మే డే స్ఫూర్తి అజరామరం!

| సంపాద‌కీయం

మే డే స్ఫూర్తి అజరామరం!

- బాసిత్ | 02.05.2018 10:18:41am

8 గంటలు పని, 8 గంటలు మానసికోల్లాసం, 8 గంటలు విశ్రాంతి అనే ప్రామాణిక పని దినం కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఇప్పటికే శ్రామిక వర్గ పోరాటాలను ప్రేమించే ఉద్యమకారులను ఉత్తేజితులను చేస్తుంది.

ʹతక్కువ పనిగంటల కోసం పోరాడడం కూడా వర్గపోరాటంలో భాగమేʹ అనే సృహ వారిలో ఎలా కలిగింది?

ʹప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడి ఉంది!ʹ అనే సృజనాత్మక అన్వయం, విప్లవ కవి చెరబండరాజుకు ఎలా స్ఫురించింది?

కొంచెం లోతుల్లోకి వెళ్దాం.

ʹమే డేʹ లేదా ʹఅంతర్జాతీయ శ్రామిక పోరాట దినోత్సవంగాʹ ప్రపంచ వ్యాప్తంగా శ్రామికులు పిలుచుకునే ఈ రోజుకు ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? దీని మూలాలు ఎక్కడివి? ఎక్కడినుంచి ఎక్కడి దాకా ఆ వెలుగు ప్రసరించింది? ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు దీనిని అత్యంత గౌరవ ప్రతిపత్తులతో జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కథా కమామీషు ఏమిటి?
అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.

మే డే, శ్రామిక హక్కుల పోరాటం అమెరికాలో ప్రారంభం అయినప్పటికీ, దీని మూలాలు మొత్తం యూరోపియన్ సమాజంలో, పారిశ్రామిక విప్లవానంతరం జరిగిన పరిణామాల్లో ఉన్నాయి. శ్రామిక వర్గ చోదక శక్తి వల్లనే ఐరోపా అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరిగి, దాని పర్యవసానంగానే వీలైనంత చౌకగా కార్మికుల శ్రమను కొల్లగొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడుదారులు అర్రులు చాచడం మొదలైంది. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘ పని గంటల వలన స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా చావడమో, రోగాల బారిన పడడమో పెరిగి పోయింది.

పందొమ్మిదో శతాబ్దం ప్రథమార్థంలో శ్రామికునికి లేదా శ్రామికురాలికి ప్రాణం కాపాడుకోగలిగేంత తిండికి, మరో శ్రామికున్ని పుట్టించేంత శక్తి ఒనగూరగలిగేంత మేరకు మాత్రమే వేతనం ఇవ్వబడి, ఆ శ్రామికుడు లేక శ్రామికురాలు అత్యంత కనిష్ట ఆయుష్షులోనే చచ్చేలా శ్రమ దోపిడి జరిగిన కాలమది.

ʹగత కాలం మేలు.. వచ్చు కాలం కంటెన్ʹ అని ఎవరన్నారో కానీ, ʹనరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వంʹ అని మహా కవి చెప్పింది జగమెరిగిందే.

ఈ స్థితి అమెరికాలో మరింత దారుణంగా మారింది.

ఇటువంటి స్థితిని ముందే ఊహించిన మార్క్స్ 1864 లో, మొదటి ఇంటర్నేషనల్లో 8 గంటల ప్రామాణిక పనిదినాన్ని డిమాండ్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. అప్పటికే 1847 నాటికే కమ్యూనిస్టు లీగ్ ఏర్పాటులో తలమునకలైన మార్క్స్ 1848లో ఏంగెల్స్ తో కలిసి ʹకమ్యూనిస్టు మానిఫెస్టోʹ రచించాడు. కార్మిక వర్గమే అగ్రగామి దళంగా రూపొంది, మొత్తం సమాజాన్ని దోపిడీ, పీడనల నుండి విముక్తి చేసే చోదకశక్తిగా తన పాత్ర పోషిస్తుందని మార్క్స్ సూత్రీకరణ చేశాడు. అందులోంచే "ప్రపంచ కార్మికులారా ఏకం కండి!",
"పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప!" అనే పిలుపు ఇచ్చేంత దార్శనికతతో ఉన్నాడు.

కనుక 1886లో అమెరికాలో " ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్", ʹ8 గంటల ప్రామాణిక పని దినంʹ ను డిమాండ్ చేయడానికి పూర్వం పైన పేర్కొన్న నేపథ్యం అంతా ఉంది.

ʹఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ʹ- FOTLU, ఇది తదనంతర పరిణామాల్లో ʹఅమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ - AFLʹ గా మారింది.
అమెరికాలోని అత్యంత పెద్ద కార్మిక సంస్థ ఆధ్వర్యంలో 1886 మే 1న చికాగో లో 3 లక్షల కార్మికులు తాము చేస్తున్న పనులను వదిలిపెట్టి వీధుల్లోకి వచ్చేశారు. తర్వాత రోజుల్లో మరిన్ని వేల కార్మికులు జత కూడారు. ర్యాలీ, ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

అయితే మూడో రోజు, అంటే మే 3 వ తేదీన ప్రఖ్యాత ʹహే మార్కెట్ʹ ప్రాంతంలో నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. కొద్ది మంది అధికారులు గుంపును చెదరగొట్టి నిరసన ప్రదర్శనను ముగింప జేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో ఎవరో గుంపులోంచి బాంబు విసిరేయడంతో 7 గురు పోలీసులు, 8 మంది పౌరులు మరణించారు.

ʹహే మార్కెట్ హింసాత్మక సంఘటనʹ దేశ వ్యాప్తంగా నిర్బంధాన్ని పెంచింది. 1886 ఆగస్టు నాటికి 8 మందిని బాధ్యులుగా ముద్రవేసి, ఎలాంటి సాక్షాధారాలు లేకుండానే అందులో ఆగస్ట్ స్పైస్, సామ్యెల్ ఫీల్డర్, అడాల్ఫ్ ఫిషర్, అల్బర్ట్ ఆర్.పార్సన్స్, మైఖేల్ స్వాబ్, లూయిస్ లింగ్ అనే పేర్లు గల 7 గురికి మరణశిక్ష, మరొకరికి (ఆస్కార్ నీబ్ కు)15 ఏళ్ల కారాగార శిక్ష వేసింది, అమెరికా ʹన్యాయకోవిదులʹ బృందం. అయితే అంతిమంగా అందులో జార్జ్ ఏంగెల్, ఆగస్ట్ స్పైస్, సామ్యెల్ ఫీల్డర్, అడాల్ఫ్ ఫిషర్ అనే 4 గురిని ఉరితీయగా ఒక వ్యక్తి (లూయిస్ లింగ్) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగతా ముగ్గురికి ఆరేళ్ల తర్వాత ʹక్షమాభిక్షʹ ʹప్రసాదించారుʹ.

అయితే సంఘటనతో సంబంధం లేని వారిని కేసులో ఇరికించి, ఆ తర్వాత క్షమాభిక్ష ʹప్రసాదించడంʹ వంటి ʹటెరిబుల్ డ్రామాʹ ఆడుతున్నారని ʹజోస్ మార్టిʹ అనే కార్మిక నాయకుడు గ్రాండ్ జ్యూరీకి అత్యంత భావోద్వేగ లేఖను , జనవరి 1, 1888న పోస్ట్ చేశాడు.ʹనిజానికి ప్రభువర్గం కిరాయి మనిషి ఆనాటి ʹహే మార్కెట్ ఘటనలోʹ బాంబు విసిరాడని, కార్మికులు ప్రశాంతంగా ర్యాలీ లో పాల్గొని, జెఫ్స్ హాల్ మీటింగులో ప్రసంగాలు వింటున్నారనిʹ నాటి లేఖలో మార్టి కళ్లకు కట్టాడు.

తదనంతరం ఐరోపాలోని సోషలిస్టు, లేబర్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు "హే మార్కెట్ అమరుల" గౌరవార్థం మే 1, 1890 న లండన్లో ఒక ప్రదర్శన ఇవ్వాలని పిలుపు నిచ్చాయి. అప్పుడు కూడా 3 లక్షల ప్రజలు పాల్గొని ప్రపంచాన్ని నివ్వెర పరిచారు.

అప్పటి నుంచి సోషలిస్టు, కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ప్రభుత్వాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ʹమే డేʹ ను కార్మికుల దినోత్సవంగా గుర్తిస్తున్నాయి. 66 దేశాలలో అధికారికంగా, అంతకంటే ఎక్కువ దేశాలలో అనధికారికంగా మే 1 వ తేదిని, ʹలేబర్ హాలిడేగాʹ, ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నారు. అట్లా ఇప్పటికి 128 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా శ్రామికులు ఒక పోరాట దినంగా ʹమే డేʹ ను జరుపుకొంటున్నారు.

అట్లాగే,1893, జనవరి 23 నాటికే ʹహే మార్కెట్ అమరులʹ స్మారక స్థూపాన్ని చికాగో నగరానికి సమీపంలో ఇలినాయిస్ లో ఫారెస్ట్ పార్క్ లో నిర్మించుకున్నారు.

అయితే విడ్డూరంగా, ఎక్కడైతే ఈ 8 గంటల పనిదినం కోసం కార్మికులు తమ రక్తం చిందించారో, ఆ అమెరికాలో ʹమే డేʹ ను జరుపుకోవడం చాలా అరుదు.

అంతే కాదు. 1894లో అప్పటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్లాండ్ దురాలోచనతో ʹమే డేనిʹ కాస్తా సెప్టెంబర్ నెల మొదటి సోమవారానికి అధికారికంగానే వాయిదా వేయించాడు. అమెరికా భయమల్లా మార్క్స్ పిలుపు ఇచ్చినట్లు ʹప్రపంచ కార్మికులంతా ఏకమైʹ తమ సామ్రాజ్యవాద పెట్టుబడి కోటల్ని ఎక్కడ కూలుస్తారో అని.

అయితే, అక్కడితో కూడా ఆగలేదు. 1958లో "హే మార్కెట్ ఘటనʹ జ్ఞాపకాలను తుడిచెయ్యడానికి ʹడ్వైట్ డి. ఈజన్హోవర్ʹ ʹమేడేʹ పేరు మార్చి ʹన్యాయ దినంగాʹ జరుపడానికి ప్రయత్నాలు జరిపాడు. సరే, వర్గ స్వభావమే అంత. శ్రామికుల రక్తాన్ని జుర్రుకొని సంపద పోగేసుకోవడానికి అలవాటు పడ్డవారు, తమ పీఠం కదులుతుందనే యావ కొద్ది కార్మిక సోదరుల పర్వ దినానికి తమకు తోచిన తరహాలో నీరుకార్చారనుకోవడంలో అతిశయోక్తి లేదు.

మార్క్స్ ద్వి శత జయంతి సందర్భంగా మే డే స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది.

విశ్వ మానవునిగా తనను తాను ప్రకటించుకొని ʹసకల దేశ కార్మికులారా! ఏకం కండి!ʹ అని పిలుపు నివ్వడం ద్వారా సంపద పోగుపడిన దేశాల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, వలస దోపిడీ లేదా పెట్టుబడిదారి దేశాల పాలక వర్గాల దోపిడి వలన సకల దేశాలలో ఉండే శ్రామిక ప్రజలకు, ముఖ్యంగా, తృతీయ ప్రపంచ దేశాల ప్రజలకు, ఆయా దేశాలలో అంతర్గతంగా కూడా ఏర్పడనున్న ముప్పును ఊహించాడని చెప్ప వచ్చు. నిజానికి తన ʹఅదనపు విలువ సిద్దాంతంʹ ప్రకటించే ప్రాపంచిక దృక్పథం ఇదే. శ్రమ వల్లే వస్తువుకు విలువ పెరిగి, దానికి కారణభూతుడైన శ్రామికుడు, ఆ వస్తువుకు పరాయీకరణ చెంది, తద్వారా శ్రామికుడు వంచనకు గురయ్యే విషాదకర పరిణామం ఒక వైపు, చౌక శ్రమ దోపిడీ వల్లనే సమాజంలో ఒక్క శాతం సంపన్న వర్గం చేతిలో 80 శాతం సంపద పోగుపడుతుందనేది స్థూలంగా అర్థం చేసుకోవాలి.

అట్లాగే 1890 నాటి 8 గంటల పనిదినం ప్రమాణాన్ని ఇవ్వాళ 128 ఏళ్ల తర్వాత కూడా అదే ప్రమాణంగా పాటించనక్కర లేదు. యాంత్రికీకరణ బాగా పెరిగిన ఈ 21 వ శతాబ్దంలో ఆ ʹయంత్రలాభంʹ ఏదో శ్రామికుడికి కూడా దక్కడం న్యాయం. ఎందుకంటే, ʹపని గంటలు తగ్గించుకొనే పోరాటం కూడా వర్గపోరాటంలో భాగమేననిʹ మార్క్స్ చాటి చెప్పిన విషయాన్ని మరవొద్దు.

అయితే శ్రామిక వర్గ సమగ్ర విముక్తి కోసం దీర్ఘకాలిక వర్గపోరాటం తప్ప మరో మార్గం లేదు.

ఇప్పటికే చికాగో అమరులు చిందించిన రక్తం అందించిన త్యాగఫలాలు సకల దేశ శ్రామికులు అందుకుంటున్నారు. కనుక ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి.

No. of visitors : 420
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

| 24.07.2016 09:12:28pm

మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన విర‌సం బృందం ప‌రిశీలించిన విష‌యాలు నివేదిక రూపంలో విర‌సం స‌భ్యుడు బాసిత్ వివ‌రించారు.......
...ఇంకా చదవండి

హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

శోవన్ చౌధురి | 15.05.2016 01:15:10pm

"జేఎన్‌యూ వారు కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే అరెస్టు చేయగా, మేం 30 మంది దాకా విద్యార్థులను జైల్లో పెట్టేసాం. అదృష్టవశాత్తు మేం వైమానిక బలగా...
...ఇంకా చదవండి

దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

బాసిత్ | 19.10.2017 09:42:40pm

తను ఒళ్లమ్ముకున్నట్లుగా, కన్నీళ్లమ్ముకొనే స్థితికి దిగజారడానికి కారణం ధనిక భూస్వామ్యంతో పాటు వేళ్లూనుకున్న పితృస్వామిక కుల వ్యవస్థ అనేది శశికి జైవికంగానో, ...
...ఇంకా చదవండి

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

బాసిత్ | 04.09.2017 09:10:50am

మొత్తం వ్యవస్థ మార్పు దిశలో కృషికి ఇంకొంచెం పెద్ద ప్రయాస అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులంతా సమిష్టి పోరాటంలో భాగం కావాల్సి ఉంటుంది....
...ఇంకా చదవండి

వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?

బాసిత్ | 15.06.2018 11:58:23pm

అధికారులు,రాజకీయ నాయకత్వంలో కించిత్ కదలిక లేక పోవడంతో 13 తేదీన దీక్షా శిబిరం నుండి కోలుకొండ దళితులంతా 2 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి 197 సర్వే నంబరుతో ఉన్న.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •