వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?

| సాహిత్యం | వ్యాసాలు

వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?

- బాసిత్ | 15.06.2018 11:58:23pm

ఏళ్ల కేళ్లుగా తమ పూర్వీకులు వెట్టి చేసి, తమ వాళ్లందరికీ రెండు చేతులు తప్ప ఏమీ మిగిల్చని నేపథ్యంలో భూమి కల నిజం చేసుకోవడం కోసం కోలుకొండ దళితులు చేయని ప్రయత్నం లేదు.

పూర్వపు ప్రయత్నాలు ఎలా ఉన్నా 2014 ఎన్నికల సందర్భంగా తెలంగాణా ఉద్యమాన్ని తన అధికార సోపానంగా మలుచుకో దలచిన కేసియార్ ʹదళితులకు 3 ఎకరాల భూమిʹ అనే హామీ కోలుకొండ దళితుల్లో మరోసారి ఆశల్నీ రేకెత్తించింది.

అయితే తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలూ, సంవత్సరాలూ గడుస్తున్నా, ఇచ్చిన హామీని నెరవేర్చుకొనే శ్రద్ధ, ఆసక్తి ఉన్నట్లు ఎప్పట్లాగే లేక పోవడంతో జాగీర్దార్లకు వెట్టి చేసినట్టి పాత తరం వృద్ధులు, వాళ్ల వారసులు తమ గోడును అధికారులు, రాజకీయ నాయకులకు వెళ్ల బోసుకున్నారు.

ఇంకో పక్క అక్కడక్కడ అరకొరగా దళితులకు ఎంతో కొంత భూమి పంపిణీ జరిగినట్లుగా వింటున్నా అవి కేవలం తమ పొలిటికల్ మైలేజీ కోసం జరిగే షాంపిల్ పంపిణీ ప్రదర్శనలు అని అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా, కొత్త ప్రభుత్వం కదా అని ఎదురు చూసినంత కాలం చూశారు. ప్రభుత్వం చూపు ఇటు మరల లేదు.

దాంతో 2016 జాన్ నెల నుండి విజ్ఞప్తులు, విన్నపాలు చేసుకోవడం మొదలు పెట్టారు. జూన్ 27, 2016 తేదీన తెలంగాణా రాష్ట్ర భూ పరిపాలన కమీషనరుకు తమ గోడును దరఖాస్తు రూపంలో విన్నవించుకున్నారు. మూణ్నెల్లు తిరక్కుండానే ముఖ్యమంత్రి కేసియార్ కు మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ప్రకటించాక కోలుకొండను దేవరుప్పుల మండలంలోనే ఉంచుతూ జనగామ జిల్లాకు కేెటాయించారు. దాంతో తమ విజ్ఞప్తుల పర్వాన్ని జనగామ జిల్లా కలెక్టర్ దరఖాస్తులు చేసుకోవడం ద్వారా కొనసాగించారు.చాలా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ,మార్చి 27, 2017 న అటువంటి దరఖాస్తు కాపి ఒకటి కోలుకొండ దళితులు తమ వద్ద సాక్ష్యం గా అట్టే పెట్టుకున్నారు.

దరఖాస్తులతో ఎవరికీ చీమ కుట్టినట్టైనా అవడం లేదు. పై పెచ్చు దరఖాస్తులు ఇచ్చుకోవడానికి దేవరుప్పుల మండల కార్యాలయానికి, జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నిత్యం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న ఇల్లందుల శ్రీనివాస్ మీద గ్రామ పెత్తందారుల కన్ను పడింది.

ఇది ఇలా ఉండగానే ఊళ్లో ఉన్న పెత్తందారులు, స్థానికేతరులతో కలిసి 119 ఎకరాల్లో విస్తరించి ఉన్న మైనర్ ఇరిగేషన్ కు చెందిన రామసముద్రం చెరువును ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. అయితే 1954 లోనే కాస్కా పట్టాలు పొందినట్లు స్థానిక దేవరుప్పుల తహసీల్దార్ ద్వారా దొంగ పట్టాలతో రికార్డుల తారుమారుకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు.

అట్లా రికార్డుల తారుమారుకు పాల్పడం వలన 2016 దాకా ఐ.బి. రికార్డుల్లో 119 ఎకరాలు గా చూపించిన అధికారులు 2017 క్యాలెండర్ తిరిగేసే సరికి రికార్డులు తిరగ రాసి రామసముద్రం చెరువును కేవలం 12 ఎకరాలుగా చూపిస్తున్నారు. కిలోమీటరు పొడవున్న చెరువు కట్ట వెంట కేవలం 12 ఎకరాల వైశాల్యంలోనే చెరువు పరిమితమయ్యిందంటే.. ఇది ఎవరి మాయ? పైగా 12 ఎకరాల చెరువు పూడికతీత కోసం మిషన్ కాకతీయ కింద 50 లక్షలు కంట్రాక్టర్లకు దోచిపెడతారా? 100 ఎకరాల విస్తీర్ణం కంటె తక్కువ ఉంటే ఆ చెరువు ఐ.బి. కిందికి రాదని, అది ఎవరో ఆసామి పోసుకున్న కట్ట అంటారని తెలిసిందే. మిషన్ కాకతీయ కింద పూడికతీత సందర్భంలో ఐ.బి. కింద ఉన్న చెరువు చింతకింది కృష్ణ మూర్తి బినామీగా సాగుతున్న చెరువు కబ్జాలను ప్రశ్నించిన సందర్భంలో అది కేవలం 12 ఎకరాల ఆసామి కట్టగా ఎందుకు కుదించ బడుతోంది?

ఎందుకంటే రాజకీయ అండదండలతో రెవిన్యూ అధికారుల భారీ అవినీతి ఆసరాతో స్థానిక పెత్తందార్ల అండతో స్థానిక, స్థానికేతరులు నిస్సిగ్గుగా చెరువును మింగేసారు.

ఈ భాగోతాన్నంతా బట్ట బయలు చేస్తున్నాడు కాబట్టే, దేవరుప్పుల మండల కార్యాలయానికి వెళ్లి వస్తున్న ఇల్లందుల శ్రీనివాస్ ను పైన పేర్కొన్న బడాబాబుల తొత్తు అయినటువంటి వీయార్వో ప్రవీణ్ రెడ్డి సీతారాం పురం బస్ స్టేజి వద్ద "మాదిగ లంజ కొడుకా! ఇంట్లో బోళ్లూ బొచ్చెలు లేని నా కొడకా, నీకు భూమి కావాల్సి వచ్చిందారా?" అంటూ బెదిరించాడు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా స్థానిక ఎస్సై, వర్ధన్నపేట సీ.ఐ. స్థానిక పెత్తందారుల కుమ్మక్కుతో ఆ కేసును నీరుగార్చేలా చేశారు. దీన్ని నీరుగార్చడంలో ఈ మధ్యనే బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వం, దాని మనసెరిగి మసలు కొనే సుప్రీంకోర్టు సవరణ తీర్పు కూడా దోహదం చేసింది.

నిజమే. కోలుకొండ లోని 167 దళిత కుటుంబాలలో ఎవరికీ భూమి లేనట్లుగానే ఇల్లందుల శ్రీనివాస్ కు కూడా భూమి లేదు. వీళ్లంతా భూమి లేనివారు ఎందుకయ్యారు? అందరి విషయం ఒక్కో కేస్ స్టడీ అనుకుంటే ఇల్లందుల శ్రీనివాస్ తండ్రి యాకయ్య, దోమల కొమురెల్లి అనే ఆసామి దగ్గర జీతం ఉంటూనే వెంకట జానకమ్మ దగ్గర వెట్టి చేసేవాడు. ఆమె తన గుట్ట, గుట్ట పక్కనే ఉన్న 500 ఎకరాల్లోంచి ఇల్లందుల యాకయ్యకు ఎకరమున్నర రాసిచ్చింది. అట్లా ఆ ఎకరమున్నర భూమి 1994 దాకా యాకయ్య పేర, యాకయ్య చనిపోయాక 1994 నుండి 2014 దాకా ఇల్లందుల శ్రీనివాస్ పేరిట ఉంది. దానికి శిస్తు కూడా శ్రీనివాస్ కడుతూ ఉన్నాడు.

కానీ, 2014 వెలమ దొరలు రాజ్యాధికారంలోకి వచ్చాక మళ్లీ పాత గ్రామీణ ఫ్యూడల్ భూస్వామ్యం పడగ విప్పింది. ʹమాదిగోనికి భూమి ఉండడమేంటి?ʹ అని గోల అంజయ్య అనే బుడ్డ పెత్తందారు అవినీతి రెవిన్యూ అధికారుల తోడ్పాటుతో శ్రీనివాస్ ఎకరమున్నర భూమిని తన పేరు మీదికి మార్చుకున్నాడు. శ్రీనివాస్ కోర్టు కెళ్లాడు. కేసు గెలిచాడు. 39 గుంటల భూమి కేసు గెలిచిన ఇల్లంతకుంట, కందికట్కూరు దళిత తండ్రీ, కొడుకులు ఎల్లయ్య, శేఖర్ లను ముదిరాజ్ కుటుంబం మూకుమ్మడి దాడి చంపినట్లు గానే శ్రీనివాస్ ను అంతం చేయాలనే ఆలోచన పెత్తందార్లకు ఉండవచ్చు. కానీ భారత విప్లవోద్యమ దిక్సూచి, తెలంగాణా సాయుధ పోరాటం ఆరంభానికి మూలకందమైన విష్నూరు రామచెంద్రారెడ్డి అండతో పెట్రేగిన అన్న మీద భూమి కేసు గెలిచి హత్యకు గురైన బందగీ కామారెడ్డి గూడెం, దొడ్డి కొమురయ్య అమరత్వం చెందిన కడివెండి, (బెంగుళూరులో పట్టుకొని కొయ్యూరులో ఎన్కౌంటర్ పేరిట చంద్రబాబు నాయుడు 1999 లో హత్య చేయించిన కామ్రేడ్ మహేశ్ పుట్టిన, నడయాడిన గడ్డ కడివెండే నని తెలిసిందే) కోలుకొండకు ఎంతో దూరంలో లేవు. కేవలం పది, పన్నెండు కిలోమీటర్ల దూరం. ఆ పోరాట దీప్తి అందించిన వెలుగు కోలుకొండ పెత్తందారుల చీకటి అకృత్యాలకు వెరపు పుట్టిస్తూండ వచ్చు. పైగా కోలుకొండ భూముల జాగీర్దారు రాణీ వేంకట జానకమ్మ, విష్నూరు రామచెంద్రారెడ్డి మేనత్త నే విషయం అక్కడ అందరికీ తెలిసిందే.

మొత్తం మీద కేసు గెలిచినా భూమి దక్కని శ్రీనివాస్, అసలు ఈ మొత్తం భూమి ఎట్లా చేతులు మారుతోందని కూపీ లాగే కృషిలో పడిపోయాడు.

రామసముద్రం చెరువును మింగేసిన చింతకింది కృష్ణమూర్తి, రాజకీయ అండదండలున్నటు వంటి ఉన్నత పోలీసు అధికారి, తదితర కబ్జాకోరుల పట్టాలను రద్దు చేసి ఊరిలోని సబ్బండ వర్ణాల బతుకు దెరువు అయినటువంటి రామసముద్రం చెరువును బతికించాలని కోలుకొండ దళితులు కోరుతున్నారు.

అట్లాగే..

ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అయినటువంటి వేంకట జానకమ్మ భూములను రెవిన్యూ అధికారులతో కమ్మక్కుతో హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మంలో నివాసం ఉంటున్నటువంటి గంజి జనార్దన్ రెడ్డి, ఎదిరి శ్రీలతా రెడ్డి, గంగాధర రావు, చలపతి రావులు అక్రమంగా పట్టాలు చేసుకున్నారు. వీళ్లేగాక యామగాని నాగయ్య అనే ఆసామి కూడా 5 ఎకరాలు పట్టాచేసుకొని 20 ఎకరాలు ఆక్రమించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ..

కబ్జాదారుల బారి నుండి రామసముద్రం చెరువును కాపాడాలని..

జానకమ్మ భూముల్నీ ఊరుమ్మడి ఆస్తులుగా ప్రకటించాలని..

ఆ భూముల్ని మూడు తరాల వెట్టి కార్మిక కుటుంబాలైన 167 కోలుకొండ దళితులకు 3 ఎకరాల చొప్పున పంచాలని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు.

అయితే మూడో రోజే పెత్తందారుల బంట్లు టెంట్లు పీకేసి దీక్షను భగ్నం చేశారు. అయితే అందరు కలిసి గుంజలు పాతుకొని, తాటిపత్రులు పైనా, కిందా పరుచుకొని భూ పోరాట దీక్ష కొనసాగిస్తున్నారు.

అయినా అధికారులు, రాజకీయ నాయకత్వంలో కించిత్ కదలిక లేక పోవడంతో 13 తేదీన దీక్షా శిబిరం నుండి కోలుకొండ దళితులంతా 2 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి 197 సర్వే నంబరుతో ఉన్న 40 ఎకరాల ప్రభుత్వ భూమిని చెట్లూ, తుప్పలూ కొట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.

మిగతా 154/1/F & 507 సర్వే నంబర్లతో ఉన్న 200 ఎకరాల జానకమ్మ భూముల్లో అక్రమ పట్టాలతో కబ్జాలో ఉన్న స్థానికేతరులైన గంజి జనార్దన్ రెడ్డి, ఎదిరి శ్రీలతా రెడ్డి, గంగాధర రావు, చలపతి రావు, యామగాని నాగయ్య లను తొలగించి వెట్టి కార్మిక దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున పంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా తామే స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు.

ఈ మాట రాస్తున్న సమయంలో కోలుకొండ శ్రీనివాస్ ఫోన్లో శ్రీనివాస్ను, ఆయన వెంట ఉన్న గనపాక పరశురాములు, శ్యామల సురేశ్, శ్యామల నరేశ్, చింతకింది సోమయ్య లను దేవరుప్పుల ఎస్సై నరేందర్ రెడ్డి కానిస్టేబుల్ మల్లయ్యను పంపి దీక్షా శిబిరం నుండి పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్తున్నారని చెప్పాడు.

రిలే దీక్ష కొనసాగుతుండొచ్చు.

మరైతే,
ఎప్పట్లాగే... రాజ్యం పెత్తందారుల కొమ్ము కాస్తుందా?

ఎప్పట్లాగే...
వేల ఏండ్లుగా ఈ నేల మీద సంపద సృష్టికర్తలైన దళితులకు నేల దక్కకుండా చేస్తుందా?

ఏం జరుగుతుందో చూద్దాం.

No. of visitors : 395
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

| 24.07.2016 09:12:28pm

మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన విర‌సం బృందం ప‌రిశీలించిన విష‌యాలు నివేదిక రూపంలో విర‌సం స‌భ్యుడు బాసిత్ వివ‌రించారు.......
...ఇంకా చదవండి

హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

శోవన్ చౌధురి | 15.05.2016 01:15:10pm

"జేఎన్‌యూ వారు కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే అరెస్టు చేయగా, మేం 30 మంది దాకా విద్యార్థులను జైల్లో పెట్టేసాం. అదృష్టవశాత్తు మేం వైమానిక బలగా...
...ఇంకా చదవండి

దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

బాసిత్ | 19.10.2017 09:42:40pm

తను ఒళ్లమ్ముకున్నట్లుగా, కన్నీళ్లమ్ముకొనే స్థితికి దిగజారడానికి కారణం ధనిక భూస్వామ్యంతో పాటు వేళ్లూనుకున్న పితృస్వామిక కుల వ్యవస్థ అనేది శశికి జైవికంగానో, ...
...ఇంకా చదవండి

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

బాసిత్ | 04.09.2017 09:10:50am

మొత్తం వ్యవస్థ మార్పు దిశలో కృషికి ఇంకొంచెం పెద్ద ప్రయాస అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులంతా సమిష్టి పోరాటంలో భాగం కావాల్సి ఉంటుంది....
...ఇంకా చదవండి

మే డే స్ఫూర్తి అజరామరం!

బాసిత్ | 02.05.2018 10:18:41am

8 గంటలు పని, 8 గంటలు మానసికోల్లాసం, 8 గంటలు విశ్రాంతి అనే ప్రామాణిక పని దినం కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఇప్పటికే శ్రామిక వర్గ పోరాటాలను ప్రే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •