ఉండవలసిన తీరు -2

| సాహిత్యం | క‌థ‌లు

ఉండవలసిన తీరు -2

- పద్మకుమారి | 01.06.2016 10:37:59am

(గ‌త సంచిక త‌రువాయి)

సతీష్‌ టీ కప్పుతో గదిలోకి వచ్చి పంజాబీ డ్రెస్సులో, పాపిట సింధూరంతో ఉన్న ధనలక్ష్మిని చూచి ʹʹఓకే... చీర కట్టుకున్నారేమో... చెప్పలేదే అని గుర్తుకొచ్చింది. మన ట్రావెలింగ్‌కు ఇదే మంచిది. వెహికల్‌ రెడీగా ఉంది. ఇక్కడి నుంచి నాలుగు గంటల ప్రయాణం. మనం అడవి చూడానికి వెళ్తున్నాం. ఎవరైనా తెలిసిన వాళ్లకు మీరు నా చెల్లెలని చెప్తాను...ʹʹ అన్నాడు.

మాట్లాడుకుంటూ ఓ మారుమూల గ్రామం చేరుకున్నారు. అక్కడ ఓ చిన్న హోటల్‌లో టీ తాగడానికి ఆగారు. దాంట్లో ఐదారుగురికి కంటే ఎక్కువ మంది లేరు. ఆడమనిషి రావడంతో ఒక్కసారి చూసి మళ్లీ మాటల్లో పడిపోయారు. పర్వాలేదు.. అంతా ప్రశాంతంగానే ఉంది. రండి టీ తాగుదాం.. అన్నాడు ధనలక్ష్మితో.

ఓ మూలన టేబుల్‌ ముందు కూర్చొని టీ తాగుతోంటే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లను చూసి సతీష్‌ పలకరింపుగా నవ్వాడు. వాళ్లిద్దరిని ధనలక్ష్మికి వసంత్‌, రాజు అని పరిచయం చేశాడు. ఇద్దరికీ ముప్పైలోపే వయసు ఉంటుంది. బక్క పల్చగా చామన చాయలో ఉన్నారు. వాళ్లిద్దరు కూడా టీ తాగారు.

సతీష్‌ బిల్లు కడుతూ తమను ఎవరైనా గమనిస్తున్నారా? అని చుట్టూ చూశాడు. అక్కడున్న వాళ్లు ఎవరి మాటల్లో వాళ్లు ఉన్నారు.
ఇక బయల్దేరుదామా? అన్నట్లుగా ఆ ముగ్గురి వైపు చూసి బైటికి నడిచాడు. వాళ్లు అతడ్ని అనుసరించారు. కాస్త రోడ్డు మీద ముందుకు వెళ్లగానే, ʹమీరు నడుస్తూ ఉండండి. నేను ఇక బయల్దేరుతానుʹ అని సతీష్‌ అన్నాడు.

ధనలక్ష్మి గతక్కు మంది
మీరు మాతో రారా? అని అడిగింది బేలగా.
మళ్లీ కలుద్దాం.. అని సతీష్‌ వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాడు.
ధనలక్ష్మి దిగులుగా ఉండటం చూసి రాజు ʹఅక్కా మనం ఈ రోజు ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. పర్వాలేదా?ʹ అన్నాడు.
ఇబ్బంది ఏమీ లేదని అంది ధనలక్ష్మి.

*** *** ***

పొద్దువాలుతూ ఉన్నప్పుడు అడవి దారిలో ముగ్గురూ నడుస్తున్నారు. ధనలక్ష్మికి ఇలాంటి నడక అలవాటు లేదు. అడవిని అసలు చూడనే లేదు. తార్రోడ్డు మీదిలా ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఎత్తు వంపుల్లో, రాళ్ల మీద నడక చాలా కష్టంగా ఉంది. అది గమనించి ఆ ఇద్దరు కామ్రేడ్స్‌ ఆమెకు అడవి గురించి చెప్పడం మొదలుపెట్టారు.

రాజు ʹవర్షాకాలమైతే అడవి పచ్చగా చిక్కదనంతో అందంగా ఉంటుందక్కా. అయితే వానల్లో తడుస్తూ బురదలో దిగబడుతూ నడవడం కష్టమే. ఎండాకాలంలో నడక సుఖంగా ఉంటుంది. అయితే ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. అడవి పల్చపడటం, నీళ్లు ఇంకిపోవడంతో కామ్రేడ్స్‌ చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది..ʹ అని చెప్పసాగాడు.

ఏ చెట్టూ ఎప్పుడు పువ్వులు పూచేదీ, అవెంత మంచి వాసన వేసేదీ చెప్తున్నారు. వాగులు, వంకలు ఎప్పుడూ ఎట్లా పారేదీ చెప్పాడు వసంత్‌.
ధనలక్ష్మి నడకను బాలెన్స్‌ చేసుకుంటూనే వాళ్లు చెబుతున్న వాటిని ఆసక్తిగా వింటోంది.
ఆదివాసులు ప్రకృతిలో ఎాటు ఎట్లా పరవశించేది కూడా వాళ్లు చెప్పసాగారు.

గంట నడిచాక ఒక గ్రామానికి చేరుకున్నారు. ఇప్పుడే కదా అడవిలోకి చేరుకున్నాం. అంతలోనే చెట్ల మధ్యలో గ్రామం. ధనలక్ష్మికి చాలా చిత్రంగా తోచింది. అడవి చెట్లను అనుకొనే దడి కట్టి దానికి కర్రలతోనే గేటులాంటిది ఏర్పాటు చేశారు. అది తీసుకొని ఆ ముగ్గురు లోపలికి వచ్చారు. అంతా కలిపి పది ఇండ్లు ఉంటాయేమో. మొదటి ఇంటి ముందుకు రాగానే ఆగిపోయారు.
వసంత్‌ ʹజంగుబాయి... జంగుబాయిʹ అంటూ పిలిచాడు.

లోపలి నుంచి ఆ.. అంటూ ఓ మహిళ వచ్చి లాల్‌సలాం దాదా అని ముగ్గురికి చేతులు కలిపింది. వసంత్‌ ఆమెను కాస్త పక్కకు తీసికెళ్లి ఏదో మాట్లాడాడు. ఆమె ఇంటి తలుపు దగ్గరికి వేసి వసంత్‌తోపాటు వెళ్లింది.

మనవాళ్లు ఇప్పుడు ఇక్కడే ఉన్నారక్కా. వాళ్ల కోసమే వెళ్లారు అన్నాడు రాజు ధనలక్ష్మితో.
అన్నయ్య ఈ రోజే కలుస్తాడా? మనసులో అనుకుంది.
ʹభీమాల్‌ దాదా కూడా కలుస్తాడా?ʹ అని రాజును అడిగింది.
ʹతను ఇంకో రెండు రోజులకు గాని కలవడు. అంత దాకా మనం నడవాలి. .. అంటుండగానే ఇద్దరు సాయుధులైన కామ్రేడ్స్‌ అక్కడికి వచ్చారు.
మళ్లీ నడక మొదలైంది.

ఇందాక వచ్చిన దారిలోనే మళ్లీ వెనక్కి నడవడం మొదలుపెట్టారు. పది నిమిషాలయ్యాక దారి నుంచి కాస్త పక్కకు దిగారు. నాలుగు అడుగులు వేయగానే అవతలి వైపున చెట్టు చాటునుంచి సెంట్రీ కామ్రేడ్ బయటికి వచ్చి దళం ఉన్న డైరెక్షన్‌ చూపించాడు.
ఆ చెట్టు దాటి కొంచెం దూరం వెళ్లగానే కామ్రేడ్స్‌ కలిశారు. వాళ్లు ఆత్మీయంగా కరచాలనం చేసి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్లలాగా పలకరించారు.

ʹదారిలో ఇబ్బంది పడ్డారా?ʹ అని కమాండర్‌ అడిగారు.
ఏం చెబుతుందో అని ఆమె వైపే రాజు, వసంత్‌ చూశారు.
లేదన్నట్లుగా తలూపింది ధనలక్ష్మి.
ʹఇప్పుడు ఇక్కడే పడుకొని చీకటితోనే లేచి బయల్దేరుతాం. రేపు సాయంత్రం భీమాల్‌ వాళ్లను కలుస్తాం. మీరు ఈ రోజు కామ్రేడ్‌ సోని దగ్గర పడుకోండిʹ అన్నాడు.
ఆ రాత్రి అక్కడే పడుకున్నారు.
అంత మంది గెరిల్లాలను ఒకేచోట చూడటంతో ధనలక్ష్మికి వింత అనుభూతి కలిగింది. ఇక నుంచి తను కూడా వీళ్లలో భాగం. ఆ ఊహే మరింత వింతగా, ఉద్రేకంగా అనిపించింది. అలా పడుకొని ఆలోచిస్తోంది.
రాత్రి పదకొండు గంటల తర్వాత నెల పొడిచింది. దట్టమైన అడవిలో చెట్ల మధ్య అక్కడక్కడ వెన్నెల వెలుగు పరుచుకుని ఉంది. ధనలక్ష్మికి నిద్ర పట్టలేదు. అడవిలోకి ఇట్లా వచ్చి సాయుధ కామ్రేడ్స్‌ మధ్య పడుకుంటానని కలలో కూడా అనుకోలేదు. అమ్మ గుర్తుకొచ్చింది.

*** *** ***

ఉదయం లేచిన వెంటనే నడక ప్రారంభించారు.
చీమల బారులాగా అందరూ వరుసుగా ఫార్మేషన్‌లో నడవడం చూసి ధనలక్ష్మి .. ఎంత పద్దతిగా నడుస్తున్నారు? అనుకుంది. అయితే ఇలాంటి దృశ్యాలు టీవీల్లో చూసింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. ఆమెకు ఎక్కడ లేని ఆనందంగా ఉంది. ధనలక్ష్మి కూడా తన బ్యాగును కిట్ లాగా రెండు భుజాలకు తగిలించుకొని కమాండర్‌ వెనకాలే నడుస్తోంది. కామ్రేడ్స్‌ అందరూ తుపాకీ, కిట్ బ్యాగులతోపటు తలా ఒక వాటర్‌ క్యాన్‌ తగిలించుకున్నారు. కొందరు బరువైన మూటలను తలపైన పెట్టుకొని మోస్తున్నారు. అవి సరుకులు కావచ్చు.

నడక మొదలు పెట్టినప్పుడే రేపటి దాకా తన వెనకాలే ఉండాలని కమాండర్‌ చెప్పాడు. ఫైరింగ్‌ జరిగితే గాబరాపడకూడదని, నీ వెనకాలే ఉన్న సోని, రాజు రక్షణగా ఉంటారని, వాళ్లను వదలిపోకూడదని చెప్పాడు. ఆ సంగతి వాళ్లకు కూడా చెప్పాడు.

దట్టమైన అడవి మధ్య నుంచి ప్రయాణం సాగింది. గంట తర్వాత అడవి పల్చబడసాగింది. మొదట చలి అనిపించినా రాను రాను నడకలో వేగం పెరగడంతో చెమటతో బట్టలు తడిసిపోతున్నాయి. అలవాటులేని నడక మూలాన ధనలక్ష్మికి ఆయాసంగానూ, కష్టంగానూ ఉంది.

రెండు గంటల ప్రయాణం తర్వాత ముందు నడుస్తున్న పైలెట్ సైలెన్స్‌ అన్నాడు.

అందరూ అలర్ట్‌ అయినట్లు ధనలక్ష్మి గుర్తించింది.
ఇంకొద్ది దూరం నడిచాక తాము ఇంత వరకు నడిచింది కొండ ప్రాంతమని ధనలక్ష్మికి అర్థమైంది. కొండ కింద గ్రామం కనిపించింది.
ʹకామ్రేడ్స్‌ భోజనానికి ఇక్కడే ఆగుదాం.. టైం పదకొండు గంటలవుతోంది..ʹ అన్నాడు కమాండర్‌. ఒక కామ్రేడ్‌ను పిలిచి నీవు గూడేనికి వెళ్లి జానకిరాం, లింగు దాదాలను పిల్చుకొని రా.. అని చెప్పాడు. ఆ లోపు ఇక్కడ వంట అయిపోతుంది..ʹ అని పంపించాడు.

పక్కనే ఉన్న సోనీతో ధనలక్ష్మి మనం దారిలోనే ఉన్నాం కదా? ప్రమాదం ఏమీ లేదా? అని అడిగింది. అందుకు సోని ఇది దారి కాదు. ఆవులు తిరిగే దారి అని చెప్పింది. శత్రువు ఇటు వైపు రాలేడని, అందుకే ఇక్కడ ఆగామని చెప్పింది.

*** *** ***

గూడేనికి వెళ్లిన కామ్రేడ్‌తోపాటు ఇద్దరు యువకులు వచ్చి ఏదో సమాచారం ఇచ్చి వెళ్లారు. వాళ్ల గొంతును బట్టి ఏదో ప్రమాదం పొంచి ఉందేమో అని అనుమానం కలిగింది. అడగడానికి ధనలక్ష్మి మోమాటపడింది. మిగిలిన అన్నం మూట కట్టుకొని బయల్దేరుతుండగా కమాండర్‌ పరిస్థితిని వివరించాడు.

ʹఇందాక వచ్చిన గ్రామస్థులు చెప్పిన దాని ప్రకారం ఒక వంద మంది వరకు పోలీసులు రాత్రి ఈ గ్రామం పక్క నుంచి వెళ్లారు. వాగు ఒడ్డున ఉదయం వంటలు కూడా చేసుకున్నారట. అయితే వాళ్లు ఆ తర్వాత కనిపించలేదని చెబుతున్నారు. అందుకని మనం జాగ్రత్తగా అడవి లోపలికి వెళ్లి గ్రామాలు తగలకుండా రేపటి అపాయింట్ మెంట్ కు వెళ్లాలి. ఏదైనా జరిగితే మనం నిన్న అనుకున్న గ్రామానికి చేరుకోవాలి..ʹ అన్నాడు.
అక్కడి నుంచి గంట నడిచాక... ఒక చిన్న గుట్ట దాపున విశ్రాంతిగా కూచున్నారు. ధనలక్ష్మికి కొంచెం ఆందోళనతో వేగంగా నడవడం వల్ల అలసటగా ఉంది. ఒత్తిడి అనిపించింది. అయితే అక్కడ ఆగటం వల్ల ఇక ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు... అనుకుంది.
చిన్నగా కునుకుపట్టింది. ఢాం అన్న చప్పుడుకు ఉలికిపడి లేచింది.

అవతలి నుంచి ఫైరింగ్‌ మొదలైంది. అసలు అది తుపాకీ మోత అని ధనలక్ష్మి అనుకోలేదు. ఆమె తేరుకునే లోపే మిగతా కామ్రేడ్స్‌ మెరుపు లాగా అలర్ట్‌ అయ్యారు. అందరూ కవర్‌లోకి వచ్చారు. కమాండర్‌, ఆయన గార్డు, మరో నలుగురు కామ్రేడ్స్‌ అర్ధ చంద్రాకారంలో పొజిషన్‌లోకి వచ్చి కాల్పులు జరుపుతూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. అవతలి నుంచి గుండ్లవర్షం కురుస్తోంది. ఇటు నుంచి ఆచితూచి ఫైరింగ్‌ చేస్తున్నారు. అవతలి వైపు ఫైరింగ్‌ విరామంలో ఇవతలి వైపు నుంచి ఒక్కసారిగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు. శతృవు వైపు నుంచి కాల్పులు జరుగుతున్నా మోత దూరమైపోయింది. ఇటు వైపు నుంచి కాల్పులు చేస్తూనే రిట్రీట్ అయ్యారు.

ఈ మొత్తంలో ధనలక్ష్మికి తుపాకి మోతలు తప్ప మరేమీ కనిపించలేదు. రాజు ఫైరింగ్‌ చేస్తుండగా సోని ధనలక్ష్మి చేయి పట్టుకుని చెట్టు చాటుకు లాక్కపోయి తనూ ఫైరింగ్‌ మొదలుపెట్టింది. ఆ కామ్రేడ్స్‌ తనను ఎట్లా లాక్కుపోతున్నారో కూడా అర్థం కాలేదు. అప్పుడామెను తుపాకీ మోతలతోపాటు భయాందోళనలూ చుట్టుముట్టాయి. కిందపడ్డంతో మోకాలికి గాయమైంది. చేతి వేళ్లు నలిగిపోయి నెత్తురు కారుతోంది. అవన్నీ గమనించే స్థితిలో ధనలక్ష్మి లేదు. పడిపోయినప్పుడు ఎవరో కామ్రేడ్‌ అమాంతం పైకి లేపి తనతో పాటు పరుగు తీయించాడు.
అరగంటయ్యాక అవతల వైపు నుంచి ఫైరింగ్‌ ఆగిపోయింది.

దళంలోని ఇరవై రెండు మంది అటూ ఇటూ చెల్లాచెదరైనా ఒక చోట తిరిగి కలిశారు. కండ్లతోనే ఒకరి నొకరు పరామర్శించుకున్నారు. మొత్తం మీద ఎవరూ తప్పిపోలేదు. చిన్న చిన్న గాయాలైనా బుల్లెట్ గాయాలెవరికీ కాలేదు. అందరిలోకి ధనలక్ష్మే బాగా గాయపడింది. ఆమె స్థిమితంగా నిలబడి మాట్లాడలేకపోతోంది. ఈ గాబరాలో చున్నీ ఎక్కడో పడిపోయింది. ఓ కామ్రేడ్‌ నీళ్ళ బాటిల్‌ తీసి తాగమని మొదట ధనలక్ష్మికి ఇచ్చాడు.

కుడి చేయికి గాయం కావడంతో బాటిల్‌ ఎత్తలేక ఎడం చేత్తో అందుకుంది. మాట బైటికి రానంతగా గొంతు ఎండిపోయింది. ఆ సీసా నీళ్లు తాగేసింది. ఆ తర్వాత మిగతావాళ్ల సంగతి గుర్తుకొచ్చింది. అది గమనించిన ఆ కామ్రేడ్‌ ఏం ఫర్వాలేదు అన్నట్లు చూశాడు.
మళ్లీ నడక మొదలైంది.

సంజ చీకట్లలోంచి నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత రెండు గంటలకు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు సెంట్రీలను ఏర్పాటు చేసి అందరినీ పడుకోమని చెప్పాడు. ఎవ్వరినీ మాట్లాడవద్దని చెప్పి కమాండర్‌ ముఖ్యులతో సమావేశమయ్యాడు.

*** *** ***

ఇది అడవిలో రెండో రాత్రి.
ధనలక్ష్మి ఆకాశంలోకి చూస్తూ పడుకుంది. ఎదురు కాల్పుల స్థితి నుంచి మిగతా కామ్రేడ్స్‌ అప్పుడే బయటపడ్డారు. అసలు ఇదేమీ జరగనట్టుగా గాఢ నిద్రలో ఉన్నారు. బయటి ప్రపంచానికి ఎదురు కాల్పులనే మాట కేవలం టీవీ స్క్రోల్‌. అంతే. ఎదురు కాల్పులు ఎలా ఉంటాయో ధనలక్ష్మి ఇంకా అర్థం చేసుకుంటూనే ఉంది. ఇంత భయానకంగా ఉంటుందా? అనుకుంది. ఈ సంఘటనలో తనకేమైనా జరిగి ఉంటే..? ఆ ఊహతో ఆమె వణికిపోయింది. అడవిలోకి చేరకముందే మరణించడమా? తనకు ఇలా ముగిసిపోవాలని లేదు. ఇష్టపూర్వకంగా విప్లవంలో భాగం కావాలని వచ్చాక ఏదో కొంత పని చేశానన్న సంతృప్తి ఉండాలి కదా? తనకే కాదు.. తన వాళ్లకు కూడా. బాబుకు ఎక్కడో ఒక చోట అమ్మ లేకుండా...

... ఇలా ఆలోచిస్తుంటే దు:ఖం వచ్చింది. ఎందరు ఇలాంటి ఘటనల్లో అమరులవుతున్నారో కదా? తన అన్నయ్యే ఇలాంటి జీవన్మరణ పోరాటాన్ని ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. తను కొనసాగగలదా? అనే చిన్న అనుమానం ఎక్కడో కదిలినా.. వెంటనే దాన్ని తుడిచేసింది. ఇదంతా తెలిసీ అన్నయ్య రమ్మన్నాడు. ఆయన చెప్పాడని కాదు... తను ఇవన్నీ తెలిసే ఈ జీవితాన్ని ఎంచుకుంది. ఎంతగానంటే ఆసరాలేని తల్లిదండ్రులను కడుపున పుట్టిన బిడ్డను ఈ జీవితం కోసం, ఆశయం కోసం వదులుకుంది. తను వెనక్కి తిరిగి చూడకూడదు. తనచుట్టున్న కామ్రేడ్స్‌లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వాళ్లు తనకంటే శారీరకంగా దృఢంగా ఏమీ లేరు. అయితే మానసికంగా బలంగా ఉన్నారు.

ఇలా ఆలోచిస్తూ నొసటి మీద చెయి వేసుకోబోయింది. కుడి చేయి భరించలేని నొప్పి అనిపించింది. పడుకునే ముందే దళం డాక్టర్‌ అంతా శుభ్రం చేసి ఇన్‌జెక్షన్లు కూడా చేశాడు. దాని ప్రభావం తగ్గుతోందో, తనే ఆలోచనలతో పట్టించుకోలేదో.. కొద్దిగా అలా కదిలితేనే చెయి సలపరం పెడుతోంది.

తను ఎనిమిదేళ్లప్పుడు మామిడి చెట్టు మీదికెల్లి పడి సరిగ్గా ఇలాగే కుడి చేతి వేళ్లు చితికిపోయాయి. తనతోపాటు చెట్టు మీద ఉన్న అన్నయ్య గాబరాగా దిగి తనను చేతుల్లో మోసుకొని ఇంటికి తీసికెళ్లాడు. తన తప్పేమీ లేకపోయినా బాపుతో బాగా తన్నులు తిన్నాడు.
ʹనువ్వు చెడిందిగాక ఆడపిల్లను ఇట్ల చెట్లు పుట్టల ఎంబడి తిప్పుతావా? ఏ కాలో చెయ్యో విరిగితే ఎవడు చేసుకుంటాడు?ʹ అని అమ్మ కూడా త్టింది.

నిజంగానే ఏదో తప్పు చేసినవాడిలా తన చేతిని అన్నయ్య తన చేతిలోకి తీసుకొని తలమీద నిమురుతూ ఇంకెప్పుడు నీకు ఇట్ల కానియ్యనురా.. అని ఏడుస్తూ అన్నాడు.

ధనలక్ష్మికి నవ్వొచ్చింది.

అన్నయ్యకూఈ సంఘటన తప్పకుండా గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడూ తనకు చిన్న ఇబ్బంది కలిగినా గిలగిలలాడేవాడు. బాగా చిన్నప్పుడైతే మాట ఇచ్చాను కదా అని దెప్పిపొడిచేవాడు. అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు తప్పిన్లా..? ఇప్పుడు తనతో పాటు ఏకంగా ఈ అడవిలోకే వచ్చేసింది.

ధనలక్ష్మికి ఆ క్షణాన ఎందుకో అన్నయ్యను చూడక ముందే తనకు ఇందాక జరిగిన కాల్పుల్లో ఏమైనా జరిగి ఉంటే..? ఈ ఊహ రావడంతో అన్నయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా? ఇంట్లో సంగతులు చెప్తానా? అని ఆదుర్దాగా ఉంది. ఎట్లాగైనా వీలు చేసుకొని అమ్మాబాపులను పిలిపించమని అడగాలని అనుకుంది. ఎందుకంటే వాళ్లు అన్నయ్యను చూడక మూడేళ్లవుతోంది. అమ్మ చాలా దిగులుగా గడుపుతోంది ఈ మధ్య. ఎక్కడ ఎన్‌కౌంటర్‌ అయినా చనిపోయింది ఎవరో తెలిసే వరకు టీవీ ముందు నుంచి లేవడం లేదు. ఆలా తల్లిని తల్చుకుంటూ నిద్రలోకి జారుకుంది.

*** *** ***

ముఖం మీద సూర్య కిరణాలు పడటంతో నిద్ర లేచింది. అప్పటికే మిగతా కామ్రేడ్స్‌ టీ తాగుతూ కనిపించారు. ధనలక్ష్మి పక్కనే సోని కూర్చొని తుపాకీ తుడుచుకుంటోంది.

ʹనువ్వు టీ తాగావా?ʹ అని అడిగింది సోనీని.
ʹనాకు వేడి వేడిగా తాగడమే ఇష్టం. అందుకే పొయ్యి దగ్గరే కూర్చొని తాగొచ్చాను. మరి నీకు తేనా?ʹ అని అడిగింది.
ʹఅయ్యో వద్దొద్దు. నేను వెళ్లి ముఖం కడుక్కొని తాగి వస్తా ʹ అని లేచింది.
అందరూ టీలు తాగి నడక ప్రారంభించారు.

ఎండతోపాటు కడుపులో ఆకలి కూడా పెరగసాగింది. ఈ రోజు నడక పూర్తయ్యే సరికి అన్నయ్యను చూస్తాననే ఊహ రాగానే ఉత్సాహం దానంతట అదే శరీరాన్ని ఆక్రమించసాగింది. మోకాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మిగతా కామ్రేడ్స్ తో పోటీపడ్డట్లు నడవసాగింది.

ఓ రెండు గంటల ప్రయాణం తర్వాత బాగా అలసట అనిపించింది. ఆకలిగా ఉంది. మనిషి బాగా డీలాపడిపోయింది. నిన్న మధ్యాహ్నం తిన్న తిండి. ఎదురు కాల్పుల తర్వాత రాత్రి వంట చేసే పరిస్థితి లేకుండె. దగ్గర్లో ఉన్న గ్రామంలోకి వెళ్లిన కామ్రేడ్స్‌ వచ్చే సరికి ఏడు గంటలు దాటింది. అంతా బాగానే ఉందని సమాచారం రావడంతో ఇక నడక మొదలు పెడితే మంచిదని బయల్దేరారు.

దట్టమైన అడవి మధ్య నడుస్తున్నారు. నిన్నటిలా గోవుల బాటలో కూడా నడవడం లేదు. ఇవన్నీ జాగ్రత్తలేమో. ముందు ముందు వీటన్నికీ అలవాటుపడాలేమో. ఆలోచనల మధ్య కాలికి రాయి తగిలింది. అమ్మా అంటూ పడబోయింది. సోనీ చేయి ఆసరా ఇచ్చింది. కృతజ్ఞతగా ఆమె వైపు చూసింది. కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి అందుకోగలిగాం. లేదంటే మరో రెండురోజులు పట్టేది... అంటూ నడుస్తూనే చెప్పాడు.

ఈ మాటతో ధనలక్ష్మి ప్రయాణ బడలిక మర్చిపోయింది. రెట్టింపయిన ఉత్సాహంతో నడవసాగింది.

చదునైన ప్రాంతంలో దళం విశ్రమించింది. వేగంగా నడవడంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. చమటతో బట్టలు తడిసిపోయాయి. మాడుపై నుంచి చెమట కారి పడటంతో కళ్లు మండాయి. అలా తల వెనక్కి వాల్చి రిలాక్స్‌ అయింది.

అప్పుడు గమనిస్తే గ్రామం దగ్గర్లోనే ఉన్నట్లు చప్పుడు వినిపిస్తోంది. పిల్లల అరుపులతో సందడిగా ఉంది.

ఇద్దరు కామ్రేడ్స్‌ ఊళ్లోకి వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. మన వాళ్లు వచ్చారు. అవతలి వైపున ఉన్నారట.. అనడంతో దళం తిరిగి నడక ప్రారంభించింది.

సెంట్రీ ప్లేస్‌ను దాటుకొని ముందుకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులు గుమిగూడి ఉన్నారు. అంత దూరంలో ఉండగానే అక్కడి నుంచి ఓ కామ్రేడ్‌ ఎదురుగా వచ్చి నిన్న తెల్లవారుజామున దళం ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఫైరింగ్‌ అయిందని చెప్పాడు.

ఎవరైనా గాయపడ్డారా? అని కమాండర్‌ అడిగాడు.

ʹఅవును.. భీమాల్‌ దాదాకు సీరియస్‌గా ఉంది. అటు వైపున ఒక పోలీసు గాయపడి మనకు దొరికాడు. నిన్న ఇదే బ్యాచ్‌పైన కాల్పులు జరిగాయట. వెను తిరిగిపోతున్నప్పుడు మళ్లీ మనకూ వాళ్లకూ ఫైరింగ్‌ అయింది. ఇదంతా మనకు దొరికిన పోలీసు ద్వారా తెలిసింది. మీరెలా ఉన్నారో అని ఆందోళనతో ఉన్నాం. అందరూ క్షేమమేనా? అని అడిగాడుʹ ఆ కామ్రేడ్‌.

ఆయన ఆ ప్రాంతపు డివిజన్‌ సభ్యుడు.

ఆ మాటలు విని ధనలక్ష్మి అచేతనమైపోయింది. కమాండర్‌ ఆ మాటలు వింటూనే ధనలక్ష్మి వైపు చూస్తున్నాడు. సోనీ వెళ్లి కదిలించే వరకు ఆమెలో చలనం కలగలేదు. మెల్లగా ఆమెను వదిలించుకొని ముందుకు నడిచింది.

పదడుగుల దూరంలో రమేష్‌ మంచంలో అపస్మారకంగా ఉన్నాడు. పార్టీ డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. పొత్తి కడుపులో తూటా తగిలి కిడ్నీ భాగం నుంచి వెళ్లిపోయింది. బాగా రక్తస్రావం అవుతోంది. పరిస్థితి చేయి దాటిపోయిందని భీమాల్‌దాదాకు కూడా అర్థమైంది. అందుకే బయటికి పంపించే ఏర్పాట్లు వద్దన్నాడు. మధ్యలో రెండు సార్లు మాత్రం ʹమనవాళ్లు వచ్చారా? అంతా క్షేమమేనా?ʹ అని అడిగాడు.

మనిషి అపస్మారకంలోకి వెళ్తూ.. ఉలిక్కిపడి లేస్తున్నాడు. ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తున్నాడు.

ఊరి జనమంతా అక్కడే ఉన్నారు. అందరి కళ్లలో విషాదం గూడుకట్టుకొని ఉన్నది. ఏమవుతుందో అనే భయంతో ఉన్నారు.
ధనలక్ష్మి ఆ స్థితిలో అన్నయ్య రమేష్‌ను చూసి పోల్చుకోలేకపోయింది. తనకు తెలిసిన అన్నయ్య పోలికలను వెతుక్కునే ప్రయత్నం చేసింది. కనురెప్పలు సగం మాత్రమే తెరుచుకొని ఉన్నాయి. కడుపులోంచి రక్తం కారుతూనే ఉంది. ఆ స్థితిలో అతడ్ని చూసి భీతిల్లింది. అడుగు ముందుకు పడలేదు. పక్కనున్న కామ్రేడ్‌ ఆమె స్థితిని గమనించి ధనలక్ష్మి భుజం మీద చెయి వేసింది.
ఆమెను చూసి అతడి పెదవులపై సన్నని చిరునవ్వు కదలాడింది. కండ్లు మెల్లగా మూసుకపోయాయి.

(బిడ్డల్ని వదిలి, తోబుట్టువులతోపాటు యుద్ధరంగాన అమరులవుతున్న జాడి అన్నపూర్ణలాంటి వాళ్ల స్మృతిలో..)

(ముగిసింది)

No. of visitors : 1331
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప...
...ఇంకా చదవండి

‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు

పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ...
...ఇంకా చదవండి

పయనించిన పాట

పద్మకుమారి | 21.12.2016 12:01:15am

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ...
...ఇంకా చదవండి

విప్లవ వ్యక్తిత్వం

పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ......
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

త్యాగాల పరంపర

పద్మకుమారి | 17.07.2016 12:35:14am

కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని......
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి

రమాకాంత్‌ వాళ్లమ్మ

పద్మకుమారి | 17.11.2019 10:25:42am

ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •