ʹకత్తిరింపబడ్డ నాలుకల కలయికʹల కోసం తపించిన కవి

| సాహిత్యం | వ్యాసాలు

ʹకత్తిరింపబడ్డ నాలుకల కలయికʹల కోసం తపించిన కవి

- వరవరరావు | 03.08.2018 10:58:15am

ఈ మధ్యనే జైలులో నేను 3 నవంబర్‌ 2005లో రాసుకున్న డైరీని మళ్లీ చదువుకున్నాను. అది నా 65వ పుట్టిన రోజు. ఆ రోజే నా తెలుగు కవితల హిందీ అనువాదాలు కొన్నింటిని ʹసాహస్‌ గాధాʹ పేరుతో వాణీ ప్రకాశన్‌గారితో అచ్చువేయించిన స్వాధీన్‌ తన దీర్ఘ కవిత ʹకాల్‌ జయీʹ నాకు పంపించడానికి మా ఇంటికి వచ్చాడు. నా సహచరి, పిల్లలు నన్ను కలవడానికి వస్తున్నారని తెలిసి తాను కూడా వచ్చాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో అని హిందీలో రాసి ఆ దీర్ఘ కవిత పుస్తకాన్ని ఇచ్చాడు. నా అరెస్టుపై రాజేంద్ర యాదవ్‌ సంపాదక వ్యాఖ్య ఉన్న సుప్రసిద్ధ హిందీ సాహిత్య మాసపత్రిక ʹహంస్‌ʹ అక్టోబర్‌ సంచిక కూడా ఇచ్చాడు. స్వాధీన్‌, నుస్రత్‌ (మగ్దూం మొహియుద్దీన్‌ కొడుకు, కవి, కార్మిక సంఘ నాయకుడు)లు కలిసి తెస్తున్న ʹసంవాద్‌-సేతుʹ హిందీ పత్రికను కూడా ఇచ్చాడు.

ʹబయట ఉంటే పుట్టిన రోజు ఎట్లా జరుపుకుంటారు అని అడిగాడు స్వాధీన్‌ʹ

ఇంకా ఇట్లా చదువుకుని వారం రోజులు కూడా అయి ఉండదు. నిన్న శాంత సుందరి గారు ఫోన్‌ చేసి స్వాధీన్‌ చనిపోయాడటా మీకు తెలుసా అని అడిగింది. విభ్రాంతికి గురయ్యాను. తెలియదన్నాను. పట్నా నుంచి రాణాప్రతాప్‌ ఫోన్‌ చేసి చెప్పాడట. వివరాలు తెలియవు. ఆయన కూడా ఎక్కడో చదివాడు. రాత్రికి కాని అరకొర సమాచారం తెలియలేదు. రాజేందర్‌ రాజన్‌ అనే హిందీ రచయిత ప్రగతివాది లేఖక్‌ సంఘ్‌కు చెందిన వ్యక్తి సామాజిక మాధ్యమంలో రాసిన ఆర్ధ్రమైన ఒక చిన్న రచన తప్ప అప్పటికీ వివరాలు తెలియవు. తెలుసుకోవడానికి నా దగ్గర స్వాధీన్‌ ఫోన్‌ నెంబర్‌ తప్ప మరేమీ లేదు.

స్వాధీన్‌ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి రాజేందర్‌ రాజన్‌ సామాజిక మాధ్యమాల్లో జూలై 21న రాసిన చిన్న రచన అద్దం పడుతుంది. అది హిందీలో ఉంది.

ʹకవి స్వాధీన్‌(శశినారాయణ్‌ స్వాధీన్‌) హైదరాబాదులో ఈ ఉదయం మరణించాడు. నేను హైదరాబాదుకు నా ఈ ప్రియమిత్రుడి పిలుపు వల్లే వచ్చాను. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూనే ఆయన నన్ను తోడ్కొని పోవడానికి మరో రచయిత వంశీలాల్‌ను వెంటబెట్టుకుని రాత్రి పదిన్నరకు స్టేషన్‌కు వచ్చాడు. ప్లాట్‌ఫాం నెంబర్‌ రెండు మీదికి వచ్చి నన్ను చుట్టేసుకున్న ఆ పరిష్వంగం చేతులు విడిపించుకోవడానికి కూడా సాధ్యం కాలేదు. జ్వరంతో కాలుతున్న ఆ చేతుల్లోని వేడి ఎడతెగకుండా వస్తున్న దగ్గు తెరలు నా శరీరాన్ని, మనస్సును తాకుతూనే ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఎందుకు వచ్చావు అని అడిగాను. ఆయన భావోన్మత్తుడు గనుక ఆ మాట ఆయనకు నచ్చలేదు. ʹముందు నేను మిమ్మల్ని ఒక మంచి హోటల్‌కు తీసుకెళ్లాలి. తినిపించాలి. ఆ తర్వాత మగ్దూం భవన్‌లో వదిలిపెట్టాలి. అక్కడ ఇప్పుడే ప్రెస్‌ నుంచి వచ్చిన మీరు ముందు మాట రాసిన నా కవితాసంగ్రహాన్ని మీకు ఇవ్వాలి. అప్పుడుగాని 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి వెళ్లనుʹ అని అన్నాడు. అంతరాత్రి ట్యాక్సీలో మంచి భోజనం తినిపించడానికి ట్యాక్సీలో హోటళ్లు వెతుకుతూ పదకొండున్నరకు నాకు భోజనం చేయించి హిమాలయాలు ఎక్కినంతగా సంతోషపడ్డాడు. మగ్దూం భవన్‌కు తీసుకువచ్చి తన కవితాసంగ్రహం ʹకటీ జబానోంకి సంగ్‌ʹ(కత్తిరింపబడిన నాలుకల కలయిక) పుస్తకం నా చేతికి ఇచ్చాడు. రేపు ఉదయం కలుద్దామని చెప్పి వెళ్లిపోయాడు. శాశ్వతంగా వెళ్లిపోయాడు.

ఇవ్వాళ వేకువనే వంశీలాల్‌జీ రుద్ధ కంఠం ఈ దుర్వార్త వినిపించింది. నా పక్క గదిలోనే వచ్చి ఉన్న ప్రొ. అలీ జావెద్‌తో ఈ విషాద వార్త పంచుకున్నప్పుడు ఆయన ముఖంలో ఆ విభ్రాంతిని చూడగలిగాను. మరింత దు:ఖదాయకమైన విషయమేమిటంటే మేమందరమూ ఏ డాక్టర్‌ రాజబహదూర్‌ గౌడ్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చామో ఆయన అల్లుడు వృత్తి వల్ల డాక్టర, అకస్మాత్తుగా రాత్రి గుండె ఆగి చనిపోయాడు.

గుండెల మీద ఎవరో దు:ఖపు పర్వతాలు పెట్టినట్టుగా ఉంది. జోహార్లు చెప్పడం కన్నా ఇపుడు ఇంకేం చేయగలం.ʹ

ఆయన కన్నా అసహాయమైన స్థితి నాది. నేను హైదరాబాదులో ఉంటున్నప్పటి నుంచి పరిచయమూ, స్నేహమూ ఏర్పడిన కవి. ఖాన్‌ సాబ్‌ ఇంట్లో పరిచయమై స్నేహమైంది. హిందీలో చాల కవితా సంకలనాలు వెలువరించాడు. దాదాపు 50 పుస్తకాల దాకా రాశాడు. వాటిలో సాహిత్య విమర్శ, సాహిత్యకారుల సంస్మరణ, రాజకీయ చర్చ, పరిచయాలు, హిందీ భాష స్థితిగతుల గురించి ఒక బాధ్యత గల రచయిత, పత్రికా రచయిత ఎన్ని రాయగలడో అన్ని రాశాడు. ఇవన్నీ 52ఏళ్లనాటికే. స్వాధీన్‌ 1965 మే 5న పుట్టాడు. ఎన్నో పత్రికల్లో పనిచేశాడు. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఇదంతా హైదరాబాదులోనే. ఆ అన్నింటినీ 1989నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన కవిత్వం, తెలుగు, ఉర్దూ, గుజరాతీ, ఇంగ్లిషు, ఫ్రెంచ్‌ భాషల్లోకి అనువదితమైంది. అన్నింటికన్నా ముఖ్యం ఆయన నిష్కర్ష కలిగిన అభిప్రాయాలకోసం దేశమంతా హిందీ రచయితలకు ఆయన తెలుసు.

చాల సున్నితమైన, పురోగమన భావాలతో కూడిన కవిత్వం రాసి హిందీలో ప్రసిద్ధుడైన కవి. భావావేశపరుడు. ప్రగతిశీల్‌ లేకక్‌ సంఘ్‌లో క్రియాశీల సభ్యుడు. దేశవ్యాప్తంగా హిందీ రచయితలతో ప్రత్యక్ష పరిచయాలున్నాయి. నాంవర్‌సింగ్‌ మొదలుకొని విభూతి నారాయణ్‌ రాయ్‌ వరకు విస్తృతమైన పరిచయాలు, స్నేహాలు ఉన్నాయి. నక్సలైటు ఉద్యమం గురించి రాశాడు. కొండపల్లి సీతారామయ్య గురించి రాశాడు. ఇటీవలెనే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆయన ఆత్మకథను సుప్రసిద్ధ హిందీ రచయిత నెహ్‌పాల్‌సింగ్‌ ఆవిష్కరించిన హిందీ రచయితల సభలో నేను పాల్గొని ఆ పుస్తకం గురించి మాట్లాడాను. దిగంబర కవులు మొదలుకొని విప్లవ రచయితల వరకు ఆయన హిందీ పాఠకులకు వివిధ పత్రికల్లో పరిచయం చేశాడు. ఆయన దిగంబర కవుల గురించి అయినా, విప్లవ రచయితల గురించి అయినా, విప్లవోద్యమం గురించి అయినా హిందీ పాఠకులకు చేసిన పరిచయం వస్తుగతమైంది, వాస్తవమైంది అని చెప్పలేను గాని ఆ ఉద్యమాల పట్ల ఆయనకు ప్రగాఢమైన అభిమానం ఉన్నదని మాత్రం ఆయన ఆత్మకథతో సహా ఆయన రచనలను బట్టి చెప్పవచ్చు.

ఆయన ద్వారానే నాకు కవి నుస్రత్‌తో పరిచయం ఏర్పడింది. నుస్రత్‌ మగ్దూం మొహియుద్దీన్‌ కొడుకు. సున్నితమైన భావుకుడు, కవి. ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌ కూడా. మేనేజర్‌పాండే మొదలుకొని కంచన్‌ కుమార్‌ వరకు హిందీలోకి అనువాదం చేసిన నా కవితలతోపాటు తాను నుస్రత్‌ కలిసి చేసిన హిందీ అనువాదాలు కలిపి ఆయన ఒక కవితా సంకలనం తయారు చేశాడు. దానిని ʹవాణిప్రకాశన్‌ʹ ద్వారా అచ్చువేయించే ఏర్పాటు ఆయన చేశాడు. ఈలోగా నేను 2005 ఆగస్టు 19న అరెస్టు అయ్యాను. మొదటిసారిగా మావోయిస్టు పార్టీతో పాటు విరసం నిషేధించబడిన సందర్భం అది. కనుక నేను జైలులో ఉండగానే ఆ పుస్తకం వెలువడాలని కృషి చేశాడు. ʹసాహస్‌గాధాʹ పేరుతో ఆ పుస్తకం వెలువడడమే కాకుండా ఢిల్లీలో సాహిత్య అకాడమీ భవనంలో ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. నా ʹసహచరులుʹ (జైలు లేఖలు) హిందీలోకి అనువాదం చేయడానికి కూడా నా నుంచి అనుమతి తీసుకోవడానికి ఆయన జైలుకు వచ్చి కలిశాడు. నా సాహిత్య, రాజకీయ జీవితాన్ని పరిచయం చేస్తూ దానికి ఒక సుదీర్ఘమైన ముందుమాట రాశాడు. నా ఈ జైలు లేఖలు కూడా వాణిప్రకాశన్‌ ద్వారానే వెలువడింది. ఇరాక్‌పై అమెరికా దాడి కాలంలో నేను రాసిన కవితలను కూడా ఆయన హిందీలోకి అనువదించాడు. ఆయన మాతృభాష తెలుగు కాదు. హిందీ నుడికారం, కవిత్వ భాష తెలిసినంతగా ఆయనకు తెలుగు నుడికారం, కవిత్వ భాష తెలియకపోవచ్చు గాని కవి హృదయమున్నవాడుగా స్వయంగా కవిగా అనువాదంలో ఆయన హిందీ పాఠకులకు అందే భాషను ఎంచుకున్నాడు. స్వయంగా తన హిందీ కవిత్వంలో చూపే శ్రద్ధ అనువాదంలో చూపగలిగాడో లేదో నేను చెప్పలేను.

మా మధ్య ఎన్ని భావావేశపు కలయికలు జరుగుతూ ఉండేవో.

ముఖ్యంగా మరిచిపోజాలనిది మగ్దూం శతజయంతి సందర్భంగా ఆయన, నుస్రత్‌, నేను, నా సహచరి హేమలత ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)కు కలిసి చేసిన ప్రయాణం. అక్కడ ఆ సభ ఏర్పాటు చేసింది సత్యనారయణ్‌ పటేల్‌ అనే ప్రగతిశీల్‌ లేఖక్‌ సంఘ్‌కు చెందిన సుప్రసిద్ధ హిందీ రచయిత. ఆ సభలో మాత్రమే కాకుండా ఇండోర్‌లోనే మరోచోట అలీఘడ్‌ ఆలుమ్నీ (అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఇండోర్‌ వాసులు)ఏర్పాటు చేసిన మగ్దూం శత జయంతి సభలో కూడా మేం పాల్గొన్నాం. రెండవ రోజు 2007 మే 18న నేను ఇండోర్‌ టౌన్‌హాల్‌లో ప్రసంగించి బయటికి వస్తుండగా మీడియావాళ్లు ʹఇప్పుడే హైదరాబాదులో మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. మీ స్పందన ఏమిటి?ʹ అని అడిగారు. ʹహిందుత్వ రాజ్యం చేసి ఉంటుందిʹ అన్నాను. తర్వాతి కాలంలో రాజ్యం(అందులో న్యాయస్థానం కూడా షరీకై) బలమున్న హిందుత్వ చేసిందని రుజువైంది.

మేం అక్కడ దాకా వచ్చామని తెలిసి దగ్గరలోనే ఉన్న దేవస్‌ పట్టణం నుంచి కూడా మాకు ప్రగతిశీల్‌ లేఖక్‌ సంఘ్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. మర్నాడు మేం ఆ పట్టణానికి వెళ్లి ఒక హోటల్‌ రూములో ఉన్నాం. మా రాక తెలిసిన సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు మేం నక్సలైట్లమని, హిందుత్వకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చామని మా మీద దాడి చేయడానికి హోటల్‌ గదికి వచ్చారు. స్వాధీన్‌కు ఇటువంటి అనుభవం లేదు. కొంచెం గందరగోళ పడ్డాడు. సభకు మమ్మల్ని ఆహ్వానించినవాళ్లు హోటల్‌ బయట మాకోసం వేచి ఉన్న సంఘ్‌ పరివార్‌ శక్తుల దృష్టి పడకుండా తప్పించి తీసుకవెళ్లి, భోపాల్‌ వెళ్లే బస్సు ఎక్కించారు. స్వాధీన్‌కు హిందీ రచయితలతో ఉన్న విస్తృత పరిచయాల వల్ల భోపాల్‌లో ఆ రాత్రి ప్రగతిశీల్‌ లేఖక్‌ సంఘ్‌ అఖిల భారత కార్యదర్శి కమల్‌ ప్రసాద్‌ ఇంట్లో ఉన్నాం(ఆయనను నేను ప్రగతిశీల్‌ లేఖక్‌ సంఘ్‌ 60ఏళ్ల సభ సందర్భంగా హైదరాబాదులో కలిశాను కూడా. ఇరాక్‌పై అమెరికా దాడికి గుజరాత్‌లో మోడిత్వ మారణకాండకు వ్యతిరేకంగా జరిగిన ఆ సభల్లో ఊరేగింపులో నేను కూడా పాల్గొన్నాను.)

విభూతి నారాయణ్‌ రాయ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌గా వార్ధాలోని మహాత్మాగాంధీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయానికి వచ్చిన కొన్నాళ్లకు ఒక అఖిల భారతస్థాయి సాహిత్య సదస్సులో పాల్గొనడానికి నన్ను పిలిచాడు. అక్కడ సదస్సులోను, బహిరంగ సభలోను నేను పొరుగున దండకారణ్యంలో భాగంగా గడ్చిరోలిలో జరుగుతున్న విప్లవోద్యమం గురించి ʹఆ విప్లవోద్యమానికి ప్రాణభూతమైన ఆదివాసుల గురించి మీకు ఏమైనా తెలుసా? ఆ అడవి నుంచి వస్తున్న గాలులే మీరు పీలుస్తున్నారు. వాళ్ల నేల మీదనే మీ ఇంత అద్భుతమైన విశ్వవిద్యాలయ నిర్మాణం జరిగింది. ఆ ఆకాశం కిందే మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు. ప్రేమ్‌చంద్‌, రాహుల్‌ సాంకృత్యాయన్‌ సాహిత్యం చదువుతున్నారు. వాళ్ల సాహిత్యంలో బహుశా అటువంటి మట్టి మనుషులు ఆ ఆదివాసుల వంటి పోరాటాలు, ఆలోచనలే చేసి ఉంటారు. మరి ఆ చైతన్యాన్ని మీరు పొందుతున్నారా?ʹ అని అడిగాను. ఆ రెండు రోజులు చర్చల్లోనే కాదు, అక్కడి హాస్టల్స్‌లో నన్ను సమర్థిస్తున్న ప్రచారంలో స్వాధీన్‌ తన స్వాధీనంలో లేనంత భావావేశాలు ప్రదర్శించాడు. నన్ను తీసుకువెళ్లి నంవర్‌ సింగ్‌కు కలిపాడు.

ఆఖరుసారి ఆయనను చూడడం ఆయన ʹఆత్మకథʹ ఆవిష్కరణ సభలోనే. సరే ఈ జ్ఞాపకాలన్నీ అలా ఉంచుదాం. ఒక మనిషి, రచయిత, స్నేహితుడు నేను ఉన్న ఊరిలోనే చనిపోతే పట్నాలో ఉన్న మరొక రచయిత నుంచి కొండాపుర్‌లో ఉన్న మరొక రచయిత్రికి తెలిసి నాకు తెలియడమా. హిందీ సాహిత్యలోకానికి అంత పరిచయమైన నిఖిలేశ్వర్‌కు నా ద్వారా తప్ప జూలై 25 దాకా తెలియకపోవడమా. మమ్మల్ని పిలిచిన సత్యనారాయణ పటేల్‌కు కూడా నేనే ఫోన్‌ చేసి తెలుపడమా. ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లా.. అపరిచితంగా ఉన్నట్లా. సాంకేతిక విజ్ఞానం, సామాజిక మాధ్యమాలు ప్రపంచాన్ని అరచేతిలో పెట్టాయంటున్నాయిగాని చలన యంత్రాలు మనుషుల్ని కదలకుండా, కలవకుండా చేస్తున్నాయా. ఇరుగుపొరుగున్నే కాదు ఒక ఇంట్లోనే ఉన్నా మనుషులు కలవలేని స్థితి ఉందా. కూకట్‌పల్లి, ఆర్‌టిసి క్రాస్‌ రోడుకు కూతవేటు దూరంలో ఉన్నట్లా.. యోజనాల దూరంలో ఉన్నట్లా. స్వాధీన్‌ ఆఖరి కవితాసంకలనం ʹకత్తిరింపబడ్డ నాలుకలʹను కలుపాలనే తపనలో వచ్చింది. మనుషుల్ని కలిపే తపనలో ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నడి వయసులోనే ప్రాణాలు విడిచాడు. ఆ మనుషులు ఆయనను ఆఖరిసారి ఎంతమంది చూడగలిగారో కదా.

ఎందుకైనా మంచిదని సాహసించి స్వాధీన్‌ నెంబర్‌కే ఫోన్‌ చేశాను. అటువైపు ఫోన్‌ ఎత్తింది ఆయన సహచరి అనుకుంటాను. ఈ వార్త నిజమేనని, ఆయనకు శ్వాస సంబంధమైన సమస్య ఉన్నదని, 21వ తేది తెల్లవారుజామున ఊపిరి ఆడని స్థితి ఏర్పడితే ఆసుపత్రి తీసుకుపోయామని, అక్కడ అప్పటికే ఆయన ఊపిరి ఆగిపోయిందని చెప్పారని ఆమె చెప్పింది. ఊపిరి బిగబట్టి వినడం కన్నా చేయగలిగిందైనా, ఆమెకు చెప్పగల ఆశ్వాసమైనా ఏముంటుంది? సున్నిత మానవ సంబంధాలు చిత్రించిన ఆయన కవిత్వం మిగిలిందని చెప్పడం కన్నా.

(26.07.2018)

No. of visitors : 542
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •