నయీ పీష్వాయీ నహీ చలేగీ

| సాహిత్యం | వ్యాసాలు

నయీ పీష్వాయీ నహీ చలేగీ

- వరవరరావు | 03.07.2018 02:26:36pm

ఇపుడింక దళితులు టెరరిస్టులయ్యారు. నిషేధితులయ్యారు.200 సంవత్సరాల క్రితం పీష్వాలపాలనను అంతం చేసి అమరులైన దళిత, బడుగు వర్గాల యోధులను స్మరించుకున్నందుకు వాళ్లు నేరస్తులయ్యారు. దళితులు,ఆదివాసులు,ముస్లిం మైనారిటీలు, శివాజీ వారసులు ఇంకా తదితర బడుగు వర్గాల ప్రజలు ʹఎల్గార్‌ పరిషత్‌ʹ ఏర్పాటుచేసుకుని పూణెశనివారపు పేట వేదిక నుంచి 2017 డిసెంబర్‌ 31న ʹనయీ పీష్వాయీ నహీ చలేగీʹఅని వేలాదిమంది సభలో నినదించినందుకు నేరస్తులయ్యారు. నాగపూర్‌ నుంచి, ముంబై నుంచి, పుణె నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో శ్రోతస్వినులుగా ఎంతోదూరం సాగివచ్చి దేశ బహుళత్వానికి చిహ్నంగా ఎన్నో జెండాలతో తరలివచ్చి బ్రాహ్మణీయవివక్ష వ్యతిరేక జ్యోతిబా ఫూలే సంప్రదాయాన్ని, డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కులనిర్మూలన పోరాటాన్ని భుజాలకెత్తుకుఎన్నందుకు నేరస్తులయ్యారు. నలుపు, ఆకుపచ్చ వంటి ఎన్నోరంగుల పతాకాలలో కాషాయానికి కేవలం ఎరుపు కనిపించింది. ఏడురంగుల సింగిణిలోని ఐక్యత కాషాయానికి కంటగింపయింది. ఏడురంగులూ తెలుపు ఛాయలే అనే శాస్త్రీయ అవగాహన మాత్రం కాషాయ రంగుకు కేవలం ఎరుపుగా కనిపించింది.

1948నాటికే భారత పాలకవర్గానికి ఆజాదీ కోరిన కశ్మీరీలు, స్వయం నిర్ణయాధికారాన్ని కోరిన ఈశాన్య తెగల ప్రజలు దేశద్రోహులయ్యారు. టెరరిస్టులయ్యారు. జాతులుగా బ్రాహ్మణీయ హిందూజాతి శత్రువులయ్యారు.లౌకిక ప్రజాస్వామ్యమని రాసుకున్నప్పటికీ దేశ విభజన కాలంనుంచే ముస్లింలు ఈ దేశంలో ఉండదగనివారయ్యారు. యువకులయితే ఐఎస్‌ఐ ఏజెంట్లు, దేశద్రోహులు, టెరరిస్టులయ్యారు. నక్సల్బరీ రైతాంగపోరాట కాలంనుంచి ఆదివాసులు నక్సలైట్లయ్యారు. కనుక వీళ్లంతా టెరరిస్టు చట్టాలు వచ్చినప్పటి నుంచి రాజ్యందృష్టిలో టెరరిస్టులు, జాతి విద్రోహులయ్యారు.

సాంఘికంగా అంటరానివారుగా వెలివేతకు, వివక్షకు గురి అవుతూ నిత్యం దాడులు, అత్యాచారాలు, హత్యాచారాలకు గురవుతున్న దళితులు ఇపుడు రాజ్యందృష్టిలో దేశద్రోహులుగా టెరరిస్టులుగా మారిపోయారు. నిషేధితమావోయిస్టు పార్టీతో సంబంధాలున్నవారుగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ స్థితి మరీముఖ్యంగా నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక రాజకీయ ఆచరణగా మారి అది భీమా కోరేగావ్‌లో బీభత్స రూపాన్ని తీసుకున్నది.

2017 డిసెంబర్‌ 31 ప్రదర్శన తర్వాత 2018 జనవరి 1న వేలాదిగా తరలివచ్చిన దళితులపై దాడి,దౌర్జన్యం,హింస జరిగింది. అందులో ముగ్గురు దళితులు అమరులయ్యారు. ఈ దృశ్యానికి ప్రత్యక్ష సాక్షి ఒక దళిత మహిళ పోలీసుల వేధింపులు భరించలేక ఆరునెలలు పోయినాక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హింసా దౌర్జన్యాలనుప్రేరేపించినవాళ్లు ఇద్దరు ఆరెస్సెస్‌ కార్యకర్తలు. ఒకరు శంభాజీ భీడే.ఈయనను స్వయంగా మోడీ గురూజీ అంటాడు. ఆయనకు పద్మశ్రీ బిరుదుఇప్పించే ప్రయత్నం కూడా మహరాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరొరు మిలింద్‌ ఎక్బోటే. ఈ ఇద్దరిపై ప్రాథమిక నేరారోపణ కోర్టులో నమోదైంది.వాళ్లు ముందస్తు బెయిలు కొరకు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కానీ బెయిల్‌ లభించలేదు.

మరోవైపు జనవరి14వ తేదీన ముంబయిలో రిలయన్స్‌ కంపెనీలో పనిచేసే ఏడుగురు దళిత కార్మికులను వాళ్లవాళ్ల ఇళ్లల్లో అరెస్టు చేశారు. వీళ్లు ప్రదర్శనలో పాల్గని, హింసా దౌర్జన్యాలు రెచ్చగొట్టారని, చిత్రహింసలు పెట్టి వారం పది రోజులు పోలీసు లాకప్‌లో పెట్టుకుని యుఎపిఎ కింద కోర్టులో హాజరుపరిచి పూణె జైలుకు పంపించారు. ఈ ఏడుగురు తెలంగాణకు చెందినవారు.ప్రత్యేక తెలంగాణఉద్యమానికి క్రియాశీలంగా ముంబైనుంచి మద్దతు పలికినవాళ్లు.వీళ్లనే కాదు, సుప్రసిద్ధ రచయిత మచ్చ ప్రభాకర్‌ను కూడా ఈ నేరారోపణపై మహారాష్ట్ర యాంటీ టెరరిస్టు స్క్వాడ్‌ (ఎటిఎస్‌) చిత్రహింసలు పెట్టి వేధించినందున ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆరు నెలల కాలం గడిచిపోయింది. వీళ్లపై చార్జిషీటు కూడా వేశారు. మహారాష్ట్ర, పూణె సరిహద్దుల్లో నిర్మాణం అవుతున్న గోల్డెన్‌ కారిడార్‌ను ప్రతిఘటించడానికి మావోయిస్టులు దళాలను పంపించారని, వాళ్లతో సంబంధాలు పెట్టు కుని సహకరిస్తున్న వీళ్లు భీమా కోరేగావ్‌ ప్రదర్శనలో చేరి హింసా దౌర్జన్యాలు పురికొల్పారన్నది ఆరోపణ. అసలు బాధ్యులైన ఆరెస్సెస్‌ కార్యకర్తలిద్దరిని ఎందుకు అరెస్టు చేయరని మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి, పూణె నగరాల్లో ప్రజల నుంచి డిమాండ్‌ పెరగడంతో పాలకులు కొత్త పథకాన్ని రచించారు. ఏప్రిల్‌ నెలలో ఢిల్లీలోని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రజా సంబంధాల కార్యదర్శి రోనా విల్సన్‌ ఇంటిపై దాడి చేసి ల్యాప్‌టాప్‌, ఫోన్‌, ఇతర పరికరాలు ఎత్తుకెళ్లారు. అట్లే నాగపూర్‌లో సుప్రసిద్ధ న్యాయవాది ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్‌ (ఐఎపిఎల్‌) సెక్రెటరీ జనరల్‌ సురేంద్ర గాడ్లింగ్‌ ఇంటిపై దాడి చేసి ఆయన వద్దనున్న ఎలక్ట్రానిక్‌ సామగ్రినంతా ఎత్తుకెళ్లారు.

ఈలోగా మార్చ్‌ నెలలోని ఎస్‌.సి.,ఎస్‌.టి అట్రాసిటీ ప్రివెంటివ్‌ యాక్ట్‌ను నీరుగారుస్తూ సుప్రీంకోర్టు మార్చ్‌20నతీర్పునిచ్చింది.దేశవ్యాప్తంగా దళితులు,ప్రజాస్వామ్యవాదులు లక్షలాదిమంది సుప్రీంకోర్టు తీర్పుపై నిరసన తెలిపి ఏప్రిల్‌ 2న బంద్‌ పాటించారు.ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో ఈ ప్రదర్శనలపై జరిపిన పోలీసులకాల్పుల్లో 11 మందిదళితులు అమరులయ్యారు.

సుప్రీంకోర్టు తీర్పు అవకాశంగా తీసుకుని రోహిత్‌ వేముల (ఆత్మ)హత్య కాలం నుంచి న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులు పృథ్వి రాజ్‌, చందన్‌ మిశ్రాలను విజయవాడ నుంచి మార్చ్‌ ఆఖరున కిడ్నాప్‌ చేసి సెంట్రల్‌ యునివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పొదిలి అప్పారావు హత్యాప్రయత్నం కేసులో యుఎపిఎ, ప్రజాభద్రతా చట్టం, పేలుడు పదార్థాల చట్టం, కుట్ర మొదలైన సెక్షన్‌ల కింద జైలులో పెట్టారు. పృథ్విరాజ్‌ కృష్ణా జిల్లా విరసం సభ్యుడు కనుక కృష్ణాజిల్లా విరసం సభ్యులు అరసవెల్లి కృష్ణ, పెద్ది కృష్ణ, మేడక యుగంధర్‌, ఇతర ప్రజాసంఘాల నాయకులు, బండి దుర్గా ప్రసాద్‌ (అప్పటికే యుఎపిఎ, ప్రజాభద్రతా చట్టం, పేలుడు పదార్థాల చట్టం,కుట్ర మొదలైన నేరారోపణలపై డిఎస్‌యునాయకులు బద్రి, రంజిత్‌, సుధీర్‌లతోపాటు ఖమ్మం జైల్లో ఉన్నాడు.).తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేసి ఇపుడు వరంగల్‌లో న్యాయవాదిగా ఉన్న అనిల్‌కు, ప్రగతిశీల కార్మిక సంఘం (పి.కె.ఎస్‌)రెండురాష్ట్రాల బాధ్యుడు కొండా రెడ్డితోసహా 15మందికి చింతూరు డిఎస్‌పి దగ్గరికివచ్చి హాజరుకావలసిందిగా సమన్లు పంపారు. పృథ్వీరాజ్‌, చందన్‌ మిశ్రాలుఅరెస్టు అయి మూడు నెలలు కావస్తున్నా బెయిల్‌ దొరకలేదు. హైకోర్టులో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగి యుఎపిఎ చట్టాన్నే ప్రశ్నించినప్పటికీ జూన్‌ 18న బెయిల్‌ నిరాకరింపబడింది.

దళితుల పట్ల రాజ్యం ఒక రాజకీయ వ్యతిరేక వైఖరిని తీసుకుని వారిని టెరరిస్టులుగా చిత్రించి ʹఉపాʹ వంటి కేసుల్లో ఇరికించడం మాత్రమేకాదు,మావోయిస్టులతో సంబంధాలున్నాయనే పేరుతో దీర్ఘకాలం జైళ్లలోపెట్టడం, రాజ్యంగా చంపివేయడం కూడా ప్రారంభించిందని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో భీమ్‌ సేన నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ను కోర్టు విడుదల చేసిన తర్వాత కూడా వెంటనే అరెస్టు చేసి ఏడాదిపైగా జైళ్లో ఉంచారు. వేల సంవత్సరాలుగా దళితులపై వ్యవస్థీకృతమైన హింస ఇపుడు అదేస్థాయిలో రాజ్యహింసలో భాగమైంది. కిల్వన్మణి (1967), కారంచేడులు (1985) దళితుల పోరాట చైతన్యానికి, అదేస్థాయిలో రాజ్యహింసకు రెండు స్థాయిల్లోని ప్రతీకలనుకుంటే భీమా కోరేగావ్‌ ప్రమాద స్థాయికి చేరిన ప్రతీక. ఎందుకంటే దళిత పోరాటాల చైతన్యస్థాయి కూడా ఉనా నుంచి భీమా కోరేగావ్‌ వరకు విశాలం అవుతూ సమీకృతమవుతూ సంఘటితమవుతూ కుల నిర్మూలన చైతన్యం బ్రాహ్మణీయ ఫాసిజంలోని దళారీ స్వభావాన్ని ప్రతిఘటించే స్థాయికి చేరి నయీ పీష్వాయి నహీ చలేగా అనే చైతన్యంగా మారింది.

ఈ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌లతో పాటు సుధీర్‌ ధావ్‌లే, షోమాసేన్‌, మహేష్‌ రౌత్‌లనుకూడా అరెస్టు చేసి భీమా కోరేగావ్‌ కేసులో యుఎపిఎ కింద ముద్దాయిలుగా చూపడం.సుధీర్‌ ధావ్‌లే మూడు దశాబ్దాలుగా సాంస్కృతిక కార్యకర్త ʹవిద్రోహిʹ పత్రిక సంస్థ వ్యవస్థాపకుడు, రిపబ్లికన్‌ పాంథర్స్‌ నాయకుడు. షోమా సేన్‌ నాగపూర్‌ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ డిపార్ట్‌మెంట్‌, విమెన్స్‌ స్టడీస్‌ హెడ్‌. మహేష్‌ రౌత్‌ బి.డి. శర్మ స్థాపించిన భారత్‌ జన్‌ ఆందోళన్‌ నాయకుడు. ప్రధాన మంత్రి ఫెలోషిప్‌పై, ఆదివాసి సమస్యలపై టాటా ఇనిస్టిట్యూట్‌లో పరిశోధన చేసినవాడు. విస్థాపన్‌ విరోధి కమిటీ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు. గడ్చిరోలి ప్రాంతానికి చెందినవాడు. వీళ్లందరినీమావోయిస్టు పార్టీ ʹఅర్బన్‌ కనెక్ట్‌ʹ అనే పేరుతో పూణె కోర్టులో హాజరుపరిచి జూన్‌ 14వరకు కూడా పోలీసు కస్టడీకి తీసుకున్నారు. తిరిగి జూన్‌ 21 వరకు పొడగించారు. అధిక రక్తపోటుతో సురేంద్ర గాడ్లింగ్‌ను పూణె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. ఐసియులో పెట్టి గుండెకు యాంజియోగ్రామ్‌ కూడా చేయవలసి వచ్చింది. రోనా విల్సన్‌, సుధీర్‌ ధావ్లే, మహేష్‌ రావత్‌, ప్రొ. షోమా సేన్‌లను జూన్‌ 21న కోర్టులో హాజరుపరుస్తూ వాళ్ల దగ్గర దొరికిన ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషించిన తర్వాత మళ్లీ పోలీసు కస్టడీకి తీసుకునే అధికారం తమకు యుఎపిఎ కింద ఉంటుందని చెబుతూ జైలుకు పంపించారు. సురేంద్ర గాడ్లింగ్‌ పోలీసు కస్టడీ 14 రోజులు పూర్తికాలేదుకనుక మళ్లీ పోలీసు కస్టడీకి తీసుకున్నారు. జూన్‌ 25న కోర్టులో హాజరుపరచి జైలుకు పంపవచ్చు.

ఇది చాలదన్నట్లు రోనా విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టు పార్టీ కుట్రపథకంతో లేఖలు దొరికాయని తీవ్ర నేరారోపణలు చేశారు. ఈ లేఖల్లోని అసంబద్ధత ఎలాఉన్నా,మోడీ, ఫడ్నవీస్‌ల రాజ్యం డా.అంబేద్కర్‌ మనుమలు ప్రకాశ్‌ అంబేద్కర్‌, ఆనంద్‌ తేల్‌తుంబ్డే, కబీర్‌ కళా మంచ్‌ హరీష్‌ పొద్దార్‌ ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి, ఉమర్‌ ఖలీద్‌లతో పాటు జిగ్నేష్‌ మేవానీ మొదలుకొని ఎందరో దళితఉద్యమ నాయకులను,మేధావులను కూడామావోయిస్టులుగా పేర్కొని వాళ్లపై నిషేధ రాజకీయాలు అమలు చేసి ప్రజా స్వామిక స్వరాన్ని వినిపించకుండా చేయదలుచుకున్నదనేది స్పష్టం.

నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆయనను మావోయిస్టు పార్టీ ʹఅర్బన్‌ కనెక్ట్‌ʹ అన్నారు. ఆయనను, ఆయన సహచరులను ఆరుగురిని యావజ్జీవ శిక్ష వేసిజైలుకు పంపారు. ఇప్పుడు వీళ్ల అరెస్టు నాటి నుంచి వీళ్ల కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్‌ను తీవ్ర నేరారోపణలతో జైలుకు పంపారు. వీళ్లంతా దశాబ్దాలతరబడి దళితులు, ఆదివాసులు, ముస్లింమైనారిటీలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు మొదలైన పీడిత ప్రజల, శ్రమజీవుల హక్కుల గురించి మాట్లాడుతున్నవారు. ఈ సాధారణ ప్రజాబాహుళ్యంపై బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద ఫాసిస్టు దాడులు, హింసతోపాటు, వాళ్లనుంచి ఎదిగి వాళ్ల గురించి గొంతు విప్పుతున్న మేధావులపై కార్యకర్తలపై ప్రజాస్వామ్యవాదులపై కూడా ఒక బీభత్స దాడికి రాజ్యంపూనుకున్నదనడానికి భీమా కోరేగావ్‌ కేసు ఒక తాజా ఉదాహరణ.

ముఖ్యంగా దక్కవలసిన న్యాయాన్ని కుట్రపూరితంగా తిరగేసిన ఉదాహరణ. న్యాయపోరాటాన్ని నేరచర్యగా చిత్రించే దుర్మార్గం.

ముస్లింలకు దక్కవలసిన న్యాయం హిందూత్వ శక్తులకు దక్కిన మక్కా మసీదులో బాంబు పెట్టిన కేసుతో దీన్ని పోల్చవచ్చు. అది 2009లో ఒక శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ సమయంలో జరిగింది. అందులో ప్రార్థనకు వచ్చిన జన్నలమ్ముకుంటున్న పేద ముస్లింలు చనిపోయారు. ఈ సంఘటనతో విచలితులై వచ్చిన వేలాది మందిపై జరిపిన పోలీసు కాల్పుల్లో కూడా ముస్లింలే చనిపోయారు. ఈ బాంబు దాడికి బాధ్యులని పోలీసులు అరెస్టు చేస్తే మూడేండ్లు జైలులో మగ్గిన వాళ్లు, చిత్రహింసలకు గురైనవాళ్లు, ఆ తర్వాతనైనా జీవితాలే కోల్పోయినవాళ్లు కూడా ముస్లింలే. ఈ సంఘటనకు మేమే బాధ్యులం అంటూ ప్రకటించి అరెస్టు అయిన హిందూ వాహిని కరడుగట్టిన హిందూత్వ శక్తులు మాత్రం నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ తీర్పు స్పెషల్‌ కోర్టు జడ్జి మెడలు వంచి హిందూత్వ రాజ్యం ఇప్పించింది అనడానికి ఈ తీర్పు ఇవ్వగానే ఆ జడ్జి రాజీనామా ఇవ్వడమే తిరుగులేని ఉదాహరణ.

2009అంటే గ్రీన్‌హంట్‌ పేరుతో ప్రజల మీద యుద్ధం ప్రారంభమైన కాలం. మహరష్ట్ర శాసన సభల ఎన్నికలు కాగానే ఇది ప్రారంభమైంది. శ్రీలంకలో ఎల్‌టిటిఇ పై మారణకాండ జరిపి ప్రారంభించిన ప్రయోగం దండకారణ్యంలో ప్రవేశపెట్టిన కాలం. ఇప్పుడు ఇది పోరాట ప్రజలకు హిందుత్వ పాలక ʹసమాధాన్‌ʹగా, ʹఆలౌట్‌ వార్‌ʹగా ముందుకొచ్చిన 2018లో ఉన్నాం. ఈ యుద్ధం అటు కశ్మీరుకు యుద్ధ రూపంలోనే విస్తరించనున్నది. ఎందుకంటే మళ్లీ ఎన్నికల సమయం వస్తున్నది. ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి బలివితర్ధి, గెలిటన్‌.

ఇదే సమయంలో ʹఅర్బన్‌ మావోయిజంʹ పేరుతో ʹఅగ్నిహోత్రిʹ అనే ఒక రచయిత రాసిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కీలకమైన పోలీసు అధికారి బాధ్యతలు నిర్వహించిన అరవింద రావు ఆవిష్కరించడం యాదృచ్ఛికం కాదు.

జనవరిలో భీమా కోరేగావ్‌లో దళితులపై అరెస్సెస్‌ దాడులతో ప్రారంభమై, ఏప్రిల్‌ 2 దళితులపై పోలీసు కాల్పుల స్థాయికి వెళ్లి, అదే కాలంలో వైస్‌ చాన్సలర్‌ హత్యాప్రయత్నం అనే అభియోగం దగ్గర ఆగకుండా ఇప్పుడు ఇది ప్రధాన మంత్రి హత్యా ప్రయత్నం స్థాయికి వెళ్లింది. జనవరి నుంచి జూన్‌ దాకా ఈ దళిత-మావోయిస్టు సంబంధ నేరారోపణ వెనుక ఎంత ఫాసిస్టు కుట్ర ఉన్నదో ఊహించ వచ్చు. దీనినే ʹఎల్గార్‌ పరిషత్‌ʹ ʹనయీ పీష్వాయీʹ అన్నది. దీనిని సాగనిద్దామా.. ప్రతిఘటిద్దామా అని తేల్చుకోవలసిన తక్షణ సందర్భంలోకి దేశంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులురాజ్యంచే నెట్టబడ్డారు. విశాల ప్రజారాశులను కదిలించవలసిన కర్తవ్యం ఈనాడు ప్రజాస్వామ్యవాదులపై ఉంది.

No. of visitors : 778
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •