది మరియు పది కాలాలపాటు మనం జీవించి ఉండేలా చేస్తోంది అని, జర్మన్‌ ప్రాచ్య తత్వవేత్త మాక్స్ ముల్లర్, దియోసఫీ అఫ్ సైకలాజికల్ రెలీజియన్ అనే గ్రంధంలో రాయడం జరిగింది.

వాస్తవంగా చీకటి యూగాలలో ఆర్యులు, మూలవాసు లందరిని హిందూఫులుగా మార్చారనేది ఇప్పటివరకు దాచబడ్డ పరమ రహస్య చరిత్ర. కనుక ఇప్పుడు అగ్ర కుల పాలకుల ప్రధాన కర్తవ్యం, ఈ సమాజాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా చీల్చాలి. అందుకు ప్రధాన ఆయుధం ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయడం. దీనితో దళితులు, ఆదివాసులు మరియు అగ్రకులాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని, దళితులూ, ఆదివాసులు మరియు బిసి, మైనారిటీ, ప్రజల మధ్య వైరుధ్యంగా మార్చి, ʹʹకరవ మంటే కప్పకు కోపం-వదలమంటే పాముకుకోపంʹʹలాంటి పీట ముడి వేశారు. ఇప్పటి నుండి దళితులూ, ఆదివాసులు ఒక శిభిరంగానూ మరియు బిసి కులాలు, మైనార్టీలు బద్ద శత్రు శిభిరంగాలుగానూ మార్చాలనేది పాలకుల ఆకాంక్ష.

ఇంతకు ముందు ఇలాంటి పీట ముడి కుట్ర ఫలితంగానే మాల, మాదిగల ఉమ్మడి సమస్య అయిన అంటరానితనం, హత్యలు,అత్యాచారాలు, విద్య, నిరుద్యోగం, ఉపాధి తదితర సమస్యలపై ఉమ్మడిగా ఉద్యమించాల్సిన సోదరుల దృష్టిని గత 35 సంవత్సరాల పాటు కేవలం రిజర్వేషన్ల వర్గీకరణ పై మాత్రమే కేంద్రీకృతమైయ్యే విధంగా కుట్రలు చేశారు. మాదిగల డిమాండ్ న్యాయమైనదేనని కొందరు మాల కుల మేధావులు, మాల కుల ప్రజాస్వామిక వాదులు, మాల కుల విద్యావంతులు, మాల కుల ఉద్యమ కారులు అంగీకరించినప్పటికీ, సమస్యకు పరిస్కారం దొరకనివ్వలేదు. రిజర్వేషన్ల వర్గీకరించాలని మాదిగ కులస్తులు ధర్నా చేసిన, మరుసటి రోజే, మాలల చేత రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేయించిన సందర్భాలు అనేకం. అదృష్టం బాగుండి కొందరు ప్రజాస్వామిక వాదుల కృషి వలన మాలా, మాదిగలు ఇంతవరకు కత్తులు దూసుకుని హింసకు పాల్పడ కుండా నిలవరించ గలిగింది. లేకుంటే వీరిద్దరూ ఒక రిపై ఒకరు హింసకు తల పడితే సమాజం ఎంత అల్లకల్లోలంగా పరిణమించేదో, పెద్దగా ఉహించాల్సిని అవసరం లేదు. ఇప్పు డిప్పుడే వీరిద్దరూ పాలకులు పన్నిన కుట్రలను అర్ధం చేసుకుని, వీరి ఉమ్మడి సమస్యల పై ఐక్యంగా ఉద్యమించడానికి ఒక ఉమ్మడి వేదిక అవసరాన్నిగుర్తిస్తున్నారని భయపడిన పాలక వర్గాలు. ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందనే వాదనను తెర మీదికి తెచ్చి, ఈ సారి మూలవాసులైన ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజలలోని దళితులను మరియు దళితేతరులను విడదీయాలనే కుట్రకు రచనలు చేస్తుంది.

ఐతే నిజంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిజంగా దుర్వినియోగము అవుతుందా, ఈ వాదనలో వాస్తవమెంతుందో పరిశీసిద్దాం.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా చెప్పుకునే దేశంలో, అగ్ర కులాలకు చెందిన, ప్రధాన మంత్రుల వద్ద, ముఖ్య మంత్రుల వద్ద, పార్టీ అధ్యక్షుల వద్ద, కార్యదర్సులు వద్ద, దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమ తోటి అగ్రకుల ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమానంగా, ఎటువంటి వివక్షకు తావులేకుండా ఆత్మగౌరవంతో మెసులుకో గలుగుతున్నారా? అన్న ప్రశ్నకు, తాజాగా ఉత్తర ప్రదేశ్, రాబర్ట్స్ గంజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన చోటేలాల్ కార్వార్ బీజేపి దళిత ఎంపీ మాత్రమే కాదు, ఆ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ సెల్ అధినేత కూడా. తన పార్లమెంటు నియోజక వర్గ సమస్యలను చెప్పుకునేందుకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాద్ ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆదిత్యానాద్ ఆ బీజేపీ దళిత ఎంపీని విపరీతంగా తిట్టి, అవమానించి బయటకు గెంటించి వేయించాడని, ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమీషన్ కు ఫిర్యాదు చేశాడంటే, అందునా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు స్పందనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన భారత్ బంద్, హింసాత్మిక సంఘటనలో 11 మంది దళితులు కాల్చి చంపబడ్డ సందర్భంలోనే ఈ సంఘటన చోటు చేసుకుందంటే, సాధారణ వాతావరణ పరిస్థితులలో దళిత ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వివరణ కావాలా?

ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చేసున్న దళిత ఉద్యోగులు తమ తోటి అగ్ర కుల ఉద్యోగులతో సమానంగా ఆత్మగౌరవంతో విధులు నిర్వహించిన సం దర్భాలు ఉన్నాయంటే అది అతిశయోక్తే అవుతుంది. సహాంజంగా గ్రామానికి ఒక్కరిద్దరు బ్రాహ్మణ పూజారులుంటేనే, ఆ గ్రామ బ్రాహ్మణేతర అగ్ర కులొన్మాదపు ఆధ్యాత్మిక క్షుద్ర పూజల్లో, మూఢ నమ్మకాల్లో, చాణిక్య నీతులతో రాటుదేలిన గ్రామంలో దళితులు నిరంతరం అంటరానితనానికి గురికాబడతున్న సందర్భాలు దేశ గ్రామాలలో కోకొల్లలు. అలాంటిది ʹʹప్రముఖ పాత్రికేయుడు, చరిత్ర కారుడైన కుష్వంత్ సింగ్ వెలువరించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి ప్రభుత్వ కార్యాల యాలలో సగటు 50 శాతం కంటే ఎక్కువ ఉద్యోగులలో బ్రాహ్మణ కులానికి చెందినవారే ఉంటారని గణాంకాలతోసహా వెల్లడి చేసినతరువాత, ఆ కార్యాలయంలో దళిత ఉద్యోగుల దుస్థితి ఎలా ఉంటుందో, ఆ చాణిక్య క్షుద్ర కుట్రలు, జిత్తులమారి ఎత్తుగడలతో సదరు దళిత ఉద్యోగులను మానసిక రోగులుగా మార్చిన సందర్భాలు కోకొల్లలు దొరుకుతాయి, ఆ నరకం అనుభవించిన వారికే అర్ధమౌతుంది. బాధితులుగా కలిసి మెలిసి ఎంతో ఐక్యమత్యంగా ఉండాల్సిన దళిత ఉద్యోగులను, ఎప్పుడు ఒకరిపై ఇంకొకరు ఘర్షణ, ఈర్ష్యలు, ద్వేషం, స్పర్ధలతో సతమతమైయ్యే వాతావరణం రాజ్యామేలుతుంటుందెలా చేస్తారు. మరో పైపు బ్రాహ్మణ మరియు బ్రాహ్మణేతర అగ్రకుల ఉద్యోగుల స్నేహపూర్వకంగా ఉంటూ, దళిత ఉద్యోగి కదలికలు రహస్యంగా ఉన్న తాధికారికి చెరవేస్తారు. ఇక ప్రైవేటు కార్యాలయాలలో పనిచేస్తున్న దళిత ఉద్యోగుల వివక్ష, అణచివేత గురించి ఎంత ఎక్కువగా చెప్పు కున్నా అది తక్కువే అవుతుంది, అక్కడి వాతావరణం కాన్సాన్ ట్రేషన్ క్యాంపును తలపిస్తోంది.

ఈ దేశంలో కుల వ్యవస్థ ఎంత భయంకర మైందంటే, అది ఏకంగా దేశ విభజనకే దారి తీసింది. బెంగాల్ ను, పశ్చిమ బెంగాల్ గానూ మరియు బాంగ్లాదేశ్ గాను, విడదీసిందనే రహస్యం ఎంత మందికి తెలుసూ? కారణం బెంగాల్లో దళితులూ, ముస్లిముల ఐక్యత వలన మనువాద బ్రాహ్మణీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని గుర్తించింది. మార్చి 15, 1947 న కాంగ్రెస్ పార్టీ మరియు హిందూ మహాసభ కలసి దేశాన్ని విభజించే కుట్ర పన్నిందనీ, హిందూ మహా సభ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో అగ్రకుల నాయకులతో ఒక భారీ సమావేశం ఏర్పాటుచేసి. ʹʹమనము ఈ కింది కులాలు మరియు ముస్లింల పరిపాలనలో బ్రతక లేమనీ, అది మనకు అవమానం కూడా అనీ, కనుక బెంగాల్ ను పశ్చిమ బెంగాల్ గానూ, బాంగ్లాదేశ్ గాను విడదీయ వలసిందేనని పిలుపు నిచ్చాడు. ఈ అధికార దాహ బ్రాహ్మణీయ కుట్ర కారణంగా జరిగిన దేశ విభజన అల్లర్లలో 2 కోట్ల మంది దళిత శరణార్థులు ఊచకోత గావించ బడ్డారని ʹʹదళిత వాయిస్ʹʹ మే 22, 2009 సంచికలో ప్రచురించింది. అలానే బంగ్లాదేశ్ దళిత శరణార్థులుగా తమ మాతృ దేశానికి అనగా భారత దేశానికి కాలినడకన తిరిగివచ్చి పశ్చిమ బెంగాల్ సుందర్బాన్‌ దీవులల్లోని, మొరిఝాపి దీవులలో తలదాచుకున్న దళితులను అక్కడ నుండి కూడా తరిమి కొట్టాలనే కుట్రతో, అప్పటి అగ్ర కుల బ్రాహ్మణీయ కమ్యూ నిస్టు (సిపిఎం) ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సుందర్బాన్‌ దీవులల్లోని, మొరిఝాపి దీవి అడవులు రిజర్వు ఫారెస్టు పరిధిలొకి వస్తాయని, దళితులు రిజర్వు ఫారెస్టు చట్టాలను అతిక్రమి స్తున్నారనీ, పర్యావణానికి హానికలుగుతుందని దుష్ప్రచారం మొదలుపెట్టి, చివరికి పొలీసు బలగాలను దింపి, మొరిఝాపి నుండి దళితులను బల వంతంగా ఖాళీ చేయించడం ప్రారంభించింది. అలా ఖాళీచేయించే క్రమంలో జరిగిన పోలీసులు కాల్పుల్లో మొత్తం 5,000 కుటుంబాలకు చెందిన 17,000 దళిత శరణార్థులు గల్లంతు కాగా, వీరిని అత్యంత కిరాతకంగా చంపి ఉంటారనీ, వీరి శవాలను నదీ జలాలలో మొసళ్ళకు, మైదాన ప్రాంత అడవులలోని పులులకు ఆహారంగా మారాయని ʹʹజర్నల్‌ ఆఫ్‌ ఏసియన్‌ స్టడీస్‌ʹʹ వాల్యూమ్‌ 58, సంఖ్య 1 (ఫిబ్రవరి 1999) పేజీ 104-125 లో ʹʹరెఫ్యూజీ రిసెటిల్మెంట్ ఇన్‌ ఫారెస్ట్‌ రిజర్వ్స్‌: వెస్ట్‌ బెంగాల్‌ పాలసీ రివర్సల్‌ అండ్‌ మొరిఝాపి మసాకిర్‌ʹʹ అనే పరిశోధనాత్మక వ్యాసంలో "మొరిఝాపి దళిత ఉచకోతలను" ప్రచురించారు రాస్‌ మల్లిక్‌.

16 నిమిషాలకు దళితుడిపై ఒక దాడి. ప్రతి రోజు నలుగురు దళిత మహిళలపై మానభంగం, ఒక వారంలో పదమూడు మంది దళితులు హత్యగావించ బడుతున్నారు మరియు ఏడుగురు దళితులు కిడ్నప్ చేయ బడుతున్నారని 2012 లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి) వెల్లడించగా. అగ్ర కుల పెత్తందార్లు 2016 లో దళితులపై 40,000 దాడులు, గిరిజనుల పై 6,500 దాడులు జరిపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తన 2017/ 2018 నివేదికలో పేర్కొన్నది. ఒక అద్యాయనం ప్రకారం, ఎస్సీ/ఎస్టీ లపై జరిగిన అత్యాచార దాడులు 2009 లో, దళితులపై 33,412 దాడులు జరగగా, గిరిజనులపై 5,250 దాడులు జరిగాయి. ఐతే అవి 2014 లో అనూహ్యంగా పెరిగి, 2014లో దళితులపై 47,064 దాడులు జరగగా, గిరిజనులపై 11,541 దాడులు జరిగాయి. అనగా ఎన్ సి ఆర్ బి 2014 ణాంకాల ప్రకారం, 704 మంది దళితులు హత్య గావించ బడగా 2,250 మంది మానభంగాలు గావించబడ్డారు, అదే గిరిజనులు 157 మంది హత్య గావించబడగా 925 మంది మానభంగాలు గావించబడ్డారు. భారత శిక్షా స్మృతి (ఐ పి సి ) ప్రకారం 45 శాతం శిక్షలు పడుతుంటే ఎస్సీ/ఎస్టీ అత్యా చార నిరోధక చట్టం ప్రకారం కేవలం 28 శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయని ఎన్ సి ఆర్ బి రిపోర్ట్ పేర్కొన్నదని బిజినెస్ స్టాండర్డ్ జులై 4,2016 సంచికలో వెల్లడించింది. ఎన్ సి ఆర్ బి రిపోర్ట్ 2015 గణాంకాల ప్రకారం ఈ దేశ జనాభాలో16.6 శాతం దళిత జనాభాలో 20.9 శాతం దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారు కాగా, 21.6 శాతం అండర్ ట్రైల్ ఖైదీ లుగా జైళ్లలో మగ్గుతున్నారు. కాగా గిరిజనులు దేశ జనాభాలో 8.6 శాతం కాగా వీరిలో 13.7 శాతం దోషులుగా జైలు శిక్ష అనుభ విస్తున్నవారు కాగా 12.4 శాతం అండర్ ట్రైల్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతు న్నారని న్యూస్ లింక్ తెలియజేసింది. అలాగే దళితులపై ఉత్తర్ ప్రదేశ్ 2012లో 6,201 దాడులు, 2013లో 7,078 దాడులు, 2014లో 8,066 దాడులు. రాజస్థాన్ రాష్ట్రం 2012లో 5,559 దాడులు, 2013లో,6,475, దాడులు, 2014 లో 6,734. బీహార్ రాష్ట్రంలో 2012లో 4,821 దాడులు 2013లో 6,721 దాడులు 2014 లో 7,874. మధ్య ప్రదేశ్ లో 2012లో 2,875 దాడులు జరగగా 2013లో 2,945 దాడులు జరగగా, 2014లో 3,294 దాడులు జరిగాయని ʹʹసామాజిక అన్యాయంʹʹ శీర్షికన జాతీయ ఇంగ్లీష్ దిన పత్రిక ద హిందు, తేదీ : జులై 25,2016 కథనం ప్రచురించింది. తమిళనాడులో దళితు లపై జరుగుతున్నాదాడుల పరంపను ఎన్ సి ఆర్ బి నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2013లో 28 మంది దళితులను 2014లో 43 మంది దళితులను అత్యంత కిరాతకంగా చంప బడ్డారని ఫ్రంట్ లైన్ మార్చ్ 30 2016లో ప్రచురించింది.

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని 18 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు అన్నాడంటే, ఆ పార్టీ అగ్రకుల ఎంపీ, ఎమ్మెల్యేలకు చాటి దళిత ఎంపీ, ఎమ్మెల్యేల పట్ల, తమకు ఓటేసి గెలిపించిన దళిత ప్రజల పట్ల సమాజంలో ఎటువంటి ఏహ్య, చులకన భావం ఉందో ఇట్టే అర్ధమౌతుంది. మరో ముఖ్య మంత్రి ఆదిత్యనాద్, ఉత్తర ప్రదేశ్ దళిత వాడను సందర్శించే ముందు ఆ వాడలోని దళితు లందరు సబ్బుతో స్నానం చేసి శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీచేస్తాడు. హర్యానా రాష్ట్రం, ఫరీదాబాద్ జిల్లా సున్ పెరా గ్రామంలో 21 అక్టోబర్2015 న ఇంట్లో నిదిరిస్తున్న దళిత కుటుంబం పై కొందరు రాజపుట్ అగ్ర కుల పైచాచిక మూకలు పెట్రోల్ పోసి ఇంటిని తగలపెట్టగా, ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు కాలి బూడిదైన సంఘటనలో, ఈ హత్యకు స్పందిస్తూ మాజీ ఆర్మి చీఫ్ మరియు కేంద్ర మంత్రి విజయ్ కుమార్ సింగ్ మాత్రాడుతూ, కుక్కలను ఎవరో రాళ్లతో కొట్టి చంపితే ప్రభుత్వం ఏవిధంగా బాధ్యత పడుతుం ది? అని వ్యాఖ్యానించాడు. ఈ దేశంలో మనుషులను చంపడం, పశువులను చంపడంతో సమానం అని ఒక కేంద్ర మంత్రి అభిప్రాయ పడటం, దాన్ని సమాజం, మీడియా మౌనం వహించడాన్నిఎలాఅర్ధం చేసుకోవాలి?

ఒకే దేశంలో నివసించే, ఒక సాధారణ ప్రజల సమూహానికి, మరో సాధారణ ప్రజల సమూహం మధ్య శత్రుత్వం ఉండటానికి కారణాలేంటి? మూకుమ్మడిగా, చాటి మనుషులను, విష సర్పాలను, క్రూర మృగాలను వెంటాడి వేటాడి క్రూరాతి క్రూరంగా చెంపే ఉన్మాదానికి ప్రధాన కారణాలేంటి? చాతుర్వర్ణీకులు అనగా పీడక కులాల కు, పంచమ వర్ణీకులు అనగా పీడిత కులాల పట్ల ʹʹభిన్నత్వంలో ఏకత్వం - ఏకత్వంలో భిన్నత్వంʹʹ లాంటి సమైక్యతా, ఏక్తా భావజాల స్ఫూర్తి ఏ కోశానా కని పించక పోవడాన్ని కారణాలేంటి? పీడక కులాలు, పీడిత కులాలు ఒకే జాతిగా ఎందుకు కలిసి మెలిసి జీవించరు? అసలు అగ్ర కులాలు, నిమ్నకులాలు అనే బేధ భావం రావడానికి చారిత్రిక కారణాలేంటి అని చూసినప్పుడు .

ప్రాచీన ఆర్యుల వలస పశ్చమ దిశగా సాగిందని భాషా పరమైన పరిశోధనల ఆధారంగా జోన్స్ చెప్పడాన్ని, ప్రఖ్యాత జర్మనీ తత్వ వేత్త జార్జి విల్హేల్ ఫ్రెడ్రిచ్ హెగెల్ 1770 - 1883 విశ్వసించాడు. నార్వేకు చెందిన సంస్కృత పండితుడు, క్రిస్టియన్ లాసెన్ (1800-1876) ఆ వాదనను సమర్ధిస్తూ, భారత దేశంలోని తెల్ల వర్ణం గల అగ్ర కులాల వారిని ప్రాచీన ఆర్యులుగా పేర్కొన్నదని, రిచర్డ్ రాసుల్ కసారో రిటన్ ఇన్ ద స్టోన్ అనే గ్రంధంలో రాయడం జరిగింది. భారత దేశంలో కొందరు తెల్ల రంగు చర్మంగల వారు, మరి కొందరు నల్ల రంగు చర్మం గల వారు స్పష్టమైన తేడాతో కనిపిస్తారు. వీరిద్దరి ఆలోచ నల్లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ, సంస్కృతి సాంప్రదాయాలలో, ప్రవర్తనలోను, గుణగణాలలో, ఆహారపు అలవాట్లలోనూ ఎంతో స్పష్టమైన తేడా లు కనిపిస్తాయి .

భారత దేశ మూలాల్లోనే తీవ్రమైన పక్షపాతం కొనసాగు తుందని ఆ ప్రభుత్వం ఒప్పుకుని తీరాలని, కొందరి పట్ల పక్షపాతం, కుల వ్యవస్థలోనే ఉందనీ. కఠోర వివక్ష వైఖిరి ఈ ప్రబలమైన కుల వ్యవస్థ జాతి వివక్షతో ముడిపడి ఉందనీ. ప్రభుత్వాలు ఈ విషయాలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదనీ. నల్లరంగు కారణంగా దళితులూ, అంటరానివారి పట్ల ప్రభుత్వాలు శత్రు వైఖరిని ప్రదర్శిస్తుంది. అని భారత ఆఫ్రికన్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు శామ్యూల్ జాక్ ʹʹఈ జ్ ఇండియా ఎ రెసిస్టు కంట్రీ?ʹʹ అని ఏప్రిల్ 7,2017 ద హిందు దిన పత్రిక ద్వారా ఒక ప్రక టన చేసాడు. ఔను శామ్యూల్ జాక్ అన్నట్లు, భారత దేశంలో నివసిస్తున్న ప్రజలం దరూ ఒకటిగా ఏ నాడు లేరు. ఒకటిగా ఏ నాడు జీవించ లేదు ʹʹభిన్నత్వంలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వంʹʹఅదర్శవంతమైన సమైక్యతా నినాదాలు వట్టి బూటకమే.

మన దేశంలో బలవంతులు, బలహీనులను వెంటాడి వేటాడి చెంపే సంస్కృతి, పులులను, సింహాలను, చిరుతపులను, వేట కుక్కలను, తోడేల్లను ఉసిగొల్పి, ఉమ్మడిగా జింకలను వెంటాడి వేటాడి చంపి తింనే పశు సంస్కృతి వేద కాలంనాటిదే. ఒక్క బీహార్ రాష్ట్రంలో భారీ దళిత ఊచకోతల సంఘటనలు అనగా, సార్తువా (1995), బదానీతోలా (1996), లక్ష్మన్ పుర బాతే (1997), ఇక్వారి (1997), శంకర్ బిగా (1999), మియన్పుర (2000)లో జరిగిన దళిత హత్యల లో, కేవలం 1995 నుండి 1997 జరిగిన ఉచకోతలలో, అనగా మూడు సంవత్సరాల కాలంలో ఆరు నరసంహార వేదాలలో 144 మంది దళితులను చంపగా, బీహార్ మొత్తంగా 16 మారణకాండలలో 300 మంది చిన్నారులు మహిళలను అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనలను, ప్రఖ్యాత మీడియా సంస్థ ʹʹద వైర్ʹʹ ఆపరేషన్ బ్లాక్ రైన్, స్టింగ్ ఆపరేషన్ ద్వారా అసోసియేట్ ఎడిటర్ కె.ఆషిస్ చేతిలోని కెమెరా కంటి ముందు నిలబడి. ఈ హత్యలు మేమే చేశాం,సాక్ష్యాలనుకూడా లేకుండా చేశాం, నిర్దోషులుగా విడుదలైన నేరగాళ్లే స్వయానా తిరుగు లేని సాక్ష్యాలు చెప్పు కున్న ఆధారాలు ఇప్పటికి ʹʹఇంటర్నెట్ యు ట్యూబ్ʹʹ లో ఈ దేశ సర్వోన్నత న్యాయ వ్యవస్థను సవాల్ చేస్తూనే ఉన్నాయ్. ఈ హంతక ముఠాకు నాయకత్వం వహించిన ఈ అరుగురు ʹʹరణ వీర సేనʹʹ కమాండర్లకు, వెన్నుదన్నుగా నిలిచి, ఆర్ధిక, రాజకీయ, ఆయుధ అనగా సత్యంత ప్రమాధ కరమైన ఎకె47, ఎస్ఎల్ఆర్, ఎల్ఎంజి, వంటి మారణాయుధాలను సరఫరా చేసి, నేరం చేయమని ఈ నరసం హారాన్నిప్రోత్సహించిన వారిలో సాక్షాత్తు మాజీ మానవ వనరుల శాఖా (హెచ్ఆర్ డి) మంత్రి మురళీ మనోహర్ జోషి, మాజీ ఆర్థిక శాఖా మంత్రి యస్వంత్ సిన్హా, శివానంద్ తివారి, పి.సి. ఠాకూర్, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, అంతిమంగా దేశ మాజీ ప్రధాని చంద్ర శేఖర్ సింగ్ ఉన్నారని స్పష్టంగా చెప్పినపుడు. ప్రేరేపిత నేరస్తుల పైనా, ప్రత్యక్షంగా నేరంలో పాల్గొన్న నేరస్తులపైనా, ఫిర్యాదు చేయడానికి ప్రజలకు ధైర్యం చాలక భయంలో మగ్గుతు న్నపుడు, కోర్టులు ఈ నేరస్తులపై సూ-మోటో కేసు నమోదుచేసి కఠిన శిక్షలు విధించ నప్పుడు. కోర్టులలో న్యాయమూర్తులు ఆత్యధికంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతర అగ్ర కులస్తులే న్యాయ నిర్ణీతలైనప్పుడు. దళితుల తమ రక్షణకు చివరి అస్త్రం ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టమేనని భ్రమ పడుతున్నప్పుడు, ఆ చట్టాన్ని కూడా గొంతు నులిమి చంపాలని కుట్రలు చేస్తున్నప్పుడు. హిందూమతోన్మాదపు వేట కొడవళ్లు , ఎకె 47, ఎస్ఎల్ఆర్, ఎల్ ఎంజి, గుండ్ల షికారి మూల మలుపులో బిక్కు బిక్కు మంటూ తచ్చాడుతున్న దళితులు, ఆదివాసులు ఇక నుంచి వేసే ప్రతి అడుగూ, రణరంగం కానిచోటు భూ స్థలమతా వెతికిన దొరికదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో.

No. of visitors : 375
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •