ఎన్‌కౌంటర్‌ కుంటా (సుకుమా) నిజానిజాలు

| సంపాద‌కీయం

ఎన్‌కౌంటర్‌ కుంటా (సుకుమా) నిజానిజాలు

- - వరవరరావు | 15.08.2018 11:25:38pm


ఆగస్టు 6, చుండూరు దళితులను అగ్రవర్ణ ఆధిపత్యం ఊచకోత కోసి గోనె సంచులలో ఖండిత శరీరాలను తుంగభద్ర నదిలో విసిరేసిన రోజు, ముప్ఫై ఆరేళ్లు గడిచాక ఛత్తీస్‌ఘడ్‌ కుంటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగి పదిహేను మంది చనిపోయినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వారి మాటల్లోనే.. ʹʹఆదివారం సుకుమా జిల్లాలో నిఘా వర్గాల సమాచారం మేరకు రెండు దాడులు చేసాం. ఒకటి గొల్లపల్లి గ్రామం - కుంటా మధ్యన ఉన్న ప్రాంతం. అందులో జిల్లా రిజర్వుగార్డుకు చెందిన 200 మంది, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ వాళ్లు పాల్గొన్నారు. వాళ్లు ఆదివారం సాయంత్రం క్యాంపు నుంచి బయల్దేరారు. వీళ్లకు నల్కటోంగ్‌ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మావోయిస్టు క్యాంపు కనిపించింది. ఎదురు కాల్పులు జరిగాయి. అందులో 15 మంది చనిపోయారు. 16 ఆయుధాలు లభించాయి.ʹʹ డి.ఎం. అవస్థి, ఛత్తీస్‌ఘడ్‌ పోలీసుల నక్సలైట్‌ వ్యతిరేక కార్యకలాపాలు చూస్తున్న యూనిట్‌కు ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్‌ ఒక ప్రముఖ ఇంగ్లిషు పత్రిక ప్రత్యేక ప్రతినిధికి రాయపూర్‌ నుంచి చెప్పిన మాటలు ఇవి.

మావోయిస్టులు నిర్విచక్షణగా మొదట కాల్పులు ప్రారంభిస్తే తర్వాత భద్రతా బలగాలకు ఎదురు కాల్చక తప్పలేదన్నాడు బస్తర్‌ రేంజి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వివేకానంద సిన్హా-

ʹʹఎదురు కాల్పులు రెండు గంటల పాటు జరిగాయి. 15 మంది పురుష మావోయిస్టు శ్రేణుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాం. కాలులో బుల్లెట్‌ దెబ్బ తగిలిన మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నాం. ఆమెకు కుంటాలో చికిత్స చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో పని చేస్తున్న దేవా అనే ఒక సీనియర్‌ మావోయిస్టు కమాండర్‌ను తర్వాత అరెస్ట్‌ చేసాం. ఇది చాలా పెద్ద విజయం. ఈ ఘనత అంతా బస్తర్‌ ప్రాంతంలో పని చేస్తున్న పోలీసు యంత్రాంగానికే దక్కుతుంది. మా బలగాల నైతిక శక్తిని ఈ సంఘటన చాలా పెంచుతుందిʹʹ అన్నాడు సిన్హా.

ఈ మావోయిస్టు శ్రేణులు మూడు వేర్వేరు మిలిటరీ విభాగాల్లో పని చేస్తున్నాయి. ఈ మూడు ప్లటూన్లు కొంటా, బెజ్జి, గొల్లపల్లిల మధ్యన తెలంగాణ సరిహద్దులో పని చేస్తూన్నాయి.

ఈ ఇంగ్లిషు దినపత్రికలో మావోయిస్టుల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామాగ్రి ఫోటో, జవాన్‌లతో పాటు వేసారు.

రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ అని, ఒకే ఘటనలో ఇంత మంది నక్సల్స్‌ మృతదేహాలు లభ్యం కావడం మొదటిసారని ప్రత్యేక డిజిపి డి.ఎం. అవస్థి విలేఖరులతో పేర్కొన్నట్లు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది.

దాడికి వెళ్లిన పోలీసు బలగాల్లో సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా దళ సభ్యులు కూడ ఉన్నట్లు డిజిపి చెప్పాడని ఈ పత్రిక రాసింది. సుకుమా జిల్లా కుంటా బ్లాక్‌ నాల్కాటాంగ్‌ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం మావోయిస్టు శిబిరం కనిపించినట్లు, ఇరుపక్షాల నడుమ అరగంట పాటు కాల్పులు జరిగాయని ఈ పత్రిక రాసింది. ఘటనాస్థలంలో(నే) మావోయిస్టు ప్రాంతీయ కమిటీ సభ్యుడొకరు, ఒక మహిళా నక్సల్‌ గాయాలతో కనిపించారని అవస్థి చెప్పినట్లు ఈ పత్రిక రాసింది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఫ్లటూన్‌ కమాండర్‌ పంజా హుంగా సహా 12 మందిని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కుంట పోలీసుస్టేషన్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అడవుల్లోకి బయల్దేరిన రెండో పోలీసు బృందం గాలింపును కొనసాగిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకూ 86 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అవస్థి చెప్పారని కూడ ఈ పత్రిక రాసింది. ʹమావోయిస్టుల మృతదేహాలు అని ఆరుగురి ఫోటోలు పోలీసుల అదుపులో గాయపడి ఉన్న మహిళా మావోయిస్టు ఫోటో కూడా ఈ పత్రిక వేసింది.

ఛత్తీస్‌ఘడ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌ - 15 మంది నక్సల్స్‌ మృతి అని మొదటి పేజీలోనే పెద్ద అక్షరాలతో శీర్షిక పెట్టి ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలిందని పత్రిక వ్యాఖ్య.

మరో తెలుగు దినపత్రిక కూడ మొదటి పేజీలోనే ఎన్‌కౌంటర్‌ - ఛత్తీస్‌ఘడ్‌లో 14 మంది మావోయిస్టులు హతం, 16 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం అని రాసింది. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో అటవీ ప్రాంతం మరో మారు కాల్పులతో దద్దరిల్లింది అని సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ అని ఈ పత్రిక రాసింది. ఈ పత్రిక బస్తర్‌ ఐజి వివేకానంద తెలిపిన ప్రకారం అని రాసింది. ఈ పత్రిక, మరో తెలుగు దినపత్రిక కూడా మృతుల పన్నెండు మంది పేర్లు ఇచ్చినవి. వీళ్లంతా ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన వాళ్లేనని మరో ఇద్దరిని గుర్తించాలని రాసింది. ఈ ఒక్క పత్రికయే గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించినట్లు ఐజి వివేకానంద, డిఐజి రతన్‌లాల్‌ డాంగీ తెలిపారని రాసింది. ఘటనను సుక్మా ఎస్పీ అభిషేక్‌ మీనా పర్యవేక్షిస్తున్నట్లు రాసింది.

మరొక తెలుగు దినపత్రిక 15 మంది నక్సల్స్‌ కాల్చివేత అని, భారీ ఎన్‌కౌంటర్‌ అని, పోలీసులకు చిక్కిన వారు నలుగురని రాసింది. ఈ రెండు పత్రికలూ దగ్గరి, దూరపు దృశ్యాలుగా పూర్తిగా పాలిథన్‌ కవర్‌లలో ముఖాలు కూడా కనిపించకుండా కూరిన మృతదేహాల ఫోటోలు ప్రచురించాయి. ఈ పత్రిక పోలీసు తుపాకి గర్జించింది అని రాసింది. ఈ పత్రిక కూడా సోమవారం అని రాసింది. ఒక మహిళా మావోయిస్టు సహా గాయపడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాసింది.

ఘటనాస్థలంలో 16 నాటు తుపాకులు, భారీగా ఐఈడీ, డెటోనేటర్‌ పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, పోస్టర్లు, మందులు, విద్యుత్‌ వైర్లు, నిత్యావసర సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఈ పత్రిక రాసింది.

ఈ పత్రిక వివేకానంద, రతన్‌లాల్‌ డాంగీ, అవస్థి - ముగ్గురూ ఇది పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా తమకు చెప్పినట్లు రాసింది. గొల్లపల్లి, కుంటల మధ్య బంగా, నులకతోగు గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో 200 మంది మావోయిస్టులు బస చేసారని ఇంటిలెజన్స్‌ నుంచి అందిన సమాచారంతో సోమవారం తెల్లవారు జామున పోలీసులు అక్కడికి చేరుకొని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. అయితే అప్పటికే పక్కా వ్యూహంతో బలగాలు నలువైపుల నునిచి కాల్పులు ప్రారంభించి మావోయిస్టులను చుట్టుముట్టారు. అరగంటకు పైగా జరిగిన కాల్పుల్లో మొత్తం 18 నుంచి 20 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారుʹ అని ఈ పత్రిక అదనంగా రాసింది.

మరొక దినపత్రిక రెండవ పేజ్‌లో అయినా చాలా వివరంగా ʹదద్దరిల్లిన దండకారణ్యంʹ అనే శీర్షికలో ఛత్తీస్‌ఘడ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ అని రాసింది. ముఖాలూ, ఛాతీ కనిపించేలా రెండు మృతదేహాల ఫోటోలు (మైనర్లుగా కనిపిస్తున్నారు), సంఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు - అని మరో ఫోటో వేసింది. దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లిందని మిగతా వివరాలు రాస్తూ మరికొందరి పారిపోయినట్లు సుక్మా ఎస్పీ అభిషేక్‌మీనా తెలిపారు అని ఈ దినపత్రిక రాసింది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు అటవీ ప్రాంతమని, 200 మంది సిఆర్‌పిఎఫ్‌, డిఆర్‌జి, ఎస్టీఎస్‌ బలగాలు సంయుక్తంగ కూంబింగ్‌ నిర్వహించాయని ఈ పత్రిక రాసింది. సుమారు గంటకు పైగా కాల్పులు జరిగినట్లు రాసింది.

పత్రిక 12 మంది పేర్లు రాసి, ముగ్గురు పేర్లు తెలియాల్సి ఉందని రాసింది. ఈ పత్రిక దొరికిన 16 ఆయుధాల వివరాలిచ్చింది. 12 నాటు తుపాకులు, ఒక 305, ఒక 12 బోర్‌, 315 బోర్‌, పిస్టల్‌, కత్తి ఉన్నాయి. అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు ముగిసిన రెండు రోజుల్లోనే మావోయిస్టులకు భారీస్థాయితో నష్టం జరగడం గమనార్హం అని ఈ పత్రిక వ్యాఖ్యానించింది. పట్టున్న చోటే మావోలకు ఎదురు దెబ్బ అని ఈ పత్రిక ఒక బాక్స్‌ ఐటమ్‌ కూడ రాసింది. మావోయిస్టులకు గట్టి పట్టున్న (లిబరేటెడ్‌ జోన్‌) ప్రాంతంలోకి దూసుకెళ్లిన జవాన్లు కోలుకోలేని దెబ్బ తీశారు. ఈ ప్రాంతానికి జవాన్లు తొలిసారిగా వెళ్ళి భారీ ఆపరేషన్‌ చేపట్టారని నక్సల్స్‌ ఆపరేషన్‌ డిజిడిఎం అవస్థి తెలిపారు. సుమారు 20 కిలోమీటర్ల మేర కాలినడకన మూడు కొండలు దాటి మావోయిస్టుల ఆచూకీ కనుగొన్నారని అన్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే అత్యంత సురక్షిత ప్రాంతంలో మావోయిస్టులు 15 మందిని కోల్పోయినట్లుగా తెలుస్తుంది. గోంపాదు, బాలాతోంగ్‌ మిన్‌దా ఏరియాలకు చెందిన మిలిషియా కమిటీలు సంయుక్తంగా క్యాంపు నిర్వహిస్తున్న క్రమంలో జవాన్లు ఒక్కసారిగా చుట్టుముట్టడంతోనే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు సమాచారం అని... ʹమావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఛత్తీస్‌ఘడ్‌లో ఈ ఏడాది కోలుకోలేని నష్టం జరిగిందని పూజారికాంకేర్‌ (మార్చ్‌ 2) మొదలు (10 మంది) గడ్చిరోలీ (40 మంది) బీజాపూర్‌ - భూపాల్‌పల్లి సరిహద్దు (8 మంది) సుక్మా (5 మంది) జులై 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద ఏరియా కమాండర్‌ అరుణ్‌ వరకు అన్ని వివరాలు రాసింది. మొత్తం 90 మంది మావోయిస్టులు, 30 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్లుగా రాసింది. పోలీసు అధికారుల కథనాలు కాకుండా వ్యాఖ్యానం ఎక్కువగా ఈ పత్రికయే చేసింది. ఈ పత్రిక కొత్తగూడెం, చర్లపర్ణశాల నుంచి రిపోర్టులు వచ్చినట్లుగా రాసింది. ఒక పత్రిక భద్రాచలం నుంచి, మరొకటి దుమ్ముగూడెం / హైదరాబాదుల నుంచి సమాచారం పొందగా ఒక ప్రముఖ ఇంగ్లిషు దినపత్రిక, ఒక తెలుగు దినపత్రిక రాయ్‌పూర్‌ నుంచి పొందినట్లు రాసినవి.

ఏ ఒక్క పత్రికా విలేఖరి కూడ ఘటనాస్థలానికి వెళ్లినట్లు లేరు. రాయపూర్‌లో రిపోర్టర్‌ ఉన్న పత్రికలు తప్ప తెలుగు పత్రికలన్నీ తెలంగాణ నుంచే సమాచారం సేకరించాయి. బహుశా ఘటనాస్థలానికి పోలీసులు పత్రికా విలేఖరులను అనుమతించి కూడా ఉండరు. పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం, ఫోటోలు తప్ప తాముగా స్వతంత్రంగా సంఘటనా స్థలానికి వెళ్లి రాసినవి ఏవీ లేవు.

తుపాకులు, సామాగ్రి అన్నీ పోలీసులు ఇచ్చిన ఫోటోలు గనుక ప్రామాణికత ఎలా ఉన్నా పూజారీకాంకేర్‌ వలె కాకుండా వెంటనే మృతుల పేర్లు ప్రకటించారు గనుక వీళ్లు కనీసం మిలిషియా సభ్యులై ఉంటారని, వీళ్ల ఫోటోలు, వివరాలు ముందే పోలీస్‌ స్టేషన్‌లలో ఉండే అవకాశం ఉంది గనుక ప్రకటించారని నేను భావించాను.

అయితే ఆగస్టు 8న సుకుమా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనీసోరి వెంట వెళ్లిన కొండపి లింగా సామాజిక మాద్యమంలో పెట్టిన సమాచారం వేరుగా ఉన్నది.

బస్తర్‌లో మాడియా, మురియా, గోండు మొదలైన ఆదివాసీ మూలవాసులుంటారు. ఈ మూల వాసులకు భారత ప్రభుత్వ పోలీసు విభాగం నక్సల్స్‌ అని అంటుంది. చంపేస్తుంది. ఆగస్టు 7వ తేదీ ఉదయం సుకుమా జిల్లా ఎన్‌కౌంటర్‌ మృతుల్లో మెహతా పంచాయిత్‌ నాలుగు గ్రామాలలో నులుకాతోగ్‌కు చెందిన మైనర్లు ఏడుగురున్నారు.

1. హిడ్మా ముచాకీ / లఖ్మా, 2. దేవా ముచాకీ / హర్రా, 3. ముకాముచాకీ / ముకా, 4. మడక మేహంగా / హుంగా, 5. మడ్కంటేంక్‌ / లఖ్మా, 6. సోఢీ ప్రభు / భీమా, 7. మడ్కం ఆయతా / సుక్మా. వీళ్లందరి వయసు 14, 15, 16, 17 సంవత్సరాలకు మించి ఉండదని వాళ్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో వారిని కలిసి పరామర్శించిన సోనీ సోరికి చెప్పారు.

2) గోంపాడు గ్రామం నుంచి మడ్కం హుంగా / హుంగా, 2. కడ్తీ హడ్మా / దేవా, 3. సోయునేత / రామా, 4. మడ్కం హుంగా / సుక్మా, 5. వంజామ్‌గంగా / హుంగా, 6. కావసీబామీ / హడ్మా,

3) కినద్రంపాడు గ్రామం నుంచి 1. మాడవి హుంగా / హింగా

4) వెలపోచ్చ గ్రామం నుంచి 1. వంజానుహుంగా / నందా

నుల్కాతోగా గ్రామం నుంచి మడ్కం బుధరి / రామా అనే మహిళ కాలు నుంచి బుల్లెట్‌ దూసుకుపోయింది. వెలపొచ్చా గ్రామం నుంచి వంజామాహంగా / నందాను పోలీసులు అదుపులోకి తీసుకొని తలమీద వెల ఉన్న నక్సలైట్‌ అని ప్రకటించారు. వీళ్లనే కాకుండా మరో ముగ్గురు యువకులను కూడ అరెస్టు చేసారు. ఎంతో మంది గ్రామస్తులను పోలీసులు వెంటబడి పరుగెత్తించి కొట్టారు. అట్లా దెబ్బలు తిన్న వాళ్లలో గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు.

ఈ విషయాలన్నీ తాను సోనీసోరీ రామ్‌దేవ్‌ బఘేల్‌ పరివారాన్ని కలిసినపుడు తెలిసాయని లింగా రాసాడు. వాళ్లంతా ఈ విషయాలు తమకు చెప్పుకొని ఏడ్చి తమ బరువు దించుకున్నారని రాసాడు. ఈ నాలుగు గ్రామాల ప్రజలు కూడ ఈ మృతులు; గాయపడిన వాళ్లు అందరూ గ్రామస్తులేనని, అక్కడ ఎదురు కాల్పులు ఏమీ జరగలేదని చెప్పారు. పోలీసులు వచ్చినపుడు గ్రామంలో నక్సలైటు ఎవరూ లేరు. మీ అందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు వాస్తవాలు తెలుసుకోవడానికి మెహతా పంచాయితీలోని గోంపాడు గ్రామానికి వెళ్లవచ్చు. అక్కడ నాలుగు గ్రామాల ప్రజలతో కూడ మాట్లాడవచ్చునన్నారు.

గోంపాడు గ్రామం పేరు మీరు హిడ్మాపై అర్ధ సైనిక బలగాలు సామూహిక లైంగిక చర్యలకు పాల్పడి ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేసినపుడు వినే ఉంటారు. ఇదే ఆ గోంపాడుగ్రామం. మెహతా పంచాయితీలో ఉన్నది. 2016 జూన్‌ 14న గోంపాడు గ్రామంలో కోసా అనే ఆదివాసీ కూతురు హిడ్మాను పోలీసులు సామూహికంగా చెరచి నక్సల్‌ పేరు పెట్టి చంపేసారు. ఆ సంఘటన, ఎన్‌కౌంటర్‌ హత్యలపై సోనిసోరి నాయకత్వంలో ఆ గ్రామస్తులే కాదు, ఆ ప్రాంత ప్రజలంతా ఉద్యమం చేసి ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్ట్‌మార్టం చేసేలా హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందారు. ఛత్తీస్‌ఘడ్‌లో న్యాయస్థానం ఆ మాత్రమైనా స్పందించడం అదే మొదటిసారి. ఇప్పుడది హైకోర్టులో న్యాయవిచారణను ఆశిస్తున్నది. ఆ గ్రామ ప్రజలు హిడ్మా కుటుంబానికి న్యాయం లభించాలని ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఈ గ్రామంలో మరో ʹఎన్‌కౌంటర్‌ʹలో పోలీసులు మరో ఏడుగురు గ్రామస్తులను చంపేసారు. ఈ గ్రామస్తులకు దేశంలోని ఆదివాసులకు ఈ ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు రక్షణ కల్పిస్తాయని విశ్వాసం ఎట్లా కలుగుతుంది?

తమ వాళ్ల మృతదేహాలను తీసుకపోవడానికి సుకుమా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆదివాసులు ఆగస్టు 7 నుంచి కూడ పడిగాపులు పడుతూ రాత్రి రోడ్ల పక్కనే పడుకున్నారు. ఆ శవాలను పాలిథిన్‌ కవర్‌లలో కూరి తెచ్చారు. పత్రికలు చిన్నవీ, పెద్దవీ. మూడు రోజుల నుంచీ సుకుమా, బస్తర్‌ పోలీసులు ఇంత పెద్ద భారీ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులను మట్టుబెట్టినందుకు అధికారులకు, ప్రభుత్వానికి ప్రశంసలు గుప్పిస్తున్నాయి. నక్సల్‌ ఆపరేషన్‌ ఎడిజె అవస్థికి, సుకుమా జిల్లా ఎస్‌పి అభిషేక్‌మీనాకు ముఖ్యమంత్రి రమణసింగ్‌ శభాష్‌లు ప్రకటించాడు. కొద్ది రోజుల్లో ఆగస్టు 15న కాకపోతే లేదా జనవరి 26న వీళ్ళకు శౌర్య పతకాలు కూడా లభించవచ్చు. రమణసింగ్‌కు వీళ్లెవరూ నక్సల్స్‌ కాదని తెలియకపోవచ్చు. గ్రామస్తులని తెలియకపోవచ్చు. తెలిసినా ఫరక్‌ (తేడా) పడకపోవచ్చు. వాళ్లు బూర్జువా రాజకీయ నాయకులలో, పోలీసు అధికారులలో కాదు గదా. ఆదివాసులైనా, మావోయిస్టులైన ఎవరైనా ఒకటే. దేశద్రోహులు, టెర్రరిస్టులు. ఈ ʹటెర్రరిస్టులʹ మృతదేహాలు గ్రామాలకు తెచ్చి ఖననం చేసారు. గోంపాడు గ్రామానికి పోలీసులు సోనీసోరిని పోనివ్వలేదు. కాని ఈ దేశం మట్టికింద, తమ అడవి తల్లి గర్భంలో నిద్రిస్తున్న ఈ ఆదివాసులు రేపు ఎప్పుడో నిజాలు చెప్తారు. మృతదేహాలు నేరస్తులను పోల్చుకుంటాయి. కార్పోరేట్‌ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం హత్యలు చేస్తున్న ప్రభుత్వాలను, అసత్యాలు రాస్తున్న కార్పోరేట్‌ మీడియాను జీవించి ప్రతిఘటించినట్లే మరణించీ ప్రశ్నిస్తారు.

తాజాకలం : ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం సుప్రీంకోర్టులో ఆగస్టు 10 శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసింది. 15 మంది ఆదివాసులను ఎన్‌కౌంటర్‌ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14,21 ఉల్లంఘనయేనని ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని, సిబిఐ లేదా సిట్‌లతో విచారణ జరిపించాలని కోరింది. మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టమ్‌ చేయించాలని కోరింది. ప్రభుత్వ న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారణను చేపట్టాలని కోరగా ప్రధాన న్యాయమూర్తి సోమవారం ఆగస్టు 13 జాబితాలో దీనిని చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశించారు.

No. of visitors : 604
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •