మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం

| సాహిత్యం | వ్యాసాలు

మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం

- విరసం | 02.05.2018 11:30:59am

ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి, మార్చడానికి మార్క్సిజమే మార్గమని నిరూపిద్దాం

..ఉదయం పూట వేటకు పోయి, మధ్యాన్నం చేపలు పట్టుకొని, సాయంకాలం పశువులను తిప్పుకొచ్చి, రాత్రి భోజనం అయ్యాక సాహిత్య విమర్శ రాసుకోగలిగే జీవితం కావాలి..

రోజుకు పది పన్నెండు గంటలు పని.. మిగతా టైంలో ఇంటికి ఆఫీసుకు మధ్య ప్రయాణం..ఆ తర్వాత నిద్ర! ఇలా పని భారానికి బలైపోతున్న ఈ తరం యువత పైవాక్యాల్లోని జీవన సౌందర్యాన్ని, స్వేచ్ఛను, ఆనందాన్ని, ఇష్టపూర్వకమైన పని ఎంపికను కనీసం ఊహించగలదా? మానవ జీవితంలో కమ్యూనిజమనే అద్భుత వాస్తవం ఎలా ఉంటుందో ఊహించి, అదెలా నిజం చేసుకోవాలో దారి చూపిన కామ్రేడ్‌ కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాటలు అవి.

ఇవాళ నిరుపేదల దగ్గరి నుంచి కార్పొరేట్‌ ఉద్యోగుల దాకా అందరూ రోజుకు పది పన్నెండు గంటలు పని చేస్తున్నారు. హక్కులు లేని ఉద్యోగాలివి. సంఘాలు పెట్టుకోడానికి వీల్లేదు. జీవన నాణ్యత, భద్రత మచ్చుకైనా కనిపించదు. కాకుంటే అందరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు ఉండొచ్చు. చాలా మందికి ఫేస్‌బుక్‌ అకౌంట్లు కూడా ఉండొచ్చు. నిరుపేదలకైతే బ్యాంకుల్లో ప్రభుత్వమిచ్చే జీరో అకౌంట్లు ఉండొచ్చు. వీటి పక్కనే కోట్లాది మంది యువతకు నిరుద్యోగమే అనివార్యమైన జీవన విధానం. ఈ స్థితిలో సహజంగానే మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కల్లోలభరితమైన సామాజిక, వ్యక్తిగత జీవితంలో మనుషులు ఒంటరివాళ్లయిపోతున్నారు. సుదీర్ఘ నాగరికతా వికాసం తర్వాత కూడా మానవత ఏమైపోయిందనే అతి పెద్ద ప్రశ్న భయపెడుతోంది.

మార్క్స్‌(1818-1883) కాలంలో సుమారుగా పరిస్థితి ఇలాగే ఉండేది. సుమారుగా అని ఎందుకు అనాల్సి వస్తోందంటే..ఈ రెండు వందల ఏళ్లలో ప్రపంచం చాలానే మారింది. కానీ ఒకటి మాత్రం మారలేదు. అదే దోపిడీ. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు ఇది మారదని మార్క్స్‌కు తెలుసు. అందుకే ఆయన తన అధ్యయనానికి అదనపు విలువు దోపిడీ అనే అంశాన్ని కేంద్రం చేసుకున్నాడు. దీని కోసం వర్గం అనే కేటగిరీ దగ్గరి నుంచి బయల్దేరాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ గుట్టు అంతా బైటపెట్టాడు. అప్పటి నుంచి ఈ 21వ శతాబ్దం దాకా అదనపు విలువ ఉత్పత్తి అవుతున్న తీరు మారుతూ వచ్చింది. దాన్ని దోచుకుంటున్న తీరు కూడా మారింది. కాని దోపిడీ మాత్రం ఇంకా ఎక్కువైంది.

మార్క్స్‌ కాలంనాటి కార్మిక వర్గం ఇవాళ లేని మాట నిజమే. మన దేశానికే వస్తే..తెల్లబట్టల కార్మికవర్గం పెరిగిపోయింది. అన్ని రంగాల్లో ఇలాంటి వాళ్లు అసంఘటితశక్తిగా మిగిలిపోయారు. గ్రామీణ రైతాంగం భూమికి దూరమై రక రకాల రూపాల్లో నిర్వాసితులవుతున్నారు. వ్యవసాయం చేస్తున్న వాళ్లు మార్కెట్లో దగా పడి ఉరిపెట్టుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తన దోపిడీ రాజ మార్గం మీద అభివృద్ధి-సంక్షేమం అనే రెండు రథ చక్రాలకు రైతులను, కార్మికులను, విద్యార్థి యువతరాన్ని, ఉద్యోగులను బంధించి శరవేగంగా తళుకుబెళుకుల ఊహా ప్రపంచంలోకి లాక్కెళుతోంది. లాభాలు అనే ఇంజన్‌ ఈ వాహనాన్ని నడిపిస్తున్నది. దాని చక్రాల కిందపడి కోట్లాది మంది ప్రజలు రక్తమోడుతున్నారు. ఇది మన ఒక్క దేశం పరిస్థితే కాదు. ప్రపంచమంతా ఇట్లే ఉంది. చరిత్రలోకి ఒకసారి పెట్టుబడిదారీ విధానం వచ్చేశాక అన్ని సమాజాలను ఇలాగే తయారు చేసింది. ఇంత అమానవీయమైన, అనైతికమైన దోపిడీ పీడనల నుంచి ప్రజలకు విముక్తి లేదా? వాళ్లకు ప్రత్యామ్నాయం లేదా? ఇక్కడే ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతోంది. మానవ జాతి అంతిమ గమ్యం ఈ పెట్టుబడిదారీ విధానమే. దీంతో సర్దుకపోవాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేనేలేదనే వాళ్లు ఎక్కువయ్యారు. ఇది నిజమేనా?

కానే కాదు. ఇంత అమానుషమైన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఉంది. ఈ ప్రపంచం ఉత్పత్తిదాయకమైన ప్రజలది. భవిష్యత్తును గెలుచుకోవాల్సిన కార్మికులది. రైతులది. నిరుద్యోగం, అభద్రత, ఆకలి, సామాజిక పీడనల కింద నలిగిపోతున్న వాళ్లది. మొత్తంగా ఈ ప్రపంచాన్ని పునర్నిర్మించాల్సిన యువతరానిది. వాళ్లు లేచి నిలబడి దోపిడీ, అసమానతలు సహజ లక్షణాలైన పెట్టుబడిదారీ విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని ధ్వంసం చేయాలి. దీనికి కారల్‌ మార్క్స్‌ చూపించిన సిద్ధాంత, రాజకీయ మార్గంలో నడవాలి. వర్గపోరాటాలకు సిద్ధం కావాలి. సోషలిజమనే కొత్త వ్యవస్థను నిర్మించుకోవాలి.

ఇలాంటి మార్పు సాధ్యమేనా? అనే సందేహం చాలా మందిని పీడిస్తూ ఉంటుంది. మార్క్స్‌ ప్రత్యేకత అక్కడే ఉంది. ఆయనకు ముందు, తర్వాత కూడా ఎందరో గొప్ప మేధావులు ఉన్నారు. వాళ్లంతా చాలా గొప్ప విషయాలే చెప్పారు. కానీ మార్క్స్‌ - ఈ ప్రపంచాన్ని ఎందరో వ్యాఖ్యానించారు.. మనం చేయాల్సింది దీన్ని మార్చడం అని అంటాడు.

ఇలాంటి పవిత్రమైన కోరికలు చాలా మందికి ఉంటాయి. కానీ మార్క్స్‌ మాటలు అలాంటివి కావు. మానవజాతి చరిత్రలో ఆదిమ సమాజం, బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల మార్పులను మార్క్స్‌ భౌతికవాద పద్ధతిలో అర్థం చేసుకొని చారిత్రక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఈ మార్పులు వర్గపోరాటాల వల్లే జరిగాయనే తాత్వికతను ముందుకు తెచ్చాడు. చరిత్రపట్ల భౌతికవాద దృక్పథం అంటే ఇదే. దీని కోసం ప్రకృతిలో భాగమైన మానవ సమాజం ఆ ప్రకృతితో ఎలాంటి సంపర్కంలో ఉంటుందో పరిశీలించాడు. దీని నుంచి ఉత్పత్తి శక్తుల అభివృద్ధి అనే నిరంతరాయ ప్రక్రియలను గుర్తించాడు. సమాజంలోని ఉత్పత్తి సంబంధాలు దీనికి ఆటంకంగా మారినప్పుడు విప్లవం వస్తుందని చెప్పాడు. అసలైన చరిత్ర అప్పటి నుంచి మొదలవుతుందని అంటాడు. అయితే ఇందులో చైతన్యవంతమైన మనుషుల పాత్ర తప్పనిసరి. మళ్లీ ఆ ప్రజలు కూడా తమ కోరికల మేరకు చరిత్ర నిర్మించలేరని అంటాడు. మార్క్స్‌ సిద్ధాంతంలోని శాస్త్రీయతకు ఇదే పునాది. మార్క్స్‌ను మిగతా మేధావుల నుంచి వేరు చేసే సిద్ధాంతం ఇది.

మార్క్స్‌ తన కాలంలోని పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించాడు. శ్రమశక్తి సరుకు కావడంతో పెట్టుబడిదారీ విధానం ఆరంభమైంది. గత వ్యవస్థలకు పెట్టుబడిదారీ విధానానికి ఉన్న మౌలికమైన తేడా ఇదే. మామూలు మాటల్లో చెప్పాలంటే జీతాలకు పని చేయించుకోవడమే పెట్టుబడిదారీ విధానం. కార్మికులు తమ శ్రమశక్తిని అమ్ముకొని దోపిడీకి గురి కావడం అంటే తమకుతామే దూరమైపోవడం. దీన్నే ఆయన పరాయికరణ అన్నాడు. కానీ ఇదేదీ బైటికి కనిపించదు. పని చేస్తాం.. జీతం ఇస్తారు.. అంతా సవ్యంగానే జరుగుతోంది కదా అనిపిస్తుంది. పెట్టుబడిదారీ విధానం లోగుట్టు ఇది. మార్క్స్‌ దీన్ని అధ్యయనం చేశాడు. ఉత్పత్తిలో ఆదనపు విలువ పోగుపడటం, దాన్ని యజమాని దోచుకోవడం పెట్టుబడిదారీ విధానం గుండెకాయ. అంటే లాభాల మీద బతికే వ్యవస్థ అది. అందువల్ల అసమానత దాని పుట్టకలోనే ఉంది. పారిశ్రామిక పెట్టుబడిలో ఉన్న ఈ లక్షణాన్ని వివరించడానికి మార్క్స్‌ పెట్టుబడి అనే మహత్తర రచన చేశాడు.

కాలక్రమంలో పెట్టుబడిదారీ విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అది సామ్రాజ్యవాదంగా మారింది. ద్రవ్య పెట్టుబడిగా చెలామణి అవుతోంది. విస్తారమైన సేవా రంగం ఏర్పడింది. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ఉత్పత్తి తీరు కూడా మారింది. ఈ పరిణామాలను అదనపు విలువ సిద్ధాంతం వెలుగులో మార్క్సిస్టులెందరో వివరించారు. ఏ రంగంలోనైనా సరే మనం పని చేస్తున్నామంటే దోపిడీకి గురైతున్నట్లే. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వెనుక ఉన్న ఫార్ములా ఇదే. వర్గపోరాటాలే దీన్ని రద్దు చేస్తాయి. గత శతాబ్దిలోనే కాదు, ఈ శతాబ్దంలో కూడా దోపిడీని రద్దు చేసే వర్గపోరాటాలే ప్రజల ముందున్న విముక్తి మార్గం.

అప్పుడు మన ముందు ఒక గంభీరమైన ప్రశ్న వచ్చి నిలబడుతుంది. మార్క్స్‌ చూపిన మార్గంలో గత శతాబ్దంలో రష్యాలో, చైనాలో కార్మికులు, రైతులు చేసిన సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాలు వెనక్కి వెళ్లిపోయాయి కదా? అని. దీన్ని తప్పించుకోలేం. నిజమే.. అక్కడ సోషలిజం నిలదొక్కుకోలేదు. పెట్టుబడిదారీ విధానం బయల్దేరింది. ఈ అనుభవం చిన్నది కాదు. అయినా రష్యా, చైనాల్లో సాధించిన ప్రగతి అంతా సోషలిజం అమలైన రోజుల్లోనే సాధ్యమైంది. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమనే సత్యాన్ని ఆ సమాజాలు నిరూపించాయి. సోషలిజం ఎంత అద్భుతమైన, మానవీయ వ్యవస్థనో రుజువు చేశాయి. అయితే అక్కడ సోషలిస్టు ప్రయత్నాలు ఎందుకు అలా ముగిసిపోయాయి? అనే ప్రశ్నకు గత యాభై ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు శక్తులు సమాధానం వెతుకుతున్నాయి.

చరిత్రలో కార్మికవర్గం ఎదుర్కొన్న ఈ వైఫల్యాల నుంచే పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదని బూర్జువా శక్తులు విర్రవీగిపోతున్నాయి. అలాగే మార్క్స్‌ సిద్ధాంతంలోనే లోపాలున్నాయనే మేధావులు ఎందరో పుట్టుకొచ్చారు. ఇలాంటి వాదనలను దీటుగా ఎదుర్కోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి లెక్కలేనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నది. లాభాలు, అసమానతలు అనే పునాది మీద బతికే పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే సంక్షోభాలు ఉన్నాయి. తనను కూలదోసే కార్మికవర్గాన్ని కూడా ఆ వ్యవస్థే పుట్టించుకుందని మార్క్స్‌ సూత్రీకరించాడు. అందుకే మార్క్స్‌ సిద్ధాంతాల వెలుగులో కార్మికవర్గ పోరాటాలు, విప్లవోద్యమాలు బద్దలవుతూ వచ్చాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు కార్మికవర్గ విప్లవాలు చెలరేగుతూనే ఉంటాయి. సోషలిజం, అంతిమంగా కమ్యూనిజమే దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా చరిత్ర పురోగమిస్తూనే ఉంది.

అందుకే 21వ శతాబ్దంలో కూడా మార్క్స్‌ మౌలిక సిద్ధాంతానికి తిరుగులేదు. గత నూటా యాభై ఏళ్లలో ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో వచ్చిన మార్పులను, కార్మిక వర్గ విప్లవాల, సోషలిస్టు ప్రయోగాల అనుభవాలను పరిగణలోకి తీసుకోవాల్సిందే. పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా మారిందని లెనిన్‌ సిద్ధాంతీకరించాడు. సామ్రాజ్యవాద యుగంలోని అర్ధ భూస్వామ్య సమాజాల్లో నూతన ప్రజాస్వామిక విప్లవం గురించి మావో సూత్రీకరించాడు. ఈ క్రమంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదంలో వచ్చిన మార్పులను గుర్తించాలి. వెనుకబడిన దేశాల్లో వలసానంతరం పెట్టుబడిదారీ అభివృద్ధిలోని ప్రత్యేకతలను అర్థం చేసుకోవాలి. భారతీయ సమాజంలో ఇంకా బలీయంగానే ఉన్న శిథిల భూస్వామ్య మూలాలను, ప్రాచీన సాంఘిక వ్యవస్థల కొనసాగింపునూ ఎంత మాత్రం విస్మరించడానికి లేదు. అనేక అంతరాల, ఆధిక్యాల కుల సంబంధాలను చారిత్రక భౌతికవాద పద్ధతిలో విశ్లేషించి సామాజిక, రాజకీయార్థిక సిద్ధాంతంగా మార్క్సిజాన్ని ఈ శతాబ్దానికి తగినట్లు మరింత పదునుదేల్చాల్సిందే.

మార్క్స్‌ తాత్విక రంగంలో గణనీయమైన కృషి చేసినప్పటికీ ఆధునిక సామాజిక సిద్ధాంత రంగానికి ఆయన వేసిన పునాది అత్యంత శాస్త్రీయమైనది. ఆయన తన కాలంలోని వేర్వేరు విజ్ఞాన శాస్త్రాల్లోని శాస్త్రీయతను సామాజిక శాస్త్రాల్లోకి తీసుకొని వచ్చారు. పెట్టుబడిదారీ సంక్షోభ కాలమే మార్క్స్‌ను ఆలోచనాపరుడిగా తీర్చిదిద్దింది. ఆయన ఆసాధారణ మేధావి.. కానీ ఆ కాలమే ఆయన్ను కన్నది. వ్యక్తిగా ఆయనలోని ప్రతిభలో ఆ కాలపు సంఘర్షణ ప్రతిఫలించింది.

అందుకే మానవజాతి వికాస క్రమంలో మార్క్స్‌ తర్వాత అంతగా ప్రభావం వేసిన వ్యక్తులు లేరు. మార్క్స్‌ అని ప్రత్యేకంగా ఆయన ద్వి శతజయంతి సందర్భంగా అంటున్నాం కాని వాస్తవానికి మార్క్సిజం అని వ్యవహరించాలి. వ్యక్తులుగా తప్ప మరే రకంగానూ వేరు చేయజాలని మార్క్స్‌ ఏంగెల్స్‌ ఇద్దరి కృషి అది. ఆ తర్వాత లెనిన్‌, స్టాలిన్‌, మావోల సిద్ధాంత, ఆచరణాత్మక కృషి అందులో భాగం. మార్క్సిస్టు లెనినిస్టు సంప్రదాయానికి బైట మార్క్స్‌ ఆలోచనలు కేంద్రంగా ఎందరో చేసిన కృషి కూడా ఉన్నది. అనేక పోరాటాల వెలుగులో ముందుకు వచ్చిన సామాజిక, తాత్విక భావనలకు మార్క్సిస్టు పద్ధతిలో చేసిన వ్యాఖ్యానాలూ ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్స్‌ తర్వాత మార్క్సిజం ప్రమేయం, ప్రభావం లేని రంగాలు ప్రపంచంలో లేనేలేవు. సాహిత్యం, కళలు, భాష, పర్యావరణం, సాంఘిక వ్యవస్థలు, సంస్కృతి, పాలనా శాస్త్రాలు, మనస్తత్వ శాస్త్రాలు, బోధనా పద్ధతులు.. ఒకటేమిటి? అన్ని రంగాలను మార్క్స్‌, ఏంగెల్స్‌ ఆలోచనలు ప్రభావితం చేశాయి. నిర్దేశించాయి. సామాజిక ప్రగతికి, విముక్తికి మార్క్సిజం శాస్త్రీయమైన గీటురాయి అయింది. ఇతరేతర సామాజిక, తాత్విక సిద్ధాంతాలను మార్క్సిస్టు పద్ధతిలో నిగ్గుదేల్చే ఒరవడి కొనసాగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని కార్మికోద్యమాలకు ఈ శతాబ్దంలో కూడా మార్క్స్‌ ఆలోచనలు దారి చూపుతున్నాయి. ఆయన ఆలోచనల విస్తరణ, విశ్లేషణ, అన్వయం ఇంకా సాగుతూనే ఉన్నది. వేర్వేరు రాజకీయ మార్గాలకు చెందిన వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. వాళ్లలో కొందరు మార్క్స్‌ చెప్పిన కార్మికవర్గ రాజ్యాధికారం, కార్మికవర్గ నియంతృత్వం వంటివి వ్యతిరేకించారేమోగాని సామాజిక సిద్ధాంతంగా చారిత్రక భౌతికవాదం తప్పని నిరూపించలేకపోయారు. అంత పటిష్టమైన శాస్త్రీయ పునాది మీద ఆయన సిద్ధాంత కృషి జరిగింది. అలా మార్క్సిజంతో ఏకీభావం ఉన్న వాళ్లే కాక లేని వాళ్లు కూడా మార్క్స్‌ ఆలోచనలు కేంద్రంగానే కృషి చేస్తున్నారు.

మార్క్సిజంలోని శాస్త్రీయ పద్ధతి వల్లే దానికి ఇంత శక్తి వచ్చింది. మార్క్సిజం ఆచరణాత్మక సిద్ధాంతం. నిరంతరం కార్మికవర్గ విప్లవానుభవాల నుంచి అభివృద్ధి చెందుతోంది. 21వ శతాబ్ది విప్లవాల్లో, సోషలిస్టు ప్రయత్నాల్లో అది మరింత రాటుదేలుతుంది. మన దేశంలోని కొనసాగుతున్న విప్లవోద్యమానికి, ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారానికి పునాది మార్క్స్‌ సిద్ధాంతమే. మార్క్స్‌ ద్విశతజయంతి సందర్భంగా మార్క్స్‌ గురించి మాట్లాడుకోవడమంటే గత రెండు శతాబ్దాల గురించి చర్చించుకోవడం మాత్రమే కాదు. 21వ శతాబ్దంలో, నిర్దిష్టంగా భారత దేశంలో మార్క్స్‌ గురించి మాట్లాడుకోవడమే. మార్క్స్‌ ద్విశతజయంతిని జరుపుకోవడం దాని కోసమే.

No. of visitors : 945
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మార్క్స్ వ‌ర్గ‌ పోరాట సిద్ధాంతం అజేయమైంది : కాశీం

కాశీం | 29.05.2018 11:22:54pm

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా... మార్క్స్ సిద్ధాంత రాజ‌కీయాల గురించి త‌న‌ అభిప్రాయాల్ని పంచుకున్న‌విర‌సం నాయ‌కుడు కాశీం...
...ఇంకా చదవండి

marx selected poetry

Editors : James Luchte | 02.05.2018 03:38:37pm

Marx wrote much of this poetry when he was nineteen, around the year 1837, while he was at university. He makes ready use of mythological themes, theologica...
...ఇంకా చదవండి

మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌

| 05.05.2018 09:37:20am

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా మార్క్స్ గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న‌ డీఎస్‌యూ కార్య‌ద‌ర్శి అరుణాంక్ మార్క్స్ ప్రాసంగిక‌త నేటికీ ఉందంటున్నారు....
...ఇంకా చదవండి

Share your views on Karl Marx, his ideology and Politics

www.virasam.org | 26.04.2018 09:26:06am

Friends who are working on various facets of Marxism and revolutionary ideology and politics, can record the same in a short video format and send them to v...
...ఇంకా చదవండి

21వ శతాబ్దంలో మార్క్స్‌

ఎడిటర్‌ & టీం | 18.04.2018 11:41:43am

మార్క్సిజానికి సంబంధించిన వేర్వేరు రంగాల్లో కృషి చేస్తున్న మీరు మీ అభిప్రాయాలను వీడియో తీసి virasam1970@gmail.com మెయిల్‌కు పంపించండి. మార్క్సిజంలోని వేర్వ...
...ఇంకా చదవండి

मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।

एडिटर & टीम | 26.04.2018 09:48:00am

मई 5 से कार्ल मार्क्स के ʹदो सौ साल साल गिरहʹ के कार्यक्रम आरँभ होने वाले हैं। साल गिरह और बर्सियोँ मेँ कोई भी खासियत नहीं रहने पर भी विश्व कार्मिक वर्ग, इन...
...ఇంకా చదవండి

గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌

పాణి | 05.05.2018 11:18:04pm

మన దేశంలో నడుస్తున్న వర్గపోరాటాలపట్ల సంఘీభావం ప్రకటించకుండా మార్క్సిజాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఉత్తమ మార్క్సిస్టుల వల్ల ఈ కాలానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లే...
...ఇంకా చదవండి

మార్క్సిజం ఆచరణ సిద్ధాంతం..

బాసిత్ | 03.07.2018 02:31:58pm

ఈ దేశంలో దళితులు, శ్రామిక వర్గాలకు అధికారం ఇంకా అందలేదని, అందుకే మార్క్సిజానికి ప్రాసంగికత అనివార్యంగా ఉంటుంద.....
...ఇంకా చదవండి

మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్

స్టువర్ట్ జేఫ్రిస్ | 05.06.2018 10:37:25am

మార్క్స్ పని అయిపోయినట్టేనా? కానే కాదు. నాకైతే, కార్ల్ మార్క్స్ ఇప్పటికి చదవడానికి అర్హత కలిగినవాడు. అయితే కేవలం అతడి దూరదృష్టి, అంచనా వల్ల కాదు, అతడి విశ్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •