విప్లవ సాహిత్య విమర్శనాయుధం

| సాహిత్యం | వ్యాసాలు

విప్లవ సాహిత్య విమర్శనాయుధం

- సింగంపల్లి అశోక్‌కుమార్‌ | 17.10.2018 01:43:13pm


ʹʹసాహిత్యంలో వర్గపోరాటాన్ని కొనసాగించాల్సి రావడం, రివిజనిజానికి వ్యతిరేకంగా ఫ్యూడల్‌్‌ విలువలకి వ్యతిరేకంగా వర్గపోరాటానికి సాధనంగా సాహిత్య విమర్శ ఉండాలనే ప్రేరణతో సాహిత్య విమర్శనా రంగాన్ని ఎన్నుకొని రాయడం ప్రారంభించాను. ఒక్క మాటలో నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలే నాకు మార్క్సిస్టు సాహిత్య విమర్శ రాయడానికి ప్రేరణ కలిగించాయిʹʹ అంటూ సర్వకాలాల్లో తన సాహిత్య విమర్శానాయుధానికి మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం గీటురాయి చేసుకున్న త్రిపురనేని మధుసూదనరావు తెలుగునాట తిరుగులేని సాహితీ విమర్శకుడు. ఆంగ్లంలో వీరి క్లుప్తనామం టి.ఎం.కాగా అది తిరుపతి మావోగా బహుళ ప్రచారం పొందింది.

త్రిపురనేని మధుసూదనరావు1959-61లలో ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో బి.ఏ.ఆనర్సు చదివారు.కొంతకాలం కాకినాడలో ట్యూటర్‌గా పనిచేసి ఆతరువాత తిరుపతి గోవిందరాజ స్వామి కళాశాలలో తెలుగుఉపన్యాసకులుగా పనిచేసి అక్కడే రిటైరయ్యారు.1970 ప్రాంతంలో నక్సల్బరీపోరాటంతో ఉత్తేజితులై చారుమజుందార్‌ పంథాను అవలంబిస్తూ, విముక్తి పోరాటంలో జనం కత్తులు పట్టడం కాదు కత్తులుగా మారాలన్నారు. విద్యార్థులకు, రచయితలకు మార్క్సిజం పాఠాలతో, రివిజనిజం గుణపాఠాలతో సాహిత్యంలో ʹమజుందారిʹ చూపారు.

1972లో విప్లవ రచయితల సంఘంలో సభ్యులుగా చేరి,అతి క్రియాశీలకంగా పని చేశారు. విరసం కార్యదర్శిగా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ 19 నెలలూ నిర్బంధం అనుభవించారు.త్రిపురనేనిపై ప్రభుత్వం సికింద్రాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు బనాయించింది. కాని అవి రుజువు కాలేదు.తనకు విశ్వాసంలేని ఎన్నికల్లో ఓటు వేయకపోవడమే కాదు తన 30ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కసారి ఎన్నికల విధులకు హాజరుకాని రాజకీయ నిబద్ధుడు.

విరసం అధ్యయన తరగతుల్లో తత్వశాస్త్రం గురించి వీరు పాఠం చెప్పేవారు. ఉపన్యాసాన్ని ఒక కళగా అభివృద్ధి చేసిన వక్త. వీరి ఉపన్యాసం ఒక ఝంఝా ప్రభంజనమై రేగేది. ఒక ఝరీ ప్రవాహమై సాగేది. క్లిష్ట తాత్విక అంశాలను బహిరంగ సభల్లోని శ్రోతలకు అర్థమయ్యేలా వివరించేవారు. మావో ఆలోచనా విధానాన్ని ప్రధానంగా విస్తృతంగా ప్రచారం చేశారు.

మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులుగా సంప్రదాయవాదులతో రాజీలేని పోరాట పద్ధతుల్లో వ్యాసాలు రాశారు. వీరు రససిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారు. సంస్కృత అలంకార శాస్త్రం ఆధ్యాత్మిక భావజాలంపై ఉంది కనుక దానికి ఎటువంటి విలువా ఇవ్వనక్కరలేదనే వారు. మార్క్సిజం-సాహిత్యం గురించి ఆర్‌.ఎస్‌.సుదర్శనం చేసిన వక్రీకరణలను ʹఆర్‌ఎస్‌ఎస్‌ దర్శన్‌ʹ పేరుతో తీవ్రంగా ఖండించారు. భుస్వామ్య సాహిత్యాస్వాదనను, రసధృతిని మార్క్సిజంతో ముడి పెట్టడానికి గుంటూరు శేషేంద్రశర్మ చేసిన ప్రయత్నాలను సహేతుకంగా తిప్పి కొట్టారు.

ʹతూర్పుగాలి, ఓటమి-తిరుగుబాటుʹలాంటి తోటి విప్లవరచయితల రచనలను రాజీ లేకుండా తీవ్రంగా సమీక్షించిన నిబద్ధుడు. చెరబండరాజు ʹముట్టడిʹ కావ్యంలోని పోలీసు పాటపై జనశక్తిలో జరిగిన వాదప్రతివాదనలలో తను పొరపడినదాన్ని బహిరంగంగా ఒప్పుకున్న నిజాయితీపరుడు.

వీరి వ్యాసాలను ʹసాహిత్యంలో వస్తుశిల్పాలు, గతితార్కిక భౌతిక మానవతావాదం, కవిత్వం చైతన్యం, మార్క్సిజం సాహిత్యవిమర్శ, మనుధర్మం నశించాలి,మార్క్సిజం వర్థిల్లాలి, విశ్వనాథ తిరోగమన సాహిత్యం,సాహిత్యం కుట్రకాదు-రచయితలు కుట్ర దారులు కాదు (కోర్టు స్టేట్‌మెంట్‌) మొదలైన గ్రంథాలుగా ప్రచురించారు.

త్రిపురనేని నాయకత్వంలో అసంఖ్యాక యువకులు పదునెక్కి కదనుతొక్కారు. విప్లవ చైతన్యాన్ని వెదికి పట్టుకునేవారు. తెలుగునాట ఎందరో ఆయనకు కనుగొన్న బిడ్డలు. మిలిటెంట్‌ యూనిట్‌గా పేరొందిన కాకినాడ విరసంయూనిట్‌ అందుకు ఉదాహరణ. ఎందరికో సాహిత్య అస్త్రాభ్యాసం చేశారు.యువతను పరుగెత్తించారు.తను యువకుడై పరుగెత్తారు. కార్యదర్శిగా విరసం యూనిట్లను ఉత్తరాలతో కదిలించేవారు. విరసం సభ్యుల అక్రమఅరెస్టుల ప్రతి ఘటనగా కాకినాడ విరసం యూనిట్‌ నుండి వెలువడిన ʹకుట్రʹ బులెటిన్‌ దీనికి ఒక ఉదాహరణ.

విరసానికి పరువుగా శ్రీశ్రీని ఎంతగా ప్రేమించేవారో, బలహీనతలతో విరసానికే బరువై నప్పుడు అంతగానూ ఖండించేవారు.ʹశివసాగర్‌ కవిత్వంʹతో పులకించిపోయే వారు. సాహిత్య రాజకీయసభలలో శివసాగర్‌ విప్లవగేయ చరణాలను రణనీయంగా ఆలపిస్తూ తన ఉపన్యాస వెల్లువతో పోటెత్తేవారు. త్రిపురనేని అంటేనే... విమర్శ కత్తి చేత పట్టుకునో, మొలకు కట్టుకునో తెలుగు నేలంతా కవాతుచేసిన విప్లవ సాహితీ విమర్శకుడిగా పేరొందిన త్రిపురనేని మధుసూదన రావు 1937 జనవరి 14న పుట్టారు, 2004 అక్టోబరు 8న తిరుపతిలో మరణించారు.

No. of visitors : 351
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •