గత కొన్నేళ్ళుగా ప్రపంచానికి బువ్వ పెట్టే రైతు తన నేలనుండి దూరం చేయబడుతూ కనుమరుగవుతుండడాన్ని మనం రోజూ గమనిస్తూ వున్నా నోటికి ఇంత కూడు దొరికినంత కాలం జరుగుతున్న విధ్వంసాన్ని విలయాన్ని పట్టించుకోకుండా ఆండ్రాయిడ్ ప్రపంచంలో మనమొక యాప్ గా మారిపోతున్నాం. కానీ, మనల్ని మనం కోల్పోతున్న దృశ్యాన్ని ఎవరో ఒకరు కాసింత ఆత్మీయతతోనో లేక ఆగ్రహంతోనో ఒక కవితగా లేక కథగా రాసుకుంటూ పోతారు. అది కూడా నిన్ను చేరదు. భూమండలమేమైనా బద్దలయిపోతుందా అని ఎటకారంగా మాటాడుతాం. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతూ నీ నా ఉనికిని కోల్పోతూ ఒక ఒంటరి దు:ఖానికి చేరువైననాడు మరల ఆ కాగితప్పేజీలు తిరగవేసే రోజు దగ్గర్లోనే వస్తుంది. అప్పుడు మనల్ని మనం దులపరించుకొని రంకెవేయాలని చూస్తాం. ఆ ఎరుక కలిగించేదే కవిత్వం, కథ, సాహిత్యం చేసే పని కాదా? అలా తన చుట్టూ జరుగుతున్న విధ్వంసాన్ని మాయమైపోతున్న మానవసంబంధాలను ఒక జాగరూకతతో మెలకువతో పరికిస్తూ తనదైన యాసలో జీవం ఉట్టిపడేలా ఆర్థ్రతను అద్ది మనం మరిచిపోతున్న నుడికారాలనే కవిత్వ భాషగా మార్చి పదచిత్రాలుగా మలచి సరళమైన భావాలుగా ఒలికించి మనల్ని మేల్కొలుపుతారు చింతా అప్పల్నాయుడు మాస్టారు. మొత్తం కవితలలో తన అమ్మా నాన్నల రైత్వారీ జీవన చిత్రాన్నే వస్తువుగా ఎంచుకొని వ్యవస్థలోని అక్కరకు రాని మార్పులను వాటి మంచి చెడులను కళ్ళముందు ఆవిష్కరించడం మాస్టారులోని ప్రత్యేకత. తన చుట్టూ తూనీగళ్ళా ఆడుతూ పాడుతూ చదువుకునే పిల్లలను, తన ఊరి చివరి మాల పేట బతుకును కూడా పద్యం చేస్తారు. కవిత్వం కోసం శైలి కోసం శిల్పం కోసం తనేమీ వెతుక్కోరు. తన చుట్టూ వున్న జీవితాన్ని అందులో అమరిన వ్యావహారిక భాషను అందులోని జీవాన్నే శిల్పంగా మలచి కవిత్వం చేయడం అప్పల్నాయుడు మాస్టారి శైలి. దుక్కిలో మిగిలిన దు:ఖాన్నంతా గానం చేస్తూ ఒట్టి పోతున్న గ్రామాలను వాటి శిధిలమవుతున్న బతుకు పటాన్ని మనముందుంచుతారు.
ఉత్తరాంధ్రా వీధుల్లో కనుమరుగైపోయిన ʹజముకు పాటʹ కవితలో
ʹʹగౌరీ పున్నమి వెన్నెల్లో
ఆకలి కర్రకు చూపుల దీపాన్ని కట్టి
సీతమ్మోరు వనవాసమెత్తుకుంటే
ఊరు ఊరంతా దు:ఖపు వాసనే.
సీతమ్మోరును చెరబట్టినట్టు
వాడి పాటల్ని పరాభవిస్తున్న రావణులు ఎందరోʹʹ అని ప్రశ్నిస్తారు.
ఆరుగాలం శ్రమించి తన కడుపు కట్టుకొని పెంచి పెద్ద చేసిన కొడుకు డాలర్ మోజులో ఎగిరిపోవడాన్ని తల్లి పేగు చేసే ఆర్తనాదంగా ఇలా ʹమాటుʹ కవితలో
నువ్వు..
ఇస్కూలు మేస్టారువైతే
మన గుంటపాపల చీకటి గుండెల్లో
అచ్చరాల చిచ్చు బుడ్డీలు ఎలుగుతాయనుకున్నాను!
ఇంజినీరువైతే
గట్టి గూడు కట్టి నీడనిస్తావనుకున్నాను
డాకటేరువైతేజి
బీదా బిక్కికి రోగాలను కుదురుస్తావనుకున్నాను
డాలర్ పులి నోటికి దొరికి పోతావనుకుంటే
పుట్టినపుడే పుటికీసుందును! అని ఆగ్రహంగా ఓ తల్లి పడే వేదనను చెప్తారు.
ఊరి చివరి మాల పేట బతుకును ఎంతో ఆర్థ్రంగా సహానుభూతితో సహజమైన వారి జీవన నడవడికను పల్లె పద చిత్రాలలో చిత్రిస్తారు ʹఒక మాలపేట కొన్ని దృశ్యాలు కవితలో మాస్టారు.
ʹʹఊరు ఊరంతటికీ
ఉదయమే పొద్దు పొడుస్తుందిగానీ
నిజానికి మాలపేటలో
సాయంకాలమే సూర్యోదయమౌతుంది!
పొద్దు పోయి పోయి తిరిగొచ్చి
మాల పేట పొయ్యిలో దూరినట్టుంటుంది!
ఆటయినా, పాటయినా
కతయినా, కయ్యమయినా
బతికి బట్టకట్టేది
మాలపేటలోనే!
కళ్ళులేని కబోది అయితేనేమి
కన్నయ్య ముసిలోడు జామురాతిరి
జమికిలి తడిమి పాటెత్తుకుంటే
పాట వినడానికి వేకువ పరుగూ నడకన వచ్చి
తడక ఇరుకులోంచి దూరిపోయి
తన్నుతానే మరిచిపోతుంది!
పగలంతా బుగత పొలంలో పనిచేసి
ఇంటిల్లిపాదికీ కడుపు తడపడానికి గెంజి తపేలాతో
ఎనకెట్టి పోతున్న ఎర్రటి పొద్దులా ఇంటికి చేరుతున్న
ఈరయ్యను చూడు
రెండు చేపలూ ఒక రొట్టే
ఐదు వేలమందికి పంచిన అపర క్రీస్తే అనిపిస్తాడు!
అనురాగాలు ఆప్యాయత
ఇలమీద ఇంకా మిగిలున్నాయని చెప్పే మహాబోధి మాల పేట
పేట పేటంతా ఒకే తీరు
అదొక ʹనల్లపూసల సేరుʹ
మమతల పూల తేరు!ʹʹ అని ఎంతో ఆత్మీయంగా వర్ణిస్తారు.
పేకేజీలు పేరుతో ప్రజలను మోసం చేస్తూ నిర్వాసితులను చేస్తూ వున్న దేశంలోనే కాందిశీకులుగా మారుస్తున్న కుట్రను ʹఒక్క నదిని నాకు కాకుండా చేసిʹ కవితలో ఇలా
పుట్టిన ఊరికి దూరమవ్వడమంటే
కంటిముందల బతుకు కాటిసీనుగా మారడమే
మట్టికి విలువ కట్టడమంటే
మా వొంటిలోని కండ కండకీ రేటు కట్టడమే అని చెప్తూ
పరిహారాల పేకేజీలను ప్రకటించడమంటే
బంగారు జింకల్ని చూపి భ్రమలు కల్పించడమే
నా ఉనికిని గురించి ప్రశ్నించి ప్రశ్నించి
రెక్కలు తెగిన జటాయువునైపోయానుʹ అని రైతు నిస్సహాయతను తెలియచేస్తారు.
వ్యాపార ప్రకటనలలో పిల్లలకు హార్లిక్స్ బూస్ట్ లను ఇవ్వడం వారికి తెలివితేటలు వాటిద్వారానే వచ్చాయన్న భ్రమలలో ముంచడం నిత్యం మనమ్ చూస్తుంటాం. కానీ పల్లెటూరి పిల్లగాడి ప్రకృతి సిద్ధమైన తెలివి వాడి ʹతల్లి పాల సారమేʹ అని ఇలా చెప్తారు
వసపిట్టలా
బడిసాల్లో ఆ పిల్లడు పలికే ప్రతి అక్షరం
ఖంగున గంటలా మోగి
ఊరవతల ఆసర సాల్లో నక్కు సాగగొడుతున్న
అయ్య చెవిలో మారుమోగుతుంది
బూస్టూ కాదు హార్లిక్సూ కాదు
వాడు జుర్రింది గంటెడు అంబలి!
కలవపువ్వులాంటి కళ్ళు
కర్రపెండలం లాంటి ఒళ్ళు
బడితోటలో మొక్కకు నీళ్ళవుతాడు
మట్టిబోది అవుతాడు
కంచెకోసం ముళ్ళకంపవుతాడు
వాడి చెలాకీతనానికి అసలు రహస్యం
ఏ కాంప్లానో కాదు
అంతా తల్లిపాల సారమే! అని చెప్తూ చివరిగా ఈ ఆరితేరిన ఆరిందను కబళించడానికి ఏ కార్పొరేటు కాలేజీ కొండచిలువలా కాచుకు కూచుందో అంటారు.
ఈ సంకలనంలో మిగిలిన కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప్రభుత్వ పథకాలు పళీళీణమేలాలు నిత్య జీవన విధ్వంసాన్ని ఆవేదనతో చిత్రిస్తారు. ఈ మధ్య కొంతమంది ఇదంతా జరుగుతున్న మార్పును ఆహ్వానించాలే కానీ కోల్పోతున్న భూస్వామ్య సంబంధాలను కీర్తించడం ద్వారా ఒరిగేదేమి వుండదని అంటూ వెటకరించడం చూస్తున్నాం. కానీ అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసం చెప్పకపోతే మనల్ని మనం తెలుసుకొని మోసాన్ని గ్రహించలేం అని నేననుకుంటాను. ఒకపక్క లక్ష ఎకరాలలో పంటను నీళ్ళను మింగి ఒక మాయా ద్వీపాన్ని సృష్టిస్తున్న కార్పొరేట్ పాలకులు వారి మాయను కప్పిపుచ్చడానికి సుజలాం సుఫలాం పేరుతో ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని ఒడిసిపట్టమనే మీడియా పద్మభూషణుల జమిలి కుట్రను చెప్పకుండా ఎలా వుండగలం. ఈ సంకలనం ఈ కాలానికి ముందుదే అయినా ఇలా నిర్వాసితులు కావడం మా ప్రాంతానికి కొత్త కాదు కనుక అప్పల్నాయుడు మాస్టారి కవితలలో మనకు ఇది కొంతమేర గోచరమవుతుంది.
కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ
అప్పుసప్పులు అప్పజెప్పబోయిన
మా అయ్య ముఖంలా ఉంది ఆకుమడి!
ఉరితీసే ముందు
నీ ఆఖరి కోరికేమని అడిగితే
ఆకుమడి బతికితే అదే చాలన్నట్టు
మా అమ్మ వాలకం!
వడ్డీ అసలును మింగుతుందని
మడి చెక్కల హామీ రాయమని
అగ్గిమీద గుగ్గిలమైపోయిన
అప్పులోడిలా వుంది అదునివ్వని కార్తె! (వాన కురవాల)
ఒరే నాయనా...
నువ్వుగాని మనసొగ్గీసినావా
యీ పెపంచికం నాశనమైపోద్దిరా కొడుకా
నీగ్గాక యింకెవలకి తెలుసు
ʹʹమన్నుబెడ్డల్ని అన్నం ముద్దలు సేసే మంత్రంʹʹ? (మనసొగ్గీకు)
ʹʹనడుంకి నారగట్టి
ʹకరువు ఏతామెక్కిʹ అప్పుల్ని తోడతాడు!
ఊరిస్తున్న పళీళీణమేళాల మధ్య
బేంకు ద్వారానికి తోరణమై వేళ్ళాడతాడు!
సత్తుగిన్నె మా అమ్మ చేతిలో
సందమామై మెరిసిపోతే
వెన్నెలాకాశం మా ఇంటిముందు
పిండి ముగ్గై వాలుతుంది!
వ్యవసాయం మా అయ్యకు వ్యసనం మరి!ʹʹ (కరువు ఏతామెక్కి)
ʹʹకొడుకా నా కొంగు బంగారమా
భూమికీ ఆకాశంకీ మద్దిని గెడగర్రమీద
ఎన్ని యిద్దిలు సేసినా ఏటినాబం
సేతల నాలుగు పైసలు రాల్ని యీటీవోడి సందాయమే
నేలబుగ్గి నెత్తికెత్తుకొని పంటకలగన్న పాపానికి
నీ ఇంటిల కరువు పామై మటమేసిందిగదరా నాయినా! (గోస)
ఇలా రైతు గోసను గానం చేసిన జముకు పాట అప్పల్నాయుడు మాస్టారి కవిత్వం. చివరిగా ఆయన తన ధిక్కార స్వరాన్ని ఇలా ప్రకటిస్తూ
దు:ఖమైతే మాత్రం ఏం?
దుక్కి
అది నా జీవసూత్రం
దుక్కి నాకు మెతుకు
దుక్కి నాకు బతుకు
దుక్కి నాకు తూర్పు దిక్కు
దుక్కి నా జన్మహక్కు!
వాన కురవాల!
ఏరు బతకాల! ఎద్దు బతకాల
ఊరు బతకాల! వాడ బతకాల!
పిట్ట బతకాల! చెట్టు బతకాల!
రైతు బతకాల!
మాస్టారి కల కలకాకూడదని అది మనందరి ఆశగా మొలవాలని ఆశిస్తూ...
Type in English and Press Space to Convert in Telugu |
ఆకు కదలని చోట వర్షించిన కవిత్వంఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం....... |
ఆ పావురాలు!ఒలికిన నెత్తురు
అద్దిన జెండానందుకుంటూ
గుంపుగా ఆ పావురాలు! ... |
తెలవారని ఆకాశం!కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ
రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ... |
Lockdown 3.0కానీ
రేప్పొద్దున్న రెపరెపలాడే
జెండాగా మారాల్సింది
ఈ నెర్రెలు బారిన పాదాలిస్తున్న
వాగ్ధానం కదా?? ... |
నమస్కరిస్తూ..కళ్ళకు గంతలు కట్టుకొన్నదని
మీ న్యాయ దేవత ముందు
నగ్నంగా నిలబడిన ఆ
పదముగ్గురూ
విడిచిన లజ్జను మీ మఖంపై
నెత్తుటి ఉమ్ముగా ఊసి!... |
పాలపుంతల దారిలో..
అమ్మలు
అలా వచ్చి ఎర్ర పూలను
దోసిట్లో పోసి వెళ్ళి పోతారు
కొన్ని నెత్తుటి చారికలను
కళ్ళలో నీటి బిందువులుగా
మార్చి కడిగిపోతారు... |
దక్షిణ యాత్రనీ ఒంటి రంగును హేళన చేసి
నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు
నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం
నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!... |
గులాబీ!వాడెంత విధ్వంసం చేసినా
నీ పసివాడి చేతిలో
గులాబీ విచ్చుకుంటూ
వాడిని భయపెడుతూనే వుంది!!... |
కుందాపనఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు...... |
మస్వాల్..మరుగుతున్న మంచు తెరలుగా
విడిపోతూ రాలిపోతున్న
మస్వాల్ పూలెన్నో
ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష
ఆజాదీ ఆజాదీ ....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |