అప్పుడు

| సాహిత్యం | క‌థ‌లు

అప్పుడు

- క‌ట్టా సిద్ధార్థ‌ | 01.10.2018 01:07:42am

అది జోసఫ్ ఉండే ఊరు. నేలమీద ఉచ్చపోస్తే తుంపర్లు పడ్డట్టు... ఊరికో మూలలో పడున్న పాతిక ఇళ్ళు. మాల పల్లె అనీ, షాలేం నగర్ అనీ దానికే రెండు పేర్లు. సన్నని రోడ్లు. పల్లెలోకి పోవాలంటే తూములోకి బలిసిన పందికొక్కులు జొరబడ్డట్టు... ఇరుక్కుని ఇరుక్కుని పోవాలి . మురిగిపోయిన సైడు కాలవల్లో పిల్లలు దొడ్డికి కూర్చుంటూ స్వాగతం పలుకుతారు. వాళ్ళ ముడ్డి కడిగే అమ్మలు చెంబుల్లో నీళ్లు పట్టుకుని నుంచుంటారు.

పల్లెలో మూడో ఇల్లు జక్రయ్యది. గొడ్డు మాంసం అమ్మే నలభయ్యేళ్ళ జక్రయ్యది. పొద్దున్నే వాళ్ళమ్మ ఫోటోకి దండమెట్టి యాపారం మొదలుపెడతాడు. పాతికేళ్లుగా పనిచేస్తున్న జక్రయ్య పండగ రోజున మాత్రం ఒక్క పైసా సరుకు కూడా అరువియ్యడు.

రోజుమార్చి రోజు మాంసం అమ్ముతాడు. అమ్మేరోజు మాత్రం సారాచుక్క ముట్టుకోడు. తాగినరోజు పెద్దపెద్ద కేకలతో అరుస్తూ ఉంటాడు. "మా తాత గొడ్డు మాసమమ్మాడు. మా అయ్య గొడ్డు మాసమమ్మాడు. నేనూ అదే అమ్ముతా. మా వంశమే గొడ్డుమాంసం వాసనలో ఉందిరా. మా యాపారం జోలికొస్తే పీకలు తెగ్గోస్తా నంజి కొడకల్లారా..నంజి కొడకల్లారా " అని అరుస్తూ తుపుక్ అని ఏ ఇంటి ముందో ఉమ్మేవాడు.

జక్రయ్య ఇంటికి నాలుగడుగుల దూరంలోని ఒకింట్లో మేరీ, రమేషూ ఉంటారు. ఆమెది ఇంటి పని. అతనిది లారీ క్లీనర్ పని. వాళ్ళకో ఏడేళ్ల అబ్బాయి. గానుగ చెట్టుకూ, ఇంటి దూలానికీ కట్టిన తీగ మీద వారంలో రెండు సార్లు ఆ పిల్లాడి నిక్కరు ఆరుతూ ఉంటుంది. ఆ నిక్కరు మీద సీతాకోకచిలుక ఆకారంలో రంధ్రం ఉంటుంది. ఆ పిల్లాడు అందులో నుంచి ఆకాశాన్ని చూసేవాడు. ఒక పక్షిపిల్లయినా కనిపించే వరకూ అలానే చూస్తూ ఉండేవాడు. ఆ పిల్లాడే జోసెఫ్. అలా అందులోనుంచి ఆకాశాన్ని చూడటం వాడుకున్న సరదాల్లో ఒకటి. అలా ఆకాశంలోకి చందమామలా నవ్వుతూ చూస్తున్న వాడిని ఒక ఉదయం చూసాను. అప్పటి నుంచీ చూస్తూనే వున్నాను. అన్నట్టు నాపేరు చెప్పలేదు కదూ... నేను ఆకాశాన్ని.

అలా ఆరోజు నుంచీ వాడిని చూడటం నాకు వ్యసనమైంది. ఆకాశానికీ వ్యసనాన్ని అంటించిన తొట్టతొలి మానవుడూ, పిల్లవాడూ, చిన్నిచిన్ని ఆశ్చర్యాల కలబోతా జోసఫ్. కుడివైపు నుంచి వాడి నాలుగో పన్ను తొర్రిది. అప్పుడే ఊడిన వాడి పాలదంతం అచ్చం నా రంగులోనే ఉంది. గాలిలా మారి వాడి పళ్లతొర్రిలోకి దూరటమంటే నాకు మహా సరదా. బడికెళ్లేప్పుడూ, తిరిగొచ్చేప్పుడూ వాణ్ని చూస్తూనే ఉండేవాడిని.

నాల్రోజుల్లో క్రిస్మస్ పండుగ. ఆ అందమైన పిల్లవాడి నల్లటి మొహం ఆ రోజు మరింత ఆనందంగా వెలుగుతోంది. వంటపనిలో ఉన్న అమ్మ వెనకగా చేరి, కుడికాలి మడమతో గచ్చుని గీకుతూ... "అమ్మా,,, అమ్మా ... " అని పిలిచాడు. పనిలో వుండి, వెనక్కి తిరక్కుండానే, చెప్పమన్నట్టు ఊ కొట్టింది. అమ్మకు ఇంకాస్త దగ్గరకు జరిగి, రెండుచేతులూ చాలినంత అమ్మను వెనకు నుంచీ వాటేసుకుని... పండక్కి కొత్తబట్టలని ముద్దుగా, చిన్నిగా అందమైన తొర్రిపళ్ళ జోసఫ్ మూలిగాడు. పనికానిస్తూనే సరే అని చెప్పి, చేతిలో ఒక రూపాయి పెట్టి, లారీ పని నుంచి, నాన రేపొస్తున్నాడో లేదో అని, ఫోన్ చేసి కనుక్కురమ్మని పంపింది. అలా నాలాగుడుగులు వెయ్యగానే, ఓసారి పిలిచి నెంబర్ గుర్తుందా అంది. ఓ... ఎందుకు గుర్తులేదూ... అని టకా టకా చెప్పేసిన జోసఫ్ నుదిటిమీద ముద్దుపెట్టుకుని, నీళ్లు నిండిన కళ్ళతో, ఫోన్ చేసి రమ్మని తలాడిస్తూ చెప్పింది.

నాన రేపొస్తున్నాడని చెప్పి, నాలుగు మెతుకులు తిని, బడికి బయల్దేరాడు. సాయంత్రం నాలుగయింది. ఆ వీదంతా బడయిపోయి ఇంటికెళ్తున్న పిల్లల కేరింతలు. ఐదు రోజులుసెలవలు. రోజూ అందమైన నల్లని సీతాకోకచిలుకలా ఎగురుతూ ఎగురుతూ పోయే జోసఫ్... ఆ రోజు చందమామలా ఆగిఆగి నడుస్తున్నాడు. ఒక బట్టల కొట్టు ముందు నిలబడి, డిస్ప్లేలో ఉన్న నీలం రంగు చొక్కాను చూసి ఆగిపోయాడు. మొన్న చూసిన సినిమాలో హీరో, హీరోయిన్ జుట్టుని మెల్లిగా వెనక్కి తోసి, మెడ మీద ముద్దుపెట్టుకున్నప్పుడు, ఇలాంటి చొక్కానే వేసుకున్నాడని గుర్తుతెచ్చుకుని, పండక్కి అదే కొనిపించుకుందాం అనుకున్నాడు. కొద్దిదూరం నడిచాక మరో కొట్టుముందాగి, ఈ సారి... హీరో, విలన్ని కొట్టేటప్పుడు లాంటి చొక్కా చూశాడు. నిర్ణయం మార్చుకుని, రెండోసారి చూసిందే కొనిపించుకుందామనీ, కుదిరితే రెండూ కొనిచ్చుకోవాలనీ ఆశ పడ్డాడు. మరో నాలుగడుగులు నడిచి, స్వీట్ షాప్ ముందు ఆగాడు. నచ్చిన మిఠాయిలన్నిటి వైపు ఆశగా చూసి, పండక్కి నాల్రోజులుందని గుర్తుతెచ్చుకుని... చకచకా ఇంటికి నడిచి, రాత్రికి అమ్మ బొజ్జమీద కాలేసి, చెంప మీద చెయ్యి వేసి ముడుచుకుని బజ్జున్నాడు.

తెల్లారిపోయింది. నిద్రలేవగానే, ఎదురొచ్చిన నాన్న బుగ్గలు ఎంగిలి చేసి, పండక్కి కావాల్సినవన్నీ చెప్పాడు. పండుగరోజు పొద్దున్నే కొందామని మాట ఇచ్చాక, కుడిజేబులో రెండు గుప్పెళ్ళ గోళీలేసుకుని, ఆటకు బయల్దేరాడు. కొనిచ్చుకోబోయే వాటి గురించి ఆటలో పిల్లలందరికీ చెప్పేశాడు. మూడ్రోజులు అలా గడిచిపోయాయి. అప్పుడప్పుడూ, తీగన వేలాడే నిక్కరు రంధ్రంలోంచి, పక్షిపిల్లలు కనిపించేవరకూ నావైపే చూసేవాడు. బోలెడన్ని కబుర్లూ చెప్పేవాడు.

రాత్రయింది. తెల్లారితే పండగ. అన్ని ఇళ్లల్లో నవ్వుల పూలు పూస్తున్నాయి. జోసఫ్ కి వాళ్ళమ్మ స్నానం చేయిస్తోంది. వళ్ళు తుడిచి, నుదిటి మీద చేయిపెడితే, కాలిపోతూ వుంది. జ్వరం తగిలిందని చెప్పి, పనుకోబెట్టింది. అదే సమయానికి హడావుడిగా ఇంటికొచ్చిన రమేషు అర్జెంటు లారీ పనిపడి, చెన్నయి బయల్దేరాడు. జ్వరంతో వున్న జోసఫ్ కు రసం కాస్తూ, వేడివేడి రసం చేతి మీద వొలుకి మేరీ చెయ్యంతా బొబ్బలెక్కేలా కాలింది. జ్వరంతో బయటికెళ్ళొద్దని, బట్టలు మళ్ళీ కొందామని జోసఫ్ ను సముదాయించి, తెల్లారక కూడా నిద్రపుచ్చింది. ఆ రోజంతా ఇంట్లో పొయ్యి వెలగలేదు. పక్కింటి మరియా, కొద్దిగా గొడ్డుమాసం, పాయసం తెచ్చించింది.

పండగెళ్లాక రెండ్రోజులకు రమేషోచ్చాడు. జోసఫ్ కు పూసమిటాయి తెచ్చాడు. పండగ బాగా జరగనందుకు కొన్నాళ్ళు దిగులు పడ్డ జోసఫ్, కొద్దిరోజులకే మామూలయ్యాడు. మళ్ళీ ఎప్పటిలానే రోజులు మొదలయ్యాయి. నిక్కర్ రంధ్రంలోంచి... నల్లటి అందమైన జోసఫ్ నావైపు చూస్తూనే వుండేవాడు.

చిన్ని జోసఫ్ ను చూస్తూ నేను... నన్ను చూస్తూ జోసఫ్. ఏడాది గడిచిపోయింది. మళ్ళీ తెల్లారితే పండుగ. బట్టల కోట్ల ముందు ఆగి ఆగి మళ్ళీ కావాల్సిన బట్టలన్నీ చూసాడు. దెబ్బ మీదే దెబ్బ తగిలినట్టు... మళ్ళీ పండగ ముందురోజు... లారీ పనిమీద రమేషు ఊరెళ్ళాడు. జోసెఫ్కి స్నానం చేయించి, నుదిటి మీద చేయి ఉంచి, జ్వరం తగిలిందని చెప్పి పడుకోమని చెప్పింది. వాడికి పట్టలేని కోపమొచ్చింది. సగం దుప్పటే కప్పుకుని, పొయ్యి ముందున్న అమ్మ వైపే కోపంగా చూస్తూ వున్నాడు. చూస్తూ చూస్తూ ఉన్నాడు. వేడివేడి చారు కావాలనే చేతి మీద ఒంపుకున్న వాడి అమ్మను చూశాడు. తెల్లారి పక్కింటి నుంచి మాంసం కూర వచ్చింది.

జోసఫ్ నడుచుకుంటూ బయటికి వచ్చాడు. సీతాకోక చిలుక ఆకారపు రంధ్రంలోంచి, నన్నే చూస్తున్నాడు. నాతో ఇలా మాట్లాడుతున్నాడు. "" అంటే అప్పుడు... అప్పుడు... అప్పుడు పోయిన పండగప్పుడు... నాకు కావాలనే జొరమొచ్చింది. నాన్నకు కావాలనే పనిపడింది. అమ్మ కావాలనే చెయ్యి కాల్చుకుంది. నలుగురూ పండగ చేసుకోవడం లేదా, అబ్బాయికి బట్టలు కొనలేదా, మాసం వండలేదా అని అడుగుతారని... అమ్మ చెయ్యి కాల్చుకుంది. నాకు జ్వరం వచ్చింది. నాన్నకు పని పడింది. ఈసారి పండక్కైనా డబ్బులుంటే బాగుండు""

ఆ రోజు షాలేం నగర్లో వాన పడిందని అందరూ అనుకున్నారు. కాదూ ... ఆకాశం ఏడ్చిందని నాకు మాత్రమే తెలుసు.

No. of visitors : 854
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •