అర్బన్ మావోయిస్టులు - ఆరెస్సెస్ ద్వేషభక్తులు

| సంపాద‌కీయం

అర్బన్ మావోయిస్టులు - ఆరెస్సెస్ ద్వేషభక్తులు

- పి.వరలక్ష్మి | 06.09.2018 09:55:17pm

ఈ నెల మీద కాసింత హుందాగా బతికే జీవితం కోసం, భూమి కోసం, భుక్తి కోసం యాభై ఏండ్లుగా పడుతున్న తండ్లాట దేశ భద్రతకు ముంచుకొచ్చిన ముప్పు అయిపోయింది. పసిపిల్లల్ని, అసహాయుల్ని ముక్కలుగా నరికేసే చోట, తప్పిపోయిన మానవత్వం జాడలకై మనుషులు తడుముకుంటూ వెదుక్కుంటున్న చోట, మానవీయ సమాజం నిర్మించాలని చిందించిన నెత్తురంతా తీవ్రవాదమైపోయింది. అయినా ఇది ఇప్పటి మాటా? భగత్ సింగ్ కాలం నుండి విప్లవం అంటే రాజద్రోహమే. విప్లవకారులు తీవ్రవాదులే. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేమిటి? తెలంగాణ రైతాంగ పోరాటకాలంలో కమ్యూనిస్టులు ఊర్లలో పడి దోచుకునే దోపిడీ దొంగలని ప్రచారం చేసారు. నక్సల్బరీ, శ్రీకాకుళం నుండి ఇప్పటి దండకారణ్యం దాకా నక్సలైట్లు, మావోయిస్టులంటే హత్యలు చేసేవాళ్ళు, విధ్వంసాలు సృష్టించేవాళ్ళు, అభివృద్ధిని అడ్డుకునేవాళ్ళు. ఎందుకు? స్వాతంత్రం పిడికెడు మంది సంపన్నులకు, భూస్వాములకు మాత్రమే వచ్చిందని, భారతదేశపు అశేష ప్రజానీకం దుర్భర భూస్వామ్య బంధనాల్లో చిక్కుకొని అర్ధబానిసలుగా, వెట్టి కూలీలుగా బతుకులీడుస్తున్నారని 50 ఏళ్ల క్రితమే భారత పాలకవర్గాల గుట్టువిప్పినందుకు. మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ అంటే మాలా మాదిగల పార్టీగా జనంతో పెనవేసుకున్నందుకు. భూస్వాములు ప్రజల్ని చంపితే ప్రజల రక్షణ కోసం గాక భూస్వాముల రక్షణ కోసం ప్రభుత్వం వచ్చినప్పుడు జనం కోసం ప్రాణాలు పెట్టిన శ్రీకాకుళం వీరులు తీవ్రవాదులే. నక్సల్బరీలో నేలకొరిగిన ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు తీవ్రవాదులే. బీహార్ లో అగ్రకుల సాయుధ ముఠాల నెదిరించిన అట్టడుగు కులాలు, వర్గాల వాళ్ళంతా తీవ్రవాదులే. కెరీరిస్టులు, వైట్ కాలర్ దొంగలు అవ్వకుండా సమాజం గురించి పరితపించిన విద్యార్థులు తీవ్రవాదులే. కార్మికుల సంఘాలను యాజమాన్యాలకు అమ్ముకోనివాళ్ళు తీవ్రవాదులే.

అడవిలో మనుషులుంటారు. అడవి గర్భంలో సంపద ఉంటుంది. పెట్టుబడిదార్లు సంపద కోసం వస్తారు. వాళ్లకు దారులు వేయడం కోసం ప్రభుత్వం వస్తుంది. అప్పటివరకు మనుషుల ఎరుకైనా లేని ప్రభుత్వాలకు వాళ్ళు అడ్డం తొలగించుకోవలసినవాళ్ళవుతారు. సంపదను కాక మనుషుల్ని ముట్టుకున్న వాళ్ళు తీవ్రవాదులవుతారు.

ʹవాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అటుంచండి. అసలు రాజ్యాంగమే అమలైతే ఈ తిరుగుబాట్లే ఉండవనిʹ మొదటిసారిగా పౌరహక్కుల స్పృహ కలగడానికి కారణమైన వాళ్ళు నక్సలైట్లే...అదే తీవ్రవాదులు. ఆలోచనల్ని, అక్షరాలని కదిలించిన వాళ్ళు. వాళ్ళు చాలా మార్పులకు కారణాలు. చైతన్యాలకు ప్రేరకాలు. ఏమీ ఆశించని వాళ్ళు. ఉన్నదొకటే ప్రాణమూ ఇచ్చేసేవాళ్ళు. వీళ్ళు కదా దేశభక్తులు అని పార్లమెంటరీ రాజకీయ పార్టీతోనే అనిపించుకున్నవాళ్ళు.

అది సరే, ఈ హింస అంతా ఏమిటి?

నక్సల్బరిలోనూ, శ్రీకాకుళంలోనూ మరెక్కడైనా మొదలు నెత్తురు పారించింది ప్రభుత్వం కాదా? బహుశా ప్రభుత్వం హింస చేయవచ్చు. జనం ఊరికే చచ్చిపోవాలి. ఆత్మరక్షణ కోసమైనా ఆయుధాన్ని కలిగి ఉండే హక్కు సంపన్నులకు మాత్రమే ఉంటుందా? ఈ చర్చ ఏనాటిది? ఈ హింస నుండి ఉపశమనం కావాలని శాంతి కోసం చర్చలు కూడా జరిగాయి. మీ డిమాండ్లు ఏమిటంటే వాళ్ళేమన్నారు? మాకే డిమాండ్లు లేవు, ప్రజల డిమాండ్లు తీర్చండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి అని కదా! అక్కడా మొదట నెత్తురు పారించి శాంతిని భగ్నం చేసింది ప్రభుత్వమే... ఆరోజు శాంతి కోసం చర్చల్లో పాల్గొన్న వరవరరావు ఈరోజు శాంతి భద్రతలకు ముప్పు. మరో సందర్భంలో మళ్ళీ శాంతి కోసం ప్రయత్నించిన స్వామీ అగ్నివేశ్ ను ఇటీవలే నడిరోడ్లో అధికార పార్టీ గూండాలు కిందపడేసి కొట్టారు. ఒకసారి కాదు రెండు సార్లు.

ఈ కాలంలో ఎంత దూరం ప్రయాణించాం! మధ్యే మార్గాలు, మధ్యవర్తులకు స్థానం లేకుండాపోయింది. తూర్పు మధ్య భారత అడవులపై ప్రపంచ మార్కెట్ శక్తుల కన్ను పడింది. వాళ్ళ కనుసన్నలలో ఆదివాసులపై, మావోయిస్టులపై యుద్ధం.

... ... ...
గాంధీ హత్యతో అప్రతిష్టపాలై కాంగ్రెస్ అతివాదుల సహకారంతో నిషేధం తొలగించుకున్న ఆరెస్సెస్ మార్పుకు ప్రతీఘాతుకంగా మొదటి నుండి సంపన్న వర్గాల ప్రయోజనాలను మోస్తూ వచ్చింది. మార్పును కోరుకునేవాళ్ళు, దేశాన్ని మధ్యయుగాల్లోకి తీసుకొని పోవాలనుకున్నవాళ్ళు పరస్పరం తలపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం (అది ఏ పార్టీ అయినా), పోలీసులు, ఆరెస్సెస్ ఒకవైపు, విప్లవ ప్రజాసంఘాలు ఒకవైపు. ఇవాళ ఏమైనా మాట్లాడొచ్చు గాని ఆరెస్సెస్ నిలదొక్కుకోడానికి, బలపడడానికి, విస్తరించడానికి కాంగ్రెస్ అన్నివిధాలా ప్రోత్సహించింది. పైకి కాంగ్రెస్, కాని నిజానికి భారత పాలకవర్గాలు- భూస్వామ్య దళారీ పెట్టుబడిదారీ వర్గాలు.

కాంగ్రెస్ ప్రభుత్వం బాబ్రీ మసీదు విధ్వంసానికి అన్ని దారులూ తెరిచింది. మత పిచ్చిని రెచ్చగొట్టే ప్రచారాలను, సంస్థలను ప్రోత్సహించింది. వ్యవస్థను కలకాలం కాపాడే శక్తులు పాలకవర్గాలకు అవసరమే. ఆర్థిక సంక్షోభాలను తట్టుకొని నిలబడాలంటే జనాన్ని ఒక కల్పిత శత్రువు వైపు ఎగదోయాలి. 80 ల నాటి నుండి ఆర్థిక సంక్షోభం ఎంత పెరిగిపోతూ వచ్చిందో ఈ శక్తులు అంతగా బలపడ్డాయి.

మొదటి నుండి పాలకవర్గ భావజాలానికి ఆరెస్సెస్ మాట్లాడే సాంస్కృతిక జాతీయవాదానికి ఎక్కడా పేచీ లేదు. ఇది అగ్రకులాలది, సంపన్నవర్గాలది, భూస్వాములది, దళారీ పెట్టుబడిదారులది. ఆర్థిక సంక్షోభం ప్రజా జీవితాలను దివాలా తీయించేకొద్దీ, సమాధానం చెప్పుకోవలసిన స్థానంలో ఉన్న పాలకులు తప్పించుకోడానికి ఒక ఊహాజనిత శత్రువును తయారుచేసుకుంటారు. ఇందుకు ఆరెస్సెస్ భావజాలం గొప్పగా తోడ్పడుతుంది. అది అనేక చిన్నా చితకా ప్రయత్నాలు చేసింది. ఇందుకు కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదనడానికి సిక్కుల మారకాండ ఒక ఉదాహరణ.

చివరికి భారత బడా వ్యాపారవర్గాల జన్మస్థానమైన గుజరాత్ లో ఆరెస్సెస్ ప్రయోగం ఘనంగా విజయవంతమైంది. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న దేశంలో మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి వేలాది మంది ముస్లింలను చంపి పార్లమెంటరీ అధికారాన్ని అది స్థిరపరచుకుంది. అయితే నక్సలైట్ల విషయంలో జరిగిన హింస అహింసల చర్చ ఇక్కడ జరగదు. ఎటువంటి హింస అది? పసిపిల్లల నోట్లో పెట్రోల్ బాంబులు పేల్చే హింస. మనుషులను ముక్కలుగా నరికి మంటల్లో వేసే హింస. గర్భం చీల్చి పిండాన్ని బైటికి లాగి చంపే హింస. ఈ హింసనంతా నడిపించిన వ్యక్తి దేశ ప్రధాన మంత్రి అయిపోయాడు. ఆరెస్సెస్ నిషేధం నుండి అధికారానికి చేరుకుంటుంది. భారత దళారీ బూర్జువావర్గానికి ఒక శక్తివంతమైన ప్రతినిధిని అది అందించింది. సామ్రాజ్యవాదానికి నమ్మకమైన ఏజెంటును ఇచ్చింది. ఇక్కడ హింస ప్రధాన స్రవంతి చర్చల్లో పెద్దగా ఉండదు. ఇది పాలకవర్గాలకు అవసరమైన హింస. రాజ్యం, దాని చీకటి శక్తులు హింస చేయడం, ప్రజలు తిరగబడి ఆయుధాలు చేతికి తీసుకోవడం- హింసా ప్రతిహింసలు రెండూ తప్పే అనే వైఖరి తీసుకునే పెద్దమనుషులు చాలా మందే ఉంటారు. కానీ ప్రజలు/విప్లవకారులు/నక్సలైట్లు ఎవరైనా రెండో అంచున ఉన్నవాళ్ళను అరాచకశాక్తులుగా చూపించే పని అన్ని సమాచార మేధో సాంస్కృతిక శక్తులను ఉపయోగించి రాజ్యం శక్తివంతంగా చేయగలుగుతుంది. ఇది మొదటి నుండీ జరుగుతూ వస్తున్నా పది పదిహేనేళ్ళుగా మరింత ముమ్మరమైంది.

అడవిలో గనుల తవ్వకాల కోసం ఆదివాసులను తరిమేసే ధ్యేయంతో మన్మోహన్ సింగ్, చిదంబరంలు మావోయిస్టులను దేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పు అన్నాడు. ఇక వాళ్ళ గురించి, ఆదివాసుల పోరాటం గురించి కాదుగదా అక్కడ బలగాలు ఊర్లకు ఊర్లు తగలబెట్టి చేస్తున్న అత్యాచారాలు, హత్యల గురించి ఎవరైనా మాట్లాడినా అది అంతర్గత భద్రతకు ముప్పే. తమను చంపుతున్న బలగాలను సుప్రీం కోర్టు సహా ఎవరూ నిలువరించలేరు. అక్కడక్కడా చప్పుడు చేసే పౌరహక్కుల కార్యకర్తలు తప్ప నిశ్శబ్దంగా వందలాది ఊర్లను నేలమట్టం చేసారు. ఇలా జరుగుతున్నదని కూడా దేశ ప్రజానీకానికి తెలీనివ్వరు. కానీ ఆ బలగాల మీద దాడి జరిగినప్పుడు ఆకాశం పైకప్పు ఎగిరిపోయేలా ప్రచారం చేస్తారు. పైగా పౌరహక్కుల సంఘాలు వీటిని ఎందుకు ఖండించవు అని రివర్స్ లో దబాయిస్తారు. ఇలా ఒకవేళ ఆదివాసులడిగితే సమాధానం ఏమిటి? వాళ్ళను స్వేచ్చగా మాట్లాడనిస్తే ఏం మాట్లాడతారో గాని మాట్లడనివ్వారు కదా.
రాజ్యాంగానికి, చట్టాలకు, చర్చలకు చోటు లేని చోట హింస మాత్రమే మిగులుతుంది కదా!

ఇవ్వాలేం జరుగుతోంది! బిజెపి, ఎబివిపి, ఆరెస్సెస్ శక్తులు ఈ దేశపు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తూ ఇష్టం వచ్చినట్లు మనుషుల్ని కొట్టి చంపుతున్నారు. ఆవులు తరలిస్తున్నారని, దేవుణ్ణి దూషిస్తున్నారని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఎవరినైనా ఎప్పుడైనా చంపగలరు. ఏ రాజ్యాంగం, చట్టం అడ్డురావు. సరిగ్గా ఇదే పద్ధతిలో ప్రభుత్వం పన్నులతో బాదేస్తుంది. నల్ల డబ్బు పేరుతో జనం డబ్బంతా లాగేసుకుంటుంది. బిజెపి అధినాయకుడి బ్యాంకు బొక్కసం నింపేసుకుంది. నేతల స్కాములు ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాయి. వీళ్ళంతా ఇప్పుడు దేశభక్తుల గుంపు.
దేశమంతా అయితే హత్యలు, లేదా ఆత్మహత్యలు. రైతులు, విద్యార్థులు, ఉపాధి పోగొట్టుకున్న కార్మికులు ఏటా వేలల్లో రాలిపోతున్నారు.
ఇప్పుడు ఎన్నికల వేల ఎప్పటిలా రైతుల్ని ఆదుకుంటామనే వాగ్దానాలు లేవు. అవినీతిని అరికడతామనే ప్రతిజ్ఞలు లేవు. కోటి ఉద్యోగాలు ఇస్తామనే హామీలు లేవు. ఇకవేళ ఇచ్చినా నిన్నటి డీమానిటైజేషన్ దెబ్బలు పచ్చిగా ఉన్నాయి గనక జనం నమ్మే పరిస్థితి లేదు.

ఆరెస్సెస్ మూకశక్తిని పెంచుకునేందుకు సంస్కృతి పేరుతో ముస్లింలు, దళితులపై దేశమంతా దాడులు చేస్తున్నది. ప్రగతిశీల రచయితల్ని, హేతువాదుల్ని, విద్యార్థి సంఘాలను లక్ష్యం చేసుకుంది. 2014 నుండి లెక్క వేస్తే ఇవి సుమారు మూడు వేల ఘటనలు. బుద్ధిజీవులంతా ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన ఏర్పరచుకుంటున్నారు. దళితులు నిన్నటికి నిన్న భీమాకోరేగావ్ లో లక్షల సంఖ్యలో ఎల్గార్ పరిషత్ కింద కూడి ధిక్కారాన్ని వినిపించారు.

ఆదివాసీల ప్రతిఘటన అప్రతిహతం. వీళ్ళకు మావోయిస్టులు తోడున్నారు. వందలాది మంది చంపినా, వేలాది మందిని జైళ్ళ పాలు చేసినా అడవిలోకి బహుళ జాతి కంపెనీలను రానివ్వడం లేదు. గూడేలను తగలబెడుతూ, అత్యాచారాలు, హత్యలు చేస్తున్న ప్రభుత్వ బలగాల దుశ్చర్యలను దేశవ్యాప్తంగా న్యాయవాదులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ వేదికల్లో వీటన్నిటినీ చర్చనీయాంశం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

భావజాలపరంగా ఇటు పట్టణ మేధోవర్గం, భౌతికశాక్తిగా కూడా దళితుల సమీకరణ ఇవాళ ప్రభుత్వానికి సవాలు. వీటిని ఎదుర్కోడానికి, జనాన్ని దారి మళ్ళించడానికి ఒక కల్పిత శత్రువు కావాలి. ముస్లింలకు తోడు ఇప్పుడా కల్పిత శత్రువు అర్బన్ మావోయిజం. భీమా కారేగావ్ ధిక్కారాన్ని, ఫాసిజానికి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న వేదికలను, మావోయిజాన్ని కలిపి కుట్టి అర్బన్ మావోయిస్టులని దేశానికి శత్రువుగా చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ. వీళ్ళెంత ప్రమాదకరమో చెప్పడానికి తనను చంపే కుట్ర పన్నారని కథను రచించాడు. రీచ్ స్టాగ్ ను తానే తగలబెట్టించి కమ్యూనిస్టులు తగలబెట్టారని ఆరోపించి జర్మనీలో కమ్యూనిస్టులను వేటాడి చంపిన హిట్లర్ తీరుగా మోడీ ఫాసిజం ఇప్పుడీ యుగంలో తలెత్తింది.

నక్సలైట్లు ఈ దోపిడీ వ్యవస్థపై పోరాడుతున్న ప్రజలేనని సాధారణ జనం జ్ఞానంలో ఉండే సానుభూతిని తుడిచేసి వారిని ఈ దేశ శత్రువులుగా, తీవ్రవాదులుగా ప్రచారం చేసి పనిలో పనిగా తనను వ్యతిరేకిస్తున్నవారినందరినీ ఆ ఖాతాలో వేసి రెండు రకాలుగా జనాగ్రహం నుండి తప్పించుకోవాలనే ప్రణాళిక మోడీ పన్నాడు. పనిలో పనిగా తనను చంపాలనే కుట్ర జరుగుతోందని సానుభూతిని పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్ని సార్లు చెప్పినా రెండు విషయాలు మళ్ళీ స్పష్టం చేయాలి. మావోయిస్టులు తీవ్రవాదులు కాదు. వారి సిద్ధాంతం, పోరాట పంథా ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా మావోయిస్టు పార్టీ ఒక విప్లవ పార్టీ. ఇలా చెప్తే నేను కూడా అర్బన్ మావోయిస్టును కావొచ్చు. కాని ఇది నిజం. ఇది చెప్పడానికి అర్బన్ మావోయిస్టే కానక్కర్లేదు. కాని ఇప్పుడు మాట్లాడేవాళ్ళంతా మావోయిస్టులే. మావోయిస్టు సిద్ధాంతం దగ్గరి నుండి పౌరహక్కుల దాకా.. ఏదైనా ఘటనతో, చర్యతో సంబంధం లేకుండా ఊరికే మాట్లాడినా, భావాలు పంచుకున్నా అది ప్రభుత్వానికి వ్యతిరేకమైనది గనక తీవ్రవాదమే. ఈ పేరు మీద సాయిబాబా, హేమ మిశ్రా, ప్రశాంత్ రాహిలతో పాటు ఆదివాసులు విజయ్ టిర్కి, పాండు నరోత్ లకు సరైన ఆధారాలు ఏవీ లేకుండానే యావజ్జీవ శిక్షలు వేసారు. ఇది మొదటి దశ. ఈ కేసు వాదిస్తున్న సురేంద్ర గాడ్లింగ్ తోపాటు రోనా విల్సన్, షోమా సేన్, సుధీర్ ధావ్లే, మహేష్ రౌత్ లను భీమా కారేగావ్ హింసకు కారకులని, అర్బన్ నక్సలైట్లని జూన్ నెలలో అరెస్టు చేసారు. ఇది రెండో దశ. రోనా విల్సన్ వద్ద మావోయిస్టుల లేఖలు దొరికాయని అందులో ప్రధాన మంత్రి హత్యకు కుట్ర ఉందని దానికి బాధ్యులను చేస్తూ ఆగస్టు 28న దేశవ్యాప్తంగా రచయితలు, సామాజిక కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేసారు. ఇది మూడో దశ. రెండో దశ కేసుల విషయంలో సుధా భరద్వాజ్ న్యాయసహాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఆమెతో సహా వరవరరావు, గౌతమ్ నవ్లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరాలను అరెస్టు చేసారు. వీళ్ళ మీద ఆరోపణలు- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫాసిస్టు వ్యతిరేక ఐక్య వేదిక ఏర్పరచారు, భీమా కారేగావ్ లో ఎల్గార్ పరిషత్ ను ఏర్పరచారు, ఇంకా కాశ్మీర్ వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నారు- అన్నీ భావాలకు, ఆలోచనలకు, అట్టడుగు వర్గాల ఆకాంక్షలకు సంబంధించినవే. ఈ గొలుసు ఇంకా ఎంతదాకా పోతుందో చెప్పలేం.

No. of visitors : 642
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •