సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

| సాహిత్యం | వ్యాసాలు

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

- వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు (త్రిమరా) విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో దూసుకొచ్చిన సాహితీ యోధుడు. మార్క్సిజాన్ని శాస్త్రంగానూ, శస్త్రంగానూ భావించి, వర్గపోరాటంలో సాహిత్య విమర్శను వ్యాసరూపంలోనూ, ఉపన్యాస రూపంలోనూ రెండంచుల పదునుగల ఆయుధంగా మలిచినవాడు. విప్లవోద్యమంలోని సాయుధపోరాట చేవను సాహిత్య విమర్శలోకి బలంగా దించినవాడు. విప్లవ సాహిత్య విమర్శలో కొడవటిగంటి కుటుంబరావు తరవాత గుణాత్మక మార్పుకు కారణమైనవాడు.

త్రిమరా విమర్శలో దూకుడు ఎక్కువనీ, తొందరపాటు సూత్రీకరణలు చేస్తాడనీ, ఎదుటివారిని గాయపరిచే స్వభావం వుంటుందనీ, యుద్ధరంగంలో శత్రువుల శిరస్సులను నిర్దాక్షిణ్యంగా ఖండించే వీరుడిలాగా సాహిత్య విమర్శ రంగంలో స్వైరవిహారం చేస్తాడనీ కొన్ని ఆరోపణల్లాంటి అభిప్రాయాలున్నాయి. ఆయన భాష, శైలి, పరుషపదజాలం, భావ తీవ్రత, విప్లవ నిబద్ధతలవల్ల అలా అనిపించటం సహజమే. ఆయన సాహిత్య రంగంలో అడుగుపెట్టిన సందర్భాన్నీ, అప్పటి రాజకీయ నేపథ్యాన్నీ గుర్తిస్తే త్రిమరా విమర్శ అంత కఠినంగా ఎందుకు కనిపిస్తుందో అర్థమవుతుంది. రాజకీయంగా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు ఆయనకు ప్రేరణ. ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టి పోరాడిన అమరుడు సుబ్బారావు పాణిగ్రాహి, విప్లవ సాహిత్యానికి ఒక దారీ తెన్నూ చూపిన విప్లవకారుడూ, విప్లవకవీ శివసాగర్‌లు సాహిత్య పరంగా ఆయనకు స్ఫూర్తి. సమాజాన్ని మార్చడానికి సాయుధపోరాటమే ఏకైక మార్గమని చాలామంది విప్లవకారులు భావిస్తున్న రోజులవి. విప్లవోద్యమ ఛాయలుకూడా లేని మైదాన, పట్టణ ప్రాంతాల నుండి సైతం శ్రీకాకుళ ప్రాంతానికి వెళ్ళి, అక్కడి పోరాటంలో భాగస్వాములై ఎంతోమంది విప్లవాభిమానులు సాహసంతో ప్రాణాలర్పించిన చారిత్రక సందర్భం అది. ఆ నేపథ్యంలో పుట్టిన విరసానికీ, ఆ వెంటనే విరసం సభ్యుడైన త్రిమరాకీ సాహిత్యంలో వాడీ, వేడీ వుండటం ఆశ్చర్యమూ కాదు, అసహజమూ కాదు. ఇంకా చెప్పాలంటే అప్పటికది అవసరం కూడా. కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలని దాచుకోరని, ఉదారవాదం పనికిరాదని మార్క్సిస్టు మ¬పాధ్యాయులు చెప్పిన మాటలు కూడా త్రిమరా సాహిత్య విమర్శలో నిర్మొహమాట స్వభావానికి కారణం కావడానికి ఎంతైనా అవకాశం వుంది.

త్రిమరా విమర్శ నిక్కచ్చిగా, కఠినంగా వుండటానికి ఇంకో ముఖ్యమైన తక్షణ కారణం కూడా వుంది. విరసం ఏర్పడగానే, సాహిత్యంలో కూడా నక్సలైట్లు ప్రవేశించారని వేదకాలంలో పుట్టవలసిన సాంప్రదాయిక సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. చేవచచ్చి నిర్జీవంగా పడివున్న అరసం తుప్పుపట్టిన తన కలాల కత్తుల్ని- తన ఉనికిని ప్రదర్శించటం కోసం- విరసంపైకి దూయటం మొదలుపెట్టింది. విప్లవ భావసారం లేకపోయినా విప్లవ పదజాలంతో విప్లవ వేషం వేసుకొని, తానే అసలు సిసలు విప్లవ కవినని, విప్లవసేనాపతినని ఊహించుకుంటూ, కమ్యూనిస్టు మానిఫెస్టో స్థాయిలో కలలు కంటూ, చెత్తాచెదారంతో నిండిన చెత్తబుట్టలాంటి కవిసేన మానిఫెస్టో అనే పుస్తకాన్ని ఒకదాన్ని రాసిపడేసి పగటి వేషగాడిలాగా గంతులేయసాగాడు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ నేపథ్యంలో సాహిత్యంలో శాస్త్రీయ మార్క్సిస్టు దృక్పథాన్ని నిలబెట్టటం విరసం కర్తవ్యంగా ముందుకొచ్చింది. ఆ కర్తవ్యాన్ని నెత్తినవేసుకుని మోసినవాడు, విజయం సాధించినవాడు, సాహిత్య విమర్శ రంగంలో విరసం తలెత్తుకుని నిలబడేట్టు చేసినవాడు త్రిమరా. నక్సల్బరీ, విరసం మధుసూదనరావును సృష్టిస్తే, సాహిత్య విమర్శలో ఆయన చరిత్రను సృష్టించాడు.

ఈ సంపుటిలోని వ్యాసాలలో చరిత్ర గురించీ, సాహిత్య చరిత్ర గురించీ, సాహిత్యంలో యుగవిభజన గురించీ మార్క్సిస్టు దృక్పథం నుండి - అంటే గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం నుండి - సాహిత్యాన్ని పరిశీలించే ప్రయత్నం ఉంది.

చరిత్ర పట్ల చరిత్ర రచయితల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఆధ్యాత్మిక దృక్పథం నుండీ, వ్యక్తివాద దృక్పథం నుండీ, సంఘటనల సముదాయంగా భావించే దృష్టి నుండీ సమాజ పరిణామాన్ని పరిశీలించి చరిత్రను రాసే పద్ధతులున్నాయి. ఇవి శాస్త్రీయ పద్ధతులు కావు. చరిత్ర అంటే కాలక్రమ పద్ధతిలో వరసగా జరిగిన సంఘటనలను రికార్డు చేయటం కాదు. తారీఖులు, దస్తావేజులు చరిత్రకు అవసరమేకాని, అవి మాత్రమే చరిత్ర కాదు. ʹʹప్రకృతిలాగా చరిత్ర కూడా కొన్ని వస్తుగత సూత్రాల్ని అనుసరించి పురోగమిస్తుందిʹʹ అంటాడు త్రిమరా. అయితే ఆ సూత్రాల్ని ఆవిష్కరించడం, ఆ సూత్రాల ఆధారంగా సామాజిక పరిణామాల్ని వివరించడం ఆ పరిణామాల్లోని పురోగమన స్వభావాన్ని చిత్రించడం చరిత్రకారుని కర్తవ్యంగా వుండాలి. సమాజం మారుతుందని మాత్రమే కాదు, ఆ మార్పు పురోగమనం వైపు వుంటుందన్న స్పృహ కూడా చరిత్రకారుడికి వుండాలి. సమాజం ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థకు మారే క్రమం పురోగమనశీలంగానే వుంటుందని మార్క్స్‌ చెప్పాడు. ఈ చారిత్రక భౌతికవాద దృక్పథం లేకుండా ఎంతగా పరిశోధించి, ఎన్ని కొత్త విషయాలు చెప్పి చరిత్ర రచన చేసినా ప్రయోజనం వుండదు. చరిత్ర పురోగమన ఫలితమే చరిత్ర రచన అన్నది తిరుగులేని వాస్తవం.

చరిత్రకారుడికి భవిష్యత్తుపై నమ్మకం వుండాలి. చరిత్రకారుడు నిరాశాపూరితుడు కాకూడదు. చరిత్రను తవ్వడం, జరిగిపోయిన విషయాలను ఏకరువు పెట్టటానికి కాదు. చరిత్ర రచన, చరిత్రను సృష్టించే ప్రజలకు స్పూర్తిదాయకంగా వుండాలి. గతవైభవాన్ని పొగిడి, వర్తమానాన్ని నిరాశా నిస్పృహలతో నింపడం చరిత్రకారుడికే కాదు, ఏ రచయితకూ తగని పని. అందుకని గతాన్ని తిట్టిపోసి భవిష్యత్తును మాత్రమే ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకోవడం నేలమీద నిలబడకుండా ఆకాశంలో విహరించడమే అవుతుంది. మానవ జాతి భవిష్యత్తును గురించి నిర్మాణాత్మక దృక్పథం ఏర్పరుచుకోవడమే చరిత్ర రచనా ప్రయోజనమని త్రిమరా భావించడంలో అర్థం ఇదే.

చరిత్రను వక్రీకరించే చరిత్రకారులు పరిశోధనా లోపంవల్లనో, సమాచార సేకరణ పరిమితులవల్లనో, చారిత్రక సత్యాలమీద తప్పుడు అభిప్రాయాలు కలిగివుండడం వల్లనో, చరిత్రను ఘటనల రాశిగాచూసి వాటిమధ్యగల కార్యకారణ సంబంధాన్ని గుర్తించలేకపోవడం వల్లనో తప్పుడు నిర్ణయాలకు వస్తుంటారు. చారిత్రక సత్యాన్ని చారిత్రక సందర్భం నుంచీ ప్రామాణికంగా నిరూపించగలగాలి. అందుకే త్రిమరా ʹʹచరిత్ర కూడా శాస్త్రం వంటిదిʹʹ అంటాడు. ప్రకృతి పదార్థాలకు, సామాజిక విషయాలకు కొన్ని మౌలిక నియమాలు సమానంగా వున్నా, కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రెండిటినీ దృష్టిలో వుంచుకుంటే తప్ప చరిత్ర రచన శాస్త్రీయంగా సాగదు.

ʹʹసాహిత్య చరిత్రను సామాజిక చరిత్రలో భాగంగానే అధ్యయనం చేయాలిʹʹ అంటాడు త్రిమరా. సాహిత్యం వ్యక్తుల బుర్రల్లోనుంచి పుట్టదు, సామాజిక చరిత్రలో నుంచే పుడుతుంది. చెట్టుకు పువ్వు పుడుతుందిగాని, పువ్వుకు పువ్వు పుట్టదు. అలాగే సమాజం నుంచి సాహిత్యం పుడుతుందిగాని, సాహిత్యం నుంచి సాహిత్యం పుట్టదు. సాహిత్యకారులకి గానీ, సాహిత్య చరిత్రకారులకి గానీ ఈ కనీసపు అవగాహన అవసరం. సమాజంతో సంబంధం లేదనుకొనే సాహిత్యకారులు కూడా సమాజంతో ఏ సంబంధమూ లేకుండా ఏ రచనా చేయలేరు. కాకుంటే సమాజం పట్ల బాధ్యత వహించి రాయకపోవచ్చు. సమాజంలో విరుద్ధ శక్తుల మధ్య జరిగే ఘర్షణలో పురోగమన తిరోగమన స్వభావాల ప్రభావం రచయితలపై అనివార్యంగా వుంటుంది. ఏ భావాల ప్రభావం వుంటుందనేది రచయితల అధ్యయనాన్ని బట్టీ, అవగాహనను బట్టీ, చైతన్యాన్ని బట్టీ, దృక్పథాన్ని బట్టీ నిర్ణయింపబడుతుంది.

సామాజిక చరిత్రలో భాగమే అయినా, సాహిత్యానికి ఒక ప్రత్యేక లక్షణం, ప్రత్యేక స్వభావం, ప్రత్యేక స్వరూపం, ప్రత్యేక ప్రయోజనం వుంటాయి. సజీవ శరీరంలో ఒక అవయవం లాంటిదే, మారుతున్న సమాజంలో సాహిత్యమనే అంగం. శరీరం నుండి అవయవాన్ని వేరుచేస్తే దానికి ఉనికి, ప్రయోజనం లేనట్టే సమాజం నుండి విడదీసి సాహిత్యాన్ని విడిగా పరిశీలిస్తే సాహిత్య ప్రయోజనం సిద్ధించదు. ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే త్రిమరా సాహిత్య చరిత్రను ఇలా నిర్వచించారు - ʹʹవివిధ సామాజిక - చారిత్రక దశలలో సాహిత్యం నిర్వహించిన సామాజిక పాత్రను ఆర్థిక, రాజకీయ, తాత్విక రంగాలతో అన్వయించి, కాలక్రమ పద్ధతిలోగానీ, చారిత్రక - తార్కిక పద్ధతిలోగానీ విశ్లేషించి ప్రతిపాదించడాన్ని సాహిత్య చరిత్ర అనవచ్చును.ʹʹ అంటే వివిధ సామాజిక జీవిత రంగాలతో సాహిత్యానికుండే పరస్పర సంబంధాల్ని విశ్లేషించి వివరించడమే సాహిత్య చరిత్ర అవుతుంది. ఈ రకమైన అధ్యయనం వల్ల సాహిత్యంలో వస్తు శిల్పాలలో వచ్చే మార్పులను సహేతుకంగా వివరించడానికి అవకాశం వుంటుంది. తద్వారా సాహిత్యం నిర్వర్తించే సామాజిక పాత్రను కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పరస్పరవాదం లేదా అన్యోన్యవాదం సాహిత్య అధ్యయనానికి శాస్త్రీయమైన పద్ధతిగా త్రిమరా అభిప్రాయపడ్డాడు.

ఈ పరస్పరవాదంతో పాటు పరావర్తన సిద్ధాంతం లేదా ప్రతిబింబ సిద్ధాంతం కూడా సాహిత్య అధ్యయనానికి కీలకమైనదని త్రిమరా నొక్కి చెప్పాడు. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే రచయిత బాహ్య ప్రపంచాన్ని తన మెదడులో ప్రతిబింబించుకుంటాడు. అంతకు ముందే తాను సంపాదించుకున్న సాహిత్య, సాహిత్యేతర పరిజ్ఞానంతో, తనకున్న తాత్విక దృక్పథంతో, బాహ్య ప్రపంచం తన మెదడులో ప్రతిబింబించడం వల్ల కలిగిన భావాలనూ, అభిప్రాయాలనూ విశ్లేషించుకొని రచన చేస్తాడు. మెదడులో ఏర్పడే బాహ్య ప్రపంచ ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబంలాంటిది కాదు. దీన్నే సృజనాత్మక ప్రతిబింబం అంటాడు త్రిమరా. రచయిత నిరంతరం మార్పుచెందే ప్రపంచంలో వున్నాడు. మారుతున్న సమాజాన్ని చూస్తున్నాడు. తనకు తెలిసో తెలియకో ఆ మార్పులో ఇతరులతో కలసి భాగస్వామి అవుతున్నాడు. ఆ క్రమంలో తానూ మారుతున్నాడు. ఇలా మారుతున్న రచయిత మారుతున్న ప్రపంచంలో భాగంగా చలనంలో వున్న బాహ్య ప్రపంచాన్ని తన మెదడులో ప్రతిబింబించు కోవడాన్నే సృజనాత్మక ప్రతిబింబం అనవచ్చు. ప్రకృతిలోనూ, సమాజంలోనూ, వ్యక్తిలోనూ వున్న నిరంతర చలన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి గతితర్క సూత్రాలూ, చారిత్రక భౌతికవాద దృక్పథమూ తోడ్పడతాయి. అంటే మార్క్సిస్టు తాత్విక సిద్ధాంతం ఒక్కటే సమాజంతోపాటు, అందులో అవిభాజ్య భాగమైన సాహిత్యాన్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట.

తెలుగు సాహిత్య చరిత్రలో యుగ విభజన గురించి త్రిమరా అపూర్వ ప్రతిపాదనలు చేసాడు. తెలుగు సాహిత్యంలో కాలక్రమ పద్ధతి బట్టిగానీ, కవుల్ని బట్టిగానీ, రాజవంశాలని బట్టిగానీ, ప్రక్రియల్ని బట్టిగానీ యుగ విభజన చేయడం కుదరదన్నాడు. ʹʹకాలపరిమితి, సమాన లక్షణాల సందర్భం, నవ్య ప్రక్రియ ఆవిర్భావం అనే ఏ అర్థంలోనూ యుగ విభజన తెలుగు సాహిత్య చరిత్ర స్వరూపాన్ని నిరూపించలేదు. చలనశీలమైన ఒక ప్రక్రియ ఇతర ప్రక్రియల లక్షణాల్ని సంతరించుకుంటూ, వదులుకుంటూ విభిన్న ప్రాంతాల్లో, విభిన్న కాలాల్లో, విభిన్న వర్గ, రాజకీయ, ఆర్థిక, మత, తాత్విక, సాంఘిక పాత్రని నిర్వహించిన క్రమాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో యుగం అనవచ్చునుʹʹ అంటాడు త్రిమరా. ఈ నిర్వచనం శాస్త్రీయమైనదే కావచ్చుగాని, దీని ప్రకారం తెలుగు సాహిత్యంలో యుగ విభజన చేయడం అంత తేలికైన పనికాదు. ఎందుకంటే, ఈ పద్ధతిలో ఇంతవరకూ సాహిత్య అధ్యయనం గానీ, పరిశీలనగానీ, విశ్లేషణగానీ ఎవరూ చేయలేదు. అందుకే, ఇది గమనించే త్రిమరా తెలుగు సాహిత్య చరిత్రలో యుగం ఒక సంకీర్ణ ప్రవాహం అన్నాడు. ఈ సంకీర్ణతా లక్షణాల్ని అర్థం చేసుకుని ఆ దృష్టితో సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తప్ప యుగ విభజన చేయడం కుదిరే పనికాదు. ఈ రకమైన అధ్యయనం కొంతవరకు త్రిమరానే చేశాడు. ఆయనా పూర్తిగా దానిపై కేంద్రీకరించలేకపోయాడు.

తెలుగులో ఏ సాహితీ ప్రక్రియా ఒక కాలపరిమితిలో లేదు. 16, 17 శతాబ్దాలలో ప్రబంధ ప్రక్రియ వర్ధిల్లింది అనుకుంటే ఈ ఆధునిక కాలంలోనూ ప్రబంధాలు రాసిన వాళ్ళున్నారు. ప్రబంధ యుగానికి పూర్వమే నన్నయ్యలో బీజప్రాయంగానూ, ఎర్రనలో అంకుర ప్రాయంగానూ ప్రబంధ లక్షణాలున్నాయని సాంప్రదాయిక విమర్శకులే అన్నారు. తెలుగు సాహిత్యంలో భక్తి ఉద్యమం ఒక యుగం అనుకుంటే, అది 12వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం దాకా విస్తరించింది. దీని మూలాలు ఇతర సమాజాలలో, ఇతర భాషా సాహిత్యాలలో అంతకుముందే ఉన్నాయి. ఏ ఒక్క సాహిత్య ప్రక్రియా ఒకే విధమైన ప్రయోజనం కోసం పుట్టలేదు. ఒకవేళ పుట్టినా అలాగే కొనసాగలేదు. ఆధునిక యుగంలో ఆధునిక యుగ ప్రయోజనాల కోసం తెలుగులో వచన సాహిత్య ప్రక్రియలైన కథ, నవల, వచన కవిత మొదలైనవి పుట్టినా, అన్నీ ఆధునిక యుగ అవసరాలతోపాటు, వేదకాల సంస్కృతి పరిరక్షణ నుండి విప్లవం దాకా అన్ని రకాల ప్రయోజనాలను నెరవేర్చే ఉద్దేశంతో రాశారు. తొలి నుంచీ తెలుగు సాహిత్యాన్ని రాజులు పోషించారు కాబట్టి, ఆరుద్ర రాజవంశాల పేరుతో చేసిన యుగ విభజనని త్రిమరా అంగీకరించలేదు. ఎందుకంటే రాజుల్ని ధిక్కరించిన కవులూ, రాజాస్థానాలకు బయట వున్న కవులూ వున్నారు కాబట్టి. అందువల్ల ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా తెలుగు సాహిత్యంలో యుగ విభజన సంక్లిష్టమైందిగా తయారవుతుంది.

త్రిమరా చేసిన యుగ విభజన- మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం, అనువాద సాహిత్యం, భక్తి సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దక్షిణాంధ్ర సాహిత్యం, ప్రాచీన సాహిత్యంలో ప్రక్రియలు, ఆధునిక సాహిత్యం, ప్రజా సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో ప్రక్రియలు మొదలైన విధంగా వుంది. ఇంతవరకూ చేసిన యుగ విభజనలలో ఇది తులనాత్మకంగా శాస్త్రీయమైనది కావచ్చుగాని, ఇదే పరమశాస్త్రీయం అని చెప్పడానికి వీల్లేదు. త్రిమరానే అన్నట్లు తెలుగు సాహిత్య చరిత్రలో ప్రతి యుగంలోనూ విభిన్న స్రవంతులు కలిసే వున్నాయి. నన్నయకు ముందు లిఖిత సాహిత్యం వున్నా మనకు దొరికింది అరకొరగా వున్న పద్యాలే. నన్నయ భారతం త్రిమరా యుగ విభజనలో అనువాద సాహిత్యం కిందికే వస్తుంది. ఇది లిఖిత సాహిత్యంలోకూడా చేరే అవకాశం వుంది. నన్నయ భారతాన్ని పక్కన పెడితే అంతకు ముందున్న లిఖిత సాహిత్యం ఒక యుగంగా చెప్పుకోదగిన స్థాయిలో మనకు లభించలేదు. అనువాద సాహిత్యాన్ని అనువాద సాహిత్యం అనాలా? లేక అనుసరణ సాహిత్యం అనాలా? అని ప్రశ్నించటానికి అవకాశం వుంది. ఎందుకంటే భారత, రామాయణాలు చాలా వరకు యథాతథ అనువాదాలు కావు. ఎన్నో మార్పులు, చేర్పులు, తీసివేతలు వున్నాయి. వాటికి సామాజిక, రాజకీయ కారణాలున్నాయి. అయితే స్థూలంగా అనువాద సాహిత్యం అనడానికి అవకాశం వుంది. ఆధునిక సాహిత్యం అన్నది కూడా స్థూల దృష్టితో చేసిన విభజనే. అందులో అనేక పాయలున్నాయి. అనేక తాత్విక ఛాయలున్నాయి.

సాహిత్యంలో పురోగమనాన్ని రెండు విధాలుగా నిర్వచించవచ్చు. మతబద్ధ రచనల నుంచీ, మతం నుంచీ విముక్తి పొందే క్రమం మొదటిది. ప్రజల సాధారణ సాంస్కృతిక స్థాయిలో కనిపించే అభివృద్ధిని బట్టి సాహిత్యంలో పురోగమనాన్ని నిర్ణయించాలనడం రెండోది. మతం నుంచి విముక్తి పొందడం, ప్రజల సాంస్కృతిక స్థాయిలో అభివృద్ధి కనిపించడం- రెండింటినీ పరిగణనలోకి తీసుకుని సాహిత్యంలో పురోగమనాన్ని నిర్ణయించాలని త్రిమరా అభిప్రాయం. సాహిత్య చరిత్ర పురోగమనాన్ని బట్టి యుగ విభజన వుండాలని అంటున్న సందర్భంలో ఆయన ఇచ్చిన వివరణ ఇది. ఈ పురోగమన సూత్రాన్ని ఆధారం చేసుకొని సాహిత్యంలో యుగ విభజన చేయడం ఎంత శాస్త్రీయమైనా, అది ఎలా సాధ్యమో ఆచరణలో చూపించడానికి ఇంకా సునిశితంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసి వుంటుంది. త్రిమరా చేసిన యుగ విభజనలో ఈ పురోగమన సూత్రం కొంతమేరకే కనిపిస్తుంది.

త్రిమరా యుగ విభజనలో నాల్గవది భక్తి సాహిత్యం. ఇందులో వున్న పురోగమనం ఆ తరవాతి యుగం ప్రబంధ సాహిత్యంలో లేదు. భక్తి సాహిత్యంలో త్రిమరా చెప్పిన రెండు రకాల పురోగమనాలు - ప్రజల సాంస్కృతిక స్థాయిలో అభివృద్ధి, మత ప్రభావం నుండి సాహిత్యం కొంతమేరకైనా విముక్తి చెందడం. ప్రజల సాంస్కృతిక స్థాయి పెరిగిందనేదానికన్నా, కవులు ప్రజల సాంస్కృతిక స్థాయికి కొంత దిగివచ్చారని అనడం నిజం. ఇదైనా సాహిత్యంలో పురోగమనాన్నే సూచిస్తుంది. అలాగే సాహిత్యం మతం నుండి పూర్తిగా విడివడకపోయినా మతమౌఢ్యం నుండి, మతంలోని కుల అసమానతల నుండి, అంటరానితనం నుండి భక్తి సాహిత్యం కొంత విముక్తిని సాధించిందనే చెప్పవచ్చు. భక్తి సాహిత్య ఉద్యమ కవులు కుల మత భేదాలను నిరసించారు. సామాన్యుల స్థాయికి అందుబాటులో లేని దైవ సంబంధమైన తాత్విక, తార్కిక చర్చలకు తిలోదకాలిచ్చారు. జ్ఞాన మార్గం కన్నా, భక్తి మార్గమే ముక్తికి సాధనం అన్నారు.

అయితే భక్తి సాహిత్య ఉద్యమంలోని ఈ పురోగమనం ప్రబంధ సాహిత్యంలో కనబడదు. ప్రపంధ కవులకు, సామాన్య ప్రజలకు అసలు సంబంధమే లేదు. పండితులు మాత్రమే అందుకోగల స్థాయిలోనే ప్రబంధ కవిత్వం ఉంది. త్రిమరా అన్నట్టు ప్రబంధాలలో రామానుజుడు చెప్పిన విశిష్టాద్వైతమే చెప్పబడినా, అది రాజుల విలాస జీవితాన్ని ఆధారం చేసుకున్నదే తప్ప సామాన్య ప్రజల జీవితాన్ని కాదు. నిజానికి రామానుజుడి విశిష్టాద్వైతం శంకరుడి అద్వైతం కన్నా ప్రజలకు అందుబాటులో వున్న తాత్విక చింతన. ప్రపంచమంతా మిథ్య అనీ, అది మన భ్రమ మాత్రమేననీ, జీవుడూ దేవుడూ వేరుగాక ఒకరేననీ అనడం శంకరాద్వైతం. ఇది సామాన్యులకే కాదు, గొప్ప తాత్వికులకు కూడా అనుభవంలోకి వచ్చే తాత్విక చింతన కాదు. అలాకాక జీవుడూ దేవుడూ వేరువేరనీ, తన భక్తి ద్వారా జీవుడు దేవుడిలో ఐక్యం చెందుతాడనీ చెప్పిన రామానుజుడి విశిష్టాద్వైతం సామాన్యులకు అందుబాటులో వున్న తాత్విక చింతన. పైగా మానవులందరూ ఒకటేననీ, అందరికీ మోక్షప్రాప్తి అవకాశం సమానంగా వుంటుందనీ చెప్పిన రామానుజుడి తత్వం సులభంగా తలకెక్కుతుంది. అయితే ఈ తాత్విక చింతన ఆధారంగా వచ్చిందని చెబుతున్న ప్రబంధ సాహిత్యం సామాన్యులకు అందుబాటులో లేదు. శంకరుడి అద్వైతంగాక, రామానుజుడి విశిష్టాద్వైతం ఆధారంగా రావడం మేరకు అది పురోగమన స్వభావాన్ని కలిగి ఉంది. అందువల్ల సాహిత్యంలో పురోగమనం సరళరేఖ కాదు, వక్రరేఖ. ఈ కారణంగానే తెలుగు సాహిత్యంలో యుగ విభజన సంక్లిష్టం, సంకీర్ణం అయింది.

త్రిమరా వచనాన్ని ఒక యుగంగా చెప్పలేదుగానీ, వచన ప్రక్రియలో నాలుగు యుగాలని చెప్పాడు - శాసనాల కాలం, చంపూ రచనల్లో గద్యం, గానయోగ్యమైన వచనాలు, ఛందోవాసనలేని శుద్ధవచనం అని. ఈ విభజన పూర్తిగా శాస్త్రీయం. తెలుగులో మనకు మొదట కనిపించే వచనం శాసనాలలో వున్నదే. అయితే ఈ శాసనాలు నన్నయకు ముందు నుండీ రాజుల పాలనా కాలమంతా కొనసాగాయి. ఈ శాసనాలు గ్రాంథిక శైలినీ వ్యావహారిక శైలినీ కలిగి, లిఖిత సాహిత్యం ప్రారంభం కావడానికి పూర్వ శబ్ద రూపాలతో నిండి వున్నాయి. ఇక చంపూ రచనల్లో గద్యం శాసనభాషకంటే భిన్నంగా వుంటుంది. పద్యాలూ, గద్యాలూ కలిసిన రచనల్ని చంపూ రచనలంటారు. కవిత్రయ భారతంగానీ, ప్రబంధాలుగానీ అన్నీ చంపూ రచనలే. చంపూ రచనలలోని గద్యం ఛందోవాసన వున్న వచనం. ఇక మూడోరకం గానయోగ్యమైన వచనాలు. భక్తి సాహిత్య ఉద్యమంలో భాగంగా వచ్చిన పద సాహిత్యం చాలా వరకు ఇలాంటిదే. వీటన్నిటికీ భిన్నంగా ఆధునిక కాలంలో వచ్చిన వచనం ఛందోవాసనలేని శుద్ధ వచనం. ఈ శుద్ధ వచనంలో కూడా గ్రాంథికం, సరళ గ్రాంథికం, శిష్ట వ్యావహారికం, మాండలికం మొదలైన భేదాలున్నాయి. ఏ అంశం తీసుకున్నా మూసపోసినట్టుకాక ఎంతో వైవిధ్యంతో వుండటం గమనించవచ్చు. ఈ వైవిధ్యంలో కూడా పురోగమనం వుంది. రచయితలకూ, పాఠకులకూ మధ్య వుండే అగాధాన్ని పూడ్చడంలోనే ఈ పురోగమనం కనిపిస్తుంది. సాధారణ ప్రజలకు ఏదో చెప్పాలనుకున్నప్పుడే వచన ప్రక్రియ అభివృద్ధి చెందుతుందని వచన రచనా పరిణామాన్ని గమనిస్తే అర్థమవుతుంది. సాధారణంగా ఆధునిక వచన కవితల్ని సామాన్య పాఠకులకు అర్థం కాకుండా రాసే వచన కవులలో కొంతమందైనా కవి సమ్మేళన సందర్భాలలో కొంత వరకు అర్థం అయ్యేట్టుగానే రాస్తారు. ఎందుకంటే అక్కడ వుండేది ఇంట్లో ఒంటరిగా చదువుకునే పాఠకులు కారు, సామూహిక శ్రవణానికి అవకాశం వున్న శ్రోతలు. అర్థం కాకపోతే శ్రోతల నిరసన ఏదో రూపంలో వెంటనే వ్యక్తమయ్యే అవకాశం వుంది. ఆ నిరసన తాకిడి కవులకు నేరుగా తగులుతుంది. ఈ విషయం కవులకు బాగా తెలుసు. కాబట్టి కవి సమ్మేళనాలలో చదివే కవితలలోని వచన స్వభావం, స్వరూపం శ్రోతలకు కొంతవరకైనా అందుబాటులో వుంటుంది. అందువల్ల పాఠకులు చదువుకునే వచనానికి, శ్రోతలు వినే వచనానికి వచన కవితల్లో కొంత తేడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కవుల వచనం శ్రోతల స్థాయికి కొంతమేరకైనా దిగిరాక తప్పదు.

తెలుగు సాహిత్య చరిత్రలో దక్షిణాంధ్ర యుగాన్ని అందరూ క్షీణ యుగం అన్నారు. కాని త్రిమరా ఈ అభిప్రాయాన్ని తుత్తునియలు చేసి పూర్వ యుగాలకంటే ఇది పురోగమించిన యుగమని నిరూపించాడు. ఈ యుగ సాహిత్యం ఏక స్రవంతిగా లేదనీ, విజయనగరం, తంజావూరు, మధుర వంటి సాంస్కృతిక కేంద్రాలలో సాహిత్యం బహుముఖంగా వికసించిందనీ, సామాన్య ప్రజల సాంస్కృతికస్థాయి పెరిగిందనీ, జీవిత వాస్తవిక చిత్రణ అపూర్వ స్థాయిలో విలక్షణంగా పెంపొందిందనీ వివరించాడు. ఈ యుగంలో పురాణాలను రాసినా వాటిని గ్రాంథిక వచనంలో రాశారు. సముఖము వెంకట కృష్ణప్ప ʹజైమిని భారతంʹ, ʹసారంగధర చరిత్రʹ వ్యావహారిక భాషకు దగ్గరగా వున్నాయి. కొన్ని తత్వ శాస్త్ర గ్రంథాలు వ్యావహారికంలోనే రాశారు. ఈ యుగంలోని వచన రచనలు రచయితలకు, అక్షరాస్యులైన ప్రజలకు సంబంధాన్ని కలిగించాయి. యక్షగానం వంటి రూపకాలు ప్రజలకు అందుబాటులో వున్నాయి. వచన రచనల్లోగానీ, యక్షగానాల్లోగానీ ఆనాటి సామాజిక స్థితిగతుల్ని ఎక్కువగా చిత్రించారు. ఈ యుగంలోని రచనలు ఎక్కువగా సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించాయి. అందువల్ల ఈ యుగం అంతకు ముందు యుగాలకంటే అన్నివిధాలా భిన్నమైందే కాక, పురోగమనశీలమైందని త్రిమరా నిరూపించాడు.

ప్రబంధాన్ని సంస్కృతంలోగాని, మధ్యయుగ సాహిత్యంలోగాని ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా భావించినట్టు కనపడదు. పురాణాల్ని, రూపకాల్ని, కావ్యాల్ని అన్నిటిని ప్రబంధం అనే పేరుతో పిలవడం సంప్రదాయంగా వుండేది. చివరకు కందుకూరి వీరేశలింగం తాను రాసిన నవల ʹరాజశేఖర చరిత్రʹ ను కూడా వచన ప్రబంధం అనడం ఈ సంప్రదాయం ప్రభావమే. ఆధునిక సాహిత్య చరిత్రకారులు మాత్రమే ప్రబంధాన్ని ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా పేర్కొన్నారు. అయితే ప్రబంధానికి వాళ్ళు చెప్పిన లక్షణాల్ని త్రిమరా అంగీకరించ లేదు. ప్రకృష్టమైన బంధం (నిర్మాణం) కలిగింది కాబట్టి ప్రబంధం అని వాళ్ళంటే, ఎక్కాల పుస్తకానికి కూడా ప్రకృష్టమైన బంధం వుంటుందని త్రిమరా వ్యంగంగా సమాధానం చెప్పాడు.

ఆధునిక సాహిత్య విమర్శకుల్లో ఒక్క రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు తప్ప ప్రబంధ స్వభావాన్నీ, దాని నేపథ్యాన్నీ ఎవరూ గుర్తించలేదని త్రిమరా అభిప్రాయం. ʹరాయలనాటి రసికతʹ అనే పేరుతో రాళ్ళపల్లి రాసిన వ్యాసంలో ప్రబంధం అసలైన లక్షణాన్ని ఆయన కొంతవరకైనా గుర్తించాడని త్రిమరా అభిప్రాయం. రాయల కాలంలోని రాజుల, సంపన్నుల రసిక జీవనాన్ని ఆనాటి ప్రజల రసిక జీవన సంప్రదాయంగా రాళ్ళపల్లి వివరించాడు. ప్రబంధాల్లో శృంగార రసిక జీవనాన్ని చిత్రించిన మాట నిజమేకాని, రాజులకు, సంపన్నులకు తప్ప ప్రజలకు ఆ జీవితం అనుభవంలో లేదన్న విషయాన్ని రాళ్ళపల్లి గుర్తించలేదు. ఏమైనా ప్రబంధాల రసిక జీవన చిత్రణని తొలిసారి గుర్తించిన ఆధునిక సాహిత్య విమర్శకుడు రాళ్ళపల్లి.

కేవలం స్వరోచి గురించి, మనువు గురించి చెప్పటం మాత్రమే ʹమనుచరిత్రʹ ప్రబంధంలో పెద్దన ఉద్దేశం కాదని, మానవ సంబంధాలలో స్త్రీ పురుష సంబంధాలు అతి సన్నిహిత సంబంధాలు కావడం వల్ల ప్రబంధాలలో కవులు తమ భావజాలాన్ని శృంగార సన్నివేశాల ద్వారా వ్యక్తం చేసారని త్రిమరా చెప్పాడు. రాళ్ళపల్లి బీజప్రాయంగా గుర్తించిన సారాన్ని త్రిమరా మరింత సమగ్రంగా, శాస్త్రీయంగా వివరించాడు. ప్రవరుడు నిజాయితీ గల ఉత్తమ గృహస్థుడు. వందలమంది రాణులతో శృంగార వైభవాన్ని ప్రదర్శించే రాజుల కాలంలో ప్రవరుడులాంటి ʹఉత్తమ గృహస్థులుʹ పనికిమాలినవారికిందే లెక్క. ఇలాంటి వాళ్ళు ప్రబంధ నాయకులు కావడానికి ఏ మాత్రం అర్హులు కారు. తన కోరికను తీర్చమని అడిగిన వరూధిని చూపిన కారణాలకు ప్రవరుడు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పలేకపోయాడనేదానికన్నా చెప్పలేనట్టుగా పెద్దన చిత్రించాడనడం సమంజసం. అనాసక్తంగానైనా ప్రవరుడు వరూధిని కోరికను తీర్చడం ధర్మవిరుద్ధం కాదనే పెద్దన అభిప్రాయం అని నిరూపించడానికి ʹʹకృపారహితాత్మక కౄరుడై యరిగె మహీసురాధము డహంకృతితోʹʹ అనే పెద్దన మాటల్నే రుజువుగా చూపించాడు త్రిమరా. మహీసురాధముడంటే బ్రాహ్మణాధముడు (ప్రవరుడు) అని అర్థం. ప్రవరుని ప్రవర్తన పట్ల ఎంత నిరసన భావం వుంటే ప్రవరుణ్ణి పట్టుకుని బ్రాహ్మణాధముడని అంటాడు పెద్దన! ఈ నిరసన కేవలం నిరసన కాదు, పెద్దన వైష్ణవమత దృక్పథానికి ప్రమాణం అంటాడు త్రిమరా.

వస్తువు అంటే కేవలం కథ కాదు, కావ్యంలోని ప్రధాన భావజాలం. కథ భావజాలానికి ఒక రూపాన్ని కల్పిస్తుంది. ఆ రూపాన్నే వస్తువుగా భావిస్తారు సాహిత్య విమర్శకులు, చాలామంది మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు కూడా. కథ ద్వారా వైష్ణవ మత దృక్పథాన్ని చెప్పడమే ప్రబంధంలోని కథా వస్తువని త్రిమరా చెప్పదల్చుకున్న విషయం. కృష్ణదేవరాయలుగాని, ఆయన కాలంలోని ప్రబంధ కవులుగాని అందరూ రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తమ తాత్విక చింతనగా అంగీకరించినవారే. దీనికి తగ్గట్టుగా ఆనాటి ఆర్థిక పరిస్థితి కూడా తోడయింది. వ్యవసాయం, వ్యాపారం అభివృద్ధి చెందాయి. రాజులు, మంత్రులు, సేనాధికారులు, భూస్వాములు, వాణిజ్య శ్రేణులు, యితర సంపన్నులు విలాస భోగ జీవితానికి అలవాటుపడ్డారు. అనేకరకాల చేతివృత్తులు కూడా చిన్న చిన్న పరిశ్రమల స్థాయికి అభివృద్ధి చెందాయి. చాతుర్వర్ణాల వ్యవస్థ ఉన్నప్పటికీ కొంత సడలింపు వచ్చింది. వర్ణాల మధ్య సంబంధాల్లో ప్రజాస్వామిక స్వభావం కొంతమేరకు ఏర్పడింది. ఈ నూతన పరిస్థితుల నుండే తెలుగు సాహిత్యంలో ప్రబంధ ప్రక్రియ పుట్టింది.

రామానుజుని విశిష్టాద్వైతం కేవలం మతం కాదు, కేవలం తత్వశాస్త్రమూ కాదు. రెండూ కలగలసిన జీవన విధానం. ఈ లోకంలోని భౌతిక సుఖాల్ని మోక్షం కోసం త్యాగం చేయాల్సిన పనిలేదు. కర్మ సన్యాసం చెయ్యాల్సిన పనిలేదు. శరీరం పాప పంకిలం కాదు. శారీరక అనుభవం తుచ్ఛమైనది కాదు. ఈ విధమైన రామానుజుని విశిష్టాద్వైతం నేపథ్యంగా ప్రబంధాల్ని పరిశీలించాలని మార్క్సిస్టు దృక్పథంతో వివరించిన తొలి సాహిత్య విమర్శకుడు త్రిమరాయే.

ప్రబంధ యుగాన్ని త్రిమరా ప్రధానంగా రెండు దశలుగా విభజించాడు. మొదటిది, రాయలకాలం నాటి ప్రబంధ యుగం. రెండోది, దక్షిణాంధ్ర యుగంలోని విలాస ప్రబంధ యుగం. ప్రబంధ యుగంలో స్వేచ్ఛా శృంగారం వున్నా అది కుటుంబ పరిమితుల్ని దాటిపోలేదు. విలాస ప్రబంధ యుగంలో అది కుటుంబ పరిమితుల్ని దాటిపోయింది. అంతేకాదు, కుటుంబం పట్ల కొంత నిరసన భావం కూడా వ్యక్తమయింది. వివాహేతర శృంగారం, వేశ్యా శృంగారం ఎక్కువైంది. దీన్నే త్రిమరా ఇలా అన్నాడు - ʹʹరాయల యుగ ప్రబంధంలో శృంగారం భక్తిలో లీనమయితే, తరవాత యుగంలో భక్తి శృంగారంలో లీనమయిపోయింది.ʹʹ మొత్తంమీద పాలకవర్గాల సాంస్కృతిక జీవనస్థాయిలో వచ్చిన మార్పే ప్రబంధ ప్రక్రియలోనూ వచ్చింది. ప్రబంధయుగానికీ, విలాస ప్రబంధయుగానికీ రెండిటికీ రామానుజుని విశిష్టాద్వైతమే తాత్విక పునాదిగా చెప్పవచ్చు.

ఈ సంపుటిలో ఒక ముఖ్యమైన విభాగం త్రిమరా విశ్వనాథ సత్యనారాయణ గురించి రాసిన మూడు పెద్ద వ్యాసాలు. నవ్య సంప్రదాయం అనే ఒక మహోద్యమానికి విశ్వనాథ సేనాపతి అనీ, మిగిలిన సాహిత్య ఉద్యమాలన్నీ దానికింద అణిగిపోయినట్టూ జి.వి. సుబ్రహ్మణ్యం రాసిన వ్యాసానికీ, ఆయన్ను సమర్ధిస్తూ రాసిన వల్లభాచారికీ సమాధానంగా రాసిన వ్యాసాలివి. సంప్రదాయవాదుల్ని, కమ్యూనిస్టు వ్యతిరేకుల్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రతీప (ప్రతికూల)శక్తులు ఎత్తిన అవతారమే నవ్య సంప్రదాయవాదమని కరాకండిగా నిరూపించాడు త్రిమరా. జి.వి. సుబ్రహ్మణ్యం ఒకవైపు అవిచ్ఛిన్నతే సంప్రదాయమని ఖండితంగా చెబుతూ, మరోవైపు అసలు విచ్ఛిన్నతే జరగకుండా సంప్రదాయం నవ్య సంప్రదాయం ఎలా అయిందో చెప్పలేకపోయాడు. నవ్య సంప్రదాయ సాహిత్యానికి జి.వి. సుబ్రహ్మమణ్యం నాలుగు కోణాలు చెప్పాడు - సంఘసంస్కరణ, గాంధీతత్వం, అద్వైతవాదం, రససిద్ధాంతం. నిజానికి ఈ నాలుగు కోణాలూ పరస్పర విరుద్ధమైనవి. నవ్య సంప్రదాయానికీ వీటికీ సంబంధమే లేదు. అసలు నవ్య సంప్రదాయమనే మాటే అర్థరహితమైంది. సంప్రదాయం అనే పదానికి ముందు నవ్య అనే విశేషణం చేర్చినంత మాత్రాన అది నవ్య సంప్రదాయం ఎలా అవుతుంది? పైగా సాహిత్యంలో ఈ నవ్య సంప్రదాయం ఒక మహోద్యమం అనీ, దానికి విశ్వనాథ నాయకుడనీ అనడం మరింత విడ్డూరం. విశ్వనాథ వలస సంస్కృతికి వ్యతిరేకంగా రచనలు చేసిన మాట నిజమే. అయితే వలస సంస్కృతిని ఆయన భూస్వామ్య సంస్కృతి దృక్పథం నుండి విమర్శించాడుగాని, ప్రజా దృక్పథం నుండి కాదు. అసలు వలస సంస్కృతి ఈ దేశంలో నిలదొక్కుకోవడానికి భూస్వామ్య సంస్కృతే కారణం. ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థ వలసవాదానికి స్వాగతం పలికింది. భూమిమీద ప్రజలకు హక్కు వుండకూడదనీ, రాజుకు మాత్రమే హక్కుండాలని విశ్వనాథ చెప్పాడు. యజ్ఞయాగాదులు, కర్మ సిద్ధాంతం, పాతివ్రత్యం, వర్ణాశ్రమ ధర్మాలు మొదలైన వాటిని వాల్మీకి రామాయణంలో కంటే విశ్వనాథే తన ʹరామాయణ కల్పవృక్షంʹలో ఎక్కువగా చెప్పాడు. దీన్నిబట్టి విశ్వనాథ వాల్మీకి కంటే కనీసం ఒక శతాబ్దం ముందు పుట్టవలసినవాడు. తరతరానికి మారుతున్న సంప్రదాయంగానీ, ʹనవ్యʹ అనే మాటగానీ విశ్వనాథకు పడే విషయాలు కావు. ʹʹవిశ్వనాథ దేనికీ నాయకుడు కాదు. మనుధర్మానికి కట్టుబానిసʹʹ అని ఆయన రచనల ఆధారంగానే త్రిమరా శాస్త్రీయంగా నిరూపించాడు. విశ్వనాథను నిర్హేతుకంగా సమర్థించే జి.వి. సుబ్రహ్మమణ్యం, వల్లభాచార్య వంటి వారి కట్టుకథల్నీ, వక్రభాష్యాల్నీ తుత్తునియలు చేశాడు.

విశ్వనాథ చరిత్ర పురోగమన శీలమైందని నమ్మడు. చరిత్ర పునరావృతమవుతుందని మాత్రమే నమ్ముతాడు. అందుకే కవి బాలగంగాధర్‌ తిలక్‌ ʹవిశ్వనాథవారు వెతగ్గా వెతగ్గా వేదకాలం ఇంకా వెనక్కి పోయిందటʹ అన్నాడు.

తెలుగు సాహిత్య చరిత్రనీ, దాని పురోగమన స్వభావాన్నీ, ఆ పురోగమనంలో ఎదురయ్యే ఆటంకాల్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అనేక విషయాల్ని సందర్భానుసారంగా త్రిమరా ఈ వ్యాసాల్లో వివరిస్తాడు.

పోతన, వేమన వంటి కవుల్ని విప్లవ కవులుగా ప్రచారం చేస్తూ కొంతమంది విప్లవ సాహిత్యాన్ని దెబ్బతీయడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, వేమన కవిత్వాన్ని వేమన పూర్వ కవుల్తో పోల్చి చూచి, వేమన కవిత్వంలోని ప్రగతిశీల అంశాన్ని విశ్లేషించడం శాస్త్రీయమైన పద్ధతిగాని, ఈనాటి విప్లవ సాహిత్యంతో పోల్చి చూడడం చారిత్రక దృష్టిలేని అశాస్త్రీయ పద్ధతని అంటాడు త్రిమరా.

( త్రిపురనేని సాహిత్య సర్వస్వం 2 పుస్థకం ముందుమాటలో కొంతభాగం)

No. of visitors : 385
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

అరుణతార

సంవర్త | 17.10.2018 02:05:50pm

లేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది .......
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •