మార్క్స్ మెచ్చిన ప్రొమిథియస్ స్పూర్తి

| సాహిత్యం | క‌థ‌లు

మార్క్స్ మెచ్చిన ప్రొమిథియస్ స్పూర్తి

- సాహస్ | 19.05.2018 02:25:40am

యురెనస్ (ఆకాశం) ప్రపంచానికి అధిపతి. అతని భార్య జియా (భూమి). వాళ్ళకు మొత్తం పద్దెనిమిది మంది పిల్లలు. అందులో పన్నెండు మంది టైటాన్స్, ముగ్గురు హెకటోంచెరిస్, ఇక మిగిలిన ముగ్గురు సైక్లోపెస్. అందరి తల్లుల మాదిరిగానె జియా కూడ తన పిల్లల చూసి ఎంతో గర్వపడేది. తండ్రి యురేనస్ మాత్రం ఆ పిల్లల చూస్తె అసహ్యించుకునేవాడు. ఎందుకంటె వాళ్ళు ఎప్పటికైన తనను కూలదోసి తన అధికారాన్ని తీసుకుంటారనే భయం. ఆ భయంతోనే తన పిల్లలను ఒక్కొక్కరిగా టార్టరస్ (అంతులేని ఒక గొయ్యి) లో పడేస్తుండేవాడు.

అలా బిడ్డలను కోల్పోవడంతో తల్లి జియా తల్లడిల్లిపోయేది. ఇక మీదట అలా జరగకూడదని మిగిలి వున్న తన పిల్లల్లో టైటాన్స్ కు ఎలాగైన తండ్రిని కూలదోసి అధికారం తీసుకోమని చెబుతుంది. టైటాన్లలో చిన్నవాడైన క్రోనస్ దైర్యం చేసి తండ్రిని అధికారం నుండి కూలదోసి ప్రపంచానికి అధిపతి అవుతాడు. తాను అధిపతి అయ్యాక అంతులేని గోతిలో తండ్రి పడేసిన తన సోదరులను బయటకు తీసే అధికారం క్రోనస్ కు ఉంటుంది. తన తల్లి కూడ అదే కోరుకుంటుంది. కాని క్రోనస్ ఆ పని చేయడు. ఆ తల్లి ఎంతో భాద పడుతుంది. కొడుకు మీద కోపడుతుంది. అయినా ప్రయోజనం ఉండదు. "వీడి పిల్లలు కూడ వీడి మాదిరిగానే వీడిని కూలదోసి ప్రపంచ అధికారాన్ని తీసుకుంటరు" అని అనుకుంటుంది.

ఆ విషయంలో క్రోనస్ కు కూడ అనుమానం వుంటుంది. అందుకే ముందు జాగ్రత్తగ తన భార్య రియా పిల్లలకు జన్మ ఇవ్వగానే వెంటనే వాళ్ళను మింగేయడం మొదలు పెడుతాడు. ఆ ఘోరాన్ని రియా తట్టుకోలేకపోతుంది. రియా బాధను చూసి జియా ఆమెకు ఒక సలహా ఇస్తుంది. "క్రోనస్ నీ పిల్లల పుట్టగానె మింగేస్తుండు కదా, ఈ సారి కానుపు కాగానె బిడ్డకు బదులుగా ఒక రాయికి బట్టలు తొడిగి అదే ఈసారి పుట్టిన బిడ్డని చెప్పు. వాడు అది మింగేస్తే నీ బిడ్డను ఎక్కడైన దూరంగా పంపి పెంచుకో" అని చెప్తుంది. కొద్ది కాలానికే రియా కు జూస్ అనే మగ బిడ్డ పుడుతుంది. వెంటనే జియా చెప్పినట్లె ఒక చిన్న రాయికి బట్టలు తొడిగి దానిని క్రోనస్ కు ఇస్తుంది రియా. దానినే తన బిడ్డ అనుకొని క్రోనస్ మింగేస్తాడు. ఇక జూస్ ను క్రోనస్ కు తెలియకుండ క్రీటె అనే ఒక ద్వీపానికి పంపితె అక్కడ వనదేవతల సంరక్షణలో పెరిగి పెద్దవాడు అవుతాడు.

అలా పెద్దవాడైన జూస్ తిరిగి వచ్చి తన తండ్రి క్రోనస్ కు వాంతులు అయ్యే విధంగా ఒక కషాయం ఇస్తాడు. వాంతులతో పాటుగా తాను మింగిన పిల్లలందరు బయటకు వచ్చి వాళ్ళు జూస్ కు మద్దతుగా నిలుస్తారు. వీళ్ళంతా కొత్త తరం దేవుళ్ళుగా తయారవుతారు. ఆ క్రమంలో "పాత దేవుళ్ళకు" (మౌంట్ ఆథ్రిస్ ను పాలించే టైటాన్లు) "కొత్త దేవుళ్ళకు" (అంటె మౌంట్ ఒలంపస్ ను ఏలే, ఒలంపియన్లు గా పిలవబడే కొత్త తరం దేవుళ్ళు) మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒలంపియన్లకు నాయకుడు జూస్.

అయితే టైటాన్ల నుండి ఇద్దరు అన్నదమ్ముల్లు (ప్రొమిథియస్ మరియు ఎపిమిథియస్) మాత్రం శతృ పక్షాణ (ఒలంపియన్ల తరుపున) యుద్ధం చేస్తారు. [గ్రీక్ లో ప్రొమిథియస్ అంటె ముందుచూపు (forethought) వున్నవాడని అర్థం. ఎపిమిథియస్ దానికి వ్యతిరేఖం. అన్నీ జరిగిపోయాక అలోచించేవాడు (afterthought) అని అర్థం.] ప్రొమిథియస్ ముందు చూపుతో జూస్ గెలుస్తాడని తెలుసుకొని తను, తన తమ్ముడు ఎపిమిథియస్ ఇద్దరు గెలిచే జట్టు తరుపున వుందామని నిర్ణయించుకుంటాడు. తను ఊహించినట్లె ఒలంపియన్లు ఆ యుద్ధంలో గెలుస్తారు. యుద్ధంలో గెలిచాక జూస్ ఓడిపోయిన టైటాన్లను అందరిని అంతంలేని గోతిలో పడేస్తాడు. ఒక్క అట్లాస్ ను మాత్రం భూమికి దక్షిణంగా పోయి తన భుజాల మీద ఎల్లప్పటికి అకాశాన్ని ఎత్తి పట్టుకోమని ఆదేశిస్తాడు.

ఇక తనకు యుద్ధంలో సహాయం చేసినందుకు ప్రొమిథియస్ కు మరియు ఎపిమిథియస్ కు బహుమతిగా తనకు ఇష్టమైన జంతువులను సృష్టించుకొమ్మని జూస్ చెప్తాడు. ఆ జంతువులకు వుండె కొన్ని లక్షణాలు కూడ చెప్పి ఆ ఇద్దరి అన్నదమ్ములకు తమకు ఇష్టమైనవి తీసుకునే అవకాశం ఇస్తాడు. ముందు, వెనుక ఆలోచించకుండ ఎపిమిథియస్ ఏనుగు, సింహం వంటి పెద్ద జంతువులను సృష్టిస్తాడు. ముందుచూపుతో అన్ని ఆలోచించి ప్రొమిథియస్ చిన్న జీవులైన మనుషుల సృస్టిస్తాడు. [అతను కేవలం పురుషులని మాత్రమే సృష్టిస్తాడు, స్త్రీలని కాదు!]. అయితే ఎపిమిథియస్ తన జంతువులకు అన్ని మంచి గుణాలు (చలికి తట్టుకునే విధంగా ఒంటి నిండా వెంట్రుకలు, వంట లేకుండనే పచ్చి మాంసం తినడం ...) ఎంచుకోవడం మూలంగా వాటికి సహజంగానే ఎలాంటి ప్రకృతి పరిస్థితుల్లో అయిన బ్రతికే సౌకర్యం వుంటుంది. కాని మనుషులు విపరీతమైన చలిని తట్టుకొనే పరిస్థితుల్లో ఉండరు. తినడానికి కూడు లేదు, ఉండడానికి గూడు లేదు, ఒంటికి బట్ట లేదు. పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఎలాంటి తెలివి లేకుండ, ఏమి చేయలేకుండ, అలా మబ్బుగా బతికేస్తుంటారు.

తాను ఇష్టంగా సృష్టించిన మనిషి అలా ధీనంగా బ్రతకడం చూసి ప్రొమిథియస్ చలించిపోతాడు. జూస్ దగ్గరికి పోయి పరిస్థితి వివరించి మనుషులకు నిప్పు (fire) సాయంగా ఇస్తె వాళ్ళు దానితో ఏదైన చేసుకొని బ్రతుకుతారని వేడుకుంటాడు. దానితో వాళ్ళు మాంసం వండుకుంటరు, పరికరాలు తయారు చేసుకుంటరు, రాత్రిళ్ళు వెచ్చగా పడుకుంటరు అని వివరంగా చెప్తాడు. కాని జూస్ " ఆ తెలివితక్కువ మనుషులకు నిప్పు ఇస్తె అంతా నాశనం చేస్తరు. అంతేకాదు ఒలంపస్ పర్వత మీద వున్న ఫైర్ కేవలం దైవత్వం వున్న వాళ్ళకు మాత్రమే" అని అతని అభ్యర్దనను తిరస్కరిస్తాడు. దానికి ప్రొమెథియస్ నొచ్చుకుంటడు. మనిషికి సహాయం చేయకపోతె దైవత్వమెందుకు అని అనుకోని ఎలాగైనా నిప్పును మనిషికి చేరవేయాలని నిర్ణయించుకుంటడు. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో నిప్పును దొంగతనంగా తీసికెళ్ళి భూమి మీద వున్న మనుషులకు ఇస్తడు.

ప్రొమిథియస్ కు తెలుసు ఆ విషయం తెలిస్తె జూస్ కోపంతో ఊగిపోతడని, తాను చేసిన పనిని "నేరంగా" భావిస్తడని. అయినా కూడ మనిషిని బ్రతికించడం కోసం సాహసం చేసిండు. ఇక చేతికి నిప్పు రాగానె మనిషి తనలోని సృజనాత్మకతకు పదును పెట్టుకొని దానితో చేయాల్సినవన్నీ చేయడం మొదలుపెడుతడు. మంచి మంచి వంటలు చేస్తుంటే వాసనలు, పొగ భూమి మీది నుండి ఆకాశానికి పోతుంటయి. అవి గమనించిన మనుషులు పైన వున్న దేవుళ్ళను సంతృప్తి పరచడానికి వాళ్ళకు గుళ్ళు, గోపురాలు కట్టి తమ వేటలోని మంచి మాంసం దేవుళ్ళ కోసం కాల్చడం మొదలు పెడుతారు. పైన దేవుళ్ళు సహితం ఆ కొత్త రుచులకు ఎంతో సంతోషపడుతుంటరు.

కాని ప్రొమిథియస్ కు తన మనుషులు మంచి మాంసాన్ని వాళ్ళు తినకుండ దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టడం నచ్చదు. ఒక అలోచన చేస్తడు. ఒక రోజు జూస్ ను భూమి మీదికి రమ్మని ఆహ్వానిస్తడు. అతను భూమి మీదికి రాక ముందే మనుషుల దగ్గరికి పోయి వాళ్ళు కోసుకున్న ఎద్దు మాంసాన్ని రెండు కుప్పలుగా పోయమని చెప్తడు. ఒక కుప్పలో బొక్కలు, తినడానికి పనికిరాని భాగాలు వేసి వాటి మీద తెల్లటి కొవ్వుతో కప్పమని చెప్తడు. ఎందుకంటె అలా చేస్తె ఆ బొక్కల కుప్ప చూడడానికి ఆకర్షణీయంగ కనబడుతది. మరో కుప్పలో మంచి మాంసం ముక్కలు వుంచి వాటి మీద కొన్ని బొక్కలు, తోలు కప్పమని చెప్తడు. అది కంటికి ఇంపుగా వుండ కుండ చూడమని చెప్తడు. రెండు కుప్పలు వేశాక జూస్ రాగానే ఆ రెండు కుప్పల్లో ఒక దానిని ఎంచుకుంటె మనుషులు ప్రతిరోజు ఆ కుప్పలో లాంటి మాంసాన్ని దేవుళ్ళ కోసం నివేదిస్తరు అని చెప్తడు. జూస్ మాంసం ముక్కల కుప్ప మీద ఉన్న బొక్కలు చూసి అసహ్యించుకొని, దాని పక్కనే కొవ్వుతో కప్పబడి నిగనిగలాడుతున్న బొక్కల కుప్పను కోరుకుంటడు. అంతా ప్రొమిథియస్ పథకం ప్రకారమే జరుగుతుంది.

కాని జూస్ కు వెంటనే తనను మోసం చేశారనే విషయం అర్థమవుతుంది. మనుషులకు నన్ను మోసం చేసేటంతటి తెలివితేటలు లేవు. దీనికంతటికి కారణం ప్రొమిథియస్ అని నిర్ధారణకు వస్తాడు. "నిప్పు దొంగతనం చేసి మనుషులకు ఇవ్వడమే కాకుండ, నన్ను వాళ్ళతో మోసం చేపిస్తాడా" అని కోపంతో జూస్ రగిలిపోయి ప్రొమిథియస్ కు మరియు మనుషులకు శిక్ష విదించాలని నిర్ణయించుకుంటాడు.
ప్రొమిథియస్ కు శిక్షగా అతన్ని ఒక కొండ మీది పెద్ద బండ రాయికి గొలుసులతో కట్టి వేసి ఆకాశం నుండి ఒక డేగ వచ్చి ప్రతిరోజు అతని లివర్ తినాలని ఆజ్ణాపిస్తాడు. ప్రొమిథియస్ కూడ అమరజీవి కనుక పగటి పూట డేగ లివర్ తినిపోతె అదే రోజు రాత్రి అది మమూలు స్థితికి పెరుగుతది. మరుసటి రోజు పొద్దున్నే మరలా డేగ వచ్చి తినేది. ఇలా ఎంతో హింసను అనుభవిస్తాడు.

ఇక మనుషులను కూడ శిక్షించాలని జూస్ ఒక కొత్త ఆలోచన చేస్తడు. కమ్మరి, కౌంసలి పనుల దేవుడు హెఫాయిస్టస్ ను మరియు అగ్నిని పిలిచి ఒక మొదటి మానవ స్త్రీని తయారు చేయమంటడు. వాళ్ళు అలాగే చేస్తారు. ఆమె పేరు పాండోర. ఆమెకు అన్ని మంచి లక్షణాలతో పాటుగా ప్రతిదీ తెలుసుకోవాలనే అంతులేని ఆసక్తిని (curiocity) కూడ ఇస్తాడు. అంత ఉత్సుకత ఉన్న స్త్రీకి ఒక పాత్రను ఇచ్చి అది ఎప్పటికి తెరువద్దు అని ఒక్కానిచ్చి మరీ చెప్పి భూమి మీదికి పంపిస్తడు. కాని ఆమె అందులో ఏముందోనని తెలుసుకునే ఆసక్తితో ఆ పాత్ర తెరిచి చూస్తుంది. అంతె ఒక్క సారిగా బాధలు, కష్టాలు, ఆశ, పెత్తనం, హింస... ఇలా అన్ని రకాల అవలక్షణాలన్ని బయటికి వచ్చేస్తవి. ఆమె ఆ మూత మూసేసరికి చివరికి ʹవిశ్వాసంʹ (hope) ఒక్కటె అందులో మిగిలిపోతుంది. ఇక బయటపడ్డ అవలక్షణాలు మనుషలోకి చేరి భూమి మీద మొత్తం అల్లకల్లోలం కావడం మొదలవుతుంది. దానిని సాకుగా చూసుకొని జూస్ మొత్తం భూమినంతటిని వరదలతో ముంచెత్తి తన కోపం తీర్చుకోవాలని మొత్తం మానవాళినంతటిని నాశనం చేయ ప్రయత్నిస్తడు... అయితే చివరికి జూస్ కొడుకుల్లో ఒకడైన హెర్ క్యులెస్ ప్రొమిథియస్ ను బంధీ విముక్తున్ని చేస్తడు. ప్రొమిథియస్ కూడ అందరి దేవుళ్ళుండె ఒలంపస్ కు వెళ్తడు.

* * *
[ Aeschylus రాసిన ʹPrometheus Bond" ను మార్క్స్ ఇష్టంగా చదువుకున్నాడు. అది అతని మీద ఎంతో ప్రభావాన్ని చూపింది. అది తన రచనలలో కూడ ప్రత్యక్షంగా, పరోక్షంగా కనబడుతుంది. ముఖ్యంగా తన పిహెచ్ డి థీసిస్ కు రాసిన ముందుమాట లో ప్రొమిథియస్ మాటలను కోట్ చేసి తన ఇష్టాన్ని ప్రకటించాడు. గ్రీక్ పురాణంలో ప్రొమిథియస్ కూడ ఒక దేవుడే, కాని మిగతా ఏ దేవుళ్ళు కూడ మనిషి బాగు గురుంచి పట్టించుకోవడం లేదని "నేను అందరి దేవుళ్ళను అసహ్యించుకుంటున్నాను " అని; మనిషి స్వీయ సృహను (self-consciousness) గుర్తించని దేవుళ్ళతో మనుషులకు పనేముందని ప్రొమిథియస్ చెప్పడం మార్క్స్ కు బాగా నచ్చింది. అంతేకాదు, మనిషి బాగు కోసం తాను చేసిన పనికి "దొంగతన నేరం" ఆపాదించబడి బండకు కట్టివేయబడ్డ ప్రొమిథియస్ "జూస్ కు విధేయుడనై ఉండేకంటే, ఈ రాయికి బానిసనై వుంట" అని తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు. మార్క్స్ తన ముందుమాటను ఈ వాక్యాలతోనే ముగిస్తాడు. తర్వాత కాలంలో "పోరాడితె పోయేదేమిలేదు బానిస సంకెళ్ళు తప్ప" అని మార్క్స్ నినదించినప్పుడు పెత్తనపు వ్యవస్థకు సాహసంగా ఎదురు తిరిగి సంకెళ్ళను సహితం గేళి చేసిన ప్రొమిథియస్ తన మదిలోమెదిలే వుంటాడు. ప్రొమిథియస్ మనిషికి అందించిన ఫైర్ లో మార్క్స్ జ్ణాణాన్ని చూశాడు. మనిషి యొక్క ఉత్పత్తి సాధనాలపై తనకే హక్కు వుండాలనే విషయాన్ని కనిపెట్టాడు. మిధ్యా ప్రపంచంపై, వాస్తవిక ప్రపంచం చేసిన పోరాటంగా చూశాడు. ప్రజా చైతన్యానికి బుద్దిజీవులు చేయాల్సిన పనిని గుర్తు చేస్తాడు. సాహస త్యాగాలను గుండెకు హత్తుకుంటాడు. చట్టబద్ద దోపిడీ వ్యవస్థలో కనీస మనుగడ కోసం అభాగ్యులు చేసే చిన్న చిన్న దొంగతనాలు నేరమెట్లయితయని వాదిస్తాడు.

మార్క్స్ రచనల్లో ప్రొమిథియస్ ప్రస్తావన చూశాను కాని ఎప్పుడు పెద్దగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేయలేదు. నేను ఎప్పుడు గ్రీక్ పురాణాలు చదవలేదు కాబట్టి ప్రొమిథియస్ కథ నాకు అస్సలు తెల్వదు. మొన్నటి చలికాలపు సెలవుల్లో నాల్గవ తరగతి చదువుతున్న మా వాడు సాహస్ Ingri dʹAulaire and Edgar Parin dʹAulaire రాసిన "DʹAulairesʹ Book of Greek Mythsʹ అనే పుస్తకం చదువుతుంటె ప్రొమిథియస్ కథ చదివి నాతో పంచుకోమని అడిగాను. నా కోరిక మేరకు వాడు 192 పేజీల పుస్తకాన్ని ఆరు పేజీల సారాంశంగా రాసి ఇచ్చాడు. దానిలోని కొంత భాగాన్ని అనువాదం చేసి మార్క్స్ ద్విశతజయంతి సందర్భంగా మీతో పంచుకోగల్గినందుకు సంతోషిస్తున్నాను.

అశోక్ కుంబము]

No. of visitors : 585
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •