ముందు బాక్సైట్‌ సంగతి చూడండి

| సంపాద‌కీయం

ముందు బాక్సైట్‌ సంగతి చూడండి

- పాణి | 30.09.2018 10:41:34pm

అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య మీద చాలా మంది అంగలారుస్తున్నారు. ఆదివాసుల నుంచి ఎదిగిన నాయకులను చంపేస్తారా? అంటున్నారు. ఒకవేళ ఆదివాసులు కాకపోయి ఉంటే అప్పుడు ఇంకో రకమైన నిట్లూర్పులు వినిపించేవి. అసలు ఎవర్నీ చంపే దాకా పరిస్థితులు పోకూడదు. దీని మీద ఎవరూ సిద్ధాంతాలు చెప్పనవసరం లేదు. అది చాలా మామూలు మానవతా వైఖరి. వివరాల్లోకి వెళితే ఎంతయినా మాట్లాడుకోవచ్చు.

మావోయిస్టులు వ్యక్తిగత హింసావాదం ఇంకా వదులుకోలేదా? ఇట్లా విప్లవం వస్తుందా? అనే రాజకీయ చర్చ కూడా మరి కొందరు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విప్లవ వ్యూహ చర్చ కూడా చేసుకోవచ్చు. కాదనేది లేదు. అవన్నీ చాలా అవసరమైనవే. విప్లవానికి సంబంధించిన ఏ చర్చకైనా సిద్ధం కావడం బాధ్యత.

కానీ వ్యవహారం నిర్దిష్టంగా ఉండాలి. ఈ హత్యా ఘటన జరిగిన ప్రాంతంలో బాక్సైట్‌ సమస్య ఉంది. ముందు ఆ సంగతి మాట్లాడుకోవాలి. అది లేకుండా ఆ చివర అస్తిత్వాల దగ్గరి నుంచి, ఈ చివర విప్లవ కార్యక్రమాల దాకా మాట్లాడుకుంటే సాగతీత అవుతుంది. నికరంగా తేలేది ఏమీ ఉండదు. నాలుగు రోజులుగా దిన పత్రికలు ఠంచనుగా ఒకటి రెండు పేజీలు ఈ ఘటనకే కేటాయించాయి. ఈ హత్యలు ఎలా జరిగాయి? వ్యూహకర్తలెవరు? ఎలా అమలు చేశారు? అనే భోగట్టా వండుతూనే ఉన్నాయి. రెండు ప్రభుత్వ అనధికార పత్రికలు పూర్తిగా ఈ పనిలో తలమునలయ్యాయి. ప్రతిపక్ష పత్రిక పనిలో పనిగా తన సొంత వ్రయోజనాలకు తగినట్లుగా వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటోంది.

దీనికి భిన్నంగా విషయాన్ని చూడలేమా? అనేదే ప్రశ్న.

బాక్సైట్‌తో సంబంధం లేకుండా ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోని ఏ హత్యల గురించీ మాట్లాడటం సబబు కాదు. ఇప్పుడు ఈ ఇద్దరి హత్యలనే కాదు, కనీసం గత పదిహేనేళ్లుగా ఏవోబీ అనబడే విప్లవోద్యమ ప్రాంతంలో ఎన్ని డజన్ల మందిని హత్య చేశారు. రాంగుడా మారణకాండ గుర్తుండే ఉంటుంది. 31 మందిని హత్య చేశారు. ఆ తర్వాత కూడా హత్యలు జరిగాయి. వాళ్లలో చాలా మంది ఆదివాసులే. కాకపోతే వాళ్లు గనుల బినామీ ఓనర్లు కాదు. ఆ పార్టీని, ఈ పార్టీని పట్టుకొని ఎమ్మెల్యేలు కాలేదు. అయితే ఆదివాసులే. ఆ హత్యలను ఇప్పటి ఘటనకు పోటీ తేవడం లేదు. ఎందుకంటే హత్యలకు హత్యలను పోటీ పెట్టడం విప్లవ నీతి కాదు. అయితే ఈ అన్ని హత్యలకు బాక్పైట్‌తో సంబంధముంది. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. ఆ మాటకొస్తే బాక్సైటే కాదు, ఏవోబీలోని సహజ సంపదతో సంబంధం ముడిపడి ఉంది.

బాక్సైట్‌ తవ్వకాలు వద్దని, మొత్తంగా అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి కంపెనీలు రావద్దని ఆదివాసులు పోరాడుతున్నారు. ఎమ్మెల్యే పదవిని, ప్రభుత్వ ప్రాపకాన్ని అడ్డం పెట్టుకొని బాక్సైట్‌ తొవ్వుకొని వెనకేసుకుంటున్నాడు కిడారి. ఇదీ అసలు సమస్య. ఇదొక్కటే సమస్య. అత్యంత శక్తివంతమైన అస్తిత్వం ఆస్తి దగ్గర, అధికారం దగ్గర దుర్బలమైపోవడమే ఈ హత్యల వెనుక ఉన్న విషాదం. ఎవరైనా దీనికి వగచాలి. ʹనా ఆదివాసీ జనం కదా? వాళ్లదీ నాదీ ఒకే ఉమ్మడి సాంఘిక అస్తిత్వ పునాది కదా? నాకు ఈ ఎమ్మెల్యే పదవైనా ఉన్నది.. వాళ్లకు ఈ తవ్వకాల వల్ల జీవితమే తుడిచిపెట్టుకొని పోతుందే..ʹ అనే ఫీల్‌ కలగాలి. చైతన్యం అనేంత పెద్ద మాట దీనికి ఉపయోగించాల్సిన పని లేదు. ఇలా అనుకోవడం అస్తిత్వ సహజ లక్షణం. అది సామాజికం, చారిత్రకం. ʹమా అదివాసులం.. మేమంతా ఒక్కటి, మీరు వేరే..ʹ అనే అస్తిత్వ కైవారం ఆస్తి దగ్గర ధ్వంసమైపోయినందుకు దు:ఖించాలి.

అతి ప్రాచీన సాంఘిక ఆదివాసీ అస్తిత్వాన్నే ఆస్తి, ఆధికారం ఇంతగా తుత్తినియలు చేసింది. మరి మిగతా అస్తిత్వాల ఉనికి ఏమిటి? వాటి ఆధారంగా మనం తయారు చేసుకుంటున్న సిద్ధాంతాల మాటేమిటి? రాజకీయ వ్యూహాల మాటేమిటి? ఎంత ఆర్దృమైన భావనలు, వర్ణనలు నిర్మించకున్నాం..ఇవన్నీ పరంపరాగత జీవన మూలాల సున్నితత్వంలోంచి ఒడిసిపట్టుకున్నవి కదా? ʹమేమూ.. మీరూʹ అనే అత్యంత మౌలిక అస్తిత్వ దినుసే ఇలా తేలిపోవడాన్ని ఏమనుకుందాం?
కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్యలతోగాని మనకు ఈ ఎరుక కలగలేదా?

నేల గర్భంలో ఎప్పటి నుంచో దాక్కొని ఉండి ఇప్పుడిలా బైటపడే క్రమంలో బాక్సైట్‌ ఎంత విషాదాన్ని నింపింది.

ఇంతకూ బాక్పైట్‌ బలీయమైనదా? వేల ఏళ్ల ఆదివాసీ సాంఘిక అస్తిత్వ మూలాలు బలీయమైనవా? గనుల తవ్వకాల నుంచి వెలికి వచ్చింది బాక్సైటేనా? లేక ఆస్తిత్వ తవ్వకాల నుంచి వర్గమనే మహమ్మారి వెలికి వచ్చిందా?

భూమ్మీది మానవ సమాజాలన్నీ వర్గ సమాజాలుగా విడిపోవడం ఇలాగే జరిగి ఉండొచ్చు.

కిడారి సర్వేశ్వరరావు ఓ పదేళ్ల కింద, పాతికేళ్ల కింద ఎలా ఉండి ఉంటాడు? ఆయన అలాగే ఉండిపోవాలని కోరుకోడానికి మనమెవరం? కానీ ఆయనకూ, ఆయనలాంటి అసంఖ్యాక ఆదివాసులకూ మధ్యలోకి బాక్సైట్‌ వచ్చేసింది. ఆస్తి వచ్చేసింది. అంతకంటే ముందే కావచ్చు.. ʹవీళ్లందరూ మా ఆదివాసులు, ఇదంతా మా ఆదివాసీ ఏరియా, అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం ఉండొద్దా..ʹ అనే అస్తిత్వ ప్రకటనతో ఆయన రాజకీయ నాయకుడయ్యాడు. కావద్దని మనమెందుకు అంటాం? కావచ్చు. అయితే ఈ పక్క ఆయన ఆదివాసీ అస్తిత్వం చట్టసభలోనో, బాక్సైట్‌ గనుల్లోనూ చిక్కుకపోయింది. ఆ పక్క అసలు ఆదివాసులు తమ అస్తిత్వాన్ని వర్గంగా గుర్తించుకోవాల్సి వచ్చింది. కిడారి సర్వేశ్వరరావు అనే ఎమ్మెల్యే వేరు, ఆదివాసులుగా బాక్సైట్‌ తవ్వకాలతో దోపిడీకి బలైపోతున్న మేం వేరు అనే విభజన జరిగిపోయింది.

మరి ఆదివాసీ అస్తిత్వం ఏమైంది?

దీన్నెందుకు చూడకూడదు? చూసీ వదిలేద్దామా?

కిడారి కూడా గతంలో బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించాడు. మిగతా అన్ని రకాల మైనింగ్‌ వద్దని పల్లెలు తిరిగాడు. ఎప్పుడు? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు. బహుశా ఆ రాజకీయాల్లోకి వెళ్లక ముందు కూడా ఆదివాసీలందరిలాగా మైనింగ్‌ వద్దనే అని ఉంటాడు. మైనింగ్‌ అంటే ఆస్తిని వెలికి తీయడం, ఆదివాసీ జీవన అస్తిత్వాన్ని మెల్లగా రద్దు చేయడం. కిడారి సర్వేశ్వరరావు మైనింగ్‌ వద్దనే దగ్గరి నుంచి మైనింగ్‌ యజమాని అయ్యాడు. అందుకే ఆయన హత్య వార్త వినగానే విదేశం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివాసీ నాయకుడ్ని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన చెందాడు. అది మొదలు అందరూ ఆదివాసీ నాయకులను చంపుతారా? అనే పాట అందుకున్నారు. వీళ్లన్నా కాకున్నా ఆయన ఆదివాసీ కాకుండాపోడు. చాలా మందికి కిడారి పార్టీ మారిన సంగతే తెలుసు. ఆయన తన అస్తిత్వం నుంచే ఫిరాయించి అవతలి వర్గంలో చేరాడు. ఈ సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. అస్తిత్వమనే పుట్టక గుర్తింపు పోదు కాబట్టి ఆదివాసీ ఆనాల్సిందే. తప్పదు.

కాకపోతే గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అవతలి వర్గానికి అస్తిత్వాలను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అన్ని అస్తిత్వాలతో కూడిన వర్గంగా ఎలా సంఘటితంగా ఉండాలో తెలుసు. వివిధ పీడిత అస్తిత్వాల నుంచి తన వర్గం వైపు మొగ్గు చూపుతున్న వాళ్లను ఎలా పికప్‌ చేసుకోవాలో అంతకంటే బాగా తెలుసు. అయితే అవతలి వర్గంలో తనకు దొరికిన చోటు ఎంతో కిడారికీ తెలిసి ఉండాలి.

వివరాల్లోకి వెళితే కిడారి దళారీ కాకుండా విప్లవోద్యమం కాపాడుకొని ఉండవచ్చు కదా? చాలా సహజంగా జరిగే ఇలాంటి పరిణామాన్ని నిలువరించి ఉండవచ్చు కదా? ఆదివాసీ ప్రాంతంలోనే సాధ్యం కాకపోతే ఇంకెక్కడ సాధ్యమవుతుంది? పోనీ అతనలా తయారయ్యాడనే అనుకుందాం.. ఎన్ని సార్లు హెచ్చరించారు? ఉత్తరాల్లోనా? నేరుగానా? అయినా సరే ఆదివాసీ కదా? ఈ వ్యవస్థ అనే సాగరాన్ని అల్లకల్లోలం చేస్తున్న సొర చేపలు, పెద్ద చేపలు ఎన్నో ఉండగా అవేవీ కాక ఈ చిన్న చేపకు శిక్ష ఏమిటి? అవి దొరకలేదని ఈ చేపకు వల వేశారా? ఇలా ఎంతో చర్చ చేయవచ్చు.

ఇవేవీ అస్తిత్వాల్లో ఆస్తి, అధికారం తెచ్చే వర్గ విభజనను వివరించజాలవు.

అవతలి వర్గంలోకి వెళ్లినవాళ్లనల్లా చంపేసుకుంటూ పోతారా? అట్లా చంపి విప్లవం తేగలరా? అనే ప్రశ్నలూ ఎదురయ్యేవే. చంపడమే ఒక విధానం కానేకాదు. విధానంలో భాగంగా చంపేదాకా పోకపోవడమే అసలు విధానం. అస్తిత్వాలతో నిమిత్తమే లేదు. ఉన్నది అస్తిత్వపు సంకెళ్ల నుంచి విముక్తి ఎలా? అనే. ఆదివాసులు ఒక ప్రత్యేకమైన సాంఘిక అస్తిత్వం ఉన్న జనాలే కాదు. వర్గాలుగా చీలిపోయిన జనం కూడా. రకరకాల గనుల తవ్వకాల వల్లే కాదు, అంతక ముందు కూడా వర్గాలుగానే ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో సాల్వాజుడుం అనే హంతక సైన్యాన్ని ఆదివాసుల నుంచే తయారు చేసి ఆదివాసుల మీదే ఉసికొల్పి మారణకాండ సృష్టించిన మహేంద్రకర్మ కూడా ఆదివాసీనే. ఆయన పూర్వీకులు బ్రిటీష్‌ ఏజెంట్లుగా పని చేసి ఆదివాసీ ఆకాంక్షలపై, పోరాటాలపై దాడులు చేయించారట. ఈ వర్గ మూలాలను విప్లవోద్యమం అక్కడికి వెళ్లాకనే బైటికి తీసింది. మహేంద్రకర్మను హత్య చేయక తప్పలేదు.

అట్లని మహేంద్రకర్మను, కిడారి సర్వేశ్వరరావును ఒకే బ్రాకెట్‌లో ఎందుకు పెట్టాలి? అసలు ఏ ఇద్దరు వ్యక్తులనైనా ఒక బ్రాకెట్లో ఎలా ఇరికించగలం? ఎవరి ప్రత్యేకత వారిదే. కామన్‌ పాయింట్‌ ఏదైనా ఉంటే అది వర్గానికి సంబంధించిందే. కొందరు ఇలాంటి వ్యక్తులను అస్తిత్వం అనే కామన్‌ పాయింట్‌ మీద నిలబెట్టి మావోయిస్టులను బోనెక్కించాలనుకుంటున్నారు. కానీ కిడారి లాంటి వాళ్లు తమంతకు తామే వర్గమనే కామన్‌ పాయింట్‌ మీదికి వచ్చి నిలబడ్డారు. అస్తిత్వాన్ని కాలదన్ని. మళ్లీ చెప్పాలంటే అదీ అసలు విషాదం. ఇది ఆ వ్యక్తుల చేతిలో ఉండేది కూడా కాదు, వాళ్లు కాకుంటే మరొకరు. ఆదివాసులే కాకపోతే ఆదివాసేతరులు గనులు తవ్వుకుంటారు. అంతా తొవ్వుకపోతున్నది అలాంటి మల్టీ నేషనల్‌ కంపెనీలే. మేమూ ఎందుకు గనులు తొవ్వుకోకూడదని కిడారిలాంటి వాళ్లు వాటా కోసం వస్తారు. సరిగ్గా అస్తిత్వం అక్కడ వాళ్లకు సరుకు అయింది. ఆ తర్వాతే బాక్సైట్‌ సరుకైంది.

ఆ పక్కనేమో ప్రాచీన అస్తిత్వ సంకెళ్లతోపాటు సరుకును, మార్కెట్‌ను, బూర్జువా ఆధిపత్య దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసులు వర్గంగా సంఘటితమవుతున్నారు. ఆదివాసుల్లోని పీడిత వర్గమే విప్లవం తెస్తుందా? అనే సిద్ధాంత సంబంధమైన ప్రశ్న తప్పక ఎదురయ్యేదే. విప్లవం తెచ్చే వర్గంలో ఆదివాసులు కూడా ఒక భాగం. ఆదివాసీ ప్రాంతాలు విప్లవానికి వ్యూహాత్మక స్థావరాలు. అంత వరకే. అంత కంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. ధ్వంసం చేయాల్సిన అసలు వ్యవస్థ బైటే ఉన్నదని, అది కొమ్ములు తిరిగిన ఆంబోతని కూడా విప్లవోద్యమానికి ఎరుకే. ఆ మాత్రం తెలియకుండా దేశ విప్లవాన్ని ఎజెండా ఎలా చేసుకుంటారు? ఆదివాసీ ప్రాంతాల విముక్తితో సరిపుచ్చుకుందామనుకోవడం లేదు. మామూలు కవితాత్మక వాక్యాల్లోనే ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేయడం తమ లక్ష్యమని విప్లవకారులు చెప్పుకుంటారు. దండకరణ్యం, ఏవోబీ, ఝార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమ కనుమల్లో దశాబ్దాలుగా సాగుతున్న పెనుగులాట అర్థం ఏమిటి? అత్యంత ప్రాచీనమైన అస్తిత్వాల్లోని ప్రగతి వ్యతిరేక మూలాల నుంచి ఎలా విముక్తి కావాలి? అనే. అంత మాత్రమే కాదు, వర్గ దోపిడీ నుంచి ఎలా బైటికి రావాలి అనే పోరాటం అక్కడ ప్రధానంగా ఉన్నది. ఆ దిశగా మావోయిస్టు ఉద్యమం గతంలో పని చేసింది, చేస్తోంది. ఇప్పటికి ఉన్న వ్యూహాలు చాలకపోతే, సరిపోకపోతే కొత్తవి తయారు చేసుకుంటుంది. మిగతా వాళ్లు కూడా ఆ పనికి ఎందుకు సిద్ధం కాకూడదు?

No. of visitors : 527
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •