సిద్ధేశ్వరం రాయలసీమ చైతన్యం

| సాహిత్యం | వ్యాసాలు

సిద్ధేశ్వరం రాయలసీమ చైతన్యం

- రాయలసీమ సాగు నీటి సాధన సమితి | 19.05.2018 09:34:23am

సిద్ధేశ్వరం ఉద్యమం రాయలసీమ అస్థిత్వ చైతన్యాన్ని రగిల్చింది. సీమ తనలోకి తాను చూసుకుంది. తనకు జరిగిన విద్రోహాలను గుర్తు చేసుకుంది. గొంతు సవరించుకొని నీటి హక్కుల కోసం నినదించింది. సుమారు వందేళ్ల సీమ ఉద్యమ చరిత్రకు సిద్ధేశ్వరం కొత్త ఆలోచనలు అందించింది. తమకేం కావాలో రాయలసీమ రైతులకు అర్థమైంది. ఎలా పోరాడాలో కూడా సిద్ధేశ్వరం నేర్పించింది. నీటి పోరాటం రైతులదే కాదని ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు కలిసి వచ్చారు. సీమ నీటి పోరాటానికి అక్షర సాయం చేసేందుకు కవులు, రచయితలు, మేధావులు ముందుకు వచ్చారు. తరతరాల పాలకవర్గ నిర్లక్ష్యానికి, వివక్షకు, చిన్న చూపుకు వ్యతిరేకంగా సీమ నేల అంతా సిద్ధేశ్వరం చైతన్యాన్ని స్వీకరించింది. మే 31, 2016 రాయలసీమ ప్రజలంతా కలిసి నిర్బంధాలను ధిక్కరించి సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన చేశారు. ప్రజలు తమ నీటి ప్రాజెక్టుకు తామే శంకుస్థాపన చేసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదోగాని, మన దేశంలో అయితే ఇదే మొదటిసారి.

రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని ఈ శంకుస్థాపన బైటికి తీసుకొని వచ్చింది. కృష్ణా నదిపై సిద్ధేశ్వరం ఆలుగు కట్టి సుమారు 50 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా సీమ ప్రజలకు అందించడం ఈ ఉద్యమం లక్ష్యం. అంత వరకే అయితే సిద్ధేశ్వరం సీమ గొంతుగా ప్రపంచమంతా వినిపించేది కాదు. మొత్తంగా సీమకు జరుగుతున్న అన్యాయాన్ని బైటికి తెచ్చింది. రాయలసీమ తన దుస్థితి నుంచి బయటపడటానికి ఒక సమగ్ర అవగాహనను అందించింది. ఇందులో తరతరాలుగా రాయలసీమకు పాలకులు చేస్తున్న అన్యాయంపై పదునైన విమర్శ పెట్టింది. ఇందులో 3 ప్రధానమైన అంశాలను సమాజంలో చర్చనీయాంశం చేసింది.

1. తుంగభద్ర నదిలో రాయలసీమకు చట్టబద్ధంగా కేటాయించిన నీళ్లకంటే రెండు రెట్టు ఎక్కువ ప్రవహిస్తున్నాయి. అయినా సీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిలో సగం కూడా వాడుకునే పరిస్థితి లేదు. తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె సి కెనాల్‌, ఎస్‌ఆర్‌బిసి, బైరవాని తిప్ప కింద ఉన్న ఆయకట్టు వ్యవసాయం అగమ్యగోచరంగా తయారైంది. ఈ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల ప్రజలకు తాగునీరు కూడా అందడం లేదు. వాళ్లకు బురద నీరు కూడా అందడం లేదు. సిద్ధేశ్వరం ఉద్యమం అలుగు నిర్మాణంతోపాటు మొత్తంగానే రాయలసీమకు చట్టబద్ధంగా కేటాయించిన నీరు ఎందుకు అందడం లేదనే అతి మౌలిక ప్రశ్న వేసింది. అసలు నీటి వాటాల్లో జరిగిన అన్యాయం సంగతి అటుంచితే హక్కుగా ఇచ్చిన నీరు వాడుకోడానికి కూడా రాయలసీమలో రిజర్వాయర్లు, కాలువలు ఎందుకు నిర్మించలేదు? శ్రీశైలం రిజర్వాయర్‌లో సీమ అవసరాకు తగినన్ని నీరు నిలువ ఉంచకుండా కోస్తా డెల్టా ప్రాంతంలోని సంపన్న వర్గాల చేపల చెరువులకు, రొయ్యల చెరువులకు నీరు ఎందుకు వదులుతున్నారు? ఈ దుర్మార్గం ఏమిటనే చర్చను సమాజం ముందుకు తెచ్చింది.

2. రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు -నగరి, హంద్రీ -నీవా, వెలగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాశారు. కానీ రాయలసీమకు చట్టబద్ధం నీటి కేటాయించి, పైన చెప్పిన ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో పాలక, ప్రతిపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు వివక్ష ప్రదర్శిస్తున్నాయి. సిద్ధేశ్వరం అలుగు ఉద్యమ ప్రభావంతో నిజాయితీగా శాశ్వత ప్రాతిపదిక మీద సీమ నీటి సమస్య పరిష్కరించకపోగా ప్రభుత్వం తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టాలని చూస్తోంది. అన్ని పార్టీల నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం పై ప్రాజెక్టుల కింద కొత్త కొత్త ప్రతిపాదనలు తీసుకుని వచ్చి ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగిస్తున్నారు. మరొక వైపు రాయలసీమలోనే వేర్వేరు దుర్భిక్ష ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. వెనుకబడిన రాయలసీమ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నీటి ప్రాజెక్టులు, వాటిని పూర్తి చేసేందుకు నిధులు, చట్టబద్ధమైన నీటి కేటాయించకుండా ఇలా వంచించడం ఏమిటని, భ్రమలకు గురి చేయడం ఏమిటనే చర్చను రాయలసీమ ఉద్యమం ముందుకు తెచ్చింది. రాయలసీమ శాశ్వత విముక్తికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పని చేయడం లేదనే విషయాన్ని సమాజంలో చర్చనీయాంశం చేసింది.

3. ఆరోజుల్ల వర్షపు నీటిని చెరువుల్లోకి వడిసిపట్టి బంగారు పంటలు పండించిన చరిత్ర రాయలసీమ ప్రజలకు ఉంది. పాలకులు నిర్లక్ష్యంతో సీమలోని వందలాది చెరువులు నిరుపయోగమయ్యాయి. రాయలసీమలోని చెరువుల పునరుద్ధ్దరణ, కొత్త చెరువుల నిర్మాణం, కాలువలతో అనుసంధానం, వర్షాలు బాగా కురవడానికి సామాజిక అడవుల పెంపకం తదితర అంశాలతో ఒక నిర్దిష్ట ప్రణాళికతో రాయలసీమ ఇరిగేషన్‌ కమీషన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకొని వచ్చింది. రాష్ట్ర విభజన బిల్లులో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కి బుందెల్‌ఖండ్‌్‌, బోలంగీర్‌ - కోరాపుట్‌ ప్యాకేజీల వంటివి సీమకు ఇవ్వాలనే డిమాండ్‌ తీసుకొని వచ్చింది. సీమ హక్కులకు, అభివృద్ధికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న వాగ్దానాలను అమలు చేయాలని, చట్టంలో లేని ఎండమావుల వంటి నినాదాల చుట్టూ సీమ ప్రజలను తిప్పి మోసం చేయవద్దనే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక వాదనను కూడా సీమ ఉద్యమం తీసుకొని వచ్చింది. కానీ రాయలసీమ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలకు ఈ విషయమే పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అంటే అమరావతి, పోలవరం అనే ప్రభుత్వ పాటకు తాళం వెయ్యడంలోనే అన్ని పార్టీల సీమ నాయకులు మునిగి తేలుతున్నారనే విమర్శను రాయలసీమ ఉద్యమం సమాజం ముందు పెట్టింది.

ప్రభుత్వం, రాజకీయ పార్టీలు రాయలసీమకు చేస్తున్న అన్యాయాలను సిద్ధేశ్వరం అలుగు ఉద్యమం చర్చనీయాంశం చేసింది. ఉద్యమం తర్వాత ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక, మోసపూరిత విధానాలపై విమర్శను కూడా సమాజంలోకి తీసికెళ్లింది. సీమ ప్రజలకు ఉపశమనాలు వద్దు, తాత్కాలిక రక్షణలు వద్ద, ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా కృష్ణా నది నుంచి న్యాయంగా హక్కుగా రావాల్సిన నీళ్లు కేటాయించాలి. వాటిని అనుభవించేందుకు శాశ్వత విధానంపై ప్రాజక్టులు కట్టాలనే డిమాండ్‌ను వినిపిస్తోంది.

అందువల్ల సిద్ధేశ్వరం అలుగు శంకు స్థాపన జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి స్ఫూర్తితో పైన చెప్పిన అన్ని సమస్యలపై ఉద్యమించాల్సి ఉంది. ఎందుకంటే ఈ రెండేళ్లుగా సీమ ప్రజల అవసరాలను ప్రభుత్వం బలి తీసుకుంటోంది. పైగా మభ్యపెట్టే చర్యలకు పాల్పడుతోంది. ఉదాహరణకు నాగార్జున సాగర్‌లో తాగడానికి కావలసినంత నీరు ఉన్నప్పటికీ, 2015 సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్‌లో అడుగంటిన నీటిని కూడ కిందికిి తరలించారు. రాయలసీమ ప్రజలను మనుషులుగా కాకపోయినా రెండు కాళ్ళ జంతువులుగా గుర్తించైనా తాగడానికి నీరు శ్రీశైలంలో నిల్వ ఉంచమని కోరినా పాలకులు కనికరించలేదు. ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలు దీనిపై నోరు కూడా మెదపలేదు. కానీ సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన తరువాత విధిలేక కొన్ని తాత్కాలిక ఉపశమన చర్యలకు దిగింది. వీటిలో ఎంత వంచన ఉందో చూడండి.

1 నిర్దిష్ట ప్రణాళిక లేకుండా హంద్రీనీవా ఎత్తిపోతల పథకం: హంద్రీ నీవా జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలైనా నిర్దేశిత ఆయకట్టు 1,92,000 ఎకరాలలో 15,000 ఎకరాలకు మించి నీరు పారడం లేదు. హంద్రీ నీవా కింద కర్నూలు, అనంతపురం జిల్లాలో ఆయకట్టు అభివృద్ధి చెయ్యలేదు, కర్నూలు జిల్లాలో 105 చెరువులకు హంద్రీ నీవా నీరు ఇస్తామని ప్రకటించారేగాని ఇప్పటికీ ఒక్క చెరువును కూడా అనుసంధానం చెయ్యలేదు, అనంతపురంలో చెరువులకు ఎప్పుడు నీరందిస్తారో నిర్దిష్ట ప్రణాళికే లేదు. ఒక సమగ్ర ప్రణాళిక లేకుండా హంద్రీ నీవాకు నీరు ఎత్తిపోస్తూ నీరు అందిస్తున్నామని, కరువు సీమను సస్యశ్యామలం చేస్తున్నామని ప్రభుత్వం వంచిస్తోంది.

2. పూర్తి చేయని గాలేరు నగరితో పులివెందుల ప్రాంతానికి నీరు: పట్టుసీమను ఒక్క సంవత్సర కాలంలో పూర్తి చేసి తన కార్యదక్షతను ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయడం లేదు. గాలేరు నగరి కాలువ నిర్మాణాన్ని కాని, ఆయకట్టును గాని అభివృద్ధి చెయ్యలేదు. గాలేరు - నగరి రెండో ఫేజ్‌ ఊసే లేదు. తాత్కాలిక ఉపశమనంలాగా ఎస్‌ ఆర్‌ బి కాలువ ద్వారా అవుకు చేరిన నీటిని గండికోటకు తరలించి, పైడిపాలెం ఎత్తిపోతల ద్వారా పులివెందులకు నీరందించి దీన్నే ప్రభుత్వం ఘనంగా చాటుకుంటోంది.

3. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుండి 3 టిఎంసీల నీటితో కె సి కెనాల్‌ కు తాత్కాలిక ఉపశమనం: అంతరించి పోతున్న కెసి కెనాల్‌ కు కీలకం గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణం. ఈ నిర్మాణం పట్ల శ్రద్ధలేని ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల నుండి 3 టిఎంసీల నీరు ఎత్తి పోసి, తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితే ఈ మూడు టీఎంసీలతోనే సీమ అంతా సస్యశ్యామలం చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.

సిద్ధేశ్వరం అలుగు అలుగు ఉద్యమం ఇలాంటి ఉపశమనాలకు సంబంధించింది కాదు. అది అలుగు నిర్మించడం ద్వారా నదిలో నీరు నిలబెట్టి సీమకు అందివ్వాలనే డిమాండ్‌తోపాటు శాశ్వత ప్రాతిపదికన రాయలసీమ సమగ్ర అభివృద్ధికి చట్టబద్ధ హక్కుగా నీరు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ ఉద్యమం జరిగింది. సీమ ప్రజలు ఈ తాత్కాలిక ఉపశమనాలు కోరుకోవడం లేదు. నీటిని భిక్షగా అడగడం లేదు. కృష్ణా జలాల్లో ఈ ప్రాంతానికి వాటా ఉంది. హక్కు ఉంది. అది తరతరాలుగా కొల్లగొట్టబడుతోంది. దాని సాధించుకోడానికి సిద్ధేశ్వరం ఉద్యమం జరిగింది. అందులో భాగమే అలుగు శంకస్థాపన ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమం. ఇది కేవలం ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకోడానికి కాదు. ద్వితీయ వార్షికోత్సవాన్ని లాంఛనంగా జరుపుకోడానికి కాదు. సిద్ధేశ్వరం అలుగు ఉద్యమానికి కొనసాగింపుగా ఈ రెండేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా కింది స్థాయి నుంచి బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఆనాటి స్ఫూర్తితో ఈ కింది డిమాండ్లను సాధించేంత వరకు పోరాడాలని రాయలసీమ ప్రజానీకం సిద్ధమయ్యారు.

1. రాయలసీమ నీటి వాటాను హక్కుగా పొందడానికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి ఎత్తిపోతల, గుండ్రేవుల రిజర్వాయర్‌, తుంగభద్ర వరద కాలువ, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ, కడప జిల్లాకు తెలుగు గంగ నీటి సక్రమంగా అందడానికి ప్రధాన కాలువ బలోపేతం చెయ్యాలి.

2. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న గాలేరు - నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు చట్టబద్ధ నీటి కేటాయింపులు తక్షణమే చేపట్టి, నిధులు కేటాయించి నిర్దిష్ట కాలంలో పూర్తి చెయ్యాలి.

3. రాయలసీమ చెరువుల అభివృద్ధికి ప్రత్యేక రాయలసీమ సాగునీటి కమీషన్‌ ఏర్పాటు చెయ్యాలి.

4. శ్రీశైలం రిజర్వాయర్‌ కనీసం నీటిమట్టం 854 అడుగులకు పునరుద్ధరించాలి. శ్రీశైలం రిజర్వాయర్‌ లో 875 అడుగులపైన ఉన్న నీటినే నాగార్జున సాగర్‌ నీటి వాటా పరిమితి మేరకు విడుదల చేసేలా విధానాలను రూపొందించాలి.

5. ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించినట్లుగా పట్టుసీమ ద్వారా మిగులు నీటిని రాయలసీమకు చట్టబద్ధంగా కేటాయించాలి.

6. శాసన సభలో ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా శ్రీశైలం రిజర్వాయర్‌ లో 100 టిఎంసీలు రాయలసీమ అవసరాలకు నిలువ ఉంచాలి.

7. కృష్ణా జలాలను పునః పంపిణీ చేసి రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలి.

8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉండిన నాగార్జున సాగర్‌ టైల్‌ పాండ్‌ ప్రాజెక్టు ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్ర విభజన చట్టంలో చేర్చి నిర్మాణం చేపట్టాలి.

9. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, కెసి కెనాల్‌, ఎస్‌ ఆర్‌ బి సి ప్రాజెక్టు లకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నీరు పంపిణీ చేపట్టడానికి, శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక చేరకుండా ఆరికట్టడానికి సిద్ధేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి.

చివరగా.. రాజకీయ పార్టీలకు ఒక్క మాట చెప్పమని కృష్ణమ్మ తల్లి కోరుకుంటోంది. తన పరుగులు ఆపి, సిద్ధేశ్వరం దగ్గర సేద తీరి తన కన్న బిడ్డలైన రాయలసీమ ప్రజల కన్నీళ్లు తుడిచి గొంతు తడుపుతానంటోంది. నదీమతల్లి సిద్ధేశ్వరం దగ్గర సేద తీరడానికి అలుగు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సీమ జనం పెద్ద ఎత్తున శంకుస్థాపన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నదీ తీరానికి చేరుకుంటున్నారు. సిద్ధేశ్వరం దగ్గర అలుగు నిర్మించమని కృష్ణమ్మ తల్లి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రాయలసీమ పట్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికి, సీమ నీటి హక్కులు సాధించుకోడానికి, ఇందులో నిర్మాణాత్మక పాత్ర పోషించేలా ఈ ప్రాంత నాయకులపై ఒత్తిడి తేవడానికి ఉత్సాహంగా, స్వచ్ఛందంగా సిద్ధేశ్వరానికి వాహనం ర్యాలీ చేద్దాం. 31మే 2018 న ఆనాటి సిద్ధేశ్వరం స్ఫూర్తిని ప్రదర్శించి మన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.

No. of visitors : 423
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •