ప్ర‌జా వీరులు... పూజారి కాంకేర్ అమ‌రులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ప్ర‌జా వీరులు... పూజారి కాంకేర్ అమ‌రులు

- జగన్ | 02.05.2018 10:23:06am

వాళ్లు అమరులు. వాళ్లు మొన్ననే యుద్ధానికి బయలుదేరారు. నిన్న యుద్ధం చేసారు.వాళ్లు అమరులయ్యారు. నేడు మనం వారిని సంస్మరించుకుంటున్నాం. తెలిసి తెలిసి వాళ్లు యుద్ధాన్ని ఎంచుకున్నారు. తల్లితండ్రులకు చెప్పి వచ్చారు. ఊరు ఊరంతా (జనతన సర్కార్‌గా మారిన) వారి ప్రజారాజ్యమంతా ఆనందంగా, ఉత్సాహంతో వారిని అభినందించి పీఎల్‌జీఏలోకి భర్తీ చేసి పంపించింది.

యుద్ధం నడుమ, దాడులను ఎదుర్కొంటూ, నష్టాలను చూస్తూ మరిన్ని కష్టాలు నష్టాలు ఉంటాయని తెలిసి తెలిసి తమ పిల్లల్ని పంపే కర్తవ్యాన్ని చేపట్టారు. జీవి పుట్టుక లాగే మరణం సహజం. ప్రకృతి సిద్ధమైన మరణానికి కాదుగాని ప్రకృతిని కాపాడడానికి, అందులో సహజంగా జీవించాలనుకుంటున్న జన సమూహాలను కాపాడాలని ప్రకృతిని, ప్రపంచాన్ని, భవిష్యత్‌ను కాపాడాలని వాళ్లు ఆ పిల్లల్ని యుద్ధరంగానికి పంపారు. ఉద్యమాన్ని కాపాడండి అని, నాయకత్వానికి రక్షణ కల్పించండని చెప్పి పంపారు. నియమాలు పాటించాలని, క్రమశిక్షణ తప్పకూడదని, కర్తవ్యాన్ని విడవకూడదని, ప్రాణత్యాగానికి సిద్ధపడాలని ప్రజా సభలో అర్థం చేయించి పంపారు. పేగు బంధాన్ని, రక్త సంబంధాన్ని, హృదయ స్పందనను ఉద్యమ పథాన పంపారు. బిడ్డలు అమరులైతే వాళ్ల నైపుణ్యాలను, ధైర్య సాహసాలను ఎత్తిపట్టి మళ్లీ ఇప్పుడు కొత్త చిగురుల్లాంటి లేలేత ప్రాయంగల తర్వాతి వరుస బిడ్డలను అన్నల, అక్కల బాటన నడవండని పంపిస్తున్నారు. నష్టాలు కొనసాగుతున్నా పంపడం ఆగలేదు. యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఇవ్వాల్టి చరిత్ర కాదు. వేల యేండ్ల నుండి కొనసాగుతున్న, రగులుతున్న చరిత్ర.

అందులో ప్రభాకర్‌ ఒక్కడే ఒక్కడు తల్లితండ్రులకు చెప్పకుండా, భార్య చెబుతున్నా వినకుండా, అత్త వద్దన్నా, మామ అడ్డంకులు కల్పించినా ఆగకుండా ఉద్యమంలోకి వచ్చి ఇరవై ఏళ్లు పనిచేసి అమరుడయ్యాడు. యాభై సంవత్సరాలు దాటినవాడు. మైదానాల నుండి, అందునా వరంగల్‌ పట్టణ శివారు గ్రామం నుండి వచ్చాడు. విద్యావంతుడై, విద్యను బోధిస్తూ విజ్ఞానాన్ని పంచుతూ తను విద్యార్ధిగా ఉద్యమ పథాన నేర్చుకుంటూ నిలిచి పోరాడి అమరుడయ్యాడు. విప్లవ తత్వంతో ప్రేమను పంచి, ఎందరినో తన చుట్టూ కూడగట్టుకున్నాడు.

ఆ తొమ్మిది మంది అమరులందరూ బస్తర్‌ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం నుండి వచ్చారు. అందరూ జనతన సర్కార్లు ఏర్పడిన గ్రామాల నుండి ఆ సర్కార్లు ఇచ్చిన రాజకీయ జ్ఞానంతో ఎదిగి ఉద్యమ బాటన నడిచి వచ్చారు. అక్కడ అమరులయిన వారిలో కొద్దిమంది 1996లో ఏర్పడిన గ్రామరాజ్య కమిటీలు, 2001 తర్వాత విముక్తి ప్రాంత లక్ష్యంతో బేస్‌ ఏరియా అవగాహనకు అనుగుణంగా జనతన సర్కార్‌ ఏర్పడ్డాక బాలల సంఘంలో చేరిన వాళ్లున్నారు. తమ కుటుంబాలతోపాటు ఈ పిల్లలు కూడా సల్వాజుడుం నరహంతక దాడుల్ని అనుభవించారు. తమ ప్రతిఘటన వల్లనే సాల్వాజుడం దాడుల నుంచి బతికి బయటపడ్డామని, ఊరును, భూమిని, ప్రకృతి వనరుల్ని కాపాడుకున్నామని, ఈ క్రమంలో చావు బతుకుల (వైరుధ్యాన్ని, పోరాటపు గతితర్కాన్ని) సారాన్ని అర్థం చేసుకున్నామని చెప్పారు. పదార్థ చైతన్యాల సంబంధం నిత్యం, సత్యం అన్న గ్రహింపును ఆకలింపు చేసుకున్నారు. జీవితం, పోరాటం పెనవేసుకున్న జీవితానుభవంతో వైరుధ్య సారాన్ని అదే లెనిన్‌ చెప్పిన గతితర్క సారాన్ని గ్రహించారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు గురించి వారు ఎంతో కొంత తెలుసుకున్నారు. వారి బోధనలు వింటున్నారు. ప్రభాకర్‌కు అర్థమయినంత లోతుగా, విస్తృతంగా మార్క్సిజం వారికి బోధపడి ఉండక పోవచ్చు. కానీ మార్క్సిజం వాళ్ల జీవితంలోకి ఆచరణ జ్ఞానంగా జీర్ణం అయ్యింది. ʹచరిత్రంతా వర్గపోరాటాల చరిత్రేʹ అన్న జ్ఞానం జీవితం పొడవునా నిత్యసత్యంగా నిలబడి జీవితం, పోరాటం విడి విడిగా లేవన్న జ్ఞానంగా కొనసాగుతూనే ఉంది.

ఈ అమరుల చరిత్రను లోతుగా పరిశీలిస్తే తెలంగాణ బిడ్డ వరంగల్‌ కేంద్రంగా విద్యా బుద్ధులు నేర్చిన ప్రభాకర్‌కు నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాల ప్రభావంతో నడిచిన కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఉద్యమ ప్రభావం ఉంది. తాను స్వయంగా 1990 దశకం ఉత్తర తెలంగాణ పోరాటంతో సంబంధంలో ఉంటూ రాజకీయంగా ఎదిగి ఆ తర్వాతనే ఉద్యమంలోకి పూర్తికాలం వచ్చి దాదాపు 2 దశాబ్దాలు పాటు దీక్షగా విప్లవ కృషి చేసాడు. ఈ కాలంలో తెలంగాణ ఉద్యమం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ నిలదొక్కుకుంది. ఉద్యమం ఆత్మ రక్షణా ఎత్తుగడలను అనుసరిస్తూ కాపాడుకున్న అతి కొద్దిమంది శక్తుల్లో ఒకడు ప్రభాకర్‌. కా. ప్రభాకర్‌ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న కాలం అంతా గ్రౌండ్‌ లెవెల్లో ముఖ్యంగా రైతాంగంలో పనిచేశాడు. ప్రభాకర్‌ ఉద్యమ ప్రస్థానాన్ని ఆయన స్మృతిగా కా. నిర్మల రాసుకున్న దానిలో అర్థం చేసుకోవచ్చు.

విప్లవ ప్రజలకు సీపీఐ (మావోయిస్టు) కేంద్ర రీజనల్‌ బ్యూరో గురించి తెలుసు. ఆ బ్యూరో పరిధిలో ఉన్న కమాండ్‌ను సీఆర్‌సీ అంటారు. ఆ కమాండ్‌ కింద ఉన్న కంపెనీల్లో సీఆర్‌సీ-2 కంపెనీ ఒకటి. ప్రధాన బలగాల కర్తవ్యంలో భాగంగా ఈ కంపెనీ ఏర్పడినప్పటి నుండి అనేక చర్యల్లో పాల్గొంది. ఇందులో ఉన్న కామ్రేడ్స్‌ మొదట 1వ కంపెనీలో పనిచేసి తర్వాత దీనిలోకి బదిలీ అయ్యారు. కొంతమంది ఇదే కంపెనీ కోసం వచ్చారు. ఈ కంపెనీకి ఒక దశాబ్దంపైగా చరిత్ర ఉంది. అమరులైన కొద్దిమంది కామ్రేడ్స్‌ ఈ చరిత్రకు ప్రతినిధులు. వారిలో ముగ్గురు సెక్షన్‌ కమాండర్లు, ఒకరు డిప్యూటీ కమాండర్‌, ఇద్దరు సీనియర్‌ పార్టీ సభ్యులు అంటే తర్వాత కమాండర్లు కానున్నారు. అలా ఒక కంపెనీ ఆరుగురు కమాండర్‌ స్థాయి కామ్రేడ్స్‌ను కోల్పోయింది.

అమరులైన కామ్రేడ్స్‌ మల్లేష్‌, జోగాల్‌, రామే ముగ్గురూ 2007లో ఏఓబీలో నిర్మాణం చేసిన 1వ కంపెనీలో ఉన్నప్పుడు జరిగిన నయాగడ్‌ దాడిలో పాల్గొని 12 వందల తుపాకులను, విలువైన గొప్ప అనుభవాన్ని సంపాదించారు. అక్కడి నుండి బదిలీపై వచ్చి కొత్తగా 2008లో నిర్మాణమైన రెండవ కంపెనీలో ప్రారంభం నుండి అమరత్వం వరకు కొనసాగారు. ప్రధాన బలగాల్లో ఉంటూ ప్రధాన యుద్ధక్షేత్రంలో ఒక దశాబ్దం పాటు అనేక యుద్ధ విన్యాసాల్లో పాల్గొని, కమాండర్లుగా యుద్ధ చర్యల్లో ఎన్నో విజయాలు సాధించి, శత్రువును మట్టుబెట్టడంలోను, శత్రువును వెనక్కి నెట్టి పారిపోయేలా చేయడంలోనూ, వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఉద్యమ కార్యకలాపాలు కొనసాగేలా చేసారు. మల్లేష్‌, జోగాల్‌, రామేలతో పాటు 2008లో 2వ కంపెనీలో భాగమయిన కోసి, రత్నలు ఇద్దరు కూడా 2వ కంపెనీ నిర్వహించిన అన్ని దాడులలోను పాల్గొని శత్రువును మట్టుబెట్టి తుపాకులను తెచ్చారు. విప్లవ క్యాంపును తమ వీరోచిత చర్యలతో ఉత్తేజితం చేసారు. అందులో ప్రముఖంగా ఉన్నవి 2009 నాటి నాల్కో దాడిలో 12 మంది సీఐఎస్‌ఎఫ్‌ బలగాల్ని చంపి తుపాకులు, పెద్దఎత్తున జెలిటిన్‌ స్వాధీనం చేసుకుని తెచ్చిన చర్య ఒకటైతే, 2010లో ముకరం దగ్గర సీఆర్‌పీఎఫ్‌కి చెందిన ఒక కంపెనీని మొత్తంగా (76 మంది) ఆంబుష్‌లో మట్టుబెట్టి, 79 తుపాకులు స్వాథీనం చేసుకున్న ఘటన మరొకటి. 2010లో నారాయణపట్న భూపోరాటానికి రక్షణగా జరిపిన ఆపర్చునిటీ ఆంబుష్‌లలో మరీ ముఖ్యంగా 2013లో జీరంగాటి ఆంబుష్‌లో సల్వాజుడుం నేత మహేంద్రకర్మను, పోలీసులను మట్టుబెట్టిన చర్యలోను పాల్గొన్నారు. 2005లో ప్రారంభమయిన సల్వాజుడుం ఎంత భయబీతావహ పరిస్థితుల్ని కల్పించిందో వాళ్ల మనస్సు మీద ఎటువంటి ముద్ర వేసిందో ఆ కామ్రేడ్స్‌ చెబుతుండే వాళ్లు. 8 సంవత్సరాల పాటు ఆ బాధల గాథలు వాళ్లను బాగానే బాధించాయి. పరివారాన్ని, సంపదలను కోల్పోయి వాళ్లు ఎన్ని ఇబ్బందులు అనుభవించారో, ఆ బాధ నుండి వ్యక్తమయిన కసి తీవ్రత ఎంత వాడిగా ఉంటుందో వారు ఆ చర్యలో పాల్గొన్నప్పుడు చూపించారు. మహేంద్రకర్మపై విప్లవోద్యమం చర్య తీసుకొందని తెలియగానే పశ్చిమ, దక్షిణ బస్తర్‌ డివిజన్లలో ఎంతగొప్ప ఉత్సాహం వెల్లి విరిసిందో, జనం చేసుకున్న ఆ పండుగలో తాము ఏ విధంగా మనస్ఫూర్తిగా ఆనందం పంచుకున్నారో గొప్ప ఉత్సాహంతో చెప్పినప్పుడు ప్రజాయుద్ధంలో వర్గకసితో జరిగిన ఘటన ప్రజావీరుల్ని, విప్లవ ప్రజలను ఎంత ఉత్సాహపరుస్తాయో మనకు స్పష్టమయ్యింది.

ఒకటిన్నర దశాబ్దంపైగా ప్రత్యక్షంగా వారు పాల్గొన్న దండకారణ్య ఉద్యమానికి, ఏఓబీ ఉద్యమ పురోగమనానికి, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ప్రత్యక్ష పాత్రను పోషించారు. 2వ కంపెనీ కామ్రేడ్స్‌ సహచర కామ్రేడ్స్‌ అమరులయినపుడు, గాయపడినపుడు, కొన్ని సందర్భాల్లో అరెస్టులు జరిగినపుడు ఈ కామ్రేడ్స్‌ ఎంత మానసిక వేదనకు గురయ్యారో చెప్పినపుడు వారిసున్నిత మనస్తత్వం, హృదయ నైర్మల్యం మనల్ని పట్టి బంధిస్తాయి. తడి ఉన్న గుండెల్ని పిండి చేస్తాయి. అందుకే ముక్కుపచ్చలారని ఆ పాల బుగ్గల పసి కూనలు వర్గ కసితో రగిలి యుద్ధ చర్యల్లో అంతటి యుద్ధ కళను ప్రదర్శించారు. అది ఒక భౌతికవాస్తవం. ʹʹమానవుల అస్థిత్వాన్ని నిర్ణయించేది వారి చైతన్యం కాదు. తద్విరుద్ధంగా వారి సామాజిక అస్థిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుందిʹʹ అంటాడు కార్ల్‌ మార్క్స్‌. ఏ చైతన్యంతో ప్రజాయుద్ధ రాజకీయాలు అభివృద్ధి చెంది ప్రజల చరిత్ర నిర్మితమవుతుందో అమరులైన ఈ కామ్రేడ్స్‌ ఆచరణ నుండి అర్థమవుతుంది.

తెలంగాణాకు బదిలీ అయ్యి వివిధ నిర్మాణాల్లో పనిచేసి విశేష అనుభవం గడించిన ఏరియా కమిటి సభ్యురాలు కా. సంగీత మిలటరీ అనుభవం కూడా వీరోచితమైనది. నాయకత్వానికి గార్డ్‌గా ఉన్న కా. లలిత క్రమశిక్షణగా, బాధ్యతగా కర్తవ్యం నిర్వహించింది. మరో కామ్రేడ్‌ లలిత సంవత్సరం కింద సరాసరి రెండవ కంపెనీలోకి భర్తీ అయ్యింది. అన్న అమరుడయినా తను కొనసాగింది. తనూ చిన్న వయస్సులో అమరురాలయ్యింది. కామ్రేడ్‌ సోనీ అనేక రాష్ట్రాలు వెళ్లి అనేక కష్టాలు అనుభవించింది. అనేక భాషలు నేర్చుకుంది. అనేక కాల్పుల ఘటనలో ధైర్యంగా ఫైర్‌ చేస్తూ రిట్రీట్‌ అయ్యింది. ధైర్యసాహసాలు చూపిన మంచి యోధ. కా. సోనీ (శాంతి) ఫొటో అందుబాటులో లేకపోవడంతో ముద్రించ లేదు. అమరులయిన కామ్రేడ్స్‌ అందరూ వారి మాతృ భాషతో పాటు హిందీ, ఒడియా, కువ్వి భాషలు, స్థానిక యాసలు సునాయాసంగా నేర్చుకున్నారు. కమ్యూనిస్టు విప్లవకారులకు ఎల్లలు లేవని చాటారు. బాగా వెనకబడిన చోట పుట్టి పెరిగిన వీరు విప్లవ రాజకీయాలు నేర్చుకొని తొందరగా ఎదిగారు.

అమరుల జీవిత చరిత్రలు వివరంగాను, పొందికగాను ఉన్నాయి. ఆ విషయ వివరాల్లోకి వెళ్లాల్సిన అవుసరం లేదు. అందులో వ్యక్తం కాని వాటికోసం మనం పరిచయాల్లో, స్పందనల్లో, కవితల్లో, పాటల్లో కొంత వరకు చూడవచ్చు. నేటి ఉద్యమాన్ని, దానిలో భాగంగా గుణాత్మకంగా జనతన సర్కార్‌ అభివృద్ధిని, ప్రజాయుద్ధం కొనసాగింపులో భాగంగా అమరుల త్యాగాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆదివాసీ ప్రజలు పిల్లలకు జన్మనిచ్చారు. అక్కడి ప్రజా ఉద్యమం జనతన సర్కార్‌ నిర్మాణానికి ʹʹపొత్తిళ్లలోని పసికూనకుʹʹ ప్రాణం పోసింది. తామే గార్డియన్స్‌గా ఉంటూ, తమ పిల్లల సాయుధ రక్షణలో జనతన సర్కార్‌ను రక్షించుకుంటున్నారు. ఒకటి పేగుబంధం, రక్త సంబంధం మరొకటి వర్గ సంబంధం, రాజకీయ సంబంధం. అక్కడ మనుషులు విప్లవ రాజకీయాలతో నడుస్తున్నారు. ఇది చిన్న మొలక. ప్రపంచం ఆశగా ఇటు చూస్తుంది. ఈ త్యాగాల పంట ప్రపంచానికి మార్గాన్ని ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. బాధ్యతగా సందేశాలు ఇస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. సల్వాజుడుం, గ్రీన్‌హంట్‌, సమాధాన్‌లకు వ్యతిరేకంగా ఈ అమరుల వీరోచిత ప్రాణత్యాగాన్ని కీర్తిస్తూ భుజం భుజం కలిపి పోరాడుతున్నారు.

వాళ్లు చివరి క్షణం వరకు కర్తవ్య నిర్వహణకు కట్టుబడిన వైనాన్ని కొద్దిగానన్నా చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా అమలు చేస్తున్న దాడుల్లో ఒకటి 2005-2006లలో ప్రారంభమైన సల్వాజుడుం పథకం పూర్తిగా విఫలమయ్యింది. 2009 సెప్టెంబర్‌లో ప్రారంభమై నడిచిన గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ మొదటి దశ, రెండో దశ, 3వ దశ కొనసాగుతూ అందులో భాగంగా ʹʹసమాధాన్‌-2022ʹʹ గా నడుస్తుంది. దాని కోసం వేలకోట్ల రూపాయల నిధులు, లక్షకుపైగా బలగాలు, ఆధునిక ఆయుధాలు, నూతన సాంకేతికత, నాయకత్వం తలలపై లక్షలాది రూపాయల వెలతో ప్రకటనలు, ఎల్‌ఐసీ పాలసీ పేరిట నూతన ఎత్తుగడలు అన్నీ యుద్ధ ప్రాతిపదికనే నడుస్తున్నాయి. అయినా ఇది ప్రజాయుద్ధం, గెరిల్లా యుద్ధం కనుక ప్రజా శత్రువులకు దీనిని అణచడానికి వీలుకావడం లేదు.

దండకారణ్యం, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన ఫిబ్రవరి 5 తేది బంద్‌ పిలుపు మేరకు పీఎల్‌జీఏ తెలంగాణలో ముఖ్యమైన దాడులను నిర్వహించింది. పినపాక మండలంలో ఇద్దరు ఇన్ఫార్మర్‌ల మీద దాడి చేయగా ఒకరు మరణించాడు. మరొకరు గాయాలతో తప్పించుకున్నాడు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 10 వాహనాలను ఒకే రోజు రాత్రి దగ్ధం చేశారు. ఈ సంఘటనతో పోలీసులు ఖంగు తిన్నారు. తెలంగాణ భూభాగంలో ఇంత పెద్ద ఘటన జరిగే సరికి పత్రికలు చాలా ప్రచారం ఇచ్చాయి. దీనితో పాటు ఛత్తీస్‌గడ్‌ తెలంగాణ బార్డర్‌లో తిప్పుపూర్‌ వద్ద పీఎల్‌జీఏ నిర్వహించిన ఆంబుష్‌తో తెలంగాణా, ఛత్తీస్‌గడ్‌ దోపిడీ ప్రభుత్వాలు ఆందోళన చెందాయి. బంద్‌ నాడు వెదిరలో ఒక సెల్‌ఫోన్‌ టవర్‌ పేల్చివేత, కళివేర్‌ క్యాంపుపై మోర్టార్‌ సెల్‌ వేయడం జరిగింది. డీకేలో బంద్‌ సందర్భంగా అనేక ప్రభావవంతమైన చర్యలు జరిగాయి. వీటన్నిటిని శత్రువు చాలెంజ్‌గా తీసుకొని ఒక సమావేశాన్ని నిర్వహించాడు.

ఫిబ్రవరి 16 తేదీన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా రాష్ట్రాల పోలీస్‌ అధికారులు సమావేశం నడిపి మనపై దాడులు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గడ్‌లోని బస్తర్‌ ఐజీ వివేకానంద్‌, తెలంగాణ ఐజీ నాగిరెడ్డి, తెలంగాణ ఎస్‌ఐబీ-ఐజీ సజ్జనార్‌, గ్రేహోడ్స్‌ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి లాంటి ముఖ్యమైన ఐజీలు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల ఎస్‌పీలు పాల్గొన్నారు. జాయింట్‌ ఆపరేషన్లకు పథకాలు రూపొందించారు.

తదుపరి రెండు రాష్ట్రాల్లో జాయింట్‌గా దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులు సెంట్రల్‌ రీజియన్‌లో గోదావరికి అటూ ఇటూ పెద్ద ఎత్తున దాడులు చేసి నాయకత్వాన్ని నిర్మూలించాలనే పథకాలు కొనసాగిస్తున్నారు. వాళ్ల ప్రయత్నాలను వీరోచిత పీఎల్‌జీఏ ఫైటర్స్‌ తిప్పి కొట్టి నాయకత్వాన్ని రక్షించుకున్నారు.

మార్చి 2న కర్రెగుట్టల్లో తడపాల వద్ద జరిగిన దాడి పథకంలో భాగంగా చర్ల ఎస్‌ఐ రవీందర్‌ నిర్వహణలో ఇన్‌ఫార్మర్లుగా తయారయిన మాజీ దళ సభ్యులు పూసుగుప్ప భరత్‌, ఊట్లకు చెందిన డువ్వల్‌ రఘు ఇచ్చిన సమాచారంతో కర్రిగుట్టలపైకి వందల సంఖ్యలో వచ్చిన గ్రేహౌండ్స్‌ బలగాలు మార్చి 2న ఉదయం 6 గంటల 10 నిమిషాలకు తడపాల, డోలీ మధ్య గల డేరాను చుట్టుముట్టారు.

శత్రువును చూసిన సెంట్రీ అలర్ట్‌ చేయడంతో ఫైరింగ్‌ ప్రారంభమయ్యింది. శత్రువు పెద్ద సంఖ్యలో మోహరించి, ఆధునిక ఆయుధాలతో రాపిడ్‌ ఫైరింగ్‌ చేసాడు. యూబీజీఎల్‌లతో షెల్లింగ్‌ చేసాడు. శత్రు బలగాల ఫైరింగ్‌, షెల్లింగ్‌ మధ్యనే వీరోచితంగా ప్రజాగెరిల్లా బలగాలు ప్రతిఘటిస్తూ పోరాడారు. శత్రువుకు ధీటుగా ఫైరింగ్‌ చేసారు. అమరుడు మల్లేష్‌ తన ఏకే 47 ఆయుధంతో నిప్పులు కక్కించి ముగ్గురు గ్రేహౌండ్స్‌ పోలీసులను తీవ్రంగా గాయపరిచాడు. రిట్రీట్‌ అవుతున్న క్రమంలో ఎల్‌ఎమ్‌జీతో ప్రజాగెరిల్లా బలగాలు రాపిడ్‌ ఫైరింగ్‌ చేసి శత్రు బలగాలను వెనక్కి నెట్టారు. తిరిగి రిట్రీట్‌ అవుతున్న క్రమంలో శత్రువు విపరీతంగా వేసిన షెల్లింగ్‌ వలన తీవ్రంగా గాయపడి మల్లేష్‌, లలిత, రత్న, ప్రభాకర్‌ అమరులయ్యారు. కొంత మంది కామ్రేడ్స్‌ శత్రువుతో పోరాడుతూ మరో వైపు రిట్రీట్‌ కాగానే కొండపైన ఉన్న పోలీసు బ్యాచ్‌ ఫైరింగ్‌ ప్రారంభించింది. ఆ ఫైరింగ్‌ రేంజికి దూరంగా వచ్చి ఎక్కువ మంది కామ్రేడ్స్‌ రిట్రీట్‌ అయ్యారు. వాడి రేంజిలో చిక్కుకున్న కామ్రేడ్స్‌ ఐదుగురు తీవ్రంగా గాయపడి అమరులయ్యారు. రిట్రీట్‌ అవుతున్న బ్యాచ్‌ కొండ దిగి వెళ్లుతున్న క్రమంలో, కొండ క్రింది వైపు ఆంబుష్‌ ఏర్పాటు చేసుకొన్న పోలీసు బ్యాచ్‌ వారిని వెంబడిస్తూ ఫైరింగ్‌ ప్రారంభించింది. దీన్ని నిలువరించడానికి ముగ్గురు బ్యాచ్‌ ఎంగేజ్‌ అయింది. శత్రువు అడ్వాన్సును నిలువరిస్తూ నిలిచిపోరాడుతున్న కామ్రేడ్స్‌లో ఇద్దరు అమరులుగా కాగా ఒక కామ్రేడ్‌ గాయపడ్డా కూడా తప్పించుకోగలిగాడు. షెల్లింగ్‌ వలన మరికొంత మంది గాయపడినా తప్పుకోగలిగారు.

అడ్వాన్స్‌ అవుతున్న బ్యాచ్‌ మీద జోగాల్‌ ఫైర్‌ చేయడంతో ఒక పోలీసు అక్కడే ప్రాణాలు విడిచాడు. మిగిలిన వాళ్లు వెనక్కి పరిగెట్టారు. తర్వాత మళ్లీ పోలీసులు జరిపిన ఆ కాల్పుల్లోనే కా. జోగాల్‌ మరో కామ్రేడ్‌ అమరులయ్యారు. ఆ విధంగా చివరి క్షణం వరకు మిగిలిన కామ్రేడ్స్‌ను క్షేమంగా రిట్రీట్‌ చేయిస్తూ 10 మంది కామ్రేడ్స్‌ అమరులయ్యారు. పెద్ద నష్టాన్ని తప్పించి ఉద్యమాన్ని కాపాడారు. శత్రువు ప్రయత్నాలను మన వీరోచిత పీఎల్‌జీఏ ఫైటర్స్‌ తిప్పికొట్టి నాయకత్వాన్ని రక్షించారు. మొదటి నుండి ఏఓబీ, తెలంగాణ రెండు జోన్సులోను కూడా అమరులైన కామ్రేడ్స్‌ గ్రేహౌండ్స్‌ బలగాలను ఎదుర్కోవడంలో మంచి అనుభవాన్ని సంపాదించారు. ప్రజాయుద్ధంలో అనుభవం గడించి, నాయకత్వ స్థాయికి ఎదిగిన ముఖ్యమైన కామ్రేడ్స్‌ అమరులు కావడం 2వ కంపెనీకి, మొత్తం కమాండ్‌కు తీవ్రనష్టం. అయితే ఇది తాత్కాలికమే. గాయపడిన వాళ్లు కోలుకుని వారి వారి స్థానాల్లోకి, బాధ్యతల్లోకి వచ్చారు. ప్రజాయుద్ధంలో అమరులు నిర్వహించిన కర్తవ్యాలను కొనసాగించడానికి కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే శత్రువుకు సమాచారం ఇచ్చిన భరత్‌, డువ్వల్‌ రఘుపై ప్రజాగెరిల్లా దళం చర్య తీసుకుంది. ఉద్యమం ముందుకే సాగుతుంది. ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అంతిమ విజయం ప్రజలదే.

ఇక్కడే అమరుడు ప్రభాకర్‌ గురించి చెప్పుకోవడం సముచితంగా ఉంటుంది.

విజ్ఞత, ఆర్ద్రత, ఆప్యాయత నిండుగా మెండుగా దండిగా గల ప్రభాకర్‌ వినమ్రతకు, అంకితభావానికి పెట్టింది పేరు. ఎదుటి వారిలో మంచిని గ్రహించి వారిని అభిమానించే అతడు క్రమంగా అటువంటి వారంతా అభిమానించే వాడిగా, తమవాడిగా మారిపోతాడు.

మహిళా కామ్రేడ్స్‌కు సహకరించడం, వారిలోని పాజిటివ్స్‌ను ప్రోత్సహించడం ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చి వారిని సమర్థించడం అతని గొప్పతనం.

క్రమశిక్షణ, పట్టుదల, నిరాడంబరతలతో తనకిచ్చిన పనిలో ఆదర్శంగా పనిచేస్తూ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. కంప్యూటర్‌కు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానాన్ని టైపింగ్‌, ప్రింటింగ్‌ విషయాల్లో అనేక మెలకువలను సొంతంగా కృషి చేసి నేర్చుకోవడంతో పాటు నేర్పాడు. ఇతరులకోసం ఎంతో సమాచారాన్ని, దృశ్య శ్రవణ రికార్డింగ్స్‌ను భద్రపరిచి అందించేవాడు. అందుకే ప్రభాకర్‌ను ఒక సోర్సుగా అందరూ భావించేవాళ్ళు. ఎప్పుడూ అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించని ప్రభాకర్‌ ఇతరుల అసహనాన్ని అర్థంచేసుకుని ఆ వాతావరణాన్ని సౌమ్యంగానే శాంతపరచే ప్రయత్నం చేసేవాడు. ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడూ సమిష్టి ప్రయోజనాలకు, కమిటీ నిర్ణయాలకు కట్టుబడి పని చేసాడు. వార్తా పేపర్లు, పత్రికలు, పుస్తకాలు క్రమం తప్పకుండా చదువుతూ, సిద్ధాంత రాజకీయ పుస్తకాలను అధ్యయనం చేసేవాడు.

2 దశాబ్దాల విప్లవ జీవితంలో ఒక దశాబ్దానికిపైగా గ్రామీణ విప్లవోద్యమంలో ఆర్గనైజేషన్‌ పనిలో కృషి చేసాడు. తెలంగాణాలో నిప్పులు చెరిగే నిర్బంధంలో ఒక్కొక్క వ్యక్తిని కలిసి రహస్యంగా ఆర్గనైజ్‌ చేస్తూ, ప్రజల దగ్గరకు పార్టీ రాజకీయాలను అందించడంలో ఎంతో ప్రయాస కోర్చి పనిచేసాడు. క్రాంతి పత్రికలో శ్రద్ధగా నేర్చుకుని అభివృద్ధిని సాధించాడు. అమరుడు కామ్రేడ్‌ లచ్చన్న తర్వాత నాయకత్వ కామ్రేడ్స్‌ పనుల కోసం, పత్రిక పనులు కోసం కృషి చేసి అవసరాలకనుగుణంగా ఎదిగాడు. క్రాంతి పత్రికకు అమరుల గురించి వివరాలు సేకరించి వ్యాసాలు రాయగల ప్రావీణ్యాన్ని సంపాదించాడు. క్రాంతి పత్రికను మంచిగా తెచ్చేందుకు ఎక్కువ శ్రమ చేసేవాడు.

నాయకత్వంతో ఎంత ప్రేమగా ఉండేవాడో కేడర్‌తో అంత ప్రేమగా, గౌరవంగా ఉండేవాడు. తనున్న ప్లాటూన్‌ కామ్రేడ్స్‌, గార్డ్స్‌ ప్రభాకర్‌ దగ్గర చాల చొరవగా అరమరికలు లేకుండా అన్నీ అడిగి తెలుసుకునేవారు.

తెలంగాణ కేడర్‌కు ప్రభాకర్‌ తలలోని నాలుకలా ఉంటే డికే, ఏఓబీ కేడర్‌కు, అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు అందుబాటులో ఉండే మంచి సహకార హస్తం. తెలంగాణ నుండి వచ్చిన నూతన విద్యార్థి, యువజనలు ఉద్యమంలో నిలదొక్కుకొనేలా ఉత్సాహం అందించేవాడు. అందరి ఆదరాభిమానాన్ని చూరగొన్న ప్రభాకర్‌ విలువలు నేర్చి విలువల కోసం నిలిచిన వ్యక్తి. ఇక్కడే కా. ఆజాద్‌ రాసుకున్న వచన కవితలోని రెండు వాక్యాలతో ఇలా ముగించవచ్చు.

ʹʹఅతను తన సర్వసాన్ని విప్లవం కోసం త్యాగం చేసినపుడు

అతను ఎంతో సమున్నతమైన లక్షణాలను ప్రదర్శించిన వాడవుతాడు.ʹʹ

ʹఅతనుʹ సర్వనామం అయిన విషయం విదితమే.

(ఒక వేకువ కోసం పుస్త‌కం నుంచి)

No. of visitors : 1705
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •