టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

| సాహిత్యం | వ్యాసాలు

టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

- నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

ఓ సజీవ జ్ఞాపకం..

అతను నాకు బాగా తెలుసు

అతడి కోసం సమాధులన్నింటినీ

పిచ్చిగా వెతికా, ఇంకా తెరుచుకొనే ఉన్న ఆ కళ్ల కోసం

ఇంకా గంభీరంగా వినిపిస్తూనే ఉన్న ఆ గొంతు కోసం

ఇంకా వేడిని హామీ ఇస్తోన్న ఆ చేతుల్ని

నా గుండెలకదుముంటూ వణికే గొంతుతో

అతనితో మెల్లగా మాట్లాడాను

ʹలోకంలో అన్నీ మట్టిలో కలుస్తాయి

కానీ నువ్వు సజీవంగానే ఉంటావు

నీకు మాత్రం చావు లేదుʹ

ఎందుకంటే- నువ్వు జీవితాన్ని వెలిగించావు!

- ప్లాబ్లో నెరూడా

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌ అని శిష్య బృందం ప్రేమగా పిలుచుకునే త్రిపురనేని మధుసూదనరావుకి కూడా చావుండదు. రెండున్నర దశాబ్దాలపాటు విప్లవ సాహిత్య ఉద్యమానికి దిశా నిర్దేశం చేసినవాడు, ఆఖరి శ్వాస వరకు విప్లవ సాహిత్య ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాచుకున్నవాడు, విప్లవ విమర్శకు బాటలు వేసినవాడు, తన ఆగ్రహోదగ్ధ గళంతో తెలుగు నేలంతా విప్లవ సాహిత్య ఉద్యమాల్ని ప్రతిధ్యనింప చేసినవాడు, ప్రతీపశక్తుల వెన్నుల్లో వణుకు పుట్టించినవాడు, శత్రుశిబిరాల చేత సైతం ʹతిరుపతి మావోʹ గా కొనియాడబడినవాడు, తనదైన శైలిలో తత్వశాస్త్రంలో మెరుగైన శిష్య బృందాల్ని తయారు చేసినవాడు, ఎవరైనా సరే ఇప్పటికీ తత్వశాస్త్రంలో మంచి క్లాస్‌ చెబితే మీరు టీఎంఎస్‌ శిష్యులా అని అడితే పరిస్థితి. అదీ టీఎంఎస్‌! ముఖ్యంగా నాకు ఆప్తుడు, మిత్రుడు, మార్గదర్శి. శ్రీశ్రీ ʹవిరసంలో వీర శైవులుʹ అని వివి సార్‌, చెరబండరాజు, జ్వాలాముఖి, కాళీపట్నం రామారావుల గురించి రాశాడు. కానీ విరంసలో వీర శైవుడు ఎవరైనా ఉన్నారంటే అది త్రిపురనేని మధుసూదనరావే. ఆ వ్యాసం రాసే నాటికి త్రిపురనేని వేడి ఇంకా శ్రీశ్రీకి తాకి ఉండదు. అందుకే ఆయన్ను పేర్కొని ఉండడు. అలాగే ఎవరికో కొడవటిగంటి కుటుంబరావు గారిని పరిచయం చేస్తే నెత్తుటి కోరలు, ఎర్రని కనుగుడ్లేవని ఆ రచయిత చమత్కరించాడట. కానీ మధుసూదనరావు గారిని చూడకుండా ఆయన విమర్శ వ్యాసాలను చదివిన వాళ్ల కళ్లకు రూపుగట్టే ఆకారం మాత్రం కోరలు, ఎర్రని కన్నుల ఉగ్రరూపమే. ఆయన ఉన్నప్పుడు ఎంత భరోసా ఉండేది విప్లవ శిబిరానికి! ఈగ వాలనిచ్చేవాడు కాదు. అలాగని విచక్షణ లేని, ఆశాస్త్రీయమైనటువంటి వాదనలు ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన ప్రతి వాక్యమూ ఎంతో శాస్త్రీయంగా, పకడ్బందీగా, పదునుగా, దృఢంగా ఉండేది. ముఖ్యంగా విశ్వనాథ సాహిత్యాన్ని ఆయన చీల్చి చెండాడిన తీరుగానీ, ఆయన విరసంలో లేని సమయంలో సత్యమూర్తి ప్రచారాన్ని తుత్తునియలు చేసిన తీరుగానీ చదవాల్సిందే. మాటల్లో చెప్పలేం.

నల్లూరి రుక్మిణి, సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ల ఇంట్లో ఉండి నేను చదువుకున్నందు వల్ల ఆనాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు చాలా మంది నాకు పరిచయం. వారివల్ల అకాడమిక్‌ చదువులకన్నా ఉద్యమ సాహిత్యం పట్టుబడింది. దాదాపు 70వ దశకం చివర్నుంచి నీకు టీఎంఎస్‌తో పరిచయం ఉండేది. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. అప్పట్లో కెవిఆర్‌ని చూసి అందరూ భయపడేవారు. ఆయనంటే ఎంతో గౌరవంతో, ఆయనపట్ల ఎంతో వినమ్రతతో ఉండేవారు. కానీ నాకు కెవిఆర్‌ అంటే ఏ మాత్రం భయం ఉండేది కాదు. అయన కూడా నాతో ఎంతో సరదాగా, ప్రేమగా ఉండేవాడు. ఎందుకో తెలియదు కానీ అందరితో ఎంతో సరదాగా ఉండే టీఎంఎస్‌ అంటే నాకు చచ్చేంత భయం వేసేది. ఆయన పలకరించినా భయంతో బిగుసుకపోయేదాన్ని. భోళాశంకరుడైన టీఎంఎస్‌ని నాకు పరిచయం చేసింది, దగ్గర చేసింది, ఆయనకు అత్యంత ప్రియమైన శిష్యురాల్ని చేసింది 1987-88ల్లో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో నేను బియిడీ చదివిన ఆ రెండేళ్లే. ఆ రెండేళ్లకూ నేను జన్మంతా రుణపడి ఉంటాను. ఆ రెండేళ్లూ నాకు కొత్త ప్రపంచం పరిచయమైంది, ప్రపంచ సాహిత్యం పరిచయం అయింది. ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినవాడు కామ్రేడ్‌ త్రిపురనేని మధుసూదనరావు. ఎంతో భయంతో, బెరుగ్గా ఆయన ద్గరికి వెళ్లిన నేను ఆయన చాచిన స్నేహహస్తాల మధ్య సరికొత్తగా జన్మించాను. ఆయన ఓ తండ్రిలాగా, మిత్రుడిలా నన్ను ఆదరించారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఆవరించి ఉండే ఓ గొప్ప స్నేహ వాతావరణంలోకి నన్ను చేయిపట్టుకొని తీసుకెళ్లాడు. ʹద పీపుల్‌ʹ అనే కవితలో ప్లాబోనెరూడా ఎలాగైతే మనుషుల్ని ప్రేమిస్తూ పలవరిస్తాడో టీఎంఎస్‌కు కూడా మనుషులంటే విపరీతమైన పిచ్చి, ప్రేమ. ఆయనను ప్రపంచం మేధావిగా భావించి గౌరవించిందికానీ ఆయన తనను తాను ఎప్పుడూ మేధావిగా భావించుకోలేదు. తనను తాను ఎప్పుడూ ఓ విద్యార్థిగానో, యువకుడిగానో భావించుకొనేవాడు. తన చుట్టూ కూడా వాతావరణమంతా యవ్వనోత్తేజంతో మిరమిట్లు గొల్పుతుండేది. చిన్న పిల్ల చెప్పేది నేను వినడం ఏమిటి అనే అహం ఎప్పుడూ నేను ఆయనలో చూడలేదు. మనం చెప్పేది ఎంతో ఓపికతో విని అంతే ఓపికతో మన స్థాయికి దిగి ఎంతో వివరంగా విషయాల్ని వివరించేవాడు. ఆయన గొప్ప బోధకుడు !

నేను యూనివర్సిటీలో చేరిన కొత్తలో అక్కడి వాతావరణం అంతా కొత్తగా, గందరగోళంగా ఉండేది. ఎవరు విద్యార్థులో, ఎవరు లెక్చర్లర్లో ఎవరు వార్డన్‌లో కూడా తెలియనంత గజిబిజిగా ఉండేది. దానికి తోడు విపరీతమైన హోం సిక్‌. బెంగ బెంగగా బిక్కుబిక్కుగాఉన్న నాకు తిరుపతి కొండంత అండగా ఉండి బెంగ, బెరుకుల్ని పోగొట్టిన వాడు టీఎంఎస్‌. అందరి కోసం ఎవరో ఒకరు వస్తుండేవాళ్లు. మా అమ్మా నాన్న వృద్ధులవడం వలన నా కోసం రావద్దని చెప్పేదాన్ని. మిగతా విద్యార్థుల కోసం వచ్చే తల్లిదండ్రుల్నో, పరిచయస్థుల్నో అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. నా కోసం ఎవరూ వచ్చేవాళ్లే లేరని బెంగపడుతూ ఒకసారి రెండు రోజులు సెలవు వస్తే అందరూ ఇండ్లకి వెళ్లిపోయినా, దూరం కాబట్టి నేను వెళ్లలేక టీఎంఎస్‌ని కలుద్దామని ఆయనంటే లోపలున్న భయాన్ని జయించి ఆయన పని చేస్తున్న కాలేజీకి వెళ్లి తొలిసారి కలిశాను. ఆయన నన్ను రిసీవ్‌ చేసుకున్న తీరు, నాతో మాట్లాడిన తీరు నాకు కొత్త టీఎంఎస్‌ని పరిచయం చేశాయి. నా హోం సిక్‌నెస్‌ను ఇట్టే దూరం చేసేశాడు టీఎంఎస్‌. నా చిన్న ప్రపంచంలో నిండిపోయారు. ఓ తల్లి కోడి తన పిల్లని రెక్కల్లో పొదువుకున్నట్లు నన్ను తన ప్రపంచంలో పొదువుకున్నాడు. నన్ను మనిషిని చేశాడు. తను వీలున్నప్పుడల్లా యూనివర్సిటీకి వచ్చి నన్ను కలిసేవాడు. అలా నా కోసం ఎవరూ రారన్న బెంగని పోగొట్టేశారు. ఆయనకు రావడం వీలు కాకపోతే తన విద్యార్థులనో, మిత్రులనో నా దగ్గరకు పంపి నేను ఎలా ఉన్నానో సమాచారం తెలుసుకునేవారు. ఒకే ఊళ్లో ఉన్నా రెగ్యులర్‌గా ఉత్తరాలు రాసేవారు. టీఎంఎస్‌ రాపిన ఉత్తరాలు చాలా చమత్కారంగా, విజ్ఞానభరితంగా ఉండేవి. ఆయన ఉత్తరాల కోసం కూడా ఆశగా ఎదురు చూసేదాన్ని. టీఎంఎస్‌ పని చేసిన కాలేజీ ఒకసారి షిఫ్ట్‌ అయింది. ఆయన ఆ విషయం రాస్తూ ʹమా కాలేజీ బైరాగి పట్టెడకు లేచిపోయింది. బెంగుళూరు అందాలు చుట్టపుచూపుగా మా కాలేజీకి వచ్చాయిʹ అని రాశారు. ఆ లెటర్‌ను నా సహ విద్యార్థులకు చూపిస్తే ʹచాలా బాగుంది. నీ బాయ్‌ ఫ్రెండ్‌ రాశాడా?ʹ అని ఆడిగారు. కాదు మా అంకుల్‌ అని చెబితే వాళ్లు అసలు నమ్మలేదు. తర్వాత యూనివర్సిటీకి టీఎంఎస్‌ వచ్చినప్పుడు వాళ్లకు పరిచయం చేశాను. వాళ్లు చాలా ఆశర్చర్యపోయారు. టీఎంఎస్‌ నుంచి ఉత్తరం రాగానే నాకన్నా ముందే వాళ్లందరూ లాక్కొని చదివేవారు. ఆ ఉత్తరాల్లో అంత యూత్‌నెస్‌ ఉండేది. నాతోపాటు నా సహ విద్యార్థి బృందమంతా టీఎంఎస్‌ ప్రపంచంలోకి వచ్చేశారు. ఎక్కువ రోజులు సెలవులొచ్చినప్పుడల్లా టీఎంఎస్‌ ఇంటికి వెళ్లిపోయేదాన్ని. ఆంటీ, బీనా, బాబు అందరూ తమ ఇంట్లోని మనిషిలాగానే చూసేవాళ్లు. ఇల్లంతా సాహిత్యంతో, ఉద్యమాలతో, వాదనలతో సందడిగా ఉండేది. నేను ఎంతో ప్రేమించే మా నాన్న చనిపోయాక నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోకుండా ఉండేందుకు టీఎంఎస్‌ చేసిన ప్రయత్నాలు, చెప్పిన మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ నా కళ్లు నిండిపోతాయి. అంత ధైర్యం తను. కుటుంబసభ్యులు నా పెళ్లి విషయం పట్టించుకోకపోయినా ఆయన నా తండ్రిలాగా నా పెళ్లి విషయం పట్టించుకొని మాట్లాడేవారు. చక్రవేణుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సూచించి ఆయనే స్వయంగా నన్ను వెంటబెట్టుకొని హైదరాబాదు తీసికెళ్లి మా ఇద్దరినీ కూచోబెట్టి మాట్లాడారు. అభిప్రాయాలు కలవకపోవడంతో అది సాధ్యపడలేదు. టీఎంఎస్‌ కూడా నా అభిప్రాయాల్ని మన్నించేవారు. మద్దతు ఇచ్చేవారు. గౌరవించేవారు. మూర్తి కూడా ఒకరకంగా టీఎంఎస్‌ శిష్యుడే. నేను మూర్తి కలిసి ఉండటాన్ని టీఎంఎస్‌ మనస్ఫూర్తిగా అభినందించారు. సంతోషించారు. మూర్తి, టీఎంఎస్‌ల మధ్య కూడా స్నేహబంధం, గురుశిష్యుల బంధం ఉండేది. మా ఇంటికి వచ్చి కొన్ని రోజులైనా కలిసి ఉండాలనే టీఎంఎస్‌ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆయన అంతిమ యాత్రకు సైతం మేం వెళ్లలేకపోవడం మాలో గిల్టీనెస్‌గానే ఉండిపోయింది. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమని ఎప్పుడూ మూర్తితో చెబుతుండేవాడు. తన లైబ్రరీలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ మూర్తికిస్తానని ఆశపెట్టేవారు. కానీ తన పుస్తకాలన్నిటినీ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఇచ్చేవారు. ʹప్రకృతి సాహితిʹ పత్రిక కోసం ఇంటర్వూ చేయడానికి మూర్తి, శ్రీరామకవచం సాగర్‌, కాట్రగడ్డ దయానంద్‌లు తిరుపతి వెళ్లినప్పుడు పుస్తకాలు ఏమీ లేని గదిలో ఆయనొక్కడే కూచ్చొని కనిపించాడట. అప్పుడు కూడా ఒంగోలు మీ ఇంటికి వస్తానని చెప్పారట. ఆ విషయం చెప్పి పుస్తకాలు లేకపోతే ఆయన ఎక్కువ కాలం బతకలేరు అని మూర్తి కళ్లెంబటి నీళ్లు పెట్టుకున్నాడు. టీఎంఎస్‌ గొప్ప చదువరి. గొప్ప మెంటర్‌. ఆయన విరసంలో ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా తిరుపతి విరసం యూనిట్‌ చాలా పెద్దగా, క్రియేటివ్‌గా ఉండేది. విప్లవ సాహిత్య విమర్శకి ఒక రూపుని, పదునుని, పౌరుషాన్ని, ఒక మార్గాన్ని ఇచ్చింది టీఎంఎస్సే అనడంలో బహుశా ఎవరికీ భిన్నాభిప్రాయాలుండవు.

కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి నేను బయటకు వచ్చేసినప్పుడు నేను అమూల్య సంపదగా భావించే టీఎంఎస్‌ నాకు రాసిన ఉత్తరాలన్నిటినీ నాతో తెచ్చుకోలేకపోయాను. ఆయన రాసిన ప్రతి ఉత్తరం ఓ కొత్త పాఠమే. ఓ గొప్ప ఉత్తేజమే. ఆయన ఉత్తరాల్లో ఎప్పుడూ కొత్త కొత్త పదాలు ఉండేవి. వాటి అర్థం వెతికినా వాటి అర్థాలు నీకు దొరకవు అనేవాడు. ఇప్పటికీ నాకు తీరిక చిక్కనప్పుడల్లా నా దగ్గర మిగిలిన టీఎంఎస్‌ ఉత్తరాల్ని ఎంతో అభిమానంతో చదువుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను. వాటిలో ʹలక్ష్మీʹ అని ప్రేమగా ఆయన పిలిచే పిలుపు ఇంకా వినిపిస్తూనే ఉంది.

అతడు నాకు బాగా తెలుసు

నేనీ రోజు ఒంటరిని కాను

అందరి గుండెల్తో కలిసి

నా గుండె స్పందిస్తోంది

అందరి గొంతుల్తో కలిసి

నా గొంతు పాడుతోంది

ఆ పాటలో అతనుంటాడు.

No. of visitors : 447
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •