చల్లగరిగె అవిభక్త వరంగల్ జిల్లాలో రేగొండ మండలంలో ఒక గ్రామం. ఇప్పుడది జయశంకర్ - భూపాలపల్లి జిల్లాలో ఉంది. సుప్రసిద్ధ సినీ రచయిత చంద్రబోస్ ఊరుగా అది వేలాది మందికి తెలిసే ఉంటుంది. జయశంకర్‌గారికి ఆత్మీయ మిత్రుడు ఆర్థికశాస్త్రంలో బహుశా సలహాదారుడు అనదగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు కిషన్‌రావు ఊరు కూడ. ఈ కిషన్‌రావు అతని అన్న మురళయ్య నాకు వరంగల్ కాలేజ్‌లో సహాధ్యాయులు. మంచి మిత్రులు.
ఇప్పుడు అది అమరుడు విజేందర్ ఊరుగా పరిచయం అయింది. ʹమీరతని కుటుంబాన్ని, ఇంటిని చూడడానికైనా రావాలిʹ అని న్యాయవాది, సిఆర్‌పిపి ద్వారా మిత్రులు రామస్వామి గారు కోరారు. యాభై ఏళ్ల నక్సల్బరీ విప్లవోద్యమంలోనే అతి పెద్దది, అత్యంత దుర్మార్గ పథక రచనతో ఏకపక్షంగా జరిగిన ʹఎన్కౌంటర్ʹ కారణంగా నేనూ వెళ్లాలనే అనుకున్నాను. ఇప్పటికి మృతుల సంఖ్య ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు దాకా ఉండవచ్చు అని అంటున్నారు. ఇంద్రావతి నదిలో కొందరి మృతదేహాలను, గాయపడిన దేహాలను మొసళ్లు తినివేయవచ్చునని అంటున్నారు. అట్లా మొసలి కొంత తినేసిన ఒక మృతదేహం కూడ లభ్యమైందట.
ఇప్పటికి తెలిసిన అమరుల్లో విజేందర్ ఒకే ఒక్కడు తెలంగాణ నుంచి ఉన్నందు వల్ల కూడ వెళ్లాలని అనుకున్నాను. పైగా 1980లలో ప్రారంభమై 2014 దాకా కూడ విప్లవోద్యమంలోకి వెళ్తున్నవాళ్లు అమరులైన వాళ్లు యువకులు ఈ ఊరి నుంచి ఉన్నారు. అమరులైన వారిలో విజేందర్ ఆరోవాడు. పులి అంజయ్య (సాగర్), సుదర్శన్‌రెడ్డి (ఆర్కె), భాస్కర్, వెలిశాల గ్రామం గాజర్ల సోదరులు నిర్మాణం చేసిన విప్లవోద్యమంలో చిట్యాల, పరకాల ప్రాంతాలు చాల బలమైనవి. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక పోరాట చరిత్ర ఉన్నట్లుగానే అమరుల చరిత్ర కూడ ఉన్నది.
స్వయంగా విజేందర్ గ్రామంలో బాల సంఘాలతో మొదలై, యుక్త వయస్సులో రాడికల్ యువజన సంఘంలో చేరి, చల్లగరిగెలోనే కాదు చుట్టుపట్ల ఎన్నో గ్రామాల్లో 1998 దాకా కూడ దళితుల్లో అణచివేతకు గురైన బడుగు వర్గాల ప్రజల్లో వాళ్ల హక్కుల సాధనకై ఎన్నో పోరాటాలు నిర్వహించాడు. పోలీసుల బెదిరింపులకు, చిత్రహింసలకు గురై, అక్రమ కేసుల్లో ఇరికించబడి జైలుపాలయి. విడుదలయ్యే నాటికి గడ్డు పరిస్థితులు ఉండడం వల్లనే కాకుండా జైల్లో శాకమూరి అప్పారావు సాహచర్యం, ఉత్తేజం వల్ల ప్రేరణ కూడ పొంది ఉన్నందున ఇరవై ఏండ్ల కిందే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2000లో చత్తీస్గడ్ రాష్ట్రం ఏర్పడినాక అందులోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలిలతోపాటు పీపుల్స్‌వార్ ఏర్పాటు చేసిన రాజకీయ నిర్మాణంలో కొంతకాలం అదిలాబాద్ జిల్లా కూడ ఉంది. విజేందర్ మొదట అదిలాబాద్ జిల్లాలో పని చేసి, ఆ తరువాత పదిహేనేళ్ల క్రితం గడ్చిరోలికి మారాడు. గత పదిహేను సంవత్సరాలుగా పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేసి ఇప్పుడు గడ్చిరోలి జిల్లా మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు.
ఇప్పుడు అమరులైన వారిలో నలుగురు పార్టీలో డివిజన్ స్థాయిలో కమాండర్లు ఉన్నారు. వారిలో ఎక్కువగా సగానికి పైగా మహిళలు ఉన్నారు. వారిలో కూడ డివిజన్, ఏరియా స్థాయిలో నాయకత్వ స్థాయిలో ఉన్నారు. అందరికి అందరు చత్తీస్గడ్ గడ్చిరోలీలకు చెందిన ఆదివాసులని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
విజేందర్కు గడ్చిరోలి - ముఖ్యంగా దక్షిణ గడ్చిరోలి జిల్లాలో తెలియని గ్రామం లేదు. తెలియని మనుషులు లేరు. ఆయన జీవితాన్నిబట్టే మావోయిస్టులుగా మారిన ఇప్పుడు అమరులైన తక్కిన ఆదివాసి విప్లవకారుల జీవితాలను మనం ఊహించుకోవచ్చు.
కొంచెమైనా తెలిసిన చోటు నుంచి ఏమీ తెలియని గహనాటవి గమ్యంలోకి చేరుకోవాలంటారు కదా.
విజేందర్ పంబాల కులంలో పుట్టాడు. నిరుపేద కుటుంబం. తండ్రి ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో మంత్రాల వల్లనో, మైసమ్మ వంటి దేవతల కొలువు వల్లనో దినభత్యం సంపాదించగలిగేవాడు. తల్లిని చూస్తే నెత్తురు క్షీణించి, కన్నీళ్లు కూడ కరువైపోయిన ఒక ఎండిన మోడు వలె ఉన్నది. తండ్రి తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఇరవై ఏళ్ల వయసులోనే విజేందర్ ఇల్లు విడిచాడు. తలిదండ్రుల జీవితం మరీ దుర్భరమైంది. తమ్ముడు కూలి పని చేసుకుంటాడు గానీ మానసికంగా ఎదిగినట్లు కనిపించలేదు. ఒక జిల్లా స్థాయి విప్లవపార్టీ నాయకుని ఇల్లు ఒక్కసారి ఎన్నికల పార్టీల గ్రామస్థాయి రాజకీయ నాయకుల ఇళ్లతో పోల్చడానికైనా ఎవరైనా ఆ ఇల్లు చూడాల్సిందే.
మేము 25వ తేదీ మధ్యాహ్నం వాళ్ల ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచిన అవరణలోకి చేరుకునే వరకు అజ్ఞాత జీవితంలోనే పుట్టిన ఆయన కూతురు మాట్లాడుతున్నది. 15 సంవత్సరాల వయసు ʹమా డాడీ మాకు ధైర్యం. ఎనిమిదేళ్ల ఆడ పిల్ల మీద కూడ పాలక పార్టీల రాజకీయ నాయకులు లైంగిక అత్యాచారాలు చేస్తున్న రోజుల్లో ఒంటరిగా మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్న నాకు, నా బోటి వాళ్లకు మా డాడీ వంటివాళ్లు స్ఫూరిʹ్త అని. పక్కన కుర్చీలో శిలవలె అతని తల్లి కూర్చొని ఉన్నది. ఆ ఇద్దరినీ తీసుకొని ʹఇల్లుʹ చూద్దామని లోపలికి వెళ్లాము. ఇల్లా అది?!
ఒక ముసలయ్య, ముసలమ్మ, మనుమరాలును పెట్టుకొని ఉంటున్న ఇంటి కన్నా ఒక పందుల గూడైనా కొంచెం వసతిగా ఉంటుందేమో.
అన్ని చానల్స్ వాళ్లు వచ్చినట్లున్నారు. ఆ గుడిసె ముందే ఆ ఇద్దరితో మా ఫొటో తీసారు. వారిలో ఎందరు లోపలికి వెళ్లి చూసారో తెలియదు.
మెదక్ జిల్లా పీపుల్స్‌వార్ కార్యదర్శి, రాష్ట్ర, కమిటీ సభ్యుడు కూడ అయిన మహేందర్‌ను సికిందరాబాద్, తుకారామ్ గేట్ వద్ద పట్టుకొని ఎన్కౌంటర్ పేరుతో చంపినప్పుడు వరంగల్ - కరీంనగర్ సరిహద్దు గ్రామమైన అన్నాసాగరం దళితవాడలో ఉన్న ఆయన ఇల్లు - పూరి గుడిసెను ప్రతి పత్రికా ప్రముఖంగా ప్రచురించి రాష్ట్రస్థాయి విప్లవ నాయకుని జీవన శైలి గురించి అబ్బురపడి రాసింది.
తెరాస అధికారానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వాగ్దానం ఒక బలమైన ప్రజా ఆకర్షణ కదా. మరి అవి ఎవరి కోసమో!
చల్లగరిగెలో నాలుగు శ్మశానాలు ఉన్నాయి. ఒకటి అంటరాని వారికి వేరుగా ఉన్నదని చెప్పనక్కర్లేదు కదా. ఊరు బయట రోడ్డు పక్కనే కొంత ఖాలీ స్థలం. దళితుల్లోనూ ఉన్న మాల, మాదిగ, పంబాల నిచ్చెన మెట్ల కుల వివక్ష వల్ల ఈ శవం అంత్యక్రియలు ఎక్కడ చేయాలన్నది కూడ రాత్రంతా ఒక చర్చ. అంత్యక్రియలు ఎట్లా నిర్వహించాలో అమరుల బంధు మిత్రుల సంఘం చెప్పగలిగిందేమో గానీ, ఊళ్లో స్థలం - అది శ్మశానమైనా సరే - అంటరాని వాని శవం కోసం అ సంఘం నిర్దేశించినా కుల పెద్దలు వినరు కదా. కుల కట్టుబాట్లు ఉంటాయి కదా.
శరీరమంతా కాలిపోయి నల్లటి బొగ్గు వలె దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మృత శరీరమై తిరిగి వచ్చిన శ్రీను, శ్రీకాంత్ - నూతన ప్రజాస్వామిక విప్లవ బీజ దశ అయిన జనతన సర్కార్ సందేశాన్ని అమరుడై తెచ్చిన వాడే కావచ్చు. కాని ఊళ్లో, ఇవ్వాటి ఊళ్లో చెల్లేది సాంఘిక శాసనమే. ఎర్రజెండాలు, శవంపై కప్పిన ఎర్రటి జెండా, విప్లవ నినాదాలు, విప్లవ అభిమానులు, ప్రజాసంఘాల సంఘీభావం - అన్నిటిని మించి శ్రీకాంత్‌గా, విప్లవ వ్యక్తిత్వంలోకి పరిపూర్ణంగా మారిపోయిన విజేందర్ స్ఫూర్తి చల్లగరిగె గ్రామానికి తిరిగి వస్తుందా.
విజేందర్ అజ్ఞాత జీవితంలోనే తన తోటి ఆదివాసి పార్టీ మహిళా కార్యకర్తతో సహజీవనాన్ని చేపట్టాడు. ఆమె శిశువు గర్భంలో పడినాక బిడ్దను కనాలని, పాప పుట్టిన తరువాత ఇక బయటికి వెళ్లి సాధారణ జీవితం గడుపుదామని కోరుకున్నది. ఆయన అందుకు అంగీకరించక పాపను తీసుకవచ్చి తన తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు. ఆమె ఆయనను వదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత అజ్ఞాతంలో ఆయన ఎంచుకున్న మరో మహిళతో సహజీవనం కూడ ఎక్కువ కాలం నిలువలేదు. ఆమె కూడ వెళ్లిపోయింది. ఇప్పుడీ ఏకపక్ష మారణకాండలో అమరురాలైన ఆదివాసి మహిళ శాంతాబాయి ఆయన భార్య అని గడ్చిరోలి పోలీసు అధికారులు అంటున్నారు. ఆమె కూడ డివిజన్ నాయకురాలని కూడ అంటున్నారు.
ఇప్పుడు ఆ శిశువు ప్రీతి అత్యంత పేదరికంలో పెరిగి పోషకాహారం లేక ఇటీవలె చావుబతుకుల్లో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు పదకొండు బాటిల్స్ రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆమెకు చదువుకునే వయుసు రాగానే కౌన్సిలింగ్లో భాగంగా ఒక పోలీసు ఇన్స్పెక్టర్ కస్తూరీ బా మహిళా పాఠశాలలో చేర్చాడు. ఇప్పుడామె ఈ అనారోగ్య స్థితిలో ఊరొదిలి వెళ్లలేక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే ఏడవ తరగతి చదువుతున్నది. ఆమెకు ఇప్పుడు పదిహేనేళ్లు. మనసులోని భావాలు, స్పప్నాలు వ్యక్తం చేసే ఒక ప్రయత్నం ఆమె కళ్లలో మాటల్లో కనిపిస్తుంది. స్పష్టమైన ఆదివాసి రూపంతో విశాలమైన నయనాలతో ఆమె తన కళ్లలో తన తండ్రి స్పప్నాలను మోస్తున్నట్లు కనిపించింది. మీడియాలో ఆమె అమరుడై తన దగ్గరకి, అతని తల్లి దగ్గరికి మళ్లీ వచ్చిన తన తండ్రి కోసం నివాళిగా బంతిపూల మాల అల్లుతున్న ఒక ఫొటో ఆమెను ఈ పత్రికలో చాల మంది చూసే ఉంటారు.
ప్రీతి ఎంతో ఇష్టంగా తన మనసులోనూ, మాటల్లోనూ తన వయసు ఆడపిల్లలు తనకంటే చిన్నవాళ్లు, పెద్దవాళ్లు ఎవరైనా సరే స్త్రీలు ఏ వివిక్షకు గురికాకుండా, ఏ అత్యాచారానికి గురికాకుండా స్వేచ్ఛగా జీవించే ఒక సమాజం ఏర్పడాలని కలులు కంటున్నది. ʹసబ్ సే ఖతర్నాక్ హై సప్నోఁకా మర్జానాʹ (ఆవతార్ సింగ్ ʹషాష్ʹ) కలలు కనే తరాన్ని కాపాడుకోవడం సమాజ బాధ్యత.
మావోయిస్టు పార్టీ పంథా, అందులో ఉన్న వాళ్ల రాజకీయ కార్యక్రమంతో ఇతరులకు అందరికీ ఏకీభావం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మావోయిస్టుపార్టీ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేసి, కార్మిక వర్గ రాజ్యాధికారం సాధించాలని పోరాడుతున్నది కనుక రాజ్యం సహించదు. రాజ్యాంగ యంత్రం ఆ విప్లవాన్ని అణచివేయాలని చూస్తుంది. అయితే ఆ రాజ్యానికి ఒక రాజ్యాంగం, ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది. అధికారంలో ఉన్నవారు ఎవరైనా ఆ రెండింటిని గౌరవించి పరిపాలిస్తామని ప్రమాణం చేసి ఉన్నారు. చట్ట విరుద్ధంగా సాయుధ తిరుగుబాటు చేసే వాళ్లనైనా ప్రభుత్వం చట్టబద్ధంగానే ఎదురుకోవాల్సి ఉంటుంది. ఆత్మరక్షణ కోసం తప్ప తమపై కాల్పులు జరిపిన వాళ్లను కూడ పోలీసులు చంపడానికి వీల్లేదు. గాయపర్చి కదలలేని పరిస్థితి చేసి బంధించవచ్చు. చికిత్స చేయించి, కోర్టులో హాజరుపరిచి, అప్పటికే నేరపూరిత చర్యలో పాల్గొన్నవారని కోర్టు ఆరోపణలను విచారించదలుకుంటే జైలుకు పంపవచ్చు. అందుకే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారనుకున్న సందర్భంలో ఎదుటి వ్యక్తులు మరణిస్తే ఆ ఎన్‌కౌంటర్‌ను హత్యానేరంగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది.
సామాన్యంగా పోలీసులు మావోయిస్టుల ఉనికి కచ్చితమైన ఆచూకి తెలిసి వెళ్లి లొంగిపొమ్మని హెచ్చరించామని, వాళ్లు వినకుండా తమపై కాల్పులు జరిపితే తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని, అందులో ఇపుడు చెపుతున్నట్లుగా ఇంత మంది మరణించారని చెప్తూంటారు. ఇప్పటికి బయటా, నదిలోనూ లభించిన మృత దేహాలన్నిటిలోనూ ఎనిమిది నుంచి పది దాకా బులెట్ గాయాలు ఉన్నాయని అంటున్నారు. అవి కచ్చితమైన ఎదురు కాల్పులు అంటున్నారు. ఇప్పటికి గుర్తించిన మృతులందరూ మావోయిస్టు పార్టీలో ఏదో స్థాయిలో ఉన్న సాయుధులే. ఎకె 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటి అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పెద్ద సంఖ్యలో దొరికింది అంటున్నారు. ఇది తమ ఆత్మరక్షణలో చేసిన ఎన్కౌంటరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మొదటిసారిగా పోలీసు వర్గాలు మావోయిస్టు దాడిలో తాము యుబిజిఎల్ (అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు) ప్రయోగించామని చెపుతున్నవి. ʹవీటిని ప్రయోగిస్తే ఆ ప్రాంతంలో విధ్వంసమే. పెద్దఎత్తున మావోయిస్టులు మరణిస్తారు. మిగిలిన వారు జీవచ్ఛావాలుగా మారుతారు. గడ్చిరోలిలో జరిగింది కూడ ఇదేనని పోలీసు వర్గాలు వివరిస్తున్నాయిʹ. అని 25వ తేదీ ఆంధ్రజ్యోతి దిన పత్రిక రాసింది. కోవర్టు ద్వారా విషాహారం కాకపోతే ఈ మారణకాండకు ఇది కారణం కావచ్చు.
ఏదైనా అత్యంత హేయమైన, అంతర్జాతీయ యుద్ధనీతి సూత్రాలకు కూడ విరుద్ధమైన దుర్మార్గమైన చర్య ఇది. ప్రజలతో పాటు ప్రజాస్వామ్య వాదులందరూ ఈ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాల మానవ హనన పథకాన్ని, మారణకాండను, ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చర్య ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దండకారణ్యాన్ని ʹఘర్షణ ప్రాంతంʹ (కాన్ఫ్లిక్ట్ ఏరియా)గా పరిగణిస్తున్నదని భావించాల్సి వస్తుంది. అప్పుడు జెనీవా ఒప్పందం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఇక్కడికి రెడ్‌క్రాస్, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్, ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్, ఆసియా వాచ్ వంటి సంస్థలను ఈ ప్రాంతాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది. పారదర్శకంగా ఈ మారణకాండపై విచారణ జరుపాల్సి ఉంటుంది. ఫాసిస్టు ప్రభుత్వాల నుంచి అది ఆశించలేము కాని, ఎటువంటి ప్రభుత్వాలనైనా మెడలు వంచి చేయించే శక్తి ప్రజలకే ఉంటుంది.
Type in English and Press Space to Convert in Telugu |
నయీం ఎన్కౌంటర్... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యంహతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే... |
వర్గ సమాజం ఉన్నంత కాలం వర్గ పోరాటం ఉంటుందిమహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవానికి యాబై నిండిన సందర్భంగా ... కామ్రేడ్ వరవరరావు సాంస్కృతిక విప్లవం లేవనెత్తిన మౌళిక అంశాలను విశ్లేషిస్తు... |
సోషలిజమే ప్రత్యామ్నాయం : వరవరరావుఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్రపంచానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని మరోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవసరముంది................. |
దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటుతెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను... |
ఇప్పుడు... దండకారణ్య సందర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులుదండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను... |
చెరసాలలో చామంతులు - 2అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద...... |
Condemn the Nilambur Fake Encounter : RDFRDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the... |
ప్రభాకరుడే గంగాధరుడుప్రభాకర్ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్ఫర్మేషన్)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ... |
యాభై వసంతాల దారి మేఘంఅంబేద్కర్ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ... |
ఎస్సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదికఎస్సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన....... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |