అత్యాధునిక జీవితంలోని మనిషి యొక్క అసందిగ్ధ ప్రవర్తనే మోహన్‌రుషి ఇటీవల వెలువరించిన ʹస్క్వేర్వన్ʹ కవితా సంపుటి. Back to square one అనేది ఇంగ్లీష్‌లో బాగా ప్రాచుర్యంలో వున్న ఒక Phrase. అంటే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక మళ్లీ మొదటికే రావడం లేదా బయలుదేరిన చోటికే రావడం అని అర్థం. ఈ పుస్తకంలో మోహన్‌రుషి దృష్టి కోణం ఇదే. తెలుగు కవిత్వం 1990 దాకా ఒక రకమైన మూస ధోరణిలో కొనసాగితే 1990ల తరువాత మరో రకమైన మూసలోకి మలుపు తీసుకుంది. వీటన్నింటినీ బద్దలు కొట్టిన కవితా సంపుటి ʹస్క్వేర్వన్ʹ. కవిత్వపు సిద్ధాంతాల దగ్గరి నుండి నిర్మాణాల దాకా, భాష దగ్గరి నుండి డిక్షన్ దాకా చాలా కొత్తగా చెప్తూ ఆధునిక మనిషి జీవిత గందరగోళాన్ని, తనకు తాను చేసుకుంటున్న విధ్వంసాన్ని గాఢమైన కవిత్వంలో ఆవిష్కరించాడు మోహన్‌రుషి. కవితా వస్తువు ఎన్నికలో, తాను చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పడంలో మోహన్‌రుషి వర్తమాన కవుల కన్నా వంద అడుగుల ముందున్నాడు. ఇందుకు ఆయన ఎన్నుకున్న పదబంధాలు, కవిత్వపు పనిముట్లు వేరు. వీటి వాడిని బట్టి కవిత్వపు వాసి మన మనసును గాయపరుస్తుంది. కొండొకచో ఒక్కో కవిత దగ్గర బకెట్ రక్తాన్ని వాంతి చేసుకొని ఆత్మలోకంలో భళ్లున పగిలిపోతాం. పైకి చాలా మర్యాద పూర్వకమైన, చాలా మామూలు పదాలుగా కనిపించే ఈయన పదాల్లో మనిషి అంతరంగ శిథిలత్వం పెళ్లున ముఖాన్ని తాకుతుంది.
ఇవాళ మనిషి వివిధ రకాల యంత్రాల్లో ఇరుక్కుపోయి తనను తాను కోల్పోయి ఏకాంతవాసిగా మిగిలిపోయాడు. మనిషికి మనిషికి మధ్య ఖాళీ విస్తరిస్తూ పోతోంది. మనిషి చాలా దూరం ప్రయాణించి వచ్చాడు. తెలియని తీరమేదో చేరిపోయాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలిందో అర్థం కాదు. అంతా శూన్యం. మాట పడిపోయినతనం. బంధాలు విచ్ఛిన్నమైపోయిన విధం. ఏదో బిజీ, ఏదో తొందర ముక్కుపట్టి లాక్కుపోతుంది. అంతిమంగా దేహమంతా సిచ్చాఫ్ అయిపోయి నిశ్శబ్దం మాటున గడ్డకట్టుకుపోతున్నాం. అంతా ఒక యాంత్రిక దినచర్య. నిన్నటి లాగే ఇవాళ. ఇవాళ్టిలాగే రేపు. నిమిష నిమిషం మరణిస్తూ బతుకంతా ఒక చావు వాసన. కాలం దండెం మీద మనల్ని మనం ʹమసిగుడ్డలా ఆరేసుకుంటాంʹ. ఒక్కో అవయవాన్ని ఒక్కో యంత్రానికి అప్పగించి మనం మాత్రం ఉత్త ఖాళీ స్పేస్లా నిల్చుండిపోతున్నాం.
ʹʹకళ్లను గాగుల్సుకూ, చెవుల్ని ఇయన్ ఫోన్సుకూ
చేతుల్ని మొబైలుకూ అప్పగించి స్వారీ చేస్తున్న ఆలోచనల్ని
పదే పదే స్వైప్ చేసే పనిలో పడి మాటల్లేవ్ మనుషులు లేరు
మనసే అందాల బొందావనంʹʹ
అందాల బృందావనంలా ఉండాల్సిన మనసు ʹబొందావనంʹగా మారి ఒక స్మశానపు వాతావరణంలో మునకలు వేస్తోంది. అంతా రొటీన్‌గా సాగిపోతున్నాం. ʹతెలిసో తెలియకో నువ్వూ, నేనూ, వాడూ, వీడూ ఒక్కొక్కరం మహా హంతకులంʹ. ప్రతి క్షణాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్, ఫేస్‌బుక్‌లలోనే ఖర్చు పెడుతూ నిరంతరం మనల్ని మనం కోల్పోతున్నాం. లేదా లైకుల్లోనో, మెస్సేజ్ల్లోనో తప్పిపోతున్నాం. ʹవాట్సాన్ యువర్ మైండ్? దేర్ ఈజ్ నో మైండ్! ఉన్ననూ అది సెల్ఫీ కుల్ఫీలతో తిమ్మిరెక్కియున్నది. ఫీలింగ్ స్లీపీ. ఒకానొక ప్రాత:కాలాన లేచి చూచుసరికి బ్రతుకు తెల్లారిపోయి ఉంటుందిʹ. ఫేస్బుక్లో మునిగిపోయిన జీవితపు పేజీలు సాంతం చిరిగిపోయి ఉంటాయి. పనికి దూరమై, ఒబెసిటీకి దగ్గరై బతుకు ఒక సంక్షోభపు చీకట్లో మెల్లమెల్లగా కుప్పకూలిపోతుంది. మనకు తెలియకుండానే మన చేతుల్లోంచి జారిపోతుంటుంది. జీవితం విషాదపు అంచుల వెంట సాగిపోయి మనం ఎక్కడో తేలిపోతాం. కాటగలుస్తాం.
ʹʹఉండేదొకప్పుడు ఒక హార్టూ, బీటూ, లాట్, లాటూ, షార్ట్ బ్రేకొచ్చి
యాడ్ల మీద యాడ్లొచ్చి వొళ్లంతా బ్లేడ్ల బ్లేడ్ల రక్తం తన్నుకొచ్చి వొక్కొక్కరం
వొక వాణిజ్య కేంద్రాలమై. రక్త శీతలీకరణలతో రాటుదేలిన వాళ్లమై.
జీవితం ఎక్కడో విలవిలా తన్నుకుంటుంది. మన కన్నింగ్ కంఠం కంచులా
మోగుతుంది ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా!ʹʹ
ఊపిరి దీపం ఆరిపోలేదు కాబట్టి మనమంతా బతికున్నామనుకుంటున్నాం. నిజంగా అదొక్కటేనా జీవంతో ఉన్నామని చెప్పడానికి నిదర్శనం. రోజు తర్వాత రోజును ఏదో బలవంతంగా దొర్లిస్తున్నాం కాని వాస్తవానికి నిత్యం ఏదో తెలయని దు:ఖంలో పొర్లాడుతున్నాం. మనల్ని మనం కాపాడుకుంటూ మనుషులతో కల్సి జీవించడం ఇంకా సరిగా నేర్చుకోలేదో. నేర్చుకున్నదాన్ని విరిచేసుకుంటూ పోతున్నామో తేల్చుకోవాల్సి వున్నది. ఎవరి చుట్టు వాళ్లు కోట కట్టుకుంటూ పోతున్నారు. చివరాఖరికి అందులోనే కూరుకుపోతున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయి ఎవరి లోకంలో వారు విహరిస్తున్నారు. బయటి గాలి సోకకుండా, బయటి ప్రపంచపు బాధలు మోయకుండా, ఎవరి ఇంటి చూరుకు వాళ్లు గబ్బిలాల్లా బతులీడుస్తున్నారు.
ʹʹఅవసరం లేని చోట
అతిగా ప్రతిస్పందించాలి
సాయం చేయాల్సి వచ్చే చోట
వ్యక్తిత్వ వికాసం గురించి చర్చించాలి
ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ
జోన్గానూ, జోలెతోనూ...
ఇక్కడ ఎవడి ప్రపంచం వాడిది
ఏర్పాటు చేసుకోలేనివాడు గాడిదిʹʹ
తలుపుల్నీ, తలపుల్నీ, కిటికీల్ని, రాత్రుల్ని, ఉదయాల్ని, మనసుల్ని, మనుషుల్నీ అన్నింటినీ మూసుకున్నాం. భద్రతో, అభద్రతో విశాల ప్రపంచంలో బతకాల్సింది పోయి మన చుట్టూ మనమే ఒక ఇరుకైన వృత్తం గీసుకొని అందులో పడి పాకుతున్నాం. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంతో ఫోజులు కొడుతుంటాం. జియో మాయలో పడిపోయి అందరూ తలలు వంచుకునే జీవిస్తున్నారు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత దళసరిగా తయారయ్యాం. దేన్నీ ప్రశ్నించం. పెట్రోలు ధర పెరిగినా, బస్సు ఛార్జీలు పెరిగినా, రాఫెల్ స్కాంలు దేశాన్ని నిలువు దోపిడి చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఉదాసీన వైఖరి. పోరాడే, ఉద్యమించే స్పృహ నుండి దూరం జరిగిపోయాం. పోను పోను ʹజీవితంలో మిగతావన్నీ మిగిలి, జీవితమొక్కటీ డిలిట్ అవుతుందిʹ. ఇదే మన నాగరికత, సాంకేతికత నేర్పిన జీవన శైలి.
ఇందులోని కవితా శీర్షికలే ఎంతో కవిత్వాన్ని ఒలుకుతున్నాయి. శీర్షికల్ని తొలగించి చూస్తే ఆధునికానంతర మానవునిపై రాసిన ఒకానొక దీర్ఘకావ్యంలా భాసిస్తుంది ఈ కవితా సంపుటి. కవి తన లోలోపల పేరుకుపోయిన ఏదో బరువును దించుకోవడానికి రాసినట్టు కనిపిస్తుంది కాని నిజానికి ఆయన బరువు దించుకొని శిలువను మన భుజాల మీదికెత్తుతాడు. మందమైన జీవితం గురించిన, కకావికలమైపోయిన జీవిత మూల్యాల గురించిన ఒక నిగూఢమైన దు:ఖం ఇది. గుండెలోని ఉక్కపోతకు అక్షర రూపం ఇది.
ఒక కొత్త కవితా శిల్పం, శైలితో ప్రతి కవితా తళుక్కున మెరిసి హృదయాన్ని కాంతివంతం చేస్తుంది. ఇదొక సంభాషణాత్మక కవితా శైలి. అంటే కవి పాఠకునితో నేరుగా మాట్లాడుతాడు. ఊకదంపుడు, సోకాల్డ్ ప్రామాణిక, పాతబడిన నిర్మాణరూపాలకు పోకుండా ప్రతి కవితా ఎత్తుగడలోనే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. సినిమాలాగా కవిత ఎక్కడో మధ్యలో మొదలవుతుంది. ప్రారంభమేమిటో కవి చెప్పడు. కవిత మొత్తం ముగిసిపోయిన తరువాత ఆయన చెప్పని వాక్యాలు మన మనసు గోడలకు అతుక్కుంటాయి. శిల్పాకారుడు రాయికి నగిషీలు చెక్కినట్లు ప్రతి కవిత ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన శిల్పంలా గోచరిస్తుంది. మాటల్ని కోల్పోయిన మనిషి వికలత్వం గురించి మాటలకందని గాఢతతో కవిత్వమై పగిలిపోతాడు కవి. రోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు తీసుకుపోయి మనల్ని ʹకూకుండనీయదుʹ. ఎంతో ధ్వని, హేళన, వ్యంగ్యం, దెప్పిపొడుపు ఇలాంటి అనేక పద్ధతుల్లో కవిత్వం మనలోకి వెళ్లిపోయి ఎక్కడో నిప్పు అంటుకొని ఆ మంటల్లో తగలబడిపోతాం. నగరం లేదు, పల్లె లేదు ఇప్పుడు ఏ మనిషైనా కలుషితమైపోయినవాడే. ఒక కృత్రిమత్వం, ఒక సంకుచితత్వం, ఒక గిరి గీసుకొని బతుకుతున్న వైనం ప్రతి మనిషినీ ఏవో పొరల కింద కమ్మేస్తుంది. అందుకే ఈ కవిత్వం ఈ రూపాన్ని సంతరించుకుంది. అంతా ఒక మృగయావినోదం, స్పష్టాస్పష్టమైన జీవితం. విలోమంగా ప్రయాణిస్తున్న ప్రపంచాన్ని కవిత్వపు అద్దంలో చూపుతుందీ పుస్తకం. ఆధునిక మానవుని బతుకును పంచనామా చేసి ఒక ఉల్కాపాతంలాంటి అక్షరాలతో మన గుండెల్ని చీల్చే కవిత్వం ఇది. శకలాలు శకలాలుగా విడిపోతున్న మనిషి జీవితపు రంగు రుచి వాసనను కాస్త కఠినంగానే చూపెట్టిన కవిత్వం. ఉపరితలంలో నవ్వు, ఒక మెత్తనిదనం కనిపించినా లోలోపల దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన ఉప్పొంగిన కవిత్వమే కనిపిస్తుంది.
Type in English and Press Space to Convert in Telugu |
ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్ కవరేజ్ ఏరియాʹఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........ |
వేయి అంచుల ʹజీవితంʹప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు...... |
దళిత దృక్పథం, ధిక్కార స్వరంఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి...... |
ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజుల.... |
సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి... ... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |