రాజ్యం బరితెగింపు వెనక

| సంపాద‌కీయం

రాజ్యం బరితెగింపు వెనక

- వ‌ర‌ల‌క్ష్మి | 15.06.2018 11:52:08pm

భీమా కోరేగావ్‌ ఉద్యమం వెనక మావోయిస్టులున్నారని ఢిల్లీ, ముంబై, నాగపూర్‌ పట్టణాల్లో ప్రజాసంఘాల నాయకుల ఇళ్ల మీద దాడులు చేసి అయిదుగురు ప్రముఖ సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. పూనే, ఢిల్లీ, ముంబై, నాగపూర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో అరెస్టు చేశామని చేపుతున్న అయిదుగురూ ప్రముఖ సామాజిక కార్యకర్తలు. దళిత హక్కుల కార్యకర్త, ʹవిద్రోహిʹ పత్రిక సంపాదకుడు సుధీర్‌ ధావ్లే, న్యాయవాది, ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ పీపుల్స్‌ లాయర్స్‌ ప్రధాన కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్‌, కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ సెక్రెటరీగా ఉన్న రోనా విల్సన్‌, విస్థాపనకు వ్యతిరేకంగా పోరాడుతున్న విస్థాపన్‌ విరోధి జన వికాస్‌ ఆందోళన్‌ సభ్యుడు మహేష్‌ రావత్‌, నాగపూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, మహిళా హక్కుల కార్యకర్త షోమా సేన్‌ -వీరంతా సమాజానికి బాధ్యత పడిన ఆలోచనాపరులు. అట్టడుగు జనసమూహం గురించి మాట్లాడుతున్న వాళ్లు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలయ్యాక ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్న మేధావులని వైట్‌ కాలర్‌ మావోయిస్టులని సంబోధిస్తూ పాలకులు మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబా నుండి రోనా విల్సన్‌, ప్రొఫెసర్‌ షోమాసేన్‌ల దాకా విప్లవ భావజాలమున్న మేధావులే కా ప్రజల తరపు న్యాయవాదిగా విశేష గుర్తింపు పొందిన సురేంద్ర గాడ్లింగ్‌, దళిత ఉద్యమనేత సుధీర్‌ ధావ్లే వంటివారు కూడా ఈ జాబితాలోకి ఎక్కారు. సాయిబాబా మావోయిస్టు అయ్యి, సాయిబాబా తరపు న్యాయవాది కూడా మావోయిస్టయ్యాడన్న మాట. ఇక నిర్వాసిత సమస్యల మీద పని చేస్తున్న యువ కార్యకర్త మహేష్‌ రావత్‌, దేశవ్యాప్తంగా నిర్వాసిత సమస్య మీద ఆదివాసీ పోరాటాల నేపథ్యంలో మావోయిస్టుగా రాజ్యం చేత ముద్ర వేయబడ్డాడు.

క్రియాశీలక సామాజిక ఆచరణలో ఉన్నవాళ్లని, ముఖ్యంగా దేశానికి కళ్లు నీవె కాళ్లు నీవె అని చెరబండరాజు అన్న యువతరం ప్రతినిధులని, సామాజ పురోగామి చైతన్యానికి మెదడుగా ఉన్నవాళ్లని రాజ్యం వేటాడుతున్నదంటే ఏ కదలికనూ తట్టుకోలేని స్థితిలో రాజ్యం ఉన్నదని అర్థం. రోహత్‌ వేముల సంఘటన మొదలు, జెఎన్‌యూ వంటి దేశంలో పేరున్న యూనివర్సిటీల మీద, విద్యార్థి సంఘాల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నదంటే అది విమర్శనాత్మక సామాజిక పరిశోధనని, ఆలోచనలను స్వీకరించలేని నిలువనీటి దుర్గంధంలాగా అయిపోయిందని అర్థం. తెలంగాణలో ఏ సామాజిక చైతన్యమైతే ఉండిందో దాన్ని ఉపయోగపెట్టుకుని ఎదిగిన తెలంగాణ పాలకవర్గం దాన్ని నిర్మూలిస్తే తప్ప తనకు మనుగడ లేదని అనుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే దాని సామాజిక పురోగమనానికి అది ప్రతీఘాతుక శక్తిగా తయారైంది. అరెస్టు చేయడం పోయి, కిడ్నాపులు చేసి చిత్రహింసలు పెట్టి, చావు అంచుల దాకా తీసుకెళ్లి మరీ తప్పుడు కేసులు పెడుతున్నది. తాజాగా డెమాక్రెటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు బద్రి, రంజిత్‌, సుధీర్‌లను పోలీసులు కిడ్నాప్‌ చేసి మూడురోజుల వరకు ఆచూకీ చెప్పకుండా చివరికి వారివద్ద పేలుడు పదార్థాలు దొరికాయని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ఇదే కేసులో తెలంగాణ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ పేరును కూడా చేర్చి ఇదే పద్దతిలో ఎత్తుకొనిపోయి ప్రజాసంఘాలు పదేపదే డిమాండ్‌ చేసిన మీదట కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నలుగురూ, అజ్ఞాతంలో ఉన్న మరో నలుగురు మావోయిస్టు పార్టీ నాయకులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారని కేసు పెట్టారు. పెద్దగా చప్పుడులేని ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రచయితల్ని కూడా సహించలేని అభద్రతలో ఉన్నాడు. సున్నితమైన భావుకత్వం ఉన్న విప్లవ కవి అరసవిల్లి క్రిష్ణ. స్వయంగా కష్టజీవి, కష్టజీవుల పక్షాన రాస్తున్న రచయిత. తరచుగా ఏమైనా ధర్నా శిబిరంలో కనిపిస్తున్నాడేమో ఆయనకు నోటీసందింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద చింతూరు పోలీసుల ఎదుట హాజరు కావాలని. అటువంటి రచయితే విరసం సభ్యుడు మేడక యుగంధర్‌, మరో సభ్యుడు పెద్దిక్రిష్ణకూ ప్రగతిశీల కార్మిక సంఘం నాయకుడు కొండారెడ్డికీ అవే నోటీసులు.

అన్నిటికన్నా దుర్మార్గమైనదీ, అంతే హాస్యాస్పదమైనదీ భీమా కోరేగావ్‌ నేపథ్యంలో అరెస్టు చేసిన రోనా విల్సన్‌ ఇంట్లో దొరికాయని చెప్తున్న మావోయిస్టుల లేఖలు, రాజీవ్‌ గాంధీ హత్య తరహా పథకం బట్టబయలైందని మీడియా పెట్టిన కేకలు. కోరేగావ్‌ హింసకు కారకులని ఆధారాలతో సహా తేలిపోయిన సంఘపరివార్‌ నాయకులు శంభాజీ భిడే, మిలింద్‌ ఎక్‌బోటేలు స్వేచ్ఛగా తిరుగుతుంటే దళితుల ఆత్మగౌరవ స్ఫూర్తికి మద్దతు ప్రకటించిన బుద్ధిజీవులనూ, తమ మీద పెచ్చరిల్లుతున్న హింసను పదిలక్షల గొంతుకలుగా నిరసించిన దళిత సంఘాల నాయకులనూ, కార్యకర్తలనూ అరెస్టు చేసింది ప్రభుత్వం. ఆ ఇద్దరు సంఘపరివార్‌ పెద్దమనుషులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తుంటే వాళ్లని రక్షస్తూ ఎల్గార్‌ పరిషత్‌ వెనక మావోయిస్టులున్నారని, ఆ కనెక్షన్‌లో సుధీర్‌ ధావ్లే తదితరులను అరెస్టులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అదెలా సాధ్యం? దళిత ఉద్యమం, విప్లవోద్యమం మధ్య వైరుధ్యం నడుస్తున్నది కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కబీర్‌ కాలా మంచ్‌ వంటి సాంస్కృతిక ఉద్యమం మొదలు దళితుల మౌలిక సమస్యను భూమితో ముడిపెట్టిన గుజరాత్‌ ఊనా ఉద్యమం, ఉత్తర్‌ప్రదేశ్‌లో సహరన్‌పూర్‌ దాడుల తర్వాత ముందుకొచ్చిన భీం ఆర్మీ, భీమా కోరేగావ్‌ దాకా దళిత ప్రతిఘటనా చైతన్యం ఇవాల ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. జిగ్నేష్‌ మేవాని వంటి పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రతిపక్షాన్ని సహించలేని ప్రభుత్వం, మిలిటెంట్‌ ఉద్యమాలుగా పురోగమించే అవకాశం కనపడుతున్న ప్రతి దళిత ప్రతిఘటననీ, ఆస్తి, భూమికి సంబంధించి మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్న ఉద్యమాలన్నిటినీ మావోయిస్టు ఉద్యమానికి లంకె వేస్తున్నది ప్రభుత్వం.

విప్లవకరవర్గం బూర్జువా పరిధిని దాటి వర్గపోరాట పంథాతో కలిస్తే ఎంత పెద్ద ప్రమాదమో రాజ్యానికి తెలుసు. సమీప, లేదా సుదూర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నా ఇది ఒక వార్నింగ్‌. విద్యార్థి ఉద్యమాల నుండి భవిష్యత్‌ విప్లవ నాయకత్వాన్ని ఊహించి వివేక్‌, శృతి, సూర్యం వంటి వారిని ఎలా చంపేసిందో, ప్రభుత్వంతో ఎక్కడా రాజీపడని పోరాటాలు చేస్తూ, మౌలిక ప్రశ్నలు వేస్తున్న విద్యార్థి నాయకత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఇనుపబూట్ల కింద తొక్కివేయజూస్తున్నదో అలాంటిదే ఇది. ఈ భవిష్యత్తును చూసి రాజ్యం భయపడుతోంది. దీన్నుండి మనం గ్రహించవలసింది చాలా ఉంది.

No. of visitors : 525
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •