జైలు గోడ‌ల వెన‌క

| సాహిత్యం | స‌మీక్ష‌లు

జైలు గోడ‌ల వెన‌క

- పెనుగొండ బాషా | 16.08.2018 12:17:00am

భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం అని, ప్రపంచం లో ఉన్న రాజ్యాంగాలలో మనది గొప్ప రాజ్యాంగం అని, ఈ దేశం లో ఉన్నంత స్వేచ్చ మరియు సమానత్వం ఏ దేశంలో కూడ ఉండవని మనం తరుచు వినే మాటలు. వాస్తవానికి ఈ దేశం లో పౌరుహక్కులు ఏవిధంగా కాలరాయబడుతున్నాయో వాస్తవాలను తన కళ్ళతో, చెవులతో స్వయంగా చూసి, విని, తన అనుభవాల ద్వారా ఈ దేశ ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, సామాజిక ఉద్యమకారులకు అరుణ్ ఫరేరా తన ʹసంకెళ్ళసవ్వడిʹ ద్వారా వినిపించే ప్రయత్నం చేశారు. ఆయన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల సుదీర్ఘ జైలు జీవితం గడిపాడు. జైలు జీవితంలో ఖైదీలు ఎటువంటి కష్టాలు, బాధలు, చిత్రహింసలకు, లైంగిక అత్యాచారాలకు ఎలా గురౌవుతారో చూశాడు.

అరుణ్ ఫరేరా విప్లవ భావాలు గల ఒక సామాజిక కార్యకర్త. ఒకరోజు రైల్వే స్టేషన్లో మఫ్టీలో ఉండే పోలీసులు ఆయన్ని కిడ్నాప్ చేసి కారులో వేసుకొని పక్క పిడిగుద్దులు గుద్దుతూ, భౌతిక హింస కు పాల్పడ్డారు. ఎవరో ఏమిటో, ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పకుండా విచక్షణ రహితంగ చావబాదుతూ రహస్య ప్రాంతానికి తరలించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేయదలిస్తే ఎందుకు చేయదలిచారో, అతని కుటుంబ సభ్యులకు గానీ బంధు మిత్రులకు గానీ సమాచారం అందచేయాలి. కానీ, అవి ఏమి పోలీసులు పట్టించుకోలేదు. తాము వేరు వేరు చొట్ల ʹకరుడుకట్టిన తీవ్రవాదులనుʹ పట్టుకున్నామని కథలల్లి, వాటికి మసాలాలు దట్టించి పత్రికలను వండి వడ్డించారు.

అప్పటికే తమ అదుపులో ఉన్న మిగతా నిందితులను కూడా చిత్రహింసలకు గురి చేశారు. ఒకరి తరువాత మరొకర్ని వంతుల వారిగా చితకాబాదుతూ తాము రాబట్టు కోవాలనుకున్న సమాచారం కోసమని చెప్పి చేయగలిగిన హింసలన్నీ చేసారు ఖాకీలు. తరువాత మేజిస్ట్రట్ ముందు హాజరుపరిచి రిమాండుకు తరిలించారు.
రిమాండులో కూడా ఒకరి తరువాత ఒకరు గంటల తరుబడి రకరకాల ప్రశ్నలతో ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరి చేసేవారు. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వకపోయిన , మౌనంగా ఉన్న కూడా తమ మొద్దు బారిన బూటుకాళ్లతో శరీరంలో ఎక్కడ పడితే అక్కడ చావబాదేవారు. కరెంట్ షాక్ ల దగ్గర నుండి సూదులతో గుచ్చడం, చివరకు పోలీసులు సహ ఖైదీ కిముడ్డిలో 20ఎం‌ఎల్ పెట్రోల్ కూడా పంపించి రాక్షస ఆనందం పొందటం లో కూడా ప్రత్యేక శిక్షణ పొందారు మహారాష్ట్ర పోలీసులు, నక్సలైట్ వ్యతిరేక కార్యకలాపాలలో పని చేసే సి-60, కొబ్రా కమాండోలు. రిమాండ్ తరువాత జ్యుడీషియల్ కస్టడికి నాగపూర్ సెంట్రల్ జైల్ కు తరలించారు.

జైలు లో అడుగు పెట్టగానే జైలర్ మరియు సుపరిండెంట్ ఖైదీలను తమ కనుసన్నల్లో అదుపాజ్ఞలల్లో పెట్టుకోవడానికి భయభ్రాంతులకు గురిచేసేవారు. జైలు మాన్యువల్ అస్సలు పాటించే వాళ్ళు కాదు. జైలులో అడుగు పెట్టె ఖైదీలలో ఎవరు ఏపాటి బలం కలిగినవారో ముందు గానే ఒక అంచనాకు వచ్చే వాళ్ళు జైలు అధికారులు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి తమ మాముళ్ళు వసూలు చేసే వారు. సెల్ ఫోన్ లో మాట్లాడటం, ఛార్జింగ్ పెట్టుకోవడం దగ్గర నుండి బిర్యానీ, బీడీలు సిగరెట్ ల దగ్గర వరకు అదనంగా డబ్బులు వసూలు చేసే వారు. ఈ మముళ్ల సోమ్మంత కింది అధికారుల దగ్గర నుండి పై అదికారుల దగ్గర వరకు అందరికీ ముట్టేది.

జైలులో ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి చోట యుద్దం చేయవలసే వచ్చేది. ఉదాహరణకు పళ్ళు తోముకోవడం దగ్గర నుండి స్నానాలు చేయడం, బట్టలు ఉతుక్కోవడం చివరికి దొడ్డికి కూర్చోవడం వరకు కష్టాలుపడాల్సి వచ్చేది. వరుసలో నిల్చోవడంలో కూడా ఎంతో పరిణతి సాధించాలంటే జైలు జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అల్పహారం, టీ తాగాలన్నా కూడా ఒకేసారి వందల మంది ఖైదీలు రావడంతో తొక్కిసలాట కూడా జరుగుతుంది. స్నానాల తొట్టి దగ్గర ఎప్పుడు జనం కిటకిటలాడేవారు. జైలులో పరిస్థితులను అరుణ్ కళ్ళకు కట్టినట్లు చెప్పడమే కాదు, చిత్రకారుడవడం వల్ల వాటిని బొమ్మలు వేసి చూపించాడు.

మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడుకోవడానికి తగినన్ని పరికరాలు ఉండవు. నిజానికి జైలు ఖైదీల మానసిక ప్రవర్తనలలో మార్పులు తెచ్చి, వాళ్ళ జీవితాన్ని సరిదిద్దేదిగా ఉండాలి. అలా మార్పులు తీసుకరాకపోగా శారీరకంగా , మానసికంగా మరింత కుంగుబాటుకు గురిచేసేలా చేస్తాయి. కొన్నిసార్లు అధికారులు తమ మాట విననివారిని, పై అధికారులకు కంప్లయింట్ చేసిన వారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునేవారు. జైలు అధికారులకు చట్టాలంటే ఏ మాత్రం గౌరవం ఉండదు.

ఇక జైళ్ళలో భాయీలని ఉంటారు. ఏదో ఒక హత్య నేరంలోనో లేక డ్రగ్స్ లాంటి కేసులలోనో జైలుకు వచ్చి ఎక్కువ కాలం నుండి శిక్ష అనుభవిస్తూ, బయట రాజకీయంగా పలుకుబడి కలిగి ఉండివారే భాయీలు. జైల్లో వీళ్ళు చెప్పిందే వేదం. అందుకే ఇతర ఖైదీ లు భాయిల మెప్పు పొందటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటారు. జైలు అధికారుల ద్వారా తమకు కావల్సిన అవసరాలను, వసతులను పొందటం కోసం పెద్ద మొత్తంలో జైలు అధికారులకు ముడుపులు ముట్ట చెబుతూ ఉంటారు. జైలు అధికారులు సిబ్బంది వాళ్ళు కోరిన లైంగిక కోరికలు కూడా తీరుస్తా ఉంటారు. అంటే డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్ళకు జైల్లో కూడా రాజభోగాలే.

ఒకరోజు క్రికెట్ ఆడే సమయంలో అధికారులు అలారం మోగించి,ఈలలు వేస్తూ, లాఠీ లను ఊపుతూ దొరికిన వాళ్ళను దొరికినట్టు చితకబాదుతూ బ్యారక్ ల వరకు తరిమి తాళాలు వేస్తారు. ఎంత మంది ఖైదీలు ఉన్నారో లెక్క చూసుకొని, తాము ఎంచుకున్న ఖైదీలను బయటకు పిలిచి నేల మీద వేసి లాఠీ లు విరిగేలాగా తమ అక్కసునంత తీర్చుకుంటారు. శాంతి భద్రతలను ఎంత క్రూరంగా అదుపు చేస్తారో తెలుసుకోవచ్చు. అలా జైల్లలో మరణించే ఖైదీల సంఖ్యలో భారతదేశం లోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ఒక అక్రమ సారా కేసులో అరెస్టు అయి జైలు జీవితం గడుపుతున్న వ్యాపారి జవాన్లు, జైలు సిబ్బంది కొట్టిన దెబ్బలకు తాళలేక రెండు రోజుల తరువాత మరణిస్తే ఆ శవానికి జైలు డాక్టర్ గ్లూకోజ్ ఎక్కించి బయట ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి కి ట్రీట్మెంట్ కోసం పంపిస్తాడు.

ఖైదీ కి అస్వస్థ గా ఉండటం వల్ల జైలు హాస్పిటల్ నుండి బయట ఉన్న కార్పొరేట్ హోప్సిటల్ కు తరలిస్తుండగా ʹమార్గమధ్యలోʹ మరణించాడని అని తమ పాత కథనే కొత్తగా చెప్తారు పోలీసులు. ప్రజాస్వామిక వాదులు, పౌరహక్కుల కార్యకర్తలు ఎప్పటి నుండో ఆలోపిస్తున్న హక్కుల ఉల్లంఘనలకు ఈ సంఘటన ఒక సాక్ష్యం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సామ్ నుండి గుజరాత్ వరకు రకరకాల ఆరోపణలతో నిత్యం ప్రజల మీద నిర్బందం ప్రయోగించి హక్కులను కలరాస్తున్నారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఖైదీ లు శూన్యం నుండి బయట పడటానికి రకరకాల పుస్తకాలను, పత్రికలను చదువుతూ కాలక్షేపం చేయడం అలవాటు. బెయిల్ ప్రయత్నాలు చేసుకోవడం, తమ కేసులు పురోగతి తెలుసుకోవడం, తమ లాయర్ లను కలుసుకోవడం, ములఖత్ లు వగైరా పనులు చేస్తూ ఎప్పుడు కూడా బిజీ గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. జైల్లో సాధారణ ఖైదీలను, హత్యకేసుల్లో నేరస్తులను ఉంచే బ్యారక్ లు, ఉగ్రవాదులను, మావోయిస్ట్ కార్యకర్తలను, మావోయిస్ట్ సానుభూతి పరులను ఉంచే అండ బ్యారక్ లు వేరు వేరుగా ఉంటాయి. చీకటి గుహలా భయానకంగా ఉండే అండా బ్యారక్ సోదరుడు ఫాసియార్డ్ (ఉరితీసే చోటు). ఈ ఫాసియార్డ్ లో ఉరిశిక్ష పడిన ఖైధీలను ఉంచుతారు. ఈ ఊరి శిక్ష పడిన ఖైధిలలో కొందరికి జైల్ ఆవరణంలో కొన్ని పనులు అప్పచెబుతారు. వీరిలో కొందరు ఫాసియార్డ్ లో గల ఉరికంబాన్ని రోజూ శుబ్రం చేస్తూ, ఉరితాడుకు ఆయిల్ రాస్తూ ఉంటారు. అసలే ఉరి శిక్షపడి రోజులు భారంగా గడుపుతూ, కుటుంబం భార్య పిల్లలు గుర్తుకు వచ్చి కుమిలిపోతూవుంటే, రోజూ ఉరికంబాన్ని చూస్తూ దాన్ని శుభ్రం చేయడం లో ఉండే వేదన వర్ణనాతీతం.

ఈ దుఖాలూ, బాధల పక్కనే ఖైధి లు తమ న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం నిరాహారదీక్షలు చేస్తూ ఉంటారు. బయటి సమాజానికి జైల్ లో జరిగే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకు వచ్చి హక్కులను సాధించుకుంటారు కూడా.

జైలు లో విచారణ లో ఉన్న ఖైధీల మీద మరిన్ని అక్రమ కేసులను మోపడంలో పోలీసులు ఎంత సిద్దహస్తులో అరుణ్ మీద మోపిన కేసులే ఉదాహరణ. ఆయన్ని ఒక కేసు మీద అరెస్టు చేసి దాదాపూ పదకొండు కేసులలో ఇరికించి సుదీర్ఘమైన జైలు జీవితం గడిపేలా చేశారు. దీనికంతటికి కారణం విద్యార్థి రాజకీయాలనుండి ఎదిగి ఒక్క ముంబయి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్నీ ప్రజాస్వామిక ఉధ్యమాలను బలపరచటం, అందులో పాల్గొనడం తప్ప మరోటి కాదు. మావోయిస్ట్ సాహిత్యం కలిగి ఉన్నాడని, లేదా అరుణే స్వయంగా మావోయిస్ట్ దాడులల్లో పాల్గొన్నడని ఆరోపణలతో నాగపూర్, గడ్చిరోలీ, చంద్రాపూర్ లలో కేసులలో నమోదు చేయడం దగ్గర నుండి అరెస్టు చేయడం చిత్రా హింసలకు గురిచేస్తూ ఏదైనా వాళ్ళకు కావల్సిన సమాచారం దొరుకుతుందని, రోజుల తరబడి నిర్బందం లో ఉంచి భౌతిక హింస కు గురిచేస్తూ, అత్యాచారానికి కూడా పాల్పడటం రాజ్య దుర్మార్గానికి నిదర్శనం.

అండ (కోడి గుడ్డు) లాంటి చీకటి సెల్ లలో నిర్బంధించి రోజుల తరబడి ఒంటరిగా ఉంచడం ద్వారా ప్రజాస్వామ్య వాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడం రాజ్యం యొక్క లక్ష్యంగా కనబడుతోంది. ఒక్క మహారాష్ట్ర జైల్ లోనే కాక , ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లలోని జైల్లలో గిరిజన, ఆదివాసీ, యస్సీ యస్టి, ముస్లిం మైనారిటీ లను అక్రమంగా కేసులలో నిర్బందించి సంవత్సరాల తరబడి జైల్లలో మగ్గెలా చేస్తున్నారు. జైలు నుండి విడుదల అయిన వెంటనే గేట్ దగ్గర అక్రమ అరెస్టులు చేస్తూ జైలు అధికారులు, పోలీసులు అక్రమ సంపాదనకు తెరతీస్తున్నారు.

అడవిలో నుండి ఆదివాసీ యువతి, యువకులను అక్రమంగా అరెస్టులు చేసి, మావోయిస్టులకు సహకరించారనో, లేక మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనో, ఇలా ఏదో ఒక నెపం నెట్టి, సామూహిక అత్యాచారాలు చేస్తున్నారు. భారత అర్ద సైనిక బలగాలు, భారత ఆర్మీ , సి‌ఆర్‌పి‌ఎఫ్, గ్రే హౌండ్స్ వంటి బలగాలకు అపరిమిత అధికారాలు ఇవ్వడం వల్ల తూర్పు, మధ్య భారతంలో మరింత హింసకు ప్రభుత్వమే కారణం అవుతోంది. భారత సరళీకృత ఆర్దిక విధానాల కారణం గా పాలక వర్గాలు తమ దోపిడి ధన దాహనికి అడవులు, అడవులతో పాటు అడవిలో ఉండే ఆదివాసులు బంధీలవుతున్నారు. భారదేశంలో ఉండే జైల్లన్నీ దళితులు, ముస్లింలు, ఆదివాసులతో నిండుగా కిక్కిరిసి ఉన్నాయి.
చదువురాని అమాయకులైన ఆదివాసీలను అక్రమంగా అరెస్టులు చూసి, వాళ్ళు కరుడు గట్టిన నేరస్తులని, వాళ్ళువల్ల భారత ఆంతరంగిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందని తప్పుడు కేసులు పెడుతున్నారు. అడవిలో ఆదివాసీలైతే మావోయిస్ట్ పేరుతోను, మైదానంలో ముస్లిలైతే ఉగ్రవాదుల పేరుతోను, కుట్ర కేసులలో ఇరికించి ఈ పోలీసులు ప్రమోషన్లు, అవార్డులు, నచ్చిన చోటికి పోస్టింగులు వేయించుకొని పాలకవర్గాల సేవలో మునిగి తేలుతున్నారు.

ఈ అక్రమ కేసుల్లో జైల్లుపాలైన రాజకీయ ఖైదీలు, ఇతర కేసులలో జైలు జీవితం గడిపిన వాళ్ళు ఇంటికి వచ్చిన తరువాత చూచూస్తే వాళ్ళ కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్నాయి. కుటుంబ పెద్ద జైల్లో ఉండటంతో కుటుంబ పోషణ భారం అయ్యి, పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాక, చాలీచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొని రాలేక , కోర్టు ఫీజులు కూడా కట్టే స్తోమత లేని వారి కుటుంబాలు తీవ్రమైన మానసిక వెధనకు గురవుతున్నాయి. చాలా కుటుంబాలలోని భార్య భర్తలు విడిపోతున్నారు. జైలు కు వెళ్ళి వచ్చిన వారి జీవితాలు మహా దుర్బరం గా మారుతున్నాయి.

పై అన్నీ విషయాలు సామాజికమైనవి, రాజకీయమైనవి కూడా. జైల్లో ఉండేవాల్లందరూ నేరస్తులు కాదు. సమాజం, చట్టం, న్యాయవవస్థ వీళ్ళని నేరస్తులని చేసాయి. అసలైన నేరస్తులు బైట ప్రపంచంలో ఏ అడ్డూ లేకుండా సంచరిస్తున్నారు. ఈ చట్టలు, చట్టాలను అమలు చేసే అధికారులలో మార్పు రానంతకాలం, మొత్తంగా వ్యవస్థ మారనంత కాలం ఎంతో మంది జీవితాలు బలవుతూ ఉంటాయి. అరుణ్ ఫరేరా స్పష్టమైన రాజకీయ అవగాహనతో సైంటిఫిక్ గా జైలు లో జరిగే ప్రతి విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసిన విధానం అద్బుతం. ఎన్ వేణుగోపాల్ తెలుగు అనువాదం చక్కగా, హాయిగా ఉంది.

No. of visitors : 749
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రాయలసీమ ప్రజల ఆకాంక్షలు

పెనుగొండ భాషా | 20.01.2019 11:37:16am

కోస్తా ప్రజల అభివృద్దే మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్దిగా చూపించే, పాలకుల దుర్మార్గాలను ఎండగట్టడంలో రాయలసీమ ప్రజలు కొంచెం వెనకబడి ఉండటం వాస్తవమే.అమరవతిని......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •