సాహిత్య విమర్శ చచ్చిన వేళ

| సంభాషణ

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

- కాశీం | 17.10.2018 02:30:31pm

తెలుగులో సాహిత్య విమర్శ చచ్చిపోయింది. విమర్శ పేరు మీద ఇప్పుడు వస్తున్నదంతా పొగడ్త, స్తుతి, దూషణ. స్నేహాన్ని, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని, భావజాలాన్ని బట్టి సాహిత్యం మీద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ-కుల సమాజంలో సామాజిక అస్తిత్వానికి అతీతంగా సాహిత్య వ్యక్తీకరణను ఆశించటం పాక్షిక సత్యమే కావచ్చు, కానీ ఇదే సమాజంలో సారవంతమైన విమర్శ వచ్చి ఉన్న వాస్తవాన్ని కూడా కాదనలేం. కానీ నేడు వాచక విమర్శ లేదు. శిల్ప విమర్శ శూన్యం. వస్తువు విమర్శ చచ్చిపోయింది. వాచకాన్ని చదువకుండా వివేచనలు సాగుతున్నాయి. విశ్వవిద్యాలయాలు ఏనాడో విమర్శ అనే పదాన్ని వదిలేసాయి. ʹవస్తువు-శిల్పంʹ అనే పరిశోధనాంశాన్ని తెలుగు శాఖలు మర్చిపోయాయి. ప్రొఫెసర్లకు కూడా అవి తెలియవని చెప్పడానికి సిగ్గేస్తుంది. పరిశోధనలన్నీ కేవలం వ్యాఖ్యానాలకు, వివరణలకు పరిమితమయ్యాయి. విమర్శ పాఠాన్ని బోధించేవాళ్లు అలంకార శాస్త్ర పరిమితిని దాటలేకపోతున్నారు. విమర్శలో సృజనాత్మకత ఏనాడో ఘనీభవించింది.

ʹవచ్చుకాలం మేలు గతకాలం కంటేʹ అని చెప్పిన అడుగుజాడ గురజాడకు క్షమాపణలతో ʹగతకాలం మేలు వచ్చుకాలం కంటేʹ అని చెప్పిన మాటను విమర్శకు అన్వయించుకుంటున్నాను. అంత మాత్రాన నన్నయతో ఏకీభావం ఉన్నట్లు కాదు. నానారుచిరార్థ సుక్తి నిధిత్వం నన్నయ సొంతం కాదు, అది మౌఖిక కవిత్వ సంప్రదాయం. భారతాన్ని అనువదించినట్లే, మౌఖిక కవితా పాదాలను కూడా నన్నయ వాడుకున్నాడు.

ఈ విమర్శ ఆవరణంలో త్రిపురనేని మధుసూదన్‌రావు గారి(టీఎంఎస్‌) పుస్తకానికి ముందు మాట రాసే సాహసాన్ని చేస్తున్నాను.

టీఎంఎస్‌ మార్క్సిస్టు సాహిత్య విమర్శను భూ మార్గం పట్టించాడు. పాశ్చాత్య మార్క్సిస్టు భావన మీద నిర్మాణమైన తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శను టీఎంఎస్‌ ప్రాదేశికం చేసాడు. ఆ మాటకొస్తే తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు నిచ్చాడు. సంప్రదాయ చట్రంలో మునిగిపోయిన విమర్శకు ప్రజాస్వామిక, ప్రగతిశీల, విప్లవ దృక్పథాలను అద్దాడు. విమర్శ అంటే శిల్పం చుట్టూ తిరిగే అలంకారిక శైలిని కాదని, సాహిత్య వస్తువే విమర్శకు భూమికగా ఉండాలని టీఎంఎస్‌ నిర్ణయించాడు. సాహిత్య శిల్పాన్ని నిరాకరించడం కాదు, వస్తువును ఆశ్రయించిన శిల్పం గురించి ఆయన తపన.

పెదబాలశిక్ష పాండిత్యాన్ని ప్రదర్శిస్తుండిన అభ్యుదయ సాహిత్య విమర్శను టీఎంఎస్‌ వర్గ పోరాట మార్గాన్ని పట్టించాడు. ʹకావ్య జగత్తుʹలో విహరిస్తున్న వివేచనకు మట్టి పరిమళం అద్దాడు. యాంత్రికతకు గురైన తెలుగు సాహిత్యంలో కొత్త పోకడలను ఆయన గతితర్కం వైపు మళ్లించాడు. ప్రతీ సాహిత్య రూపానికి సాహిత్య నిర్మాణంతో పాటు దృక్పథం కూడా అతి ముఖ్యమైన అంశంగా ముందుకు తీసుకొచ్చాడు. ʹసామాజిక చైతన్య రూపాలలో భాగమే సాహిత్యం, కళలుʹ అని మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పిన అవగాహనను తెలుగు సాహిత్య విమర్శకు అన్వయించిన అతికొద్ది మంది ఆలోచనా పరులలో టీఎంఎస్‌ మొదటివాడు. ప్రజల ఆచరణాత్మక రూపాలలో భాగం కాకుండా రాసేదంతా మార్క్సిస్టు సాహిత్య విమర్శగా చలామణి అవుతున్న కాలంలో, నిత్యం పెనుగులాటలో వ్యవక్తమవుతున్న కళారూపాలను సరైన దృక్పథంతో అంచనా కట్టడం ఆయన చేసాడు. ఏ సాహిత్య రూపానికైనా దాని అస్తిత్వం ఆయా చారిత్రక దశలోని జీవితంతో పెనవేసుకొని ఉంటుందని చెప్పాడు. కవిత్వంలో కమిట్‌మెంట్‌ ఏమిటంటే శిల్పం, దృక్పథమని గట్టిగా జవాబు ఇచ్చాడు.

టీఎంఎస్‌కు అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఊగిసలాట లేదు. ఎందుకంటే ఆయనకు సరైన దృక్పథం ఉంది గనుక. ʹʹసాహిత్యానికి స్వతంత్య్ర ప్రతిపత్తి ఉందనే ఫ్యూడల్‌, బూర్జువా వాదాల్ని ఆచరణలో నిరాకరించాలి. సాహిత్య నిబద్ధత వాదానికి జరుగుతున్న పోరాటాలు పాలకవర్గాలకీ, కార్మిక, రైతాంగ వర్గాలకీ జరుగుతున్న పోరాటాల ప్రతిబింబమే. విప్లవ రచయితలకే కాదు, నన్నయ నుంచి రచయితలందరికీ నిబద్ధత ఉందని ఆధునిక పండితులు ప్రచారం చేస్తున్నారు. నిబద్ధత అనేది విప్లవ సాహిత్య భావన. విరసమే ఈ సిద్ధాంతాన్ని సాహిత్య రంగంలో ప్రవేశపెట్టింది. విశ్వనాథకీ నిబద్ధత ఉంది, శ్రీశ్రీకి నిబద్ధత ఉందని చెప్పడం సరైనది కాదు. నిబద్ధత అంటే ప్రజలకి నిబద్ధంగా ఉండటం. విప్లవ రాజకీయాలకు నిబద్ధంగా ఉండటంʹʹ అని నిబద్ధతలోని చిక్కుముడులను టీఎంఎస్‌ చాలా అవలీలగా విడగొట్టాడు. వర్గ పోరాట ప్రాపంచిక దృక్పథమే రచయిత నిబద్ధత అని ఆయన నిర్ధారించాడు. నిబద్ధత విషయంలో ఆయన చాలా నిర్దిష్టంగా ఉన్నాడు. మార్క్సిజం- లెనినిజం-మావోయిజం కార్మికవర్గ, రైతాంగ తాత్విక సిద్ధాంతం, ప్రాపంచిక దృక్పథం, తాత్విక దృక్పథం రచయితకు ఉండటమే నిబద్ధత అని చెప్పాడు.

తెలుగు సాహిత్యంలో విశ్వనాథ తిరోగమన భావాలను ప్రభావశీలంగా అడ్డుకొన్నవాడు టీఎంఎస్‌. ఈ శతాబ్ది సాహిత్యంలో పరమక్షుద్ర క్షీణ సాహిత్యం విశ్వనాథదని ఒక వాక్యంతో తేల్చాడు. సాహిత్యంలో కనీసం బూర్జువా ప్రగతిశీల భావాలను కూడా అంగీకరించని విశ్వనాథ ఫ్యూడల్‌, బ్రాహ్మణీయ ఆలోచనలను చొప్పించాడు. యాభయో దశకంలో అభ్యుదయ సాహిత్యం తన ప్రభావాన్ని కోల్పోతున్న సందర్భంలో విశ్వనాథ ప్రతిఘాతక భావాలు సాహిత్యంలోకి ప్రవేశించాయి. ఈ విషయాలన్నింటిని టీఎంఎస్‌ సాధికారికంగా విశ్వనాథ తిరోగమన సాహిత్యంలో విశ్లేషించాడు.

కవి అంటే సాదాసీదా మనిషి కాదు. సృజనాత్మకత కాగడాను చేపట్టి వెలుగులు విరజిమ్ముతూ ప్రయాణించే బాటసారి. టీఎంఎస్‌ అభిప్రాయంలో కవి ఆధ్యాత్మిక ఖైదు కాదు. ʹʹజీవితంలో వ్యక్తిగత సుఖాలను అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉన్నత శ్రామిక శ్రేయోరాజ్యాన్ని సాధించటానికి కలాన్ని ఆయుధంగా చేసే కవే ఈ రోజు కవిʹʹ. అనేది ఆయన అభిప్రాయం. కవులకు అమూర్తభావనలు ఆపాదించి, ఒక ప్రత్యేక కేటగిరిగా గుర్తించటాన్ని ఆయన వ్యతిరేకించాడు. శాస్త్రీయ ప్రజా ఉద్యమాలకు సంఘీభావంగా రాలిపోయిన తారల గురించి స్పందించేవాడు కవి అని, ప్రజలలో భావ విప్లవాన్ని సృష్టించే బాధ్యత కవిదేనని భావించాడు. ప్రజలు ఏ ఆయుధాన్ని చేపడితే కవి ఆ ఆయుధాన్నే ఝుళిపించాలని కోరాడు. సాహిత్య చరిత్రలో కవుల స్థానాన్ని నిర్ధారణ చేయడానికి చరిత్రకారులు చాలా ప్రయత్నాలు చేసారు. అహేతుక స్థానాలలో కొందరు కవులను కూర్చోబెట్టారు. చారిత్రక దశలతో సంబంధం లేకుండా విమర్శకుల ఇష్టాయిష్టాలతో పీఠాలేసారు. కాని టీఎంఎస్‌ విశ్లేషణలు, వ్యాఖ్యానాలు అవసరం లేకుండానే కవుల స్థానాలను నిర్ణయించాడు. ʹʹగురజాడ ఆరంభించిన సామాజిక కవితను వీరేశలింగం సంస్కరణ ధోరణిని, గిడుగు వ్యవహారిక ఉద్యమాన్ని రాయప్రోలు తప్పుడు దోవల్లోకి మళ్లించాడుʹʹ ఇంత సూటిగా, షార్ప్‌గా అభిప్రాయాన్ని ప్రకటించటంలో టీఎంఎస్‌ నేర్పరి. నిజానికి తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడను అకవిని చేసి రాయప్రోలు సుబ్బారావును ఆధునిక కవితా యుగానికి యుగకర్తను చేసే పనిని చాలా మంది చేసారు. సినారె ఆధునిక సాహిత్య యుగకర్తలు ఇద్దరని(గురజాడ, రాయప్రోలు) మధ్యమార్గాన్ని తీసుకున్నాడు. కాని సాహిత్య వస్తువులో, భాషలో, దృక్పథంలో గురజాడ అప్పారావే యుగకర్త. ఈ విషయాన్నే టీఎంఎస్‌ సూటిగా తేల్చాడు. పరిణామానికి దోహదం చేసేదే ప్రయోగం, ఆ ప్రయోగాన్ని మొదట సాహిత్యంలో చేసినవాడు గురజాడ.

టీఎంఎస్‌ అసలైన మార్క్సిస్టు విమర్శకుడు. విమర్శలో విప్లవ పథ నిర్దేశకుడు. ఆయనకు సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల మీద సాధికారికమైన పట్టు ఉండటం వలన తెలుగు సాహిత్య విమర్శలో విప్లవ మార్గాన్ని వేసాడు. కళా-శాస్త్రాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. అలంకార శాస్త్రం గురించిన లోతైన పరిజ్ఞానం ఉంది. మార్క్సిస్టు క్లాసిక్స్‌ మీద విస్తృత అధ్యయనం ఉంది. ఈ నేపథ్యం నుంచి ఏ సాహిత్య ప్రక్రియనైనా, కవినైనా, విమర్శకుడినైనా నిష్కర్షగా అంచనా వేయటం చేసాడు. శ్రీశ్రీ, కెవిఆర్‌, రా.రా., చెరబండరాజు, వరవరరావు, జ్వాలాముఖి, శివసాగర్‌ ఇలా సాహిత్యంలో ప్రముఖులందరిని ఒక క్రమంలో విశ్లేషించాడు. వాళ్ల సాహిత్యంలోని గుణదోషాలను తాత్విక పునాది మీద చర్చించాడు. ఎవరి విషయంలోనూ ఉదారవాదానికి గురికాకుండా, స్వీయాత్మకతకు లోనుకాకుండా పరిశీలించాడు. జ్వాలాముఖి లోకానికంతా దిగంబర కవిగా, విప్లవ కవిగా పరిచయం. కానీ ఆయనలోని మార్క్సిస్టేతర లక్షణాలను టీఎంఎస్‌ ఎత్తిచూపాడు. ఫ్యూడల్‌, భావవాద ఆలోచనలు అతని కవిత్వంలో ఎలా ఉన్నాయో చెప్పాడు.

రా.రా బయటి ప్రపంచానికి గొప్ప మార్క్సిస్టు విమర్శకుడిగా తెలుసు. ఆయనలోని ఫ్యూడల్‌, సంప్రదాయ ఆలోచనలు సాహిత్యంలో వ్యక్తమైన తీరు టీఎంఎస్‌కే తెలుసు. ʹʹరసమే కవిత్వ జీవధాతువుʹʹ. ఇది ఆధునికుల విశ్వాసమని చెప్పిన రారా ఆధునిక వేషం వేసుకున్న ఛాందసుడని టీఎంఎస్‌ నిర్ధారించాడు. అభినవగుప్తుడు సంస్కృతంలో చెప్పిన ʹరసేనైవసర్వం జీవిత కావ్యంʹ అనే మాటను రారా తెలుగు చేసి తానేదో గొప్పగా చెప్పుకోవటంలోని అనౌచిత్యాన్ని టీఎంఎస్‌ బట్టబయలు చేసాడు. రారా సాహిత్య విమర్శ సాహిత్య పరిధులను దాటకూడదని రాసాడు. సంప్రదాయ విమర్శకులందరూ ఇదే మాట చెప్పారు. కొందరు ప్రజాస్వామిక స్వభావం కలిగిన విమర్శకులు కూడా ఇదే మాటను ఒప్పుకున్నారు. రారా కూడా వీళ్ల శిబిరంలో ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. కాని వీర మార్క్సిస్టు విమర్శకుడుగా ఊరేగటంలోనే అభ్యంతరం ఉంది. బహుశ అలంకారికులు కూడా సాహిత్యాన్ని సాహిత్య పరిధులలో విశ్లేషించలేదు. అది ఏ కాలంలోనూ సాధ్యం కాదు. సాహిత్యానికి జీవితమే ముడిసరుకు అయినప్పుడు, సమాజంలో, రాజకీయాలలో భాగమైన జీవితాన్ని ప్రతిబింబించే సాహిత్యం-దానిని విమర్శించే సాహిత్య విమర్శ సాహిత్య పరిధులలో ఉండటం సాధ్యం కాదు. విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, తత్వశాస్త్రం సాహిత్య విమర్శను ఎంతో సుసంపన్నం చేసాయి. కనుక సాహిత్యేతర విషయాలపై విమర్శకుడికి ఎంత పట్టు ఉంటే సాహిత్య విమర్శ అంతగా శాస్త్రీయంగా ఉంటుంది. కాని రారా సాహిత్య విమర్శను సాహిత్య పరిధిలోకి కుదించటం అమార్క్సిజం అవుతుంది. అందుకే టీఎంఎస్‌ రారా స్థానమేమిటో నిర్ణయించాడు. ʹʹవామపక్షం ముసుగు వేసుకున్న ఆర్‌.ఎస్‌ సుదర్శనమే రారాʹʹ

తెలుగు సాహిత్యంలో గురజాడకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ కేవీఆర్‌, శ్రీశ్రీ రచనలు చేసారు. గురజాడ ప్రసరించిన మహోదయాన్ని కేవీఆర్‌ నిరూపించాడు. వెలుగుజాడల అడుగుజాడను శ్రీశ్రీ ప్రతిష్టించాడు. ఆకాశపు దారుల్లో ప్రయాణిస్తున్న తెలుగు కవితాన్ని భూమార్గం పట్టించి భూకంపం పుట్టించిన ప్రజాకవి శ్రీశ్రీ. కష్టజీవికి ఇరువైపుల ఉన్నవాడే కవి అని కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అర్థ శతాబ్దం తనదేనని ప్రకటించుకున్న సాధికారి శ్రీశ్రీ. అయితే కవిత్వంతో పాటు శ్రీశ్రీ సారవంతమైన విమర్శను రాసాడు. ఆయన కవిత్వం, విమర్శ భిన్న తలాలలో చర్చించవల్సిన విషయాలు కావు. కవిత్వంలో విమర్శ ఉంది. విమర్శలో కవిత్వం ఉంది.

ʹʹకదిలేది కదిలించేదీ

మారేది మార్పించేదీ

పాడేదీ పాడించేదీ

పెను నిద్దుర వదిలించేదీ

మునుముందుకు సాగించేదీ

పరిపూర్ణపు బ్రతుకిచ్చేదిʹʹ కవిత్వమని శ్రీశ్రీ కవితాత్మకంగా చెప్పిన పాదాలలో పరిపూర్ణమైన విమర్శ ఉంది. కవిత్వ నిర్వచనం ఉంది.

ʹʹసిందూరం, రక్త చందనం

బంధూకం, సంధ్యారాగం,

పులిచంపిన లేడినెత్తురూ,

ఎగరేసిన ఎర్రని జెండా,

రుద్రాలిక నయనజ్వాలిక,

కలకత్తా కాళిక నాలిక

కావాలోయ్‌ నవకవనానికిʹʹ కవితా దినుసులు ఏముండాలో శ్రీశ్రీ కవులకు నిర్దేశించాడు. ఒక కాలంలో కవులు కావ్యావతారికలు రాసుకునేవారు. అందులో కృతిభర్త, కృతికర్త, ఇష్టదైవస్తుతి, కుకవినింద, మంచి కవితా లక్షణాలను కవులు పేర్కొనేవాళ్లు. అంటే కవులందరూ స్వయంగా విమర్శకులుగా ఉండేవాళ్లు. ఆధునిక కాలంలో విప్లవ సాహిత్య అవసరాలను తీర్చడానికి చాలామంది కవులు విమర్శకులయ్యారు. ఈ అవసరాన్ని అద్భుతంగా తీర్చినవాడు శ్రీశ్రీ. కనుక టీఎంఎస్‌ ఆధునిక విమర్శకుడుగా శ్రీశ్రీ స్థానాన్ని పదిలపర్చాడు. సామాజిక విమర్శతో కూడిన సజీవ సాహిత్య విమర్శకు నలభయో దశకంలోనే శ్రీశ్రీ నాంది పలికాడు. శ్రీశ్రీ కవిత్వంలో కంటే విమర్శలోనే సామాజిక దృష్టిని స్పష్టంగా చూడవచ్చునని ఆయన అభిప్రాయం. సాహిత్య విమర్శలో వర్గ పోరాటాన్ని ప్రవేశపెట్టి శ్రీశ్రీ సాహిత్య విమర్శ స్వరూపాన్ని మార్చాడు. కేవలం శ్రీశ్రీని విమర్శకుడుగా నిలబెట్టే ప్రయత్నం మాత్రమే కాకుండా ఈ ఆవరణంలో విప్లవ విమర్శ, విప్లవ విమర్శకులు ఎలా ఉండాలి, వర్గ పోరాట రాజకీయాలను విమర్శలో ఎలా ఎత్తి పట్టాలనే దృక్పథాన్ని టీఎంఎస్‌ అందించాడు.

తిక్కన, వేమన, గురజాడ-శ్రీశ్రీకి కవిత్రయం. వీరి ముగ్గుర్ని ప్రజా కవులని శ్రీశ్రీ చెప్పిన విషయంలో టీఎంఎస్‌ శ్రీశ్రీని విభేదించాడు. ఒకరు ఫ్యూడల్‌ కవి, మరొకరు వ్యాపారకవి, ఇంకొకరు బూర్జువా కవి అనే నిర్ధారణలు చేసాడు. వాళ్లు ఆయా సామాజిక సందర్భాలలో దోపిడీవర్గ ప్రయోజనాలను నెరవేర్చారే కానీ దోపిడీకి గురయ్యే వర్గ ప్రజల గురించి రాయలేదని టీఎంఎస్‌ అభ్యంతరం. అయితే ఇక్కడ ఆయా కాలంలోని సాహిత్యంలో ప్రజాస్వామిక భావాలను వ్యక్తం చేయటానికి ప్రయత్నం చేసిన పరిమితిని అర్థం చేసుకుంటూనే వారి కృషిని గుర్తించటానికి ʹప్రజాకవులుʹ అనే మాటను శ్రీశ్రీ వాడినట్లుగా ఉంది. చివరగా శ్రీశ్రీ మార్క్సిస్టు విమర్శకుడు కాదనే నిర్ధారణను టీఎంఎస్‌ చేసాడు. ఇది పాక్షిక సత్యమే కావచ్చు. ఒక కవిని, విమర్శకుడిని అంచనా వేసి అతని కంట్రిబ్యూషన్‌ను నిర్ణయించటంలో ఉదారవాదానికి గురికావల్సిన అవసరం లేదు. కానీ పూర్తిగా తిరస్కరించే ధోరణి సరైనది కాదు. సైద్ధాంతికంగా ఈ పద్ధతి యాంత్రికవాదం అవుతుంది. ʹతెలుగు విమర్శకుడికి తిట్టడంలో ఉన్న ప్రజ్ఞ మెచ్చుకోవటంలో లేదుʹ అని శ్రీశ్రీ చెప్పిన మాటను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.

ఈ పుస్తకంలో టీఎంఎస్‌ రాసిన చాలా వ్యాసాలు పరిశోధనాత్మకమైనవి. విశ్వవిద్యాలయాలలో ఇతని వ్యాసాలకు సరితూగగలవి ఉన్నాయనుకుంటే సందేహమే? అతడు ʹనాటక ప్రయోజనం-అధ్యయన పద్ధతిʹ మీద రాసిన వ్యాసం కొత్తదిగాను, విశ్లేషణాత్మకమైనదిగా ఉంది. ఈ వ్యాస ఎత్తుగడలోనే టీఎంఎస్‌ విలక్షణతను పాటించాడు. వాక్యం నేరుగా మొదలవుతుంది. ఇదోరకమైన వ్యాసశిల్పం. ఆ తర్వాత వ్యాస వివరణ ఉంటుంది. దాదాపు టీఎంఎస్‌ వ్యాసాలన్నీ ఇదే శైలిలో ఉన్నాయి. వలసతత్వం, సంప్రదాయికత పేరుకపోయి ఉన్న సమాజంలో సామాజిక బాధ్యత స్వీకరించని ఏ మేధావి కూడా నిరక్ష్యరాస్యుడి కన్నా గొప్పవాడేమి కాదని టీఎంఎస్‌ అభిప్రాయం. అభివృద్ధి పొందిన విజ్ఞానాన్ని జీవిత రంగాలకు అన్వయించి అధ్యయనం చేయనివాడు విద్యావంతుడే కాదని కూడా చెప్పాడు. నాటకం నిర్వచనాన్ని అలంకారశాస్త్రం, సంస్కృత సాహిత్యం నుంచి కాకుండా నిత్య జీవితం నుంచి ఇచ్చాడు. ప్రదర్శించే కళా రూపమే నాటకమన్నాడు. ఈ ప్రదర్శన, కళ అనేవి అన్ని కాలాలలో, అన్ని దేశాలలో ఒకేలా ఉండవు. సామాజిక వ్యవస్థను బట్టి భిన్నత్వం వ్యక్తమవుతుందని చెప్పాడు. నాటక ప్రయోజనం ఆనందమని భావించేవాళ్ల తప్పుడు సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ ఆనందం, ఆవేశం విడిగా ఉండవని అవి సామాజిక అస్తిత్వం నుంచి, చైతన్యం నుంచి పుడుతాయని చెప్పాడు. ఏ కళా రూపమైన మనిషి అస్తిత్వం నుంచే పుడుతుంది. కనుక నాటకం సామాజిక చైతన్యరూపం. నాటకం పండితులు చెబుతున్నట్లు సంస్కృత సాహిత్య జన్యం కాదు, వేట అనుకరణ నృత్యమే నాటకమని, మనిషికున్నంత చరిత్ర నాటకానికుందని చెప్పాడు. ప్రజల వ్యక్తీకరణనే మొదటి నాటకం. ఆ తర్వాత దానిని కొందరు రాజశ్రితులుగా మార్చారని టీఎంఎస్‌ వివరించాడు. ఫ్యూడల్‌ వర్గాల జీవితాన్ని ప్రతిబింబించని వాటిని నాటకాలు కావని పండితులు నిర్ధారణ చేసి ప్రజా నటులను బహిష్కృతులుగా చేసారు.

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పాలకులకు కవుల మీద ఎనలేని గౌరవం ఏర్పడింది. ఫలితంగా కవులు ప్రభుత్వాలను వ్యతిరేకించకుండా చేసుకోగలుగుతున్నారు. ప్రత్యామ్నాయ భావజాలం బలంగా లేకపోవటం కూడా దీనికి కారణంగా ఉంది. కాని చరిత్రలో పాలకుల గురించి, ప్రభుత్వం గురించి కావ్యాలు రాసిన కవులకెవరికి అంతగా గుర్తింపు లేదు. అంత మాత్రమే కాకుండా ʹప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఆధునిక సాహిత్యంలో ఒక్క మహా కావ్యమైన రాలేదుʹ అని టీఎంఎస్‌ ʹనన్నయ భూతంతో ప్రభుత్వంʹ అనే వ్యాసంలో రాసాడు. ఒకనాడు విశ్వనాథ సత్యనారాయణ పాలకులకు సేవ చేయటానికి తపించాడు. ఆయన గురించి టీఎంఎస్‌ రాస్తూ ʹఎంత పాత విషయమైతే అంత ఎక్కువగా ప్రేమించే వ్యాధి కొందరికి ఉంటుంది. విశ్వనాథ ఈ వ్యాధితోనే చచ్చిపోయాడుʹ ఈ వాక్యంలో ఉన్న సూటిదనం వలన, అది బట్వాడ చేసిన విషయం వలన వ్యాస శిల్పం తళుక్కున మెరిసింది. సాంఘిక జీవితంలో ఏర్పడే మార్పులను బట్టే కవిత్వం ఉంటుంది. అయితే బ్రాహ్మణీయ భావజాలం అధికమవుతున్న ఈ రోజుల్లో దానికి తగిన కవిత్వాన్ని, సాహిత్యాన్ని పాలకులు ముందుకు తెస్తున్నారని అందులో భాగమే నన్నయ ప్రవేశమని టీఎంఎస్‌ సూక్ష్మస్థాయిలో గ్రహించి పాఠకులను, రచయితలను అలర్ట్‌ చేసాడు. ఈ వ్యాసం ఇవ్వాల్టికీ ప్రాసంగికంగా ఉంది.

టీఎంఎస్‌ 1991లో ʹనేటి కవిత్వతత్వంʹ పేర ఒక సుదీర్ఘ వ్యాసం రాసాడు. 1970 నుంచి అంటే విరసం ఏర్పడిన నాటి నుంచి 1990 వరకు రెండు దశాబ్దాల కవిత్వం గురించిన పరామర్శ చేసారు. కవిత్వంలో వర్గ పోరాటం ప్రారంభం కావటం, కవిత్వ నిర్మాణం మీద, కవిత్వం మౌలికతల మీద విస్తృత ప్రభావం వేసిన విరసం పుట్టినప్పటినుంచి వ్యాసం ప్రారంభం కావటం ఔచిత్యంగా ఉంది. ఈ కాలపు కవిత్వంలో రామాయణాలు, భారతాలు, హనుమంతుడు, కుచేలుడు, నోములు, వ్రతాల గురించిన కథా నేపథ్యంగా వస్తుండిన నిర్జన కవిత్వం గురించి టీఎంఎస్‌ తన వ్యాసంలో ప్రస్తావించాడు. అంతే కాకుండా తిరోగమన వాదాన్ని ప్రచారం చేస్తూ రాస్తున్న ఆత్మ కవిత్వం గురించి కూడా రాసాడు. సంప్రదాయాలకు పెద్దపీట వేసి పూర్వకాలపు పురుషార్థాలకు ప్రాసంగికత కల్పించే పని కవిత్వం ద్వారా జరగటాన్ని టీఎంఎస్‌ తప్పుపట్టారు. ʹʹఆధునిక విజ్ఞాన, శాస్త్ర, సామాజిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక, నైతిక శాస్త్రాల నేపథ్యం నుంచి పుట్టి పెరుగుతున్నదే ఆధునిక కవిత్వమనిʹʹ టీఎంఎస్‌ శాస్త్రీయమైన నిర్వచనం ఇచ్చాడు. అయితే మతవాద కవిత్వం, బూర్జువా వర్గానికి మద్దతు తెలిపే కవిత్వం, వికృత, అసభ్యతలను ప్రచారం చేసే మూక కవిత్వం కూడా ఆధునిక కవిత్వం పేరు మీద ప్రచారమవుతుందని ఆయన వివరించాడు.

ఈ వ్యాసంలో ఆయన విప్లవ కవిత్వ లక్ష్యం, నిర్మాణం గురించి అవసరమైన వ్యాఖ్యలు, విశ్లేషణలు చేసారు. ఏది విప్లవ కవిత్వం అనే చర్చ ప్రారంభ దినాల్లో చాలా జరిగింది. ʹʹప్రజల విప్లవకర పోరాటాలు, ఆ పోరాటాలకు సంబంధించిన తాత్విక, సాంఘిక విషయాలే విప్లవ కవిత్వంలో వస్తువుʹʹ విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ రాజకీయాలు లేనట్లే, విప్లవ కవిత్వం కూడా ఉండదు. సిద్ధాంతం లేకుండా పోరాటాలను మాత్రమే ప్రచారం చేస్తే ప్రజలు గందరగోళానికి గురవుతారని భావించాడు. అందుకే విప్లవ కవిత్వానికి మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం ప్రాపంచిక దృక్పథమని చెప్పాడు. విప్లవ కవిత్వం శిల్పం గురించి పట్టించుకోదు, కేవలం నినాదాలను కవిత్వంగా ప్రచారం చేస్తారనే ఆరోపణను టీఎంఎస్‌ పూర్వపక్షం చేస్తూ విప్లవ కవిత్వం వచన కవితను శిల్పపరంగా సుసంపన్నం చేసిన తీరును విశ్లేషించాడు. విప్లవ కవులు వచన కవితను సజీవ ప్రక్రియగా మార్చారు. కళాత్మకం చేసారు. విప్లవ కవిత్వంలోని పద చిత్రాలకు భావాలు ముడిసరుకు. కవిత్వంలో కేవలం బాధల్ని చెప్పి సరిపెట్టుకునే విధానాన్ని విప్లవ కవిత్వం అధిగమించింది. కవిత్వం అంతర నిర్మాణంలో పద చిత్రాలకీ, భావాలకీ ప్రాపంచిక దృక్పథం నేపథ్యంగా ఉండాలి. విప్లవ కవిత్వంలో వ్యక్తమైన వైవిధ్యాన్ని కూడా టీఎంఎస్‌ విశ్లేషించాడు. కవిత అంతర్నిర్మాణం, అది ఒదిగిన పద్ధతి, భాషా సామాగ్రి, పద కల్పనలు మొదలైన శిల్పగత విషయాల గురించి ఆయన సూక్ష్మ పరిశీలన పరికల్పన చేసాడు.

తెలుగు కవిత్వాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లినది పాట. కాని ఈ పాటను విమర్శకులు విస్మరించారు. పట్టించుకోలేదు. కవిత్వంలో భాగంగా వచ్చిన ద్విపద కవిత్వాన్ని, గేయాన్ని, వచన కవిత్వాన్ని ఆదరించి ఆకాశానికి ఎత్తినట్లుగా పాట గురించి మాట్లాడలేదు. రాయలేదు. కారణం స్పష్టమే. పాట రచయితలందరూ ఉత్పత్తి కులాల నుంచి ఎదిగారు. మరీ ముఖ్యంగా దళిత కులాల నుంచి వచ్చారు. తమ జీవితాన్ని, ఆరాట పోరాటాలను పాటలో చిత్రించారు. ఫలితంగా సాహిత్యంలోకి అంటరాని జీవితాలు ప్రవేశించాయి. కాని విమర్శకులందరూ అగ్రకులాలవారే. పాట గురించి కానీ, పాటలో చిత్రించిన జీవితం గురించి కానీ ఏ మాత్రం అవగాహన లేనివాళ్లు. పైగా పాటలో అల్లిన జీవితం, పాట నిర్మాణం వచన కవితను మించి పోయేలా ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన విమర్శకులు పాట విషయంలో మౌనం పాటించారు.

విమర్శకు ఉండిన ఈ పరిమితిన టీఎంఎస్‌ గ్రహించాడు. కనుక పాట గురించి కనీసంగానైనా ప్రస్తావించాడు. విప్లవ కవులు వచన కవిత కంటే ఎక్కువగా పాట పట్ల చూపిన శ్రద్ధ గురించి చెప్పాడు. విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప్పగలమనే సౌలభ్యాన్ని టీఎంఎస్‌ గుర్తించాడు. కేవలం అవసరం కోసమే కాదు, సైద్ధాంతికంగానే పాట గొప్పతనాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ʹʹవచన కవిత ప్రజా ప్రక్రియ కాదు. అది పరాయికరణ ఫలితమైన కవిత్వ రూపం. వస్తురూపంగా దానికి ప్రజా స్వభావం కల్గించగలమే కానీ రూపపరంగా దానికి ప్రజా స్వభావం లేదుʹʹ. పాటలో అస్పష్టత, సంకీర్ణత ఉండదు. పదచిత్రాలు లేకపోయినా భావాల సమ్మేళనం వలన పాటను శ్రోతలు ఆలకించగలరు. కనుక పాటకు లొంగని మనిషంటూ ఉండడు. ఈ ఐదు దశాబ్దాలలో పాట కవులు మొత్తం సాహిత్యాన్ని ఆక్రమించుకున్నారు. పాటలో కళాత్మకత లోపిస్తే శ్రోతకు భావం పట్ల ఆసక్తి ఉండదు. ఈ విషయాలన్నింటిని టీఎంఎస్‌ తన వ్యాసంలో ప్రస్తావించాడు.

రెండు దశాబ్దాలు(1970-1990) విరసం మీద జరిగే అన్నిరకాల దాడులను సాధికారికంగా తిప్పికొట్టినవాడు టీఎంఎస్‌. సాహిత్య, రాజకీయ దాడులను, వ్యక్తులు, విప్లవ వ్యతిరేకులు, ప్రభుత్వ పోషకులు చేసిన దాడులను టీఎంఎస్‌ సైద్ధాంతికంగా పూర్వపక్షం చేసి ఖండించాడు. విమర్శకు విమర్శే సమాధానం కాకుండా(తిట్టుకు తిట్టే సమాధానం కాదు కూడా) వాస్తవాల ఆధారంగా సత్యాలను నిరూపించే రచనా పద్ధతి టీఎంఎస్‌ది. ʹవిరసానికి మూసిన తలుపులుʹ పేరు మీద సుప్రభాతం(5 మే 1992) పత్రికకు సమాధానం రాసాడు. టీఎంఎస్‌లో ఉండే వాదనా పటిమను చూపే ఎక్కువ వ్యాసాలలో ఇదీ ఒకటి. వాక్యంలో ఉండే సూటిదనం వలన, వ్యాసరచనా నైపుణ్యం వలన ఈ వ్యాసం పేర్కొనదగినది. ʹʹసుప్రభాతం కవిత ప్రత్యేక సంచికలో అన్నింటి కంటే మూసిన తలుపులు చిత్ర పటం చాలా బాగుంది.ʹʹ ఈ వాక్యాన్ని చూడగానే సుప్రభాతం పత్రికను పొగుడ్తున్నట్లు అన్పిస్తుంది. కాని ʹʹపాత కాలపు జమీందార్ల మహా సౌధ సింహద్వారపు మూసిన తలుపుల్లా చాలా అందంగా ఉన్నాయిʹʹ రెండో వాక్యంలో మూసిన తలుపుల అందాన్ని ధ్వన్యాత్మకం చేసాడు. వ్యాజస్తుతి అలంకారిక శైలి ఇందులో ఉంది. వాక్యాన్ని ఇంత బలంగా వ్యక్తం చేయాలంటే అక్షరం నొప్పులు పడాల్సిందే.

అధ్యయనం తక్కువ, అరుపులు ఎక్కువైన కాలంలో జీవిస్తున్నాం. ʹఅట్ట జ్ఞానులుʹ ఎక్కువైపోయారు. కలం పట్టి రాసినా, వేదిక నెక్కి మాట్లాడినా వీరి కాలమే చలామణి అవుతున్నది. కాని విమర్శించాలన్నా, మెచ్చుకోవాలన్నా సీరియస్‌ అధ్యయనం ఉండాలని టీఎంఎస్‌ భావించాడు. అలవోకగా పాసింగ్‌ కామెంట్స్‌ కూడదన్నాడు. రచనా సంవిధానం తెలియాలంటే అధ్యయనం చేయాలని చెప్పాడు. భావాలు రూపొందాలంటే అధ్యయనమే మూలం. ఈ అధ్యయనం ఎంత విస్తృతమైనదంటే ʹʹసాహిత్య విమర్శకుడికి సాహిత్య అధ్యయనం చాలదు. సామాజిక శాస్త్రాల్ని ఆధునిక శాస్త్రాల్నీ చదవకపోతే శాస్త్రీయ విమర్శ చేయలేడుʹʹ పూర్వ గ్రంథాల అధ్యయనం అలవాటుగా ఉండాలని, వాటిలో ఉన్న తప్పులను సరిచేయాలని, లేకపోతే రాయటమే అనవసరమని బలంగా వాదించాడు. కెరియరిజం, యిగోయిజం, ఎనార్కిజం మధ్యతరగతి లక్షణాలని, వీళ్లకు ఒక దృక్పథమంటూ ఉండదు, కనుక అధ్యయనం వలన ఈ పరిమితిని అధిగమించవచ్చు. టీఎంఎస్‌కు తత్వశాస్త్రం మీద అపారమైన పట్టు ఉంది. తాత్విక వ్యక్తీకరణలు సాహిత్యం నిండా కన్పిస్తాయి. ప్రతి వాక్యంలో విన్పిస్తాయి. ఫ్యూడల్‌ వర్గ మేధావుల నుంచి బూర్జువా వర్గ మేధావులు వస్తారు. బూర్జువా వర్గ మేధావుల నుంచి కార్మికవర్గ మేధావులు వస్తారు. ఇది పరిణామంలో జరిగే క్రమమని తత్వశాస్త్రం నుంచి టీఎంఎస్‌ స్వీకరించాడు.

తత్వశాస్త్రాన్ని, రాజకీయాలను, రాజకీయార్థ శాస్త్రాన్ని అధ్యయనం చేయటమంటే సూక్ష్మ స్థాయి పరిశీలన అని అర్థం. ప్రజా పోరాటాల నుంచి సిద్ధాంతాన్ని ఆవిష్కరించుకునే దృష్టితో అధ్యయనం ముండాలి. మన భాషనం, లేఖనం అనే వ్యక్త్తీకరణలు సృజనాత్మకంగా ఉండాలని టీఎంఎస్‌ అభిప్రాయం. భాషను వాడే పద్ధతి వక్తకు, రచయితకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విప్లవ శిబిరంలో కూడా వేదం వెంకటరాయ, కొక్కొండ వెంకట రత్నం పంతులు, వేగుంట మోహన ప్రసాద్‌లు బయలుదేరారు. కవిత్వంలోనూ, వచనంలోనూ నర్మగర్భ రచనలకు తెరలేపారు, పైగా అలా రాస్తేనే పాండిత్యమనే ధోరణి కూడా పెరుగుతున్నది. కనుక ఇప్పుడు టీఎంఎస్‌ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటే ఈ అస్పష్టత నుంచి బయటపడవచ్చు. ʹʹసులభంగా వినటానికి, చదవటానికి ఇంపుగా ఉండే భాషలో భావరూపాల్లో రచనలు చేయాలి. రూపంలో జాతీయత, ప్రాదేశికత లేకపోతే రచన విఫలమవుతుంది.ʹʹ మార్క్సిస్టు సూత్రాలను ఉన్నది ఉన్నట్లుగా యాంత్రికంగా ఉపయోగించి రాయటం, మాట్లాడటం పెరిగింది. వాటిని నిర్దిష్ట పరిస్థితికి అన్వయించి సృజనాత్మకతను అభివృద్ధి చేయాలని టీఎంఎస్‌ భావన.

బండెడు పుస్తకాలను ముందేసుకొని చదవటం పుస్తక పూజ అవుతుందని, ఏ పూజ అయినా అంతిమంగా మూఢత్వానికే దారితీస్తుందని తెలుసుకొని మూఢ విశ్వాసాన్ని సహేతుకంగా నిరూపించే జ్ఞానం కోసం చదువాలి. సమస్యను అర్థం చేసుకొని, ఆచరణాత్మకం కావడానికి దోహదం చేసే అధ్యయనం నేటి అవసరం. ʹʹగతితార్కిక భౌతిక వాదాన్ని విశ్వసించినంత మాత్రాన ఎవడూ గతితార్కిక భౌతికవాది కాలేడు. వివరించగలగాలి, నిరూపించగలగాలి, వాదించగలగాలి, ఆచరించగలగాలిʹʹ ఈ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి అధ్యయనం అవసరమని టీఎంఎస్‌ భావన. అధ్యయనం కూడా వ్యక్తిగత స్థాయిలో కాకుండా సమష్టి అధ్యయనం ఉండాలని దాని కోసమే విరసం సాహిత్య పాఠశాలని చెప్పాడు.

విమర్శకుడిగా టీఎంఎస్‌ ప్రత్యేకత అంతా గతితార్కిక సాహిత్య భౌతికవాదంలోనే ఉంది. మద్దుకూరి చంద్రశేఖర్‌రావు, జి.వి.కృష్ణారావు మొదలు రారా, కేవీఆర్‌ వరకు అందరూ చారిత్రక భౌతికవాదాన్ని సాహిత్యానికి అన్వయించి విమర్శ రాసారని ఆయన అభిప్రాయం. అయితే ఆ విషయంలో వాదోపవాదాలు ఏమున్నా మనం ఆయన చెప్పిన ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తించాలి. చర్చించాలి. అదేమిటంటే... పునాది మాత్రమే ఉపరితలాన్ని ప్రభావితం చేస్తుందని ఇప్పటి వరకు చాలామంది చెప్పారు. కాని ఉపరితలం కూడా పునాదిని ప్రభావితం చేస్తుందని టీఎంఎస్‌ ప్రతిపాదన. ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఈ విషయం పట్ల స్పష్టత వస్తుంది. కులం గురించి విప్లవోద్యమం చర్చించిన సందర్భంలో కులం ఉపరితలంలోనూ, పునాదిలోనూ ఉందని, అప్పుడప్పుడు ఉపరితలంలోని కుల వ్యక్త్తీకరణలు, ఆధిపత్యం పునాదిని ప్రభావితం చేస్తుందని చెప్పింది. సరిగ్గా టీఎంఎస్‌ చెప్పింది కూడా ఉపరితలంలోని నైతిక విలువల లాంటివి పునాదిని, సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయని, కనుక పునాది మాత్రమే సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుందనేది పాక్షిక విషయమే అవుతుంది.

సాహిత్య విమర్శే లేని ఈ సందర్భంలో విమర్శ, విమర్శకుడు ఎలా ఉండాలో టీఎంఎస్‌ చెప్పిన విషయంతో ఈ ముందు మాటను ముగిస్తాను. ʹʹవిమర్శకుడు సాహిత్యాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమ గుడ్డిది కాకూడదు. రచయితల మీద కూడా గౌరవం ఉండాలి. కాని ఆ గౌరవం అహేతుకం కాకూడదు. విమర్శకుడు విద్యార్థిగా ఉంటూనే ఉపాధ్యాయుడి పాత్రను నిర్వహించాలి.ʹʹ ఈ దృష్టి విమర్శకులు కాగోరే వారందరికి ఉండాలి. రచయితలు ఏ వస్తువును చేపట్టాలి? రచయితలు రచనలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? శిల్ప నైపుణ్యం సాధించటం ఎలా? మొదలైన ప్రశ్నలకు విమర్శకుడు తాత్విక దృక్పథంతో సమాధానం చెప్పాలని టీఎంఎస్‌ కోరుకున్నాడు. ఈ తాత్విక పునాది కోసమే ఆయన గతితార్కిక సాహిత్య భౌతికవాదాన్ని ముందుకు తెచ్చాడు. మార్క్సిస్టు విమర్శకులు అనగానే శిల్ప వ్యతిరేకులనే ముద్ర ఉంది. కానీ టీఎంఎస్‌ ఆ విషయాన్ని ఖండించాడు. వస్తువు-శిల్పం వేరు వేరు కాదని, ఆ రెంటి మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్పాడు. ఏ రచయిత అయినా ఏం చెప్పాలనేది ముందు నిర్ణయించుకొని ఎలా చెప్పాలో తర్వాత నిర్ణయించుకుంటారని చెప్పాడు. కనుక శిల్పం వస్తువులో కరిగి పోయేటట్లు ఉండాలన్నాడు.

శ్రీశ్రీ, కేవీఆర్‌, చెరబండరాజు, వరవరరావు టీఎంఎస్‌కు సహచరులు. లేదా టీఎంఎస్‌ వాళ్లకు సహచరుడు. కానీ వాళ్ల రచన మీద అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు విమర్శకుడి పాత్రను మర్చిపోలేదు, అంతకంటే మార్క్సిస్టు పాత్రను విస్మరించలేదు. కనుక ఆయన పుస్తకానికి ముందు మాట రాస్తూ ఆయనను ఆకాశమంత ఎత్తుకు పొగిడి ముగిస్తే ఆయన రచనా దృక్పథానికి కొనసాగింపు లేనట్లు అవుతుంది.

చెరబండరాజు ʹముట్టడిʹ పుస్తకాన్ని సమీక్షిస్తూ అందులో చెర రాసిన ʹమాలోని మనిషివేʹ అనే పాట మీద టీఎంఎస్‌ అనుచిత, అసందర్భ, అవగాహన రాహిత్య విమర్శ చేసాడు. పోలీసు, సైనికుడు ఉద్యోగం రీత్యా ప్రభుత్వంలో భాగంగా ఉంటారు. పాలకవర్గాల అణిచివేతకు సాధనాలుగా మారుతారు. కాని వాళ్లు కార్మికుల, రైతుల, ఉత్పత్తి కులాల బిడ్డలే. అంటే కార్మికవర్గమే. కనుకనే సైన్యంలోని సైనికుల గురించి, పోలీసుల గురించి విప్లవోద్యమం కరపత్రాలు రాసి పంపిణి చేసి వారిని ప్రజల వైపు రావల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోరాడే ప్రజల మీద నిర్బంధాన్ని ప్రయోగించే జీవో చేరి చేసినప్పుడు దానిని డ్రాఫ్ట్‌ చేసేది కింది స్థాయి ఉద్యోగులే. అలా అని వాళ్ల మీద, వారి సమస్యల మీద సాహిత్యం రాయకుండా ఉండలేము కదా! అదే విధంగా ʹనేటి కవిత్వంʹ గురించి రాస్తూ కొందరు కవులు రాస్తున్న నీరసమైన, ఏడ్పుగొట్టు కవిత్వం అనే మాటలను ప్రయోగించిన టీఎంఎస్‌ అదే అర్థంలో ʹబడుగు కవిత్వంʹ అనే పదాన్ని నిందార్థంలో రాసాడు. ఇది బడుగులను అవమానించే వ్యక్తీకరణ. ఇది సరిచేసుకోవల్సి ఉండే.

పదునైన విమర్శను ఇష్టపడే పాఠకులకు, నిప్పు లాంటి విమర్శకుడి అక్షరాలతో కరచాలనం చేసే హృదయగత మేధస్సులకు ఈ పుస్తకంలోకి ఆహ్వానం...

చింతకింది కాశీం

10 అక్టోబర్‌ 2018

ఆర్‌-9, ఓయూ.


No. of visitors : 444
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •