ఎట్టి మనుషుల మట్టి కథలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఎట్టి మనుషుల మట్టి కథలు

- అరుణాంక్ లత | 02.05.2018 11:01:09am


కటిక పూలు చదివాక నాలుగు వాక్యాలు రాయాలి అనిపించింది. అయితే నేను విమర్శకుడ్ని కాదు పరామర్శించడానికి. మేధావిని కాదు విశ్లేషించడానికి. నాలాంటి బతుకును రాసిన నా అన్న ఇండస్ మార్టిన్ కోసం రాస్తున్న నాలుగు ప్రేమ వాక్యాలు. అందులో చూసుకున్న నా జీవితానుభవాలు.

కటిక పూలు దళిత బతుకుల్ని ఆవిష్కరించిన కథలు. కథలు కాదు. కాదు బతుకులు. బతికిన బతుకుల తాలూకు అనుభవాలు. వెలివాడ అనుభూతులు. ఏకకాలంలో పెదాలపై నవ్వును, కంటినిండా నీళ్లను తెప్పించే కథలు. వెలివాడ అనుభవించిన ఉక్కపోత. చెమట కారినంత సహజంగా అనుభవించిన అవమానాల తాలూకు ఉక్కపోత. ఈ అనుభవం మాలపల్లెదే కాదు. మాదిగ పల్లెది. ఎరుకల పల్లెది. యానాదుల పల్లెది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్న ప్రతి పీడిత కులాల పల్లెలది. హిందు ఆధిపత్య దేశంలో మత మైనారిటీలది. కథల్ని ఎవరైనా రాస్తారు. జీవితాల్ని మాత్రం అనుభవించిన వారే రాస్తాడు. వాడు/ఆమె రాయడమే సరైనది. ఒక కళ్యాణరావులాగా, పైడి లాగా, మద్దూరి లాగా, కలేకురిలా, వేముల ఎల్లయ్య లా, వినోదిని లా, జూపాక సుభద్రలా.... ఇంకా కలం ఝుళిపించిన అనేకానేక అనేకానేక అంటరాని జీవుల్లాగా.

ఇప్పటి వరకు మనం చదువుకున్న (నేను రాస్తున్న) మూడు-నాలుగు అగ్రకులాల, రెండు జిల్లాల భాషే ప్రమాణికమైనదిగా చెలమణిలో ఉన్నది. కానీ కటిక పూలలో దాన్ని బద్దలు కొడుతూ గుంటూరు జిల్లా, పొన్నూరు పరిసర మాల, మాదిగ పల్లెల్లో వాడే భాష ఉన్నది. దాన్ని నుడికారం అనను, యాస అనో, మాండలికం అనో కుదించను. అది భాష. అచ్చంగా మా దళితుల భాష. దానికి మాత్రమే సొంతం అయిన ఒక వ్యాకరణం ఉంది. అది వాడ వ్యాకరణం. అది యే నిఘంటువుల్లో దొరకదు. అది యే సాహిత్యంలో చోటు చేసుకోలేదు. మద్దూరి, పైడి కవితల్లో తప్ప బహుశా ఇంకా ఎక్కడ కానరాదు. అది మాల, మాదిగ పల్లెల భాష. కటిక పూల భాష. ఈ దేశ అగ్రకులాలు మాకు అంతగట్టిన ʹకటికʹతనం ఉంది. అది వాళ్లపైనే ప్రయోగించాడు ఇండస్ మార్టిన్. ఇంకోటి మాకు సహజంగా ఉన్న ʹపూలʹతనం ఉన్నది. అది సువాసనలు వెదజల్లుతది. దళిత జీవితంలో ఉన్న సున్నితత్వాన్ని చెప్తది. బతుకు తాలూకు గాయాలను, వాటిని తట్టుకు నిలబడ్డ పోరాటాలను, రేపటి కోసం పడ్డ ఆరాటాలను కలిపి రాసిన కటికపూల భాష ఇది. గుంటూరు మాల, మాదిగ పల్లె భాష, ఆదిలాబాద్ మాదిగ, కరీంనగర్ వడ్డెర అయిన నాకు అర్థం అయ్యే అవకాశమే లేదు. నేను అదే అనుకున్నా. అయినా ఒక్కసారి చదువగానే అర్థం అయింది. కారణం ఇద్దరివి ఒకే రకమైన అనుభవాలు కావడం.

అయితే... చాలామంది ఆ భాష అర్థం కావడం లేదు.. ఫుట్ నోట్స్ ఇస్తే బావుండు అని అన్నారు. దానికి ఇండస్ ఇచ్చిన సమాధానమే రాస్తాను. ʹమాది కానీ భాషను ఇన్నెండ్లుగా మామీద రుద్దితే, పదాలు అర్థం కాకపోతే నిఘంటువులు పెట్టుకొని చదువుకున్నాం. మా బాధల్ని, మా భాషలో రాసుకున్నాం. ఎట్లా చదువుకుంటారో మీ ఇష్టం.ʹ

పుస్తకాన్ని విశ్లేషించబోవడం లేదు. నాకు తోచిన నాలుగు మాటల్ని రాస్తున్న. కటికపూలలో ఉన్న నా జీవిత అనుభవాల్ని రాస్తున్న. నాకు అనిపించిన విషయాల్ని పంచుకుంటున్న.

మొత్తం 26 కథలు ఉన్న పుస్తకం. ఇరవై ఆరు కథలు అనడం కన్నా ఇరవై నాలుగు ఘటనలు అనడం సబబు. (రెండు ఘటనలు రెండు భాగాలుగా ఉన్నాయ్). ముందే అన్నట్టు ఇవి జీవితాలు. జీవిత అనుభవాలు. సాహిత్యం అంటకుండా వెలివేసిన జీవితాలు. అంటకుండా దూరం పెట్టిన అనుభవాలు. ఏ రచన, దృశ్య మాధ్యమాల్లో చోటు చేసుకొని భాష. వాటిన్నింటిని కలిపితే కటికపూలు.

కటిక పూలు మాంసం కొనడానికి డబ్బులు లేక, అప్పు చేయలేక తండ్రి పడే తండ్లాట. ఏం చేసైనా తెస్తాడు అనే తల్లి నమ్మకం. ఆ తండ్లాటలో స్వాభిమానం ఉంది. మోషే మాటల్లో అంతరార్ధాన్ని గుర్తించిన మాదిగ కక్కయ్య ఎరుక ఉంది. ʹవొర్ని అలకాపురం మారాజో.... బడాయిలకి ఏం తక్కువలేదు. ఆడెవన్నా అందరూ రొక్కాలిచ్చి పొగులెత్తుకున్నారా ఏంది? వారం మిట్టిపల్లెలో కూలికెళ్ళిందెవురూ? నీ పిలకాయలు తినకుండా మా గొంతుల్లో చియ్యలు దిగుతాయా ఏంది? మీ అయ్యకు మల్లే బో అభిమానం మడిసివేʹ ఈ వాక్యాలు చాలు. ఆకలి, అంటరానితనాన్ని భరిస్తూనే స్వాభిమానంతో నిలబడేందుకు ఒక తరం చేసిన తండ్లాట కనిపిస్తుంది. ఈ సంఘటనకు రాసిన ముక్తాయింపులో ఒక ఆగ్రహ ప్రకటన ఉంది. నిజంగానే మేం థగ్గులమై కత్తుకలు కోసి నెత్తుటి బాకీ తీర్చుకుంటే ఈ దేశ చరిత్ర ఇంకోలా ఉండేది.

బతుకుపాట ఇక్టోరియా మారాణి ముక్కు బేసరి పోయి ఏడుస్తూ అన్నమాట ʹనడిరేత్తిరి లాంటి నా కర్రి మొకాన సందమావ నా బేసరి, బీద బతుకుల్లో సచ్చిపోయిన మాయమ్మమ్మ సక్కదనాల నవ్వసుంటిదదీʹ ఈ కవిత్వం ఏ ఆధునిక కవి రాశాడు? దళిత జీవితంలో కవిత్వం బాగమైంది. కవులు కవిత్వం రాస్తారు. ప్రజలు కవిత్వం మాట్లాడతారు. బేసరి కొనిత్తాని మా అయ్యా అనింగానే ʹమాయమ్మ కళ్ళంపటి కిట్టకాలవగెట్లేత్తుకుని మా ఇంటిని ముంచెత్తిందనుకోబ్బా!ʹ అన్న గుంటూరు మాలపల్లె మాటకి, ʹఏండ్ల తర్వాత అచ్చిన సుట్టాన్ని సూసి కండ్లు అరద గోదారైనైʹ అన్న ఆదిలాబాద్ మాదిగ పల్లెకి ఏం సంభందం. భాష వ్యక్తీకరణ రెండు ప్రాంతాల వెలివాడది ఒకే విధంగా ఉండడమే అనుకుంటా.

ఈ దేశంలో వేళ్ళూడుకు పోయిన బ్రాహ్మణీయ విద్య విధానం కళ్ళకు కట్టినట్టు సూపిందీ ʹసదువు కంపుʹ ముస్లిం పిల్లవాణ్ణి ʹయేరా పాకిస్తాన్.... నీ పిలక పీకిస్థాన్ʹ అని ఎగ్గుల వెడితే బడే బంజేసి ఆళ్ల అయ్యా బట్టల దుకాణంలో పనికే పరిమితం కాబడ్డ వెత మామూలిది కాదు. నా చిన్నప్పుడు ఒక ముస్లిం క్లాస్మేట్ ని ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ʹఅరేయ్ మీరు పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తారు కదా..!ʹ అని అడిగాడు ఇంకోడు. ʹమేం పాకిస్తాన్ కి ఎందుకు చేస్తాంరా?ʹ అని వాడు ఓ అమాయక సమాధానం ఇచ్చాడు. ముస్లిం అనగానే పాకిస్తాన్ అనే విషయాన్ని పిల్లల మెదల్లోకి నింపిందెవడు.? ముస్లింలు పరదేశీయులు అని రాసినంతగా... ఆర్యులు పరదేశీయులు. అని సిలబస్లో ఎందుకు భాగం కాలేదు? ʹనాదిర్షాలు, గజినిలు, ఘోరీలు ఒక్కొక్కడు మహంతకుడుʹ... సరే రాజు ఎవడైనా హాంతకుడే దానికి ఎవడు అతీతుడు కాదు. కానీ రాముళ్లు, కృష్ణుళ్ళు, దశవతారాలు చేసిన హత్యల మాటేమిటి..? సదువుకుంటే సంపడం. ప్రేమను వ్యక్తం చేస్తే నపుంసకత్వాన్ని ఒప్పుకోలేక ముక్కు, చెవులు కొయ్యడం వీటిమాటేమిటి? ఏ సిలబస్ లో ఇవేందుకు భాగం కాలేదు? ముస్లింల డ్రాపౌట్స్ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది..? కారణం కటికపూలు చెప్పింది. ఒప్పుకునే ధైర్యం ఎవడికి ఉంది? వ్యతిరేకించే వాడు దమ్ముంటే రమ్మనండి... నడి బజాట్లో తేల్చుదాం. ఈ దేశ విద్య విధానపు ముఖచిత్రాన్ని.

గూచ్ గూచ్... ఈ పదం నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో రెండు కులాలలో భాగమైన పదం. పందుల్ని తోలుతున్నప్పుడు గూచ్.. గూచ్... అంటూనే తోలుతారు. నా మామలు... అన్నలు కర్రకు ఉచ్చు చేసి పందుల వెనుక గూచ్... గూచ్... అని తిరగడం దగ్గరగా చూశా. అది చదవగానే నా బాల్యం ఒక్కసారి కళ్లముందు మెదిలింది. గాయాల బాల్యం అది. కన్నీళ్లను మింగిన బాల్యం అది. అవమానాల్ని, హేళనను భరిస్తేనే నిలబడిన స్నేహలా తాలూకు వివక్షల బాల్యం. ఇందులో ఎరుకల పిల్లవాణ్ణి గూచ్... గూచ్... అని ఎగ్గుల పెట్టారు. నా బాల్యము అంతే. ఇప్పటికి తెలుగు తప్ప ఇంకో భాష రానీ ఓ శూద్ర మిత్రుడు. వాడికి నేను కనపడగానే pig అనగా పంది. సువర్ అనగా పంది. అంటూ బల్లో నేర్చుకున్న ఇంగ్లీషు, హిందీ పాఠాలు వాడికి అప్పుడే గుర్తుకు వచ్చేవి. ఇది వడ్డెర జీవితం. మా అమ్మ కులపు తాలూకు గాయాల జీవితం. విష్ణుమూర్తి వరహావతరం అని ఒకవైపు మొక్కుతూనే, మరోవైపు అదే వరహాన్ని పెంచే, తినే ఎరుకల, వడ్డెర బతుకులను ఎగ్గుల పెట్టె హిందూ కుల హిప్పోక్రటిక్ బతుకుల తాలూకు వాస్తవం చిత్రం. ఈ దేశపు చరిత్ర, వర్తమానాల బతుకు చిత్రం.

ముప్పియ్యారు, డెబ్బీరెండు ఈ మాటలు వాడకపోయిన, ఆవు మాంసం తిని నాలుక మొద్దు మారకపోయిన కనపడగానే గోడకు అనుకుని ఉన్న ఓ మిత్రుడు ʹమాదిʹగోడʹ అంటూ గోడను తడమడం, గుండెల్లో గుచ్చుతున్న కత్తికి సంకేతం. అమ్మాయి కనపడగానే క్లాస్ రూమ్ ని చూపిస్తూ ʹమాదిʹగదిʹ అనడం. అయినా మేం నోరు మూసుకోని తిరగబడకుండా ఉంటేనే మా స్నేహాలు నిలబడతాయి. తిరగబడితే ఓ కారంచేడు, ఓ చుండూరు, ఓ వేంపెంట, ఓ పదిరికుప్పం ఈ దేశం మాకు ఇచ్చిన బహుమతులు. కులం అడిగితే మాదిగ అని చెప్పినా ʹఓహో హరిజన్స్ ఆʹ అనడం మమ్మల్ని ఇంకా మా అయ్య పిల్లలుగా గాక ʹహరి సంతానంʹగా చూడడం ʹయే తనమోʹ ఈ దేశ మేధావులే చెప్పాలి. మా భాషలో చెప్తే మరి మోటుగా ఉండి జీర్ణించుకోలేరు కదా.

ʹఈ కథల్లో మధ్య మధ్యలో రచయిత తన గొంతు వినిపించండం. చివర్లో ముక్తాయింపు ఇవ్వడం బ్రేహ్ట్ ఎపిక్ థియేటర్ ని పోలి ఉందిʹ. అన్నాడు ప్రముఖ విమర్శకులు గుంటూరు లక్ష్మీ నర్సయ్య. అయితే ʹబ్రేహ్ట్ ఆ ఫార్మ్ ని ఇండియా జానపదుల నుండి తీసుకున్నాడనిʹ అంటాడు కళ్యాణరావు తన ʹతెలుగు నాటకం మూలాలుʹలో. బ్రేహ్ట్ నే ప్రభావితం చేసిన అట్టడుగు వర్గాల నాటకం ఎందుకు సాహిత్యంలో చోటు చేసుకోలేదు? మాల దాసర్లూ, మాదిగ దాసర్లు అల్లిన గాథలన్ని శ్రీనాథుని అకౌంట్లో ఎట్లా పడ్డాయి? కళ్యాణరావు అన్నట్లు ʹమా అయ్యా అల్లినదాన్ని/ వాడయ్య రాసేడు/ అల్లిక అంటరానిదు అయింది/ రాతేమో రాజై కూసుంది.ʹ నిజమే. ʹపులులు తమ చరిత్ర రాసుకునే దాకా వేటగాడు రాసిందే చరిత్రʹ అని అంబేద్కర్ అన్న, ʹపాలకవర్గాల చరిత్రకు సరిగ్గా వ్యతిరేకంగా ప్రజల చరిత్ర ఉంటుంది. మనం చదువుతున్నది అంతా పాలకవర్గాల చరిత్రʹ అని కార్ల్ మార్క్స్ అన్నా, రెండు ఒకటే. ప్రజలు తమ చరిత్ర రాయటం మొదలుపెట్టాలని. ఈదేశంలో అయితే అట్టడుగు కులాలు రాయడం మొదలుపెట్టాలని. ఇండస్ ఆ పని చేశాడు.

అయితే దీన్ని దళిత కథలని, దళిత సాహిత్యం అని కుదించే పని ʹసాహిత్యకారులుʹ చేస్తారు. ఎందుకంటే దీన్ని సాహిత్యంగా గుర్తిస్తే జంధ్యాల, అగ్ర పీఠాలు కదులుతాయి. ఎవరైనా వీటిని దళిత కథలు అంటే, నాదొక్క ప్రశ్న. కొన్ని కులాలకే పరిమితం అయిన సతీ, భర్త చనిపోతే జీవితాంతం విధవగా ఉండి పోవడం గురించి రాసిన సాహిత్యం అంతా ఎందుకని ఆ కులాల సాహిత్యంగా గాక, గొప్ప సాహిత్యంగా వెలుగుతుందో చెప్పాలి. నియోగులు, వైదికుల మధ్య పంచాయితీ, ప్రవరలు ఎందుకని సాహిత్యంగా పరిఢవిల్లుతుందో చెప్పాలి. బ్రాహ్మణ మంత్రాల్లో ఉండే శబ్దం, లయల్లో కవిత్వం నేర్చుకున్న వాళ్లకు, జీవితంలో కవిత్వం భాగమై, కవిత్వం మాట్లాడే కటికపూల గోస అర్థం అయ్యే అవకాశమే లేదు.

ఈ కథలు నాకు నోస్టాల్జియా అంటూ కాలర్ ఎగిరేసుకునే కథలు గాదు. గాయాల బాల్యపు తాలూకు వెన్నాడే జ్ఞాపకాల కత్తిపోట్లు. అవి చదివి పక్కన పడేసేవి కాదు. నేటికి వెంటాడుతున్న కులం అనే మాన్స్టర్ చేస్తున్న లోతైన గాయాలు. వర్గం మారిన ʹయేహి రే తేరా ఔకాత్ʹ అంటూ గుర్తు చేసే కులోన్మాదపు వికృత క్రీడలు. సార్ అని పిలుస్తూనే మీరేవుట్లు అని అడిగి, తీరా కులం తెలిసాక చూసే చీదరింపు చూపు, దేహం మీద పాములు, తేళ్లు విసిరేస్తే అవి వేసిన కాట్లకన్నా ఏమి తక్కువ కాదు. ʹఇండస్ ను చూస్తే నాలుగు తరాల చైతన్యం విద్వత్ కనిపిస్తుందిʹ అని గుర్రం సీతారాములు, ఎం.ఎఫ్. గోపీనాథ్ లు రాశారు. రెండు తరాల పీపుల్స్ వార్ చైతన్యం ఉన్న నాది ఇండస్ ది దాదాపు ఒకే కథ. మేం మంచి బట్టలు వేస్తే ఓర్వని అగ్రకులాల వెకిలి మాటల కథ. హిందీనో, ఇంగ్లీషో మాట్లాడితే ʹవో పెద్ద దొరల భాష మాట్లాడుతున్నారేʹ అని వెక్కిరించినా తట్టుకు నిలబడ్డ గాయాల కథ. మంచి మార్కులొస్తే, ఆళ్ల ఆడపిల్లలు మాతో మాట్లాడితే ఓర్వలేని తనం చేసిన గాయాల కథ. గాయాల సమూహాల్ని, సమూహాల గాయల్ని అనుభవించిన, అనుభవిస్తున్న వెలివాడ కథ.

సీతారావుడు పెళ్లికాడా బువ్వ కోసం కూసుంటే మార్టిన్ ఈపు మీద గుద్దిన ఇక్టోరియా రాచ్చసి ఏడుస్తూ అన్నమాట, కాళ్లకు చెప్పుల్లేకుండా ఆడుకోనికి పోతే ఈపు బసంత్ నగర్ ఎయిర్పోర్టు చేసి మా నాన్న చెప్పిన మాటల్లో సారం ఒక్కటే. ʹమనకు బట్టల్ని బట్టి గౌరవం వస్తుంది బేటా, మంచి బట్టలు వేసుకోవాలే, షూ వేసుకోవాలే, పాపడ తీసి తల దువ్వుకోవాలే, సూపుకు సుంగారం కనపడాలేʹ ఆయన అప్పుడు ఎందుకు చెప్పిండో యూనివర్సిటీలో బుషర్ట్ ఎస్తే ఓ అగ్రకుల ʹవిప్లవకారుడుʹ ʹఏం అరుణాంక్ టక్, షూ మీదకెళ్ళి దిగుతా లెవ్ʹ అనేదాక అర్థం కాలే. ʹఅభ్యుదయం, విప్లవం మాటలు చెప్పినంత వీజీ కాదని.ʹ నేను రగ్గడ్, రగ్గడ్ తయారవుతున్నా, మా నాన్న ఇప్పటికి ఎందుకు ఇన్ షర్ట్, షూ మీద కెళ్ళి దిగడో. దాని వెనుక మా తరాలు పడ్డ ఉక్కపోత ఉంది. తండ్లాట ఉంది. మేం మంచి బట్టలు వేసుకున్నా ఒప్పుకొని అగ్రకులాల తాలూకు వెకిలి మాటలకు ధిక్కారమే మా బట్టల్లో, మాటల్లో, నడవడికలో కనిపిస్తుంది. దాన్ని అహంకారం అనొచ్చు. వీడికి డిక్కీ బలుపు అనొచ్చు. ఎవడు ఎన్ని కూసిన మాది స్వాభిమానం. వందల, వేల ఏండ్లుగా అంటరానితనం, ఆకలి, అవమానాల్ని ఎదుర్కొన్న జీవులుగా మేం ప్రకటిస్తున్న ధిక్కారం.

అంబేద్కర్ అన్నట్లు ʹమహాత్ములు ఎందరో వచ్చారు. మహాత్ములు ఎందరో పోయారు. అయినా అంటరాని వాళ్ళు ఇంకా అంటరాని వాళ్లుగానే ఉన్నారు.ʹ ఇదేం చిన్నమాట కాదు. అందుకే అనుకుంటా ʹరేపు విప్లవం వచ్చిన కులం పోదు. సోషలిస్టు దశలో వర్గంతో పాటే కులం అంతమవుతుంది. కులం పునాదిలో ఉంది. ఉపరితలంలో ఉంది. దాన్ని అంతం చేసేందుకు అన్ని వైపుల నుండి దాడి చేయాలి.ʹ అన్ని ఎంఎల్ పార్టీలు ఈ సమాజం అర్ధ భూస్వామ్యం అనే నిర్ధారణ దగ్గరే ఆగిపోతే ʹఈ అర్ధ భూస్వామ్య సమాజానికి బ్రాహ్మణికల్ నేచర్ ఉన్నది. కనుక ఇది బ్రాహ్మణీయ అర్ధ భూస్వామ్య సమాజం.ʹ అని విప్లవోద్యమం రాసుకున్నది.

ఇప్పుడు ఇది అర్ధ భూస్వామ్యమా లేక పెట్టుబడిదారీ సమాజంగా రూపొందిందా? అనే చర్చ నడుస్తున్నది. ఒకవేళా ఇది పెట్టుబడిదారీ సమాజం అని నిర్ధారణ అయితే అది కేవలం పెట్టుబడిదారీ సమాజం కాదు. బ్రాహ్మణీయ పెట్టుబడిదారి సమాజమే అవుతుంది. అందులో దళితుడు పారిశ్రామికవేత్తగా గాక దళిత పారిశ్రామికవేత్తగానే గుర్తింపబడతాడు.

చివరగా ఒక్కమాట. దుర్మార్గమైన డ్రకొనియన్ కులవ్యవస్థ చేసిన బాల్యపు గాయలను రాసి, కటికపూలతో ఏడిపించిన అన్నో మార్టినో ఐ లవ్యూ... నేను నా బాల్యపు గాయల్ని రాయాల్సే ఉంది. బతుకు వెతల్ని, గాయల్ని కథలు, కథలుగా చెప్పాల్సే ఉంది. నువ్వు సివరాకర్నా రాయి. రాయి.. అన్నట్టే.

No. of visitors : 692
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •