వీళ్లు చేసిన నేరం ఏంటి?

| సాహిత్యం | వ్యాసాలు

వీళ్లు చేసిన నేరం ఏంటి?

- అరుణ్ | 16.06.2018 10:29:00am

ʹనేరమే అధికారమై
ప్రజలను నేరస్తులను చేస్తూ శిక్షిస్తూంటే
చూస్తూ ఊరుకొనే ప్రతిఒక్కరూ నేరస్తుడేʹ -వివి

దాదాపు 4 దశాబ్దాల కిందటి కవివాక్కు యిప్పటికీ మధ్యతరగతి బుద్ధిజీవులను వేలెత్తి చూపుతూవున్నదంటే, మన ఆలోచనా దృక్పథం లో వెలితిని గుర్తించాల్సిన సంద‌ర్భ‌మిది. ఒక ప‌న్సారే కావచ్చు, ఒక కాల్బుర్గి కావచ్చు, ఒక గౌరీ లంకేష్ కావచ్చు, లేక ఝార్ఖండ్ , చత్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రాలలో నిజాల్ని నిర్భయంగా వెలికి తీసే జర్నలిస్టులు కావచ్చు. బూటకపు ఎన్కౌంటర్ల పై వెళ్ళిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కావచ్చు. సాధారణ కార్యకర్త కావచ్చు, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కావచ్చు. కాని వారంతా ప్రజలపై ముఖ్యంగా ఆదివాసి,దళిత, మైనారిటీ ప్రజలపై రాజ్య హింసను, ప్రభుత్వ మద్దతుతో హిందూత్వ‌ వాదులు జరుపుతున్న హింస ను ప్రశ్నిస్త్తున్నారు కాబట్టే.. వారు మానసిక వికలాంగులు కానందుకే, రాజ్యం కాటుకు బలయ్యారు. ఆ కారణంగానే 95% శారీరక వికలాంగుడైన ప్రొ. సాయిబాబా జైల్లో మగ్గుతున్నాడు. వీటన్నిటిపైనా మెజారిటీ మధ్యతరగతి బుద్ధిజీవుల స్పందన అతి దారుణంగా వుంది. వేయి పడగల హైందవ నాగరాజు నీడన సేద‌తీరాలనుకుంటున్న మధ్యతరగతికి అటూ యిటూ మసలాలంటే భయం. నోరుమెదపాలంటే భయం. చివరకు స్పందిచాలంటే భయం. స్పందించే హృదయం,ఆలోచించే మెదడూ తనకు అత్యంత ప్రమాద‌కరమైన శత్రువులని రాజ్యంనిస్సిగ్గుగా ప్రకటించుకుంటోంది.

నేడు అప్రకటిత అత్యవసర ప‌రిస్థితి నెలకొనివుంది. ʹఫాసిజం ఆడుతూంది ప్రజాస్వామ్య నాటకం.ʹ ఆట, పాట, మాట పై నిషేధం. మనం తినే తిండిపై, వేసే బట్టపై మాట్లాడే మాటపై ఆంక్షలు. నేడు మనం, మరతిప్పితే ఆడే మరబొమ్మలంగా, జీవచ్చవాలంగా బతికే పరిస్థితి. ఒక వేళ దేనికైనా స్పందించినా అది మన కులం , ప్రాంతం, మతం పై ఆధార పడివుంటుంది. పీడితుడు(కులం, మతం, ప్రాంతం రీత్యా) మనవాడైతేనే, అదీ వ్యక్తిగతంగా మనకు పెద్దగా యిబ్బందికరం గాకపోతేనే, నిరసన పాటిస్తాం. మహా అయితే కొంతసేపు రాస్తా రోకో చేస్తాం. కుల, మత ప్రాంతాలకతీతంగా మనిషిని మనిషిగా చూసే హృదయాన్నిఏనాడో కోల్పోయాం. మనకు సిద్దాంతాలంటేనే భయం. మరీ ముఖ్యంగా పాలకులకు రుచించని సిద్దాంతాలంటే మరీ భయం. కాని, ఆ ఆలోచనకారులే, వారి ఉద్యమాలే నేడు మనం కనీస జీవన భ‌ద్రత కల్గివుండడానికి కారణం అని తెలుసుకోం. తరతరాలుగా వాళ్ళు చేస్తున్న, చేసిన త్యాగాలే నేడు కొంత మేరకైనా మన సుఖ, సంతోషాలకు పునాదులు అని మరుస్తాం.

తూత్తుకూడి సంఘటనకు చలిస్తాం. వేదాంత కార్పోరేట్ దోపిడీనీ నిరసిస్తాం. ఆవేదనతో, ఆక్రోశంతో, ఆవేశంతో ప్రజల తిరుగుబాట్లకు యాదృచ్చికంగా స్పందించేందుకు అలవడ్దాం. మంచిదే. కాని, అలాంటివి తాత్కాలిక ఉపశమనాలు కల్గిస్తాయితప్ప, పాలకవర్గాల రాజకీయ, ఆర్ధిక విధానాలపై ప్రభావం చూపవని చరిత్ర చెప్పినా మనం వినం. అవే కార్పోరేట్లు ఒరిస్సా, చత్తీస్ఘ‌డ్‌, ఝార్ఖండ్‌లో దేశ సంపదను దోస్తుంటే, దానికి వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్ లకై ఆదివాసీలు పోరాడుతుంటే మాత్రం నోరువిప్పం. వారిపై రాజ్యం యుద్ధం ప్రకటిస్తే, వారిని ఊచకోత కోస్తుంటే మనం మౌనం వహిస్తాం. ఎందుకంటే అవి స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో జరుగుతున్న పోరాటాలు గనుక. ఆ పోరాటాలు దోపిడీ మూలాలను పెకలిస్తాయి కనుక. అవి కార్పోరేట్ దోపిడీని శాశ్వతంగా నిర్మూలిస్తాయి గనుక. అవి గొప్ప త్యాగాలను కోరుతాయి గనుక. వాటికి మద్దతు తెల్పడమంటే మనం అణచివేతను ఆహ్వానించడం గనుక. మనం ప్రొ.సాయిబాబా, సుధీర్ దావ్లే, సురేంద్ర గాడ్గిల్, మహేష్ రౌత్, రోనా విల్సన్, ప్రొఫెస‌ర్ షోమాసేన్ లము కాదల్చుకోలేదు కనుక.

వాళ్ళు అత్యంత పీడనకు గురైనా దళితుల, ఆదివాసుల, మహిళల, రాజకీయ ఖైదీల హక్కుల కై పోరాడుతున్న వారైనా మనకు పట్టదు. వాళ్ళు పీడిత జనాలకహక్కులకై గొంతెత్తుతున్న వాళ్ళు. వాళ్ళు హిందూత్వ వాదులకు వ్యతిరేకంగా కుల,వర్గ పీడితులనందరిని సంఘటితం చేస్త్తున్న వాళ్ళు. వాళ్ళు దోపిడీ, పీడన లేని కుల, వర్గ రహిత సమాజాన్ని కలలు కంటున్నా వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కుల వర్గ సమాజం లో తాత్కాలిక వుపశమనాలకై వెంపర్లాడక దోపిడీ పీడనలనుండి శాశ్వత విముక్తిని కోరేవారు. ఈ పాలక వర్గాలకు నిజమైన ప్రతిపక్షాలు వాళ్ళే. మన హక్కులకై తమ హక్కులను కోల్పోతున్నవాళ్ళు వారే. కానీ, అలాంటి వారి హక్కులరక్షణకై గొంతువిప్పాలంటేనే, తాత్కాలిక ఉపశమనాలకై వెంపర్లాడుతూ, ఏదోకొంత నిరశన తెల్పి నాలుగు రాయితీలు పొందాలని ఆశించే మన మధ్యతరగతి బుద్దిజీవులకు భయం. వారు మాట్లాడే హక్కులు కోల్పోతే తమకెలాంటి హక్కులుండవని, యిక బానిస‌ బతుకులేనని గ్రహించక పోనడం మధ్యతరగతి విషాదం.

ఎవరు వారు?


ఎందరో? ఊరూ, పేరు లేని వాళ్ళు. సర్వనామమై ప్రజల హక్కుల కొరకు గొంతెత్తున్నవాళ్ళు. నిన్న గౌరీ లంకేష్ కావచ్చు, ప్రొ.సాయిబాబా కావచ్చు, నేడు సుదీర్ ధావ్లే కావచ్చు. అలాంటి వారివల్లనే నేడు మనం కొంతమేరకైనా పౌరహక్కుల అనుభవిస్తున్నాం. వారే, ఇప్పటి సందర్బం లో మావోయిస్టులుగా, ప్రధాన మంత్రి మోడీ హత్య కుట్రదారులుగా ముద్రబడిన వాళ్ళు. వాళ్ళను గురించి మాట్లాడడం కనీస ప్రజాస్వామ్య హక్కయినా, మనం భీరువులం కాబట్టి, మాట్లాడం. కనీసం వారిని గురించైనా తెలుసుకుందాం.

సుదీర్ ధావ్లే


నాగపూర్ లోని ఒక మురికివాడలో జన్మించిన పేద దళితుడు. 54 సం. ల ఈ ధావ్లే చిన్నప్పటినుండి అన్యాయాలకు, హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తున్న హక్కుల కార్యకర్త. 2002 గుజరాత్ హత్యాకాండ కు చలించిన ధావ్లే ʹవిద్రోహిʹ అనే ద్వైమాస పత్రికను ప్రారంబించాడు. ఆ తర్వాత 2006 లో ఖైర్లాంజి దళితుల హత్యానంతరం ఒక సాంస్కృతిక, రాజకీయ సంస్థ ʹరమాబాయి నగర్-ఖైర్లాంజి హత్యాకాండ విద్రోహి సంఘర్ష్ సమితిʹ ని స్థాపించాడు. కొంతకాలం తర్వాత పై సంస్థ మూత పడ్డాక, 2007 డిసెంబర్ 7 న రిపబ్లికన్ పాంథర్స్ కులనిర్మూలన ఉద్యమం అనే సంస్థను ఏర్పాటు చేసాడు. తొలుత పీపుల్స్ వార్ పార్టీ నిషేదానికి గురికాకముందు, ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసినా , ఆ తర్వాత దళితోద్యమంవైపు మొగ్గుచూపాడు. అతని పత్రిక ʹవిద్రోహిʹ ప్రభుత్వానికి కంటగింపయ్యింది. అతని గత సంబంధాలు 2011 లో అతన్ని చెరసాలపాలు చేసాయి. అయితే నిర్బంధం అతని సంకల్పాన్ని దెబ్బ తీయలేక పోయింది. అన్ని దళిత సంఘాలను ఒకే గొడుగు కింద తెచ్చే ప్రయత్నంలో దాదాపు 200 సంఘాలను కలిపి ఎల్గార్ పరిషత్ ను నిర్వహించాడు. అలా పీడిత దళితులనంద‌రినీ, బహుజనులతో కలిపి ఏక తాటిపై తేవడం హిందూత్వ ప్రభుత్వానికి కంటిలో కారం చల్లినట్టయింది. అతని లక్ష్యం దళిత, బహుజనులందరిని ఏకం చేయడమే. అతని అరెస్టుకు ఇదే కారణమని అతని స్నేహితులంటున్నారు.

సురేంద్ర గాడ్లింగ్


ధావ్లే పొరుగు ప్రాంతం లో జన్మించిన ఈ సురేంద్ర (47) ఫీజు తీసుకోని ప్రజల వకీల్‌. అతని జీవితమంతా ప్రజా రాజకీయాలే. ఎన్నో సామాజిక –సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గోన్న సురేంద్ర, తన స్నేహితులైన ప్రజాకార్యకర్త ప్రజా గాయకుడు కవి అయిన శంబాజి భగత్, మరియు సుప్రసిద్ధ మరాటి ప్రజాగాయకుడు విలాస్ ఘోగ్రే తో కలసి ఆవాహన్ నాట్యమంచ్ అనే సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ప్రతి సాయంకాలం నాగపూర్ మురికివాడల్లో ప్రజలకు దళిత హక్కుల గురించి, వారిపై అణచివేత గురించి ఆట , పాటలద్వారా అవగాహన కల్పించేది. దాంతో గాడ్లింగ్ తృప్తి చెంద లేదు. దళితుల హక్కులకై , కార్మిక హక్కులకై కోర్టుల ద్వారా పోరాడాలనుకున్నాడు. అందుకై న్యాయవిద్యనభ్యసిచి వకీలయ్యాడు. ఇక అప్పటినుండి చట్టవ్యతిరేక హత్యలు, పోలీసులచే హక్కుల ఉల్లంఘనలు, తప్పుడు కేసులు, దళితుల, ఆదివాసులపై అత్యాచారాలు వీటన్నిటికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడం మొదలెట్టాడు. అనతికాలం లోనే, సురేంద్ర UAPA, అటవీ చట్టాలు, SC,STఅత్యాచార నిరోధక చట్టాలపై ప్రావీణ్యత సంపాదించాడు. రాజకీయ ఖైదీలహక్కులకై న్యాయ పోరాటం మొదలెట్టాడు. మొన్న అరెస్టు అయ్యేదాక సురేంద్ర ప్రొ. సాయిబాబా కేసును వాదిస్తున్నాడు కూడా. అంతేగాక సురేంద్ర ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కమిటీ(PUDR) లో చురుకైన కార్యకర్త. అత్యంత సామాన్య జీవితం గడుపుతున్న యితని యింటిపై పోలీసులు దాడి చేసినపుడు వారికి లభించింది అతని భార్య దగ్గర వున్న రూ.500/ మాత్రమే. కొంత కాలంగా అతి తీవ్రమైన కీళ్ళ వాతం తో భాద పడుతున్న సురేంద్రను అరెస్ట్ అయిన మర్నాడే జూన్ 7న పోలీస్ కస్టడీ నుండి ఆస్పత్రి కి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత అతన్ని జుడీసియల్ రిమాండ్ కు పంపారు.

మహేష్ రౌత్


మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్ జిల్లా లఖపూర్ గ్రామం లో వెనుకబడిన కులానికి చెందిన రౌత్ (30) ఆదివాసిహక్కుల చాంపియన్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన యితడు మేనమామ దగ్గర పెరిగాడు. అతనిపై అతని తాతగారి రాజకీయభావాల ప్రభావం వుందని అతని కుటుంబ సభ్యులు చెబుతారు. గడ్చిరోలి నవోదయ పాఠ‌శాల లో చదువు పూర్తయ్యాక రౌత్ టాటా సామాజజిక అధ్యయనాల సంస్థ (Tata Institute of Social Sciences) లోసామాజిక సేవ (social work) తరగతి లో చేరాడు. యిక్కడే అతని తాత్విక దృక్పథంలో మార్పు వచ్చింది. అంతవరకు తగినంత డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆలోచనతో వున్న రౌత్, ప్రజాసేవనే పరమావధిగా ఎంచుకున్నాడు. టాటా సంస్థ నుండి అతి ప్రాముఖ్యత కల్గిన ,అందరూ ఎంతగానో ఆశించేఆ ప్రధానమంత్రి గ్రామీణ అభివృద్ధి ఫెలోషిప్ పొందిన పిన్నవయస్కులలో యితనొకడు. ఆ ఫెలోషిప్ కాలం పూర్తయ్యాక గడ్చిరోలి ప్రాంతంలో ఆదివాసీల అభివృద్దికై పాటుపడిన రౌత్ కు, యిప్పుడు అక్కడ అతనితోపాటు పనిచేసిన సహచరులు మద్దతు నిలుస్తున్నారు. రౌత్ ఆదివాసీల హక్కులకై చాల ఉద్యమాలు నడిపాడని , ముఖ్యంగా సూరజ్‌ఘ‌డ్‌లోని మైనింగ్ ప్రాజక్ట్ కు వ్యతిరేకంగా అతను నిర్వహించిన పోరాటం చెప్పుకోదగ్గదని రౌత్ తో కలిసి చాలా దగ్గరిగా పనిచేసిన వకీల్, మరియు జిల్లా పరిషత్ స‌భ్యుడు అయిన లాల్సో నోగోటి చెబుతాడు. రౌత్ ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ద పోరాటాలనే నిర్వహించేవాడని , చట్టబద్దంగానే హక్కులకై పోరాడేవాడని లాల్సో నోగోటి తెలుపుతాడు.

ఆదివాసి హక్కులకై ఏర్పడిన విస్తాపన్ విరోధి జన వికాస్ ఆందోళ‌న్ సంస్థ కేంద్ర కన్వీనర్ గా ప‌నిచేస్తున్నాడు రౌత్‌. మధ్య దళారీల జోక్యం లేకుండా బీడీ ఆకులను నేరుగా మార్కెట్ లో అమ్మడం ద్వారా ఆదివాసీలకు న్యాయనైన ధర వస్తూందని, మధ్య దళారీల తోలిగింపుకై ఆదివాసీలను సంఘటితం చేసాడు. సహజంగానే అతడు గుత్తేదారులతో, పోలీసులతో నిత్యం ఘర్షణ పడాల్సి వచ్చేది. ధనసంపాధనకై ఏనాడు వెంపర్లాడని రౌత్ తన జీవికకై తన సోదరి పై అధారపడేవాడని తెలుస్తోంది. గత 6 నెలలుగా పెద్ద ప్రేగులో కురుపుతో(Ulcerative colitis) తీవ్రంగా బాధ పడుతున్న రౌత్ ఒక్క నెలలోనే 7 కిలోల బరుతగ్గాడని, అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేదని అతని స్నేహితులు , బంధువులు చెబుతున్నారు.

రోనా విల్సన్


కేరళ కోలం జిల్లాకు చెందిన 47 ఏళ్ళ రోనా విల్సన్ రాజకీయ ఖైదీల విడుదలకై అనునిత్యం ప్రచారం చేస్తున్న కృషీవలుడు. డిల్లీ జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా, విద్యార్ధి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. 2001 పార్లమెంట్ పై దాడి కేసులో నిందితుడుగా అక్రమ కేసును ఎదుర్కొన్న ప్రొ. S.A.R జిలాని విడుదలకై కృషి చేసిన విల్సన్, ఆ తర్వాత రాజకీయ ఖైదీల విడుదలకై ఏర్పడిన కమిటీ లో చురుకుగా పనిచేస్తున్నాడు. రాజ్యాన్ని ప్రశ్నించినందుకు, అన్యాయాలకు వ్యతిరేకంగా వుద్యమించినందుకు అక్రమ కేసుల కు బలవుతున్న ఉద్యమకారులకు అండగా నిలిచినవాడు విల్సన్. గత కొన్ని నెలలుగా విల్సన్ కార్యక్రమాలలో చురుకుగా లేడని, అతనికి ఎల్గార్ పరిషద్ తో సంబంధం లేదని ప్రొ.జిలాని అంటారు. అంతే గాక లండన్ లో Ph. D చేసేందుకు విల్సన్ ఈ మధ్యకాలం లో సన్నాహాలు చేస్తున్నాడని జిలాని చెబుతున్నారు.

షోమాసేన్


నాగపూర్ విశ్వవిద్యాలయం లో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేస్తున్న ప్రొ. షోమా సేన్ బెంగాల్ కాయస్థ కుటుంబం లో జన్మించిన ముంబాయ్ బాలిక. ఆమె భర్త తుశారకాంత్‌ భట్టాచార్య 2007 సం.లో అరెస్ట్ అయ్యాక ఆమె తన స్త్రీవాద కార్యకలాపాలను తగ్గించి అకడెమిక్ మరియు తర్జుమా కార్యకలాపాలపై ఎక్కువ కేంద్రీకరించారు. మొదట్లో పౌరహక్కుల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్న షోమాసేన్ గత కొన్ని సం.లుగా వాటికి దూరంగా ఉంటూ తన పదవీ విరమణానంతర ప్రశాంత జీవనానికి వేచి చూస్తున్నారని ఆమె కూతురు కోయల్ తెల్పింది. అరెస్టు చేయబడ్డ యితరుల మాదిరే సేన్ కు భీమా కారేగావ్ సంఘటనతో ఏ సంబంధమూ లేదంటుంది సేన్ కుమార్తె.

ఎవరి వారు వీరు?


ఈ ఐదుగురు భిన్న సామాజిక వర్గాలకు చెందిన వారు. భిన్న ప్రాంతాలకు చెందిన వీరంతా భిన్న కుటుంబ నేపథ్యం కలవారు. వీరిలోవున్న ఏకత్వం వీరందరికీ గల ప్రజాస్వామ్య దృక్పథమే గాక ఆచరణ శీలత, స్పందించే హృదయం, ఆలోచించే మెదడు , త్యాగశీలత. భీమకోరేగావు సంఘటన తర్వాత ఒక బలమైన దళిత స్వరం తిరుబాటు, హిందూత్వ వాదానికి ఒక సవాల్ విసిరినారనిపించింది. దళిత నాయకులని చెప్పుకొనే వారికి కొన్ని పదవులిచ్చి వారిని తమకు దళారులుగా మార్చుకొని తన ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చని విశ్వాసం పై గొడ్డలి వేటు పడింది.ʹమీ ఆవులు మీరుతీసుకోండి, మాకు భూమి యివ్వండిʹ అనే స్లోగన్ హిందూత్వ ఆధిపత్య పునాదుల కదిలించేదిగా వుంది. కొన్నిపధవులు, కొన్ని ఉద్యోగాలతో తృప్తిపరచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్న పాలక వర్గానికి కేవలం ప్రభుత్వాదికారమే కాదు, రాజ్యాధికారం కావాలని, దేశ సంపదలో తమ వాటా ఏమిటనే ప్రశ్నలు పాలక వర్గపు పునాదులను కదిలించేవిగా వారిని బీతావాహం చేసాయి. అందుకే బీమా కోరేగావు హింసకు కారకులైన హిందూత్వవాదులను వదిలి ప్రజలకొరకు సమాజ మార్పుకొరకు పనిచేస్తున్న పై ఐదుగురి పై మావోయిస్టు కార్యకర్తలని, ప్రధానమంత్రి హత్యకు కుట్రపన్నారని కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తూ రాజ్యం వారిని తన నిర్బంధం లోకి తీసుకుంది.

మరి సమాజం లో తన కులం, మతం , ప్రాంతం వారి పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనల చేబట్టే ఆయా కులాల, మతాల, ప్రాంతాల సంఘ బాద్యులు నేడు పై ఐదుగురి పై జరుగుతున్న కుట్రపై ఎందుకు తీవ్రంగా స్పందించడం లేదు. బహుశా వారంతా తమ కుల, మత, ప్రాంత, లింగ వివక్షతకే పరిమితం కాకుండా ఒక విశాల దృష్టితో మొత్తం పీడిత ప్రజానీకాన్ని తమ వారిగా భావించడం. వారిని దోపిడీ, పీడన నుండి, సకల వివక్షతల నుండి విముక్తం చేసే సమాజానికి పాటుపడటం, కేవలం ఈ వ్యవస్థలోనే కాసింత వెసులుబాటును ఆశించేవారికి రుచించడం లేదేమో. అంతేగాక రాజ్యం వారిపై మావోయిస్టు ముద్రవేయడం ఒక కారణం కావచ్చు. అను నిత్యం రాజ్యాంగ హక్కుల గురించి, రాజ్యాంగ పరిధిలోనే జరపాల్సిన న్యాయపోరాటాల గురించి అందరికి బోధించే మేదావులకు, మావోయిస్టులకూ పౌర హక్కులుంటాయని, మావోయిస్టు తాత్విక దృక్పథం కల్గినంత మాత్రాన ఎవ్వరూ నేరస్తులు కారని దేశ అత్యున్నత న్యాయస్థానం యిచ్చిన తీర్పు తెలియదనుకోవాలా? మావోయిస్టుల ముద్ర వేసి సంఘటితమవుతున్న పీడిత కులాలను, వర్గాలను అణచివేసే ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా ఎదుర్కొనక పోతే రాజ్యాంగం ప్రసాదించిధనుకుంటున్న కనీస మానవ హక్కులు అందరికీ మృగ్యమవుతాయని గ్రహించాలేనంత అమాయకులనుకోవాలా?

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చక తప్పదు.

ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చారు
నాకెందుకు అక్కరలేనివని మాట్లాడలేదు
నేను కమ్యూనిస్టుని కాదుగదా!

తర్వాతవాళ్ళు కార్మిక నాయకులకోసం వచ్చేరు.
నాకెందుకని ఊరుకున్నాను
నేనేమైనా కార్మికనాయకుణ్ణేమిటి?

ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చేరు
మనకెందుకని అడగలేదు
నేను యూదును కాదుగదా!

చివరికి వాళ్ళు నాకోసం వచ్చేరు
నన్ను వెనకేసుకుని రావడానికి
ఎవ్వరూ మిగల్లేదు.

- మార్టిన్ నీమలర్

మనకు వారి రాజకీయ భావజాలంతో ఏకీభావం లేక పోవచ్చు, మనం వారి కార్యాచరణను విభేదించ వచ్చు. కాని దేశ పౌరులుగా వారికి భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్చ వుందని, వారి కార్యకలాపాలను రాజ్యాంగ పరిధిలోనే సమీక్షించాలని, వారికీ పౌరహక్కులుంటాయని గుర్తించి మనం వారి తరపున గొంత్తెత‌క‌ పోతే మనకూ అదే పరిస్థితి ఏర్పడక తప్పదు. అప్పుడు మనల్ని రక్షించేందుకు ఎవ్వరూ మిగలరు.

నీ భావాలతో నేను ఏకీభవించక పోవచ్చు, కాని నీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ కోసం నేను ప్రాణాన్నిఅయిన అర్పిస్తాను –అన్న వోల్టేర్ ను గుర్తుతెచ్చుకొనే సందర్భం కాదా యిది.

చివరిగా వారి త్యాగాల పలితాలే నేడు మనం అనుభవిస్తున్న కనీస స్వేచ్చా, స్వాతంత్ర్యాలని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

No. of visitors : 885
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

అరుణ్ | 16.08.2019 07:43:10pm

కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని .....
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

అరుణ్ | 17.11.2019 11:14:53am

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే...
...ఇంకా చదవండి

నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

అరుణ్ | 04.02.2020 05:38:00pm

, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా......
...ఇంకా చదవండి

ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం

అరుణ్ | 15.04.2020 08:57:19pm

చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా....
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి

పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19

అరుణ్ | 15.05.2020 09:15:54pm

తనకు తాను పెట్టుబడిదారివ్యవస్థ మలినాలనుండి శుబ్రపరుచుకొనే ప్రయత్నాలలో భాగమే ఈ కోవిడ్ వైరస్ అని వైరాలజిస్ట్(వైరస్ అధ్యయన వేత్త) లు అంటున్నారు....
...ఇంకా చదవండి

ఆన్ లైన్ విద్య -వర్గస్వభావం - ఒక పరిశీలన

అరుణ్ | 01.07.2020 05:28:52pm

బడుగుబలహీన వర్గాలకు విద్యను దూరంజేసి, క్రమంగా సమాజ మార్పులో, అభివృద్ధిలో వారి పాత్ర, వాటా లేకుండా చేయడమే ఈ ఆన్ లైన్ విద్య లక్ష్యం. అంతేగాక విద్యారంగపు .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •