సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం

- జి.వెంకటకృష్ణ | 05.06.2018 10:52:19am


కవీకథకుడైన అద్దేపల్లి ప్రభు వెలువరించిన కథా సంపుటి సీమేన్ కథలు. పద్మూడు కథల యీ పుస్తకం చదవడం , గోదావరి నదీ ప్రాంతమైన చాగల్నాడును దర్శించడం లాంటింది. అభివృద్ధి చెందిన యే ప్రాంతమైనా ఆ అభివృద్ధి సాధించే క్రమంలో కొన్ని నీడల్నీ , కొన్ని ఖాలీలనీ తన బయటి ప్రాంతంలో మిగల్చడమే కాదు, తనలోనూ మిగుల్చుకుంటుందని యీ కథల సాక్షిగా చెప్పవచ్చు.దీపం కింది సమ్మె చీకట్లో మిగలడమే కాదు , ఆ నీడలో చచ్చిపడిన పురుగులు బరువునూ మోస్తుంది. ఆ చీకటి యెంత బరువుగా వుంటుందో , చచ్చిన జీవులు వ్యథలెంత బరువో ప్రభు వివరిస్తాడు.ఆ చీకటి పై మనిషి చేసే ప్రతిఘటనల్లో యెన్ని విరూపాలుంటాయో కూడా చిత్రించాడు. ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం సృష్టిస్తున్న గ్లోబల్ భూతం యెదుట యిదొక ఉపప్రాంతపు విలాపమని యీ కథలు చదివాక అనిపిస్తుంది.అయితే వుప ప్రాంతాల అస్తిత్వాన్ని ప్రభు గుర్తిస్తాడా అన్నది ప్రశ్న.

కోస్తా ఆధునిక వ్యవసాయ అభివృద్ధి అనే ప్రక్రియ ప్రత్యక్షంగా పరోక్షంగా వొనకూర్చుతున్న పరిణామాలను నిష్టురంగా ఎత్తి చూపిన కథలు యీ సంపుటి లో వున్నాయి. వ్యవసాయం పేరుతో భూమిని రసాయనాలమయం చేయడం మొదలుకొని , కొండల్నీ కోనల్నీ తవ్వేయడం , సహజమైన చిట్టడవులనీ మడ అడవులను ధ్వంసం చేసి ఆక్రమించుకొనడం, ఆ క్రమంలో ప్రకృతి లోని జీవరాసులనూ , మనుషులనూ విస్థాపన చేసేయడం , పంటపొలాలను చేపలు/ రొయ్యల చెరువులు చేసేయడం యిలాంటి యెన్నో విషయాల పట్ల చాలా చిత్తశుద్ధి తో కథలల్లి , తనదైనశైలిలో ప్రతిఘటనను చిత్రించాడు అద్దేపల్లి ప్రభు.

భూమ్మీదకి (2005) శ్రీ సూర్య నారాయణ (2017 యీ కథలు రెండూ కలుషితమైపోతున్న వ్యవసాయ భూమిని గురించి మాట్లాడుతూనే , కోస్తా వ్యవసాయం నుండి రైతాంగం బయటికెళ్లిపోతున్న వైనాన్ని దాని పర్యవసానాలనూ వివరిస్తాయి. బయటికెళ్లిపోవడమంటే అది అమెరికా కావచ్చు , పిల్లల చదువులు,వ్యాపారాల పేరుతో కాకినాడ కైనా కావచ్చు. కౌలు కివ్వడమనే ప్రక్రియ అంతటితో ఆగకుండా , ఒక లాజికల్ విధ్వంసక కంక్లూజన్ కు దారి తీసి, ధాన్యం పండించడమనే ప్రయాస నుండి , నష్టాలనుండీ , శ్రమనుండీ తప్పించుకోవడానికి భూముల్ని చేపలు/ రొయ్యల చెరువులు గా మారిపోవడానికి దారితీస్తుంది. అంతే కాకుండా యీ రెండు కథలూ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణించేవి. భూమ్మీదకు కథ భూమిపై ప్రేమతో వున్నత చదువులు చదివుండీ అమెరికా పోయే అవకాశం వుండీ అవి వదులుకొని వ్యవసాయం చేయడానికి, అందులోనూ పర్యావరణాన్ని సంరక్షించే రసాయనాలు వాడకుండా చేస్తానని ప్రశాంత్ లాంటి కాపు యువకుడు ముందుకు రావడాన్ని చిత్రించింది. శ్రీ సూర్యనారాయణ ,(2017) కథలోని సూర్యనారాయణ అనే కాపుయువకుడు టీచర్ పోష్టు రాక , వ్యవసాయ కష్టం లాభసాటి కాదు కాబట్టి ఆ పని చేయలేక , తండ్రి మెడలు వంచి ఆస్తిలో తన వాటా విడగొట్టుకొని , తన భూమిని కౌలుకు యిచ్చి ఆ ఆదాయం మీద బతికేస్తూ, అదికూడా వెసులుబాటు కానప్పుడు భూమిని చేపలచెరువు వ్యాపారులకు యిచ్చేస్తాడు. రెండు కథలూ వ్యవసాయానికి సంబంధించినవే అయినా కాలక్రమంలో వ్యవసాయం ఏ స్థితికి చేరుకుంటుందో , నిష్టురంగా చెప్పిన కథలు. భూమ్మీదకు కథ ఒక కల అయితే, శ్రీసూర్యనారాయణ కథ యిప్పటి కోస్తా వాస్తవికత అయి వుండవచ్చు.ఇప్పటి కోస్తా సమాజంలో దాగివున్న అనివార్య వ్యాపార స్వభావానికి ఒక సాక్ష్యం కావచ్చు. జీవితం నిజాయితీగా చిత్రింపబడితే దాని గతిశీలత దానంతటదే వ్యక్తమవుతుందని చెప్పడానికి మంచి వుదాహరణలీ కథలు.

హద్దు , ఊరు గోదావరి, నాగులకొండ , లోకం మంది కాదు, సీతక్క కొండ , సిన్నన్నా మనవేటీ సైలేమా , యీ ఆరు కథలూ ప్రభులోని వుధ్యమకారుడు పొందిన అలజడి రూపాలు.

హద్దు కథ అతి సహజంగా , అభివృద్ధి జరగడం యెలా అనే ప్రశ్నను లేవదీస్తుంది. ఈ కథలోని బూరయ్య అనే పర్యావరణ ప్రేమికుడు , చాగల్నాడులోని ఒక చిట్టడవిని నిర్మూలించి ఒక ఫ్యాక్టరీ కట్టడానికి జరిగే అధికారిక వ్యవహారాన్ని అడ్డుకుంటాడు.దానికై ఒక వుధ్యమం నడుస్తుంది. అప్పడెదురయ్యే ప్రశ్న , అన్నింటినీ అడ్డుకుంటే మరి అభివృద్ధి జరగడమెలా? అప్పుడు కథలో వచ్చే సమాధానం, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఆ అభివృద్ధి యెవరికి ?గత పాతిక సంవత్సరాలుగా గ్లోబలైజేషన్ పేరుతో జరుగుతున్న చర్చనంతటినీ , ప్రభు ఒక్క కథ ద్వారా తేటతెల్లం చేస్తాడు. చివరికి యీ కథలో ఆ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు వుధ్యమకారులు తమ శరీరాన్ని పణంగా పెట్టడాన్ని కథకుడు సంకేతిస్తాడు. ఇది పాత సంకేతమే అయినా , ముంచుకొస్తున్న పెను ప్రమాదం మానవబలిని కోరుతోంది , దానికి సిధ్ధంకండీ అని చెప్పే సంకేతమే అయినా, అది ఆ మేరకు అభిలషనీయమే. ఊరు గోదావరి కథ కూడా పెద్ద ఆనకట్ట చేసే జనవిస్థాపనను యెదుర్కోమని చెప్పే కథ. జనసమూహ శక్తి దైవశక్తి గా మారుతుందని సూచించే కథ. ఆ కథలో ఒక పాత్ర కథను ముగిస్తూ యీ మాటలంటుంది , " ఒక దాన్ని మనం రక్షించాలంటే దాన్ని మనం యిష్టం పడాలి.మన యిష్టం పెరిగేకొద్దీ దాని శక్తీ పెరుగుతుంది. మన లాంటి వాళ్లు వేలూ లచ్చలూ కోట్లూ అయితే అది మహాశక్తి గల దేవత అవుతుంది. ఆ దేవత మన్ని కాచుకుంటుంది."

ప్రకృతినీ, సహజవనరులనూ మానవుడు చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోవాలనే వాస్తవిక ఆకాంక్ష, ప్రభు కథల్లో క్రమక్రమంగా ప్రజాప్రతిఘటన స్థాయి ( హద్దు కథ 2006) నుండి ప్రతిఘటనే దైవశక్తి గా మారుతుంది అని చెప్పే ( ఊరు గోదావరి 2007) స్థితికీ , అటునుండి, ప్రతిఘటించడానికి వేరే మార్గాలు లేనప్పుడు, దైవాన్ని నమ్మి శక్తినివ్వమని అడగడం ( నాగులకొండ కథలో , స్థలమహత్యం విధ్వంసాన్ని అడ్డుకున్నట్టు చిత్రించడం, లోకం మందికాదు కథలో ప్రొటాగనిష్ట్ , దేవున్ని శక్తినివ్వమని అడగడం, సిన్నన్నా మనవేటీ సైలేమా కథలో చివరికి, ʹ మన కాళ్లకింద నేలలో సహజవనరులేవీ లేకుండా చేయమని దేవుడ్ని ప్రార్థించడం తప్ప మనమేమీ చేయలేమʹని చెప్పించడం ) దాకా పరిణమించింది. సీతక్క కొండ కథ అయితే పూర్తి స్థాయి మిస్టిక్ కథ.

ఒక కఠిన వాస్తవికత ముందు , రచయిత నమ్మిన పోరాటరూపాలు గణనీయమైన మార్పకు గురికావడం ప్రభు కథల్లో చూస్తాము. ఓడిపోతున్న సందర్భాలు పెరిగేకొద్దీ ప్రతిఘటన ల్లో నకిలీ వీరత్వాన్ని చిత్రించడం కంటే , సాంస్కృతిక రూపాల్లోని శక్తి ముందు తన పాత్రలను నిలబెట్టడం , వాళ్ళ లోని మానవీయ కాంక్ష ను పదిలంగా వుంచడానికి, ప్రాకృతిక శక్తుల్లోంచీ జీవధారను అందించడం ప్రభు శిల్పపరంగా అందుకున్న వ్యూహంగా కనిపిస్తోంది.ఆ శిల్పవ్యూహమే ప్రభు చేత మిస్టిక్ కథ కూడా రాయించింది.

సీమేన్ కథైనా, ఇస్సాకుచిలుక కథైనా యిలాంటి శిల్పఛాయలతో రాసినవి గానే కన్పిస్తాయి.దళితవాడ మీద దాడి జరిగినప్పుడు మాయమైపోయిన సీమేన్ , అజ్ణాతజీవితం నుంచీ వూరికొచ్చి ,జనాలతలలో నాలుకలా మెలిగే వాడు , బీలభూముల్లో నిర్మిస్తున్న ఫాక్టరీ నీ అణువిద్యుత్ ప్లాంట్ నూ వ్యతిరేకిస్తూ, దాడి చేసి పోలీసు కాల్పుల్లో మరణిస్తాడు. ʹఅయ్యా ఆడు పువ్వుల్లో పువ్వండీ , నీళ్లల్లో నీరండీ, సేవల్లో సేపండీ, పాముల్లో పామండీ ,నిప్పుల్లో నిప్పండీʹ అని చెప్పించడం ద్వారా సీమేన్ ప్రకృతిలో భాగమని చెప్పే కథకుడు , సీమేన్ అసలు పేరు కథలో చెప్పనే చెప్పడు. సీమేన్ అనేది కూడా సాహసానికి సింబల్ గా వాడాడు. ఇస్సాకు చిలుక కథను ఒక మాటలు నేర్చిన చిలుకతో కథనం చేయిస్తాడు. ఈ కథలో ఇస్సాకు కూడా ఒక మాటలు నేర్చిన చిలుకే. ఇస్సాకు ప్రకృతి వనరుల్ని దండుకోవాలని చూసే పెత్తందార్ల అవినీతిని ప్రశ్నించినవాడే.లౌక్యం లేకుండా, నోటి దురుసుతో అన్యాయస్తులను యెద్దేవాచేస్తున్నందుకు మరణాన్ని కొనితెచ్చుకున్నవాడు.

ఇంకో కోణం నుంచి చూసినప్పుడు, సీమేన్, ఇస్సాకుచిలుక దళిత కథలు కూడా. వీటికి తోడుగా ʹరిబ్బక్కమ్మʹ , నిఖార్సయిన దళితకథ. ఊర్లోని కాపు పెత్తందారు లైంగిక దౌర్జన్యాలను తెగువతో యెదురించే రిబ్బక్కమ్మ నిష్ఠురమైన దళిత బాల్యచిత్రం. దళితవాడ బతుకుల్లో వున్న కఠినత్వం , ఆ మనుషులకు ముందూవెనుకా చూసుకోకుండా , లౌక్యం లేకుండా మాట్లాడే తనాన్నిస్తుందనీ అది అత్యంత సహజంగా అమిరే అలవాటనీ , యీ రెండు కథలూ మనకు చెబుతాయి. కథాగమనం అంతా యీ అంశం మీదనే నిర్మాణమవడం వాళ్లలోని నిర్మలత్వానికి ప్రతీకగా రచయిత సూచిస్తాడు.

సీమేన్ కథలన్నింటిలోకీ భిన్నమైనది, ʹఅతడు మనిషిʹ కథ. గ్రామీణ ప్రాంతాల్లో అడుగు స్థాయి మనుషుల్లోని మానవత్వం ముందు , పట్టణ మధ్యతరగతి వ్యక్తి తన్నుతాను ప్రశ్నించుకొనేలా చేసే కథ. గ్రామీణ- పట్టణ మనస్తత్వాలూ, ఆధునిక అభివృద్ధి భావనల మధ్యా తారతమ్యాలను , ఒక ప్రకృతి ప్రకోపం ముందు నిలబెట్టి నిగ్గుదేల్చే కథ. నేటి పట్టణ బాలబాలికల బట్టీ కొట్టడం మీద ఆధారపడ్డ జ్ణాపక జ్ణాణాన్ని , యేటివోడ్డున జాలరి బాలుడి బతుకుదెరువు జ్ణాణంతో పోల్చి, వీడికి తెలిసిన యెన్నో రకాల చేపల పేర్లూ, యీతలూ వాళ్లకు తెలుసా అని యెదురు ప్రశ్న వేసే కథ. ఒక కష్టకాలంలో ఏ దారీ లేనప్పుడు నగర అగంతకుడికి పల్లెటూరి వాడు ఆదరంతో, నిస్వార్థంగా ఆశ్రయమిచ్చినట్లు , యిదే పల్లెటూరి వాడికి నగరజీవి ఆశ్రయమివ్వగలడా అని సవాల్ విసిరే కథ.

ప్రభు , యీ కథల్లో ప్రబలంగా ఒక పర్యావరణ ప్రేమికుడిగా కన్పిస్తాడు.సహజవనరుల దోపిడీని ఆపడం ప్రకృతి పరిరక్షణ లో భాగంగా గుర్తిస్తాడు. ప్రకృతిని కాపాడుకోవడానికి జరిగే ప్రజా ప్రతిఘటన మనుషుల్ని హింస పాలుజేస్తోందనీ , మనుషుల్ని మాయం చేస్తోందని యీ కథల ద్వారా చెబుతున్నాడు. ఇష్టపడే అంశం చుట్టూ మనుషులు కూడితే అదే దైవశక్తిగా పరిణమిస్తుందనీ , అదే కాపాడుతుందనీ సూత్రీకరిస్తాడు .

No. of visitors : 502
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •