పోలీసుల నీడలో రాపూరు

| సాహిత్యం | వ్యాసాలు

పోలీసుల నీడలో రాపూరు

- కిరణ్‌ | 06.09.2018 11:45:52pm


జస్టిస్‌ ముల్లా 60 సం.ల క్రితం ఈ దేశంలో పోలీసులు చేస్తున్న హింస మరెవరూ చేయడం లేదని చెప్పినదానిలో నూటికి నూరుపాళ్ళు నిజం ఉందని దేశంలో ఇప్పటివరకు జరిగిన అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. రాపూరు సంఘటన కూడా అంతే. చట్టపరంగా డ్యూటీ చేయవలసిన ఎస్‌.ఐ. లక్ష్మణ్‌రావు చట్టాన్ని అతిక్రమించి రూ.2000/-ల పంచాయితీలో రాములమ్మ అనే మహిళను స్పృహతప్పేలా కొట్టాడంటే చట్టాలు, న్యాయస్థానాలు ఖాకీలను ఏమిచేయలేవని ధీమా అనేది అర్థం అవుతున్నది. లీగల్‌ విషయాలలో పోలీసులు తలదూర్చవద్దని న్యాయస్థానాలు ఎన్నిసార్లు చెప్పినా పోలీసుల తీరు ఏమాత్రం మారడం లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. పాలకులకు నిరంతరం పోలీసులతో అవసరాలు ఉంటాయి కాబట్టి పాలకులు చూసిచూడనట్టుగా వదిలేస్తుంటారు. ప్రభుత్వాలకు చెడ్డపేరు తెచ్చినప్పుడో, పాలకులకు ఇబ్బందులు కలిగినప్పుడో తప్ప మిగతా సందర్భాలలో సీరియస్‌గా పట్టించుకున్నది లేదు. అటువంటి సందర్భం ఎదురైనప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్లో, ట్రాన్సఫర్లో తప్ప శాఖపరమైన చర్యలేవి ఉండవు. ఇవి దృష్టిలో పెట్టుకొని పోలీసులు సివిల్‌ మేటర్లలో తలదూర్చడం మామూలు అయిపోయింది.

మండల కేంద్రమైన రాపూరులో మూడు దళితవాడలు ఉన్నాయి. పాత మాలపల్లెలో 150, కొత్త మాలపల్లెలో 220, మాదిగపల్లెలో 120 కుటుంబాలు జీవిస్తున్నాయి. కొద్దినెలల క్రితం కొత్తమాలపల్లెలో పక్కపక్క ఇళ్ళైన పంతగాని వరలక్ష్మి, (భర్త మధు), మేరిగ సుభాషిణి (భర్త ఏసురత్నం)కు మధ్య 5 అడుగుల స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో సుభాషిణి వేలు వాచింది. సుభాషిణి రాపూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌.ఐ.లక్ష్మణ్‌రావు వరలక్ష్మిని ఆమె భర్త మధును పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మధును కొడుతున్నప్పుడు వరలక్ష్మి అడ్డువెళ్ళింది. ఎస్‌.ఐ. వరలక్ష్మిని కూడా కొట్టడంతో వరలక్ష్మి, మధు బంధువుల సహాయంతో వెంకటగిరి మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసి వివరాలు పంపించమని కోర్టు గూడూరు సి.ఐ.ని ఆదేశించింది. కోర్టు ఆదేశించినా గూడూరు సి.ఐ. విచారణ చేయకపోవడంతో తమకు న్యాయం జరగలేదని 20-07-2018న వరలక్ష్మి జిల్లా ఉన్నతాధికారులకు రిజిస్ట్రర్‌ పోస్టుద్వారా ఫిర్యాదు చేసింది. అదే దళితవాడకు చెందిన ఏసేబుకు మాడపోతల సుబ్బారాయుడు రూ.2000/-లు ఇవ్వాలి. ఏసేబు సుబ్బారాయుడును డబ్బులు అడిగే సందర్భంలో ఇద్దరిమధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఏసేబు సుబ్బారాయుడు అతని సోదరుడు పిచ్చయ్యపై రాపూరు పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేశాడు. పిచ్చయ్య, సుబ్బారాయుడు వరలక్ష్మికి బంధువులు. వరలక్ష్మి తనమీద పై అధికారులకు కంప్లైంట్‌ చేయడానికి వీరే కారణమని అప్పటికే కొందరు ఎస్‌.ఐ. లక్ష్మణ్‌రావుకు చెప్పడంతో అదే అదనుగా భావించిన ఎస్‌.ఐ. రెండు కేసులకు సంబంధించి ఇరువర్గాలను 01-08-2018న స్టేషన్‌కు పిలిపించాడు. అవతలవారి దగ్గర డబ్బులు తీసుకొని మమ్ములను, మా ఆడవారిని స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారని పిచ్చయ్య పక్కవారికి చెపుతూ తిడుతుండడాన్ని సురేష్‌ అనే కానిస్టేబుల్‌ విని పిచ్చయ్యపై సురేష్‌ చేయిచేసుకున్నాడు. పోలీస్‌స్టేషన్‌ రూమ్‌లో కూర్చుని ఉన్న ఎస్‌.ఐ. లక్ష్మణ్‌రావు మరికొందరు బయట జరుగుతున్న గొడవను విని బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌.ఐ. లక్ష్మణ్‌రావు కూడా పిచ్చయ్యను కొట్టాడు. పిచ్చయ్య భార్య రాములమ్మ అడ్డువెళితే ఆమెను ఎస్‌.ఐ.లక్ష్మణ్‌రావు పొత్తికడుపు మీద తన్నగా కిందపడిపోయి స్పృహ కోల్పోయింది. రాములమ్మ చనిపోయిందనుకున్న భర్త పిచ్చయ్య తన బంధువులకు ఫోన్‌ చేయగా పిచ్చయ్య బంధువులు 9మంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అందరూ కలసి పోలీసులపై తిరగబడ్డారు. ఆ ఘర్షణలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. దీనిని సాకుగా తీసుకొని మూడు దళిత పల్లెలపై 300ల మంది పోలీసులు మూకుమ్మడిగా దాడిచేసి పిల్లలు, వృద్దులు, మహిళలు అనికూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టి సుమారు 100మంది యువకులను నిర్భందించి గూడూరు, దక్కిలి, పొదలకూరు, రాపూరు పోలీస్‌స్టేషన్‌లకు తరలించి విచారణపేరుతో రెండురోజులు చిత్రహింసలుపెట్టి మొత్తం 32మందిపై ఐ.పి.సి. 307, 120-బి, 353 సెక్షన్లకింద కేసులు నమోదుచేసి 19మందిని అరెస్టు చేశారు.

పోలీసులు చేసే అరాచకాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో సోనిసోరి అనే మహిళ ముఖంపై యాసిడ్‌పోశారు. దండకారణ్యంలో ఆదివాసి గర్భవతులను తుపాకీ బాయినెట్లతో గర్భాలను చీల్చి పిండాలను ముక్కలు ముక్కలు చేశారు. విశాఖ జిల్లా వాకాపల్లిలో 10మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసిన రక్షకభటులు భారతదేశంలో మహిళలకు ఎక్కడా రక్షణలేదని రుజువు చేశారు. చిన్నవాళ్ళపై దురుసుగా ప్రవర్తించే పోలీసులు దళితులపట్ల ఇంకా దూకుడుగా ప్రవర్తించడం వింతేమికాదు, కొత్తేమికాదు. హైకోర్టుల్లో మనువు విగ్రహాలు నిర్మిస్తున్న దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు దళితులకు న్యాయం చేస్తాయనుకోవడం అమాయకత్వమే. శంభూకుడిని రాముడు చంపినట్టు ఓ మాజీపోలీసు ఉన్నతాధికారి తను డ్యూటీలో ఉన్నప్పుడు పాలకులకు పెట్టుబడిదారులకు తొత్తుగా ఉంటూ హిందూమత ఆచారాలలో మునిగితేలుతూ ఎంతోమంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయించి పదవి విరమణ తర్వాత గీతా సారాంశాన్ని హిందూమత భావజాలాన్ని అనేక పద్దతులలో ప్రచారం చేస్తూ అగ్రకుల పోలీసు ఉన్నతాధికారులకు రోల్‌మోడల్‌గా నిలబడుతున్నాడు. 1996 మే,16న ఆర్‌.ఎస్‌.ఎస్‌. శక్తులు మొదటిసారిగా ఈ దేశ రాజకీయపీఠాన్ని కైవసం చేసుకొని 13 రోజుల పాటు పరిపాలన కొనసాగించినప్పుడు దళితులు, ముస్లింలు, క్రైస్తవులు బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంలా బతికిన సంఘటనలు ఇప్పుడు రోజూ ఎదురౌతూనే ఉన్నాయి.

ఆవు మాంసం తిన్నారనో, గుర్రం ఎక్కాడనో, తమకు ఎదురు చెబుతున్నారనో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి తోటి మనుషులను క్రూరంగా చంపుతూ ఉంటే కులాలు, మతాలు వదలి మనుషులంతా హేతుబద్ధంగా జీవించాలని కోరుకున్న కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే, గౌరీలంకేష్‌లను హిందూ మతోన్మాద శక్తులు కాల్చిచంపుతూ వుంటే ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న అరుణ్‌ ఫెరేరా, సుధా భరద్వాజ్‌, గౌతమ్‌ నౌలఖా, వెర్నాస్‌ గోంసాల్వేజ్‌, కామ్రేడ్‌ వరవరరావును గొంతెత్తకుండా రాజ్యం నిర్భందిస్తున్నపుడు తప్పని పరిస్థితులలో ప్రజలు అనేక పోరాటమార్గాలను ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నదే రాపూరు సంఘటన కూడా. రాపూరు ఎస్‌.ఐ. లక్ష్మణ్‌రావు ఎవరినిపడితే వారిని తిట్టడం, కొట్టడం కేసులు పెట్టడంలో నుండి రాపూరు దళిత ప్రజలు తిరుగుబాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని అగ్రకుల పోలీస్‌ అధికారులు చేసిన అరాచకమే ఇదంతా. కాబట్టి ఎస్‌.ఐ.లక్ష్మణ్‌రావును గూడూరు సి.ఐ., డి.ఎస్‌.పి.లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదుచేసి, అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదలచేయాలని అనేక ప్రాంతాలలో దళిత సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు నిరసన పోరాటాలు చేస్తున్నారు.

No. of visitors : 252
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ముసుగు సంఘం పేరుతో తప్పుడు ప్రచారమెందుకు?

ప‌చ్చ‌ల కిర‌ణ్ కుమార్‌ | 17.04.2017 10:32:33am

ముసుగులోవుండి చైతన్య మహిళా సంఘంపై తప్పుడు ప్రచారం చేస్తున్న విధ్యార్ధిని చైతన్య సంఘం ఇకనైనా ముసుగువీడి ప్రజా సమస్యలపై ప్రజలతో ప్రజా సంఘాలతో కలసి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •