గాలి కోసం, నీరు కోసం, ఈ భూమ్మీద బతుకు కోసం...

| సంపాద‌కీయం

గాలి కోసం, నీరు కోసం, ఈ భూమ్మీద బతుకు కోసం...

- పి.వరలక్ష్మి | 05.06.2018 10:32:32am

రోజురోజుకూ చస్తూ బతుకుతున్న జనం న్యాయం అడిగితే ఏకంగా చంపేశారు. రాగి పరిశ్రమ చేస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా మే 24న తూత్తుకుడిలో రోడ్డెక్కిన వేలాది మంది జనంతో తమిళనాడు ప్రభుత్వం ఏకంగా యుద్ధమే చేసింది. కశ్మీర్ లో చేసినట్లు, దండకారణ్యంలో చేసినట్లు జనాన్ని నడిపించే నాయకుల కోసం వెతికి లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు. కాల్పులపై నిరసన తెలుపుతున్న జనంపై మళ్ళీ కాల్పులు జరిపారు. 13 మందిని చంపేశారు. వందల మందిని క్షతగాత్రులను చేసారు. రెండువందల మందినిపైగా అరెస్టులు చేసారు.

తమిళనాడు పారిశ్రామిక కేంద్రాల్లో తూత్తుకుడి ఒకటి. పదుల కొద్దీ చిన్నా, పెద్దా పరిశ్రమల్లో ఒకటి రాగిని ఉత్పత్తి చేసే స్టెరిలైట్ కంపెనీ. ఇది ʹవేదాంతʹ పరివారంలో ఒకటి. లండన్ కు చెందిన వేదాంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ భారతదేశంలో భారీ మైనింగ్ పరిశ్రమల్లో ఒకటి. అటు యు.పి.ఎ ప్రభుత్వానికి, ఇటు ఎన్.డి.ఎ ప్రభుత్వానికి చాలా ఇష్టమైన ఈ కంపెనీ భారతదేశంలో రాగి, జింక్, అల్యూమినియం ఖనిజాలున్న గనులు తవ్వి, ఆయా ముడిపదార్థాలు శుద్ధి చేసి లోహాల్ని వెలికితీసే అమ్ముతుంది. మైనింగ్ నుండి ఉత్పత్తి దాకా కాలుష్యాన్ని వెదజల్లడంలో, జనం ప్రాణాలు తీయడంలో ఇది రికార్డులకెక్కింది. నియంగిరి ప్రజలు వేదాంతను రానివ్వకుండా పట్టువదలని పోరాటం చేసి తమను, తమ నేలను, ప్రకృతిని కాపాడుకున్నారు. దండకారణ్య ఆదివాసులు వీరోచితంగా పోరాడుతున్నారు.

ఈ వేదాంతకు చెందిన స్టెరిలైట్ ఇరవై రెండు సంవత్సరాల క్రితం తూత్తుకుడికి వచ్చింది. అంతకుముందు అది మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేసింది. అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. తమిళనాడులోనూ అది ప్రతిఘటన ఎదుర్కుంది. ప్రజల నిరసనలను అణగదొక్కి 1996లో షరతులతో కూడిన అనుమతినిచ్చింది తమిళనాడు ప్రభుత్వం. ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) మన్నారు సముద్రతీరానికి కనీసం 25 కిలోమీటర్ల దూరం వదిలి ఫ్యాక్టరీ కట్టుకొమ్మని చెప్పింది. దీనిని స్టెరిలైట్ ఉల్లంఘించింది. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమీ అనలేదు. ఆ విషయం పక్కన పెట్టేసి ఫ్యాక్టరీ చుట్టూ 25 మీటర్లు గ్రీన్ బెల్ట్ (చెట్లు) అభివృద్ధి చేయాలని, భూగర్భ జలాలు కలుషితమైతే లైసన్స్ రద్దు చేస్తామని చెప్పింది.

ఒక్క సంవత్సరంలోపే గాలి, నీరు కాలుషితమయ్యాయని ఫిర్యాదులందాయి. మద్రాసు హైకోర్టు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసర్చ్ ఇస్టిట్యూట్ నివేదిక ఆధారంగా ఫ్యాక్టరీని మూసేయించింది. అయితే ఒక్క వారానికే మళ్ళీ అధ్యయనం చేసి రిపోర్టివ్వమని అదే సంస్థను అడిగితే రెండోసారి కంపెనీకి క్లీన్ చిట్ లభించింది. అనుమతించినదాని కన్నా రెండు రెట్లు ఎక్కువ సామర్థ్యంతో ఫ్యాక్టరీ నడిపినా, పదే పదే కాలుష్యం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా, అడపా దడపా విష వాయువు లీకై జనం ఆసుపత్రుల పాలైనా, తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిల్లా అధికారులు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చారు. పైగా ఫ్యాక్టరీని విస్తరించేందుకు అనుమతులిచ్చారు. 2004లో ఒకసారి, 2010లో ఒకసారి హైకోర్టు ఫ్యాక్టరీని మూసేయించింది కూడా. అయినా స్వయంగా కేంద్ర మంత్రి చిదంబరం వేదాంత బోర్డు సభ్యుల్లో ఒకరైనాక ఎవరూ దానిని ఆపలేకపోయారు. హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చి, 2013లో తుది తీర్పు ఇచ్చేలోపే విషవాయువులు లీకయ్యి స్థానిక ప్రజల్ని ఊపిరాడనివ్వకుండా చేయడం మొదలు ఫ్యాక్టరీలో ఎనిమిది సార్లు ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయి అనేకమంది గాయాలపాలయ్యారు. ఇంత జరిగినా సుప్రీం కోర్టు జరిమానా విధించిది తప్ప ఫ్యాక్టరీ మూసేయించడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే దేశానికి ఏంతో కీలకమైన రాగిని ఉత్పత్తి చేసే పరిశ్రమ నిలిచిపోతే అభివృద్ధి ఆగిపోతుందట. 1300 మంది ఉద్యోగాలు కోల్పోతారట. వాతావరణం విషతుల్యం అయినా ఫరవాలేదు. భూగర్భ జలాలు అడుగంటినా, వ్యవసాయం నాశనమైనా, తాగునీరు కలుషితమైనా, ఊపిరితిత్తులు దెబ్బతిని, గర్భస్రావాలు, క్యాన్సర్లతో ప్రజలు రోజురోజూ చస్తున్నా ఫరవాలేదు. ఇదీ పరిస్థితి.

ఈ స్థితిలో స్టెరిలైట్ ప్లాంటు విస్తరణ కోసం ప్రభుత్వం అనుమతులిస్తుంది. ఏడాదికి 40 వేల మెట్రిక్ టన్నుల కాపర్ శుద్ధి చేసే సామర్థ్యంతో మొదలై ఇట్లా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ క్రమంగా 4 లక్షల మెట్రిక్ సామర్థ్యానికి ఫ్యాక్టరీ విస్తరించింది. ఇప్పుడు మరింతగా విస్తరించడానికి జనం ఒప్పుకోలేదు. అందుకే అంత రక్తపాతం. గాలి, నీరు, ఈ భూమ్మీద బతుకు అడిగినందుకే ఇప్పుడు వారు అసాంఘిక శక్తులయ్యారు. సంఘ వ్యతిరేక శక్తుల వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందంటున్న వాళ్ళకు జనం అడుగుతున్న ప్రశ్న ʹమరి వేదాంత చేసిన నేరమేమీ లేదాʹ అని.

ʹచట్టం, అధికార యంత్రాంగం ఇన్నేళ్ళు ఎక్కడికి పోయాయిʹ అని. ʹఅవి ఎవరి పక్షాన తమను దండించడానికి, తమకు నీతులు చెప్పడానికి వచ్చాయిʹ అని. ఇంకో విషయం ఏమిటంటే ఇంత మంది చనిపోయాక వెలువడిన హైకోర్టు తీర్పును, దాన్ననుసరించి ఫ్యాక్టరీ మూసివేతను గత అనుభవాల రిత్యా జనం నమ్మడం లేదు. లెక్కలేనన్ని నేరాలు చేసిన స్టెరిలైట్ యాజమాన్యాన్ని, కాల్పులు జరిపిన పోలీసులను, ఆదేశించిన అధికారులను ప్రభుత్వం శిక్షిస్తుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న.

భూమి కోసం అసంఖ్యాక పోరాటాలు చూసాం. ʹదున్నేవారికే భూమిʹ నినాదం వెంట దోపిడీ పునాదుల్ని కదలించే ఉద్యమాలు సామాజంలో నూతన చైతన్యాన్ని రాగుల్కొల్పడం చూసాం. ఒకటి రెండు దశాబ్దాలుగా తమ భూములను కార్పోరేట్ పరిశ్రమల కోసం గుంజుకుంటుంటే కాళ్ళ కింద నేల నిలబెట్టుకోనీకి పెనుగులాడుతున్న మూలవాసుల, మట్టిమనుషుల నెత్తురు నదీ ప్రవాహాలు చూస్తున్నాం. దండకారణ్యం మొదలు నందిగ్రాం, కళింగనగర్ నుండి కళింగాంధ్ర దాకా పెట్టుబడి పక్షాన నిలబడి రాజ్యం ప్రజలపై తుపాకులు పేల్చడం చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి, ఆర్థిక వృద్ధి మాయాజాలం మధ్యతరగతిని కమ్మివేస్తుంటే ఆ అభివృద్ధి మౌలిక భావనను అట్టడుగు జనం ప్రశ్నించారు. అబివృద్ధి నమూనాను చర్చనీయాశం చేసారు. దేశవ్యాప్తంగా విస్థాపన వ్యతిరేక పోరాటాలు చట్టాలనూ ప్రభావితం చేశాయి. స్థానిక ప్రజల విస్థాపన వెంటే పర్యావరణ విధ్వంసం కూడా చర్చకు వస్తోంది. సముద్ర తీరాలు, నదీ తీరాలు, పంట భూములు, అడవులు, కొండలు నశిస్తే మనుగడే ప్రశ్నార్థకం. ఇక అభివృద్ధికి తావెక్కడ? ఎవరి అభివృద్ధి కోసం ఈ విధ్వంసం? పిడికెడు మంది కార్పొరేట్ల విచ్చలవిడి సంపద పెరుగుదలే దేశాభివృద్ధా? ఇవన్నీ మౌలిక ప్రశ్నలు.

అయితే ఈ ప్రశ్నలన్నీ విస్థాపిత ప్రజలతోనే అణగారిపోతున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు అనే భ్రమలు పెట్టుబడులను ఆకర్షనీయం చేసాయి. తమ ప్రాంతంలోకి పెట్టుబడులను రప్పించగలిగినవాడే గొప్ప నాయకుడు. ఇవాళ రాష్ట్రాన్నో, దేశాన్నో కంపెనీలకు ఎంత తెగనమ్మితే అంత గొప్ప. పరిశ్రమలొస్తే ఉద్యోగాలొస్తాయి. విదేశీ కంపెనీలైతే మరీ మంచిది. ఇదెంత వరకు నిజం? ఎంత మూల్యానికి ఎంత ప్రతిఫలం. లక్షల మందిని రోడ్డుకీడుస్తున్నారు కదా, వేల మందికైనా ఉద్యోగాలోస్తున్నాయా? ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నదెంతమంది? కొత్త పరిశ్రమల కింద ఉపాధి పొందుతున్నదెంతమంది? దానికిమించి ప్రకృతి వినాశనానికి ఎంత మూల్యం చెల్లించగలరు? పంటభూమికి మార్కెట్ రేటు ఉంటుందేమో గానీ, లక్షలాది జీవరాసుల్ని, వాటికి బతుకునిచ్చే జీవావరణాన్ని ఇమడ్చుకున్న భూమికి విలువ ఎలా కడతాం? ఋతువుల్ని నడిపించే, వర్షాలు కురిపించే వాతావరణం దెబ్బతింటే నష్టపరిహారం ఏ కంపెనీ, ఏ ప్రభుత్వమిస్తుంది? భారతదేశంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు. పర్యావరణానికి అసలే లేదు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే జీవన ప్రమాణాల్లాగానే పర్యావరణ స్పృహ మనకు చాలా తక్కువ. వేలాది పరిశ్రమలు కనీస ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా కలుషితాల్ని వెదజల్లుతున్నాయి. భోపాల్ విషవాయు దుర్ఘటన వంటివి జరిగినా కంపెనీ యజమానుల మీద ఈగ వాలదు. ఇలా ఉంటేనే కార్పోరేట్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారం చేసుకోడానికి సానుకూలత. పెట్టుబడుల స్వర్గధామం అంటే ఇదే. వాటికోసం కార్మిక చట్టాలు ఎప్పుడో మురికిఓడుతున్న గంగలో కలిపేసారు. ప్రకృతిని బలిచేస్తున్నారు.

తూత్తుకుడి ఉద్యమం అభివృద్ధి నమూనాను ప్రజల జీవితంతో ముడిపడిన పర్యావరణ విధ్వంసం నుండి బలంగా చర్చనీయాంశం చేయగలిగింది. ఇది విస్తరించాల్సిన అవసరముంది. తూత్తుకుడి అమరులకు జోహార్లు.

(జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)


No. of visitors : 573
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •