గుండె గుండెతో చెప్పిన ఊసులు

| సంపాద‌కీయం

గుండె గుండెతో చెప్పిన ఊసులు

- పి.వరలక్ష్మి | 03.08.2018 10:44:59am

ʹమనిషి మనిషితో చేరి
మాట చేతగా మారి
చేయీచేయీ కలిపి
గుండె గుండెతో ఊసులాడ్డమే విప్లవంʹ అంటాడు చలసాని ప్రసాద్‌. అలా పంచుకున్న కొన్ని ఊసులు ఈ ఉత్తరాలు. ఇలా కొన్ని వేల ఉత్తరాలు రాసి ఉంటాడు. ప్యూర్‌ సాహిత్యజీవులనబడే వాళ్ల దగ్గరి నుండి, విప్లవ కార్యకర్తల దాకా చలసాని అనగానే అలా గుండెతో గుండెను ముడివేసిన స్నేహాన్నే గుర్తుచేసుకుంటారు. చలసాని స్నేహ ప్రపంచం చూస్తే మానవ జీవితం ఇంత విశాలంగా ఉండగలదా అని సంభ్రమానికి గురవుతాం. ఒక సాహిత్యజీవికి, సాంస్కృతికోద్యమ కార్యకర్తకు ఉండవలసిన విస్తృతి చలసానిని చూసి నేర్చుకోవాల్సిందే. ఆయనొక నమూనా అనవచ్చునేమో. నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమ సంచలనాల నుండి తెలుగునాట ఒక విప్లవ సాహిత్య సంస్థ నిర్మాణ ఆవశ్యకతను గుర్తించి పైన చెప్పినట్లు మనిషి మనిషితో కలిశాడు. శ్రీశ్రీ వంటివారిని విప్లవోద్యమ స్రవంతిలోకి మళ్లించి ప్రజల పక్షాన నిలిపాడు. శ్రీకాకుళ త్యాగాలు, విశాఖ విద్యార్థులు, చలసాని ప్రసాద్‌ వంటి శక్తులది తెలుగు సాహిత్య ఒరవడినే ప్రతిపక్షం చేసేసిన ఉద్యమ క్రియాశీలత్వం. విరసం ఆవిర్భాం నుండి తెలుగు సాహిత్యం కీలకమైన మలుపు తీసుకుంది. భాషను బహురూపాలుగా మెరిపించినా వ్యవస్థ పక్షాన నిలిచిన రచయిత రచయితే కాదని నిక్కచ్చిగా ఒక విభజన రేఖను గీసింది. ఆలోచనాపరులందర్నీ విప్లవోద్యమం ఎంతగా తాకిందో చలసాని ప్రసాద్‌ వంటి వ్యక్తులు అలా మనుషుల్లోకి చొచ్చుకుపోయారు.

సహజంగానే స్నేహాస్పదుడైన చలసానికి ఇటువంటి ఉద్యమ వ్యక్తిత్వం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎక్కడ ఏమూల ఏ మనుషులు తారసపడినా హృదయంలో కాసింత తడి ఉన్నవాళ్లంతా ఆయన దృష్టిలో ʹమనవాళ్లేʹ. మనవాళ్లే అని ఊరుకోడాయన. వాళ్ల కష్టసుఖాల్లో తాను పాలుపంచుకుంటాడు. అంత మాత్రమే కాదు, విరసంకో, విప్లవోద్యమానికో ఘడియో, అరఘడియే వాళ్లు వెచ్చించేలా చేస్తాడు. చలసాని చెప్తే ఏ పనైనా చేసేవాళ్లు ఉన్నట్లే చలసానికి చప్తే ఏ పనైనా అయిపోతుంది అనుకునే భరోసా కూడా ఉంటుంది. తననీ, కుటుంబాన్నీ, ప్రేమానుబంధాలను అన్నిటినీ విప్లవంలో భాగం చేసిన చలసాని ప్రసాద్‌కు ఒక మిత్రుడన్నట్లు మావోయిజం వే ఆఫ్‌ లైఫ్‌. ప్రత్యామ్నాయ విలువలు, విప్లవ సంస్కృతి జీవధారగా ఆయన జీవితం ఉద్యమంలోకి ప్రవహించింది. చలసాని ప్రసాద్‌ కమ్యూనిస్టుగా చరిత్ర గతిశీలతను ఆకళింపు చేసుకొని సామాజిక పురోగమన మార్గంలో తన కార్యకర్తృత్వాన్ని బాధ్యతగా, విలువగా, జీవనవిధానంగా నెరపినవాడు. భారత విప్లవోద్యమ చరిత్ర చలసాని ప్రసాద్‌ను ఇట్లా తనలో భాగం చేసుకుంటుంది. ఎందరెందరో పేర్లు కూడా తెలీని అద్భుత మానవులు ఈ చరిత్ర నిర్మాణంలో ఉన్నట్లే చలసాని చేసిన ఎన్నో తీర్ల పనులు ఇందులో ఉంటాయి.

సరిగ్గా తెలుగు సాహిత్య సాంస్కృతికోద్యమంలో కూడా చలసానిది విలక్షణమైన పాత్ర. చలసాని ఉద్యమ జీవితంలాగానే ఆయన సాహిత్య కృషిని అంచనావేయడానికి బహుశా కొత్త ప్రమాణాలు కావాలి. విరసం చలసాని సాహిత్య సర్వస్వం అచ్చువేస్తున్నది. కానీ ఆయన స్వయంగా పేరు పెట్టి రాసిన రచనలు మాత్రమే ఆయన సాహిత్య సర్వస్వం కాదన్నది స్పష్టం. ఇది ఎవరి విషయంలోకన్నా చలసాని విషయంలో ఇంకెంతో వాస్తవం. అచ్చైన రచనలే ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని పట్టివ్వవు. అరుణతార, శ్రీశ్రీ, కొకు రచనల సంపాదకత్వం దీనికి జోడించినా అదీ ఒక భాగం మాత్రమే. ఆయన విప్లవాన్ని, సాహిత్యాన్ని శ్వాసించాడు. మనుషుల్ని, పుస్తకాలను అపరిమితంగా ప్రేమించాడు. తానే ఎన్నోచోట్ల ఉదహరించినట్లు ʹBooks are the bloodless substitute for lifeʹ ʹకనుక మానవ జీవితపు లోతుల్ని విప్లవాచరణలోనూ, పుస్తకాల్లోనూ స్పృశించి పరవశించాడు. రెండిటిలోనూ మానవ సమూహం ఉంటుంది, జీవితంలోని గాఢత ఉంటుంది. ఆయన లైబ్రరీ మొదటిసారి చూసినప్పుడు ʹఇవన్నీ మీరు చదివారా సిపిʹ అని సరదాగా అడగాలనిపించింది. ఇప్పుడాయనను ఆయన పరోక్షంలో కొత్తగా చదువుతుంటే సిగ్గు, ఆశ్చర్యం కలుగుతోంది. ఇప్పుడీ ఉత్తరాలే తీసుకుందాం. దాదాపుగా ఉత్తరాల నిండా పుస్తకాల గొడవే. ఆయన పుస్తక సేకరణ అలా ఉంచితే రచయితలు, పాత్రలు ఆయనతో నిరంతరం కదలాడుతుంటారు. ఒక ఉత్తరంలో బెర్నాడ్‌ షా ప్రస్తావన వస్తుంది. ʹమాగ్బెత్‌లో ఆఖరి సీన్‌ని నవలగా మార్చి చూపించాడు, గడుసు వెధవʹ అంటాడు. మార్క్స్‌ గురించి బెర్నాడ్‌ షా ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుచేసి పొంగిపోతాడు. తనకిష్టమైన రచయిత మార్క్పిస్టు కూడా అయితే సంబరపడిపోతాడు. కాకపోతే కమ్యూనిస్టు కాకపోతేనేం, రచన గొప్పగా ఉంది కదా అని దానినీ అంతే ప్రేమిస్తాడు. రచయితలతో, పాత్రలతో కూడా స్నేహం చేసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లుగా ఆయన సంభాషణలుంటాయి. కన్యాశుల్కం పాత్రలతో విజయనగరమంతా చుట్టివస్తాడు. దేవదాసు కోసం ఎందుకన్నిసార్లు కళ్లనీళ్లు పెట్టుకుంటాడో అంతుబట్టదు.

జైలు నుండి ఇంటికి రాసిన ఉత్తరాల్లో పిల్లలకు సాహిత్యం చదవమని ప్రోత్సహిస్తాడు. వాళ్లు పరీక్షలు రాస్తుంటే ʹపరీక్షల బాధ పగవారిక్కూడా వద్దు. మెదడులో తేళ్లు, జెర్రులూ పాకినట్టు ఉంటుందిʹ అని దిగులుపడతాడు. స్వేచ్ఛగా వికసించాల్సిన జ్ఞానానికి ఇటువంటి కర్కశ బంధనాలు ఉండకూడదని, పర్షీలు లేని కాలం కోసం తన కలలను ఖైదు నుండే పంచుకుంటాడు. శ్రమజీవుల మాటల్లో, పల్లె పదాల్లో ఉండే భాషా సంపదను పట్టుకుని ఎందరితోనో పంచుకునేవాడు చలసాని. జైల్లో ఉన్నప్పుడు ʹఉగాదిʹ అనే కుర్రాడు పాడిన ʹకోడిపిల్లʹ పాటను రాసుకుని వెంటనే కృష్ణ్కకు పంపాడు. ఈ పాటను తర్వాత ఎన్నోసార్లు పాడి వినిపించాడు. సాధారణ ఖైదీలు మాట్లాడుకునే భాషలో పదాల సొగసును గురించి, సృజనాత్మకతను గురించి రాశాడు. పదకవితల దగ్గరి నుండి జనపదాల దాకా అచ్చమైన తెలుగు భాషను చలసాని పలవరించాడు. వివికి రాసిన ఒక ఉత్తరంలో తెలుగుకు ద్రవిడ భాషా మూలాలు కాదు, బస్తర్‌ గోండు భాష నుండి తెలుగు పుట్టిందనే ఆధారాలున్నాయని, దీని మీద పరిశోధన చేయాలనుకుంటున్నానని రాశాడు. గోండీ గురించి కుప్పలు తెప్పలుగా మెటీరిల్‌ పోగుచేస్తున్నానని కూడా రాశాడు. ఇక పరిశోధన విద్యార్థులకు, రచయితలకు చలసాని ఒక రిసోర్స్‌ పర్సన్‌. తానే శోధించడం మొదలుపెడితే భూగోళంలో ఏ ఆనవాలునూ వదిలిపెట్టడు. వివి అన్నట్లు చలసాని సాహితీ సంచార దీపం.

శ్రీశ్రీ, కొకు సమగ్ర సాహిత్యం వెలువరించడానికి ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. రెక్క విప్పిన రెవల్యూషన్‌ ముఖచిత్ర ఫోటో కోసం మూడు సంవత్సరాలు ప్యారీస్‌లో ఉన్న మిత్రురాలి వెంటపడి చివరికి సాధించాడు. విసిగిపోయి అన్నాడో, నిజంగా చేశాడో గాని దీని కోసం 300 లెటర్లు రాశానని బాబయ్యగారితో వాపోయాడు. శ్రీశ్రీ సముద్రంలో మునిగి, కొకు కీకారణ్యం అంతా తిరిగాడు. రావిశాస్త్రి నుండి తిలక్‌, విశ్వనాథల దాకా, ప్రాచీన సాహిత్యం నుండి దళిత సాహిత్యందాకా, షేక్స్‌పియర్‌ నుండి కాడ్వెల్‌, హ్యూగో, గూగీల దాకా వందల సముద్రాలు ఈదాడు. చలసానికి ఈత అన్నా ప్రాణమే. ʹమనది సాహిత్య, సామాజిక జీవితం. సాంస్కృతిక సముద్రం. అలసట ఎరగకుండా నిలువీత ఈదుదాంʹ అంటాడు.

ఈ ఉత్తరాల్లో ఆయన సామాజిక సాహిత్యతత్వం కనపడుతుంది. అనారోగ్యంపాలైనప్పుడు ʹనేనుపోతే పెద్ద నష్టం ఏమీ లేదుగాని, విరసం నాకప్పగించిన శ్రీశ్రీ, కొకుల వర్క్స్‌ అసంపూర్తిగా మిగిలిపోతాయని బెంగʹ అని రాశాడు.

ʹసాహిత్యానికి షాట్‌ కట్స్‌ లేవు. కీర్తికండూతికి ఉన్నవే అవి. ఆ కోవలోకి మనం చొరబడం. కనక ప్రాణాలు తేటగా ఉన్నాయి. మనసు పదిలంగా ఉంది.ʹ- ఇది చలసాని సాహితీ వ్యక్తిత్వం.

ʹప్రేమించడానికి నాకీ ప్రపంచం చాలడంలేదు
ఆత్మీయత పెంచుకోడానికి జీవితకాలం సరిపోదు

సిపికి మనుషుల పట్ల ఇంత ఆరాటం. తగనివారిపట్ల కూడా అహేతుక ప్రేమ కురిపించాడని చలసానిపై విమర్శ. ʹమందిలో తప్పులేదు. మనిషిలో లొసుగులున్నాయిʹ అంటాడాయన. ఆయన ప్రేమకు ఎదురుగా రాజకీయాలు ఉంటే మాత్రం చలసాని క్రమశిక్షణ గల కమ్యూనిస్టే. భూమ్యాకాశాలను పొట్టబెట్టుకున్నవారిని శ్రీశ్రీ ఎలా పొగడగలుగుతున్నాడు అన్నప్పుడు చలసాని బాధ ఎంతలా ఉండిందో గానీ శ్రీశ్రీ కాదు, ఛీఛీ అనాలనిపిస్తోందని రాశాడు. అతనిలోని విదూషకుడిని చావనివ్వు, భూమ్యాకాశాలను గేయం చేసిన మా శ్రీశ్రీ మాకు కావాలని కోరుకున్నాడు. ఆయనని శ్రీశ్రీ చలసాని అంటారేమో గాని ఆయన జనం చలసాని. జైల్లో హుసేన్‌ వంటి సాధారణ ఖైదీని అమితంగా ప్రేమించగల చలసాని. హుసేన్‌ విడుదలయ్యాక చలసాని కోసం వెతుక్కుంటూ వచ్చాడట. మరోసారి ఇంటిదాకా వచ్చి జీడీలు, అరటిపళ్లు, కాఫీపొడి తెచ్చిస్తాడు. హుసేన్‌ గురించి రాస్తూ చలసాని అంటాడు ʹవాడసలు నాలుకతో మాట్లాడడు, గుండెతో మాట్లాడతాడుʹ అని. మధ్యతరగతి అంతా బోలుగా ఉంటారు. అట్టడుగు జనంలోనే జీవిత రసాస్వాదన ఉంటుందంటాడు సిపి. అటువంటి జనం దగ్గరి నుండి మేధావి వర్గం దాకా సిపికి పరిచయమున్న అందరి వ్యక్తిగతంలో చలసాని ఒక స్పేస్‌ ఉంటుంది. పిల్లల్ని, పెద్దల్ని, సహచరుల్ని అందరినీ ముద్దు పేర్లతో పిలవడం, మొట్టికాయలు వేయడం ఆయనకే సాధ్యం.

కమ్యూనిస్టులైనవాళ్లు రాజకీయాల విషయంలో తప్పక విమర్శనాత్మకంగా ఉండాలి. విమర్శనాత్మకంగా ఉండటం అంటే శతృపూరితంగా ఉండటం కాదు. రాజకీయ భిన్నాభిప్రాయం ఉన్న ఒక మిత్రుడికి రాస్తూ I have very affectionate disagreements with you అంటాడు చలసాని. అసహనం ఉన్మాదం స్థాయిలో అలముకుపోతున్న స్థితిలో భిన్నాభిప్రాయం పట్ల అత్యంత ప్రజాస్వామికంగా ఒక్క చలసాని ప్రసాద్‌ వంటి విప్లవకారుడే ఉండగలడు. ప్రత్నామ్నాయ విలువలంటే అవే కదా! మరి సంస్థ నుండి తప్పుకున్నవారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ʹవాళ్లు మనవాళ్లే. పరిస్థితుల ప్రభావం వల్ల కొనసాగలేకపోయారు.ʹ చలసాని వైఖరి ఇది.

ముందే అన్నట్లు చలసాని కొన్ని వేల ఉత్తరాలు రాసి ఉంటాడు. ఇప్పటికి దొరికిన మేరకు ఎక్కువ భాగం అర్థరాత్రి నుండి తెల్లవారుఝూము మధ్య రాసినవే. వేళకానివేళలలో నిద్రకు వెలియై ʹగొండెలోని తడి గొంతులో ఉబకక, కాగితం మీద ఒలికినʹ కాసిన్ని అక్షరాల వెనక ఆవేదనంతా బహుషా సమూహం గురించిన చింతే. చారిత్రక కర్తృత్వాన్ని నిర్వహించిన వ్యక్తులు వారు వేసిన అడుగుల్లో చరిత్ర తాలూకు ఆనవాళ్లు వదిలి వెళతారు. భవిష్యత్తుకు వేసిన బాటల్లో కొనసాగవలసిన ఆచరణకు అనుభవజ్ఞానం అందించిపోతారు. చలసాని ప్రసాద్‌ చెప్పిన ఎన్నో ఊసుల్ని ఇంకా పోగుచేయవలసే ఉంది. ఇప్పటికివి మాత్రం అందించగలుగుతున్నాం.

(ʹచ‌ల‌సాని ప్ర‌సాద్ జాబులుʹ పుస్త‌కం ముందుమాట‌)

No. of visitors : 580
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •