సాహిత్య వర్గ పోరాటవాది

| సాహిత్యం | వ్యాసాలు

సాహిత్య వర్గ పోరాటవాది

- పాణి | 19.10.2018 09:23:54am

ఆధునిక తెలుగు సాహిత్య, మేధో రంగాల్లో త్రిపురనేని మధుసూదనరావుది ఒక ప్రత్యేకమైన కంఠస్వరం. ఆయనను అనుకరించడం, అనుసరించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా పోలేకపోయారు. మధుసూదనరావు ఆలోచనా తీవ్రత అలాంటిది. దీనికి ఆయన మేధో వ్యక్తిత్వం, ఆయన రూపొందిన కాలం రెండూ కారణం.

మధుసూదనరావు రచన, ప్రసంగ కాలంనాటి ఉద్యమ, మేధో వాతావరణం ఇప్పుడు లేదు. చాలా మారిపోయింది. ఒక కొత్త తరం సాహిత్య, సిద్ధాంత రంగాల్లోకి వచ్చింది. అది తనదైన ఆలోచనా సంవేదనలతో, భాషా నుడికారంతో కొత్త ప్రపంచాన్ని వెంటేసుకొని వచ్చింది. ఇది ప్రతి తరంలోనూ జరిగేదే.

నిజానికి నక్సల్బరీ ఉద్యమంలోకి వచ్చిన సీనియర్‌ రచయితలకు, విప్లవోద్యమం వల్లనే మేధో రంగంలోకి వచ్చిన వాళ్లకూ మధ్య కూడా ఈ తేడా చూడవచ్చు. అందుకే తనది నక్సల్బరీ తరమని మధుసూదనరావు గర్వంగా చెప్పుకునేవారు. ఆయన ముమ్మరంగా రాస్తున్న రోజుల్లోనే ముందుకు వచ్చిన కొత్త ఆలోచనలు ఈ ఇరవై పాతికేళ్లలో చాలా విస్తరించాయి. కొన్ని ధోరణులు సహజంగానే వాటి తార్కిక పర్యవసానమైన చివరి అంచులకు చేరుకున్నాయి. ఆచరణలో నిగ్గుదేలగలిగినవే మిగిలాయి. గెలుపు ఓటముల మధ్యనే అవి పురోగమిస్తున్నాయి. ఇవేవీ దిగ్భ్రాంతికరం కాదు. చాలా అనివార్యం. సహజం.

ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పటి మేధో వాతావరణంలో మధుసూదనరావు మనకు ఏమనిపిస్తారు? ఆయన వేసిన దారి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఆయన అవసరం ఏమిటి? ఆనాటి అవగాహనలు, ఉద్వేగాలు, ఉద్యమ ఆవసరాలు, అనివార్యతలను గుర్తిస్తూనే వ్యూహాత్మకంగా వాటిని పక్కన పెట్టి పరిశీలిస్తే ఇప్పటికీ ఆయన రచనల్లోని మౌలికతను ఎలా క్రోడీకరించగలం? అనే కోణాల్లో పరిశీలించవచ్చు.

మధుసూదనరావు ప్రాసంగికతను తేల్చుకోడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రభావశీలమైన వ్యక్తులు తమ కాలాన్నేకాక, తదనంతర కాలాన్ని కూడా ప్రభావితం చేస్తారు. భవిష్యత్తులోకి విస్తరిస్తారు. అలాంటి వాళ్లను ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న ప్రతి తరం ఎదుర్కొంటుంది. మార్క్సిస్టు సాహిత్య విమర్శ రంగంలో మధుసూదనరావు అలాంటివారు.

నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు తెలుగు సాహిత్య విమర్శను మార్చేశాయి. వ్యక్తులుగా ఆ మార్పుకు ఆరంభకులు కేవీఆర్‌, శ్రీశ్రీ, కుటుంబరావు. కానీ నక్సల్బరీకి నిలువెత్తు సాహిత్య విమర్శా ప్రతినిధి త్రిపురనేని మధుసూదనరావు.

నక్సల్బరీ ఉద్యమం ఈ వ్యవస్థను మార్చే ఒక రాజకీయ సామాజిక సాంస్కృతిక పంథా. అది విప్లవాత్మక పరిణామం. దానికి మహత్తరమైన దీర్ఘకాలిక స్వభావం ఉన్నది. దీన్ని పూర్తిస్థాయిలో పుణికిపుచ్చుకొని సాహిత్య సిద్ధాంతం, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్రలకు మధుసూదనరావు పటిష్టమైన పునాదులు వేశారు.

శాశ్వతమైనది ఏదీ లేదు.. చలనమే శాశ్వతం అనే భౌతికవాద దృక్పథంతో ఆరంభమైన మార్పు క్రమం ఇది. కాబట్టి సమాజం, దాని సృజనాత్మక రూపమైన సాహిత్యం, దాన్ని విశ్లేషించే సాహిత్య విమర్శ కూడా మారుతూ ఉన్నాయి. ఈ మార్పు క్రమంలో భాగంగా తన కాలంలోనే కాదు, తదనంతర కాలంలో కూడా మధుసూదన రావు ఆలోచనల పాత్ర ఏమిటి? అనేది ఈ తరం అన్వేషించాలి. ఆయన సమగ్ర సాహిత్య ప్రచురణ దీనికి ఉపయోగపడాలి. ఈ నిండైన అర్థాన్ని విప్లవ రచయితల సంఘం గుర్తించి ఈ పనికి పూనుకుంది.

విరసం ఏర్పడ్డ తొలి రోజుల్లో వర్గ శతృ నిర్మూలన, సాయుధ పోరాటమే ఏకైక మార్గం అనే భావనలు బలంగా ఉండేవి. విప్లవోద్యమంలోంచి విప్లవ సాహిత్యోద్యమంలోకి ఇవి వచ్చాయి. అందుకే విప్లవ సాహిత్యం సాయుధ పోరాటాన్ని శక్తివంతంగా చిత్రించింది. ఈ స్ఫూర్తిని అందుకున్న తొలి తరం విప్లవ రచయితల్లో ఒకరైన మధుసూదనరావు సాహిత్య విమర్శను తన ప్రధాన రంగం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన సాహిత్యంలో వర్గపోరాటం అనే భావనను ప్రవేశపెట్టారు. ఈ మాట అంతక ముందు కూడా వ్యవహారంలో ఉండొచ్చు. కానీ ఆయన సాహిత్యంలో వర్గపోరాటం అనడం వెనుక బలమైన తాత్వాక, రాజకీయ పునాది ఉన్నది. దానికి అనుగుణమైన వ్యూహం ఉన్నది. దీనికి లోబడి ఉద్యమ అవసరం కోసమే ప్రతి రచనా చేశారు. ఆదాటున ఏదీ రాయలేదు. లక్ష్యం దిశగా సాగే సైనికుడిలా రచనా రంగంలో పని చేశారు. ఇది ఆలోచనాపరుడిగా ఆయన స్థాయిని తెలియజేస్తుంది.

మధుసూదనరావులాంటి ఒక గంభీరమైన కంఠస్వరం రూపొందడం వెనుక తక్షణ ఉద్యమ ప్రభావం, అప్పటి స్థలకాలాల ప్రమేయం ఏమిటి? అనే అధ్యయనం దానికదే చాలా ప్రత్యేకమైనది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, చాలా లోతైన, దీర్ఘకాలికమైన సిద్ధాంత చట్రంలో సాగే ఆలోచన, ఆచరణ కూడా స్థలకాలబద్ధంగానే ఉంటుంది. అందులోని బలానికి, విస్తృతికి కారణం అదే. అలాగే ఆ స్థల కాలబద్ధత వల్లనే అనేక ప్రత్యేకతలు ఏర్పడతాయి. ఈ రెంటినీ కలిపి అర్థం చేసుకోవాల్సిందే. దీనికి కూడా మధుసూదనరావు రచనలు మంచి ఉదాహరణ.

ఈ స్థల కాల సందర్భాల్లో ఆయన సాహిత్యంలో వర్గపోరాటం అనే భావనను తీసుకవచ్చారు. దానికి సాహిత్య విమర్శను ఒక ఆయుధంగా తీర్చిదిద్దారు. వర్గపోరాట పంథా వల్లనే మార్క్సిస్టేతర, మార్క్సిస్టు వ్యతిరేకుల రచనల్లోని తప్పుడు ధోరణులు ఎత్తి చూపారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శగా చెలామణిలో ఉన్నదానిలోనే ఏపాటి మార్క్సిజం ఉన్నదో తేటతెల్లం చేయగలిగారు.

సాహిత్యంలో వర్గపోరాటాన్ని ఎంచుకోవడం వల్లే ఆయన చాలా మౌలిక స్థాయికి వెళ్లి మార్క్సిస్టు సాహిత్య విమర్శకు అవసరమైన తాత్విక, సిద్ధాంత పునాదిని సమకూర్చారు. తెలుగు సాహిత్య విమర్శలో, ముఖ్యంగా మార్క్సిస్టు సంపద్రాయంలో మౌలిక మార్పు తీసుకొని వచ్చారు. విప్లవ సాహిత్యోద్యమాన్ని, సాహిత్య విమర్శను పదునుదేల్చారు. ఎంతగానంటే మధుసూదనరావుకు ముందు, తర్వాత అని విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తర్వాత విప్లవ సాహిత్య విమర్శ చాలా ముందుకు వెళ్లిన మాట నిజం. వచన ప్రక్రియలకు, వాచక విశ్లేషణకు, రాజకీయార్థిక, సామాజిక సంబంధాల చర్చకు విస్తరించింది. దీనికి ఆయన వేసిన పునాది ఉపయోగపడిందని మర్చిపోలేం.

రష్యాలో సోషలిస్టు నిర్మాణ క్రమానికి తగిన మానవులు రూపొందేలా సాహిత్యం, కళలు ఉండాలని స్టాలిన్‌ సోవియట్‌ రచయితలకు పిలుపు ఇచ్చారు. ప్రతీఘాతుక భావాలను తుడిచి పెట్టేలా సాహిత్య సాంస్కృతిక కృషి సాగాలని కోరుకున్నారు. దానికి మార్గదర్శకత్వం వహించారు. సాహిత్యంలో వర్గపోరాటం అనే మాట ఆయన నిర్దిష్టంగా అనలేదు. బహుశా మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌ కూడా సాహిత్యాన్ని వర్గపోరాట సాధనమని అన్నట్లు మధుసూదనరావు రచనల్లో కనిపించదు.

చైనా సాంస్కృతిక విప్లవ కాలంలోనే అన్ని జీవన రంగాల్లో వర్గపోరాటం అనే మాట బలంగా ముందుకు వచ్చింది. ఒక రకంగా సాంస్కృతిక విప్లవం రెండో రాజకీయ విప్లవం. లేదా సాంస్కృతికమనే పేరుతో సాగిన రాజకీయ విప్లవం. చైనా సమాజంలోని భూస్వామ్య, బూర్జువా ప్రగతి వ్యతిరేక భావాలను, ముఖ్యంగా కమ్యూనిస్టు ముసుగులోనే పెచ్చరిల్లుతున్న రివిజనిస్టు భావాలను ఇది లక్ష్యం చేసుకున్నది. దీని కేంద్రం వర్గపోరాటం. ఆ కాలంలో ఏవైనా లోపాలు జరిగి ఉండవచ్చు, అయితే కోట్లాది మంది ప్రజలు అనేక స్థాయిల్లో, రూపాల్లో వర్గపోరాటంలో భాగమయ్యారు. ఈ వర్గపోరాట అభినివేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం వేసింది. మన దేశంలో నక్సల్బరీ ఉద్యమానికి ఈ అంతర్జాతీయ విప్లవ నేపథ్యం ప్రేరణ అయింది.

త్రిపురనేని మధుసూదనరావు అలాంటి సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా సాంస్కృతిక విప్లవం నాటి వర్గపోరాట తీవ్రతే. అందువల్లే ఆయన కంఠస్వరం చాలా తీవ్రంగా ఉండేది. ఆ కాలంలోని భారత విప్లవోద్యమం నుంచి కూడా ఇది ఆయనలో వ్యక్తమైంది. ఆ తీవ్రత విప్లవశక్తులను సమ్మోహపరిచేది. చైతన్యపరిచేది. అంతంత మాత్రం పాండిత్యంతో సాహిత్య విమర్శ, మేధో రంగంలోకి వచ్చినవాళ్లు ఆయనను చూసి జడుసుకునేవాళ్లు. ప్రగతిశీల ముసుగు వేసుకొని నటించేవారు తోకముడిచేవాళ్లు. ఇంత తీవ్రమైన వర్గపోరాటం ఏ శక్తులతో చేయాల్సి ఉన్నదో ఆయన చాలా నిర్దిష్టంగా గుర్తించారు. బూర్జువావాదం, సనాతనవాదం, రివిజనిజం అనే మూడింటి ప్రమాదాన్ని సమానంగా గుర్తించారు. శ్రామికవర్గం పక్షాన నిలబడి వీటితో నిజంగానే ఆయన వర్గపోరాటం నిర్వహించారు.

గతంలో కూడా వీటి పైన పోరాడిన వాళ్లు ఉన్నారు. కానీ మధుసూదనరావు వాటి తాత్విక పునాదుల కింది నుంచి పోరాటం ఎక్కుపెట్టారు. ఆయా వాదాలకు చెందిన శిఖరాలను ఎంచుకొని మరీ నేల మట్టం చేశారు. తద్వారా ఆ మూడు ప్రగతి వ్యతిరేక వాదాలను ఓడించారు.

ఇదంతా ఆయన ఎంచుకున్న రంగస్థలంలో పైకి కనిపించేది మాత్రమే. వాస్తవానికి జరిగింది ఏమంటే ఆయన చాలా కాన్షియస్‌గా వర్గపోరాట వ్యూహం ద్వారా సాహిత్య పరిశీలనా క్షేత్రాన్ని విస్తరించారు. ఆయన కాలంలో ఆయనకంటే అధ్యయనపరులు ఎందరో ఉండవచ్చు. సాహిత్యతత్వాన్ని, ప్రక్రియా ప్రత్యేకతలను బాగా ఎరిగినవాళ్లూ ఉండవచ్చు. కానీ మానవ జీవితంలో, సమాజంలో సాహిత్యం నిర్వహించే పాత్రను, దానికి ఆ శక్తి సంక్రమించిన తీరును మధుసూదనరావు వర్గ పునాదిలోంచి పట్టుకున్నారు. తద్వారా వర్గపోరాటం ద్వారానే సాహిత్యం మానవ చైతన్యానికి, ఆచరణకు దోహదకారి అవుతుందనే విషయాన్ని ఎత్తిపట్టారు. అనేక వైపుల నుంచి, పలు కోణాల్లోంచి ఈ మౌలిక విషయాన్ని ఆయన తిరుగులేని విధంగా చెప్పారు. ఇది సాహిత్య విమర్శకు ఆయన చేసిన అతి ప్రాథమిక చేర్పు.

ప్రాథమికం అని ఎందుకు అనాల్సి వస్తోందంటే ఆ తర్వాత ఆయన ఈ ఆవరణలో నిలబడి చాలా కీలకమైన పనులు చేశారు. సాహిత్య పరిశీలనా క్షేత్రాన్ని విస్తరించడం వల్ల అంతక ముందు కంటే చాలా విష

యాలను చర్చించడానికి విమర్శలో అవకాశం కలిగింది. తద్వారా విమర్శ ఒరవడే మారిపోయింది.

ఆ రకంగా మధుసూదనరావుకు ముందు మార్క్సిస్టు సాహిత్య విమర్శ కృషి జరిగినా విప్లవ సాహిత్యోద్యమం అందుకున్న ఆధునిక, శాస్త్రీయ భౌతికవాద దృక్పథానికి సాటిలేని ప్రతినిధి త్రిపురనేని మధుసూదనరావు. తాత్విక, సాహిత్య రంగాల్లో వర్గపోరాటం అనే భావన ఆయన చేతిలో పదునైన పనిముట్టుగా, చారిత్రక యుగ సంధ్యలను తరచి చూసే బావుటాగా వెలుగులు విరజిమ్మింది. ఆయన ఈ పని పైపైన చేసుకుంటూ వెళ్లలేదు. తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ, సాహిత్య సిద్ధాంత కల్పనలో అంత వరకు ఉన్న దాన్నంతా చెలిగి సరికొత్త మార్గం వేశారు.

నిజానికి నక్సల్బరీ ఉద్యమమే అన్ని రంగాలకు ఇలాంటి విస్తృతిని, లోతును అందించింది. కాబట్టి చాలా సహజంగానే విప్లవోద్యమ సాంస్కృతిక మేధో శక్తిగా రంగం మీదికి వచ్చిన విరసంలో కూడా ఇది వ్యక్తమైంది. అయితే సాహిత్య పరిశీలనా క్షేత్రానికి సంబంధించిన ఈ విస్తృతి ఆయనలో వ్యక్తమైనంతగా ఆ కాలంలో మరెవ్వరిలోనూ చూడలేం. సాహిత్యాన్ని దాని తాత్విక, చారిత్రక యుగ స్వభావంలోంచి చూడాలని, ఉత్పత్తి సంబంధాలపై ఆధారపడిన రాజ్య, పాలనా, నైతిక, మత, కుల వ్యవస్థల ఆవరణలో, వాటి పరస్పర సంబంధాల్లో చూడాలనే ఒక సంక్లిష్టమైన పద్ధతిని ఆయన ముందుకు తెచ్చారు. కొంచెం అటూ ఇటూగా ఈ మాటను ఒక సూత్రంగా అంతక ముందు విమర్శకులు కూడా చెప్పారు. కానీ మధుసూదనరావు దీన్ని వివరించారు. అన్వయించారు. సాహిత్య వాచకం ఉత్పత్తి, అందులోని భావాల ఉత్పత్తి, వాటి కొనసాగింపు, ప్రభావాలు మొదలైన వాటిని ఒక నిర్దిష్ట కాలంలోని సాహిత్యంలోంచి విశ్లేషించారు.

సాహిత్య పరిశీలన క్షేత్రాన్ని విశాలం చేయడం అంటే ఇదే. అంటే మానవ నాగరికతా క్రమంలో సాహిత్యం ఉనికిని, మానవ జీవితంలో సాహిత్యం పాత్రను, లేదా చోటును దాని వాస్తవికత నుంచి ఎత్తి చూపడం. ఈ పని అంతా ఆయన సాహిత్య కళ పట్ల అప్రమత్తంగా ఉంటూనే చేశారు. ఆ రకంగా ఆయన సాహిత్యానికి ఎన్నటికీ చెరిగిపోని భౌతిక పునాదిని నిర్మించారు. ఇంకోలా చెప్పాలంటే మానవ చైతన్యరూపమైన సాహిత్యాన్ని దాని అసలైన స్థానంలో గుర్తించడం వల్ల అది ఎలా భౌతికశక్తిగా మారుతుందో ఎత్తి చూపారు. విప్లవాన్ని కోరుకునే రచయితల చేతిలో సాహిత్యం, కళలు ఎలా భౌతిక శక్తిగా మారవలసి ఉన్నదో దారి వేశారు. ప్రజలకు భావాలు పరిచయమైతే అవి భౌతికశక్తిగా మారుతాయనే అవగాహన ఇందులో కనిపిస్తుంది. దీని ప్రకారం సాహిత్యాన్ని దాని నిజమైన అర్థంలో పాఠకుల వద్దకు చేర్చగలిగేలా సాహిత్య విమర్శ ఉండాలని ఆయన అనుకున్నారు.

ఇప్పుడు ఆయన రచనలన్నీ తిరిగి చదువుతోంటే చాలా చోట్ల రాజకీయ, సైనిక పోరాటాల్లో ఉండే వ్యూహాలు కనిపిస్తాయి. అందులో ఆయన చూపిన మెలకువలు అబ్బురమనిపిస్తాయి. గెలుచుకోవాల్సిన పక్షాన్ని గెలుచుకోవడంలో, ఓడించాల్సిన వాళ్లను వెతికి మరీ అవతలి పక్షంలోకి తోలి దునుమాడటంలో ఆయన చూపిన వ్యూహ నైపుణ్యం అపారం. ఇందులో కొంచెం దుందుడుకుగా వ్యవహరించిన సందర్భాలు ఉండొచ్చు. కానీ సాహిత్యంలో వర్గపోరాటం అనే మాటను పూర్తి సార్థకం చేసిన సాహిత్య విమర్శకుడాయన.

సాహిత్యాన్ని వర్గపోరాటంలో భాగం చేయడం, లేదా సాహిత్యంలో వర్గపోరాటం నిర్వహించడం అనే రెండు మార్గాల్లో సాహిత్యానికి భౌతికశక్తి వస్తుంది. పాఠకుల ఆలోచనల నుంచి, సాహిత్య అనుభవం నుంచి, అనుభూతి నుంచి సామాజిక ఆచరణలో భౌతికశక్తిగా అది మారుతుంది. ఆయన చేసిన సాహిత్య విమర్శ, భావజాల సంవాదం వెనుక ఈ వ్యూహం కూడా ఉంది. ఒక సందర్భంలో ఆయన విడిగా సాహిత్యంలో విప్లవాలు ఉండవని ఆయన తేల్చి చెప్తారు. సాహిత్యం వల్ల విప్లవాలు రావని కూడా అంటారు. విప్లవాలకు సాహిత్యం ఒక భౌతికశక్తిగా దోహకారి కావాలనే అవగాహన ఆయన విమర్శ వెనుక ఉన్నది.

ఇవాళ ఉన్న సామాజిక మేధో వాతావరణంలో కూడా ఆయన రచన అద్భుతమనిపించడానికి ఇదీ ఒక కారణం. ఈ అవగాహనే ఆయన్ను మిగతా సాహిత్య విమర్శకుల నుంచి ఇప్పటికీ మౌలికంగా వేరు చేసి నిలబెడుతోంది. అంతక ముందున్న పరిశీలనా పద్ధతులకు, వాటి అర్థాలకు ఉనికి లేకుండా చేసింది.

ఇది విప్లవ సాహిత్యోద్యమానికి, తెలుగు సాహిత్య విమర్శకు అంతులేని మేలు చేసింది. తత్వశాస్త్రం, చరిత్ర, సాహిత్య చరిత్ర, మతశాస్త్రం, మత తత్వశాస్త్రం మొదలైన వాటిని ఆయన వర్గపోరాట పరికరమైన సాహిత్య విమర్శలో వాడుకున్నారు. దీని వల్ల సాహిత్యాన్ని సాహిత్యంగా, కేవల కళగా, సౌందర్యంగా, హృదయ కంపనకు ప్రేరకంగా చూసే విమర్శకులంతా తమ ఉనికిని తడుముకోవాల్సి వచ్చింది. కేవలం సాహిత్యాన్ని అనుభవించే, పలవరించే విమర్శకులు హతాసులయ్యారు. సాహిత్యరంగాన్ని తరతరాలుగా తిరోగమన శక్తులు దురాక్రమించి ఉన్న తరుణంలో ఆయన తన సిద్ధాంత ప్రమేయాలతో విమర్శకు, సిద్ధాంతానికి అవసరమైన భూమికను, దృక్పథాన్ని అందించారు.

మార్క్సిస్టుగా, సాహిత్య విమర్శకుడిగా మధుసూదనరావు పరిణామంలో గతితార్కిక సాహిత్య భౌతికవాదానికి కీలకస్థానం ఉంది. దీనితో సంబంధం లేకుండా ఆయన తాత్విక, సాహిత్య సిద్ధాంత వికాసాన్ని అంచనా వేయలేం. ఆయన ప్రాసంగికత కూడా అక్కడే ఉన్నది. ఆరంభంలో అన్నట్లు ఆనాటి స్థల కాల ప్రత్యేకతలు, ఉద్వేగాలు, ఉద్యమ అవసరాలను పక్కన పెట్టి(ఎందుకంటే ఉద్యమ అవసరాలు కూడా ఇప్పుడు అవి ఉండవు. వేరే ఉంటాయి కాబట్టి) ఈరోజుకూ, రేపటికీ మిగిలి ఉండే మౌలికతను గతితార్కిక సాహిత్య భౌతికవాద ప్రతిపాదనలో చూడవచ్చు. మొత్తంగా ఆయన రచనల్లో వివరించాల్సినవి, విస్తరించాల్సినవి మిగతావాటి కంటే గతితార్కిక సాహిత్య భౌతిక వాదంలోనే ఎక్కువ ఉన్నాయి. సారాంశంలో ఆయన కోర్‌ వర్క్‌ ఈ వ్యాసం.

దీన్ని ఆయన 1979లో ప్రతిపాదించారు. దీనికన్నా ముందు సాహిత్యంలో వస్తు శిల్పాలు, సాహిత్య ప్రయోజనం: సంప్రదాయ శాస్త్రీయ దృక్పథాలు, మార్క్సిజం-సాహిత్యం, కవితా విప్లవాల స్వరూపం మొదలైన వ్యాసాలు రాశారు. ఇంకా చాలా రాసి ఉన్నా ఇవి ముఖ్యమైనవి. ఒకసారి ఈ వ్యాసాలు చదివి గతితార్కిక సాహిత్య భౌతికవాదంలోకి వెళితే ఆయన తొలి నుంచీ ఎంత నిర్మాణాత్మకంగా రాస్తూ వచ్చారో తెలుస్తుంది. ఏ ఒక్క రచనా తన సాహిత్య అభిరుచిని చాటుకోడానికి రాయలేదు. పైపై ఆలోచనలు పోగేసి ఏదీ ముందుకు తేలేదు. ఒక ఆలోచననే పదే పదే అనేక పేర్లతో రుబ్బినట్లనిపించదు. ఒక కచ్చితమైన పరిణామం, విస్తృతి కనిపిస్తుంది. సాహిత్యంలో వర్గపోరాటం చేయడానికి శ్రామికవర్గ దృక్పథం వైపు నుంచి ఒక పటిష్టమైన సిద్ధాంతం అవసరం గుర్తించి ఆ దిశగా రాస్తూ పోయారు. ఏది రాసినా ఈ మౌలిక ధార కొనసాగింది. విప్లవ కవిత్వం ఎలా ఉండాలి?, ప్రజలు-భావాలు అనే తొలి దశ వ్యాసాల దగ్గరి నుంచి ఏడెనిమిదేళ్లపాటు సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర సంబంధమైన విడి వ్యాసాల్లోని, వాద వివాద రచనల్లోని తార్కిక క్రమమే గతితార్కిక సాహిత్య భౌతికవాద ప్రతిపాదనకు దారి తీసింది. ఆ తర్వాతి వ్యాసాల్లో ఈ ప్రతిపాదన అన్వయం కనిపిస్తుంది.

ఆయన సాహిత్య విమర్శలోకి వచ్చాక తెలుగు మార్క్సిస్టు విమర్శా సంప్రదాయానికి బలమైన పునాదులు లేవని గుర్తించారు. ప్రజా పక్షపాతం, సాహిత్య సమాజ సంబంధం, వస్తు ప్రాధాన్యం, నేపథ్య విశ్లేషణలాంటి కోణాల్లోనే అప్పటి దాకా సాహిత్యాన్ని పరిశీలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఒక కృతి మీదకాని, లేదా కవి మీద కాని లోతైన అంచనా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. విమర్శకులు స్థూలంగా చారిత్రక భౌతికవాద దృష్టిని ప్రదర్శిస్తూ వచ్చారు.

ఈ మొత్తాన్ని మధుసూదనరావు విమర్శనాత్మకంగా చూశారు. అందువల్లే అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంనాటి ఏ భావననూ యథాలాపంగా స్వీకరించలేదు. దేన్నీ చిన్న చిన్న సవరణలతో కొనసాగించవచ్చని అనుకోలేదు. ఆయనను ఎవ్వరూ అనుసరించలేకపోవడమే కాదు, ఆయన కూడా గత తెలుగు సాహిత్య విమర్శకుల్లో ఎవ్వరినీ అనుసరించలేదు. కెవిఆర్‌ తప్ప మిగతా ఎవ్వరి కృషితోనూ ఆయనకు సంతృప్తి కూడా లేదు. దీనికి ఆయన ఆలోచనా తలమే కారణం.

అందుకే ఆయన మార్క్స్‌ ఏంగెల్స్‌ రచనల వెలుగులోనో, చారిత్రక భౌతికవాద దృష్టితోనో సాహిత్యాన్ని పరిశీలించినంత మాత్రాన మార్క్సిస్టుల దగ్గర ఒక సాహిత్య సిద్ధాంతం ఉన్నట్లు కాదని కూడా తేల్చేశారు. తనకు మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన,్‌ స్టాలిన్‌, మావో రచనలే ప్రమాణం అని ప్రకటించిన మధుసూదనరావు వాళ్ల రచనల్లోని సాహిత్య ప్రస్తావనల క్రోడీకరణే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం కాదని కూడా నిస్సంకోచంగా అన్నారు.

ఇలాంటి ఎరుక ఆయనకు మొదటి నుంచీ ఉన్నది. అన్నిటిలాగే సాహిత్యమూ మానవ ఆచరణ ఫలం. సామాజిక ఆచరణ కానిది ఏదీ లేదు. సాహిత్య సృజన కూడా ఒకరకమైన సామాజిక ఉత్పత్తే. అయితే సాహిత్యంగా అది మిగతా అన్ని ఉపరితల అంశాల కంటే భిన్నమైనది. మార్క్సిజం ఆ ఉపరితల అంశాన్నిటినీ విశ్లేషించాలి. వాటిలో భాగమైన సాహిత్యాన్నీ వివరించాలి. కాబట్టి దానికి ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ రకంగా గతితార్కిక సాహిత్య భౌతికవాదం ఉపరితల విశ్లేషణ ప్రయత్నం.

ఈ పని చేయాలంటే మొదట పునాది ఉపరితలం అనే విశ్లేషణ పద్ధతిని స్పష్టం చేయాలి. మార్క్స్‌, ఏంగెల్స్‌ కాలం నుంచి ఇప్పటి దాకా పునాది-ఉపరితలం అనే పద్ధతి అనేక వక్రీకరణలకు, తప్పుడు వ్యాఖ్యానాలకు గురైంది. దీనికి మార్క్సిస్టు వ్యతిరేకుల రాతలతోపాటు మార్క్సిస్టు శిబిరంలోనే ఆది నుంచి కొనసాగుతున్న యాంత్రిక ధోరణి కూడా కారణం.

కాబట్టి మొదట చారిత్రక భౌతికవాదంలో పునాది ఉపరితలం అనే పద్ధతిని సవ్యంగా చూడాలి. ఆ తర్వాత ఈ పద్ధతి ద్వారా వేటిని విశ్లేషించగలమో తెలిసి ఉండాలి. ఈ రెండూ లేకుంటే సహజంగానే మార్క్సిస్టు పద్ధతిలోని శాస్త్రీయతకు దూరమైపోతారు. యాంత్రిక నిర్ధారణలకు చేరుకుంటారు.

వీటన్నింటి వల్ల పునాది ముందు మారితే ఉపరితలం దానంతట అదే మారుతుంది అనేది మార్క్సిస్టుల అభిప్రాయమని దుష్ప్రచారం జరిగింది. పునాది విషయాలు తప్ప ఉపరితల రంగాల గురించి వివరించడం మార్క్సిస్టులకు చేత కాదని సిద్ధాంతాలు చేశారు. చివరికి మార్క్సిజంలోనే ఆర్థికేతర విషయాల చర్చకు చోటు లేదనే ఘోరమైన వక్రీకరణ జరిగిపోయింది.

కాబట్టి ముందు పునాది ఉపరితలం మధ్య సంబంధాలను సెట్‌ చేయాలి. ఆ తర్వాత ఉపరితంలోని ఒక అంశమైన సాహిత్యాన్ని విశ్లేషించాలి. దీనికి పునాది ఉపరితల సంబంధాలు మాత్రమే కాదు, ఉపరితలంలోని అనేక అంశాల మధ్య ఉండే సంబంధాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే సాహిత్యమనే ఒకానొక ఉపరితల అంశాన్ని ఈ మొత్తం సంబంధాల పరిణామ క్రమంలో అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని మధుసూదనరావు ఈ ప్రతిపాదనలో చెప్పారు.

పునాది-ఉపరితం కలిసి ఒక అవయవి.. అందులో అన్నీ అవయవాలే.. వీటి మధ్య అంతర్‌ గతితర్క సంబంధాలు ఉంటాయి.. పునాది, ఉపరితలం కలిసి ఉండే అవయవిలో సాహిత్యం ఒక అవయవం. కాబట్టి దాన్ని ఏ రకంగా వేరు చేసిగాని, ఏక ముఖ లేదా బాహ్య సంబంధాల్లో గాని చూడరాదు.. పునాది-ఉపరితలాల మధ్య ఏకైక కారణ సంబంధం ఉండదు. పరస్పర అన్యోన్య సంబంధం, అంతర్‌ గతితర్కం ఉంటుంది. సమాజమంటే అన్యోన్య ఆశ్రితాల మొత్తం. విభిన్న విభాగాల మొత్తం కాదు. ఒక అవయవం మిగతా అవయవాలకంటే భిన్నంగా ఉన్నదంటే, భిన్నమైన క్రియను, పాత్రను నిర్వహిస్తుంది. అది అవయవిలో భాగంగా ఉన్నందువల్లే సాధ్యమవుతున్నది. సాహిత్యానికి అలాంటి భిన్నమైన పాత్ర ఉన్నది. దానికి, అంతిమ కారణమైన పునాది ఏకైక కారణం కానవసరం లేదు... అంటారు.

ఈ ప్రతిపాదన మధుసూదనరావు సాహిత్య సిద్ధాంత వ్యక్తిత్వానికి కేంద్రం. మార్క్సిస్టు పద్ధతికి సంబంధించి ఇంత మౌలిక స్థాయిలో పట్టించుకున్న ఒరిజినల్‌ థింకర్‌ మధుసూదనరావు.

ఆర్థిక నిర్ణాయకవాదం, సాహిత్యానికి సాపేక్ష స్వయం ప్రతిపత్తివాదం అనే రెండు పెడ ధోరణులను సాహిత్య భౌతికవాదంలో మధుసూదనరావు ఎదుర్కొన్నారు. ఉత్పత్తి సంబంధాల ప్రాధాన్యతను విస్మరించకుండా ఆర్థిక నిర్ణాయకవాదాన్ని ఓడించారు. అవయవిలో ఒక అవయవం అయిన సాహిత్యానికి అంతిమ కారణమైన పునాది ఏకైక కారణం కానవసరం లేదని అన్నారు. తద్వారా ఉపరితలం గురించిన సిద్ధాంత ప్రయత్నం చేశారు. సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి, దానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడానికి ఈ ప్రాతిపదిక అద్భుతంగా ఉపయోగపడుతుంది. మార్క్సిస్టు పద్ధతిలో పునాదిని వివరించినంతగా ఉపరితలాంశాలను వివరించడం సాధ్యమా? అని సందేహం మార్క్సిస్టులనబడే వాళ్లలో కూడా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మధుసూదనరావు ప్రయత్నించారు. చారిత్రక భౌతికవాదాన్ని ఆయన వివరించిన పద్ధతి ఒక్క సాహిత్యానికే కాదు, మానవ చరిత్రలోని నాగరికతా క్రమంలో ముందుకు వచ్చిన అన్ని సామాజిక విషయాలను విశ్లేషించడానికి ప్రేరేపిస్తుంది.

సాహిత్యానికి ఉండే ప్రత్యేకతల దృష్ట్యా ఆర్థిక నియతి వాద చిక్కు నుంచి తప్పుకోడానికి సాహిత్యానికి సాపేక్ష స్వయంప్రతిపత్తి అనే ఊబిని కొందరు సృష్టించారు. మార్క్సిస్టు వ్యతిరేక ఆర్థిక నియతివాదాన్ని సవరించకుండా సాపేక్ష స్వయంప్రతిపత్తి అనే మరో మార్క్సిస్టు వ్యతిరేక భావనను మార్క్సిస్టులనబడే వాళ్లే తీసుకొని వచ్చారు.

ఈ రెంటిని సవరిస్తూ చారిత్ర భౌతికవాద పద్ధతిని మధుసూదనరావు అవయవి సిద్ధాంతం ద్వారా పరిష్కరించారు. ఇక్కడ అసలు విషయం ఏమంటే - రాజకీయార్థిక వ్యవస్థలు కేంద్రంగా వర్గపోరాటమనే ఇరుసు మీద చారిత్రక వికాసాన్ని విశ్లేషించే చారిత్రక భౌతికవాదం వ్యవస్థకు బైట ఉండే సామాజిక అంశాలను ఎలా వివరిస్తుంది? అనే అతి ముఖ్యమైన సిద్ధాంత సమస్య ఉంది. సమాజమనే మొత్తంలో రాజకీయార్థిక వ్యవస్థతోపాటు నాగరికతా క్రమంలో భాగమైన అనేక సామాజిక, సాంస్కృతిక విషయాలు ఉంటాయి. ఇవి కూడా భౌతిక వాస్తవికమైనవే. వీటికి చారిత్రక క్రమంలో ముందుకు వచ్చిన అన్ని ఉత్పత్తి వ్యవస్థలతో సంబంధం ఉంటుంది. అయితే వాటిని నేరుగా ఉత్పత్తి వ్యవస్థతో ముడిపెట్టి చూడటం కుదింపుకు దారి తీస్తుంది. దీని ఒకానొక పర్యవసానమే ఆర్థిక నియతివాదం. అప్పుడు ఉపరితల అంశాల విశ్లేషణకు దూరమైపోతాం.

ఉదాహరణకు ఒక యుగంలోని సాహిత్యానికి, ఆ తర్వాతి కాలంలోని సాహిత్యానికి తేడా చెప్పడానికి ఉత్పత్తి సంబంధాల దగ్గరికి వెళ్లాల్సిందే. అప్పుడు కూడా రాజకీయార్థిక వ్యవస్థతోపాటు మిగతా ఉపరితల అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ కాలంలోని సాహిత్య ప్రత్యేకతలను, మార్పులు చెప్పాల్సి ఉంటుంది. .

మార్క్సిస్టు చింతనాపరుడిగా మధుసూదనరావు కార్యక్షేత్రం ఇది. తన రంగం సాహిత్యం కావడం వల్ల సాహిత్య సిద్ధాంతం కోసం నిర్దిష్టంగా ప్రయత్నించారు. దీని కోసం ఆయన చారిత్రక భౌతికవాదం నుంచి అవయవి భావనను ఎంచుకున్నారు.

సమాజ అభివృద్ధి క్రమాన్ని ఉత్పత్తి వ్యవస్థ కేంద్రంగా వివరించే చారిత్రక భౌతికవాదం ఒక స్థూల సిద్ధాంతం. ఒక నిర్దిష్ట రాజకీయార్థిక వ్యవస్థగా పెట్టుబడిదారీ విధానం ఎలా పని చేస్తుందో వివరించేందుకు మార్క్స్‌ అదనపు విలువ సిద్ధాంతాన్ని కనుక్కొన్నారు. చారిత్రక భౌతికవాదమే ఉపరితలంలోని అన్ని అంశాలను నేరుగా వివరిస్తుందనుకోవడం పొరబాటు. లేదా వాటిపై చారిత్రక భౌతికవాద వ్యాఖ్య వినిపిస్తే సరిపోతుందనుకోవడం కూడా తగదు. చారిత్రక భౌతికవాద పద్ధతిలో వేర్వేరు సామాజిక విషయాలను వివరించడానికి ప్రత్యేక సిద్ధాంతాలు తయారు చేసుకోవాలి. సాహిత్యం కూడా ఒక సామాజిక అంశమే. అది భావాల చరిత్రతో, చైతన్యాల క్రమంతో ముడిపడి ఉంటుంది. ఆ రకంగా ఉపరితలంలోని మిగతా వాటి కంటే కూడా భిన్నమైనది. దీర్ఘకాల అవధిలో సాహిత్యంలో వచ్చే మార్పులు ఉత్పత్తి సంబంధాలనుబట్టే వర్గం దృష్ట్యా వివరించగలం. కానీ సృజనాత్మక వ్యవహారమైన సాహిత్యంలోని రూప ప్రత్యేకతలను, వైవిధ్యాలను, వైరుధ్యాలను, భావాల క్రమాలను, వాటి వెనుక ఉండే మానవ అనుభవాలను, వాటి అర్థాలను నేరుగా ఉత్పత్తి సంబంధాల ద్వారా వివరించడంలో చిక్కులు ఉంటాయి. ఎందుకంటే ఉత్పత్తి సంబంధాలు అనేక మాధ్యమాల ద్వారా ఉపరితలాంశాల్లో వ్యక్తమవుతుంటాయి. వాటిని గుర్తించి వివరించగల సాహిత్య సిద్ధాంతమే పైన చెప్పిన చిక్కులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఉపరితలాంశాలను, అందులో ఒకటైన సాహిత్యాన్ని, దాని ప్రత్యేకతలను, వైవిధ్యాన్ని కూడా ఉత్పత్తి సంబంధాల వలె సిద్ధాంత పటుత్వంతో విశ్లేషించగలగాలి.

మధుసూదనరావుకు ముందున్న మార్క్సిస్టు విమర్శకులంతా వస్తువు-శిల్పం, లేదా పునాది-ఉపరితలం అనే ద్వయాలలో మొదటిదాన్ని బట్టి రెండోది ఉంటుందని వాటి సంబంధాలను ఏక ముఖంగా చెప్పి సరిపెట్టారు. మధుసూదనరావు దీంతో సంతృప్తి చెందకుండా మార్క్సిజం ప్రకారం సాహిత్య సిద్ధాంతం తయారు చేయవచ్చని బయల్దేరారు. తెలుగు మార్క్సిస్టు సాహిత్య చరిత్రలో ఆయన విలువైన పాత్ర ఇక్కడే ఉంది. ఈ థీóరిటికల్‌ విగర్‌ ప్రతిపాదన వ్యాసంలోనూ, అనేక వైపుల నుంచి వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పడంలోనూ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన మార్క్సిస్టు పద్ధతి సర్వాంగ ప్రాపంచిక దృక్పథం అంటారు. ప్రకృతి సంబంధ విషయాలను పక్కనపెట్టి సామాజిక విషయాలను అర్థం చేసుకోడానికి ఈ ప్రతిపాదనను సానుకూలంగా తీసుకోవచ్చు.

అయితే ఈ వ్యాసానికి ఒక ముఖ్యమైన పరిమితి ఉంది. ఆయన కూడా సాహిత్య సందర్భంలో చారిత్రక భౌతికవాద వొక్కాణింపు మాత్రమే చేశారు. ఆ రకంగా ఈ ప్రతిపాదన పత్రం చారిత్రక భౌతికవాద వ్యాఖ్యానానికి పరిమితమైంది.

అవయవిలో భాగంగా ఉన్నప్పుడే ఒక అవయవంగా సాహిత్యం ఫంక్షనింగ్‌ ఉంటుందని చెప్పారు. దాని రూపాలు ఏమిటి? ఏ తలంలో దాని వ్యక్తీకరణలు ఉంటాయి? సృజనాత్మక సాహిత్యం మానవ అనుభవానికి సంబంధించింది కాబట్టి, జీవితంలో దాని పాత్ర ఏమిటి? అనే కొన్ని విషయాలు చర్చించి ఉన్నా సాహిత్య సిద్ధాంత విస్తరణకు మరింత దారి దొరికేది.

అయినప్పటికీ గతితార్కిక సాహిత్య భౌతికవాద వ్యాసాన్ని ఇప్పుడు తాజాగా చదివితే ఒక ఆలోచనాపరుడు తాను చేయదల్చుకున్న బృహత్తర నిర్మాణానికి సన్నాహకంగా కనిపిస్తుంది. బహుశా అప్పుడు జరిగిన చర్చల వల్ల ఆయన ప్రయత్నం అర్థాంతరంగా ఆగిపోకుండా కొనసాగి ఉంటే ఈ ప్రతిపాదనను ఎలా విస్తరించి ఉండేవారో ఇప్పుడు ఊహించుకోవాల్సిందే. నిజానికి ఒక సాహిత్య సిద్ధాంత ప్రతిపాదన మీద తెలుగులో ఈ వ్యాసం విషయంలోనే జరిగింది. కానీ చర్చ ఎక్కువగా పేరు మీదే నడిచింది. అలా కాకుండా అసలు విషయం మీదికి వెళ్లి ఉంటే ఇంకోలా ఉండేది. మధుసూదనరావు లక్ష్యం మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత ప్రయత్నం కాబట్టి పేరు అలాగే పెట్టినా సరిపోయేదే.

అయితే తాను ఆ పేరు పెట్టడానికి ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు. గతితార్కిక భౌతిక వాదాన్ని, చారిత్రక భౌతికవాదాన్ని వేరు చేసే పొరపాటు ధోరణిని ఎదుర్కోవడం లక్ష్యంగా గతితార్కిక సాహిత్య భౌతికవాదం అనే పేరు పెట్టానని అన్నారు. గతితార్కిక భౌతికవాదం తత్వశాస్త్రానికి సంబంధించిందని, చారిత్రక భౌతికవాదం సామాజిక పురోగమన శాస్త్రానికి సంబంధించిందని చాలా మంది భ్రమపడుతుంటారని అన్నారు. గతితార్కిక భౌతికవాదంలో భాగమే చారిత్రక భౌతికవాదమని, ఆ రెంటినీ వేరు చేయకూడదని ఆయన అభిప్రాయం. అలాగే ఆ రెండూ ఒకటే అనే అర్థంలో ఇంకో చోట అంటారు. ఆయన అవగాహన ప్రకారం మార్క్సిజం ప్రధానంగా తత్వశాస్త్రం. స్టాలిన్‌ కాలానికి స్థిరపడిన గతితార్కిక చారిత్రక భౌతికవాదం.

అప్పుడు గతితార్కిక చారిత్రక భౌతికవాదం వెలుగులో రూపొందే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం కూడా తత్వశాస్త్రం కోవలోకి చేరుతుంది. సాహిత్య సిద్ధాంతానికి తప్పక తాత్విక దృక్పథం ఉండాలి. అయితే సాహిత్యం సామాజిక ఉత్పత్తి అనుకుంటే సాహిత్య సిద్ధాంతం కూడా ఒకానొక సామాజిక సిద్ధాంతమనే అభిప్రాయం కూడా ఉంది. మధుసూదనరావు కూడా ʹసాహిత్య విమర్శ సమాజ విమర్శగానే ఉంటుందిʹ అని ఈ వ్యాసంలో అంటారు. సాహిత్యం మౌలికంగా మానవానుభవం, దాని కళా కలాపం సాహిత్యం. ఇవి రెండూ సామాజికం. మార్క్సిజమంటే తత్వశాస్త్రమే అనుకున్నా, గతితర్కానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం కోసమని గతితార్కిక భౌతికవాదం అని నిర్వచించినా వీటి ఆధారంగా తయారయ్యే సాహిత్య సిద్ధాంతం సామాజిక సిద్ధాంతమే కావాలి. కానీ మధుసూదనరావు సాహిత్య సిద్ధాంతానికి తత్వశాస్త్ర సంబంధమైన నొక్కు ఎక్కువ ఇచ్చారు.

( త్రిపురనేని సాహిత్య సర్వస్వం 3 పుస్థకం ముందుమాటలో కొంతభాగం)

No. of visitors : 365
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •