యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

| సంపాద‌కీయం

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

- విరసం | 17.10.2018 01:36:53pm

త్రిపురనేని మధుసూదనరావు కృష్ణాజిల్లా దివి తాలూకా అంగలూరులో 1937 జనవరి 14న పుట్టారు. తల్లిదండ్రులు నాగభూషణమ్మ, చలమయ్య. తండ్రి ఉపాధ్యాయుడు. తాత త్రిపురనేని రామస్వామి చౌదరి. 1947-52 మధ్య గుడివాడ హైస్కూలులో, 1953-57 గుడివాడ ఎఎన్‌ఆర్‌ కళాశాలలో చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1957-61 బిఎ ఆనర్స్‌ చదివారు. ఆ తర్వాత కాకినాడ పిఆర్‌ కాలేజీలో ట్యూటర్‌గా నెల పని చేశారు. 1963 డిసెంబర్‌ 17న తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. ఆ తర్వాత కొద్ది కాలానికే అక్కడే గోవిందరాజుల స్వామి కాలేజీకి ట్రాన్సఫర్‌ అయ్యారు. ఆ కాలేజీలోనే 1997లో రిటైర్‌ అయ్యారు.

1964 జూన్‌2న ప్రబలకుమారితో పెళ్లయింది. విజయ, బీనాదేవి, విజయకుమార్‌ వాళ్ల సంతానం. పెద్ద కుమార్తె విజయ 1974లో యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మే 18న మమధుసూదనరావు సికింద్రాబాద్‌ కుట్ర కేసులో అరెస్టయి ఎమర్జెన్సీ కాలమంతా జైల్లో ఉన్నారు. బీనాదేవి, ఆమె భర్త రఘు కుప్పం విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. కుమారుడు విజయకుమార్‌ తిరుపతిలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ప్రబలకుమారి అక్కడే ఉంటున్నారు.

విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి మధుసూదనరావు జాస్తి సత్యనారాయణ వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. తిరుపతిలో అభ్యుదయ సాహితి అనే సంస్థను స్థాపించారు. అది తర్వాత తిరుపతిలో విప్లవ రచయితల సంఘం శాఖ ఏర్పడటానికి దోహదం చేసింది. తెలుగు సమాజాల్లో మహత్తర విప్లవ పాత్ర పోషించిన రాడికల్‌ విద్యార్థి సంఘం ఆవిర్భావానికి ముందే 1973లోనే తిరుపతిలో ʹరాడికల్‌ స్టూడెంట్స్‌ʹ ఏర్పాటుకు ఆయన మార్గదర్శి అయ్యారు.

1972 గుంటూరు మహా సభల్లో విరసంలో సభ్యత్వం తీసుకున్నారు. 1974 కర్నూలు సభల్లో విరసం కార్యదర్శి అయ్యారు. 1974మే నెలలో అరెస్టయ్యారు. మళ్లీ 1980 జనవరి హైదరాబాదు మహా సభల్లో కార్యదర్శిగా ఎన్నికై 1984 జనవరి పలాస సభల వరకు కొనసాగారు. 1982 ఆగస్టు నుంచి 1984 జనవరి వరకు అరుణతార సంపాదకుడిగా బాధ్యత వహించారు. ప్రభుత్వం ఆయనపై సికింద్రాబాదు, చిత్తూరు కుట్రకేసులు పెట్టింది. ఈ రెండూ కోర్టు కొట్టేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన సాహిత్య చరిత్ర, విమర్శ సంబంధమైన కోర్టు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. 1990లో వ్యక్తిగత కారణాల వల్ల ʹనాకు గౌరవప్రదంగా వెళ్లిపోదామని ఉంది, విరసం కూడా అట్లా భావిస్తే మంచిదిʹ అని లేఖరాసి సంస్థ సభ్యత్వానికి దూరమయ్యారు. తిరిగి 2004లో కావలి విరసం మహా సభల్లో తిరిగి సభ్యత్వం తీసుకున్నారు.

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తిరుపతికి పరిచయం చేసింది త్రిపురనేని మధుసూదనరావేనని, 1972లో చారుమజుందార్‌ వచ్చినప్పుడు తిరుమల కొండ మీద కలిశామని భూమన్‌ రాశారు. 1970 ఆగస్టు-అక్టోబర్‌ సంచికలో అంపశయ్య నవల మీద చిన్న సమీక్ష వ్యాసం రాశారు. బహుశా ఆయన తొలి వ్యాసం ఇదే కావచ్చు. ఆయన విరసంలో చేరాక కొద్దికాలానికే చిత్తూరు యూనిట్‌ తరపున కవిత్వం-చైతన్యం పుస్తకం అచ్చయింది. 1992లో మార్క్సిజం వర్థిల్లాలి-మను ధర్మం నశించాలి అనే చిన్న చర్చావ్యాసం అనంతపురం సంయుక్త ప్రచురణల తరపున అచ్చయింది. 1995లో విరసం విశ్వనాథ సాహిత్యం కుల మత విషం అనే పుస్తకం అచ్చేసింది. 1997లో పర్‌స్పెక్టివ్‌ పబ్లికేషన్స్‌ ఆయన ముఖ్యమైన వ్యాసాలు సాహిత్యంలో వస్తు శిల్పాలు అచ్చు వేశారు. తెనాలి పోయిట్రీ ఫోరం వాళ్లు మార్క్సిజం-సాహిత్య విమర్శ అనే ఇంటర్వ్యూను ప్రచురించారు. ఇవిగాక 1970, 80లలో మార్క్సిజం-సాహిత్యం, తెలుగులో కవితా విప్లవాల స్వరూపం, సాహిత్యం కుట్ర కాదు, రచయితలు కుట్రదారులు కాదు, గతితార్కిక మానవతా వాదం మొదలైన వ్యాసాలు చిన్న బుక్‌లెట్స్‌గా విరసం, సృజన తరపున అచ్చయ్యాయి.

ఆయన అమరత్వం తర్వాత సాహిత్య సర్వస్వం అచ్చేయాలని విప్లవ రచయితల సంఘం అనుకుంది. నిషేధానంతరం 2006లో జరిగిన 20వ మహా సభల్లో కవిత్వం-చైతన్యం పేరుతో ఒక సంపుటి తెచ్చింది. ఆ తర్వాత మిగతా సంపుటాలు తేవడం ఆలస్యమైంది. ఇప్పటికి ఇలా మళ్లీ అన్నీ కలిసి ఒకేసారి మూడు సంపుటాలుగా తెస్తున్నాం. మధుసూదనరావు సన్నిహితులు, విప్లవోద్యమ అభిమానుల సహకారంతోనే ఇప్పటికైనా ఇలా ప్రచురించగలుగుతున్నాం.

మధుసూదనరావుకు తన రచనల రాతప్రతులుగాని, అచ్చయ్యాకగాని భద్రపరుచుకోవడం అలవాటు లేదు. చివరికి ఆయన ఫొటోలు రెండు మూడు కంటే కుటుంబ సభ్యుల దగ్గర కూడా లేవు. సాహిత్య సర్వస్వం అచ్చవుతోందనే సమాచారం తెలిసి కొందరు తమ దగ్గర ఉన్న రచనలు పంపించి సహకరించారు. అయినా ఒకటి రెండు రచనలు మా దృష్టిలో ఉండీ సేకరించలేకపోయాం. మాకు తెలియకుండా కొన్ని ఉండొచ్చు. ఆయన రాసిన ఉత్తరాలు ఉండొచ్చు. వాటితోపాటు సాహిత్య, రాజకీయ తరగతుల్లో ఆయన చెప్పిన పాఠాలు రాసుకున్న వాళ్లు నోట్స్‌ పంపించినా, ఇంటర్వ్యూల ఆడియో రికార్డులు పంపించినా ఎత్తిరాసి మరో సంపుటం అచ్చేస్తాం.

ఆయన రచనలను సంపుటాలుగా విభజించడంలో ఒక చిక్కు ఉంది. కాలక్రమాన్ని పాటించడం అంత మెరుగైన పద్ధతి కాదు. వస్తు రీత్యా విభజించడం కూడా కష్టమే. ఎందుకంటే ఆయన అన్నిటినీ తత్వశాస్త్ర పునాది నుంచే చూస్తారు. అయినా ఏదో ఒక పద్ధతి తప్పనిసరి కాబట్టి సాహిత్య సమీక్ష/విమర్శ, సాహిత్య చరిత్ర, సిద్ధాంత వ్యాసాలుగా మూడు సంపుటాలు చేశాం. ఇది చాలా స్థూల విభజన మాత్రమే. కొంచెం అటూ ఇటూ కూడా ఉండవచ్చు.

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. అపారమైన సిద్ధాంత పరిజ్ఞానం, సూక్ష్మస్థాయిలో స్పష్టత, తీవ్రమైన వర్గపోరాట అభినివేశం ఆయన సొంతం. వాద వివాదాల్లో అవతలి పక్షం వాదనను ఓడించి, ప్రజా పక్ష వాదనను నిర్మించడంలోనే వర్గపోరాట స్ఫూర్తి, ప్రభావం, ప్రయోజనం ఉంటాయని ఆయన దృఢంగా నమ్మేవారు. ఆ మెలకువలు బాగా తెలిసిన విప్లవ మేధావి ఆయన. జీవితమంతా అలాంటి ఆచరణే కొనసాగించారు. అన్ని రంగాల్లో వర్గపోరాట అవసరం గతం కంటే మరింత పెరిగిన ఈ తరుణంలో ఆయన రచనలకు మరింత ప్రాధాన్యత ఉంది. ఈ స్థల కాలాల్లో వర్గపోరాట సునిశితత్వాన్ని, దృఢత్వాన్ని ఈ తరం సంతరించుకోడానికి అవసరం అని విరసం మధుసూదనరావు సాహిత్య సర్వస్వం అందిస్తోంది.


No. of visitors : 327
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •