బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

| సంభాషణ

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

- ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

క‌మండ‌ల్‌ శ‌క్తుల‌కు వ్య‌తిరేకంగా సాగిన మండ‌ల్ పోరాట చైత‌న్యంలోంచి ముందుకొచ్చిన త‌రానికి చెందిన ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబా ఈనాటికీ కాషాయ శ‌క్తుల‌కు కొర‌క‌రాని కొయ్య‌గానే క‌నిపిస్తున్నారు. అందువ‌ల్ల‌నే నాగ్ పూర్ కారాగారంలో దాదాపు రెండేళ్ల‌పాటు మాన‌సిక‌, శారీర‌క ఇబ్బందుల‌కు గురిచేయ‌డమే కాదు.. బెయిల్ తీసుకొని ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌ను తాను ప‌దేళ్ల‌కు పైగా బోధిస్తున్న ఢిల్లీ యూనివ‌ర్సిటీలోకి అడుగు పెట్ట‌నీయ‌డం లేదు. తొలుత అఖిల‌ భార‌త ప్ర‌జాప్ర‌తిఘ‌ట‌న వేదికని (ఏఐపీఆర్ ఎఫ్‌), ఇప్పుడు విప్ల‌వ ప్ర‌జాస్వామిక వేదికని (ఆర్‌డీఎఫ్‌)ని సామ్రాజ్య‌వాద వ్య‌తిరేక ఉమ్మ‌డి పోరాటాల‌కు, ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ నిర‌స‌న గ‌ళాల‌కు కేంద్రంగా మ‌ల‌చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలోనే పాల‌క‌వ‌ర్గాల క‌న్నెర్ర‌కు ఆయ‌న గుర‌య్యారు. ఆయ‌న పోరాట కృషితో ఆంధ‌ప్ర‌దేశ్‌-తెలంగాణ గ‌డ్డ‌కు అవినాభావ సంబంధం ఉంది. జైలు నుంచి విడుద‌ల అయిన త‌రువాత తొలిసారి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ప్రొఫెస‌ర్ సాయిబాబా విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం ఆన్‌లైన్ మ్యాగ‌జైన్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ద‌శాబ్దానికి పైగా మీరు ఢిల్లీ యూనివ‌ర్సిటీలో బోధిస్తున్నారు. అలాంట‌ప్ప‌డు జైలు నుంచి బెయిల్ మీద వ‌చ్చిన మిమ్మ‌ల్ని వ‌ర్స‌టిలోకి అనుమ‌తించ‌డం లేదు? ఆందోళ‌న చేస్తున్న ఏబీవీపీ ప్ర‌ధాన వాద‌న‌, మేనేజ్‌మెంట్ అభ్యంత‌రం ఏమిటి?


ఏప్రిల్ 4న సుప్రీం కోర్టు బెయిల్ ఆర్డర్ వచ్చింది. నేను 7వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాను. ఆ మ‌రునాడే యూనివర్సిటీకి నేను బెయిల్ పై విడుదలయ్యాననే సమాచారాన్ని రాతపూర్వకంగా తెలియజేశాను. హెల్త్ చెకప్ అనంతరం నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరతానని తెలిపాను. చెప్పినట్లుగానే 13వ తేదీన జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. కానీ.. ఉద్దేశ పూర్వకంగా గవర్నింగ్ బాడీ సమావేశాన్ని వెంటనే నిర్వహించకుండా తాత్సారం చేశారు. గవర్నింగ్ బాడీలోని సగం మంది సభ్యుల కాలపరిమితి పూర్తయ్యేంత వరకు ఆగి 21వ తేదీన‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ బాడీలో సంఘ్ పరివార్ నేప‌థ్యం క‌లిగిన స‌భ్యులే మిగిలారు. వారు ముందస్తుగా బయటి నుంచి ఏబీవీపీ వాళ్లను తీసుకువచ్చారు. నేను యూనివర్సిటీకి వెళ్లడంతోనే ఏబీవీపీ గూండాలు నాపై దాడికి యత్నించారు. యాంటి నేషనల్, దేశద్రోహి, నక్సలైట్ అంటూ నినాదాలిచ్చారు. సాయిబాబను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటే విద్యార్థులను నక్సలైట్లుగా మార్చుతాడంటూ గొడవ చేశారు. నా వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు... ఏబీవీపీ వాళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డారు. నేను యూనివర్సిటీకి వెళ్లిన నాలుగు సార్లూ ఇలాంటి వాతావరణాన్నే సృష్టించారు. చివరకు నా విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకునేందుకు ఏక వ్యక్తి కమిటీని వేశారు. నేను రావడం వల్ల వ‌ర్సిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయ‌ని బాడీ తేల్చింది. నన్ను వర్సిటీకి రావద్దని చెప్పింది. వర్సిటీలోకి బయటి నుంచి వచ్చి గొడవ చేసే అరాచక శక్తులను ప్రోత్సహిస్తూ ఒక అధ్యాపకుడిని యూనివర్సిటీకి రావద్దని ఆదేశించడం ఎలాంటి ప్రజాస్వామ్యమో మరి. ఇదంతా చూస్తుంటే, జైలు పోరాటానికి కొనసాగింపు ఇంకా ఉందనిపిస్తోంది. అధ్యాపకుడిగా నాకున్న బోధ‌నా హక్కు కోసం పోరాడి తీరుతాను

బోధించే ఆచార్యుల హ‌క్కుల‌కే దిక్కు ఉండ‌టం లేదు. మ‌రి విద్యార్థుల స్వేచ్ఛకు క‌లుగుతున్న భంగం అంతాఇంతా కాదు. చ‌ర్చ‌ల‌కు, స‌మాలోచ‌నలకు, దృక్ప‌థ సంయోజ‌నాల‌కు, సామాజిక గ‌తి ప‌రిశీల‌న‌, విశ్లేష‌ణ‌ల‌కు వేదిక‌లుగా ఉండాల్సిన విశ్వ‌విద్యాల‌యాల్లోని ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు కార‌ణం ఏమంటారు?


ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలకు అవకాశం లేకుండా చేయాలనేది కుట్ర. అందులో భాగంగానే ముందుగా ఏవో కొన్ని అంశాల పట్ల తమ అనుకూల బృందాల చేత అత్యంతరాలు వ్యక్తం చేయిస్తారు. దేశ వ్యతిరేకం, జాతి వ్యతిరేకం పేరిట ఫిర్యాదులు చేయిస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ యాజమాన్యం విద్యార్థులపై చర్యలకు పాల్పడుతుంది. హెచ్‌సీయూలోగానీ, జేఎన్‌యూలో గానీ, చెన్నై ఐఐటీలో గానీ ఇదే జరిగింది. చూడడానికి ఇవన్నీ వేటికవి వేరు వేరు సంఘటనలుగా కనిపించినా.. ఒక ప‌ద్ధ‌తి ప్రకారం జరిగినవే. తద్వారా భయానక వాతావరణం సృష్టించాలని ప్ర‌భుత్వం అనుకొంటుంది.

నేష‌న‌ల్‌, యాంటి నేష‌న‌ల్ వంటి వాదాల‌ను వింటున్నాం. కాషాయ శ‌క్తుల దూకుడును అడ్డుకొనే క్ర‌మంలో ఉదార‌వాద మేధావుల నుంచి ప్ర‌గ‌తిశీల వాదుల దాకా.. అంతా ఈ చ‌ర్చ‌ను ఏదో కొస‌న మంటిస్తుండ‌టం చూస్తున్నాం. అస‌లు యాంటి నేషనల్ లాంటి వాదాలను ఎలా అర్థం చేసుకోవాలి?


మొత్తం సమాజంలోనే ఒక సంక్షోభం నెలకొన్నప్నుడు సహజంగానే యువత దానికి స్పందిస్తుంది. పాలక వర్గాన్ని ప్రశ్నిస్తుంది. ఈ విషయాన్ని కమ్యూనిస్టుల కంటే హిందుత్వ శక్తులు భాగా అర్థం చేసుకున్నాయి. సంక్షోభ సమయంలో యువతను ఆర్గనైజ్ చేయడాన్ని కమ్యూనిస్టులు పట్టించుకోలేదు. కానీ సంఘ్ ఈ విషయంలో అలర్ట్ గా ఉంది. మిలిటెంట్ సెక్షన్‌ని తమ దారిలోకి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. 1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట్‌ శక్తులు తమ వైపు తిప్పుకున్నాయి. ఇప్పుడు సంఘ్ పరివార్ కూడా హిట్లర్ భాటలోనే నడుస్తోంది. సమస్యలు కాని వాటిని సమస్యలుగా ముందుకు తెచ్చి అసలు విషయాల్ని పక్కదోవ పట్టిస్తుంది. నేషనల్, యాంటీ నేషనల్ లాంటి వాదాలూ అలాంటివే. ఈ వాదాల వల్ల ప్రజల సమస్యలేవీ పరిష్కారం కావు. కొద్ది మంది చేతుల్లో సంపద కేంద్రీకరించబడడం వల్ల ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతాయి. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు కదలకుండా పక్కదోవపట్టించేదుకే ఈ ప్రయత్నాలన్నీ.దేశాన్ని పాలిస్తున్న పాలకవర్గాలు వనరుల్ని సామ్రాజ్యవాదులకు అప్పగించడం కంటే పెద్ద దేశద్రోహమేమీ ఉంటుంది.

పులులు శాంతిస‌భ పెడితే మేక‌ల‌న్నీ వెళ్లి ఆ స‌భ‌ని విజ‌య‌వంతం చేసిన‌ట్టు ఉంది ప‌రిస్థితి. అస‌లు విశ్వ‌విద్యాల‌యాలు సంఘ్ ప‌రివార్ ఎజెండాలోకి రావ‌డానికి కార‌ణం ఏమిటి?


యువతను ఐడియాలజికల్‌గా మౌల్డ్‌ చేసుకొనే లక్ష్యంతో సంఘ్ పరివార్ పనిచేస్తోంది. అందుకోసం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను వాడుకొంటోంది. దేశ వ్యాపంగా సంఘ్ పరివార్ నిర్వహించే సరస్వతీ మందిరాల్లో 36 లక్షల మంది విద్యార్థులున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వాళ్లందరినీ ఫాసిస్ట్ ఐడియాలజీ వైపు మళ్లించే యత్నం జరుగుతోంది. బీజేపీ వచ్చాక హెచ్ఆర్డీ మిసిస్టర్‌ స్మృతి ఇరానీని నియమించడం వెనుక ఇదే ఐడియాలజీ ఉంది. స్మృతిఇరానీ ఆర్ఎస్ఎస్‌తో నేరుగా సంబంధాలు కలిగిన వ్యక్తి. మొత్తం విశ్వవిద్యాలయాలను సంఘ్ పరివార్ శ్రేణులతో నింపివేశారు. గవర్నింగ్ బాడీలు, అధ్యాపకులు పూర్తిగా సంఘ్ పరివార్ కనుసన్నల్లో పనిచేసేవారే. పథకం ప్రకారం తమ ఐడియాలజీకి అనుగుణంగా ఇనిస్టిట్యూషన్స్‌ని మలుచుకునే కుట్రలో భాగం ఇది. ఇదంతా నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నడుస్తోంది. కేవలం విద్యాలయాలే కాదు.. అన్ని ప్రభుత్వ విభాగాలనూ పూర్తిగా కాషాయ శక్తులతో నింపివేస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ప్రారంభించిన జనజాగరణ కార్యక్రమంతో గిరిజనులను హిందూ మతంలోకి బలవంతంగా మార్చుతున్నారు. ర‌క్ష‌ణ శాఖ స‌హా ప్రతి రాజ్య విభాగం సంఘ్ ప‌రివార్ శ్రేణులతో నిండిపోయింది. కొత్తగా అంబేద్కర్ జయంతులు, భగత్ సింగ్ వర్థంతులు సైతం నిర్వహిస్తూ అంబేద్కర్, భగత్ సింగ్ సిద్ధాంతాలను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు యత్నిస్తోంది. అయితే, ఇంత చేసినా రాడిక‌ల్ శ‌క్తుల‌ను లొంగదీసుకోవడం కష్టం కనుక, వాళ్లపై దాడులకు పాల్పడుతున్నారు.

రాడిక‌ల్ శ‌క్తుల‌ను చంపివేయ‌డం లేదంటే వారి య‌వ్వ‌నమంతా ఉడికిపోయేదాకా.. రాజ‌కీయ ఖైదీలుగా ఏళ్ల‌కు ఏళ్లు జైళ్ల‌లో పెట్ట‌డం చేస్తున్నారు. అలాంటి వారి విడుదల కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగాల్సి ఉంది?


దేశ వ్యాపంగా 10వేలకు పైగా రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. ముఖ్యంగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలు, టెర్రరిస్టుల పేరుతో ముస్లింలు చెర‌లో ఉన్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్, ఒడిశాల్ల‌ అత్యధికంగా ఆదివాసీలు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరిపై 80 నుంచి 100కి పైగా కేసులు ఉన్నాయి. వాళ్ల తరపున వాదించడానికి న్యాయవాదులు కూడా ఉండరు. నాతో పాటు నాగ్ పూర్ జైల్లో ఉన్నవాళ్లలో మెజారిటీ ఆదివాసీలే. గ్రామాల నుంచి పట్టుకొచ్చి వారిపై అక్రమ కేసులు బనాయిస్తారు. వాళ్లకు అసలు... జైలు, కోర్టు లాంటి వ్యవహారాలేవీ తెలియ‌వు. అలాంటి వారిని చార్జిషీటు కూడా వేయకుండా సంవత్సరాల తరబడి బయటకు రాకుండా చేస్తారు. ఒకవేళ శిక్ష అనుభవించి విడుదలైనా తిరిగి మళ్లీ జైలు గేటు ముందే అరెస్టు చేసి కొత్త కేసులు బనాయిస్తారు. నగరాల్లో ఉండేవాళ్లు తమకు తెలియకుండానే చాలా ఆంక్షలకు అనుగుణంగా స‌ర్దుకొని జీవిస్తుంటారు. కానీ ఆదివాసీలు స్వేచ్ఛగా జీవించేవారు. వాళ్లకు ఆంక్షల మధ్య, సర్థుకొని జీవించడం తెలియ‌దు. అలాంటి వాళ్లను ఏళ్లకు ఏళ్లు జైలుకు పరిమితం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంది. జైళ్లలో మగ్గుతున్న ముస్లింలు, ఆదివాసీల గురించి ఆలోచించాలి. కనీసం జైళ్లలో ఉన్నవాళ్లందరి జాబితా ఉందా మన దగ్గర?

జైలులోనే కాదు.. జ‌నాభాలోనూ మీరు చెబుతున్న‌వారి జాబితా క‌నిపించ‌డం లేదు. మావోయిస్టు ఉద్య‌మం ప‌నిగ‌ట్టుకొని చేసిన ప్ర‌య‌త్నాల వ‌ల్లనే మ‌నం కొన్ని ఆదివాసీ పేర్ల‌నైనా ప‌ల‌కగ‌లుతున్నాం. అలాంటి ఉద్యమంపై మేధో, సైద్ధాంతిక స్థాయిలో చ‌ర్చ‌ను పురిగొల్పుతున్న మీ వంటి ప్ర‌గ‌తిశీల‌, ప్ర‌జా చైత‌న్యశీలురపై రాజ‌ద్రోహం ముద్ర వేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఈ రాజ‌ద్రోహాలు, దేశ‌ద్రోహాలు, ఉపాలు, కుట్ర‌కేసులు ప్రశ్నించే గొంతులను అడ్డుకోగలవా?


నాపైనే కాదు, ఎవరి మీదైనా పెట్టిన తప్పుడు కేసులు నిలవవని పోలీసులకు తెలుసు. కానీ వాళ్లు వీలైనంత మేరకు ప్రశ్నించే గొంతులను నొక్కిపెట్టాలనుకుంటారు. ఉద్యమకారుల కార్యాచరణను అడ్డుకోవాలనుకుంటారు. నన్ను అరెస్టు చేసిన అధికారులు విచారణలో... "నువ్వు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం మానేస్తే వదిలేస్తామ"న్నారు. అందుకు అంగీకరించనందువల్లే నన్ను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. బినాయక్‌సేన్ విషయంలోనూ అదే జరిగింది. సాల్వాజుడుంకి వ్యతిరేకంగా పనిచేసిన వినాయక్ సేన్ ని దాదాపు రెండు సంవత్సరాల పాటు జైలులో బంధించారు. సాల్వాజుడుం స్థానంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొద‌ల‌యిన క్ర‌మంలో, దానికి వ్య‌తిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాను. దాదాపు 40 దేశాల్లో మాట్లాడాను. అందుకే, నాపై తప్పుడు కేసులు మోపి జైలులో బంధించారు.

ఇంత జ‌రుగుతున్నా మోడీ స్పందించ‌డు. గుజ‌రాత్ సంద‌ర్భంలో ముస్లింల‌ను "కారు కింద ప‌డిన కుక్క పిల్ల‌ల"తో పోల్చిన‌ట్టు, మోడీత్వ‌- స్మృతిబ‌ద్ధ హ‌త్య‌కు బ‌లైన వేముల రోహిత్ ను "భ‌ర‌త‌మాత బిడ్డ"గా అభివ‌ర్ణిస్తాడు. ఆయ‌న ఏమ‌న్నా ఎత్తిప‌ట్ట‌డానికి ప్రాంతీయ‌, జాతీయ మీడియా చాన‌ళ్లు సిద్ధంగా ఉంటాయి. ఇంత‌కీ మోడీ - మీడియా అనుబంధం ఎవరి ప్రయోజనాల కోసం?


మీడియాను కంట్రోల్ చేయడం కోసం 2014 ఎన్నికలకు ముందే మోడీ ఒక మెకానిజం సిద్ధం చేసుకున్నాడు. అందుకోసం 500 కోట్లు వెచ్చించి విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకున్నాడు. అవి ఎన్నికల తరువాత కూడా కొనసాగుతున్నాయి. మోడీ టీంలోని అంతర్జాతీయ కన్సల్టెన్సీలు మీడియాను కంట్రోల్ చేయడంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాయి. జేఎన్ యూ లాంటి సంఘటనల్లో మార్పింగ్ వీడియోలు ఎలా సృష్టించారో గమనించవచ్చు. అదంతా ప్రీ ప్లాన్డ్ వ్యవహారం. నేను ముందే చెప్పినట్లు ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మీడియాను వినియోగించుకుంటారు. కార్పొరేట్ ప్రయోజనాలు, పాలక వర్గాల ప్రయోజనాలు ఒకటే కావడం వల్ల ఇదంతా సులభంగా జరుగుతోంది.

మీ విష‌యానికి వ‌స్తే.. మీరు ప‌నిచేసిన ఏఐపీఆర్ఎఫ్‌కు తెలంగాణ ఉద్య‌మంతో విడ‌దీయ రాని బంధం ఉంది. ప్ర‌త్యేక రాష్ట్రంలో ఈనాడు ప్ర‌జాస్వామిక తెలంగాణ నినాదం బాగా పుంజుకొంటోంది. ఆ నినాదానికి పురుడుపోసిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ నేప‌థ్యం ఏమిటి?


1998లో ఏఐపీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వరంగల్ డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఆ సందర్భంగానే ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ఇచ్చాం. ప్రజాస్వామిక తెలంగాణ అంటే తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాలి. అణగారిన‌ వర్గాలకు సమాన అవకాశాలు, హక్కులు లభించాలి. కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా పాలక వర్గాలు పాలక వర్గాలుగానే, అణగారిన వర్గాలు అణగారిన వర్గాలుగానే ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించినా ప్రయోజనం ఉండదన్నాం. ఈ సందర్భంగా పెద్ద చర్చ జరిగింది. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజాస్వామిక తెలంగాణ అనే కండిషన్ పెడితే ఎలా? అలా అయితే రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదు" అని వాదించారు కొందరు. "ముందు తెలంగాణ రానివ్వండి. తరువాత ప్రజాస్వామిక తెలంగాణ గురించి మాట్లాడుదా"మన్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం... ప్రజల జీవితాల్లో మార్పు రాకుండా భౌగోళిక తెలంగాణ సాధించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజాస్వామిక తెలంగాణ అనే కండిషన్ ఏమీ లేదు. ముఖ్యంగా ఆంధ్ర వలసవాదులు ఇక్కడి వనరులను కొల్లగొట్టారు. హైదరాబాద్‌లో అక్రమంగా వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. ఇక్కడి వనరులపై స్థానిక ప్రజలకే హక్కు ఉండాలి. కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆంధ్ర వలసవాదులు ఆక్రమించుకున్న ఆస్తుల ప్రస్తావ‌నే లేదు. తెలంగాణ భూస్వామ్య శక్తులు ఇప్ప‌టికీ ఆంధ్ర పాలక వర్గాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణ‌లో పౌర హ‌క్కుల‌కు కాప‌లా కుక్క‌లా ఉంటాన‌ని, న‌క్స‌లైట్ ఎజెండాను ప్ర‌త్యేక రాష్ట్రంలో అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. అధికారంలోకి వ‌చ్చిన తొలినాటి నుంచీ ర‌క్తం పారిస్తున్నాడు. మాట‌, ఆట‌, పాట బంద్ అంటున్నాడు. ఈ మ‌ధ్య వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక స‌భ‌లో మిమ్మ‌ల్ని, వ‌ర‌వ‌ర‌రావును, మ‌రికొంద‌రిని కోర్టు ఉత్త‌ర్వుల పేరిట వేదిక ఎక్క‌నీయ‌లేదు. ఈ ప‌రిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి?


తెలంగాణ ఏర్పడినా కేంద్రం నియంత్రణ, కోస్తాంధ్ర నియంత్రణ కొనసాగుతూనే ఉన్నాయి. బీహార్, ఆంధ్ర తదితర ప్రాంతాలకు చెందిన పాలకవర్గాలు దేశ వ్యాప్తంగా బస్తర్, జార్ఖండ్, లాల్ గ‌ఢ్‌, తెలంగాణ వంటి ప్రాంతాల్లోని ఖనిజ సంపద, అడవి వనరులపై వ్యాపారం చేస్తున్నాయి. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటూ వనరులను దోచుకుంటున్నాయి. ఈ దోపిడీని అడ్డుకంటే ప్రజాస్వామిక తెలంగాణకు ద్వారాలు తెరుచుకున్నట్లవుతుంది. ఆ విష‌యం తెలుసు కాబ‌ట్టే తెలంగాణ ప్ర‌భుత్వం ఇక్కడి ప్రజా ఉద్యమాలపై అణచివేతను ప్రయోగిస్తూ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. సుదీర్ఘ పోరాటం ద్వారా తమ ఆకాంక్షలను ప్రకటించిన తెలంగాణ ప్రజల కల ప్రజాస్వామిక తెలంగాణలోనే సాకారం అవుతుంది.

No. of visitors : 2845
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ...
...ఇంకా చదవండి

అమ‌ర‌త్వ‌పు జాడ‌ల్లో...

ఫొటోలు : క‌్రాంతి | 22.07.2016 12:11:40pm

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా జూలై 18న హైద‌రాబాద్‌లో జ‌రిగిన రాజ్య‌హింస వ్య‌తిరేఖ స‌భ దృశ్యాలు.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •