ఊరుకుందామా?

| సంభాషణ

ఊరుకుందామా?

- అరణ్య కృష్ణ | 21.07.2018 11:34:02pm


పీవోడబ్ల్యు సంధ్య మీద సామాజిక మాధ్యమాలలో నడుస్తున్న ట్రోల్ గమనిస్తున్నారా? రాముడు, కృష్ణుడుకి సంబంధించిన విలువల్ని దాటి వచ్చామని, రాముడు, కృష్ణుడు చేసే పనులకి ఇప్పుడైతే భారతీయ శిక్షా స్మృతి కింద ఖైదు చేయొచ్చని ఆమె అన్న మాటలకి ఆమె ఫోటోలను పెట్టి మరీ ఆమెని వేటాడుతున్నారు. స్త్రీగా ఆమె వ్యక్తిత్వాన్ని కొన్ని వేలమంది మగానుభావులు సోషల్ మీడియాలో హత్య చేయాలని చూస్తున్నారు. ఆమెని క్రూరంగా రేప్ చేయాలట. మానాన్ని గునపాలతో పొడవాలట. పబ్లిగ్గా ఆమె తల నరకాలట. సజీవ దహనం చేయాలట. మొత్తం మీద ఆమెని చంపేసేయాలంట. ఆమె తల్లి గురించి, భర్త గురించి, ఇతర కుటుంబసభ్యుల గురించి...ఇష్టం వచ్చినట్లు ఎల్లల్లేని బూతు స్వైరకల్పనతో తమ సాంస్కృతిక మనోభావాల గంజాయి పంట పండిస్తున్నారు. ఒక స్త్రీ గురించి పచ్చి బూతులతో, హింసాత్మకంగా వెర్బల్ రేప్ కి పూనుకుంటున్నారు.

ఎంతైనా మనది స్త్రీలని గౌరవించే వ్యవస్థ కదా. తన స్వంత స్త్రీని అనుమానంతో అగ్నిప్రవేశం చేయించి, గర్భవతి అని కూడా చూడకుండా అడవుల్లో వదిలేయించిన, మరో స్త్రీకి ముక్కు చెవుల్ని కోసి, అవమానించే జెండర్ పరంగా క్రూరాతి క్రూరమైన, ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వానికి కొనసాగింపుగానే సామాజిక జీవితంలో వున్న సంధ్య వంటి స్త్రీల మీద జరిగే దాడిని చూడాలి. ఎంతైనా శీలానికి ప్రాధాన్యతనిచ్చే జాతి కదా మనది. మనకి స్త్రీల మీద ప్రేమ పుడితే అంగాంగ వర్ణనల ప్రేమ ప్రబంధాలు పుట్టుకొస్తాయి. భక్తి పరాక్ష్ఠతకి చేరితే దేవతల కుచాగ్రాల వర్ణనలతో సరస సుప్రభాత సాహిత్యం అంకురిస్తుంది. స్త్రీల మీద కోపం వస్తే లిఖిత/అలిఖిత బూతు పంచాంగాలు వెల్లువెత్తుతాయి. సృజనాత్మక హింసానందానికి పరాకాష్ఠగా భావించదగ్గ రచనలు వందలకు వందలుగా మందలకు మందలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అహో! ఇది స్త్రీలని గౌరవించే ఏకపత్నీవ్రతపు సౌశీల్యవంతుల మనోభావాలు. అవును వీళ్ళు అచ్చు నిర్భయ హంతకుల్లానే మనోభవిస్తున్నారు. వీలుంటే అలా చేయాలనే కుతూహలం "మా హిందూత్వం! మా జోలికి వస్తే, మమ్మల్ని విమర్శిస్తే ప్రాణాలు తీస్తాం" అనే ఈ ఆధ్యాత్మిక మనోభావ సంపన్నూలది.
*
మనది ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకుంటుంటాం కదా! అందుకోసమైనా మనం అప్పుడప్పుడూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవాలి. దౌర్భాగ్యం ఏమిటంటే డబ్బులు వెదజల్లి, కులాల కుంపట్లు ఎగేసి, మతాల చిచ్చుబెట్టి, దేశభక్తి బ్లాక్మెయిలింగులు చేసి వోట్లెలఛ్ఛన్ల ద్వారా మన దేశంలో పాలకులు అధికారంలోకి వస్తారు కాబట్టి, ఆ విధంగా ప్రభుత్వాలేర్పడతాయి కాబట్టి మనది ప్రజాస్వామ్యం అనుకుంటుంటాం. కానీ ఎలక్షన్లు అనే పద్ధతి (రాజకీయ) ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం మాత్రమే అని ఎంతమందిమి భావిస్తున్నాం? ప్రజాస్వామ్యమంటే ఎమ్మెల్లేలు, ఎంపీల లెక్కల ద్వారా ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాలు ఏర్పరచటం కాదని, అంతకు మించిన వ్యవహారమని ఎంతమందిమి విశ్వసిస్తున్నాం?

ప్రజాస్వామ్యం అనేది వ్యక్తిగత స్థాయిలోనూ, వ్యవస్థ స్థాయిలోనూ అమలు కావలసిన ఒక తాత్విక భావజాలం. భిన్న సంస్కృతులు, అవగాహనలు, సంప్రదాయాలు, భాషలు, విశ్వాసాలు కలిగిన అనేక ప్రజా సమూహాల మధ్య ఒక సామరస్య జీవనం సాధ్యపడాలంటే ఆయా సమూహాలన్నింటి మధ్య సామూహిక జీవనంలో భిన్నత్వం పట్ల, వైవిధ్యం పట్ల పరస్పర గౌరవం, సహనం వుండాలి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, మైనారిటీ అనేది ప్రభుత్వాల ఏర్పాటుకే తప్ప ప్రజా సమూహాల మధ్య ఆధిపత్యానికి సంబంధించినది కాదు. సమూహాల సైజుని బట్టి గౌరవం, ప్రాముఖ్యత, మాట చెల్లుబడి, ఆధిపత్యమో లేక లొంగి వుండటమో జరిగితే అది ప్రజాస్వామ్యం కాదు. మరీ ముఖ్యంగా కాలానుగుణంగా భౌగోళిక సరిహద్దులు మారుతూ, కొత్త జాతులు కలుస్తూ ఇప్పటి ఒక రూపంగా వున్న భారతదేశం వంటి భిన్న భౌగోళిక ప్రాంతాలు, సంస్కృతులు, భాషలు, యాసలు, సంప్రదాయాలు వంటి తీవ్ర భిన్నత్వం కలిగిన దేశంలో ప్రజాస్వామ్యం మనసా, వాచా, కర్మణా అమలవ్వాల్సిందే.

కానీ ఇప్పుడేం జరుగుతున్నది? మెజారిటేరియనిజం అనేది ప్రజాస్వామ్యంగా కీర్తించబడి ప్రజాస్వామిక స్ఫూర్తికి కీడు కలిగిస్తున్నది. మెజారిటీ ప్రజల విశ్వాసాల పేరుతో ఒక నియంతృత్వానికి మార్గం వేయబడుతున్నది. ఏ శాస్త్రీయ దృక్పథం, నాగరికత, అభివృద్ధి చేయబడిన పౌరసమాజ విలువలూ లేని పురాతన కాలానికి చెందిన ఆధిపత్య, రాచరిక, జెండర్ ఇన్సెన్సిటీవ్ కి ప్రతీకాత్మకంగా నిలిచి, ఇతిహాసానికి ఎక్కువగా చరిత్రకి తక్కువగా నిలిచిన పౌరాణిక పురుషుడు/పాత్రని ఆధారం చేసుకొని సంస్కృతి నిర్వచించబడుతున్నది. సామాజిక జీవనంలో శాస్త్రీయ దృక్పథం, మానవసంబంధాల్లో ప్రజాస్వామికత వెల్లివిరియాల్సిన సందర్భంలో మనం దాటొచ్చిన పురాతన, అనాగరిక, మోటు భావనలు విలువలుగా కీర్తించబడుతున్నాయి. ఆ మోటు నమ్మకాలే మనోభావాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.

నిజానికి ఈ పరిస్తితి ఒక అనివార్య దశ. ఇది ఒక పోరాట దశ. పురాణాలు, నమ్మకాలు, ఆచారాలు, వెలివేతలు, వివక్షల ద్వారా ఎన్నో వందల వేల సంవత్సరాల నుండి అమలవుతున్న కుల, లింగ ఆధిపత్యాన్ని హేతువుతో తిరగతోడి, చైతన్యంతో ప్రశ్నించి, ధిక్కారంతో కూలదోయాలన్న పురోగామి ఆలోచనల్ని మట్టుపెట్టాలన్న దురుద్దేశ్యమే ఈ "మనోభావాలు" వెనకనున్నది. రాముడు కేవలం ఒక కాల్పనిక దేవుడో, పురాణ పురుషుడో అయ్యుంటే ఇంత పేచీ లేదు. కానీ రాముడొక భావజాలం. సామాజిక చింతనాపరులు ఏ శివుణ్నో, వెంకటేశ్వరుణ్నో, వినాయకుణ్నో, కుమారస్వామినో కాకుండా రాముడినే ఎందుకు ఎక్కువగా విమర్శిస్తారంటే రాముడు కుల, లింగ వివక్షలకి, ఆధిపత్యాలకి ఆధ్యాత్మిక ఆమోద ముద్ర వేసే భావజాలమే కనుక. మిగతా దేవుళ్ళని సాధారణంగా హేతువాద దృక్పథంతో ఎదుర్కోవచ్చు కానీ రాముడిని మాత్రం సామాజిక చింతన ద్వారా మాత్రమే ఎదుర్కోవాల్సొస్తుంది. అనేక వందల సంవత్సరాల పాటు చాతుర్వర్ణ ధర్మం పేరుతో మూడు కులాలు కుమ్ముక్కై తమ జాతుల్ని అణగదొక్కినందుకు చదువుకున్నం చైతన్యవంతులైన వారు తమకు ధిక్కారస్వరంతో మాట్లాడక ఆధ్యాత్మిక తన్మయత్వంతో అర్ధ నిమీలిత నేత్రులై "మనోభావ సంపన్నులు"లా పులకరిస్తారా?
**

సంధ్య మాట్లాడిన విధానం నచ్చకపోతే అదే మాట చెప్పొచ్చు. కానీ అసలు ఒక అభిప్రాయం కలిగున్నందుకే చంపేస్తారా? మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో వున్నందుకు, ఈ మూడు దశాబ్దాల కాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు, ఆ తరువాత కూడా ప్రతి సామాజిక సందర్భంలో తన వాణిని, విశ్లేషణని వినిపించి, ఉద్యమాలతో మమేకమై, ఎన్నో కేసులు, లాఠీ దెబ్బలు భరించి, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో డ్రాఫ్టులు ఇచ్చి, కొన్ని వేల గృహ హింస కేసులలో బాధితులకు అండదండలు, మార్గదర్శకత్వం ఇచ్చినందుకు, ఉద్యమాల కోసం పిల్లలు వద్దనుకొని, ముగ్గురు అనాధ పిల్లల్ని పెంచినందుకు మాత్రమే మనం సంధ్యలాంటి వారిని కాపాడుకోవాలి అనటం లేదు. సమాజంలో మార్పు రాకూడదని, స్త్రీలు, అణగదొక్కబడ్డ కులాలకు చెందిన వారు ఎప్పటికీ ఆధిపత్య భావజాలానికి లోబడే వుండాలనే రాజకీయ ప్రణాళికని ఓడించటానికి మనం సంధ్యలాంటి వారిని కాపాడుకోవాలి. పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి వారిని మనం ఇంకేమాత్రం కోల్పోకూడదంటే ఇప్పుడు సంధ్య లాంటి వారిని కాపాడుకోవాల్సుంది.

గతంలో రంగనాయకమ్మ, చలం, శివసాగర్, కత్తి పద్మారావు వంటివారు కథలు రాసినా, విశ్లేషణ చేసినా, కవిత్వం రాసినా, మహోద్వేగ ఉపన్యాసాలిచ్చినా ఇంతటి దారుణ పరిస్తితుల్లేవు. వామపక్ష, పురోగామ ఉద్యమకారులే గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ, బోనాలెత్తుకుంటూ ఉద్యమాలు రాజకీయ స్ఫూర్తి పరంగా బలహీనమై పోయిన ఇవాల్టి సందర్భంలో ఈ అసహనం వెనుక మతాన్ని ఉపయోగించుకునే రాజకీయ వ్యూహముంది. తీవ్రమైన హిందూత్వ భావనలు లేని న్యూట్రల్స్ ని హిందూత్వ పరిధిలోకి లాక్కొచ్చి వోటు బాంకు బాలెన్సు పెంచుకోవాలనే కుట్ర వుంది ఈ వ్యూహంలో. పాలనలో ఘోరంగా విఫలమై, చెప్పటానికి అబద్ధాలు కూడా మిగలక, హామీలు జోకులుగా మారిన ప్రస్తుత సందర్భంలో మిగిలింది మతపరమైన ఉద్రిక్తతలు రేపి, కల్లోల భరిత ఉద్వేగాల్ని వోట్లుగా మార్చుకునే కుటిల రాజకీయమే!
**

మతమూ రాజకీయమూ కలిస్తే గూండాగిరి హల్చల్ చేస్తుంది. అదే ఇప్పుడు స్వామి అగ్నివేశ్ మీద కూడా దాడి చేసింది.

ఊరుకుందామా? ఏమీ ఎరగనట్లు గమ్మునుందామా?

No. of visitors : 1646
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •