చారిత్రక కాల్పనికత-కాల్పనిక చారిత్రకత

| సాహిత్యం | స‌మీక్ష‌లు

చారిత్రక కాల్పనికత-కాల్పనిక చారిత్రకత

- పాణి | 03.07.2018 02:06:18pm

చారిత్రక కాల్పనికత-కాల్పనిక చారిత్రకత

స్వామి ʹశప్తభూమిʹ నవల

సాహిత్యం మానవ ప్రక్రియ. ఇంకా ఎన్ని నిర్వచనాలైనా ఇచ్చుకోవచ్చు కానీ అవన్నీ దీని దగ్గరే ఆరంభమవుతాయి. అందువల్లనే చరిత్రకంటే భిన్నంగా ఉంటుంది. నిజానికి మానవ ప్రక్రియ కావడం వల్లనే చరిత్రకూ, సాహిత్యానికి మధ్య సంబంధం కూడా ఉంటుంది.

సాహిత్యమనే మానవ ప్రక్రియను కాగడాగా ధరించి స్వామి రాయలసీమ చరిత్ర లోతుల్లోకి ప్రయాణించారు. శప్తభూమి నవలలోకి వెళ్లి వివరించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఈ నవలలోకి నాలుగైదు వైపుల నుంచి ప్రవేశించవచ్చు. ప్రతి ఎంట్రన్స్‌లోంచి వాచకం దానికదే కొత్తగా కనిపిస్తుంది. కనీసం పఠనానుభవం దగ్గర ఆరంభించినా, దానికి కారణమైన వాచకం పొరల్లోకి వెళ్లితే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఇక్కడ ఆ పని చేయబోవడం లేదు. మొత్తంగా శప్తభూమి అనే కాల్పనిక రూపానికి, అది సంచరించిన చారిత్రక ప్రపంచానికి సంబంధించి కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. పైన చెప్పినట్లు ఏ వైపు నుంచి నవలలోకి ప్రవేశించడానికైనా ఈ ఈ చట్రం బాగుంటుందని అనుకుంటున్నాను.

తెలుగు సమాజాల్లో చాలా ప్రత్యేకతలు ఉన్న రాయలసీమ గురించి రాసిన నవల ఇది. శీర్షిక కిందే రాయలసీమ చారిత్రక నవల అని ఉంటుంది. నిర్దిష్టంగా అనంతపురం చారిత్రక నవల అనడం మరింత బాగుంటుంది.

ʹఅది పజ్జెనిమిదవ శతాబ్దం. క్రీ.శ 1775వ సంవత్సరం..ʹ అని నవల ఆరంభమవుతుంది. ఆ కాలంలోని తెలుగు ప్రజల గురించి మనకు తెలిసిన చరిత్రలో తెలియని చరిత్రే చాలా ఎక్కువ. కులాలు, ప్రాంతాలు, వర్గాల రీత్యా చూస్తే ఆనాటి చారిత్రక ఆవరణలోని అగాధాలు భయం గొలుపుతాయి. అదంతా చాలా ఓ పెద్ద కత. ఇప్పుడు దాని గురించి కాదుగాని, మనకు తెలిసిన రాయలసీమ చరిత్ర అనబడే దానిలో 18వ శతాబ్దం చాలా కీలకం. దీనికి అంతక ముందటి చరిత్రతో సంబంధం లేదని కాదు. అట్లని గతానికి కొనసాగింపే 18వ శతాబ్దమని కుదించడానికి కూడా లేదు. చాలా పరిణామాలతో రాపిడిపడి పడిన పరివర్తనా కాలం అది. దాని గురించి రాత ఆధారాలు చాలా కొంచెమే ఉన్నాయి. అవి కూడా శకలాలే. కొన్ని మౌఖిక రూపంలో ఉండిపోతే, రాత రూపంలో ఉన్న వాటిని ఎలా అర్థం చేసుకోవాలో పెద్ద కసరత్తు చేయాల్సిదే. యథాతథంగా వాటి నుంచి ఏ నిర్ధారణకూ రాలేము. అయితే ఒక్క మాట చెప్పవచ్చు. ఇవాళ రాయలసీమ అని, దాని ప్రత్యేకతలని అనుకుంటున్న వాటితో దగ్గరి సంబంధం ఉన్న కీలక గతం అది. అంటే ఇప్పుడు రాయలసీమ ఇలా ఉండటానికి ఆ గతంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. అంత మాత్రాన అదే వర్తమాన రాయలసీమకు ఏకైక కారణమని అనుకోడానికి లేదు. దాని ప్రాధాన్యతను గుర్తించడానికే ఇదంతా.

స్వామి శప్తభూమి ఇలాంటి చారిత్రక కాలంలోంచి కాల్పనిక రూపం ధరించింది. చారిత్రక నవలల్లో రెండు ధోరణులు ఉంటాయని మాట వరసకి మనం అనుకోవచ్చు. ఒకటి: చరిత్రగా మనకు బాగా తెలిసిన, లేదా చరిత్రగా సాధికారికంగా నమోదై ఉండిన దాన్ని నవలగా కాల్పనీకరించడం, రెండు: చరిత్రగా మనకు తెలియని, లేదా తెలిసీ తెలియని దాన్ని నవలగా రాయడం. ఈ రెండో పని చాలా కష్టమైనది. అది రచయిత కాల్పనిక శక్తికి సవాల్‌ విసురుతుంది. అంతే కాదు, రచయిత చారిత్రక దృష్టిని అడుగడుగునా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ రెండూ సక్రమంగా లేకపోతే నవలా లక్షణాలు బాగా ఉన్నా చారిత్రక దృక్పథంలోనే లోపాలు కనిపించవచ్చు. చారిత్రక ఆధారాలు బాగా ఉండీ అంతగా నవల కాకుండా పోయే ప్రమాదమూ ఉండొచ్చు. నవల అనే మహాద్భుత మానవ ప్రక్రియ రచయితల సృజనాత్మకతను, చారిత్రకతను నిగ్గుదేల్చేస్తుంది.

నవల, కథా రచయితగా ఎంతో గుర్తింపు ఉన్న స్వామి ఇప్పటి దాకా సాధించిన విజయాలు ఒక ఎత్తయితే శప్తభూమి ఆయన కాల్పనిక, చారిత్రకతలను జేగేయమానంగా ఎత్తిపట్టింది. ఉదాహరణకు గతంలో కొమురం బీం, అంటరాని వసంతం నవలలు కూడా ఇలా మనకు ʹఅధికారికంగా తెలియని చరిత్ర ఆవరణలోకి వెళ్లి చారిత్రకను నిర్మించుకుంటూ, ఆ పునాదిపై గొప్ప కాల్పనిక రూపం ధరించాయి. ఇలాంటి నవలు మరి కొన్ని కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ శప్తభూమి.

స్థానిక చరిత్రలను రికార్డు చేసిన మెకంజీ కైఫియత్‌ల ఆధారంగా గురజాడ హండే అనంతపురం చరిత్ర అని ఎడిట్‌ చేసిన పుస్తకంలోంచి అనేక విషయాల ఆధారంగా ఈ నవల ఇతివృత్తం నిర్మాణమైంది. హండే వంశం అనంతపురం చుట్టుపక్కన ప్రాంతాలను 1569 నుండి 1811 దాకా పాలించింది. హండే హనుమప్ప నాయుడు మొదటి రాజు. చివరి వాడు హండే సిధ్ధరామప్ప నాయుడు. ఈ చివరి రాజు పరిపాలించిన రోజులు ఈ నవలా కాలం. అందుకే క్రీ.శ 1775లో అని నవల ఆరంభమవుతుంది. 1788 దాకా సాగుతుంది.

ఇదీ స్థూలంగా నవలా కాలం. చరిత్రగా పైకి కనిపించే వివరాలివి. ఇవి మనకు తెలిసిన చరిత్రలో భాగం. చరిత్రకు మనం ఇచ్చుకునే కచ్చితమైన నిర్వచనాల ప్రకారమైతే నిర్మాణం కావాల్సిన చరిత్రకు ఇవి కొన్ని ఆధారాలు. అనంతపురం నిజ చరిత్రలోకి నడవడానికి స్వామికి ఇవి కాలిబాటగా ఉపయోగపడ్డాయి. ʹచరిత్రʹ వివరాలు కొన్ని మాత్రమే తెలిసినప్పుడు చారిత్రక నవలలో రచయిత సృజనాత్మకతకు ఎక్కువ పనిబడుతుంది. చరిత్రను కాల్పనీకరించి సరిపెట్టుకుంటే కుదరదు. అసలు చరిత్ర ఏమిటో అన్వేషించే కాల్పనిక ప్రయాణంగా రచన సాగుతూ, దాన్ని పునర్నిర్మించాల్సి వస్తుంది. ఒక వైపు నుంచి చూస్తే జీవితంపట్ల రచయితకు ఉండే సృజనాత్మకతే చరిత్రను నిర్మిస్తుందా? అనిపించేంతగా ఈ ప్రక్రియ జరుగుతుంది. శప్తభూమికి ఉన్న ప్రవేశ మార్గాల్లో ఇదొటి. ఇదే చరిత్రకారులకు, సృజనాత్మక రచయితలకు ఉండే తేడా. ముఖ్యంగా కథ, నవల రాసే వాళ్లలో ఉండే ఊహాశక్తి వాస్తవికతను రచనగా పునర్నిర్మిస్తుంది. అట్లని చరిత్రకారుల్లో, ఇతరుల్లో సృజనాత్మకత.. ఊహాశక్తి ఉండదని కాదు. ఆ రంగాలు ఏర్పరుచుకున్న శాస్త్రీయ పద్ధతి, పరికరాలు అనే పునాది అనుమతించిన మేరకే వారి కృషిలో అవి వ్యక్తమవుతాయి.

కానీ కాల్పనిక రచయితలు వాస్తవికతతో వ్యవహరించే తలమే భిన్నంగా ఉంటుంది. అక్కడికి వాళ్లు ఎలా చేరుకుంటారు? దాన్నెలా గ్రహిస్తారు? తిరిగి దాన్ని ఎలా సాహిత్య రూపంలో పునర్నిర్మిస్తారు? అనే వాటికి రచయితలకు ఉన్న దారులే వేరు. అలాంటి ప్రయాణం చేసి వాళ్లు రాసిన సాహిత్యం చదివామంటే మనకు ఇదంతా నిజమే అనిపించేంత కాల్పనికంగా ఉంటుంది. అలా అనిపించడంలోని కాల్పనికతే ఆ రచన సాహిత్యకతకు గీటురాయి. వాస్తవికతను పునర్నిర్మించే ఈ ఊహ లేదా కాల్పనికతలను రచయితల్లోని చారిత్రక దృష్టి వడగడుతుంది. ఈ వడబోత ప్రక్రియ సక్రమంగా లేని రచయితల చేతిలో వాస్తవికత అభూత కల్పన అవుతుంది. చరిత్ర పేరుతో ఊహా కల్పనలకు దారి తీస్తుంది. దృక్పథ ప్రాధాన్యత ఇదే.

18వ శతాబ్దంలో అనంతపురం జిల్లా పరిసరాల్లోని హండే రాజుల పాలన, దానికి సంబంధించిన కొన్ని స్థానిక వివరాలు మాత్రమే చరిత్ర పేరుతో స్వామి ముందున్నాయి. వీటి ఆధారంగా ఆయన ఆనాటి వాస్తవ చరిత్ర అనదగిన దాన్ని ఎలా కాల్పనీకరించారు? లేదా తన కాల్పనిక శక్తిలోంచి ఇతివృత్తానికి ఉన్న చారిత్రకతను ఎలా నిర్మించారు? అనేదే ఈ నవలలోని అద్భుతం. ఎవరైనా ఈ నవలను విశ్లేషించదల్చుకుంటే మొదట చేయాల్సిన పని ఆదే. అదయ్యాక దాని ఆధారంగా మిగతా విశ్లేషణలెన్నయినా చేయడానికి దారులు దొరుకుతాయి.

నవల అయిపోయాక వెనుక పేజీల్లో స్వామి ʹఈ నవలను రాయించిన క్రమం ఒకటుందిʹ అనే వివరణ ఇచ్చిరు. అందులో ఆయన ఏమంటారంటే..ʹఈ నవలలోని సిద్ధరామప్పనాయుడు, కరిహుళి బసవప్ప, దళవాయి సుబ్బరాయుడు, చార్లెసు బ్రౌను, మాడల కందప్ప వంటి వారు ఒకప్పుడు నిజంగా జీవించి ఉన్న చారిత్రక వ్యక్తులు. కానీ ఈ చారిత్రక వ్యక్తులు పజ్జెనిమిదవ శతాబ్దానికి కాల సూచికలుగా మాత్రమే నవలకు ఉపయోగపడినారు.

ఎల్లప్పజెట్టి, కోడెనీలడు, ఇమ్మడమ్మ, మరియక్క, పద్మసాని, కోమటి పడుచు, బ్రాహ్మణ ఇల్లాలు, వీరనారాయణరెడ్డి, కంబళి శరభడు వంటి వారు పైన పేర్కొన్న వారి మాదిరి చారిత్రక వ్యక్తులు కారు. చారిత్రక పాత్రలు. ఈ చారిత్రక పాత్రలు చారిత్రక వ్యక్తుల నుంచి కాకుండా, చారిత్రక ఘటనల నుంచి కల్పించబడినాయి..ʹ అన్నారు.

నవల విశ్లేషణ చట్రాన్ని తయారు చేసుకున్నాక ఏ ప్రవేశమార్గం నుంచి అయినా లోపలికి పోవడానికి ఇది తాళం చెవిలాంటి మాట. సాంస్కృతిక, నైసర్గిక ప్రత్యేకతల వల్ల ఆ ప్రాంత సాహిత్యానికి, రచయితలకు ఉన్న సూటిదనానికి స్వామి ఈ మాట చెప్పడం ఒక ఉదాహరణ. నిజమైన చారిత్రక వ్యక్తులను కాల సూచికలుగా తీసుకొని, చారిత్రక ఘటనల నుంచి చారిత్రక పాత్రలను ఊహించారు. ఇది రచనా వ్యూహంగా కనిపిస్తుందిగాని వాస్తవానికి ఈ నవలలోని చారిత్రక కాల్పనికత, కాల్పనిక చారిత్రకతల మేళవింపుకు దోహదపడింది ఇదే. మామూలుగా కాల్పనిక సాహిత్యం నడిచేది అందులోని పాత్రల వల్లే. ఈ నవలలో చారిత్రక వ్యక్తులు కూడా కథ నడుపుతారుగాని అసలు కథ నడిపేది చారిత్రక పాత్రలే. వాళ్లలో చాలా మటుకు బహుజనులు, దళితులు. ఆనాటి చారిత్రక జీవితానుభవంలో దళితులకు, బహుజనులకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది ఈ నవలలోకి వెళ్లగల మరో ప్రవేశమార్గం. 18వ శతాబ్దంలో మనకు తెలియకుండాపోయిన అనంతపురం చరిత్రలో ఈ కులాల, వర్గాల జీవితం ఒకటి. వాళ్ల కష్టం, కన్నీళ్లు, సాహసం, త్యాగం, మొరటుదనం, మొండి నమ్మకాలు.. ఒకటేమిటి ఎన్నో ఆ కాలానికి సంబంధించినవి స్వామి చిత్రించారు. మనుషులు అట్లా ఉన్నారని చెప్పడం, ఎందుకు అలా ఉన్నారో ఆనాటి ప్రాకృత్రిక, సామాజిక, పాలనా, ఉత్పత్తి సంబంధమైనవన్నీ కనిపించేలా చెప్పడం ఈ నవలలో ఉన్న లక్షణం. తెలిసిన చరిత్రలోని వ్యక్తులను కాల సూచికగా తీసుకోవడం, వాటి ఆధారంగా నిజ చరిత్రను నిర్మించేందుకు కాల్పనిక పద్ధతిలో అప్పుడు ఉండదగిన పాత్రలను ఊహించడం, వాళ్ల జీవన చిత్రణ ద్వారా ఆ కాల చరిత్రను అందివ్వడం అనే జమిలి ప్రక్రియ ఈ నవలలో సాగింది. లేకపోతే హండే రాజుల చరిత్రగానే ఇది మిగిలిపోయేది. అప్పుడు నవలా నిర్మాణంలోకి తెలియని చరిత్ర వచ్చేది కాదు. దీని కోసం ఆయన వెచ్చిన కాల్పనికశక్తి వల్లే నవలా లక్షణాలను శప్తభూమి గొప్పగా సంతరించుకుంది.

వీటన్నింటి వల్ల ఇప్పటికీ రాయలసీమలో ఉండే ఒక రకమైన ప్రత్యేక సామాజిక స్థితికి 18వ శతాబ్దంలోని మూలాలు కనిపిస్తాయి. స్వామి ఎంత శక్తివంతమైన జీవన చిత్రణ చేశారంటే.. నవల చదువుతోంటే.. ఎవరికైనా ʹఓహో.. ఇందుకన్నమాట రాయలసీమ ఇట్లా ఉండేదిʹ అనిపిస్తుంది.

జీవితాన్ని.. దాని వాస్తవ-ఊహా తలాల్లోకి ప్రయాణించి అర్థం చేసుకొనే రచయితకు ఈ ప్రాంత చరిత్ర ఏమిటి? అనే ప్రశ్న రాయలసీమ ఉద్యమ ప్రేరణతో తలెత్తి ఉండొచ్చు. ఈ ప్రశ్న ఆయన సృజనాత్మకతకు పదును పెట్టింది. దాని అంచులపై నుంచి నవలలోకి చారిత్రకత ఒరుసుకొని వచ్చింది. అందుకే ఈ నవలా పఠనం గొప్ప అనుభవాన్ని, అన్వేషణా దృష్టి గల జ్ఞానాన్ని ఏకకాలంలో అందిస్తుంది. ఇంకోలా చెప్పాలంటే ఆ కాలపు చరిత్ర ఏమై ఉంటుంది? ఆ చారిత్రక ఆవరణలోని జన జీవితం ఎలా ఉండి ఉంటుంది? అనే గీటురాయి మీద ఈ నవల నిర్మాణమైంది. అదే సమయంలో వ్యక్తిగా స్వామిలో ఉండే ఒక రకమైన తాత్వికత (దాన్ని ఇక్కడ ఒక వాక్యంలో చెప్పడం బాగుండదు కాని..) కూడా నవలలోకి వచ్చింది. అది ఆధునిక పూర్వ, లేదా స్థానీయ తాత్విక ధారకు చెందినదా? ఆలోచించాల్సిందే. ఆధునికత స్పర్శ లేని ఈ నవలా కాలంలోకి, జీవితంలోకి మళ్లీ ఆయనే ఒక వెలుగు రేఖను ప్రసరింపజేస్తారు. ఇలాంటి ఎంట్రన్స్‌లోంచి కూడా నవలలోకి వెళ్లి ఆసక్తికరమైన విషయాలు చెప్పవచ్చు. ఉదాహరణకు హండే రాజుతో తనకు పుట్టిన కొడుకును పద్మసాని ఇంగ్లీషు చదువు కోసం మద్రాసు పంపిస్తుంది. అక్కడ మన్నారు దాసుకు బ్రౌన్‌ కలుస్తాడు. క్రైస్తవ మతంలోకి వెళతాడు. తన స్నేహితురాలు మేరీని పెళ్లి చేసుకంటాడు. అప్పటి దాకా దుర్భేద్యమైన దేశీయ కైవారంలో ఉన్నట్టనిపించిన రాయలసీమ చరిత్రలోకి ఇలాంటి మార్గాల్లో ఆధునిక పోకడ మొదలైంది. ఇది ఆ తర్వాత ఏమైంది? ఆనాటి దేశీయ స్థితిగతులతో అనంతపురం తెగతెంపులు చేసుకున్నదా? లేక అదే కొనసాగుతున్నదా? మార్పులు ఏమైనా వచ్చాయా? ఆనే ఆసక్తి కలిగాక కూడా ఇంతకూ అప్పుడేమైంది? అని మరోసారి నవలలోకి వెళతాం. అంత కాల్పనిక శక్తి, చారిత్రక దృష్టి రెండూ బలంగా ఉన్న నవల శప్తభూమి.

No. of visitors : 502
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •